Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: రిపబ్లిక్ దినాన దిల్లీలో రచ్చ

ఎమ్బీయస్: రిపబ్లిక్ దినాన దిల్లీలో రచ్చ

భయపడినంతా జరిగింది. పెరేడ్ కంటె ట్రాక్టర్ ర్యాలీకే ఎక్కువ కవరేజి వచ్చింది. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రైతులు దిల్లీని అల్లకల్లోలం చేశారు. ఇలాటిది ఎంతోకొంత జరగడంలో ఆశ్చర్యం లేదు కానీ, ఎఱ్ఱకోట మీది దాడి మాత్రం అనూహ్యం. దేశపౌరులందరూ ఖండించవలసినదే. రైతు నాయకులు ముందే ఖండించేశారు. ఇది ప్రభుత్వం కుట్ర. దానికి నాయకత్వం వహించినవాడు మాతో ఎన్నడూ కలిసి సంప్రదింపులు చేసినవాడు కాదు, బిజెపి పార్టీకి పనిచేసినవాడే, మోదీతో కలిసి తీసుకున్న ఫోటో యిదిగో అంటున్నారు. 

విడిగా ఎవరేం చేసినా హింసాత్మక సంఘటనలకు కలక్టివ్‌గా రైతులదే బాధ్యత అని బిజెపి అంటుంది. కాదు, మేం శాంతంగానే వున్నాం, ప్రభుత్వమే అసాంఘిక శక్తులను ప్రవేశపెట్టి తమ ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చిందని రైతు నాయకులు ఆరోపించారు. నా చిన్నప్పణ్నుంచి ప్రతి ఉద్యమంలోనూ యిలాటివి వింటూనే వున్నాను. చివరకు ఏదీ నిర్ధారించరు. రైతులు రెచ్చగొట్టారని పోలీసులు అంటారు. అంగీకరించిన ప్రదేశం వరకు పోలీసులు వెళ్లనివ్వలేదు కాబట్టే, పేచీ వచ్చిందని రైతు నాయకులు అంటున్నారు. 

మహా అయితే దీనిపై ఓ కమిషన్ వేస్తారు. దాని నివేదిక మూడేళ్ల తర్వాత వస్తుంది. అది సెక్రటేరియట్‌లో ఓ మూల పడేస్తారు. ఈసారి కొత్త కోణమేమిటంటే యిదంతా ఐఎస్‌ఐ వాళ్లే చేయించారని, ఆందోళనకారులందరూ పాకిస్తాన్ నుంచి డబ్బు అందుకున్నవారేనని మోదీ భక్తులు అనేస్తారు. దిల్లీలో రైతులు యిలాటి ఆందోళనలు ఎన్నో చేశారని, అధికార పక్షం వాళ్లు వీటి వెనుక ప్రతిపక్షం వుందని ఆరోపించడం, ప్రభుత్వం చేతకానితనం వలననే యిలాటివి జరుగుతున్నాయని ప్రతిపక్షం అనడం దశాబ్దాలుగా నడుస్తోందని గుర్తు చేసుకోవచ్చు.

ఉదాహరణకి ప్రస్తుత ఆందోళనలో కూడా ముఖ్య భూమిక వహిస్తున్న భారత్ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు కీ.శే. మహేంద్ర సింగ్ తికాయత్ అనే యుపి రైతు నాయకుడు 1988లో దిల్లీ బోట్ క్లబ్‌ మైదానంలో మీటింగు జరుపుతామని ఒక్కరోజుకై అనుమతి తీసుకుని, 5 లక్షల మందిని వెంటేసుకుని వచ్చి మీటింగు అయిన తర్వాత తమ 35 కోర్కెలు (చెఱుకు ధర పెంచడం, విద్యుత్ చార్జీల మాఫీ... వగైరా) తీరిస్తే తప్ప మైదానం ఖాళీ చేయను పొమ్మన్నాడు. 

