cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బందిపోటు రాణి సినిమా పిచ్చి

ఎమ్బీయస్:  బందిపోటు రాణి సినిమా పిచ్చి

బిహార్‌లో శకుంతల అనే మాజీ బందిపోటు వుంది. కొంతకాలం జైల్లో వుండి బయటకు వచ్చింది. తన బాబాయి చేసిన మోసం వలన బలాత్కారానికి, దోపిడికి గురై బందిపోటుగా మారానని ఆమె కథనం. తన జీవితం ఏ సినిమా కథకూ – ముఖ్యంగా ఫూలన్‌దేవి కథకు తీసిపోదని, అందువలన అది ఖచ్చితంగా తెర కెక్కాలనీ ఆమె దృఢాభిప్రాయం. ఎట్టకేలకు ఆమె కల నిజం కాబోతోంది.

ఫూలన్‌-దేవి (1963-2001) యుపిలో వెనుకబడిన కులాలకు చెందిన పేద యువతి. చాలా చిన్నపుడే పెళ్లి చేసేశారు. వైవాహిక జీవితం నరకప్రాయంగా గడిచింది. యుక్తవయసు వచ్చాక తలిదండ్రులను, భర్తను ఎదిరించి యింట్లోంచి పారిపోయి తమ ప్రాంతంలో తిరుగాడే బందిపోట్ల ముఠాను ఆశ్రయించింది. వారిలో ఆమెలాటి కులంవాడే ఒకడు ప్రేమించి ఆదరించాడు. బందిపోటుగా తీర్చిదిద్దాడు. అది ముఠాలోని అగ్రవర్ణస్తులకు నచ్చలేదు. కొన్నాళ్లకు ఆమె కారణంగా ముఠాలో చీలికలు వచ్చి జరిగిన కాల్పుల్లో ఆమె ప్రియుడు చనిపోయాడు.

పోటీ ముఠా ఆమెను బహమాయీ అనే గ్రామానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించింది. ఆ గ్యాంగ్‌లోని 22 మంది ఆమెను సామూహికంగా రెండు వారాలపాటు రేప్ చేశారు. ఆమె ఎలాగోలా తప్పించుకుని పారిపోయి. తన ప్రియుడి ముఠాలో మిగిలిన సభ్యులతో చేతులు కలిపింది. వారిలో ఒకరిని కొత్త ప్రియుడిగా స్వీకరించి, బందిపోటుగా కొనసాగింది. కొన్ని నెలల తర్వాత తనను బలాత్కరించిన 22 మందిని ముఠా సహాయంతో కాల్చి చంపింది. ఇది ఒక స్త్రీ తనకు జరిగిన పరాభవానికి తీర్చుకున్న ప్రతీకారంగా ప్రజలు భావించారు. అప్పటిదాకా ఫూలన్‌ అనే పిల్చిన మీడియా దేవి అని చేర్చింది.

ఆ సామూహిక హత్య తర్వాత ఫూలన్ చట్టానికి దొరక్కుండా రెండేళ్లు గడిపి చివరకు తనంతట తానే తన ముఠా సభ్యులతో సహా 1983లో పోలీసులకు లొంగిపోయింది. హత్యలతో సహా ఆమెపై మొత్తం 48 నేరాలున్నాయి. విచారణ జరుగుతూండగా 11 ఏళ్లు జైల్లో ఉంది. పరిస్థితులే తనను అలా మార్చాయని వాపోయేది. 1994లో యుపికి ముఖ్యమంత్రిగా వున్న ములాయం సింగ్ యాదవ్ ఆమెపై కేసులు ఎత్తివేసి బయటకు వచ్చేట్లా చేయడమే కాక, తన పార్టీలోకి చేర్చుకుని మీర్జాపూర్ నుంచి ఎంపీగా రెండుసార్లు గెలిపించాడు. 2001లో దిల్లీలో ఆమె అధికార నివాసం ముందు ఆమెను బహమాయీ హతుల బంధువులు కాల్చి చంపారు.

ఫూలన్‌ను జైల్లో కలిసిన మాలా సేన్ అనే రచయిత్రి ఆమె కథను గ్రంథస్తం చేయగా దాన్ని దర్శకుడు శేఖర్ కపూర్ ‘‘బాండిట్ క్వీన్’’ (1994) పేర సినిమాగా తెర కెక్కించాడు. ఆమె పాత్రలో సీమా బిశ్వాస్ అనే నటి నటించింది. సినిమా విడుదలకు ముందు తన ప్రైవసీని హరించారంటూ ఫూలన్ కాస్త హంగామా చేసి రాజీగా 40 వేల పౌండ్లు ముట్టాక ఊరుకుంది. సినిమాకు అవార్డులు వచ్చాయి, డబ్బూ వచ్చింది. అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించబడింది. ఈ ఉదంతమంతా శకుంతల మనసులో నాటుకుంది. తన మీదా  ఓ సినిమా వస్తే చరిత్రలో తన పేరూ మారుమ్రోగుతుంది కదా అనుకుంది.

ఈమెకు కూడా  అలాటి కథే కాస్త తగ్గు స్థాయిలో వుంది. ఆమె చెప్పుకుంటున్న ప్రకారం - బిహార్‌లో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మధుబని జిల్లాకు చెందిన ఆమె వెనుకబడిన కులాలకు చెందినది. ఆమె తండ్రి భూమిపై కన్నేసిన బాబాయి 1987లో అన్నను చంపించి, వీళ్ల కుటుంబంపై పెత్తనం చలాయించాడు. 13 ఏళ్ల వయసున్న యీమె దానికి అడ్డు చెప్పడంతో యీమెను బంధువులతో, కొందరు నేరస్తులతో రేప్ చేయించి, భయపెట్టి భూమి లాక్కున్నాడు. ఒక 55 ఏళ్ల ముసలాడితో పెళ్లి నిశ్చయించి, ఊరి నుంచి పంపేసి అడ్డు తొలగించుకుందా మనుకున్నాడు.

