cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఫ్రెడరిక్ ఫోర్‌సైత్ ప్రతిభ

ఎమ్బీయస్: ఫ్రెడరిక్ ఫోర్‌సైత్ ప్రతిభ

‘‘డే ఆఫ్ ద జాకాల్’’ నవలలో ఇక్కణ్నుంచి లెబెల్ పాత్ర ముందుకు వస్తుంది. ఇతను శ్రద్ధగా పనిచేసే తీరు చూసి, జాకాల్ ఎవరో యితనికి తెలిసిపోతే బాగుండును అనిపిస్తుంది మనకు. అతను యితర దేశాల్లో సాటి డిటెక్టివ్‌లను సంప్రదించి, టాప్ క్లాస్ కిరాయి హంతకుల గురించి తెలిస్తే చెప్పమన్నాడు. స్కాట్లండ్ యార్డ్‌లో వున్న అతని స్నేహితుడు థామస్ ‘ఒక ఇంగ్లీషతను ఉన్నాడు, విదేశాల్లోనే ఎక్కువగా ఆపరేట్ చేస్తాడు. మధ్య అమెరికాలో ఒక దేశపు అధ్యక్షుణ్ని దూరం నుంచి కాల్చి చంపినట్లు పుకార్లు వున్నాయి. కానీ సాక్ష్యాలు దొరకలేదు. అతని పేరు, వైనం కూడా తెలియదు.’ అని చెప్పాడు. లెబెల్ తక్కిన దేశాల మిత్రులతో కూడా సంప్రదించి, అతని పేరు ఛార్లెస్ కాల్‌త్రోప్ అని, లండన్‌లో వుంటాడని తెలుసుకున్నాడు.

థామస్ రికార్డులు తిరగవేసి, ‘ఔను, యీ కాల్‌త్రోప్ ఆ సమయంలో ఆ దేశంలో వున్నాడు కూడా..’ అని కన్‌ఫమ్ చేశాడు. ఛార్లెస్‌లోని మొదటి అక్షరం చా, కాల్‌త్రోప్‌లో మొదటి రెండక్షరాలు కాల్ కలిపితే చాకాల్ అని వస్తుంది. ఫ్రెంచ్ భాషలో దాని అర్థం జాకాల్ అని. అందుకనే జాకాల్ అని కోడ్‌నేమ్ పెట్టుకుని వుంటాడు అని అతని అసిస్టెంటు గెస్ చేశాడు. లండన్ స్పెషల్ బ్రాంచ్ వాళ్లు వెంటనే కాల్‌త్రోప్ యింటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరు. ఒంటరిగా వుంటాడని, ఊళ్లో లేడని తెలిసింది. అతని పాస్‌పోర్టు యింట్లోనే వుంది. అంటే దొంగ పాస్‌పోర్టుపై ప్రయాణిస్తున్నాడన్న మాట. పాస్‌పోర్టు బట్టి అతని రూపురేఖలు, వయసూ, యితర వివరాలూ తెలిసిపోయాయి. ఇక ఆ పోలికలతో ఉన్న మనుషుల పేర జారీ అయిన పాస్‌పోర్టులన్నిటినీ లిస్టు చేసి, వాళ్లు ప్రస్తుతం ఎక్కడున్నారో ఆచూకీ తీయడం మొదలుపెట్టారు.

ఓఏఎస్‌లో ఫ్రెంచి గూఢచారుల ఇన్‌ఫార్మర్లు వున్నట్లే, ఓఏఎస్ మనిషి ఒకామె ఎయిర్‌ఫోర్స్ కల్నల్ ఉంపుడుగత్తెగా వుంది. జాకాల్ అన్వేషణ గురించి జరిగే సమావేశాల్లో కల్నల్ పాల్గొంటూ వుంటాడు. తిరిగి వచ్చి రాత్రి ఆమెతో పిచ్చాపాటీగా అన్నీ చెపుతూ వుంటాడు. ఆమె ఓఏఎస్ వాళ్లకు చేరవేస్తూ వుంటుంది. లెబెల్ ఏ మేరకు సమాచారం సేకరిస్తున్నాడో వాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోతూ వుంటుంది. జాకాల్ ఒక స్పోర్ట్స్ కారు ఛాసిస్‌కు తన తుపాకీని వెల్డ్ చేసి, ఆ కారులో ఇటలీ నుంచి పారిస్‌కు బయలుదేరుతూ ఓఏఎస్ ఏజంటుకు ఫోన్ చేశాడు. అతను వెంటనే యిదంతా చెప్పి ఏం చేస్తావన్నాడు. రిస్కు తీసుకుంటాను అన్నాడు జాకాల్. దక్షిణ ఫ్రాన్స్‌కు చేరి ఒక హోటల్లో వున్నాడు.

