cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఫ్రాయిడ్‌ చేసిన సైకోఎనాలిసిస్

ఎమ్బీయస్‌: ఫ్రాయిడ్‌ చేసిన సైకోఎనాలిసిస్

ఆధునిక మనోవిశ్లేషణా (సైకో ఎనాలిసిస్‌) శాస్త్రానికి ఆద్యుడని చెప్పదగిన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ (1856-1939) ఆస్ట్రియా దేశంలో న్యూరాలజిస్టుగా పనిచేశాడు.  పేషంటుతో మాట్లాడి అతని మానసిక రుగ్మతలను, మనసు కారణంగా కలిగే శారీరక రుగ్మతలను నయం చేసే వైద్యప్రక్రియను ప్రారంభించి, ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. 1881లో వియన్నా యూనివర్శిటీ నుంచి మెడికల్‌ డాక్టర్‌ అయ్యాడు. అక్కడే న్యూరో పెథాలజీలో లెక్చరరు అయ్యాడు, తర్వాత 1902లో ప్రొఫెసర్‌ అయ్యాడు. వియన్నాలోనే 19886లో క్లినికల్‌ ప్రాక్టీసు చేసేవాడు. 1938లో జర్మన్లు ఆస్ట్రియాను ఆక్రమించడంతో జన్మతః యూదుడైన ఫ్రాయిడ్‌ ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆయన ఇంగ్లండు పారిపోయాడు. అక్కడ వుండగానే 1939లో పోయాడు.

వైద్యపరిభాషలో ఉండే ఆయన సిద్ధాంతాలను వివరించడం కష్టం. అయినా ఆయన ఏయే అంశాల గురించి చెప్పాడో తెలుసుకుందాం. బాల్యంలో మనకు కలిగే అనుభవాలు పెద్దయ్యాక మనపై ఎలా ప్రభావం చూపుతాయో చెప్పాడు. తరతరాలుగా మనలో వున్న విశ్వాసాల కారణంగా, మన పెద్దలు మాట్లాడే మాటల కారణంగా, మనలో గూడు కట్టుకునే భయాల గురించి చెప్పాడు. అణచివేతకు గురైన మనోభావాలు ఏ విధమైన వికృతపు ఆలోచనలకు దారి తీస్తాయో చెప్పాడు. మన కలలను విశ్లేషించాడు. మనసులో ఎలాటి కోర్కెలు, భయాలు ఉంటే, ఎలాటి కల వస్తుందో చెప్పాడు. సెక్స్‌ అనేది మన భావాలను, భయాలను, యిష్టానిష్టాలను ఎలా శాసిస్తుందో చెప్పాడు. 

ఇవన్నీ తొలిసారి విన్నపుడు ఛ, ఛ, అలా ఏమీ కాదు, ఈయనేదో గాలిలోంచి కథలు అల్లేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సిద్ధాంతాల్లో కొన్ని మనకు భయం కొల్పుతాయి, జుగుప్స కలిగిస్తాయి. నిరాకరించ బుద్దేస్తాయి. అందుకే సంఘం ఆయనను మొదట ఆమోదించలేదు. తీవ్రమైన చర్చలు జరిగాయి. ఖండనమండనలు జరిగాయి. తన సిద్ధాంతాల ఆధారంగా ఆయన క్లినికల్‌గా ఫలితాలు చూపగలగడంతో అందరూ విధిలేక నమ్మవలసి వచ్చింది. ఆయనకు శిష్యులు ఏర్పడ్డారు. వారు ఈయన బాటలో ముందుకు వెళ్లి, సరికొత్త ప్రయోగాలు చేశారు. కొందరు కొన్ని విషయాలలో యీయనతో విభేదించారు.

