cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తాయిలాలే తాయిలాలు

ఎమ్బీయస్‌: తాయిలాలే తాయిలాలు

ఎన్నికలు ఐదు రోజులున్నాయనగా యిప్పుడు ప్రధాన పార్టీలు మానిఫెస్టోలు విడుదల చేశాయి. సాధారణంగా అభ్యర్థుల పేర్ల ప్రకటనలో జాప్యం జరిగేది. అవతలి అభ్యర్థి ఎవరో చూసి, అప్పుడు మనం చెపుదామని ఆగేవారు. ఇప్పుడు మానిఫెస్టోల విషయంలో కూడా అదే జరుగుతున్నట్లుంది. అవతలివాళ్ల హామీలేవిటో చూసి, అంతకంటె భారీ హామీని గుప్పిద్దామని ఆఖరి నిమిషం దాకా ఆగుతున్నారు. గుండె జబ్బు ఉన్నవాళ్లు మానిఫెస్టోలను లోతుగా చదవడం మంచిది కాదు. వీటన్నిటికి డబ్బెక్కణ్నుంచి వస్తుందాన్న భయం వేసిందంటే యిక అంతే సంగతులు. అందుకే చాలామంది వీటిని నవ్వుతూ వింటున్నారు. ఉగాది పంచాంగశ్రవణం చూడండి. ఆ రోజు మాత్రమే రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం లాటి అంకెలు వింటాం, తర్వాత అవి ఎలాగూ గుర్తుండవు. మన బతుకు మనం నడుపుకుంటూనే ఉంటాం. ఈ హామీలను కూడా అలాగే ట్రీట్‌ చేయాలనే భావంతో కాబోలు ఉగాది నాడే మానిఫెస్టోలు విడుదల చేశారు వీళ్లు.

ఆంధ్ర ఎన్నికలలో విధానాలపై చర్చలు వినరావటం లేదు. అదిస్తాం, యిదిస్తామనే హామీల వర్షం మాత్రమే కురుస్తోంది. ఇక్కడ గమనించవలసినదేమిటంటే గతంలో 'అది చేస్తాం, యిది చేస్తాం' అని హామీలిచ్చేవారు. ఇప్పుడు 'అదిస్తాం, యిదిస్తాం' అనే అంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ఖజానాకు క్షామం వస్తుందేమోనని భయం వేసే రేంజ్‌లో నడుస్తోంది యీ వేలం పాట. 'వాళ్లు రెండిస్తాన్నారా? అయితే మేం మూడు', '...మా పాట మూడున్నర' యిలా సాగుతోంది. గతంలో మీ వూరికి రోడ్డు వేయిస్తాం, ఆసుపత్రి కట్టిస్తాం, వంతెన కట్టిస్తాం, బడి శాంక్షన్‌ చేయిస్తాం, బస్సు తిప్పుతాం అనేవారు. ఇప్పుడు ఆ మాటలు పోయాయి. అన్నీ భారీ వాగ్దానాలే. పోర్టులు కట్టేస్తాం, పోలవరం కట్టేస్తాం, ఫారిన్‌ కంపెనీ ఫ్యాక్టరీలు తెచ్చేస్తాం, కళ్లు తిరిగే రాజధాని కడతాం... యిలాటివి. ఐదేళ్ల తర్వాత ఏమయ్యాయి అని అడిగితే అంత భారీ ప్రాజెక్టులు ఓ పట్టాన అవుతాయా అని దబాయించవచ్చు, కేంద్రం అప్పివ్వలేదు, విదేశాల నుంచి తెద్దామంటే పూచీ యివ్వలేదు అనే సాకులు చెప్పవచ్చు.

