cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: లాక్ డౌన్ పొడిగింపు?

ఎమ్బీయస్‌: లాక్ డౌన్ పొడిగింపు?

లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా, పొడిగిస్తే ఎంతకాలం పొడిగిస్తారు, దేశమంతటా పొడిగిస్తారా, లేక కొన్ని డేంజర్‌ జోన్లకు పరిమితం చేస్తారా? కేంద్రం రాష్ట్రాలనే నిర్ణయించుకోమంటుందా? ఇలా అనేక ప్రశ్నలు. ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు.  ఏది చేసినా విమర్శించేవాళ్లు ఎలాగూ ఉంటారు. ఇలా కాదు, అలా చేసి వుండాల్సింది అంటారు. మామూలుగానే అంటూంటారు, యిలాటి అయోమయ పరిస్థితిలో మరీ అంటారు. ఎందుకంటే మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కారణంగా గందరగోళంలో పడ్డాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ అర్థం కావటం లేదు. ఏం చేస్తే మంచిదో కూడా తెలియటం లేదు.

మన దేశంలో ఏటేటా భారీ వర్షాలు వస్తాయి, రోడ్లు నాశనమవుతాయి. వరదలు వస్తాయి, ఇళ్లు కొట్టుకుపోతాయి. వేసవిలో తాగునీటి ఎద్దడి వస్తుంది. కరువు వస్తుంది. శీతాకాలం రాగానే అంటువ్యాధులు ప్రబలుతాయి. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోదు. సదరుకాలం రాగానే ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు అనే వార్త వస్తుందంతే. మూణ్నెళ్ల ముందే, ముందు సీజన్‌లోనే ప్రణాళికలు వేశారా, నిధులు విడుదల చేశారా, అలసత్వం వుంటే నిగ్గదీశారా - ఏమీ తెలియదు. చివరకు భారీ నష్టం కలుగుతుంది. ప్రజల అవస్థలు పడతారు. ప్రతీ ఏటా వచ్చే డిజాస్టర్‌ విషయంలోనే యిలా వుంటే అంతకుముందెన్నడూ చూడని యింత తీవ్రమైన డిజాస్టర్‌ విషయంలో ఎలా వుంటుందో ఊహించవచ్చు. మనకు ఏ సన్నద్ధతా లేదు.

ప్రజారోగ్యం గురించి మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చామో చివర్లో చెప్పుకుందాం కానీ, వైద్యరంగాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులను పరిపుష్టం చేయవసిన అవసరాన్ని మనం నిర్లక్ష్యం చేశామనేది ఒప్పేసుకుని ముందుకు సాగుదాం. మన పాలకులు తప్పులు చేశారు, పౌరులుగా వాళ్లని నిలదీయకుండా మనం తప్పులు చేశాం. దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన యీ తప్పిదాలన్నీ ఒక నెలలో, రెండు నెలలలో సవరించబడే విషయాలు కావు. అవన్నీ సవరించేదాకా లాక్‌డౌన్‌ ఉంచగలరా? ఉంచితే లాభం జరుగుతుందని గట్టిగా చెప్పగలమా?

ప్రపంచంలో సగం జనాభా లాక్‌డౌన్‌లోనే ఉంది, దాదాపు 100 దేశాలు పూర్తిగానో, పాక్షికంగానో లాక్‌డౌన్‌ విధించాయి, మనం మాత్రం ఎందుకు చేయకూడదు? అని వాదించడం సులభం. ఒక్కో దేశానిది ఒక్కో కథ. చైనా, దేశమంతా లాక్‌డౌన్‌ చేయకుండానే కంట్రోలు చేయగలిగింది. ఊహాన్‌ లాటి పారిశ్రామిక ప్రాంతంతో విదేశాలకే అంత రాకపోకలు ఉన్నపుడు దేశంలోని వివిధ ప్రాంతాలతో రాకపోకలు ఉండవా? అయినా చైనా షాంఘై, బీజింగ్‌ వంటి పట్టణాలను పూర్తిగా మూసేయలేదు.

ఇటలీలో, స్పెయిన్‌లో, అమెరికాలో ప్రజలు వ్యవహరించిన తీరులో మన ప్రజలు వ్యవహరించరు. అయినా వాళ్ల ఇమ్యూనిటీ లెవెల్స్‌ వేరు, మనవి వేరు. వాళ్ల దగ్గర రోజుకు వేలాదిమందికి పరీక్షలు చేసి ఎంతమందికి సోకిందో చెప్పగలుగుతున్నారు. మన దగ్గర పరీక్షలు జరగటం లేదు కాబట్టి మన అంకెలన్నీ ఊహాజనితమైనవే. అలాటప్పుడు వారిని మనం ఎందుకు అనుకరించాలి? మన ప్లానింగ్‌ మనకుండాలి. మన నగరాలు, మన పట్టణాలు, మన గ్రామాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారి వలన రోగం వ్యాపిస్తోందంటున్నారు. అటువంటి వారి తాకిడి దేశంలోని అన్ని గ్రామాలకు ఉందని చెప్పగలమా?