సైన్సు మాత్రమే కాదు, ఏ శాస్త్రమూ ఎన్నడూ స్థిరంగా వుండదు. థీసిస్‌ (ప్రతిపాదన), యాంటీథీసిస్‌ (దానికి వ్యతిరేకమైనది), సింథసిస్‌ (ఈ రెండిటినీ సమన్వయం చేసుకునేది) వుంటాయని, జ్ఞాన సముపార్జనకు యిదే మార్గమని జర్మన్‌ డయలెక్టికల్‌ మెథడ్‌ (గతితార్కికవాదం) అంటుంది. దీనికి ఉదాహరణగా శ్రీశ్రీ వేమన పద్యాన్ని ఉటంకించారు. ‘ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు’ అనేది థీసిస్‌. రెండో పంక్తి ‘చూడచూడ రుచుల జాడ వేరు’ అనేది యాంటీథీసిస్‌. అంటే పోలికలు ఒక్కటేగా వున్నంత మాత్రాన అవి రెండూ ఒకటి కాదు, రెండిటిలో తేడా వుంది. రుచి చూస్తే తెలిసిపోతుంది అని ప్రతివాదన చేస్తోంది. ‘పురుషుందు పుణ్యపురుషులు వేరయా’ అనేది సింథసిస్‌.

వస్తువులు చూడడానికి ఒకేలా కనబడుతున్నా, వాటి గుణాల్లో తేడా వుంటుంది. కొన్ని విశిష్టమైనవి, కొన్ని సాధారణమైనవి. అలాగే మనుషులందరూ పైకి ఒకేలా వున్నా, వారిలో కొందరు మహానుభావులు వుంటారు. వారి గుణాలు మిన్నగా ఉంటాయి. అని కన్‌క్లూడ్‌ చేయాలి. ఇప్పుడు నేననేది ఏమిటంటే ఈనాటి సింథసిస్‌ కొన్నాళ్లకు థీసిస్‌గా మారుతుంది. మళ్లీ దానికి యాంటీథీసిస్‌, సింథసిస్‌ పుట్టుకుని వస్తాయి. అందుకే జ్ఞానసముపార్జన అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. జ్ఞానమనేది వేదాలతోనో, కార్ల్‌ మార్క్‌స్‌తోనో ఆగిపోదు.

వేదాల తర్వాత వేదాంగాలైన ఉపనిషత్తులు వచ్చాయి. వాటికి వేర్వేరు వ్యాఖ్యానాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆదిశంకరుడు, ఆనంద కుమారస్వామి, వివేకానందుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వారు వాటికి సవరణలు ప్రతిపాదిస్తూనే వచ్చారు. కొందరు మూఢ కమ్యూనిస్టు మార్క్స్‌ వద్ద, లెనిన్‌ వద్ద ఆగిపోయి, అవే సిద్ధాంతాలు వల్లిస్తూ ఉంటారు. అక్కణ్నుంచి కదిలి రాకుండా వాటి ఆధారంగా నేటి సమాజాన్ని విశ్లేషించ బూనుతారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఆ కొలబద్దలు పనికి రావని గ్రహించరు.

ఇదంతా ఎందుకు చెప్పానంటే ఫ్రాయిడ్‌ చెప్పినదే వేదమని అనడానికి లేదు. సమాజ స్థితిగతులు మారుతుంటే దానికి అనుగుణంగా మానవస్వభావం కూడా మారుతూ రావచ్చు. అందువలన ఫ్రాయిడ్‌ను చదివి, తర్వాతి వారినీ చదివి, ఎప్పటికప్పుడు సిద్ధాంతాలను రివైజ్‌ చేసుకుంటూ పోవాలి. ఇది ఒక డైనమిక్‌ ప్రాసెస్‌. అయితే సైకో ఎనాలిసిస్‌ తెలుసుకోవాంటే మౌలికంగా ఫ్రాయిడ్‌ ఏం చెప్పాడో తెలుసుకుని తీరాలి. ఆ పునాది లేకుండా సవరణలు చేయడం అసాధ్యం. ఇప్పటిదాకా ఫ్రాయిడ్‌ గురించి తెలియనివారి కోసం యివి రాస్తున్నాను. ఇది మిడిమిడిజ్ఞానంతో చేస్తున్న రేఖామాత్రపరిచయం మాత్రమే. ఆసక్తి కలిగితే పూర్తి పుస్తకాలు చదవవచ్చు.