ఈలోగా దొంగ పాస్‌పోర్టుల కూపీ లాగడం ద్వారా జాకాల్ ఉపయోగిస్తున్న డగ్గన్ పాస్‌పోర్టు సంగతి లెబెల్‌కు తెలిసిపోయింది. సరిహద్దు దాటి ఫ్రాన్సులోకి వచ్చినట్లు తెలిసి, ట్రాక్‌ డౌన్ చేసి హోటల్‌పై దాడి చేశాడు. కానీ కల్నల్ ఉంపుడుగత్తె ద్వారా సమాచారం అందుకున్న జాకాల్ ఒక గంట ముందే హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దాంతో తన టీములోనే ఎవరో సమాచారం అందిస్తున్నారని లెబెల్‌కు అనుమానం వచ్చింది. ఆ రాత్రి అందరి ఫోన్లు ట్యాప్ చేయించాడు. మర్నాడు సమావేశంలో అది బయటపెట్టడంతో కల్నల్ సిగ్గుపడి రాజీనామా చేసి, వెళ్లిపోయాడు.

ఇక జాకాల్‌కు రహస్య సమాచారం తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.  అయినా అతను వెనక్కి తగ్గలేదు. హోటల్లో వుండగా ఒక ఒంటరి మహిళను ఆకర్షించి, వలలో వేసుకుని ఆమె అడ్రసు తెలుసుకున్నాడు. హోటల్ ఖాళీ చేసి, కారులో ఆమె గ్రామానికి వెళ్లి మకాం పెట్టాడు. ఆమె సంతోషంగా తనతో వుండమంది కానీ అతని బట్టలు సర్దుతూంటే తుపాకీ బయటపడి, ఎవరు నువ్వు అని నిలదీసింది. వెంటనే ఆమెను చంపివేసి, డగ్గన్ తాలూకు వస్తువులన్నీ ఓ లోయలో పడేసి పారిపోయాడు. అతని దగ్గర అవసరార్థం దాచి పెట్టుకున్న రెండు ఫ్రెంచి ఐడెంటిటీలున్నాయి. వాటిలో ఒకటి బయటకు తీసి పారిస్‌కు వెళ్లే రైలెక్కాడు. ఆ మహిళ హత్య బయట పడేనాటికి అతను పారిస్ జనసమూహంలో కలిసిపోయాడు.

జాకాల్ ఫ్రెంచ్ పాస్‌పోర్టులు కూడా రెడీ చేసి పెట్టుకుంటాడని లెబెల్ ముందే ఊహించాడు. అతని పోలికలతో వున్నవాళ్ల ఫ్రెంచ్ పాస్‌పోర్టులు వెతికి, వాళ్లు ఉన్నారా లేదా అని తనిఖీ చేస్తూ పోతే, జాకాల్ దగ్గరున్న పాస్‌పోర్టుల వివరాలు అతనికి తెలిసిపోయాయి. కానీ మనిషి ఎక్కడ దొరుకుతాడు? అతను ద గాల్‌పై ఎప్పుడు దాడి చేస్తాడో తెలుసుకోవడం ఎలా? 1963 ఆగస్టు 22 సాయంత్రం అతనికి హఠాత్తుగా తట్టింది -  హత్యకు ముహూర్తం ఆగస్టు 25కి పెట్టి వుంటాడని! ఎందుకంటే రెండవ ప్రపంచయుద్ధంలో పారిస్ విముక్తి దినం అది. ప్రతీ ఏడూ ఆ వార్షికోత్సవం నాడు ద గాల్ పారిస్‌లోనే వుండి, ఒక మైదానంలో ఆనాటి యుద్ధవీరులందరినీ సన్మానించడం ఆనవాయితీగా వస్తోంది. అప్పుడైతే అతను ఒక ప్రదేశంలో నిలబడి దొరుకుతాడు.

