cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: గోవా రాజకీయాలు

ఎమ్బీయస్‍:  గోవా రాజకీయాలు

ఇవాళ మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తూ టిఎంసి అంటే ‘టెంపుల్, మస్‌జిద్, చర్చ్’ అనే కొత్త నిర్వచనం యిచ్చి, అన్ని మతాల వాళ్లని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆమె పార్టీలో కాంగ్రెసు నాయకులు చేరారు. ఎన్‌సిపి ఎమ్మెల్యే కూడా చేరబోతున్నాడని వదంతి వుంది. బిజెపిలో టిక్కెట్లు ఆశించేవాళ్లు ఎక్కువై పోవడంతో టిక్కెట్టు దొరకని వాళ్ల కోసం తృణమూల్, ఆప్ గేలాలు పట్టుకుని కూర్చున్నాయి. ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న గోవా యిటీవల వార్తల్లో బాగా వినబడుతోంది. ముఖ్యంగా కాంగ్రెసు నాయకులు పార్టీ విడిచి తృణమూల్‌లోకి గెంతేస్తూండడంతో! దీన్ని అరికట్టాలని కాబోలు ప్రియాంకా గాంధీ డిసెంబరు 10న గోవాకు వెళతానని ప్రకటించిన మరుక్షణం మరి కొంతమంది కాంగ్రెసు నాయకులు టపటపా జంప్ అయిపోయారు. ఇదీ సోనియా గాంధీ కుటుంబీకులు కార్యకర్తల్లో తెచ్చే చురుకుతనం!

2017లో కాంగ్రెసు 17, బిజెపి 13, ఎంజిపి (మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ) 3, జిఎఫ్‌పి (గోవా ఫార్వర్డ్ పార్టీ) 3, ఎన్‌సిపి 1, స్వతంత్రులు 3 గెలుచుకున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెసును గవర్నరు పిలవాలి, కానీ పిలవలేదు. ఎవర్ని కలుపుకోవాలాని కాంగ్రెసు తాత్సారం చేస్తూండగానే బిజెపి, ఎంజిపి, జిఎఫ్‌పి, ఇండిపెండెంట్‌లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత కాంగ్రెసు పార్టీని చీల్చి 10 మందిని, ఎంజిపిని చీల్చి యిద్దర్ని లాక్కుంది. 2019లో జరిగిన ఉపయెన్నికలలో మరో 3 గెలిచింది. 2017లో 17 స్థానాలున్న కాంగ్రెసులో ముగ్గురు మాత్రమే మిగిలారు. వాళ్లలో యిద్దరు బిజెపి వైపు చూస్తున్నారంటున్నారు.

ఈ మధ్య కాంగ్రెసు నుంచి వెళ్లిపోయినవాళ్లలో యిద్దరు మాజీ ముఖ్యమంత్రులున్నారు. వెళ్లిపోయినవాళ్లలో కొందరు బిజెపిలో చేరారు, ఇంకొందరు తృణమూల్‌లో చేరారు, మరి కొందరు ఆప్‌లో చేరారు. ఇక బిజెపి ప్రస్తుతం 27 మందితో విరాజిల్లుతూ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతూ హామీలు గుప్పిస్తోంది. ఎన్నికలు ముంగిట్లో వున్నాయి కాబట్టి ఐదేళ్లగా చేయని పనులు చేపట్టింది. సెప్టెంబరు నుంచి ఇంటికి 16 వేల లీటర్ల చొప్పున ఉచితంగా నీటివసతి అందిస్తోంది. అక్టోబరులో ‘సర్కార్ తుమ్‌చ్యా దరి’ (మీ గుమ్మంలో ప్రభుత్వం) అనే స్కీము కింద ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. నవంబరు కల్లా 10 వేల ఉద్యోగాలిస్తానంది.

గోవా పేరుకి రాష్ట్రమే కానీ చాలా చిన్నది.  11 లక్షల ఓటర్లు మాత్రమే. మన మల్కాజగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లు 31 లక్షలు! మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 40. విస్తీర్ణంలో, జనాభాపరంగా కూడా నియోజకవర్గాలు చిన్నవి. సగటున 25 వేలకు అటూయిటూ ఓటర్లుంటారు. పదిమంది వెనకాల వున్న ప్రతీవాడూ నాయకుడే! ఇక ఫిరాయింపుల విషయంలో దీనంత అధ్వాన్నమైన రాష్ట్రం మరొకటి లేదు. ప్రతి రాజకీయ నాయకుడు హీనపక్షం 4 పార్టీలు మారి వుంటాడని అంచనా. పార్టీలోంచి బయటకు వెళతాడు, మళ్లీ వస్తాడు, మళ్లీ వెళతాడు. ఏ సిద్ధాంతాలూ వుండవు. అందువలన ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తెచ్చుకుంటుందాని లెక్కలు వేసుకోవడం అనవసరం. 10 సీట్లు మాత్రమే వచ్చినా ఎలాగోలా ప్రభుత్వం ఏర్పరచగల టెక్నిక్ బిజెపి కుంది. 2012 నుంచి పాలిస్తూ వుంటే ఐదేళ్ల తర్వాత 13 సీట్లతో సరిపెట్టారు. పైన చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పరిచింది. ఈసారీ అదే చేయవచ్చు.

