Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: డ్రగ్‌ వ్యాపారి విచారణలోనూ యిబ్బందే

ఎమ్బీయస్‌: డ్రగ్‌ వ్యాపారి విచారణలోనూ యిబ్బందే

మెక్సికో కేంద్రంగా అమెరికాలో భారీగా డ్రగ్‌ వ్యాపారం చేసే జోవాక్విన్‌ గజ్‌మన్‌ (అతన్ని 'ఎల్‌ చాపో' - మిస్టర్‌ పొట్టివాడు అంటారు) అమెరికాకు జైల్లో 18 నెలలుగా ఉంటున్నాడు. మెక్సికో ప్రభుత్వం అతన్ని పట్టుకుని జైల్లో పెట్టిన రెండు సార్లూ 2001లోనూ, 2015లోనూ పారిపోయాడు. 2016లో మళ్లీ పట్టుకున్నారు. ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో మెక్సికన్లపై నానారకాల అభియోగాలూ చేశాడు. వాళ్లు అమెరికాకు దొంగతనంగా వచ్చి చౌకగా పనిచేస్తూ స్థానికులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారన్నాడు, డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ అమెరికన్‌ యువతను చెడగొడుతున్నాడన్నాడు.

అసాంఘిక శక్తుల్లో చాలామంది మెక్సికన్లే అన్నాడు. వాళ్లు సరిహద్దులు దాటి రాకుండా గోడ కట్టేస్తానన్నాడు. ట్రంప్‌ నెగ్గడంతో మెక్సికో ప్రభుత్వాధినేతకు గుబులు పుట్టింది. తమ నిజాయితీని కొంతైనా చూపించకపోతే డ్రగ్స్‌ పేరు చెప్పి ట్రంప్‌ నిజంగా తమపై దాడి చేస్తాడేమోనని భయపడి ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందుగా చాపోను అమెరికాకు అప్పగించింది. అమెరికాలో అతను చేసిన నేరాలకై ఏడు ఫెడరల్‌ డిస్ట్రిక్టులలో కేసులు నమోదయ్యాయి. 'సినాలోయా కార్టెల్‌' అనే ప్రపంచంలోనే అతి పెద్దదైన డ్రగ్‌ మాఫియాకు అతనే అధినేతనీ, 14 బిలియన్‌ డాలర్ల డ్రగ్స్‌ను అమెరికాలో చలామణీలో పెట్టాడనీ అభియోగం. సాధారణంగా యిలా పట్టుబడిన డ్రగ్‌ లార్డ్‌లు నేరం ఒప్పేసుకుని శిక్ష తగ్గించుకుంటూ ఉంటారు. కానీ చాపో తాను అమాయకుణ్నని వాదిస్తున్నాడు.

డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (డిఇఏ) వాళ్లు యిన్నాళ్లూ మాదకద్రవ్యాలు దగ్గర ఉంచుకున్నవారిని, కొన్నవారిని, అమ్మినవారిని, వాడిన వారిని పట్టుకుంటూ శిక్షలు వేయిస్తూ వచ్చారు. ఇప్పుడీ చిన్నాచితకా కేసులు వదిలేసి దేశంలోకి సరఫరా చేసే వాళ్ల నడ్డి విరచాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వారి వలలో పడిన తిమింగలం యీ చాపో. అతను మూడు దశాబ్దాలుగా నడిపిన డ్రగ్‌ వ్యాపారం వలన వేలాది మంది చనిపోయారని, లక్షలాది మంది కొకైన్‌కు బానిసలయ్యారని ప్రాసిక్యూషన్‌ అంటోంది.  బ్రూక్లిన్‌లో యీ సెప్టెంబరులో ప్రారంభం కాబోతున్న యీ కేసు అమెరికా చరిత్రలోనే అది పెద్ద డ్రగ్‌ కేసుల్లో ఒకటంటున్నారు. అయితే యీ కేసుని తయారుచేస్తున్న ప్రాసిక్యూషన్‌కు కొన్ని అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి. 

చాపో 1957లో మెక్సికోలోని పర్వతప్రాంతమైన లా ట్యూనాలో పుట్టాడు. అతి పేద కుటుంబం. చిన్నప్పణుంచి బజార్లో బస్తాలు మోస్తూ నాలుగు రూకలు సంపాదించి కుటుంబానికి యిచ్చేవాడు. ఆ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు, రైళ్లు, రోడ్లు వేయడంలో పనిచేయడానికి 19 వ శతాబ్దం ద్వితీయార్థంలో చైనా నుంచి కార్మికులను తెప్పించారు. వాళ్లకు నల్లమందు, గంజాయి అలవాటు కాబట్టి, ఆ విత్తనాలు తెచ్చుకుని అక్కడ పాతారు. మెక్సికన్‌ వాతావరణంలో అవి బాగా పండాయి. నల్లమందు అక్కణ్నుంచి అన్నిచోట్లకు ఎగుమతి అయ్యేది - ముఖ్యంగా అమెరికాకు. దాన్నుంచే హెరాయిన్‌ తయారుచేసేవారు.

