cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: 'గ్లాడియేటర్‌' చారిత్రక నేపథ్యం

 ఎమ్బీయస్‌: 'గ్లాడియేటర్‌' చారిత్రక నేపథ్యం

రస్సెల్‌ క్రో హీరోగా, రిడ్లీ స్కాట్‌ డైరక్టు చేసిన ఇరవై ఏళ్ల నాటి ''గ్లాడియేటర్‌'' (2000) ఓ కల్ట్‌ సినిమా. దాని తర్వాత అలాటి సినిమాలు చాలా రావడానికి దోహదపడింది. దాన్ని ''దోజ్‌ ఎబౌట్‌ టు డై'' పేర 1958లో వెలువడిన హిస్టారికల్‌ ఫిక్షన్‌ నవల ఆధారంగా తీశారు. ఏ మేరకు చరిత్ర, ఏ మేరకు కల్పన కలిపారు అనేది ఆసక్తికరం. చాలామంది ఆ సినిమా చూసే వుంటారు. మర్చిపోయినవారి కోసం, చూడనివారి కోసం క్లుప్తంగా కథ చెపుతాను - హీరో పేరు మాక్సిమస్‌. అతను రోమన్‌ చక్రవర్తి (సీజర్‌ అంటారు) ఆరిలియస్‌ సైన్యంలో ఓ జనరల్‌. చక్రవర్తికి చాలా ఆప్తుడు. చక్రవర్తి కూతురు లూసిలాకు అతనంటే ప్రేమ కానీ ఆమెకు వేరే వాళ్లతో వివాహమై పోయి ఒక కొడుకు పుట్టాడు. హీరోకి యింకో అమ్మాయితో పెళ్లయింది. ఓ కొడుకు. వాళ్లు వాళ్ల పల్లెటూళ్లో ఉంటారు. చక్రవర్తి కొడుకు కమోడస్‌ దుష్టుడు, ఆశాపరుడు. అతనికి హీరో అంటే అసూయ.

కథ క్రీ.శ.180లో ప్రారంభమైంది. జర్మనీ ప్రాంతంలో రోమ్‌ సైన్యం జర్మన్‌ తెగలపై యుద్ధం చేస్తోంది. వృద్ధచక్రవర్తి కూడా రణరంగంలో ఉన్నాడు. హీరో కారణంగా గెలుపు సిద్ధించాక, ఎంతో సంతోషించిన చక్రవర్తి అతనితో చెప్పాడు ''రాజ్యమంతా అవినీతితో, అసమర్థతతో కునారిల్లుతోంది. ప్రజాప్రతినిథులతో, మేధావులతో ఏర్పడిన (పార్లమెంటు వంటి) సెనేట్‌కు అధికారం తిరిగి అప్పగించేద్దా మనుకుంటున్నాను. కానీ నాకు సమయం చాలదు. నా కుమారుడు పనికిమాలినవాడు. అందువలన నా మరణానంతరం నిన్ను నా వారసుడిగా ప్రకటిస్తాను. నువ్వు రీజంట్‌ (సంరక్షకుడు)గా ఉండి రాజ్యపాలనను సెనేట్‌కు అప్పగించు.'' అన్నాడు. స్వగ్రామానికి వెళ్లిపోవాలని ఉన్నా చక్రవర్తిపై గౌరవంతో హీరో సరేనన్నాడు. 

అప్పటిదాకా రాజధానిలోనే ఉన్న చక్రవర్తి కుమారుడు కమోడస్‌ (పాత్రధారి జోయాక్విన్‌ ఫీనిక్స్‌) తన అక్క లూసిలా (పాత్రధారిణి కేనీ నీల్సెన్‌) తో సహా యుద్ధభూమికి వచ్చాడు. హీరోకి వారసత్వం అప్పగిస్తున్నానని తండ్రి చెప్పగానే ఒళ్లు మండి తండ్రిని హత్య చేశాడు. తనని తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. హీరోని పిలిచి తనకు విధేయుడిగా ఉండమన్నాడు. జరిగినది గ్రహించిన హీరో తిరస్కరించడంతో అతన్ని ఖైదు చేయించి, రహస్యంగా చంపించబోయాడు. హీరో తప్పించుకున్నాడు కానీ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే తన సొంత ఊరికి వెళ్లి చూస్తే అప్పటికే చక్రవర్తి సైనికులు అతని భార్యాసుతులను క్రూరంగా చంపివేశారు. ఇల్లు నాశనం చేశారు. గాయాలతో స్పృహ తప్పి పడివున్న అతన్ని కొందరు ఎత్తుకుపోయి, రోమ్‌ రాజ్యంలోని ఒక పట్టణంలో ప్రాక్సిమో అనే బానిస వ్యాపారికి అమ్మివేశారు.  