వారం రోజుల పాటు అక్కడే తిష్ట వేస్తే రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి, చచ్చినట్లు అన్నీ ఒప్పుకుంది. చెప్పవచ్చేదేమిటంటే యిలాటివి జరగడం అరుదు కాదు. అప్పుడూ వాళ్లు ట్రాక్టర్ల మీద వచ్చారు, వారం రోజులు మకాం వేశారు కానీ డబ్బులు పాకిస్తాన్ నుంచి వచ్చాయని ప్రభుత్వాలు అనేవి కావు. ప్రతిపక్షాలనే నిందించేవి. ఇప్పుడు బిజెపి సర్కారు వచ్చాక ప్రతీదానికీ ఐఎస్ఐ లింకు పెట్టడం (గతంలో ఇందిర సిఐఏ హస్తం అనేది) అంటోంది.

ఆందోళన చేయడానికి రైతులకు డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందని ఆశ్చర్యపడేవాళ్లు భారీ ర్యాలీలు నిర్వహించడానికి, ఎన్నికలలో విస్తారంగా ఖర్చు పెట్టడానికి, ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడానికి బిజెపికి డబ్బు ఎక్కణ్నుంచి వస్తోందో ఆశ్చర్యపడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అబ్బెబ్బే వాళ్లంతా దేశభక్తితోనే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు అంటే మాత్రం ఏకంగా మూర్ఛపోతాను. 

ఇన్నేళ్లూ కాంగ్రెసులో వుండగా లేని దేశభక్తి, బిజెపి అధికారంలోకి రాగానే ఎక్కణ్నుంచి అవతరించిందాని? బిజెపిలోకి వస్తే డబ్బు చేసుకోవచ్చనే ఆలోచన లేకపోతే వాళ్లు రానే రారు అనేది కామన్‌సెన్స్. ఏదీ అవినీతికి ఆధారాలెక్కడ? అంటే యివాళ తెలియకపోవచ్చు. చాలాసార్లు నేరం జరగగానే నేరస్తులెవరో తెలియదు. కొన్నాళ్ల పాటు అనుమానితులపై నిఘా వేసిన తర్వాతనే అసలు సంగతి బయటపడుతుంది.

ఇప్పుడు బిజెపి ఎలక్టొరల్ బాండ్స్ గురించి సమాచారం అడిగితే చెప్పదు. కార్పోరేట్ల నుంచి విరాళాలలో దాదాపు 80 శాతం బిజెపికే వెళుతున్నాయి అంటే వాళ్లు ఎందుకిస్తున్నారు? వాళ్లకు మేలు కలుగుతోందనే కదా! తమకు లాభం చేకూరే చట్టాలు ప్రభుత్వం ద్వారా చేయించుకోవచ్చనే కదా! అబ్బే బిజెపి సిద్ధాంతాలు నచ్చి.. అంటే మరి యుపిఏ హయాంలో వుండగా ఎందుకు యివ్వలేదు? అప్పుడూ యివే సిద్ధాంతాలుగా?

కరోనా పేరుతో పెట్టిన పిఎం-కేర్స్ ఫండ్‌కు ఎవరిచ్చారు, ఎంతిచ్చారు, ఎలా ఖర్చయింది అంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం చెప్పదు. సమాచార హక్కా? తొక్కా అంటుంది. ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది అనే వార్తలు రోజూ చదువుతాం. ఇప్పటికి ఎంత పట్టుబడింది, మీ దగ్గర ఎంత వుంది? అని సమాచార హక్కు చట్టం కింద హైదరాబాదు కస్టమ్స్‌ను అడిగితే చెప్పం అంది. సరైన సమయం వచ్చేదాకా యివేమీ బయటపడవు. అప్పటిదాకా ఎవరి ఊహలు వాళ్లవి.

