cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : డివి నరసరాజు శతజయంతి

ఎమ్బీయస్ :  డివి నరసరాజు శతజయంతి

ప్రధానంగా సినీ రచయిత, అనుకోకుండా దర్శకుడు, నటుడు అయిన డివి నరసరాజుగారి శతజయంతి యివాళే. 1920 జులై 15 న విజయవాడలో పుట్టారాయన. 86 ఏళ్ల వయసులో హైదరాబాదులో మరణించారు. మధ్యలో చాలాకాలం మద్రాసులో సినీరచయితగా వున్నారు. ఆయన గొప్ప రచయిత, స్టార్ రచయిత. ఆ స్థాయి రచయిత శతజయంతి ఘనంగానే జరగాలి కానీ కుటుంబం దన్నో, కులం దన్నో, పలుకుబడి వున్న వీరాభిమానులో వుండకపోతే సభలు, సమావేశాలు, టీవీ కార్యక్రమాలు జరగవు. మా ‘‘హాసం క్లబ్’’ తరఫున మేం మంచి సభ జరపాలని ఆర్నెల్ల క్రితమే అనుకున్నాం. మా కన్వీనర్ ఎస్.వి.రామారావుగారికి ఆయనతో వ్యక్తిగతంగా కూడా దీర్ఘపరిచయం, నాకు, వరప్రసాద్‌కు స్వల్పపరిచయం వుంది కాబట్టి అది మా బాధ్యత అనుకున్నాం. కానీ కరోనా కారణంగా సభ జరపలేకపోయాం. అందువలన యీ అక్షరనివాళితో సరిపెడుతున్నాను.

నరసరాజు గారంటే హుందాతనానికి, పెద్దరికానికి మారుపేరు. సినిమా రచయిత కావాలని అనుకునేవాళ్లు ఆయనలా వుండాలని కోరుకోవాలి. ఆయన పెద్దపెద్ద సంస్థలకు పనిచేశారు. కిందామీదా పడి, ఎడాపెడా రాసేయాలని అనుకోలేదు. రాసినది నాణెంగా, వేలెత్తి చూపడానికి వీల్లేని విధంగా రాశారు. వివాదాలకు దూరంగా మసలుతూ, అన్ని గ్రూపులవారి మన్ననలు పొందుతూ, దేనికీ ఆరాటపడకుండా, హైరాన పడకుండా, చీకూచింతా లేకుండా హాయిగా, దర్జాగా బతికారు. ఎందరో ధనికులైన మిత్రులున్నా సినిమా నిర్మాణానికి పూనుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప డైరక్షన్ చేయలేదు.

తక్కినవాళ్లు ఆయనకలా చెల్లింది అని సులభంగా అనేయవచ్చు. ఎందుకంటే ఆయన ధనికుడు. భుక్తి కోసం పనిచేయవలసిన అవసరం లేనివాడు. విద్యాధికుడు. ఆ రోజుల్లోనే మద్రాసు లయోలా కాలేజీలో బిఏ చదివి, యూనివర్శిటీ ఫస్ట్ వచ్చినా ఏ ఉద్యోగానికీ వెళ్లలేదు. హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, సరదాగా నాటకాలు రాశారు, వేశారు.. ఆ నాటకాలు చూసి దర్శకుడు కెవి రెడ్డిగారు పిలిస్తే 32వ ఏట సినిమా రంగానికి వచ్చి ‘‘పెద్ద మనుషులు’’ (1954) సినిమాకు కథ, సంభాషణలు రాశారు. ఆ సినిమా హిట్టయింది. అదే కాదు, నరసరాజుగారు రాసిన సినిమాల్లో అత్యధిక శాతం విజయవంతమైనవే.

