cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: అమరావతి గతి ఏమిటి?

ఎమ్బీయస్: అమరావతి గతి ఏమిటి?

2019 ఎన్నికల ఫలితాలు రాగానే ‘‘అమరావతి ఏమౌతుంది?’’ అని వ్యాసం రాస్తూ, పరిస్థితి చాలా అయోమయంగా వుందన్నాను. 15 నెలలైంది. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇంకో 15 నెలల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోయినా ఆశ్చర్య పడనక్కరలేదు. ఆనాటి నా వ్యాసంలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని, అసెంబ్లీ, సెక్రటేరియట్ అమరావతిలోనే కొనసాగిస్తూ ప్రభుత్వశాఖలన్నిటినీ రాష్ట్రమంతా పంచేయాలనీ సూచించాను. లేకపోతే హైదరాబాదు సిండ్రోమ్ కారణంగా అన్నీ ఒక్కచోటే పెట్టి, మళ్లీ యింకో విభజన కోరే పరిస్థితి వస్తుందని వాదించాను. భూములిచ్చిన రైతుల సమస్య చిక్కుపడిపోయిన దారంలా వుందని, దాన్ని ఎలా విప్పుతారో వేచి చూడాలని అన్నాను.

15 నెలల తర్వాత - ఆ దారపుచిక్కు అలానే వుంది. హైకోర్టు కర్నూలుకి మారుస్తాననడంతో ఆగకుండా, వైసిపి సెక్రటేరియట్‌ను వైజాగ్‌కు మారుస్తానంది. రాజధాని మార్పు అని అనకుండా దీనికి ‘మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ’ అంటూ ఏవేవో ముసుగులు తొడిగింది. దాంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టినవారందరూ భగ్గుమన్నారు. మూడేళ్ల క్రితమే వాళ్లకు అర్థమైపోయింది – తామనుకున్న స్థాయిలో బాబు అమరావతి కట్టలేడనీ, అందువలన రిటర్న్స్‌ పెద్దగా రావనీ. కానీ జగన్ పదవిలోకి రావడం అసంభవం కాబట్టి, ఎప్పటికో అప్పటికి పెట్టుబడి వెనక్కి వస్తుందని అనుకున్నారు. కానీ వారు పీడకలలో సైతం ఊహించినది జరిగి జగన్ అధికారంలోకి వచ్చేసి, అమరావతి అంత్యక్రియల కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాడు.

జర్నలిస్టులకు, కళాకారులకు మాత్రమేనా యిళ్ల స్థలాలు కేటాయించేది, పేదలకు యివ్వకూడదా? అంటూ రాజధాని ప్రాంతంలో స్థలాలిచ్చాడు. తమ స్థలం పక్కన కార్పోరేట్ కాంప్లెక్సు వెలుస్తుందనుకుంటే కార్మిక, కర్షకవాడలు మొలిస్తే ఎలా అని పెట్టుబడిదారులు గుండెలు బాదుకున్నారు. అంతేకాకుండా, యిక్కడ అవతరిస్తాయనుకున్న సంస్థలేవీ కనుచూపు మేరలో కానరాకుండా పోయాయి. దాంతో యిన్వెస్టర్లంతా యీ ఘోరకలిని ఆపండని టిడిపి వెంటపడ్డారు. 

నిజానికి అమరావతిలో పెట్టుబడి పెట్టినవారందరూ టిడిపి సమర్థకులూ కారు, చంద్రబాబు కులస్తులూ కారు. బాబు హైదరాబాదులో హైటెక్ సిటీ కడతానన్నపుడు కానుకోలేక పెట్టుబడులు పెట్టకుండా తాత్సారం చేశాం, ఇప్పుడైనా సరైన సమయంలో రైలెక్కుదాం అనుకుని చిన్నా, పెద్దా కలల బేహారులందరూ స్థలాలు కొనేశారు. వారిలో అన్ని ప్రాంతాలవారూ, అన్ని కులాలవారూ ఉన్నారు. రాజకీయంగా టిడిపి అంటే పడనివారు సైతం, డబ్బొస్తే చేదా? అనుకుంటూ విత్తనాలు నాటారు.