 అప్పట్లో రోమ్‌లో బానిస వ్యవస్థ ఉండేది. యజమాని వాళ్లను కోసినా, చంపినా అడిగేవాడు లేడు. రోమన్‌ పౌరులకు హింసాత్మక క్రీడలంటే సరదా. పెద్ద ఆడిటోరియంలో కూర్చుని యిద్దరు సాయుధులైన బానిసలు ఎవరో ఒకరు చచ్చేదాకా కొట్టుకుంటూంటే చూడడం యిష్టం. ఇలా స్టేడియంలో పోరాడేవారిని గ్లాడియేటర్‌ అంటారు. కొంతకాలంగా పాత చక్రవర్తి వీటిని నిషేధించాడు. ఆ చట్టం రోము నగరంలోనే నిక్కచ్చిగా అమలవుతోంది కానీ దూరప్రాంతాల పట్టణాల్లో అధికారులు టూర్నమెంట్స్‌ను అనుమతిస్తున్నారు. అందువలన ప్రాక్సిమో తన బానిసలను గ్లాడియేటర్స్‌గా మార్చి, వారితో ప్రదర్శనలు యిప్పించి డబ్బు సంపాదిస్తున్నాడు. గ్లాడియేటర్‌గా మారడానికి హీరో మొదట్లో యిష్టపడలేదు. కానీ ప్రాక్సిమో ఒత్తిడికి లొంగి రంగంలోకి దిగాడు. 

సైన్యాధిపతిగా నేర్చిన నైపుణ్యంతో అతను అద్భుతంగా పోరాడడం చూసి ప్రాక్సిమో ముగ్ధుడయ్యాడు. ''నేనూ ఒకప్పుడు గ్లాడియేటర్‌నే. పాత చక్రవర్తి నన్ను బానిసత్వం నుంచి విముక్తుణ్ని చేశాడు. కొత్త చక్రవర్తి అంటే నాకు యిష్టం లేదు. సెనేట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేశాడు. తను చేసిన ఘాతుకాన్ని మరిపించడానికి అతను ప్రజలకు తాయిలాలు యిస్తున్నాడు. వారిది మూకస్వభావం కాబట్టి, వారిని మురిపించడానికి టూర్నమెంట్లపై నిషేధం ఎత్తివేస్తున్నాడు. రోమ్‌ లోని భారీ స్టేడియం కలోసియంలో 150 రోజుల పాటు వరుస క్రీడలు నిర్వహిస్తున్నాడు. నువ్వు ఊరికే పోరాడడం కాదు, ఆడియన్స్‌ని మెప్పించే కళ నేర్చుకో. నీకు పేరు వస్తే అది చూపించి, కలోసియంలో జరిగే క్రీడలో స్లాట్‌ సంపాదిస్తాను. అక్కడా నీకు పేరు వచ్చిందంటే చక్రవర్తి కళ్లలో పడతావు. ఆయన్ని ముఖాముఖీ కలిసే అవకాశం వస్తుంది.'' అని హీరోకి ఆశ పెట్టాడు.

కమోడస్‌ ఎదుట పడి తన ప్రతీకారం తీర్చుకోవడమే జీవితాశయంగా బతుకుతున్న హీరోకి ఈ ఆఫర్‌ నచ్చింది. అప్పణ్నుంచి ఆడియన్సుని మెప్పించసాగాడు. అనుకున్నట్టుగానే కలోసియంకు చేరాడు. కమోడస్‌ సమక్షంలో ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రోమన్‌ సైన్యం కార్థేజిని జయించిన ''బ్యాటిల్‌ ఆఫ్‌ జామా''ను స్ఫురణకు తెస్తూ యిచ్చిన ప్రదర్శనలో కార్థేజి వీరులుగా యీ గ్లాడియేటర్స్‌, అప్పటి రోమన్‌ సైనికులుగా రోమ్‌ ప్రస్తుత సైనికులు పాత్రలు నిర్వహించారు. లెక్క ప్రకారం కార్థేజీ వీరులు రోమన్‌ సైనికుల కత్తికి బలి కావాలి. ప్రజలు చప్పట్లు కొట్టాలి. కానీ హీరో కార్థేజి తరఫున నాయకుడిగా ఉంటూ రోమన్‌ సైన్యాన్ని ఓడించేశాడు. ఇది చరిత్రకు విరుద్ధంగా ఉన్నా ప్రజలు యీ కార్థేజి నాయకుడికి జేజేలు పలకడం చూసి, ప్రజల్ని మెప్పు కోసం కమోడస్‌ అతన్ని అభినందించడానికి మైదానంలోకి వచ్చాడు.