తాకిడి లేని గ్రామాలకు కూడా పక్క వూరి నుంచి వచ్చి అంటించవచ్చు అనవచ్చు. వాటి గురించి జాగ్రత్తలు చెప్పవచ్చు. రోగం సోకినంత మాత్రాన టపా కట్టేస్తారని ఏమీ లేదు. స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు రోగం సోకినవారిలో 5% మంది పోయినట్టున్నారు. దీనిలో అంతమంది ఉండరంటున్నారు. 65 ఏళ్ల లోపు వాళ్లకు వచ్చినా త్వరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి లేని వృద్ధులకు మాత్రమే ప్రమాదం ఎక్కువ. ఇప్పుడీ లాక్‌డౌన్‌ ద్వారా వారికి సరైన ఆహారం దొరక్కుండా, సరైన వ్యాయామం చేయనీయకుండా, వైద్యపరీక్షలు చేసుకోనీయకుండా, సహాయం చేసే పనివారు లేకుండా చేసి వారిని మృత్యువుకి మరింత చేరువ చేస్తున్నారు.

వృద్ధులనే కాదు, వ్యాధిగ్రస్తులందరికీ యీ లాక్‌డౌన్‌ చాలా నష్టం చేస్తోంది. అన్ని ఆసుపత్రుల ఔట్‌పేషంటు వార్డులు మూసేశారు. ఎమర్జన్సీ కేసులు చూస్తామంటున్నారు. ఏది ఎమర్జన్సీయో ముందే ఎలా తెలుస్తుంది? తల తిరుగుతోందని పరీక్ష చేయించుకోవడానికి వెళితే మెదడులో ట్యూమర్‌ ఉందని తేలుతుంది. కడుపులో గ్యాస్‌ ఎక్కువగా ఉందని వెళితే హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందంటున్నారు. శరీరంలో ఏ అవయవానికి ఆపరేషన్‌ చేయించుకున్నా, కొన్నాళ్ల పాటు రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోవాల్సిన వాళ్లుంటారు. కానీ రోడ్డు మీద పోలీసుల దృష్టిలో అవన్నీ ఎమర్జన్సీలు కావు. హార్ట్‌ ఎటాక్‌ వస్తేనే వాళ్లకు ఎమర్జన్సీ కింద లెక్క.

రెగ్యుర్‌ చెకప్‌ చేయించుకోకపోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. బయట వాకింగ్‌ చేయనీయటం లేదు. అనేక గేటెడ్‌ కమ్యూనిటీల్లో కూడా నడవనీయటం లేదు. వాకింగ్‌ లేకపోవడం వలన మలబద్ధకం పెరుగుతుంది, సుగర్‌ పెరుగుతుంది, కొలస్టరాల్‌ పెరుగుతుంది. గుండె పనితీరు దెబ్బ తింటుంది. వీటి వలన చచ్చినా ఫరవాలేదా? చూడబోతే కరోనా వలన కాకుండా తక్కిన వాటివలన పోయేట్లున్నాం.

ఇవన్నీ పట్టించుకోకుండా లాక్‌డౌన్‌ పెంచుతూ పోతే కరోనా అదుపులోకి వస్తుందా? ఎలా వస్తుంది? రేపు కొనసాగినా లేక ఎత్తేసినా కూడా పెరుగుతుంది. సహజం. ఎందుకంటే మనం యిప్పుడే టెస్టింగు మొదలుపెట్టాం. ఇన్నాళ్లూ కిట్సే లేవు. ఇప్పుడు పరీక్షలు చేస్తూంటే అసలైన అంకెలు బయటపడతాయి. అంకెలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. చివరకు ఇండియాలో కేసుల సంఖ్య లక్షకు చేరినా విస్తుపోవద్దు. ఎందుకంటే మనకు జనసాంద్రత ఎక్కువ. ఒకరితో మరొకరికి సంపర్కం ఎక్కువ. రోగం సోకాక చికిత్స చేసేందుకు మనకు సౌకర్యాలు లేవు, మందులు లేవు. తగినంతమంది డాక్టర్లు లేరు, వైద్యసిబ్బంది లేరు.

సరైన స్ట్రాటజీ ఏమీ వేయకుండా లాక్‌డౌన్‌ పెంచడమే సర్వరోగనివారిణి అనుకోవడం చాలా పొరబాటు. ఆ స్ట్రాటజీని అమలు చేయాల్సిన అన్ని రాష్ట్రాలతో కలిసి కూర్చుని రూపొందించాలి. విడివిడిగా సలహాలిమ్మంటే ఎలా? వాళ్లకు వాస్తవాలు చెప్పారా? వాళ్లకు తెలివిడి వుందా? పూర్వానుభవం ఉందా? కెసియార్‌, జగన్‌ పారాసిటమాల్‌తో పోతుందన్నారు, స్థానిక ఎన్నికలు ఆగనక్కర లేదన్నారు. ఇప్పుడు కెసియార్‌ జూన్‌3 వరకు లాక్‌డౌన్‌ పెంచాలంటున్నారు.  అనావృష్టి, అతివృష్టి.

అసలీ ముఖ్యమంత్రుందరికీ వైద్య, ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్‌ నిపుణులతో సమావేశం ఏర్పరచి, అప్పుడు సలహాలివ్వమనాలి. ఆ సలహాలైనా యిప్పుడు అడుగుతున్నారు. లాక్‌డౌన్‌ విధించేముందు ముఖ్యమంత్రులను సంప్రదించాలన్న ఆలోచనే రాలేదు మన మోదీ గారికి. ఆయనదంతా ఒక దేశం-ఒక నేత ఫిలాసఫీ. ఆయన చేస్తాడు, మనం ఔననాలి. నోట్ల రద్దు విషయంలో అయితే విషయం లీకవుతుందని ముందుగా ఎవరికీ చెప్పలేదన్నారు. దీని విషయంలో పరమ రహస్యం ఏముంది కనుక? ఎందుకు అడగలేదు? (సశేషం)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)  
mbsprasad@gmail.com