నల్లమందు వాడకాన్ని నిషేధిస్తూ అమెరికా 1914లో హారిసన్‌ చట్టం తేవడంతో, దానికి అలవాటు పడ్డవారు మెక్సికోనుంచి చాటుగా తెప్పించుకోసాగారు. ఈ సరఫరాకు సినాలోవా, చిహువాహువా, డ్యురాంగో అనే మూడు ప్రాంతాల నడుమ ఉన్న ప్రాంతం (గోల్డెన్‌ ట్రయాంగిల్‌ అంటారు) పేరుబడింది. చాపో అక్కడివాడే కాబట్టి 1972లో అంటే తన 15 వ ఏట ఆ వ్యాపారంలోకి దిగాడు. ఉద్యోగం ఏదీ దొరక్కపోవడం చేత గంజాయి పెంచడం, అమ్మడం చేసేవాడు. 

నిక్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా డ్రగ్స్‌ సమస్యను గుర్తించి దానిపై 1971లో పోరాటాన్ని ప్రకటించాడు. అఫ్గనిస్తాన్‌ నుంచి కొలంబియా వరకు అనేక దేశాల్లోని వ్యాపారస్తులు అమెరికాకు మత్తుమందులు సరఫరా చేస్తున్నారని గ్రహించి వాళ్లపై పోరాటం సాగించాడు. కొలంబియా మాఫియాపై ఒత్తిడి పెరగడంతో వాళ్లు తమ దృష్టిని మెక్సికోపై పెట్టారు. ఎందుకంటే మెక్సికోకు, అమెరికాకు 2వేల మైళ్ల సరిహద్దు ఉంది. దాన్ని నిరంతరం కాపలా కాయడం అసాధ్యం. అప్పటికే మెక్సికో హెరాయిన్‌, మారిజువానా సరఫరా చేస్తోంది. ఇప్పుడు వాటికి కొలంబియా వారి కొకైన్‌ తోడయింది.

కొలంబియా వాళ్లు ఆండియన్‌ అడవుల నుంచి తమ సరుకును విమానాల్లో గోల్డెన్‌ ట్రయాంగిల్‌కు తెచ్చి గ్వాడలాజారా కార్టెల్‌కు అప్పగించారు. వారిలో భాగమైన చాపో అక్కణ్నుంచి కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్‌లకు అతి తక్కువ సమయంలో రవాణా చేసేవాడు. అతనికి ఉన్న ఆ నేర్పు అతనికి 'ఎల్‌ రాపిడో' (మిస్టర్‌ స్పీడ్‌) అనే బిరుదు తెచ్చిపెట్టింది. అతనికి లాజిస్టిక్స్‌లో ఎక్స్‌పర్ట్‌గా పేరు వచ్చింది. నోగాలెస్‌ వంటి సరిహద్దు గ్రామాల్లో శాంతా క్రూజ్‌ నది కిందుగా సహజంగా ఏర్పడిన సొరంగాలున్నాయి. చాపో వాటిని పటిష్టం చేసి పట్టాలు వేసి, విద్యుత్‌తో నడిచే చిన్న తోపుడు బళ్లు, ఎలక్ట్రిక్‌ బల్బులు ఏర్పాటు చేసి, సరుకును నది కింద నుంచే స్మగుల్‌ చేసేసేవాడు. సొరంగాలు వేయించడంలో అతను ఎక్స్‌పర్ట్‌.

2015లో జైలు నుంచి అతను సొరంగం ద్వారానే జైలు నుంచి పారిపోయాడు. 1989 వచ్చేసరికి గ్వాడలాజారా కార్టెల్‌ ముక్కముక్కలుగా విడిపోయింది. వాటిలో సినాలోవా కార్టెల్‌ చాపో నియంత్రణ కిందకు వచ్చింది. అక్కణ్నుంచి క్రమంగా డ్రగ్‌ లార్డ్‌గా మారాడు. అయితే రాబిన్‌హుడ్‌ యిమేజి మేన్‌టేన్‌ చేయడానికి ఏదో ఒక సంతలో లేదా జాతరలో హఠాత్తుగా ప్రత్యక్షమై డబ్బు కట్టలు పంచేవాడు. రోడ్లు వేయించాడు, ఆసుపత్రులు కట్టించాడు. అందుకే యిప్పటికీ అతని సొంత ప్రాంతాల్లో అతని పేరున్న క్యాప్‌లను పెట్టుకుని తిరుగుతున్నారు.