మామూలుగా అయితే మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయి, కాలేయం, ప్లీహం ఒకదానికి మరొకటి ఎంతదూరంలో ఉంటాయి అని తెలుసుకోవడానికి పుస్తకాలు చదవం. కానీ మనసు వేసే కుప్పిగంతుల గురించి, కోతిచేష్టల గురించి చదవడం సరదాగానే ఉంటుంది. పైకి ఎంత పెద్దమనుషుల్లా ఉన్నా మనకు ఎలాటి దురూహలు, కొంటె ఆలోచనలు వస్తాయో మనకు తెలుసు. అలా ఎందుకు వస్తాయో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండడం సహజం. అయితే యీ పుస్తకాలు చదివేటప్పుడు తటస్థభావంతో చదవాలి. సాధారణంగా వైద్యపుస్తకాలు చదువుతూంటే ఏ రోగం గురించి చదివినా, ఆ రోగలక్షణాలన్నీ మనలో గూడుకట్టుకుని వున్నాయనుకుని కంగారు పడతాం. అలాటిదే దీనిలోనూ జరగవచ్చు. నీ మనసులో ఫలానా వికారం ఉంది, దానికి కారణం యిది అని ఫ్రాయిడ్‌ చెప్పాడనుకోండి, అది ఒప్పుకోవడానికి యిష్టపడక ‘ఈయనవన్నీ విపరీతమైన వాదనలండి’ అని నిరాకరించడమూ సబబు కాదు.

మీరు మానియాల గురించి, ఫోబియాల గురించి వినే వుంటారు. మానియా అంటే వేలంవెర్రి లాటిదన్నమాట. మెగాలోమానియా అంటే ఏదైనా గ్రాండ్‌గా, భారీగా చేయాలన్న పిచ్చి అన్నమాట. తనను తాను చాలా ఘనుడిగా ఊహించుకోవడం కూడా దీని కిందే వస్తుంది. క్లెప్టోమానియా అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా, వస్తువు చిన్నదైనా సరే సరదాకొద్దీ దొంగిలించడ మన్నమాట. నింఫోమానియా అంటారు, సింపుల్‌గా చెప్పాలంటే మదపిచ్చి. లైంగికవాంఛ హెచ్చు మోతాదులో ఉండడం. వీటన్నిటికి చిన్నతనంలో ఎదుగుదలలో కలిగిన హెచ్చుతగ్గుల వలన వచ్చాయని ఫ్రాయిడ్‌ అంటాడు.
అబ్లూటోమానియా అని ఉంటుంది. మాటిమాటికీ కడుక్కోవడ మన్నమాట. ఒక స్త్రీ తన జననాంగాన్ని మాటిమాటికీ నీళ్లతో కడుక్కుంటోందంటే, ఆమె పాపం చేసి వుంటుందని, పాపభీతితో శుద్ధి చేసుకోవాలనే తాపత్రయంతో కడుక్కుంటోందని ఫ్రాయిడ్‌ ప్రతిపాదన. ఛ, ఛ ఆవిడకు ఆచారం ఎక్కువ, ఆరోగ్యం పట్ల చాదస్తం ఎక్కువ, అందువలన కడుక్కుంటుందేమో, యీయన దేనికిదేనికో ముడిపెట్టేస్తున్నాడు అనిపిస్తుంది.

