Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: దుర్గా పూజ - బెంగాల్‌ ఎకానమీ

ఎమ్బీయస్‍: దుర్గా పూజ - బెంగాల్‌ ఎకానమీ

పాశ్చాత్య దేశాల్లో క్రిస్‌మస్ పండుగకు మతపరంగా ఉన్న ప్రాముఖ్యత కంటె ఆర్థికపరమైన ప్రాముఖ్యత ఎక్కువ అంటారు. ఎందుకంటే ప్రజలు ఏడాది పొడుగునా దాచుకున్న డబ్బంతా క్రిస్‌మస్ టైములో ఖర్చు పెడతారట. ఒకరికొకరు బహుమతులు యిచ్చుకోవడం, ఇంట్లోకి వస్తువులు కొనడం, యాత్రలు చేయడం.. యిలా ఎకానమీలో పెద్ద జంప్ ఉంటుందట. మన తెలుగు రాష్ట్రాలలో పండగ హడావుడి అనేది ఏడాది పొడుగునా పరుచుకుని వుంటుంది.  సంక్రాంతి సేల్స్, ఉగాది సేల్స్, ఆషాఢం సేల్స్, శ్రావణ సేల్స్, దసరా సేల్స్, దీపావళి సేల్స్ వగైరా ఉంటాయి. వీటితో పాటు అక్షయ తృతీయ, శివరాత్రి, వినాయక చవితి అంటూ ఏదో ఒక పండగ పేరు చెప్పి అమ్మకాలో, ఎకనమిక్ యాక్టివిటీయో జరుగుతూ ఉంటుంది. కానీ బెంగాల్‌లో మాత్రం తక్కిన పండగలేవీ పెద్దగా కనబడవు కానీ దసరా మాత్రం అద్భుతంగా జరుపుతారు, పాశ్చాత్య దేశాల్లో క్రిస్‌మస్ లాగానే! ఏడాదిలో తక్కిన 11 నెలల్లో జరిగే అమ్మకాలు ఒక యెత్తు, ఆ ఒక్క నెలలో జరిగే అమ్మకాలు ఒక యెత్తు అంటారు.

టూరిజం తీసుకున్నా దసరా సమయంలో బెంగాల్‌లో ఉండే బెంగాలీలలో చాలామంది రాష్ట్రం బయటకు వెళితే, రాష్ట్రం బయట ఉన్న బెంగాలీలలో చాలామందికి బెంగాల్‌కు వస్తారు. మార్కెట్‌లోకి కొత్త రకం చీరలన్నీ ఆ సమయంలోనే వస్తాయి. కొత్త పాటల సిడిలు అప్పుడే రిలీజవుతాయి. ఇక బహుమతులు యిచ్చుకోవడాలైతే వేలం వెర్రిగా సాగుతాయి. పండగ రోజుల్లో బంధుమిత్ర దర్శనాలు జోరుగా సాగుతాయి. ఇంట్లో వండుకునే వాళ్లు కనబడరు. అంతా బయట తినేవాళ్లే. హోటళ్లు, రెస్టారెంట్లు పిచ్చి రష్. పబ్లిక్, ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ అతి రద్దీగా ఉంటుంది. ఊరంతా పందిళ్లు వేస్తారు. ఆ మండపాలు చూడడానికి పొద్దుటి నుంచి రాత్రి దాకా జనాలు తిరిగేస్తూనే ఉంటారు. ఎటు చూసినా సందడి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఏడాదంతా దాచుకున్న డబ్బు హుష్‌కాకీ అయిపోతుంది.