భారీ వాటి మాట పక్కన పెట్టండి, చిన్నచిన్న పనులు చేసి పెట్టండి అని అడిగితే వారికి నచ్చటం లేదు. ఎందుకంటే అవి పబ్లిసిటీకి పనికి రావు. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత అన్నీ అదే స్థాయిలో ఊహిస్తున్నారు. ఏం చేసినా కళ్లు చెదరాలంతే! గతంలో అనేక నిర్మాణాత్మకమైన పనుల మీదే ఫోకస్‌ ఉండేది. ఆ కాంట్రాక్టుల్లో అవినీతి గురించి మాట్లాడటం లేదు, అది ఎలాగూ తప్పదు. కానీ నిధులు వాటికి ఖర్చయ్యేవి. తమిళనాడు (అప్పట్లో మద్రాసు)లో డిఎంకె ఆ విధానాన్ని మార్చింది. 1967లో 'రూపాయికి మూడు పడుల (పడి అంటే సోలకు దగ్గరగా వుంటుంది) బియ్యం' అనే నినాదంతో ఎన్నికలలో నెగ్గింది. అప్పటిదాకా కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లు (పారిశ్రామిక వాడలు) నెలకొల్పి ఉపాధి కల్పించింది. కానీ తమకు వెంటనే ప్రయోజనం కలిగే యీ నినాదంపై జనాలకు మోజు పుట్టింది. నిజానికి అధికారంలోకి వచ్చాక డిఎంకె మూడు పడులు యివ్వలేకపోయింది. ఓ పడో ఎంతో యిచ్చి సరిపెట్టింది. అదేమంటే 'పెళ్లి సమయంలో కూతురికి వడ్డాణంతో ఎన్నో సొమ్ములు పెడతామనుకుంటాం, వియ్యాల వారికి అలా చెప్తాం కూడా, కానీ ఫైనల్‌గా తేలేటప్పటికి మెళ్లో ఓ చిన్న గొలుసు వేసి పంపుతాం, ఇదీ అలాగే' అని చెప్పుకుంది.

ద్రవిడ బాటలోనే ఎన్టీయారూ - ఎన్టీయార్‌ పార్టీ పెట్టినపుడు ద్రవిడ పార్టీల విధానాలనే అనుకరించారు. వాళ్లలాగే బిసిలకు రాజ్యాధికారం కల్పించడం, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి కేంద్రంపై ఉసి గొల్పడం, పార్టీ రంగును డ్రెస్‌ కోడ్‌గా వాడడం.. యిలా ఎన్నో దించేశారు. వాటితో బాటే యీ సంక్షేమ పథకాలు కూడా. రెండు రూపాయలకు బియ్యం, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం - యివి కూడా దిగుమతి అయ్యాయి. కాంగ్రెసు వీటిని ఎద్దేవా చేసింది. అప్పుడు ఎన్టీయార్‌ 'ఎప్పుడో తన తర్వాతి తరానికి రెడీ అయ్యే భారీ ప్రాజెక్టుల కంటె ప్రస్తుతం తన కడుపు నిండడమే ముఖ్యం అనుకుంటాడు పేదవాడు. అతనికి యీ రోజు అన్నం పెట్టి రేపటిదాకా బతికి వుంచడం ముఖ్యం.' అని వాదించారు. అది అందర్నీ ఆకట్టుకుంది. దాంతో కాంగ్రెసు కూడా కంగారు పడి, ఎన్నికలకు ముందు కిలో రూ.1.90కే యిచ్చింది. ఏది ఏమైనా పథకం ఎన్టీయార్‌ది కాబట్టి, ఆ పథకం ఆయన పేరుతోనే వినుతి కెక్కింది. దానికి వచ్చిన పేరుతో ఎన్టీయార్‌ మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వీటికి డబ్బెక్కణ్నుంచి వస్తుంది? అని అడిగితే పెద్దవాళ్ల పొట్టకొడితే డబ్బులు అవే రాల్తాయి వంటి సినిమా డైలాగులు చెప్పేవారు.