ఆ మైదానానికి చుట్టూ అనేక భవంతులున్నాయి. ఏదో ఒక భవంతి పై అంతస్తు మీద నుంచి అతన్ని కాల్చి చంపవచ్చు. కానీ అంత దూరం నుంచి కాల్చాలంటే చాలా, చాలా ఎక్స్‌పర్ట్ అయి వుండాలి. గుండు అంత దూరం ప్రయాణించాలంటే తుపాకీని ప్రత్యేకంగా తయారు చేయించాలి. ఇది జాకాల్ వలన సాధ్యమా? అతను తుపాకీ పేల్చడంలో ఎక్స్‌పర్ట్ అని కదా ప్రతీతి. అందువలన ఆ రోజే అతను కచ్చితంగా ఎటాక్ చేస్తాడు. తన అంచనాను స్పెషల్ ఫోర్సుకి చెప్పగానే అందరూ అతనితో ఏకీభవించారు. ‘ఆ రోజు జాగ్రత్తగా వుంటే సరిపోతుంది, అయినా యీ లోపునే అతన్ని కనిపెట్టేస్తాం. జాకాల్ ఒక మహిళను చంపాడు కాబట్టి హంతకుడిగా ప్రకటించి అతని కోసం బహిరంగంగా వెతకడం ప్రారంభిస్తాం. టీవీల్లో, పేపర్లలో అతని ఫోటోలు ప్రకటించి, అతని ఆచూకీ చెప్పమని పౌరులను కోరతాం. ఇది యిక పోలీసుల పని, నీ డిటెక్టివ్ పని అయిపోయింది కాబట్టి నువ్వు రెస్టు తీసుకో’ అని హోం మంత్రి లెబెల్‌కు చెప్పాడు. లెబెల్ హమ్మయ్య అని యింటికి వెళ్లి విశ్రమించాడు.

జాకాల్ యీ లోపుగా రూపం మార్చాడు. ఒక ‘గే’గా తయారై, గే బార్‌లో ఒకబ్బాయిని ఆకర్షించి, అతనితో పాటు అతని ఫ్లాటుకి వెళ్లాడు. టీవీలో యితని మొహం చూసి, అతనికి అనుమానం రావడంతో వెంటనే అతన్ని చంపి, ఆ ఫ్లాట్‌లో సద్దు చేయకుండా దాగున్నాడు. దాంతో ఫ్రెంచి పోలీసులు అతన్ని పట్టుకోలేక పోయారు. 25 ఉదయం జాకాల్ ఒక ముసలి, కుంటి యుద్ధవీరుడిలా డ్రెస్ చేసుకున్నాడు. తన సైలెన్సర్ తుపాకీని ముక్కలుముక్కలుగా విడదీసి, చంకకర్రలో అమర్చి, దాన్ని చంక కింద పెట్టుకుని, కొన్ని భాగాలను ఓవర్ కోటు జేబులో పెట్టుకుని ఆ మైదానానికి వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ వాళ్లు పైపైన చెక్ చేసి వెళ్లనిచ్చారు. అతను మైదానంలోకి వెళ్లకుండా పక్కనున్న భవంతి పై అంతస్తుకు చేరుకున్నాడు. ద గాల్ మెడల్స్ యివ్వడం ప్రారంభించగానే కాల్చడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు.