స్టాక్ ఎక్స్‌ఛేంజిలో షేర్ల లావాదేవీలు యిలాగే వుంటాయి. బుల్స్ గంటగంటకూ రేటు పెంచేస్తూ మధ్యతరగతివాళ్లు కూడా బుట్టలో పడేవరకూ పెంచి, ఆ తర్వాత రేటు పడగొట్టేస్తారు. హెచ్చురేటులో కొన్న మధ్యతరగతివాళ్లు ఉసూరుమంటూ మళ్లీ రేటు ఎప్పటికైనా పెరుగుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటారు తప్ప ఆ బుల్స్‌పై పగబట్టరు. షేరు రేటు పెరగాలని ఉద్యమాలు చేయరు. కోర్టుకి వెళ్లరు. ఎందుకంటే అది ఒక వ్యాపారపరమైన నిర్ణయం. లాభనష్టాల్లో ఏదైనా రావచ్చని తెలిసే గోదాలోకి దిగుతారు.

అమరావతి విషయంలో రైతుల సమస్య లేకపోతే ఉద్యమం చేయడానికి అంశమేముండేది చెప్పండి. ప్రభుత్వభూముల్లోనే రాజధానికి శంకుస్థాపన చేసి, తర్వాతి ప్రభుత్వం (పోనీ అదే పార్టీకి చెందినదనుకోండి, ఆ ముఖ్యమంత్రికి వేరే ఊళ్లో భూములుండడం చేత రాజధాని మారుద్దామనుకుని) ‘ఇక్కడ కడితే ఖర్చు ఎక్కువౌతుందట, వేరే చోట కడతాం’ అని వుంటే ‘అలా ఎలా చేస్తావ్? రాజధాని వస్తుంది కదా, రేట్లు పెరుగుతాయని పక్కన భూమి కొన్నాను, మీరిప్పుడు మార్చేస్తే ఎలా?’ అని కొనుగోలుదారుడు కోర్టుకి వెళ్లగలరడా?

మామూలు పరిస్థితుల్లో అయితే రాజకీయపార్టీలకి యీ విషయంలో పెద్ద ఆసక్తి వుండవలసిన అవసరం లేదు. రాజధాని ఎక్కడ పెడితే, ఎక్కడకు మారిస్తే ఏం చేయగలుగుతాం? అనుకుని వూరుకునేవారు. టిడిపి హయాంలో అమరావతిని నిర్ణయించినపుడు వైసిపి అలాగే అనుకుని ఊరుకుంది. బాబు ప్రభుత్వభూముల్లోనే కట్టేసి వుంటే భూసమీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశం కూడా వైసిపికి వుండేది కాదు. ఇప్పుడు టిడిపి కూడా అమరావతి కాకపోతే మరోచోట కట్టుకోనీ అని వూరుకోవచ్చు. రాష్ట్రమంతా వాళ్ల పార్టీ నాయకులున్నపుడు వారికి రాష్ట్రమంతా భూములు వుంటాయి. వైజాగ్‌లోనూ, కర్నూలు లోనూ బాబు అనుయాయులకు భూములు లేవా? అక్కడి భూముల రేట్లు పెరుగుతాయిలే అనుకుని ఊరుకోవచ్చు.