ఇలాటి డైలాగులు సభలో చప్పట్లకే పనికి వస్తాయి తప్ప ఆచరణలో జరిగేవి కావు. అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో తలపెట్టినా, పెద్దవాళ్లు హై క్లాసు లాయర్లను, ఆడిటర్లను పెట్టుకుని  కేసులు వాదిస్తారు, లంచాలతో అందర్నీ కొనేస్తారు. కొన్ని కేసుల్లో ఓడిపోయి ఆస్తులు అప్పగించినా, అవి ఋణాలిచ్చిన బ్యాంకులకు, కార్పోరేషన్లకు పోతాయి తప్ప పేదవాడికి అన్నం పెడతాననే రాష్ట్రప్రభుత్వాలకు రావు. ఇది తెలిసి కూడా నాయకులు సభల్లో యిలాటి కబుర్లు చెపుతూనే ఉంటారు. 2014 ఎన్నికలలో కూడా రైతు ఋణమాఫీకి డబ్బులెక్కడివి అని అడిగితే టిడిపి నాయకులు 'జగన్‌ లక్ష కోట్లు ఉన్నాయిగా, అవి పట్టుకుని వచ్చి యిలా పంచేస్తాం' అని జవాబిచ్చారు. కేసుల్లో యిరుక్కున్నది లక్షకోట్లూ కాదు, యిప్పటిదాకా రానూ లేదు, కేసులకు అతీగతీపురోగతీ లేదు, పోనీ జగన్‌ ఆర్థిక నేరాలపై ఐదేళ్లలో బాబు కొత్తగా కేసులేమైనా పెట్టారా అంటే అదీ లేదు. లక్ష్మీనారాయణ గారి సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకుని ఆ సిబిఐ కేసుల మీదే ఆశలు పెట్టుకున్నారు. అవి చూస్తే నీరుగారి పోతున్నాయి.

డబ్బు మాది, పేరు మీదా? - చెప్పవచ్చేదేమిటంటే - సంక్షేమ పథకాలు నిధులు ఓ పట్టాన రావు. నెగ్గినవారు కేంద్రం యిస్తుందనుకుని హామీ యిచ్చాం అని చెప్తారు. 'మేమిచ్చిన నిధులతో పథకం పెట్టి మా పేరు పెట్టకుండా మీ పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు, మీ యిమేజి పెంచడానికి మేమెందుకు నిధులివ్వాలి?' అంటుంది కేంద్రం! 'అవేమన్నా మీ నిధులా? మేం సేకరించి పంపినవే కదా?' అని రాష్ట్రం అడుగుతుంది. అది నిజమే, కానీ నియోజకవర్గాల్లో నాయకులు కూడా యిదే ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవచ్చు కదా. మేం సేకరించి పంపే పన్నులే కదా, మరి నిధుల పంపిణీలో పాలక పక్ష ప్రాంతాలకు, విపక్ష పాలక ప్రాంతాలకు వివక్షత ఎందుకు? అని. సంక్షేమ పథకాలు ప్రారంభించడం సులభం కానీ ఆపడం అతి కష్టం. ఊరికే డబ్బు తీసుకోవడం మరిగాక, వదులుకోవడానికి జనాలకి మనసు రాదు. ఆపేస్తే కోపం తెచ్చుకుంటారు కూడా. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువకుడు, ఉద్యోగం వచ్చినా ప్రభుత్వానికి సమాచారం యివ్వడు. 'ఇంతకంటె మంచి ఉద్యోగం వచ్చాక అప్పుడు చెప్తా, ఇది చిరుద్యోగం, జీతం చాలటం లేదు' అని తనకు తాను సర్దిచెప్పుకుంటాడు. ప్రభుత్వమే కనిపెట్టి భృతి ఆపేస్తే కసిపడతాడు.