నేను కలకత్తాలో మూడున్నరేళ్లు పనిచేశాను. దసరాకు ముందు ఖాతాల నుంచి భారీగా విత్‌డ్రాయల్స్ ఉండేవి. పండగ తర్వాత అన్ని ఎక్కవుంట్లలోనూ మినిమమ్ బాలన్సే! దసరాకు ముందు కస్టమర్ వచ్చి పాస్‌బుక్ అప్‌డేట్ చేయమంటే క్లర్కు ‘అన్నా, పూజ తర్వాత రండి’ అని చెప్పేవారు. నాకు భలే నవ్వు వచ్చేది. పూజకు, దీనికీ సంబంధం ఏముంది? పూజ తర్వాత పునర్జన్మ ఎత్తినంత బిల్డప్ కాకపోతే అని. కానీ కస్టమరు సరేనని వెళ్లిపోయేవాడు. ఏ పనైనా పూజ తర్వాత అంటూ వాయిదా వేసేసేవారు. బెంగాల్ ఆర్థిక వ్యవస్థలో దసరా కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అనుకునేవాణ్ని కానీ గణాంకాలు తెలియవు. 2019లో బ్రిటిష్ కౌన్సిల్ ఒక అధ్యయనం చేసి ప్రకటించిన వివరాలు యీ మధ్యే చదివాను. దసరా పండగ రాష్ట్ర జిడిపికి 2.58శాతం కంట్రిబ్యూట్ చేస్తుందట. దుర్గా పూజకు సంబంధించిన క్రియేటివ్ ఇండస్ట్రీస్ విలువ రూ.32,377 కోట్లుట. దీనికి తోడుగా మమతా బెనర్జీ తన రాజకీయాల కోసం దుర్గాపూజా మండపాలకు ఆర్థికసాయం పేర మరింత డబ్బును వ్యవస్థలోకి పంప్ చేస్తోంది.

మమత ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోగానే 2012 ఏప్రిల్‌లో ఇమామ్‌లకు నెలవారీ గౌరవ వేతనాలిస్తానని ప్రకటించింది. అది కుదరదని 2013లో కలకత్తా హైకోర్టు చెప్పింది. అప్పుడు ఆ వేతనాలని వక్ఫ్ బోర్డు ద్వారా యిప్పించింది. వాళ్లకిచ్చాం కదాని 2018 నుంచి దుర్గా పూజ మండపాలు నిర్వహించే కమిటీలకూ యిచ్చింది. నిజానికి అటు ఇమాములు కానీ, యిటు దుర్గాభక్తులు కానీ ఎవరూ ప్రభుత్వాన్ని సాయం కోసం అర్థించలేదు. ఓట్ల యావతో తృణమూల్ చేసిన పని యిది. ప్రభుత్వసాయం అందుతోంది కాబట్టి పూజామండపం ప్రారంభించినప్పుడు స్థానిక అధికార పార్టీ నేతను ఆహ్వానిస్తారు. వాళ్లు రాజకీయోపన్యాసం చేస్తారు. మామూలు మీటింగులకు రాని జనం కూడా దుర్గాదేవి కోసం వస్తారు. వీళ్ల ఉపన్యాసం వాళ్ల చెవిన పడుతుంది.

గత 11 ఏళ్లగా ప్రతీ ఏడూ మమత అనేక మండపాలను ప్రారంభిస్తూ పోయింది. అన్నిటికీ ఒకేసారి వెళ్లలేదు కాబట్టి, కొన్నిటికి పూజకు కొన్ని వారాల ముందే మండపం ప్రారంభింప చేసి, సాధ్యమైనంత ఎక్కువ మండపాలకు వెళ్లడం ఆనవాయితీ చేసుకుంది. ఆ విధంగా జనంలోకి చొచ్చుకుపోయే అవకాశాన్ని చేజిక్కించుకుంది. దీనితో పాటు మండపాల మధ్య పోటీ పెట్టి బాగున్నవాటికి రాష్ట్రప్రభుత్వం తరఫున అవార్డులు కూడా యివ్వసాగింది. 2018లో మండపానికి రూ.10 వేల చొప్పున గ్రాంట్ యిచ్చారు. దాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి, గత ఏడాది రూ. 50 వేలిచ్చారు. తాజాగా దాన్ని రూ.60 వేలకు పెంచారు.

దానితో సహాయం అందుకునే పూజాసమితులు 2018లో 18 వేలుంటే యిప్పుడు 43 వేలయ్యాయి. దీనివలన ప్రభుత్వానికి రూ.258 కోట్లు ఖర్చవుతున్నాయి. మండపాల విద్యుత్ బిల్లులలో 60శాతం రాయితీ ఖర్చు దీనికి అదనం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించలేక పోతోంది. అయినా యిలాటి ఖర్చులు మాత్రం ధారాళంగా చేస్తోంది మమతా సర్కారు. ఈ పెంపును బిజెపి వ్యతిరేకించింది. తాము బేగమ్ మమతాగా ముద్ర కొట్టిన వ్యక్తి యీ విధంగా హిందూ పండగ నిర్వాహకులను డబ్బు ఆశ చూపించి ఆకట్టుకోవడం వాళ్లకు నచ్చలేదు. ఇదే ముస్లిము పండగకి యిచ్చి ఉంటే సంతుష్టీకరణ పేరు మీద తిట్టిపోసేవారు. ఇప్పుడు గట్టిగా అంటే హిందువులకి కోపం రావచ్చు. అందువలన ఆర్థికభారం అంటూ విమర్శించారు.