అయితే హీరో ఒక హెల్మెట్‌ ధరించి ఉన్నాడు. పేరు కూడా చెప్పడానికి యిష్టపడలేదు. చక్రవర్తి చెప్పగా చెప్పగా హెల్మెట్‌ తీసి, మొహం చూపిస్తూ తన పేరు చెప్పాడు.  చనిపోయాడనుకున్న హీరో యిలా ప్రత్యక్షమయ్యేసరికి కమోడస్‌ తెల్లబోయాడు. అక్కడికక్కడే చంపేసేవాడు కానీ ప్రజలు అతన్ని ధీరత్వాన్ని ఆరాధిస్తూండడంతో ఏమీ చేయలేక పోయాడు. దాంతో యింకో యుద్ధం ఏర్పాటు చేశాడు. దానిలో ఓటమి ఎరగని ఫ్రెంచ్‌ గ్లాడియేటర్‌ను హీరోకు ప్రత్యర్థిగా దింపాడు. దానికి తోడు పోరాడే సమయంలో అనేక పులుల్ని హీరోపై వదిలాడు. చివరకు హీరో పులుల్ని చంపి, తన ప్రత్యర్థిని కూడా మట్టి కరిపించాడు. 'అతన్ని చంపేయ్‌' అని చక్రవర్తి ఆజ్ఞాపించినా చంపలేదు. దాంతో రోమన్‌ జనావళి 'ఆహా, యీ వీరుడు రుణామయుడు కూడా' అని జయజయధ్వానాలు పలికారు. ఇదంతా కమోడస్‌కు దుస్సహంగా ఉంది. హీరో దగ్గరకు వెళ్లి 'నీ భార్యను యిలా అత్యాచారం చేయించాను, చచ్చేటప్పుడు నీ కొడుకు యిలా ఆక్రందనలు చేశాడు' అంటూ రెచ్చగొట్టాడు. అతను తిరగబడితే వెంటనే సైనికుల ద్వారా చంపించివేద్దామని! కానీ హీరో ఓర్మి వహించాడు.

హీరో బతికి ఉన్నాడని తెలియడంతో కమోడస్‌ సోదరి లూసిలా అతన్ని రహస్యంగా కలిసింది. సెనేటర్‌ గ్రాఛూస్‌ సహాయంతో అతన్ని రోమ్‌ నుంచి తప్పిస్తానని, యిప్పటికీ అతనంటే విధేయత గల సైనికులను యిప్పిస్తానని, అతను రోమ్‌పై దండెత్తి కమోడస్‌ను గద్దె దింపి, అధికారాన్ని సెనేట్‌కు అప్పగించాలని ప్రతిపాదించింది. హీరో ఒప్పుకున్నాడు. అతని ప్రస్తుత యజమాని ప్రాక్సిమో పారిపోయేందుకు ఏర్పాట్లు చేశాడు. అయితే కుట్ర విషయం పసిగట్టిన కమోడస్‌ లూసియాను బెదిరించి, బెల్లించి రహస్యం తెలుసుకున్నాడు. కుట్రదారులను చంపి, హీరోని బందీగా పట్టుకున్నాడు. అతన్ని మెచ్చిన ప్రజల ముందే తను అతని కంటె ఘనుడని చూపుకోవాలనే ప్రణాళికతో మైదానంలో అతనితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు.