ఎన్టీయార్‌ రెండు రూపాయలకు కిలో బియ్యం పెట్టినపుడు, మార్కెట్లో బియ్యం కిలో మూడున్నరో ఎంతో ఉండేదనుకుంటా. ఇప్పుడు 50-60 మధ్య ఉంటోంది. ఇప్పుడు కూడా రూపాయికి కిలో బియ్యం పథకం ఉన్నట్టుంది. మార్కెట్‌ ధరలో సగం అనే కొలబద్ద పెట్టుకుని ఉంటే కొంత సమంజసంగా ఉండేది. అది లేదు, వాళ్లు రెండు రూపాయలన్నారు కదా, మేము రూపాయికే యిస్తాం అని పోటీపడి యిచ్చిన వ్యవహారమిది. సినిమా టిక్కెట్టుకి 30 రూ.లు ఖర్చుపెట్టే పేదవాడు బియ్యానికి రూపాయికి మించి ఖఱ్చు పెట్టలేడా? అది తీసుకోవడానికి రేషన్‌ షాపుకి వచ్చేవాళ్ల దుస్తుల బట్టి అంచనా వేయవచ్చు,

వీళ్లకు యీ స్కీముకి అర్హత ఉందో లేదో! కానీ ఏ ప్రభుత్వమూ యిలా ఆలోచించడం మానేసింది. ప్రాంతీయ పార్టీలలో చాలా భాగం సంక్షేమ పథకాలతో, కులపరమైన ఓటు బ్యాంకులతో అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీలకు సవాలు విసరడంతో, అవీ యీ బాట పట్టాయి. తాము ఏలుతున్న రాష్ట్రాలలో యిలాటి పథకాలే పెట్టసాగాయి. ప్రజలకు అవసరం, ప్రభుతకు అవకాశం ఉన్నాయో లేదో లెక్కలు వేసుకోకుండానే ఎడాపెడా సంక్షేమానికి బజెట్‌ కేటాయింపులు పెంచుతూ పోయారు.

కొత్తగా వాదించిన చంద్రబాబు - ఇవి చూసి ఆలోచనాపరులు విసిగి వేసారిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీయార్‌లా సంక్షేమ పథకాలతో ఆకట్టుకునే రకాన్ని కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో అభ్యుదయ పథంలో నడిచే ఆధునికుణ్ని అని చెప్పుకున్నారు. 'పేదవాడికి చేప నిచ్చే బదులు, చేపలు పట్టుకునే నైపుణ్యం నేర్పిస్తే చాలు, అతని బతుకు అతనే బతుకుతాడు' వంటి మంచి సిద్ధాంతాలు వల్లించారు. రోడ్ల విస్తరణ, ఆర్థిక సరళీకరణ, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు వంటి ఎన్నో పనులు చేపట్టారు. అయితే యిబ్బంది ఎక్కడ వచ్చిందంటే ప్రపంచ బ్యాంకు చెప్పినది తుచ తప్పకుండా చేసి, వారి మెప్పు సంపాదించారు కానీ, స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో తూకం తప్పారు.

విద్యుత్‌ సంస్కరణలు ఒకేసారి చేపట్టడంతో ఆ ధాటికి ప్రజలు తట్టుకోలేక పోయారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలై పోయినా, దాన్ని పట్టించుకోకుండా వ్యవసాయం దండగ, మీరంతా మీ పిల్లల్ని కంప్యూటరు ఆపరేటర్లను చేయండి అని పిలుపు నిచ్చారు. స్థానిక నాయకులు ప్రజల గోడును వినిపించినా బాబు పట్టించుకోలేదు. మీకేమీ తెలియదు, నేను ముందుకు దూసుకుపోతుంటే, మీరు పాతరాతి యుగం మాటలు మాట్లాడుతున్నారు అని విదిలించేశారు. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం బట్టి, ఆయనకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసే వుంటాయి. అయినా ప్రజలను మభ్య పెట్టడానికి తన చేస్తున్న ప్రచారపు హోరులో తనూ కొట్టుకుపోయారు. ప్రపంచ బ్యాంకు కితాబులు, పారిశ్రామిక వేత్తల ఆహాఓహోలు - యివన్నీ ఒక మత్తులో ముంచాయి.