వెంటనే అభిషేక్ బెనర్జీ ‘‘బిజెపి వాళ్లకు ఏం చేయాలో తెలియటం లేదు. మమత దుర్గాపూజను ఆపేస్తోందని ప్రచారం చేశారు. తీరా చూస్తే దుర్గాపూజను ఇన్‌టాన్‌జిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో చేత 2021 డిసెంబరులో గుర్తింపచేసింది. ఈ ఏడాది గ్రాంటు పెంచకపోతే మమతను హిందూ వ్యతిరేకి, కితం ఏడాది కంటె ధరలెంతో పెరిగినా అంతే యిస్తోంది అనాలనుకున్నారు. పెంచితే యిలా మాట్లాడుతున్నారు. టూరిజం ద్వారా ఆదాయం వస్తుందన్న పేరు చెప్పి కోట్ల ఖర్చుతో గుజరాత్‌లో పేద్ద విగ్రహం కట్టినప్పుడు బెంగాల్ బిజెపి నాయకుల నోళ్లేమయ్యాయి? మండపాలు మరిన్ని, ఘనంగా ఏర్పాటు చేస్తే టూరిస్టులు రారా? డబ్బు రొటేట్ కాదా? తద్వారా ఆర్థికాభివృద్ధి జరగదా?’ అని దులిపేశాడు.

అభిషేక్ రాజకీయపరంగా దాడి చేయవచ్చు కానీ అతనన్నదానిలో వాస్తవం లేకపోలేదు. దుర్గాపూజ సందర్భంగా రాష్ట్ర ఎకానమీలో ఎలాటి స్వింగ్ వస్తుందో పైన రాశాను కదా, ప్రభుత్వధనం ఏదో రూపేణా ప్రజల చేతిలోకి వెళ్లడంతో ఆర్థికపరమైన ఉత్తేజం కలుగుతుంది. మండపాల సంఖ్య పెరిగిన కొద్దీ వసూళ్లు పెరుగుతాయి. ప్రభుత్వం యిచ్చినదానితో మండప నిర్వాహకులు తృప్తి పడరు. స్థానికుల నుంచి చందాల పేరుతో జబర్దస్తీగా వసూలు చేస్తారు. అక్కడ ఉన్నన్నాళ్లూ నేనూ బాధితుణ్నే. ఎక్కడెక్కడి పేటల వాళ్లో గుంపులుగా వచ్చి చందా అడిగేవాళ్లు. మా ఏరియా కాదు, మేం యివ్వం అంటే ‘నువ్వు ఎక్కణ్నుంచో వచ్చి మా తిండి తింటున్నావు. నీ ఏరియా ఏది అని మేమడిగామా? మా ఏరియా గురించి నువ్వడుగుతావేం?’ అని అరిచి మీదపడి కరిచినంత పని చేసేవారు.

దసరా సందర్భంగా బెంగాలీలకు చాలా ఖర్చులుంటాయని రాశాను కదా. ఉన్నవాడు ఖర్చు పెడతాడు. లేనివాడు అడ్డదారిలోనైనా సంపాదించాలని చూస్తాడు. ఆ సమయంలో జేబుదొంగతనాలు సైతం ఎక్కువౌతాయని చెప్తూంటారు. ఇప్పుడు ప్రభుత్వం యిలా విచ్చలవిడిగా నిధులు పంచుతూంటే వాళ్లందరికీ నిజంగా పండగే! ఇచ్చిన వాటికి ప్రభుత్వం లెక్కలడుగుతుందా ఏమన్నానా? ఎలా ఐతేనేం, డబ్బు ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన పటేల్ విగ్రహం యిలాటి ఫైనాన్షియల్ మొబిలిటీని ఎన్నటికీ సాధించలేదు. ఆ విగ్రహమే కాదు, ఏ విగ్రహానిదైనా అదే పరిస్థితి. టూరిజం పేర భారీ నిర్మాణాల కంటె కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే యిలాటి ప్రోలెటేరియట్ టూరిజం వలననే ఆర్థికాభివృద్ధి మెరుగ్గా జరుగుతుంది.

- ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?