కానీ బాబు ఊరుకోలేకపోతున్నారు. ‘పాపం ఆయన అక్కడ అద్భుతనగరం కడదామనుకున్నారు, అది ఆవిర్భవించటం లేదని ఫీలవుతున్నారు’ అని ఎవరైనా కారణం చెపితే నమ్మడం కష్టం. ఎందుకంటే అది కట్టి, ఆయన పేరు తెచ్చుకుందామనుకున్నాడు కానీ వేరేవాళ్లు కడితే ఆయన కేమి ఘనత? తండ్రి కట్టిన యింటి డిజైన్ కొడుక్కి నచ్చదు. అలాటప్పుడు రాజకీయ ప్రత్యర్థి వేసిన డిజైన్‌ను మార్చకుండా వుంటారా? ఇది బాబుకి తెలియదా? అందువలన నగరనిర్మాణం గురించి కాదు ఆయన వర్రీ. పెట్టుబడుల గురించే! టిడిపి వారిలో చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టారు. టిడిపివారు కాకపోయినా పెట్టుబడి పెట్టినవారిని ఆదుకుంటే వారందరూ యిప్పుడు తన సమర్థకులుగా మారవచ్చు. ఇదే బాబు ముందున్న వ్యూహం.

రాజధాని తరలింపు అడ్డగించడానికి కోర్టు మార్గం ఒక్కటే మిగిలింది. దానిలో ఆయన సాధించవచ్చు. తరలింపు ఆపుతారు కానీ పెట్టుబడిదారుల ఆశలు ఫలించేట్లు అద్భుతనగరం కట్టించలేరు కదా. కట్టించాలంటే తను అధికారంలోకి రావాలి, అదీ 2024 నాటికే. నాలుగేళ్లు మాత్రమే వ్యవధి వుంది. పదవిలోకి రావాలంటే తక్కిన చోట్ల నుంచి పార్టీకి మద్దతు రావాలి. కానీ వచ్చేట్లుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే టిడిపి అమరావతి రొంపిలో పీకలదాకా మునిగిపోవడంతో, ఇది తప్ప వేరే సమస్య లేదనట్లు ప్రవర్తించడంతో తక్కిన ప్రాంతాల టిడిపి నాయకులు కలిసి రావటం లేదు.

ఎందుకంటే అమరావతి ప్లాను లోంచి వీసం కూడా ఎందుకు తగ్గకూడదో వాళ్లు స్థానిక ప్రజలకు నచ్చచెప్పలేరు. మీడియాలో ఏం చెప్తున్నారు? ‘అమరావతి రైతులు తమ కూతుళ్లకు భారీ కట్నాలిచ్చి పెళ్లి చేద్దామని, రాజధానికై భూములిచ్చారు. ఇప్పుడు అద్భుతనగరం కట్టకపోవడంతో, అభివృద్ధి జరగదని వాళ్లు నిరాశలో మునిగి ఆత్మహత్యకు సిద్ధమవుతున్నారు’ అని. ఇప్పుడు వైసిపి అభివృద్ధిని నలుచెరగులా పంచేస్తామనడంతో తక్కిన ప్రాంతాల వాళ్లూ తమ కూతుళ్లకు ఖరీదైన అల్లుళ్లు కొనుక్కునే అవకాశం వస్తుందనుకుంటున్నారు. ‘అబ్బే లేదు, అమరావతి వాసులకు తప్ప, తక్కినవాళ్లకు అలాటి కలలు కనే హక్కు లేదు’ అని ఉత్తరాంధ్ర, రాయలసీమ టిడిపి నాయకులు తమ ప్రాంతాల వారికి ఎలా నచ్చచెప్పగలరు?