వైయస్‌ ఉచిత విద్యుత్‌ హామీ - ప్రజల హాహాకారాలు వైయస్‌ చెవిన పడ్డాయి. జ్యోతి బసులా పాతికేళ్లు ఏకధాటీగా పాలించేస్తానంటున్న బాబు కవచంలో బీటలున్నాయని, వాటిలో విద్యుత్‌ బీట మరీ పెద్దదనీ గుర్తించిన వైయస్‌ ఉచిత విద్యుత్‌ హామీతో ముందుకు వచ్చారు. 'అది అసంభవం, అలా యిస్తే ఆ తీగల్లో కరంటు రాదు, బట్టలు ఆరేసుకోవడానికి తప్ప అవి మరెందుకూ పనికి రావ'ని కొట్టి పడేశారు బాబు. కానీ వైయస్‌ నేతృత్వంలో కాంగ్రెసు నెగ్గింది. తను అప్రతిష్ఠ పాలైనది, వైయస్‌కు ఓట్లు కురిపించినది ఉచిత విద్యుత్‌ పథకమే అనే భ్రమలో పడిపోయారు బాబు. అప్పణ్నుంచి తన ఆధునిక విధానాలను మార్చుకున్నారు. 'ఉచిత' హామీలనే నమ్ముకున్నారు. వైయస్‌ కూడా హామీలు, పథకాలే నమ్ముకున్నారు. వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తే తప్ప భవిష్యత్తు లేదని గ్రహించి జలయజ్ఞం మొదలుపెట్టినా, పని మొదలు పెట్టడానికి ముందే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ ఎడ్వాన్సులు యిచ్చేసి దాన్ని ధనయజ్ఞంగా మార్చేశారు. జరగవలసినంత పని జరగలేదు. అది పూర్తయ్యేలోపున ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వగైరా సంక్షేమ పథకాలపైనే పడ్డారు.

బాబులో మార్పు - 2009 వచ్చేసరికి బాబులో గతకాలపు బాబు కనబడలేదు. 'ఉచిత నగదు బదిలీ' బాబు ముందుకు వచ్చారు. కానీ ప్రజలు వైయస్‌నే గెలిపించారు. పదేళ్లగా ప్రతిపక్షంలో ఉండడంతో 2014 వచ్చేసరికి బాబులో మరింత కసి పెరిగింది. రైతు ఋణమాఫీ, కాపు రిజర్వేషన్లతో సహా అనేక హామీలు ఎడాపెడా గుప్పించేశారు. 600 పై చిలుకు ఉన్నాయంటారు, నేను లెక్కపెట్టలేదనుకోండి. కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు, పైగా కేంద్రంతో సత్సంబంధాలున్న నాయకుడు ఉంటే మంచిదనుకున్నారు కాబోలు ప్రజలు గెలిపించారు.

అయితే జగన్‌ అలా అనుకోలేదు. ఋణమాఫీ హామీ యిచ్చి బాబు గెలిచారు, యివ్వక తను ఓడానని అనుకుంటున్నారు. తన తండ్రికి వచ్చిన పాప్యులారిటీ అంతా సంక్షేమ పథకాల వలననే వచ్చిందనే భావంలో పడ్డారు. నేను అధికారంలోకి వస్తే అదిస్తా, యిదిస్తా అనడం సాగించారు. బాబుకీ అదే నమ్మకం. ఎంత పెద్ద హామీ యిస్తే, అన్ని ఓట్లు వస్తాయని. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కెసియార్‌ భారీగా నెగ్గడంతో ఆ గెలుపుకీ పథకాలే కారణమని వీళ్లిద్దరూ నమ్ముతున్నారు. ఇక పోటీలు పడి తాయిలాలు ప్రకటిస్తున్నారు. పవన్‌ కూడా వెనకబడ దలచుకోలేదు. తనూ గుప్పిస్తున్నాడు.

