cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ - ఫేడ్‌ ఇన్‌, ఫేడ్‌ ఔట్‌

ఎమ్బీయస్‌: లాక్‌డౌన్‌ - ఫేడ్‌ ఇన్‌, ఫేడ్‌ ఔట్‌

సినిమాలో ఏదైనా కొత్త కారెక్టరును పరిచయం చేసేందుకు ఫేడ్‌ ఇన్‌, జూమ్‌ ఇన్‌ టెక్నిక్‌ ఉపయోగిస్తారు. అలాగే నిష్క్రమణ సమయంలో జూమ్‌ ఔట్‌, ఫేడ్‌ ఔట్‌ ఉపయోగిస్తారు. లాక్‌డౌన్‌ ప్రక్రియ మనకు కొత్త పాలకులకు అనుభవం లేదు, పౌరులకు లేదు. అందువలన దాన్ని మనకు పరిచయం చేసేటప్పుడు ఫేజ్‌ ఇన్‌, విత్‌డ్రా చేసేటప్పుడు ఫేజ్‌ ఔట్‌ చేయాలని నా ఉద్దేశం. ఏదైనా దశలవారీగా చేస్తేనే వారికీ, మనకూ సౌలభ్యం. ఏదైనా తప్పు జరిగితే ఎప్పటికప్పుడు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అంటున్నారు. ఒక్కసారిగా ఎత్తివేస్తారా? ఎత్తివేస్తే దుష్ఫలితాలు వుంటాయేమో! అప్పుడేం చేస్తారు? మళ్లీ యింకో నెల లాక్‌డౌనా? దీనికి అంతం ఎక్కడ? మే 1 నుంచైనా దశలవారీగా ఎత్తేయాలి అనుకుంటే ఆ పని యిప్పుడే మొదలుపెట్టవచ్చు.

లాక్‌డౌన్‌ పిడుగుపాటులా వచ్చిపడింది. కరోనా విషయంలో జాగ్రత్త కోసం సోషల్‌ డిస్టెన్సింగ్‌, మాస్కుల ప్రాధాన్యత గురించి చెప్తూ వచ్చిన ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. మన దేశపౌరులకు క్రమశిక్షణ ఉండదు, ఎవడూ చెప్పిన మాట వినడు. కర్ఫ్యూ అంటేనే బయటకు వచ్చి ఓ సారి డాన్సు చేసి చూడాలనే సరదా వున్నవాళ్లు ఎక్కువ అనుకుంటాం. అలాటిది అందరూ ప్రధాని మాట మన్నించి ఒక్క తాటిపై నడిచి దాన్ని విజయవంతం చేశారు. కర్ఫ్యూ సంగతి సరే, సాయంత్రం చప్పట్లు, తాళాలు, కంచాలు, గరిటెల మోత ఎందుకు? ఏప్రిల్‌ 5న విద్యుత్‌ దీపాలార్పి, మరో దీపాలు వెలిగించడం దేనికి అని కొందరంటారు. మోదీగారికి మన ఇండియన్‌ సైకీ బాగా తెలుసు. మనకు ఏదో హంగామా ఉండాలి. లేకపోతే మజా ఉండదు.

మా చిన్నపుడు సినిమా హాల్లో కరంటు తరచుగా పోతూ వుండేది. పోగానే కొందరు బాటరీ లైట్లు తెరపై వేసేవారు, కేకలు వేసేవారు. ఎందుకు అంటే వాళ్లకే తెలియదు. ఇప్పుడైనా కరంటు పోయి తిరిగివస్తే అందరూ హా అంటూ గట్టిగా సామూహికంగా నిట్టూరుస్తారు. గణపతి నవరాత్రుల్లో చూడండి, తొమ్మిది రోజుల పూజకు చాలామంది రారు. కానీ నిమజ్జనం నాడు తప్పకుండా వచ్చి డాన్సులాడతారు. భక్తి కన్నా అట్టహాసం మీదే మోజు.