బాబు, లోకేశ్ అయితే హైదరాబాదు వదలరు, కదలరు కాబట్టి సామాన్య కార్యకర్తలను ఎదుర్కునే యిబ్బంది వారికి లేదు. తక్కినవారికి జనాల మధ్య తిరగక తప్పదు కదా. అందుకే వారు కిమ్మనకుండా వున్నారు. బాబు, ఆంధ్రజ్యోతి ‘అమరావతి రైతుల మనుగడ ప్రమాదంలో పడింది. వారి కోసం ఎవరూ ఉద్యమించరేం?’ అని తక్కిన జిల్లాల వారిని నిలదీస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఎవరికి పట్టిందండి? తక్కిన చోట్ల ఏమీ పెట్టకుండా పెట్టకుండా అన్నీ తమ వద్దే పెడతామని బాబు నిర్ణయించినప్పుడు అమరావతి వాసులు తక్కిన ప్రాంతాల వారి గురించి ఆలోచించారా? ‘అబ్బే మా దగ్గర యిప్పటికే బోల్డు ఆసుపత్రులున్నాయి కదా, ఆ ఎయిమ్స్ లాటిది ఏ అనంతపురంలోనో పెట్టండి పాపం’ అన్నారా? ఇప్పుడు వాళ్ల కోసం వేరేవాళ్లు ఎందుకు ఆలోచిస్తారు? అందుకే చూసీచూడనట్లు ఊరుకున్నారు.

ఇక అమరావతి ప్రాంతం వారి గురించి ఆలోచిస్తే – కృష్ణ, గుంటూరు రెండు జిల్లాలలో కూడా ఆందోళన పడేవారెవరు? ఆస్తులున్నవారే. సామాన్యుడికి రాజధాని సరదా లేదు. అది వస్తే జీవనవ్యయానికి రెక్కలు వస్తాయని భయం. ప్రస్తుతం వైజాగ్‌లో అదే ఫీలింగు. నిజంగా రాజధాని అంటూ వస్తే ఆ పేరు చెప్పి, సెలూన్ చార్జిల దగ్గర్నుంచి పెరిగిపోతాయని. అందువలన వైజాగ్ మధ్యతరగతి వాళ్లు ‘ఎందుకొచ్చిన రాజధాని బాబూ’ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కృష్ణ, గుంటూరు జిల్లాలలో తొలి నుంచీ స్థిరాస్తులు వున్నవాళ్లకి పెద్దగా చింత లేదు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు రాష్ట్రం నడిబొడ్డులో వున్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి నేచురల్ గ్రోత్ ఎలాగూ వుంటుంది. రాజధాని పెట్టినా పెట్టకపోయినా స్థలాల ధరలు క్రమేపీ పెరుగుతాయి.  

బాధంతా ఎవరిదంటే, మధ్యలో హెచ్చురేట్లు పెట్టి భూములు కొన్నవారిదే! వాళ్లు ఏవేవో లెక్కలు వేసి కొనేశారు, తీరా చూస్తే రేట్లు పడిపోయాయి. మళ్లీ పెరిగే అవకాశం కనబడటం లేదు. అందుకని తీరని దుఃఖం. అయితే వారి సంఖ్య వేలల్లోనే వుంటుంది. కోట్లలో వున్న ప్రజలను ప్రభావితం చేయగల స్థాయిలో వాళ్లు లేరు. ఈ పరిస్థితుల్లో బాబు అమరావతి కోసం తన పార్టీ మొత్తాన్ని పణంగా పెట్టారు. నానా తంటాలు పడుతున్నారు. కేంద్రం చక్రం అడ్డు వేస్తుందనుకుంటే వేయలేదు. ఇక కోర్టులనే నమ్ముకున్నారు. కోర్టుల తీరు చూస్తే జగన్‌ను ముందుకు సాగనీయకుండా చేయగలవనిపిస్తుంది. సాగనీయదు కానీ ‘అద్భుతనగరం కట్టి తీరు, లేకపోతే మేం ఊర్కోం’ అని ప్రభుత్వాన్ని దండించగలదా అన్నదే సమస్య.

చంద్రబాబు ఎక్కడా లేని విధంగా భూసమీకరణ అంటూ కొత్త ప్రయోగం చేయడంతో వచ్చింది రైతు సమస్య అనే తంటా. భూధంధా చేసిన పెట్టుబడిదారులకు అందివచ్చిన పెద్ద ఆయుధమై కూర్చుంది. అయితే యీ ఆయుధాన్ని ఎలా వాడాలో వాళ్లకీ తెలియటం లేదు. బాబు నేతృత్వంలో సుప్రీం కోర్టులో  రకరకాల ట్రిక్కులు వేస్తున్నారు. జడ్జిల చేత ‘నాట్ బిఫోర్ మీ’ అనిపిస్తున్నారు. 