లెబెల్‌కు అవేళ పనేమీ లేదు. అయినా భద్రతా ఏర్పాట్లు ఎలా వున్నాయో చూద్దామని మైదానానికి వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్లన్నిటిలో జాకాల్ ఫోటో చూపించి, ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. ఒకచోట ఒక గార్డు ఒంటికాలి సైనికుణ్ని అనుమతించానని, యింత ఉక్కలోనూ అతను పెద్ద కోటు వేసుకోవడం వింతగా వుందనీ చెప్పాడు. వెంటనే లెబెల్ ఏం జరుగుతోందో ఊహించాడు. చుట్టూ భవంతుల్ని వెతకమని పెట్రోలు టీముకి చెప్పి, తను ఒక భవంతి పై భాగానికి వెళ్లాడు. సరిగ్గా జాకాల్ అదే భవంతిలో వున్నాడు. ఒక యుద్ధవీరుడికి మెడల్ యిస్తున్న ద గాల్ తలకు గురి పెట్టి గుండు పేల్చాడు. అయితే అది అతని తల పక్కనుంచి దూసుకుపోయి, కింద పడింది. ఎవరూ గమనించలేదు. జాకాల్ వంటి అమోఘమైన షూటర్ గురి తప్పడం వింతగా వుంది కదా!

జరిగినదేమిటంటే, ద గాల్ ఆ సమయానికి వంగి, ఆ యుద్ధవీరుడి బుగ్గలు ముద్దాడాడు. ఇది ఫ్రెంచ్ సంప్రదాయం. ఇంగ్లీషు వాళ్లు యిలా ఎప్పటికీ చేయరు. జాకాల్ ఇంగ్లీషువాడు కాబట్టి దీన్ని ఊహించలేదు. అందుకే గురి తప్పింది. అతని చేతిలో ఉన్న తుపాకీ సైలెన్సర్ కాబట్టి సద్దు చేయలేదు. వెంటనే మరో గుండు లోడ్ చేశాడు. కానీ అప్పటికే లెబెల్, అతని సహచరుడు అతను వున్న గది తలుపు పగలకొడుతున్నారు. జాకాల్ యిటు తిరిగి ఆ తుపాకీ బుల్లెట్‌తో సహచరుణ్ని చంపేశాడు. మూడో బులెట్ లోడ్ చేస్తూండగానే నిరాయుధంగా వున్న లెబెల్ సహచరుడి శవం నుంచి పిస్టల్ తీసుకుని జాకాల్‌ను కాల్చేశాడు. అక్కడితో అతని కథ ముగిసింది.

అయితే యీ కథకు ఫోర్‌సైత్ అద్భుతమైన ట్విస్టు యిచ్చాడు. జాకాల్ మరణం తర్వాత లండన్ స్పెషల్ బ్రాంచ్ వాళ్లు వచ్చి అతని లండన్ ఫ్లాట్‌లో వస్తువులను స్వాధీన పరుచుకుంటూ వుంటే ఒకతను కారు దిగాడు. ‘‘నేనే ఛార్లెస్ కాల్‌త్రోప్‌ని. హాలీడేయింగ్‌కై స్కాట్లండ్ వెళ్లాను. మీరెందుకు నా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారు?’ అని రంకెలు వేశాడు. నిజానికి ఆ కిరాయి హంతకుడికి, యితనికి ఏ సంబంధమూ లేదు. ఒక ఫాల్స్ లీడ్‌ పట్టుకుని పోలీసులు ముందుకు సాగారు కానీ విజయం సాధించారు. అంతవరకు బాగానే వుంది కానీ, జాకాల్ అసలు పేరేమిటి? అతనెవరు? ఎప్పటికీ తెలియదు. పారిస్‌లో ఒక స్మశానంలో అనామకుడిగా పాతిపెట్టబడిన జాకాల్ గురించి అఫీషియల్ రికార్డుల్లో ‘కారు ప్రమాదంలో చనిపోయిన పేరు తెలియని ఒక విదేశీ యాత్రికుడు’ అని రాసుకున్నారు. అంత్యక్రియలకు హాజరైనవారు – పూజారి, పోలీసు కానిస్టేబుల్, రిజిస్ట్రార్, సమాధి తవ్వినవారు, లెబెల్!