మననెలా ఎంటర్‌టైన్‌ చేయాలో మోదీకి తెలుసు. కానీ 5 రాత్రి 9 గంటలకు 9 ని.ల పాటు దీపం పట్టుకుని ఎందుకుండమన్నారో అర్థం కాలేదు. 5వ తారీకు కాబట్టి 5 ని.లంటే సరిపోయేది కదా! ఇలా అడిగితే ‘దీనిలో ఉన్న తాత్త్వికత మీలాటి హిందూద్రోహులకు తెలియదు. 9 అంటే నవగ్రహాలు, వాటి శాంతి కోసం దీపం  పట్టుకోమన్నారు మోదీ గారు’ అని మోదీ భక్తులు కోప్పడతారేమో! సరే 22 కర్ఫ్యూ భలే చేశాం అని మురిసిపోతూండగానే 24 నుంచి లాక్‌డౌన్‌ గురించి నాలుగు గంటల వ్యవధిలో ఎనౌన్సు చేసేశారు.

మోదీ గార్కి నాటకీయత అంటే మక్కువ ఎక్కువని తెలుసు కానీ బొత్తిగా మరీ యింత తక్కువ వ్యవధా? డౌన్‌లో జోరుగా వెళుతున్న సైకిల్‌కు సడన్‌ బ్రేక్‌ వేసి, దేశాన్ని బోల్తా కొట్టించినట్లయింది.  మెల్లమెల్లగా  బ్రేక్‌ వేసినట్లు ఆ కర్ఫ్యూ విధానాన్ని కొన్ని రంగాలకు, కొన్ని ప్రాంతాలకు విధిస్తూ, సడలిస్తూ క్రమక్రమంగా జనాలకు అలవాటు చేసి అప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్‌ అని అంటే బాగుండేది. మోదీ గారు ఏదైనా చేస్తే వెనక్కాల ఏదో ప్లానింగ్‌ ఉండే వుంటుంది అనుకునేవాళ్లం. ఇప్పటికీ ఎన్నికల వేళ, పరప్రభుత్వాలను పడగొట్టేవేళ ఆ ప్లానింగ్‌ కనబడుతూనే ఉంది. కానీ దేశానికి సంబంధించిన విషయాలు కొన్నిటిలో మాత్రం కానరాలేదు.

నోట్ల రద్దు విషయంలో చూశాం. చలామణీలో ఉన్న 86% నోట్లను రద్దు చేశారనగానే ఎంతో కసరత్తు చేసి వుంటారనుకున్నాం. ప్రారంభమైన వారం రోజుల్లోనే తెలిసిపోయింది - ఏ ప్రణాళికా లేకుండా గత్తరబిత్తర చేసేశారని. కొత్త నోట్లు తెద్దామనుకున్నపుడు వాటికి తగ్గట్టుగా ఎటిఎంను మార్చలేదు, నోట్ల పంపిణీలో ఆర్‌బిఐను యిన్‌వాల్వ్‌ చేయలేదు. ఇవన్నీ అర్థమైన కొద్దీ భయం పట్టుకుంది, యిదేమిట్రా యిలా చేశాడు అని. ఇప్పుడు యీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ విషయంలో కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, చేతు కాల్చుకున్నాక ఆకుల గురించి వెతకడం మొదలుపెట్టారని అర్థమౌతోంది.

లాక్‌డౌన్‌ పెట్టేశాం, అందరూ యింట్లో కూర్చోండి అన్నారు బాగానే ఉంది. మరి అందర్నీ యిల్లు చేరనివ్వాలి కదా, చేరకుండా ఎక్కడివాళ్లు అక్కడే గప్‌చుప్‌, స్టాచ్యూల్లా నిలబడిపోండి అంటే ఎలా? రెండు రోజుల టైములో మీ మీ రాష్ట్రాలకు వెళ్లండి, అక్కణ్నుంచి మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని మీ వూళ్లకు వెళ్లండి అనాల్సింది. తక్కిన ప్రయాణాలన్నీ కాన్సిల్‌ చేసి, నగరాల నుండి 24 గంటల పాటూ రైళ్లు నడిపి, పంపేయాల్సింది. బోగీలో 72 మందికి చోటుంటుంది. 24 మంది మాత్రమే ఎక్కవచ్చు అనవచ్చు. బస్సులూ అంతే. వలస కార్మికులే కాదు, మామూలు వాళ్లూ ఏదో ఒక అడంగుకి చేరేవారు.