ఒక స్త్రీ యిష్టమైన మొగాడితో ఒంటరిగా మాట్లాడుతూ వేలికున్న ఉంగరాన్ని తీసి మాటిమాటికీ తీసి తొడుక్కుంటోందంటే ఆమె అతనితో లైంగికానుభవం కోరుకుంటోందని అర్థం అని ఒక ప్రతిపాదన. అది ఆమె అలవాటేమో అని కొట్టి పారేయవచ్చు. లేదా ఫ్రాయిడ్‌ చెప్పినట్లు ఆమె మనసు ఆ దిశగా ఆలోచిస్తోందేమో, ఆ విషయం మనసు పొరలలో దాగుండి ఆమెకే తెలియదేమో. ఇది చూసి ఆ అబ్బాయి తొందరపడి, ప్రపోజ్‌ చేస్తే ఆ అమ్మాయి ఛీ కొట్టవచ్చు కూడా. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు చైతన్యస్థితిలో వుండవు. సుప్తచైతన్యావస్థలో ఉంటాయి. ఎవరైనా హిప్నటైజ్‌ చేయగలిగితే అవి బయటకు రావచ్చు.

అలాగే ఫోబియా (భయాలు) వుంటాయి. నీళ్లంటే భయం, నిప్పంటే భయం లాటివి సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కోరికి క్లాస్ట్రోఫోబియా అంటే తలుపులు మూసేసిన గదులంటే భయం. చిన్నప్పుడు వాళ్ల నాన్న బాగా దండించి తలుపులు మూసేసిన చీకటి గదిలో గంటల తరబడి పెట్టాడేమో, ఆ భయం అలా వుండిపోయిందేమో అంటాడు ఫ్రాయిడ్‌. మనలో చాలామందికి జెనోఫోబియా ఉంటుంది. అంటే కొత్తదంటే భయం. కొత్త ప్రదేశమైనా, కొత్త ఆలోచనలైనా, కొత్త పద్ధతన్నా భయమే. కారణం, చిన్నపుడు మనం ఏదో కొత్త తరహాగా పనిచేయబోతే తిట్లు, దెబ్బలు తిన్నామేమో. లేదా ఆప్తమిత్రుడు ఆ బాటలో వెళ్లి గాయపడ్డాడేమో!

బాగా చిన్నవయసులో వున్న పిల్ల అనుకోకుండా యింట్లో పెద్దవాళ్ల శృంగారం చూసి, ఆ తీవ్రమైన కదలికలు, కేకలు, మూలుగులు విని అది బాధాజనక అనుభవంగా భ్రమపడి వుండవచ్చు. యుక్తవయసు వచ్చాక సెక్స్‌ అంటే భయం పెంచుకోవచ్చు. ఇలా కారణాలు వెతకడం పెద్ద పనే. అవి డాక్టర్లు చేస్తారు. ఇలాటివి కూడా ఉంటాయి అని తెలుసుకోవడం వరకే మన పని. తెలుసుకుంటే యిలాటి వింత ప్రవర్తనలు ఎదురైనపుడు భూతవైద్యుణ్ని పిలవకుండా, సైకియాట్రిస్టు దగ్గరకు వెళితే మంచిదని సలహా యిస్తాం.

ఇప్పుడు ఫ్రాయిడ్‌ సిద్ధాంతాల్లో ఒకటి - వ్యక్తిత్వానికి ఉండే ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో త్రయీ గుణ సిద్ధాంతం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. వైద్యపాఠ్య పుస్తకాల్లో తెలుగులో వాటిని ఏమంటారో నాకు తెలియదు. ఇంగ్లీషులో చదివి, నాకు తోచిన రీతిలో వివరిస్తున్నానంతే. మనలో మనసు, బుద్ధి, వివేకం ఉన్నాయని మనకు తెలుసు. మనసు మనం చెప్పిన మాట వినదు. లోకం ఏమనుకుంటే ఏం, నాకు తోచినట్లు చేయమని ఒత్తిడి చేస్తుంది. కోరిక తీరాలంతే, మంచీ చెడూ పట్టించుకుంటూ కూర్చోవద్దు అంటుంది. ఇలాటి దాన్ని ఇడ్‌ అంటారు.