ఈ నవలను 1970 జనవరి- ఫిబ్రవరిలలో 35 రోజుల్లో ఫోర్‌సైత్ పూర్తి చేశాడు. దాన్ని పట్టుకుని సెప్టెంబరు దాకా పబ్లిషింగ్ సంస్థల చుట్టూ తిరిగాడు. క్లయిమాక్స్ ముందే తెలిసిపోతే నవలెవడు చదువుతాడంటూ అందరూ తిరస్కరించాడు. పైగా అప్పటికి ద గాల్ జీవించే వున్నాడు కూడా. చివరకు హచిన్‌సన్ అనే సంస్థ ‘నువ్వు బాగా రాయగలవని అర్థమైంది. ఇది పెద్దగా అమ్ముడుపోదు కాబట్టి 8 వేల కాపీలు మాత్రమే వేస్తాం. కానీ మరో రెండు నవలలు రాసి యివ్వాలి. దీనికి 500 పౌండ్లు అడ్వాన్సు యిస్తాం, తక్కిన రెండిటికి కలిపి 6 వేల పౌండ్లిస్తాం.’ అని బేరమాడింది. గత్యంతరం లేక ఫోర్‌సైత్ సరేనన్నాడు. 1971 జూన్‌లో పుస్తకం బయటకు రాగానే విపరీతంగా అమ్ముడు పోసాగింది. న్యూయార్క్‌లోని వైకింగ్ ప్రెస్ వాళ్లు అమెరికాలో ప్రచురించడానికి లక్ష పౌండ్లు యిస్తామన్నారు. దానిలో సగం ఫోర్‌సైత్‌కు, సగం హచిన్‌సన్‌కు వెళ్లింది.

హచిన్‌సన్‌తో కాంట్రాక్టు ప్రకారం ఫోర్‌సైత్ రాసిన తక్కిన రెండు నవలలు  ఒడెస్సా ఫైల్ (1972), డాగ్స్ ఆఫ్ వార్ (1974)! అవీ చాలా బాగుంటాయి. నేను ‘డెత్ ఆఫ్ ఏ ఫ్యూజిటివ్’ అనే ఇంగ్లీషు కథ రాసినప్పుడు (‘‘ఎలైవ్’’లో ప్రచురితమైంది) న్యూస్ పేపర్ రిపోర్టులతో బాటు ఒడెస్సా ఫైల్‌లో సమాచారాన్ని కొంత వాడుకున్నాను. టార్గెట్ 8 అనే క్రైమ్ సీరియల్ రాసినప్పుడు చివరిలో అనూహ్యమైన ట్విస్టు యివ్వాల్సి వచ్చినపుడు అలా జరగడానికి ఆస్కారం వుందని పాఠకులను కన్విన్స్ చేయడానికి డాగ్స్ ఆఫ్ వార్ రచనా నేపథ్యాన్ని వాడుకున్నాను. ఈ జాకాల్ నవల ఆధారంగా 1973లో సినిమా వచ్చింది. అదీ బాగుంటుంది. లక్షిత వ్యక్తులను మార్చి 1997లో రీమేక్ వచ్చిందట. ఈ థీమ్‌తో మలయాళంలో ఆగస్టు 1 (1988) అనే సినిమా వచ్చిందట.

ఒక చిన్న విషయాన్ని చెప్పి యీ వ్యాసాన్ని ముగిస్తాను. 1982లో ఫోర్‌సైత్ కథాసంకలనం ‘‘నో కమ్‌బాక్స్’’ వెలువడింది. 1983లో అనుకుంటా వినోద్ మెహతా సంపాదకత్వంలో వస్తున్న ‘‘సండే అబ్జర్వర్’’లో ఆ సంకలనంలోని ఒక కథను శాంపుల్‌గా ముద్రించారు. దాని పేరు ‘‘దేర్ ఆర్ నో స్నేక్స్ ఇన్ ఐర్లండ్’’. ఐర్లండ్‌లో మెడికల్ స్టూడెంటుగా వున్న రామ్ అనే భారతీయుడు పై సంపాదన కోసం ఒక బిల్డింగ్ సైట్‌లో పనిచేస్తూంటాడు. అక్కడి ఫోర్మన్ యితన్ని అష్టకష్టాలు పెట్టడంతో కసి పెంచుకుని ఇండియాకు వచ్చి ఒక చిన్న విషపు పాము (వైపర్)ను కొనుక్కుని పట్టుకెళ్లి ఆ ఫోర్మన్ కోటు జేబులో పెడతాడు. ఫోర్మన్ దాన్ని చూస్తాడు కానీ ఐర్లండ్‌లో పాములు వుండవు కాబట్టి అది బల్లి అనుకుంటాడు. రామ్‌ను ఏడిపించడానికి అతని లంచ్‌బాక్స్‌లో పెడతాడు. ఇలా కథ సాగుతుంది. చివరకు రామ్ కారణంగా ఐర్లండ్‌లో పాములు ప్రవేశించాయని చెపుతూ కథ ముగుస్తుంది.