చాపో తన ముఠాను కార్పోరేట్‌ లెవెల్లో నడిపేవాడు. సమర్థులను గుర్తించి, వారికి పనులు అప్పగించేవాడు. జీతాలు మరీ అంతగా యివ్వకపోయినా అందరూ అతని మాట పాటించేవారు. 1990 నుంచి కొకైన్‌ వ్యాపారంలో భారీ లాభాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో డ్రగ్‌ మాఫియావాళ్లు ఆధునిక ఆయధాలు చేపట్టి, ఒకరిపై మరొకరు దాడి చేసుకునేవారు. 1993 జూన్‌లో గ్వాటెమాలా పోలీసులు అతన్ని పట్టుకుని మెక్సికోకు అప్పగించారు. 20 ఏళ్లు శిక్ష పడింది. అతను వార్డన్లకు లంచాలిచ్చి, జైలు నుంచి తన ఆపరేషన్స్‌ కొనసాగించాడు. 2001లో జైలు సిబ్బంది సహకారంతో మాసిన బట్టల బండిలో దాక్కుని పారిపోయాడు కూడా. ఇక అప్పణ్నుంచి అమెరికా, మెక్సికో పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఆ వేట 13 ఏళ్లు సాగింది.

అండర్‌గ్రౌండ్‌ టన్నెళ్ల ద్వారా అతను ఎప్పటికప్పుడు తప్పించుకునేవాడు. చాపో జైల్లో ఉన్న సమయంలో సైన్యం నుంచి రిటైరయ్యాక డ్రగ్‌ వ్యాపారంలోకి దిగిన జేటాస్‌ అనే గ్రూపు పైచేయి సాధించింది. ఇతను బయటకు వచ్చి వాళ్లపై దాడులు చేశాడు. చివరకు 2014లో చాపో పట్టుబడ్డాడు. ఈసారి 16 నెలలే ఉన్నాడు. 2015 జులైలో బాత్‌రూమ్‌ కింద తవ్వించుకున్న సొరంగం ద్వారా పారిపోయాడు. భూమికి 33 అడుగుల లోతున అయిదున్నర అడుగుల ఎత్తు, రెండుపావు అడుగల వెడల్పు, మైలు పొడుగు ఉన్న సొరంగాన్ని అతని అనుచరులు తవ్వారు. 2016 జనవరిలో మెక్సికో నేవీవారు అతన్ని ఒక యింట్లో పట్టుకున్నారు. అతను ఎప్పటిలాగా ఒక సొరంగం ద్వారా పారిపోయాడు. కానీ కొన్నాళ్లకే పట్టుబడిపోయాడు. 2017 జనవరిలో అమెరికాకు తరలించి న్యూయార్కులో హై సెక్యూరిటీ జైల్లో ఉంచారు.

మెక్సికోలో డ్రగ్స్‌ తయారుచేసి అమెరికాకు పంపే వ్యాపారం బిలియన్‌ డాలర్ల వ్యాపారం కాబట్టి దాన్ని కైవసం చేసుకోవడానికి డ్రగ్‌ కార్టెల్‌లు తమలో తాము నిరంతరం కలహించుకుంటూ ఉంటాయి. ఒకరినొకరు చంపుకుంటాయి. మధ్యలో సాధారణ పౌరులు కూడా చనిపోతూ ఉంటారు. గత దశాబ్దకాలంలో యీ వ్యాపారం కారణంగా 1,19,000 మంది చనిపోయారు. అవయవాలు పోగొట్టుకున్నవారి సంఖ్య దీనికి అనేక రెట్లు ఎక్కువ. హింస పెరిగిపోవడంతో 2006లో మెక్సికో అధ్యక్షుడు కాల్డెరాన్‌ అమెరికా ప్రభుత్వ సాయంతో యీ గుంపులను అణచసాగాడు.

అప్పణ్నుంచి పదేళ్లలో అమెరికా మెక్సికోకు 1.6 బిలియన్‌ డాలర్లు దీనికై యిచ్చింది. ఏం చేసినా హింస పెరుగుతూనే ఉంది. ఈ ముఠాలు మురికివాడల నుండి ధనాశ చూపించి పేద కుర్రవాళ్లను తమలో చేర్చుకుంటూ, తమలో తాము పోరాడుతూ, సెక్యూరిటీ ఫోర్సుపై కూడా దాడి చేస్తారు. డ్రగ్స్‌పై యుద్ధానికి అమెరికా యిప్పటివరకు ఒక ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టి ఉంటుందని అంచనా. హెరాయిన్‌ వలన 2010లో 3 వేల మంది చనిపోతే 2016లో 15 వేల మంది చనిపోయారు.  ఇప్పుడు ప్రాసిక్యూషన్‌ వారు దేశాలకు విస్తరించిన హింసకు, యీ వ్యాపారానికి ముడిపెట్టి కేసు నడపబోతున్నారు. దాంతో శిక్ష పెద్దదవుతుంది. 