అయితే యిక్కడ కుతంత్రం ఏమిటంటే పోటీకి ముందు వెళ్లి హీరో వీపు మీద బాకుతో పొడిచేశాడు. ఆ గాయం కనబడకుండా కవచం తొడిగించేశాడు. ఏం చేసినా హీరో కమోడస్‌ను ఓడించి చేతిలో కత్తిని ఎగరకొట్టాడు. అప్పుడు కమోడస్‌ తన అంగరక్షకుడితో హీరోని చంపేయమన్నాడు. కానీ అది నియమాలకు విరుద్ధం కాబట్టి అతను ఒప్పుకోలేదు. అప్పుడు కమోడస్‌ చాటుగా దాచి వుంచుకున్న బాకు తీసి హీరోని పొడవబోయాడు. హీరో ఒడుపుగా దాన్ని తన చేతిలోకి తీసుకుని దానితోనే కమోడస్‌ పీక కోసేశాడు కానీ గాయాల కారణంగా తనూ మృత్యువాత పడ్డాడు. చనిపోయే ముందు గ్లాడియేటర్లందరినీ స్వేచ్ఛాజీవులుగా చేయమని, రాజకీయ సంస్కరణలు చేపట్టమని, గ్రాఛూస్‌ను సెనేటర్‌గా మళ్లీ నియమించమని కోరాడు. అందరూ అతనికి నివాళులు అర్పించారు.

ఇది ప్రజల్ని పులకింప చేసే ఒక జానపద కథ లాటిది. దానికి చరిత్ర తళుకులను అద్దడంతో గాంభీర్యం వచ్చింది. అయితే దానికోసం చరిత్రను ఎంతవరకు వాడుకున్నారు, ఎలా మార్చుకున్నారు అనేది చెప్పబోతున్నాను. వక్రీకరించారు అన్నా తప్పు లేదు, కానీ వక్రీకరించినా తప్పుగా అనుకోలేదు జనం. ఎందుకంటే దీనిలో విలన్‌గా చూపబడిన కమోడస్‌ ఘనుడేమీ కాదు, అందువలన అతని వ్యక్తిత్వానికి దెబ్బ తగిలింది అని ఎవరూ అనుకోలేదు. 

స్క్రిప్టు తయారీలో పాలు పంచుకున్న చరిత్రకారుల్లో ఒకాయన చరిత్ర బొత్తిగా మార్చేస్తూన్నారంటూ మధ్యలో వదిలేశాడు. ఇంకో ఆయన సాయపడతాను కానీ తెరపై నా పేరు వేయకండి, నా పరువు పోతుంది అన్నాడు. ఏ ఘట్టం జరిగినా ఆయన దీనికి ఆధారమేమిటి అని అడిగి చంపుతూండేవాడని డైరక్టరు వాపోయాడు. నిజానికి చెప్పాలంటే మన కంటె, ప్రపంచంలో చాలా రాజ్యాల కంటె భేషుగ్గా రోమన్లు తమ చరిత్రను రికార్డు చేశారు. అయితే కథలో వచ్చే గ్యాప్స్‌ పూరించడానికి కొన్ని సన్నివేశాలు కల్పించవలసి వస్తుంది. అది ఎకడమీషియన్స్‌ అర్థం చేసుకోరు.

ఇక లభ్యమౌతున్న చరిత్ర ప్రకారం చూస్తే కమోడస్‌ తన తండ్రి ఆరిలియస్‌ (121-180)ని చంపలేదు. అతను మశూచికమో మరోటో అంటువ్యాధి కారణంగా చనిపోయాడు. 40 ఏళ్ల వయసులో గద్దెనెక్కి 19 ఏళ్లు పాలించిన ఆరిలియస్‌కు చక్కటి పాలకుడిగా, విజేతగా మంచి పేరుంది. పేదలకోసం పాఠశాలలు తెరిచాడు. ఆసుపత్రులు పెట్టించాడు. పౌరుల పట్ల దయకలవాడు. ఫిలాసఫర్‌ (స్టాయిసిజమ్‌) కూడా. ''మెడిటేషన్స్‌'' పేర తన అంతరంగ తరంగాలను గ్రీకు భాషలో గ్రంథస్తం చేశాడు. అయితే ఆ నాటికి తన రాజ్యంలో వ్యాప్తి చెందుతున్న క్రైస్తవాన్ని అడ్డుకోవడానికి క్రైస్తవులను తీవ్రంగా హింసించాడు. అతని పాలనలో అభివృద్ధితో పాటు ఖర్చు పెరిగింది. అవినీతి కూడా పెరిగిందని, తను నియంత్రించ లేకపోతున్నానని వగచినట్లు సినిమాలో చూపించారు. 