మర్నాడు మా కొలీగ్ యింట్లో ఫంక్షన్‌కై నా సీనియర్ బ్యాంకు కొలీగ్స్‌తో కలిసి కార్లో వెళుతున్నాం. అందరం ఇంగ్లీషు సాహిత్యాభిమానులం కావడంతో ఫోర్‌సైత్ థరోనెస్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అప్పుడు నేను ‘‘..కానీ ఫోర్‌సైత్ కూడా పొరబాటు చేశాడు. నిన్న నేను చదివిన కథలో రామ్‌కు పాము అమ్మిన ఇండియన్ పేరు చటర్జీ అని పెట్టి, అతని గురించి వర్ణించినపుడు ‘ద ఓల్డ్ గుజరాతీ..’ అని వర్ణించాడు. ప్రమాదో ధీమతా మపి.. అంటే యిదే కాబోలు!’’ అన్నాను. వెంటనే నా సీనియర్లందరూ ఫోర్‌సైత్ ఎన్నడూ పొరబాటు చేయడు అంటూ నన్ను ఖండించారు. మర్నాడు పేపరు పట్టుకెళ్లి అందరికీ చూపిస్తే ఆశ్చర్యపడ్డారు. ఫోర్‌సైత్‌కు ఇండియాలో వ్యాపారస్తులంటే గుజరాతీలని గుర్తుండి వుంటుంది. చటర్జీ అనేది బాగా తెలిసున్న ఇండియన్ పేరు. దాంతో కన్‌ఫ్యూజ్ అయి వుంటాడు.

ఇర్వింగ్ వాలెస్ తను నవలలు ఎలా ప్లాను చేస్తాడో రాసిన వ్యాసం చదివాను. క్రియేటివ్‌గా రాయడం పూర్తి చేశాక, ఇలాటి తప్పులేమైనా వుంటాయేమో చూడమని కొందరు ఏజంట్లకు యిస్తారట. ఇవే కాదు, ఫలానా ఊళ్లో, ఫలానా వీధిలో, ఫలానా పేరుతో వున్నవాడు భార్యను హత్య చేశాడు అని కల్పించి రాస్తే, వాడు అక్కడ నిజంగా వుంటే ‘నాకు పరువునష్టం కలిగింది’ అని కేసు వేయగలడు. ఈ ఏజంట్లు అలాటివన్నీ చెక్ చేసి, పేరు స్పెల్లింగైనా మార్పిస్తారు. ఫోర్‌సైత్ ఏజంటెవరో ఆ పని సరిగ్గా చేయలేదు. గుజరాతీ ఇండియన్ కమ్యూనిటే, చటర్జీ ఇండియన్ పేరు, సరిపోయిందిగా అనుకుని వుంటాడు. ఇండియా గురించి సరిగ్గా తెలియని వాడు శంకరన్ అయ్యంగార్ అనే పేరుతో పాత్ర సృష్టిస్తే దానిలో పొరపాటు వైష్ణవ సంప్రదాయం గురించి తెలిసినవారికే తెలుస్తుంది. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, యీ పొరపాటు ఫోర్‌సైత్ దృష్టికి వెళ్లినట్లుంది. ఆ కథను పునర్ముద్రించినపుడు గుజరాతీ అనే పదం తీసేశారు. ఇప్పుడు యింటర్నెట్‌లో దొరికే కథలో గుజరాతీ అనే వర్ణన కనబడదు. మరి నేను చెప్పినదానికి సాక్ష్యం ఏమిటి అంటే ఆనాటి ‘‘సండే అబ్జర్వర్’’ చూడాల్సిందే! చివరగా చెప్పేదేమిటంటే ఫోర్‌సైత్ గొప్ప రచయిత. జాకాల్ గొప్ప పుస్తకం. వీలుంటే చదవండి. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

mbsprasad@gmail.com

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×