ఇక రెండు నెలలపాటు ఆందోళన చేయడానికి రైతులకు డబ్బులు ఎవరిచ్చారన్నది ప్రశ్న. వాళ్లు ఆ క్యాంపుల్లో వున్న విధానం చూశారా? అవేమైనా లాడ్జిలా? రూమ్ హీటర్లున్నాయా? రోడ్డు పక్కన లంబాడీ వాళ్ల గుడారాల్లా వున్నాయి. అక్కడే రొట్టెలు కాల్చుకుని తినేశారు. పైగా అందరూ అక్కడే పనులు మానేసి కూర్చున్నారని ఎందుకనుకోవాలి? కుటుంబం నుంచి వంతుల వారీగా వచ్చిపోతున్నారేమో! ఎంత సింపుల్‌గా బతికినా ఎంతో కొంత ఖర్చు అవకతప్పదు. గత 20 ఏళ్లగా పంజాబ్, హరియాణాలలో వ్యవసాయం కిట్టుబాటుగా వుందని రాశాను కదా. 

అందువలన ఆ ఖర్చులు భరించే స్థితిలోనే వాళ్లుండవచ్చు. పైగా పంటల సమయంలో రైతు సంఘాలు కొంత విరాళాలు పోగు చేస్తాయి. అవి యిప్పుడు కిచెన్‌ల నిర్వహణ ఖర్చు భరిస్తూ వుండవచ్చు. లేదా అప్పులు చేస్తూ వుండవచ్చు. ఫ్యాక్టరీ కార్మికులు కూడా 30, 40 రోజులు సమ్మె చేయడం ఎన్నో సార్లు చూశాను. వాళ్లందరికీ ఐఎస్‌ఐ నుంచి నిధులు వచ్చాయనుకోవాలా? ఉపాధికి ముప్పు వచ్చినపుడు డబ్బుకి వెనకాడకుండా పోరాడతారు.

ఆందోళన చేసేవాళ్ల మీద నిందలు మోపే బదులు, అసలు ఆందోళన చేసే అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లకు భయాందోళనలు ఎందుకు కలిగాయి? అనేది శాంతంగా ఆలోచించడం మంచిది. ఎవరో పార్టీ వాళ్లు చెప్పారని నెలల తరబడి ఆందోళన చేసేటంత తెలివితక్కువ వాళ్లు కాదు రైతులు.

ఈ పార్టీలన్నీ ఒక్కలాటివే, అందరూ కలిసి తమను ముంచుతాయని సందేహిస్తూనే వుంటారు. రైతుల పరిస్థితి బాగాలేదని అందరికీ తెలుసు. దానికి పలుకారణాలున్నాయని గతవ్యాసంలోనే రాశాను. అందువలన ఏదైనా కొత్త చట్టం తెద్దామనుకుంటే వాళ్ల పరిస్థితి మెరుగుపడేందుకు తేవాలి. కానీ వీటి వలన తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అవుతుందని రైతుల భయం.

సమాచారలోపం వలననే రైతులకు ఆ భయం అంటారు మోదీ. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో బిజెపివారికి సాటి రాగలిగిన వారెవరైనా వున్నారా? పైగా గడపగడపకు వెళ్లి ప్రచారం చేయగల ఆరెస్సెస్ క్యాడర్ అండగా వుంది. దాదాపు అన్ని రాష్ట్రాలలో వాళ్ల ఎమ్మెల్యేలున్నారు.

పోలింగు బూతు స్థాయి వరకు వాలంటీర్లను పెట్టుకుని ఆసేతు హిమాచలం ఎన్నికలు గెలవగలుగుతున్న వారికి, ఒకరిద్దరు తప్ప యావత్తు మీడియా జీహుజూర్ అనే తరుణంలో, ఉపన్యాసకళలో అందె వేసిన చేయి అయిన మోదీ నాయకుడిగా వుండగా, గాంధీ, నెహ్రూల తండ్రి తాతల నుంచి అందర్నీ భ్రష్టులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించగల సోషల్ మీడియా సేన దన్నుగా వుండగా మూడు చట్టాల గురించి వారు వివరించలేక పోతున్నారంటే, సమర్థించుకోలేక పోతున్నారంటే ఆశ్చర్యంగా లేదూ!?

పాఠకులలో కొందరు రైతుల ప్రస్తుత పరిస్థితి బాగా లేదు కాబట్టి కొత్త బిల్లు తెస్తే తప్పేముంది? అని అడుగుతున్నారు. తప్పకుండా తేవాలి. వాటివలన మేలు కలుగుతుందా లేదాని ఒకటికి పదిసార్లు ఆలోచించి, సంప్రదించి మరీ చేయాలి. దశల వారీగా, ప్రాంతాల వారీగా చేసుకుంటూ, అనుకున్న ప్రకారం జరగకపోతే సవరించుకుంటూ, అప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తూ చట్టం చేయాలి.