డ్రగ్స్‌ వ్యాపారం చేసే మెక్సికన్‌ మాఫియా వాళ్లు మెక్సికన్‌ పోలీసులకు, సరిహద్దులను రక్షించే సైనికులకు లంచాలు యిస్తూ తమ పని కానిచ్చుకుంటూ ఉంటారు. అందువలన డ్రగ్స్‌ వ్యాపారస్తులను పట్టుకోవాలంటే అమెరికాలోని డ్రగ్‌ నిరోధక శాఖ మెక్సికన్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌కు అవతలివాళ్ల కంటె ఎక్కువ లంచాలిచ్చి ఆ వ్యాపారస్తుల ఆనుపానులు లాగుతూ వచ్చారు. అలాగే డ్రగ్‌ వ్యాపారుల ఆచూకీ చెప్పడానికి అదే వ్యాపారంలో ఉన్న కొందరిని పోలీసు యిన్‌ఫార్మర్లగా మార్చుకున్నారు. వాళ్లకు డబ్బులిచ్చారు. వాళ్లు పట్టుబడ్డ సందర్భాల్లో తక్కువ శిక్ష పడేట్లుగా చేశారు. లేకపోతే డ్రగ్‌ మాఫియా గురించి సమాచారం రాబట్టడం అసాధ్యం. సమాచారం బయటకు పొక్కిందని తెలిస్తే మాఫియా వాళ్లను చిత్రహింసల పాలు చేస్తుంది, ప్రాణాలు తీస్తుంది.

అందువలన వారిలో కొందరు చిన్నచేపలను పోలీసు పక్షాన మార్చుకోవాలి. దానికి డబ్బివ్వాలి, వేరే ఆశలు చూపాలి. కానీ చట్టప్రకారం చూస్తే యిది తప్పు. ఈ విషయం యిదివరకే వెలుగులోకి వచ్చింది. 2011లో విసెంటే జంబాడా అనే ఒక మాదకద్రవ్య వ్యాపారి పట్టుబడినపుడు అతను 'నన్ను శిక్షించడానికి వీల్లేదు. నేను డిఇఎ యిన్‌ఫార్మర్‌ని' అన్నాడు. ఇలాటి బేరసారాలు అడడానికి డిఇఏ అధికారులు, యీ వ్యాపారులతో అనేక సమావేశాలు జరిపారు. అవన్నీ బయటపడితే యికపై మాఫియా జాగ్రత్తపడుతుంది. 

డిఇఏ ఏజంట్లు మాఫియాలో చొరబడడానికి ఒక్కోప్పుడు తామే చిన్న నేరాలకు పాల్పడి,  తాము కూడా యీ వ్యాపారంలో ఉన్నామని చూపుకోవాలి. లేకపోతే వాళ్లు దగ్గరకు రానీయరు. కానీ చట్టరీత్యా యిది నేరం. డ్రగ్‌ వ్యాపారం చట్టవిరుద్ధమైనట్లే, డ్రగ్‌పై యుద్ధం కూడా చట్టవిరుద్ధమైన మార్గాలలో చేయాల్సి వస్తోంది. కోర్టులో విచారణకు వచ్చినపుడు జడ్జిలు దీనిపై ప్రాసిక్యూషన్‌ను నిలదీయవచ్చు. డిఫెన్సు లాయరు దీన్ని తన కనుకూలంగా వాడుకోవచ్చు. మెక్సికోలు అధికారగణం, రాజకీయనాయకులు యావత్తు ఎప్పుడో ఒకప్పుడు డ్రగ్‌ మాఫియాకు అమ్ముడుపోయినవారే. లేదా భయం చేత వారికి సాయపడినవారే.

అవన్నీ అమెరికన్‌ కోర్టులో బయటపెడితే రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. దౌత్యపరమైన సమస్యలు రావచ్చు. ఎల్‌ చాపో నేరాలను నిర్ధారించడానికి మెక్సికో, కొలంబియాలలో డ్రగ్‌ వ్యాపారం చేస్తూ పట్టుబడి, శిక్ష అనుభవిస్తున్న నేరస్తులను తన సాక్షులుగా ప్రాసిక్యూషన్‌ ఉపయోగించుకుంటోంది. చాపో డిఫెన్సు లాయరు 'శిక్ష తగ్గిస్తామని ఆశ చూపి, వాళ్ల చేత అతనికి వ్యతిరేకంగా చెప్పిస్తున్నారేమోనన్న సందేహాన్ని కోర్టులో లేవనెత్తి, వారి సాక్షాన్ని పరిగణించవద్దని జడ్జిని కోరతాను.' అన్నాడు. ఈ పరిస్థితుల్లో కేసు ఎలా పరిణమిస్తుందో తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?