సినిమాలో చూపించినట్లు అధికారాన్ని సెనేట్‌కు అప్పగించే సదుద్దేశం, దానికి గాను తన జనరల్‌ను రీజంటుగా ఏర్పాటు చేసే ప్రణాళిక ఏ మాత్రం లేవు. చనిపోయేందుకు ముందు మూడేళ్ల పాటు కొడుకుతో కలిసి పాలించాడు. కొడుకు ఆశపోతు, క్రూరాత్ముడని  తెలిసినా అతనికి రాజ్యపాలన నేర్పుదామని తాపత్రయం. జర్మనీ తెగలపై ఆరిలియస్‌ విజయం సాధించడంతో సినిమా మొదలైంది. కానీ అతను వాళ్లను జయించలేదు. యుద్ధం సాగుతూండగానే మరణించాడు. అతని తర్వాత అధికారంలోకి వచ్చిన కమోడస్‌ ఆ తెగలతో సంధి చేసుకున్నాడు. ఇక ఆరిలియస్‌ ప్రజలను సంస్కరించే ఉద్దేశంతో గ్లాడియేటర్‌ క్రీడను రోమంతా నిషేధించాడన్నదీ కరక్టు కాదు. అది ఒక నగరానికి మాత్రమే పరిమితం. అదీ వాళ్లు తనపై తిరుగుబాటు చేసినవాడికి మద్దతు యిచ్చారన్న కోపంతోనే!

ఇక హీరో పాత్ర ఎలాగూ కల్పితపాత్రే. అతని పేరు చరిత్ర పుస్తకాల్లో కనబడదు. కమోడస్‌ కలోసియంలో యుద్ధాలు చేయడం, అంతిమంగా హత్య చేయబడడం వాస్తవమే కానీ బహిరంగంగా కలోసియంలో చంపిన మొనగాడు ఎవడూ లేడు. అతనిపై చేసిన రకరకాల హత్యాయత్నాలు విఫలమయ్యాక, చివరకు అతని ఒళ్లు పట్టే మల్లయోధుణ్ని లోబరుచుకుని అతనిచేత స్నానశాలలో పీక నులిమి చంపించివేశారు. అతని పేరు నార్సిసస్‌. క్రీ.పూ. 5 వ శతాబ్దంలో  రోమన్లు యుద్ధంలో ఆరితేరిన ఒక రైతును నియంతగా ఎన్నుకున్నారు. అతను రోమన్లపై విదేశీయులు చేసిన దాడిని విజయవంతంగా తిప్పికొట్టాక, నేను వచ్చిన పని అయిపోయింది అంటూ పదవి వదిలేసి వెళ్లిపోయాడు. చక్రవర్తి మార్కస్‌కు సన్నిహితుడైన జనరల్‌ మాక్రినస్‌ అని వుండేవాడు. స్పార్టకస్‌ అనే బానిస గ్లాడియేటర్‌గా పనిచేసి, వారి చేత తిరుగుబాటు చేయించాడు. లూసిలా రెండో భర్త అంటే ఆరిలియస్‌ యిష్టం. అతన్ని తన తర్వాత వారసుడిగా చేద్దామనే యోచన చేశాడు కానీ వీలు పడలేదు. వీళ్లందరిని కలబోసి హీరో పాత్ర తయారు చేశారు. 

సినిమా చూస్తే విలన్‌ కమోడస్‌ చాలా తక్కువకాలమే రాజ్యం చేసినట్లు అనిపిస్తుంది. కానీ కాదు. క్రీ.శ. 161లో పుట్టిన అతను 17 ఏళ్లకై యువరాజుగా తండ్రితో కలిపి మూడేళ్లు పాలించి, 19 వ ఏట చక్రవర్తియై 12 ఏళ్లు పాలించి తన 31 వ ఏట 192లో చనిపోయాడు. సినిమాలో అతనికి వివాహమైనట్లు చూపించలేదు. అతనికి బ్రూటియా అనే భార్య ఉంది. అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేసి మార్సియా అనే ఆమెను ఉంచుకున్నాడు. పిల్లలు లేరు. సినిమాలో అక్కను లూసిలాను మోహించి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కందామని బలవంత పెడుతూన్నట్లు చూపించారు. 