ఏదైనా ఆచరణలోకి వచ్చేసరికే అసలు లోపాలు బయటపడతాయి. స్విస్ బ్యాంకుల్లోంచి బ్లాక్ మనీ రప్పిస్తామన్నారు. వచ్చిందా? నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ ఖతం అన్నారు. అయిందా? స్వచ్ఛభారత్ పెట్టి సెస్ వసూలు చేసినపుడు దేశమంతా తళతళ లాడుతుందన్నారు. ఆడిందా?

మేక్ ఇన్ ఇండియా పెట్టినపుడు ఉద్యోగాలే ఉద్యోగాలన్నారు. వచ్చాయా? పాకేజీ ప్రకటించినపుడు ఉత్పత్తి రంగం ఉరకలు వేస్తుందన్నారు, వేసిందా? జిఎస్‌టి పెట్టినపుడు 1947 ఆగస్టు పదిహేనంత హంగామా చేశారు. ఆ వ్యవస్థ యిప్పటిదాకా చక్కబడలేదు. 370 ఎత్తేసినపుడు కశ్మీర్ మన చేతికి పూర్తిగా వచ్చేసిందన్నారు. వచ్చిందా? వస్తే సైన్యం ఎందుకుంది అక్కడ? ఇలాటి కబుర్లు వినివిని, యిప్పుడీ సాగు చట్టాల గతి ఏమవుతుందోనని సందేహించినా మోదీ భక్తులు తిట్టేస్తున్నారు.

లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా వుండగా రైల్వే అద్భుతంగా లాభాలు గడించేసింది అంటూ డప్పు కొట్టారు. లాలూ ఐఐఎమ్‌కు వెళ్లి లెక్చరు కూడా యిచ్చి వచ్చాడు. తర్వాత బయటపడింది బండారం. ఇప్పుడీ  మూడు చట్టాలేమిటో తెలుసుకుంటే రైతుల భయాలు, నిపుణుల సందేహాలు ఏమిటో మనకు అర్థమౌతుందేమో!

చట్టాల్లో మొదటిది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు ఇప్పటివరకు రైతులు తమ పంటలను రాష్ట్రాల నిర్వహణలో వున్న ఎపిఎంసి (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ)లకు - యికపై మండీలు అందాం - అమ్మేవారు. ఇకపై అలా అమ్మనవసరం లేదు. వాటిని బైపాస్ చేసి, విడిగా వేరే జిల్లాలో లేదా, వేరే రాష్ట్రంలో కూడా అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. దానికి గాను ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తారు. మండీలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పంటలపై ఎలాటి ఫీజులు, సెస్‌లు, విధించడానికి లేదు.

ఇప్పటిదాకా మండీలపై రాష్ట్రాలు ఆదాయం గడిస్తున్నాయి. పంజాబ్‌లో యిది 8.5 శాతం వుంది. కొన్ని రాష్ట్రాలలో 1 శాతం వుంది. అలా వచ్చినదాన్ని వ్యవసాయాభివృద్ధికే వెచ్చించాలని అసలు ఉద్దేశం. కానీ దాన్ని యితర ఖర్చులకు ఉపయోగించేస్తున్నాయి రాష్ట్రాలు.

ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. కేంద్రం కలగజేసుకుని తమ ఆదాయానికి గండి కొడుతోందని వాటి బాధ. అధికంగా నష్టపోయే పంజాబ్ ప్రభుత్వం ముందుగా అభ్యంతరం తెలిపింది. చాలా రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం వుండడం, తక్కిన వాటిలో బిజెపితో మొహమాటం వున్న ప్రభుత్వాలు వుండడంతో చాలామంది కిమ్మనటం లేదు. కొంతకాలం కిం? అన్న కెసియార్ రాజకీయ కారణాలతో ఎలా పిల్లిమొగ్గ వేశారో చూశాం.