సరే, యిలాగే కొంతకాలం లాగించినా ఎప్పటికో అప్పటికి వాదనలు జరగాలి కదా. కోర్టువారు ‘రాజధాని తరలించడానికి వీల్లేదు’ అన్నారనుకోండి, ప్రభుత్వం ఏమంటుంది? ‘అబ్బే ఎక్కడ తరలించాం? లెజిస్లేటివ్ రాజధాని యిదేగా’ అంటుంది. ‘హైకోర్టు, రాజధాని ఒక్కచోటే వుండాలి’ అని హుంకరించిందనుకోండి, ప్రభుత్వం ‘అనేక రాష్ట్రాలలో లేదు కదా, అది యిక్కడ వర్తించదా?’ అనవచ్చు. ‘మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏమిటి, నాన్సెన్స్’ అంటే ఉత్తరాఖండ్ ఉదాహరణ చూపవచ్చు. ‘అసలు రాజధాని ఎక్కడ పెట్టాలో అంతా మీ యిష్టమేనా’ అంటే, ‘ఆ విషయం గత ప్రభుత్వమే తేల్చింది కదా, కేంద్రం ఊసు లేకుండా తనదే పెత్తనం అంది కదా’ అనవచ్చు

ఒకవేళ కోర్టు మొండిగా, బండగా, తక్కిన చోట ఏదీ పెట్టకుండా అన్నీ యిక్కడే పెట్టి తీరాలి అందనుకోండి, చాలా వింతగా వుంటుంది. అందరూ కనుబొమ్మలు ఎగరేస్తారు. ప్రభుత్వం సరేనండి అని బయటకు వచ్చేసి, రాజధాని కట్టడం మానేయవచ్చు, ఉన్నదేదో వుంది, ముక్కుతూ మూలుగుతూ వుండనీ అనుకోవచ్చు. అప్పుడు కోర్టు కెళ్లినవాళ్లకు ఏం లాభం?  వాళ్లు మళ్లీ తలుపు తడతారు. బ్రహ్మాండంగా, కళ్లు చెదిరేలా, మా పెట్టుబడికి రెట్టింపు రిటర్న్స్ వచ్చేలా కట్టమనండి అని అడగాలి. అడగగలరా? అడిగినా కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరితే ‘మా దగ్గర లక్షల కోట్ల డబ్బుంటే కడుదుం. లేదు కదా’ అనేసి కూర్చోవచ్చు. కట్టాలంటే కష్టం కానీ, మానాలంటే ఏమంత పని!

‘అబ్బే చేతిలోంచి డబ్బు పెట్టనక్కరలేదు, రైతుల నుంచి సేకరించిన భూమిని అమ్మేస్తే లక్ష కోట్లు వచ్చేస్తాయి. దానితో కట్టేయవచ్చు’ అని కోర్టుకి వెళ్లినవాళ్లు సూచిస్తారు. నిజానికి యిలాటి వాదన అనేకసార్లు వినిపిస్తుంది. హర్షద్ మెహతా కేసులో, విజయ్ మాల్యా కేసులో వాళ్లు యిదే చెప్తారు. ‘మా కంపెనీ షేర్లు మార్కెట్‌లో అమ్మేస్తే చాలు, బాంకు ఋణాలన్నీ వాటంతట అవే చెల్లిపోతాయి’ అని. ఒకసారి కంపెనీ నిజపరిస్థితి బయటకు వచ్చాక ఆ షేరు మార్కెట్ వేల్యూ దారుణంగా పడిపోతుంది. ఎవడూ కొనడు. వచ్చిన డబ్బు ఏ మూలకూ చాలదు.