అంతకింతైతే ఇంత కెంత? - ఈ హామీ వెర్రి ఎంతవరకు పోయిందంటే బాబు మొన్న అంటున్నారు - 'రెండు వేల పెన్షనిస్తానన్నందుకు కెసియార్‌కు 88 సీట్లు వస్తే, మూడు వేల పెన్షన్‌ యిస్తానన్నందుకు నాకెన్ని రావాల? 175!' అని. వెయ్యికి 44 సీట్లనుకుంటే, మూడు వేలకు 132 రావాలి కానీ 175 ఎలా అయ్యాయి? నాకు అర్థం కాలేదు. అంతకింతైతే యింత కెంత? అనే సామెత ఉంది. దాని వెనుక ఒక నీతి ఉంది కూడా - పాపపుణ్యాల్లో అలాటి లెక్కలు వుండవు అని. తెరాసకు 88 రావడానికి పెన్షన్లు ఒక్కటే కారణమని బాబు ఎలా అనుకున్నారో తెలియదు.

2014కు ముందు ఋణమాఫీ హామీ ఎలా సాధ్యం అని జర్నలిస్టులు అడిగితే సాధ్యమే అని టిడిపి ప్రతినిథి కుటుంబరావుగారు బల్ల గుద్ది చెప్పారు. ఆ తర్వాత ఆ పథకానికి అనేక ముళ్లు వేసి, భారం తగ్గించేశారు. ఉన్న పథకాలకే డబ్బుల్లేక పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిస్తున్నారు. పసుపు కుంకుమలకు యిచ్చే నిధులు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాను నుంచి లాగుతున్నారంటున్నారు. మరి పెన్షను పెంచితే దేనికి కన్నం పెడతారో తెలియదు.  ఇప్పుడు చెపుతున్న హామీలకు కూడా పక్కన చిన్నగా చుక్కలు పెడతారు. ఎన్నికలయ్యాక 'చుక్కకు వివరణ కింద రాశాం, చదువుకోండి' అంటారు. అక్కడ 'అర్హులకు మాత్రమే' అని ఉంటుంది. ఆ అర్హత ఏమిటో వారు అప్పుడు చెప్తారు.

హామీలు సాధ్యమో కాదో చెప్పడమెలా? - నాకు చాలా మంది మెయిల్సు రాస్తున్నారు - బాబు/జగన్‌/పవన్‌ యిస్తున్న హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని. రాసేవాళ్లు ముగ్గురి పేర్లూ రాయరు. తమకు యిష్టం లేని వారి పేరు మాత్రమే రాస్తారు. ఆర్థిక నిపుణులుగా పేరు తెచ్చుకున్నవారు సైతం, రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఎడాపెడా అబద్ధాలు ఆడేస్తున్నపుడు, తప్పుడు సమాచారం యిస్తున్నపుడు నా బోటి సామాన్యుడు సమాధానం ఎలా చెప్పగలడు? ఎన్నో ఏళ్లగా నా వ్యాసాల ద్వారా చర్చిస్తున్నాను. ఏ పార్టీ కూడా బజెట్‌లో యింత శాతం ఫలానా దానికి కేటాయిస్తాం అని ఎందుకు చెప్పదని అడుగుతున్నాను.

ఓట్ల కోసం నాయకుడు ఓ నదీతీరానికి వెళ్లాడనుకోండి. అక్కడ చేపలు పట్టేవాళ్లు కనబడతారు, నేను గెలిస్తే వాళ్ల కోసం ఓ కార్పోరేషన్‌, ఏటా వెయ్యికోట్ల నిధులు అందిస్తాను అంటాడు. చూపు పక్కకు తిప్పగానే అక్కడ స్నానాలు చేస్తూ, మంత్రాలు చదివేవారు కనబడతారు. వాళ్లకీ ఏటా వెయ్యి కోట్ల కార్పోరేషన్‌  అంటాడు. చూపు గట్టు మీదకు సారిస్తే బట్టలు ఉతికి ఆరేసేవాళ్లు కనబడతారు, వాళ్లకీ వెయ్యికోట్లు..! వయసులో ఉన్న ఆడపిల్ల కనబడితే పెళ్లిళ్లకు వెయ్యేసి కోట్లు, ముసలాయన కనబడితే పెన్షన్లకు వెయ్యి కోట్లు... ఇలా వెయ్యేసి కోట్లు ఎన్ని ఎంతమందికి యివ్వగలరు చెప్పండి. సమాజంలో ఏ వర్గాన్నీ, ఏ వయస్సు వాణ్నీ వదలడు.  అందర్నీ విడివిడిగా చూసి, విడివిడి హామీలు యిచ్చేస్తారు తప్ప అందర్నీ కలివిడిగా చూసి, అందరికీ పనికి వచ్చే మంచి ఆసుపత్రి కట్టిస్తా అనడు. ఎందుకంటే చేతికి డబ్బిస్తేనే ఓటరు మురుస్తాడని యితని నమ్మకం.