ఒక నిజామాబాదు వ్యక్తి దిల్లీలో యింటర్వ్యూకి వెళ్లాడనుకోండి. కంపెనీ వాళ్లిచ్చిన త్రీస్టార్‌ హోటల్లో ఒక రోజుకని దిగాడు. ఇంతలో లాక్‌డౌన్‌ అన్నారు. దిల్లీలో ఎవరూ తెలియదు. హోటల్లో సొంత ఖర్చుతో వారాల తరబడి వుండగలడా? ఉన్నా హోటల్‌ వాడు రెస్టారెంట్‌ మూసేశామంటే! కనీసం హైదరాబాదు దాకా రానిస్తే ఎవరో ఒక తెలిసున్నవాడు తగులుతాడు. వాళ్లింట్లో తలదాచుకోవచ్చు. ఇలా ప్రయాణం చేసిన వాళ్లందరి చేతి మీదా అనుమానితులుగా స్టాంపు కొట్టి పంపినా తప్పులేదు. ఇంట్లో వాళ్లే దగ్గరుండి, టెస్టు చేయించుకుంటారు, దూరంగా పెడతారు.

ఇలా లాక్‌డౌన్‌ దిశగా అడుగు వేస్తూ హెల్త్‌ ఫెసిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసుకుంటూ వెళ్లి అప్పుడు లాక్‌డౌన్‌ అంటే బాగుండేది. చైనావాడు నిజమో అబద్ధమో కానీ పదిరోజుల్లో కరోనాకై ఆసుపత్రి కట్టానన్నాడు. అలాటి మాయాబజార్లు మనం ఊహించలేం కానీ ఆసుపత్రుల్లో ఎక్విప్‌మెంట్‌ పెట్టాలంటే మెషినరీ సప్లయి చేసేవాళ్లుండాలి, మెకానిక్కుండాలి, నడిపే సిబ్బంది వుండాలి, కన్స్యూమబుల్స్‌ రావాలి, మందులుండాలి, వేసేవాళ్లుండాలి. ముందుగా చెప్తే అవన్నీ సమకూర్చుకునేవారు. ఏమీ లేకుండా  ముఖ్యమైనవాళ్లు వేరే ఊళ్లో ఉండిపోయారేమో! ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, మెకానిక్‌ ఉన్నా వాళ్లని రానివ్వాలి, వచ్చేందుకు వాహనాలుండాలి, వచ్చినా మెటీరియల్‌ లేందే వాళ్లేం చేస్తారు? కొందామంటే ఆ షాపులు తెరవనీయడం లేదు. మందులు, కూరగాయలు, కిరాణా షాపులు తప్ప వేరేవాటిని మూసేయమన్నారు.

ఆసుపత్రి ఉన్నా కరోనా గురించి వాళ్లేం చేయగలుగుతారు? క్వారంటైన్‌ చేయడానికి ఆసుపత్రుల్లో వసతుల్లేవు. అటూయిటూ సర్ది ఏదో చోటు చేసి క్వారంటైన్‌ అని పేరు పెట్టేసినా ఆ తర్వాత రెండు, మూడు రోజుల దాకా ఏ టెస్టూ చేయటం లేదట. సిఫార్సు చేయించుకోవలసి వస్తోందట. టెస్టు చేసినా  రిజల్టు చెప్పటం లేదట. వైద్యసిబ్బందిని తప్పు పట్టడానికి లేదు. టెస్టింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోలేదు. ప్రయివేటు ఆసుపత్రిలో శాంపుల్‌ తీసినా, ప్రభుత్వాసుపత్రికి పంపాలట. వాళ్లు ల్యాబ్‌కు పంపాలట. ల్యాబ్‌ సిబ్బంది రాత్రికి రాత్రి పెరిగిపోరు కదా, వచ్చి పడుతున్న శాంపుల్స్‌ మిస్‌ప్లేస్‌ అయిపోతున్నాయట. మళ్లీ కావాలంటున్నారట.

ఇవన్నీ -ట వార్తలే. కానీ మన ఆసుపత్రుల, టెస్టింగ్‌ సెంటర్ల వ్యవహారం ముందే కాస్త తెలుసు కాబట్టి యిలా జరగడానికే ఎక్కువ ఆస్కారం ఉందని ఒప్పుకోవాలి. పైగా యీ పరిస్థితుల్లో సిబ్బంది రాకపోకలు కష్టమైపోయినపుడు ఎవర్నీ గట్టిగా ఏమీ అనలేరు. ఒకవేళ పాజిటివ్‌ వస్తే యివ్వడానికి మందులూ లేవు. మలేరియా మందులిచ్చి చూస్తున్నారు. కోలుకున్న వాళ్లని యింటికి పంపిస్తున్నారు. తిరగబెడితే మళ్లీ రమ్మంటున్నారు.