ఆయన మద్రాసులోనే నివాసముంటూ, సినిమా ఆఫర్లు వచ్చినపుడు వాళ్ల ఆఫీసుకి వాళ్ల కారులో వెళ్లి చర్చలు జరిపి, అక్కడే కూర్చుని రచన సాగించేవారు. సినిమారంగంలో పెద్ద తలకాయ లనదగిన వారందరితో కలిసి పనిచేశారు. చిత్రం ఏమిటంటే ఒక్కో డైరక్టరుకి ఒక్కో రైటర్‌తో వేవ్‌లెంగ్త్ కుదురుతుంది. కానీ నరసరాజుగారికి కెవి రెడ్డి గారితోనూ కుదిరింది. బిఎన్ రెడ్డిగారితోనూ కుదిరింది. చక్రపాణి గారితోనూ కుదిరింది. ముగ్గురివీ మూడు రకాలైన స్కూల్స్. ఆయన బిఎన్ వంటి సీనియర్ డైరక్టరుతోనూ పని చేశారు, తాతినేని రామారావు వంటి యువ డైరక్టరుతోనూ చేశారు. అందరూ నరసరాజుగారి విద్వత్తును గుర్తించారు, గౌరవించారు.

నరసరాజు గారు నాటకాల నుంచి వచ్చినా ఆయన సంభాషణల్లో నాటకీయత కనబడదు. సంభాషణలు అతి సహజంగా వుంటాయి. కథ రాసినప్పుడు కూడా చాలా తార్కికంగా, సైంటిఫిక్‌గా వుంటుంది తప్ప కృత్రిమమైన ట్విస్టులుండవు. సీరియస్ డైలాగులు రాసినప్పుడు కూడా మెలోడ్రామా ఉండదు. పాత్రస్వభావాన్ని, సన్నివేశ సందర్భాన్ని అనుసరించే వుంటాయి. మరొక గొప్ప లక్షణం ఏమిటంటే, ఆయన హాస్యరచనా కౌశలం, వ్యంగ్యవైభవం, చమత్కారం! రమణ గారి హాస్యరచన కూడా ఆహ్లాదంగా వుంటుంది. కానీ నరసరాజుగారి సక్సెస్ రేట్ ఎక్కువ. ఆయన సామాన్య ప్రజలు కూడా అందిపుచ్చుకునేలా రాయగలరు. ‘‘గుండమ్మ కథ’’, ‘‘తిక్క శంకరయ్య’’ డైలాగులు ఆయనవే.

ఆయన అన్ని రకాల సినిమాలూ రాశారు. ‘‘దొంగరాముడు’’, ‘‘లేతమనసులు’’, ‘‘కోడలు దిద్దిన కాపురం’’, ‘‘రంగులరాట్నం’’, ‘‘రాము’’, ‘‘బడిపంతులు’’ వంటి అనేక సాంఘిక సినిమాలు, ‘‘వీర పాండ్య కట్టబ్రహ్మన’’ వంటి చారిత్రాత్మకం, ‘‘రాజమకుటం’’, ‘‘సింహబలుడు’’ వంటి జానపదాలు, ‘‘భక్త ప్రహ్లాద’’ వంటి పౌరాణికం, ‘‘యమగోల’’ వంటి పొలిటికల్ సెటైర్ ప్లస్ సోషల్ ఫాంటసీ, ‘‘కారు దిద్దిన కాపురం’’ వంటి సైఫై పిల్లల సినిమా – యివన్నీ ఆయన రాసినవే. కథలు కూర్చడంలో ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ‘‘రాముడు భీముడు’’ కథ, సంభాషణలు ఆయనవే అని చెప్తే చాలు. అది ఎన్ని రకాలుగా, ఎన్ని భాషల్లో వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహో అనబుద్ధవుతుంది.

ఆయన విలువ తెలుసు కాబట్టే అందర్నీ తెల్లవారు ఝామున రమ్మనమనే ఎన్టీయార్ యీయన కోసం కాల్‌షీట్లు మార్చుకుని 9 గంటలకు రావచ్చనేవారు. ఎయన్నార్ ‘‘శ్రీరంగనీతులు’’ రాసి పెట్టమని కోరడమే కాదు, డిఫాక్టో ప్రొడ్యూసరుగా వుండమన్నారు. ఎవి మెయ్యప్పన్ కోరి ‘‘భక్త ప్రహ్లాద’’ రాయించుకున్నారు. ఎవరైనా తొందరపెట్టి రాయమంటే యీయన కుదరదనేవారు. తన ధోరణిలోనే రాసి యిచ్చేవారు. సాటి రచయితలు, నిర్మాతలు, దర్శకులు ఆయనను గౌరవించేవారు. ‘‘రాముడు భీముడు’’ హిందీలో ‘‘రామ్ ఔర్ శ్యామ్’’గా తీసినపుడు దిలీప్ కుమార్ యీయనతో చర్చించి కథలో మార్పులు చేశాడు.