బజెట్‌లో శాతాలు చెప్పమనండి చాలు - ఏ పార్టీ ఐనా 'మా ప్రభుత్వాదాయం వంద రూపాయలైతే దానిలో ఉద్యోగుల జీతభత్యాలకు 40 రూ.లు పోతాయి, పాత ఋణాల వడ్డీలకు రూ.15 పోతాయి, నడుస్తున్న ప్రాజెక్టులకు కేటాయింపులకై రూ.10 పోతాయి, నడుస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపుకు రూ.20 పోతాయి, ఏదైనా విపత్తు వస్తే అవసరపడే ఆపత్కాల నిధికై రూ.5 పోతాయి, తక్కినది రూ.10 మాత్రమే. దానితో కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. దానిలో ఎ వర్గానికి రూ.1, బి వర్గానికి 2, సి వర్గానికి అర్ధరూపాయి... యిలా చెప్తాయా? చెప్తే మనకు వచ్చేదేమిటో ముందే తెలిసిపోతుంది కదా!

ఎంత తర్కించి అడిగినా వీళ్లు చెప్పరు. 'ఇప్పటి ఆదాయం బట్టి మీరు లెక్కలు వేసి, వెయ్యి కోట్లు ఎక్కణ్నుంచి తెస్తామని అడుగుతున్నారు. మేం పన్ను వసూళ్లు బాగా చేసి, ఆదాయం పెంచుతాం' అంటారు. బజెట్‌ సమర్పించేందుకు ముందు రోజు యిచ్చే గణాంకాలు చూడండి. అంచనాలకు, వాస్తవాలకు తేడా తెలుస్తుంది - 'ఈ ఏడాది యింత వస్తుందనుకున్నాం, కానీ ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు దెబ్బ తిని, వ్యవసాయ ఆదాయం తగ్గింది, వ్యాపారస్తుల వద్ద నుంచి రావలసినది కోర్టు కేసుల్లో నలుగుతోంది. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు' అని ఉంటుంది ఆ నివేదికలో. అయినా వీళ్లు చిత్తమొచ్చినట్లు వాగ్దానాలు చేసేస్తూనే ఉంటారు.

అమలు చేయకపోవడానికి చెప్పే సాకులు - ఈ వాగ్దానాలు నమ్మి ఓట్లేశారనుకోండి, వీళ్లు అధికారంలోకి రాగానే మొదటగా చెప్పేది - పాతవాళ్లు ఖజానా ఖాళీ చేశారు, పరిస్థితి యింత ఘోరంగా ఉందని మేం ఊహించలేదు. పందికొక్కుల్లా మేసి పారిపోయారు, వాళ్లను పట్టుకుని డబ్బు కక్కించి, హామీలు అమలు చేస్తాం. కొన్నాళ్లు పోయాక చెప్పేది - పందికొక్కులు ఫైళ్లు కొరికేసి పారిపోయాయి. వాళ్ల అవినీతికి ఆధారాలు దొరకటం లేదు. మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్లను పట్టుకునేదాక మేం విశ్రమించేది లేదు. ఇంకొన్నాళ్లు పోయాక, ఆ అవినీతి ముద్ర పడిన మంత్రి వీళ్ల పార్టీలో చేరిపోతాడు. ఇక దాని గురించి మాట్లాడరు.