ఇవన్నీ చూసుకోకుండా లాక్‌డౌన్‌ అనేయడం పొరబాటు. నేనందుకే అన్నాను. ముఖ్యమంత్రులకు, ప్రధానికి అనేక రంగాల నిపుణుల చేత సాధకబాధకాల గురించి చెప్పించి, వాళ్లల్లో వాళ్లు చర్చించుకుని, అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుని వుండాలని. అది జరగలేదు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పాడు ‘అమలు చేయాల్సినది రాష్ట్రాలే కదా. లాక్‌డౌన్‌ ఆదేశించడానికి ముందు మమ్మల్ని సంప్రదించలేదు.’ అని. లేదు సంప్రదించాం, యిదిగో రుజువు అని బిజెపి పార్టీ తరఫునైనా ఖండన రాలేదు. ‘నాతో మాట్లాడారు, నీతో మాట్లాడలేదా?’ అని మరో ముఖ్యమంత్రీ అనలేదు.

ఏది ఏమైనా ఏ ముఖ్యమంత్రీ అది మనసులో పెట్టుకోకుండా ప్రధానికి సహకరించారు. ఇది ఇండియా గొప్పతనం. అమెరికాలో యీ స్ఫూర్తే కొరవడి, దేశాధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్లు కలహించుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులూ తన కిస్తున్న సహకారాన్ని మోదీ గుర్తించాలి. వాళ్లను తేలికగా తీసుకోకూడదు, చులకనగా చూడకూడదు. ఈసారి లాక్‌డౌన్‌ పొడిగింపు విషయంలో వాళ్ల అభిప్రాయాలు సేకరించడం శుభపరిణామం. ఎందుకంటే ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరు. యూరోప్‌లో దేశాల్లాటివి మన రాష్ట్రాలు. వాళ్లందరూ ఒకే విధానాన్ని అమలు చేయటం లేదు. మనమూ చేయనక్కరలేదు.

జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ముంబయిలా జనాభా అతి పల్చగా వున్న ఈశాన్య రాష్ట్రాలుండవు. ఊరూరా ఆసుపత్రులున్న కేరళలా, ఆసుపత్రికి వెళ్లాలంటే కాలువ యీదుకుంటూ వెళ్లాల్సిన ఒడిశా వుండదు. మహారాష్ట్రలో ముంబయిలా రత్నగిరి వుండదు. ముంబయిలో ధరావి ఉన్నట్లు, జుహూ ఉండదు. స్థానిక పరిస్థితుల బట్టి రాష్ట్రాల డేంజర్‌ జోన్స్‌ను గుర్తించి, వాటిని యితర ప్రాంతాలతో విడగొట్టి, కార్డన్‌ ఆఫ్‌ చేసి, అక్కడి పౌరులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకానీ లాక్‌డౌన్‌ మంత్రం పఠించి, అందర్నీ మూసుకుని యింట్లో కూర్చోమంటే కరోనా దానంతట అది ఛూమంతరకాళి అయిపోతుందా?

ఒక ఉదాహరణ చెప్తాను. ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ ఉంటుంది, రోగిని కొన్ని గంటల పాటు ఆపరేషన్‌ థియేటర్‌లో వుంచి, ఐసియుకి మార్చి అక్కడ కొన్ని రోజులుంచి, తర్వాత మామూలు గదిలో కొన్ని రోజులుంచి, ఆ తర్వాత యింటికి పంపేస్తారు. రోగుల పరిస్థితి బట్టి ఎవరు ఎక్కడ వుండాలో డాక్టర్లు చెపుతారు. ఒపి పేషంటును కూడా పట్టుకెళ్లి ఆపరేషన్‌ థియేటర్లోనో, ఐసియులోనో పెడితే మేన్‌టేన్‌ చేయలేరు. ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితి ఎలా వుందంటే ఇంట్లో వుండదగిన మనిషిని కూడా పట్టుకెళ్లి ఐసియులో పెట్టినట్లుంది. దీనివలన రెండు నష్టాలు - మామూులు మనిషికి అంత జాగ్రత్త అవసరం లేదు కాబట్టి ఆ ఖర్చంతా వృథా. రెండోది నిజంగా ఐసియులో వుండవల్సిన వ్యక్తికి, వీళ్లందరితో పంచుకోవలసిన కారణంగా కష్టనష్టాలు కలుగుతాయి.