ఇక చట్టం వలన లాభపడేది రైతులా, కార్పోరేట్లా అనే దానికి చిన్న లిట్మస్ టెస్ట్. కుదేలై పోయిన కార్పోరేట్ రంగానికి ఉద్దీపన అందించడానికి 2020 మేలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిలో ఏం చెప్పింది? అగ్రికల్చరల్ మార్కెట్లలో, ఆగ్రిబిజినెస్‌లలో మిమ్మల్ని అనుమతిస్తాం అని చెప్పింది. అంటే దాని అర్థమేమిటి? మీరు బాగుపడాలంటే ఆ వ్యాపారంలోకి వెళ్లడం అత్యవసరం. అందువలన అనుమతిస్తున్నాం, వెళ్లి డబ్బు చేసుకుని బాగుపడి ఉద్యోగాలు కల్పించండి అనే కదా! జూన్‌లో ఆర్డినెన్సు ద్వారా, యిప్పుడీ చట్టం ద్వారా ఆ హామీ తీర్చింది. ఇది కార్పోరేట్లను నిలబెట్టడానికే తప్ప రైతులకు మేలు చేకూర్చడానికి కాదని అక్కడే తెలిసిపోయింది కదా!

కార్పోరేట్లు యీ వ్యాపారంలోకి నిరభ్యంతరంగా రావచ్చు. గతంలో ఎన్నో కార్పోరేట్లు అగ్రిబిజినెస్‌లో వచ్చాయి కూడా. కొంత మంచీ, కొంత చెడూ జరిగింది. ఈసారి పెద్ద ఎత్తున రప్పిద్దామంటే, వాళ్లను మండీలతోనే ఒప్పందాలు పెట్టుకోమంటే పోయె. కార్పోరేట్లు ఏమైనా దగా చేస్తే ఢీ కొనగల సత్తా వీళ్లకు వుంటుంది.

అమూల్ లాటి బలమైన కోఆపరేటివ్ సంస్థతో ఎవరూ ఆటలాడలేరుగా! నిజానికి సహకార వ్యవస్థ అద్భుతమైన సిద్ధాంతం. ‘పదిమంది కోసం ఒక్కడు, ఒక్కడి కోసం పదిమంది’ అనే సూత్రంపై ఏర్పడిన సంస్థలను క్రమపద్ధతిలో కూల్చేశారు. ఇప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో అది బాగానే పనిచేస్తోంది. మన తెలుగు రాష్ట్రాల వంటి రాష్ట్రాలలో రాజకీయనాయకులు ప్రవేశించి భ్రష్టు పట్టించారు. మార్క్‌ఫెడ్ కూడా మంచి ఆలోచనే. రాష్ట్రప్రభుత్వాలు వాటిని పాడు చేశాయి.

అలాగే మండీల నిర్వహణ కూడా. ఒక్కోచోట ఒక్కోలా ఉంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు బిజెపి చేతిలోనే వున్నాయి. మండీలలో లోపాలుంటే సవరించడం వారి చేతిలో పని. అది చేయకుండా ఆ వ్యవస్థను బలహీనపరచి ప్రత్యామ్నాయం కోసం వెతకడం దేనికి? ప్రత్యామ్నాయం వుంటే తప్పేముంది అనవచ్చు. థియరీ ప్రకారం వినడానికి బాగానే వుంటుంది కానీ ఆచరణలో ఏం జరుగుతోందో చూడండి.

టెలికాం రంగంలో ఏమైంది? ‘ప్రజలారా, మీరు ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క మొబైల్ వాడవచ్చు, ప్రయివేటు రంగంలోని మొబైళ్లూ వాడవచ్చు. మేం మాత్రం బిఎస్‌ఎన్ఎల్‌కు 4జి యివ్వం. తక్కినవాటికి యిస్తాం. ఆ తర్వాత అంతా మీ యిష్టం.’ అంది ప్రభుత్వం. సహజంగానే బిజినెస్సంతా ప్రయివేటు వాళ్లకు, ముఖ్యంగా ముకేశ్ అంబానీ జియోకు పోయి, బిఎస్‌ఎన్‌ఎల్ మూతపడుతోంది.