ప్రజలు వాళ్ల పనిలో వాళ్లు పడివుంటారు. ఫలానా హామీ ఏమైంది అని అడగరు. ఒకవేళ పాత పార్టీయే అధికారంలోకి వచ్చిందనుకోండి, వాళ్లు చెప్పే కారణాలు - 1. మనపై అసూయతో కేంద్రం సహకరించటం లేదు, ఫైళ్లు దిల్లీలో మూలుగుతున్నాయి, ప్రత్యేక విమానాలు వేసుకుని ముప్ఫయి సార్లు వెళ్లి వచ్చా, ఎపాయింట్‌మెంట్‌ యివ్వలేదు 2. సంక్షేమ పథకాలకు అధికారులు అడ్డుపడుతున్నారు, వాళ్ల మైండ్‌సెట్‌ మారుస్తున్నాం 3. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, మీకు మేలు జరిగితే మాకు పేరొస్తుందనే  భయంతో అడ్డుపుల్లలు వేస్తున్నాయి. పథకాలు సరిగ్గా అమలు కావటం లేదంటూ, నిధుల వితరణలో పక్షపాత ధోరణి ఉందంటూ కోర్టుకి వెళ్లి స్టే తెచ్చారు. మేమేం చేయగలుగుతాం? వచ్చే ఎన్నికల్లో వాళ్లని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పండి.

ఓట్లకీ, యీ పథకాలకూ లింకుందా? - ఈ టెక్నిక్కులన్నీ ఓటర్లు చూస్తూనే ఉన్నారు. అయినా హామీలను నమ్మి ఓట్లేస్తారా? అనేది ప్రశ్నార్థకం. నమ్మరు, వెయ్యరు అని యితమిత్థంగా చెప్పడమూ కష్టమే. ఎవరు ఎందుకు గెలుస్తున్నారో స్పష్టంగా తెలియక పోవడం చేతనే, నాయకులు యీ తాయిలాల బాట పట్టారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల గురించి మాట్లాడడమే మానేశారు. విదేశీయులెవరైనా యీ ప్రచార ధోరణిని గమనిస్తే, యీ ఓటర్లు ఉచితాల గురించి దేబిరించే ముఖాలన్నమాట, 'ప్రభుత్వం చేయూత నిస్తే చాలు, మేమే కష్టపడి సంపాదించుకుంటాం' అనే ధైర్యం వీళ్ల కెంత మాత్రం లేదన్నమాట అని చులకనగా చూస్తారు. అదీ దౌర్భాగ్యం!

తమాషా ఏమిటంటే యితర దేశాల్లో అభ్యర్థుల మధ్య చర్చావేదిక పెడతారు. ఓటర్లు మీరు చెప్పిన హామీ ఎలా అమలు చేస్తారు? అని సూటిగా అడుగుతారు. మన దగ్గర అలాటిది వుండదు. ఏ టీవీయైనా ఏర్పాటు చేసినా, వీళ్లు 'చిత్తశుద్ధి వుంటే ఏదైనా సాధ్యమే' అనేసి తప్పించుకుంటారు తప్ప, గణాంకాలతో సమాధానం చెప్పరు. ఎందుకంటే వాళ్లకూ గణాంకాలు తెలియవు. తెలిసిన గణాంకాలేవైనా ఉన్నాయా అంటే ఏ నియోజకవర్గంలో ఏ కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేవి మాత్రమే. అవి కూడా కచ్చితంగా ఉండవు. ఎందుకంటే కులపరమైన జనాభా లెక్కలు యిప్పటిదాకా రాలేదు. నెగ్గాక కూడా ఏ కారణం చేత నెగ్గామో తెలియక ఏ హామీ అమలు చేయాలో అర్థం కాక ఎందుకైనా మంచిదని ఏదీ అమలు చేయరు కాబోలు!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2019)
mbsprasad@gmail.com