పైగా అందరూ ఐసియులో వుంటే, బయట పనిచేసేవారెవరు? దానికి నీరు, విద్యుత్‌, వగైరాలు అందించేవారెవరు? 130 కోట్ల మందిని మానిటర్‌ చేయాలన్నా, నియంత్రించాలన్నా మన పోలీసులూ చాలరు, డాక్టర్లూ చాలరు. అందరి మీదా దృష్టి పెడదామంటే పర్యవేక్షణ పలుచన అయిపోతుంది. అందువలన అనుమానిత ప్రాంతాల్లో వున్న కొందరిమీదనే ఫోకస్‌ పెడితే ఫలితాలు త్వరగా వస్తాయి. జోన్‌ బయట వున్న ప్రాంతాల్లో ఆసుపత్రులు, షాపులు అన్నీ ఫుల్‌  స్కేలు లో నడపనిస్తే యీ డేంజర్‌ జోన్‌ వాళ్లను అక్కడ ట్రీట్‌ చేయించి, త్వరగా ప్రమాదం నుంచి బయట పడేయవచ్చు.

కెసియార్‌ తెలంగాణలో లాక్‌డౌన్‌ నెలాఖరు వరకు పెంచడాన్ని సమర్థిస్తూ కొందరు రాష్ట్రంలో వెయ్యిమంది దిల్లీ తబ్లిగీ వాళ్లున్నపుడు మరేం చేస్తారు అంటున్నారు. వెయ్యిమంది వెళ్లారు, వాళ్ల తాలూకు వాళ్లు, సంపర్కం చెందినవారు ఎంతమంది వున్నారంటారు? మాయాబజారులో ఘటోత్కచుడు చెప్పినట్లు ‘..బంధు, బంధు, బంధు..’ అని లెక్కవేసినా ఒక్కోడు వెయ్యిమందికి అంటించాడనుకున్నా పది లక్షలు తేలతారు. ఇది కూడా హైయ్యర్‌ సైడ్‌ వేసిన లెక్క ఎందుకంటే వీరిలో కొందరు కామన్‌గా తేలతారు- బంధువులో, స్నేహితులో, యిరుగుపొరుగువారో కావడం చేత. పోనీ కొండగుర్తుగా పదిలక్షలందాం.

వీరి కోసం నాలుగు కోట్ల మందికి గృహనిర్బంధపు శిక్ష వేయడం దేనికి? ఈ పదిలక్షల మందిని గుర్తించి, పరీక్షించి, మొరాయిస్తే తోలుతీసి, తీసుకొచ్చి కుదేసి, వెర్రివేషాలేస్తే నాలుగు తగిలించడానికైనా సిబ్బంది వుండాలి కదా. వీళ్లతో పాటు దిల్లీ నుంచి  రైలులో ఎవరు వచ్చారో తెలుసుకోవాంటే రైలు  రికార్డు చూడాలి, బస్సులో వచ్చినవాళ్ల గురించి అడగాలంటే బస్సు సిబ్బందిని అడగాలి. స్కూలుకో, ఆఫీసుకో వెళ్లారంటే ఎవరితో కలిసారో చూడడానికి అక్కడివారిని వాకబు చేయాలి. వాళ్లందరినీ యిళ్లలో పడేసి వుంచితే యివన్నీ ఎలా తెలుస్తాయి?