తీరిక సమయాల్లో ఆయన ‘‘విజయచిత్ర’’లో వ్యాసాలు రాసేవారు. ‘‘ఈనాడు’’లో ‘‘అక్షింతలు’’ పేర సమాజంపై వ్యంగ్యరచనలతో కాలమ్ నడిపేవారు. హైదరాబాదుకి వచ్చి స్థిరపడ్డాక ‘‘సితార’’లో ‘‘తెర వెనుక కథలు’’ పేరుతో ఆనాటి ప్రముఖ సంస్థల గురించిన విశేషాలెన్నో గ్రంథస్తం చేశారు. తర్వాత అది గ్రంథరూపంలో వచ్చింది కూడా. సినిమా జర్నలిస్టుల పాలిట అది కల్పతరువైంది. నాతో సహా ఎందరో దానిలోని ఉదంతాలను ఉటంకించారు.

ఆయన నిత్యచదువరి. తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు విపరీతంగా చదివేవారు. మా ‘‘హాసం’’ పత్రిక కూడా రెగ్యులర్‌గా చదివి మెచ్చుకునేవారు. మాకు రెండు కథలు కూడా రాసిచ్చారు.  ‘‘వృద్ధబాలశిక్ష’’ పేర వృద్ధాప్యంలో పిల్లల యింట్లో వుండే పెద్దలు ఎలా మెలగాలో చెపుతూ ఓ చిన్న నవల రాశారు. పేరు, థీమ్ చాలా బాగున్నాయి కానీ సరిగ్గా పండలేదు. ఏమైనా అనుకుంటారేమోనని సంకోచిస్తూనే, ఆ విషయాన్ని తెలియపరుస్తూ మేనేజింగ్ ఎడిటర్ హోదాలో నేనే ఉత్తరం రాస్తూ రచన తిరస్కరించాను. కానీ ఆయన ఏమీ అనుకోలేదు. ‘ఫర్వాలేదు లెండి’ అనేశారు.

‘‘హాసం’’ తరఫున రావి కొండలరావుగారి సారథ్యంలో ‘‘హ్యూమర్ క్లబ్’’ ప్రారంభించినపుడు ఆయన అధ్యక్షుడుగా వున్నారు. ఆయన మంచి వక్త కూడా. తెలుగుతనం ఉట్టిపడే పంచెకట్టుతో గంభీరంగా కనబడేవారు కానీ మందహాసంతోనే చక్కటి జోకులు వేసేవారు. ఇతర వక్తలు మాట్లాడిన తీరు గమనించి, అవసరం బట్టి ఎక్కువగానో, తక్కువగానో మాట్లాడేవారు. పరోక్షంలో కూడా ఆయన గురించి పరుషంగానో, విమర్శిస్తూనో మాట్లాడినవారిని నేను చూడలేదు.

నరసరాజుగారిలో చెప్పుకోదగిన మరో మంచి లక్షణం – ఆయన పాజిటివ్ ఏటిట్యూడ్. ఆయన జీవితంలో అనేక కష్టాలున్నాయి. భార్యకు దీర్ఘకాలంపాటు అనారోగ్యం వుండేది, కొడుకు వృద్ధిలోకి రాలేదు, కూతురుకి మధ్యవయసులోనే వైధవ్యం ప్రాప్తించింది. అయినా ఆయన తన ఆత్మకథకు పెట్టిన పేరు – ‘‘అదృష్టవంతుని ఆత్మకథ’’! అది చదివితే ఆయన జ్ఞాపకశక్తికి జోహారనాలి. 50 ఏళ్ల క్రితం నాటి విషయాలను, సంఘటనలను మనసుకు హత్తకునేట్లు వర్ణించారు. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను వివరించారు. మనుషుల గురించి అంచనా వేయడంలో, తూకం చెడకుండా వారి గురించి చెప్పడంలో ఆయన దిట్ట.

శతజయంతి సందర్భంగా ఆయనకు నా తరఫున, మా ‘‘హాసం’’ సంస్థ తరఫున అంజలి ఘటిస్తున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)
mbsprasad@gmail.com

 


×