లూసిలాను ఒక కొడుకున్న వితంతువుగా చూపించారు. కానీ ఆమెకు పూర్వవివాహం వలన పుట్టిన కొడుకు అప్పటికే చనిపోయాడు. కమోడస్‌ అధికారంలోకి వచ్చేనాటికి ఆమెకు పునర్వివాహం జరిగి 11 ఏళ్లయింది. ఈ వివాహం వలన యిద్దరు పిల్లలున్నారు. ప్రియులతో చేతులు కలిపిి ఆమె క్రీ.శ.182లో కమోడస్‌ను చంపడానికి ప్రయత్నిస్తే, కమోడస్‌ ఆమెకు ప్రవాసశిక్ష వేశాడు. అక్కణ్నుంచి మరో కుట్ర చేయడంతో చంపించివేశాడు. అందువలన కమోడస్‌ మరణించే నాటికే లూసిలా పోయి పదేళ్లయింది. సినిమాలో ఆమె బతికి ఉన్నట్లు, హీరోకి సాయం చేసినట్లు చూపారు. నిజానికి యీమె కాక కమోడస్‌కు యింకా అక్కచెల్లెళ్లున్నారు. ప్రాధాన్యత లేకపోవడంతో వారిని చూపలేదు. 

కమోడస్‌ భీరుడేమీ కాదు. తండ్రితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నాడు. అధికారంలోకి వచ్చినా అనేక సార్లు గ్లాడియేటర్‌గా ప్రజల సమక్షంలో యుద్ధాలు చేసి, మైదానంలో జంతువులను బాణాలతో వేటాడి మెప్పించేవాడు. అయితే అతనికి అహంభావం ఎక్కువ. తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించేవాడు, హెర్క్యులిస్‌గా చిత్రీకరించుకునేవాడు. ప్రజారంజకంగా పాలించలేదు. అతనితో ఆ వంశపతనం ప్రారంభమైంది. కమోడస్‌ మరణం తర్వాత రాజ్యాధికారం సెనేట్‌ చేతికేమీ వెళ్లలేదు. వాళ్లు యితన్ని ప్రజల శత్రువుగా ప్రకటించారు. పెర్టినాక్స్‌ అనే సామాన్యుడు చక్రవర్తి అయ్యాడు. కానీ మూణ్నెళ్లు తిరక్కుండా అతన్ని అంగరక్షకుడే చంపేశాడు. ఆ తర్వాత డిడియస్‌ అనే అతన్ని రెణ్నెళ్లు కాగానే చంపేశారు. ఇలా ఆ ఏడాది (క్రీ.శ. 193)ని ''ఇయర్‌ ఆఫ్‌ ఫైవ్‌ ఎంపరర్స్‌''గా పిలుస్తారు. అంతటి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 

ప్రతీ వ్యక్తికి చరిత్ర తెలుసుకోవడం అవసరం. గతం తెలిస్తేనే వర్తమానానికి అన్వయించుకోగలం. భవిష్యత్తును రూపొందించుకోగలం. అయితే చరిత్రను తారీకులతో, దస్తావేజులతో చెపితే బోరు కొడుతుంది. దానికి కొంత సొంత పైత్యం రంగరించి, అప్రధానమైన వ్యక్తులు కేంద్రంగా, చారిత్రక నేపథ్యంతో యిలాటి నవలలు, సినిమాలు తీస్తే చరిత్ర పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా ఛాయలు ''బాహుబలి''లో కనబడతాయి. విలన్‌కు రాజ్యకాంక్ష, స్త్రీకాంక్ష రెండూ వున్నాయి. తాను కోరిన రాజ్యం, స్త్రీని దక్కించుకున్న హీరోపై అసూయ వుంది. 

తను సొంత కొడుకైనా తన కంటె సమర్థుడైన కజిన్‌కు తల్లి రాజ్యం యిచ్చిందని భల్లాల దేవుడికి కసి. ఇక్కడ తన తండ్రి తనను పక్కన పెట్టి, హీరోకి వారసత్వం యిచ్చాడని కమోడస్‌కు కసి. స్త్రీ విషయంలో ''గ్లాడియేటర్‌''లో విలన్‌ సొంత అక్క మీదే మోజు పడతాడు. ఆమె గతంలోనే కాక, యిప్పుడూ హీరోని ఆరాధిస్తుంది. అది యితనిలో ఒక కాంప్లెక్స్‌ కలిగిస్తుంది. ''బాహుబలి''లో పరాయి స్త్రీ! ఆ మార్పుతో బాటు పగ తీర్చుకునే పని హీరో తర్వాతి తరానికి అప్పచెప్పారు. ''గ్లాడియేటర్‌'' విజయం ఆ తరహా సినిమాలు హాలీవుడ్‌లో రావడానికి ప్రేరణగా పనికి వచ్చింది.

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
  mbsprasad@gmail.com