కొన్ని రంగాలకు మినహాయింపు యిప్పటికే యిచ్చారు, లాక్‌డౌన్‌ పొడిగిస్తున్న రెండు వారాల్లో యింకా కొన్ని రంగాలకు మినహాయింపు యిస్తున్నారు. ఇలాటి మినహాయింపే సురక్షితంగా భావిస్తున్న కొన్ని ప్రాంతాలకు కూడా యివ్వాలి. జైలు ప్రాంగణం చిన్నగా వుంటుంది నిఘా వేయడం సులభం. ఊరంతా జైలే అంటే ఎవర్నని చూస్తారు? ఎందర్ని చూస్తారు? మనుషులు బతకాలంటే కూరలు కావాలి, ఉప్పులుపప్పులు కావాలి అని వాటికి వదులుతున్నారు. కానీ ఆ విండో తక్కువ గంటలు పెట్టినకొద్దీ మార్కెట్‌లో,  రైతుబజార్లలో రద్దీ పెరుగుతుంది. వస్తువులు దొరకవనే ఆందోళనతో తోపులాటలు పెరుగుతాయి. డాన్‌ టు డస్క్‌ అన్నట్లు పగలంతా వుంచితే జనం స్ప్రెడ్‌ అవుతారు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించవచ్చు.

ఎవరో కొందరు తుంటర్లని తప్పిస్తే దేశం మొత్తం ప్రధాని మాట మన్నించి మూడువారాల లాక్‌డౌన్‌ను పాటించారు. కరోనా గురించి జనాలకు అవగాహన వచ్చింది. రోగాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రభుత్వానికి ఒక అవగాహన వచ్చింది. ఇక పాక్షికంగానైనా రిలాక్స్‌ చేయకపోతే ధిక్కరించే ప్రమాదం ఉంది. అది కౌంటర్‌-ప్రొడక్టివ్‌ అవుతుంది. నోట్ల రద్దు సమయంలో మోదీ 50 రోజులంటే ప్రజలు ఓపిక పట్టారు. కానీ 2016లో మోదీకి ప్రజల్లో వున్న గుడ్‌విల్‌ యిప్పుడు లేదు. నోట్లరద్దు, జిఎస్‌టి, నిరుద్యోగం, పరిశ్రమల మూసివేత, బ్యాంకు మోసాలు- యివన్నీ మోదీ సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు కాడేమోనన్న అనుమానాలు కలిగించసాగాయి. ఇవాళ రాత్రి ప్రధాని ప్రసంగం అంటే పనిమనిషి దగ్గర్నుంచి టెన్షన్‌ పడుతోంది.

ఈ లాక్‌డౌన్‌ జీవితంలో కనీవిని ఎరుగని అనుభవం. ప్రపంచమంతా సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతోంది కాబట్టి మనం సహకరించాలి అనుకుంటూ సహకరించారు. కానీ సహనం గీత దాటడం మొదలుపెడితే చాలా అనర్థాలు ప్రారంభమౌతాయి. బతికుంటే బలుసాకు తినవచ్చు అని కెసియార్‌ చెప్పవచ్చు. ఆ బలుసాకు మీరిస్తారా అని ప్రజలు రాష్ట్రాన్ని అడుగుతున్నారు. రాష్ట్రాలు మా దగ్గరేముంది, కేంద్రం యివ్వాలి అంటున్నారు. కేంద్రం మా దగ్గరేముంది? మీరే యివ్వాలి అని ప్రజల్ని అడుగుతున్నారు.

అసలే నడుం విరిగి వుంది. జీతాల్లో కోత. ఉద్యోగం ఊడుతుందేమో తెలియదు, దుకాణం మూతపడుతుందేమో తెలియదు. జరిగిన నష్టం ఏనాటికి పూడుతుందో తెలియదు. పైగా విరాళాలు కూడానా? అనుకుంటే ఆశ్చర్యముందా? బతికుంటే.. అనే తెలుగు సామెతలా హిందీలో జాన్‌హై, జహాఁ హై అంటారు. ప్రాణం వుంటేనే లోకం వుందని అర్థం. మోదీ యిప్పుడు జాన్‌ భీ, జహాఁ భీ అంటున్నారు. బతుకూ బతకాలి, మనుగడా సాగాలి అని భావం. మనుగడ సాగాలంటే రిలాక్స్‌ చేయాలి. కాదు రిలాక్స్‌ చేయకుండా యిలాగే చేస్తాం అంటే కష్టం. ఎందుకంటే లాక్‌డౌన్‌లో అన్ని రకాల అన్ని స్థాయిల పౌరులు యిబ్బంది పడ్డారు. వాటి గురించి వచ్చే వ్యాసంలో.(సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
 mbsprasad@gmail.com