అలాగే అమరావతిలో అద్భుతనగరం వెలవడం దాదాపు అసాధ్యం అన్న భావం నెలకొన్నాక యిక హెచ్చు రేటు పెట్టి కొనేవాడెవడు? జగన్ అధికారంలోకి వచ్చాక అని కాదు, బాబు వుండగానే గత మూడేళ్లగా యిదే సందేహంతో రేటు పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం యీ వాదన వినిపించి, మచ్చుకు ఓ వంద ఎకరాలు వేలం వేసి చూపించి, కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు, స్థలాలు అమ్మినా రాదు అని మొండికేస్తే కోర్టేం చేస్తుంది?

ఎలా చూసినా, అమరావతిలో మహానిర్మాణాలు రావడం కష్టమనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసిపి ఓడిపోయి, టిడిపి అధికారంలోకి వచ్చినా అమరావతి వెలుస్తుందన్న గ్యారంటీ లేదు. కరోనా రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని పూర్తిగా దెబ్బ కొట్టేసింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. కేంద్రం జిఎస్‌టి బకాయిలకే పంగనామం పెడుతోంది. ఇక రాష్టంలో డబ్బంతా సంక్షేమ పథకాలకే పోతోంది. జనాలు యివి బాగా మరిగారు. రేపు టిడిపి అధికారంలోకి వచ్చినా వీటిని ఆపడానికి భయపడుతుంది. పేరు మార్చి కంటిన్యూ చేయాల్సిందే.

వీటన్నిటికీ పోగా యిక ఖజానాలో మిగిలేదేముంది? గతంలోలా రాజధాని పేర బాండ్లు అమ్ముదామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఆ గుడ్‌విల్ ఒక్కసారికే పనికి వచ్చింది. అందువలన అమరావతి అద్భుతనగరంగా వెలవడం దాదాపు అసాధ్యం. అలా అని పాడుపెట్టడమూ అసాధ్యం.

ఈ వాస్తవాన్ని టిడిపి, వైసిపి రెండూ గుర్తించాలి. వైసిపి సెక్రటేరియట్‌ను వైజాగ్‌కు తరలించే యత్నం మానుకోవాలి, వైజాగ్ యిప్పటికే పెద్ద నగరం కాబోతోంది. ఐటీ, ఫార్మా ఎక్విప్‌మెంట్, అంతర్జాతీయ విమానాశ్రయం వగైరాలు వస్తాయంటున్నారు. అక్కడే అన్నీ పెట్టి మరో హైదరాబాదు చేయనక్కరలేదు. 

హైకోర్టును కర్నూలుకు తరలించి, తక్కినవి అమరావతిలో కంటిన్యూ చేయవచ్చు. రాజధానిని చిన్నగానే కట్టవచ్చు. డిపార్టుమెంట్లు రాష్ట్రమంతా వెదజల్లవచ్చు. దానిలో యిప్పటికే చాలా భాగం కట్టిన భవనాలను పూర్తి చేసి, కార్పోరేట్లకు విక్రయిస్తారని ఓ వార్త వచ్చింది. అది జరిగితే మంచిదే. ప్రయివేటు రంగంలోనైనా ఏదో ఒక యాక్టివిటీ ప్రారంభమౌతుంది. రాష్ట్రానికి నడిబొడ్డున వుంది కాబట్టి, ఇన్‌ఫ్రాస్టక్చర్ యిప్పటికే వుంది కాబట్టి, ఎంతోకొంత తప్పకుండా పెరుగుతుంది.

ఇక టిడిపి కూడా వాస్తవాన్ని గుర్తించి యీ తరహా ప్రపోజల్‌తో ముందుకు రావాలి. రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్ర నాయకులు ‘ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడిపోనివ్వం’ అంటూ మొండికేసి నష్టపోయారు. విభజన తప్పదని పార్టీ హై కమాండ్ చెప్పినపుడు కాంగ్రెసు ఎంపీలు ‘సరే అయితే మా రాష్ట్రానికి ఫలానా ఫలానా యివ్వండి’ అంటూ బేరాలాడి కొన్నయినా సంపాదించుకోవాల్సింది. అది చేయలేదు. తమకు కావలసిన ప్రయివేటు డిమాండ్లు తీర్చుకున్నారు, పైకి మనకు ‘ఆపేస్తాం’ అని చెప్పి మోసగించారు.