దాంతో ఈమె తన ప్రాంతంలో చురుగ్గా వున్న ఒక  బందిపోటు ముఠాలో చేరింది. ముఠాలోని చరిత్ర మహతో అనే అతన్ని పెళ్లాడి పిల్లల్ని కంది. వాళ్లను తల్లి కిచ్చి పెంచమంది. మహతో ఆమెకు గుఱ్ఱపుస్వారీ, తుపాకీ పేల్చడం నేర్పించాడు. తన లాటి అభాగినుల హక్కుల కోసం దోపిడీలు, దొంగతనాలు చేసింది. దుర్మార్గులను దండించి, బీదలకు సాయం చేసింది. ఆమె బాబాయి పోలీసులను లోబరుచుకుని ఆమెపై హత్య, దోపిడీ, డబ్బు గుంజడం వంటి కేసులు పెట్టించాడు. దాంతో ఆమె జైలుపాలైంది. బయటకు రాగానే మళ్లీ యింకో కేసు పెట్టేవారు. అలా సుమారు ఐదేళ్లు జైల్లో గడిపింది. చివరకు కేసులు కొట్టేశారు.

అంటే యీమె చేసినవి మరీ అంత పెద్ద ఘోరాలు కాదనుకోవాలి. కానీ యీమె మాత్రం తనను ఫూలన్‌తో పోల్చుకుని తెర కెక్కాలనుకుంటోంది. జైల్లో వుండగా జానపద సంగీతంపై మక్కువ పెంచుకుని మైథిలీ, భోజపురి భాషల్లో పాటలు పాడి ఆల్బమ్స్ విడుదల చేసింది. వాటికి గుర్తింపు రావడంతో రాజకీయాల్లోకి రావాలనుకుని, ఫూలన్ లాగానే సమాజవాదీ పార్టీలో చేరింది. అక్కడ నచ్చక బయటకు వచ్చి జనతా దళ్ (యు)లో చేరింది. వాళ్లు యీమెను పెద్దగా పట్టించుకోలేదు.

జైల్లో వుండగానే వినోద్ కుమార్ సింగ్ అనే అతను పరిచయమయ్యాడు. అతనిదీ మధుబని జిల్లాయే. మాజీ బందిపోటే. అతను బిజెపిలో వుండేవాడు. ఈమెతో బాటు జెడి (యు)లో చేరాడు. 2004లో ఆమెను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. నీ కథతో రూ. 1.25 కోట్ల బజెట్‌తో సినిమా తీస్తా అంటూ 2011లో హంగామా చేశాడు. వేరే హీరోయిన్ ఎందుకు, నీకు 38 ఏళ్లయినా హీరోయిన్‌గా ఫస్ట్‌క్లాస్‌గా పనికి వస్తావ్ అన్నాడు. ‘‘శకుంతల’’ అనే నీ పేరు మీదుగానే సినిమా. అన్నాడు. రజా మురాద్, అవధేశ్ మిశ్రా వంటి తారాగణంతో సినిమా 2012 జనవరిలో విడుదల కాబోతోందంటూ 2011 సంవత్సరాంతంలో వార్తలు వచ్చాయి. చివరకు ఏమైందో ఏమో సినిమా విడుదల కాలేదు.

8 ఏళ్లయినా శకుంతల ఆశలు చావలేదు. బయోపిక్‌ల హవా నడుస్తోంది కాబట్టి ఉత్సాహం పుట్టింది.  హైదర్ కాజ్మీ అనే నటుడు, నిర్మాత, దర్శకుడి చేత యిప్పుడు ‘‘బాండిట్ శకుంతలా’’ పేర సినిమా తీయించింది. 46 ఏళ్ల వయసులో తనే హీరోయిన్ పాత్ర వేసింది. అభిమన్యు సింగ్ ఓ పాత్ర వేస్తున్నాడు. కాజ్మీది ముఖ్యపాత్ర. నిర్మాతలుగా వేరేవారి పేర్లు కనబడుతున్నాయి. భర్త వినోద్ పేరు ఎక్కడా వినబడటం లేదు. ఈ సినిమా జెహానాబాద్ జిల్లాలో చిత్రీకరించబడింది. దీన్ని కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపుదామనుకున్నాం కానీ కోవిడ్ కారణంగా కుదరలేదు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే థియేటర్లలో రిలీజ్ చేస్తాం అంటున్నారు పబ్లిసిటీ విభాగం వారు.  

చిత్రం ఏమిటంటే దర్శకుడు కాజ్మీ ఓ రేప్ కేసులో యిరుక్కున్నాడు. 2012లో నాకు కాఫీలో మత్తుమందు కలిపి యిచ్చి రేప్ చేశాడనీ, అతని సోదరి అదంతా వీడియో తీసిందనీ, ఆ వీడియో చూపించి తనను బెదిరిస్తూ లైంగిక వేధింపులు చేస్తూ వచ్చాడనీ ఆరోపిస్తూ 2019లో ఓ నటి యితనిపై కేసు పెట్టింది. దాంతో అతను ఆర్నెల్లపాటు జుడిషియల్ కస్టడీలో వుండాల్సి వచ్చింది. అతను యీ కథకు ఏ మేరకు న్యాయం చేస్తాడో, యీ సినిమా విడుదలయ్యాక శకుంతల పేరు దేశమంతా తెలుస్తుందో లేదో చూడాలి. (ఫోటో – కాజ్మీ, శకుంతల, ఇన్‌సెట్‌లో హీరోయిన్ క్లోజప్) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2020)
mbsprasad@gmail.com

 


×