బుద్ధి అనేదేమిటి? ఛ, మనం కోరగానే అన్నీ దక్కవు, ఇది అయ్యే పని కాదు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ప్రస్తుతానికి నోరు మూసుకో, అదను చూసి నీ కోరిక తీరుస్తాలే అని ప్రాక్టికల్‌గా మాట్లాడుతుంది. ఇక వివేకం ఏమంటుంది? ఎవడైనా చూశాడా లేదా అని కాదు, అదను దొరికిందా లేదా అని కాదు. తప్పనేది ఎన్నటికీ చేయకూడదు. కోరిక కలిగింది కాబట్టి తీర్చుకుంటా అంటే పశువుకు, మనిషికి తేడా ఏముంది? అని చివాట్లు వేస్తుంది. తప్పు జరగకుండా కాపలా కాస్తుంది. ఈ వివేకాన్నే అంతరాత్మ, అంతర్వాణి అంటారు.

వీటిని కాస్త యించుమించుగా ఫ్రాయిడ్‌ తన భాషలో చెప్పాడు. మనసు లాటి దాన్ని ఇడ్‌ అన్నాడు. బుద్ధి లాటి దాన్ని ఈగో అన్నాడు. ఆత్మగౌరవాన్ని ఈగో అంటారు.  కొంతమంది ఈగో అంటే అహంకారం అనే అర్థంలో వాడతారు. తమ కుంటే ఆత్మగౌరవం, ఎదుటివాళ్ల కుంటే అహంకారం. కానీ యిక్కడ ఆ అర్థాలు పొసగవు. వివేకాన్ని సూపర్‌ ఈగో అన్నాడు. ఈ మూడూ బ్రెయిన్‌లో విడివిడి కంపార్టుమెంట్లలో వుండవు. ఒక దాని తర్వాత మరొకటి రావు. అన్నీ ఏకకాలంలో ఉంటాయి. చిన్న వయసులో ఇడ్‌యే ప్రధానంగా వుంటుంది. వయసు వచ్చేసరికి రెండోది, మూడోది బలపడతాయి. ఇక అప్పణ్నుంచి మనిషిలో ఘర్షణ తప్పదు. మూడూ చురుగ్గా వుంటూ మనిషి ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో దేనిది పైచేయి అయితే ఆ మనిషి వ్యక్తిత్వం అలా రూపొందుతుంది.

ఇడ్‌ అనేది మనిషిలో మౌలికంగా (ప్రిమిటివ్‌గా), సహజాతంగా (ఇన్‌స్టింక్టివ్‌గా), స్వాభావికంగా ఉండే గుణం. దీనిలోనే భౌతికంగా, వంశపారంపర్యంగా వచ్చే లక్షణం ఉంటుంది, లైంగిక పరమైన స్వభావం, సెక్స్‌ ఇన్‌స్టింక్ట్‌ (దీన్ని ఫ్రాయిడ్‌ గ్రీకు శృంగారదేవుడైన ఈరోస్‌ పేరుతో వ్యవహరించాడు), చావుకి కూడా వెరవకుండా చూపే దూకుడు స్వభావం (ఎగ్రెసివ్‌ డెత్‌ ఇన్‌స్టింక్ట్‌) కూడా ఉంటాయి. మూడోదాన్ని ఫ్రాయిడ్‌ గ్రీకు మృత్యుదేవత తనాటోస్‌ పేర వ్యవహరించాడు. మనం దేన్నయినా వర్ణించాలంటే సమాజంలోని పౌరాణిక పాత్రలను ఉపయోగించుకుంటాం. భీమబలం, శల్యసారథ్యం, మంథర దుర్బోధ, దూర్వాసకోపం.. అనగానే వేరే ఏ వివరణా అక్కరలేకుండా ఛట్టున అర్థం చేసుకుంటాం.  అలాగే ఫ్రాయిడ్‌ యూరోప్‌ సంస్కృతుల పౌరాణిక పాత్రల ద్వారా తన సిద్ధాంతాలను వివరించాడు.