ఇప్పుడు టిడిపికి కూడా తామనుకున్న స్థాయిలో అమరావతి వెలవదని తెలుసు. అయినా పెట్టుబడిదారులను ఊరడించడానికి, పోరాడేస్తున్నట్లు బిల్డప్‌లు యిస్తోంది. ఇది ఒక నిలువీత, 8 నెలలుగా ఉద్యమం అంగుళం ముందుకు కదలలేదు, విస్తరించలేదు. అదే జనం, అవే నినాదాలు. ఇక బిల్డప్పులు మానేసి, టిడిపి పెట్టుబడిదారుల తరఫున వైసిపితో బేరాలాడాలి. అసలైన రైతులెవరు, వారికి యివ్వవలసినదేమిటి అనేది ముందుంచుకుని, బేరమాడితే పని కావచ్చు. ఎందుకంటే భూములిచ్చిన రైతుల సమస్యకు యిప్పటివరకు పరిష్కారం చూపకుండా వైసిపి చెడ్డపేరు తెచ్చుకుంది. ఏదో ఒక ఫేస్ సేవింగ్ మెజర్‌కై అది చూస్తూండవచ్చు.

నేను రాసినది చదివి ‘ఇదేదో సంపాదకీయంలా వుందేమిటి’ అని మీరనుకోవచ్చు. సంపాదకులంతే అటువైపు, యిటువైపు వాదనలన్నీ ఏకరవు పెట్టి, ఎవరిది న్యాయమో సొంత అభిప్రాయం చెప్పకుండా ‘ఇరు పక్షాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి’ అని సూచిస్తారు. అలా కూర్చుని మాట్లాడుకోగలిగితే సమస్య యింత దాకా రానే రాదు కదా! వాళ్లను వెక్కిరిస్తూనే నేను అదే పద్ధతిలో రాస్తున్నానంటే కారణం ఇది తప్ప టిడిపికి వేరు మార్గం లేదు.

కోర్టులు వివాదాన్ని నానుస్తాయి తప్ప పరిష్కారం చూపవు. తన ఐదేళ్ల పాలనలోనే బాబు ఏదో రకంగా నిర్మాణాలు చేపట్టేసి, ప్రయివేటు నిర్మాణాలు ఎడాపెడా ప్రోత్సహించి వుంటే, ఆటోమెటిక్‌గా నగరం పెరిగిపోయి, దాన్ని రివర్స్ చేయడానికి లేకుండా వుండేది. కానీ ఎంతసేపు డిజైన్లనీ, మరోటనీ కాలక్షేపం చేసి, ఎవర్నీ ఏదీ కట్టనీయకుండా చేయడంతోనే యిప్పుడీ అవస్థ వచ్చింది.

వైసిపి పన్నాగాలను కోర్టుల ద్వారా ఆపినా ప్రయోజనమేమీ వుండదని యిప్పటిదాకా చెప్పుకున్నాం. అమరావతి ముక్కుతూ మూలుగుతూ పడి వుండే కన్నా, రాజీపడి ఎన్నో కొన్ని సాధించుకుంటే, కాస్తయినా అభివృద్ధి జరిగి, నేచురల్ కోర్స్‌లో మరికొన్ని వస్తాయి. ఏదో ఒక రూపంలో అమరావతి నిలబడడం టిడిపికి, దాని వెనక వున్న పెట్టుబడిదారులకు అత్యవసరం, వైసిపికి కాదు. అందువలన యీ విషయంలో చొరవ తీసుకోవలసినది టిడిపియే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
mbsprasad@gmail.com

 

 


×