కార్పోరేట్లతో వ్యవహారం ఎలా వుంటుందో వారితో వ్యవహరించిన వాళ్లకు తెలుస్తుంది. సినిమా రంగంలో అనేకమంది ప్రయోగాలు చేసి దణ్ణం పెట్టారు. వాళ్లు అగ్రిమెంటులో బాగా యిరికిస్తారు. పేరు గొప్ప తప్ప డబ్బు విదల్చరు. అందుకే యిప్పటికీ సినిమా రంగంలో ప్రయివేటు ఆపరేటర్లే ఎక్కువ. హెచ్చు వడ్డీలకు డబ్బు తెచ్చి అవస్థలు పడతారు కానీ కార్పోరేట్లకు దూరంగానే వుంటారు. ఇలాటి వాళ్లతో బక్క రైతు ఎలా వేగగలడు? మాకు 5 ఎకరాల మాగాణి పొలం వుండేది. వరి పండేది. పండాక ధాన్యం సంచీలో పోసుకుని సైకిల్ మీద రైసు మిల్లర్ల దగ్గరకు తిరిగేవాణ్ని. వాళ్లు వడ్లు అరచేతిలో పోసుకుని నలిపినలిపి ముక్కూమూతీ విరిచేవారు. 

నేను చేతులు నలుపుకుంటూ ఎంత రేటు చెప్తారా అని చూసేవాణ్ని. నాకే కనక దాన్ని ఓ రెండు నెలలు దాచుకునే సౌకర్యం కల్పించి వుంటే అతని దోపిడీకి గురయ్యేవాణ్ని కాను. ఈ బాధలు పడలేక పొలం అమ్మేశాం. ఒక సాధారణ మిల్లరే నన్ను ఆడించగలిగితే కార్పోరేట్ ఏ మేరకు సాధారణ రైతులను ఆడించగలడో ఊహించండి. వాళ్లు సంఘటితమై సొసైటీగా ఏర్పడితే తప్ప, వాళ్లను తట్టుకోలేరు.

ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రయివేటు పరం చేయడం జరుగుతోంది. నష్టాల్లో వున్న ఎయిర్ ఇండియాను అమ్ముతామంటారు, లాభాల్లో వున్న ఎల్‌ఐసిని అమ్ముతామంటారు. లాజిక్ ఏమిటో మనకు అర్థం కాదు. ఇప్పటిదాకా ప్రభుత్వం చేతిలో వున్న వ్యవసాయరంగాన్ని విడుదల చేసి స్వేచ్ఛావిపణిలో వదులుతున్నారని, దానితో అది ఎక్కడికో ఎత్తులకు ఎగిరిపోతుందని అనుకోనక్కరలేదు. రైతులు ప్రభుత్వాధీనంలో పని చేయటం లేదు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులలో అదనంగా వున్నవాటిల్లో 80 శాతం ప్రయివేటు సెక్టార్‌లోని పెద్ద వ్యక్తులే ఆపరేట్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 7 వేల మండీలే ఉన్నాయట. బిహార్, కేరళ, మణిపూర్‌లలో మండీలే లేవుట.

ఇలా దేశమంతా పరిస్థితి నానా రకాలుగా వుంది. రైతుల స్థితిగతులు బాగు చేయాలంటే అనేక మార్గాలున్నాయి. అవేమీ చేయకుండా యిదే సంజీవని అని కేంద్రం చెపుతున్న మాటలు రైతులు నమ్మటం లేదు. కనీస మద్దతు ధర గురించి పట్టుబడుతున్నారు. దాని విషయమేమిటి? దాన్ని నిర్ణయించే ప్రక్రియలో జరుగుతున్న లోపాలేమిటి? కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏ మేరకు సాధ్యం? హోర్డింగ్ (అపరిమితంగా నిలువ చేయడం)కు వీలు కల్పించే వివాదాస్పదమైన మూడో చట్టమేమిటి? వీటిపై వచ్చే వ్యాసాల్లో మాట్లాడుకుందాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?