ఆకలి, దాహం వంటి మౌలికమైన మన దైహిక అవసరాలు, కోరికలు ఇడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఆకలి అనగానే అన్ని రకాల ఆకళ్లు వస్తాయి. శైశవంలో దీని లక్షణాలు స్పష్టంగా కనబడతాయి. పసివాడికి ఆకలి వేయగానే ఏడుస్తాడు, పాలు కాగుతున్నాయి కాస్సేపు ఆగు అంటే వినడు. పదిమంది ఎదుట ఉన్నా తల్లి స్తన్యం కోరతాడు. సిగ్గూ, శరం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తాడు, నిద్ర పోతాడు. ఎవరేమనుకుంటారో లెక్క చేయడు. వాటి ఆటబొమ్మను వేరే ఎవరికైనా పిల్లవాడికి యిమ్మంటే యివ్వడు. పక్కవాడిది నచ్చిందంటే పోట్లాడి లాక్కుంటాడు. మర్యాద, మొహమాటం లాటివి మచ్చుకు కూడా ఉండవు.

పెద్దవాళ్లే వాడికి యిలాటివి మప్పుతారు. ‘వాడు కాస్సేపు ఆడుకుని యిచ్చేస్తాడులే, యీ లోపుగా నువ్వు యింకోటి ఆడుకో’ అని నచ్చచెప్పి బలవంతాన యిప్పిస్తారు. పెద్దయ్యేసరికి వీడే నేర్చుకుంటాడు. వచ్చినవాణ్ని యీడ్చిపెట్టి తన్నమని మనసు చెపుతున్నా, పైకి నవ్వుతూ ‘ఇన్నాళ్లకు మీ దర్శనభాగ్యం కలిగింది’ అంటాడు. ఎవడైనా మనసులో మాటను యథాతథంగా చెప్పేస్తే ‘బొత్తిగా మర్యాదా, మప్పితం తెలియవండి. నలుగురిలో బతకవలసినవాడు కాదు.’ అని తీసిపారేస్తాడు.

అంటే పెద్దయ్యాక ఇడ్‌ అదృశ్యమై పోదు. కానీ దాన్ని అదుపులో పెట్టడం నేర్చుకుంటామంతే. దానికి బాహ్యప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి ఏ కోరికైనా కోరేస్తూ వుంటుంది. దానికి వాస్తవాలతో కాని, లాజిక్‌తో కాని, సామాజికపరమైన కట్టుబాట్లతో కానీ ప్రమేయం లేదు. మైండ్‌లోని అచేతన భాగంలోనే అది ఆపరేట్‌ చేస్తూ ఉంటుంది. అందువలన గొంతెమ్మ కోర్కెలు కోరుతూ వుంటుంది. దాని ఆలోచనలు చాలా ప్రాథమిక స్థితిలో వుంటాయి. తర్కానికి, వాస్తవానికి సంబంధం లేకుండా ఊహల్లో తేలుతూ వుంటాయి. ఎప్పుడు చూసినా తన సౌఖ్యం, తన స్వార్థమే.

ప్రతివాడూ తన ఇడ్‌ లేదా మనసు చెప్పినట్లు నడుచుకుంటానంటే, అంటే చిత్తమొచ్చినట్లు ప్రవర్తిస్తానంటే సమాజం మనజాలదు. అందువలన దాన్ని కంట్రోలు చేయడానికి ఈగో, సూపర్‌ ఈగో ఉంటాయి. అయితే అలా కంట్రోలు చేయడం వలన ఇడ్‌ కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. పరిణతి చెందిన మనిషి విషయంలో అవి పెద్ద సమస్యలుగా మారవు కావు కానీ చెందని మనిషిలో ఆందోళన, క్రుంగుబాటు కలిగి మానసిక రోగి అవుతాడు. ఈగో, సూపర్‌ ఈగో గురించి వచ్చే వ్యాసంలో చెప్పుకుందాం. 

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
 mbsprasad@gmail.com