2017లో బిజెపికి మనోహర్ పారికర్ ఉన్నాడు. అతను బిజెపిని క్రైస్తవులకు (జనాభాలో వారి % 35 దాకా వుంది) కూడా విస్తరించి, పార్టీని పెంచాడు. అందరితోను సత్సంబంధాలున్నాయి. అతన్ని బిజెపి అధిష్టానం కేంద్రం నుంచి గోవాకు పంపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే తిమ్మిని బెమ్మి చేసి ఆ పని చేయగలిగాడు. ప్రస్తుతం ఉన్న బిజెపి ఎమ్మెల్యేలలో సగం మంది క్రైస్తవులే. తక్కిన రాష్ట్రాలలో క్రైస్తవులపై, మతమార్పిడిపై గగ్గోలు పెట్టే బిజెపి గోవాలో కిమ్మనదు. 2019లో పారికర్ పోయాక వారసుడిగా వచ్చిన ప్రమోద్ సావంత్‌కు అతనంత చాతుర్యం లేదు. పైగా పారికర్ అనుయాయులను దూరం పెట్టాడన్న మాట కూడా వినవస్తోంది. కానీ అతనికి ఆరెస్సెస్, అధిష్టానం ఆశీస్సులున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి అతనే అని అమిత్ షా ప్రకటించేశాడు కూడా. ఫిరాయింపులలో ఆరితేరిన దేవేంద్ర ఫడణవీస్‌ను గోవా ఇన్‌చార్జిగా వేసి, యితనికి సాయపడమన్నారు.

ఏం చేసినా బిజెపిలో లుకలుకలు బాగానే వున్నాయి. ముఖ్యంగా కొందరు నాయకులు తమ కుటుంబసభ్యులకు టిక్కెట్లివ్వమని, లేకపోతే పార్టీ విడిచి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణె తనతో పాటు భార్యకు కూడా వేరే చోట టిక్కెట్టివ్వమంటున్నాడు. అక్టోబరు 14న అమిత్ షా వచ్చినపుడు అతను ముఖ్యమంత్రి పనితీరుపై ఫిర్యాదు చేశాడు. అతనితో పాటు మౌవిన్ గోడిన్హో అనే మంత్రి కూడా! నౌకాశ్రయాల మంత్రి మైకేల్ లోబో ఆ సమావేశంలో పెద్దగా కానరాలేదు. అతనిదీ రాణా లాటి డిమాండే. అతని భార్యకీ యివ్వాలిట. లేకపోతే వెళ్లిపోతాట్ట. అతనికి ఏడు అసెంబ్లీ స్థానాల్లో పట్టుంది. ముఖ్యంగా మూడిటిలో అతని మాట బాగా చెల్లుతుంది. కాంగ్రెసు నుంచి ఫిరాయించి ఉపముఖ్యమంత్రి అయిన చంద్రకాంత్ కావ్లేకర్ కూడా తన భార్యకు టిక్కెట్టివ్వమంటున్నాడు. అతనికి నాలుగు నియోజకవర్గాల్లో పట్టుంది. మాజీ మంత్రి పాండురంగ్ మాడ్‌కైకర్‌దీ అదే డిమాండ్. పారికర్ కొడుకు ఉత్పల్ నాకూ టిక్కెట్టివ్వాలంటున్నాడు.

వీళ్లందరితో బాటు కాంగ్రెసు నుంచి కొట్టుకొచ్చిన పదిమంది విషయంలో ఏం చేయాలో బిజెపికి తెలియటం లేదు. వాళ్ల ఫిరాయింపును నియోజకవర్గ ప్రజలు హర్షించలేదని రిపోర్టులు వస్తున్నాయట. బిజెపికి యింకో చింత కూడా వుంది. ఇప్పటిదాకా మహారాష్ట్రకే పరిమితమైన శివసేన మొన్న దాద్రా నగర్ హవేలీలో పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు గోవాకు కూడా వచ్చి హిందువులు అత్యధికంగా వున్న 22 స్థానాల్లో పోటీ చేసి తన ఓట్లు చీలుస్తుందేమోనన్న అనుమానం వుంది. దానికి తోడు మనోజ్ పరబ్ పెట్టిన రివల్యూషనరీ గోవన్స్ అనే సంస్థ కూడా గుబులు పుట్టిస్తోంది. గోవా గోవావాళ్లకే అనే నినాదంతో నిరుద్యోగపీడిత యువతను ఆకర్షిస్తున్నాడతను. గోవా సురాజ్ పార్టీ పేర ఎన్నికలలో పోటీ చేస్తానంటున్నాడు. చేస్తే నాలుగైదు నియోజకవర్గాల్లో బిజెపికి కష్టమే.

ప్రమోద్ సావంత్ తను ముఖ్యమంత్రి అవుతూనే భాగస్వామి ఐన జిఎఫ్‌పి మంత్రులను తన కాబినెట్‌ లోంచి తీసేశాడు. అప్పణ్నుంచి ఆ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయి అతనిపై, బిజెపిపై కారాలూ మిరియాలూ నూరుతున్నాడు. తృణమూల్ అతన్ని రమ్మంటోంది. ఊరిస్తున్నాడు కానీ యింకా చేరలేదు. తనే ప్రతిపక్షాలన్నిటినీ కూడగడతానంటూ తిరుగుతున్నాడు. తను 10-12 స్థానాల్లో పోటీ చేసి తక్కినవి మీకు, తృణమూల్‌కు వదులుతానంటూ కాంగ్రెసు దగ్గరకు వెళ్లాడు. కానీ కాంగ్రెసు తృణమూల్‌తో ససేమిరా కలవనంటోంది. తన పార్టీని చీల్చినందుకు బిజెపిపై కోపంగా వున్న ఎంజిపి, బిజెపికి పట్టున్న ఉత్తర గోవాలోని 10-12 స్థానాల్లో పోటీ చేద్దామనుకుంటోంది. తృణమూల్‌తో పొత్తు కుదుర్చుకుంది కూడా. ఇలాటి పరిస్థితుల్లో రంగంలోకి ఒంటరిగా దిగాలా, పొత్తులు పెట్టుకోవాలా అనే ప్రశ్న బయలుదేరింది బిజెపి నాయకుల్లో. బహుశా ఒంటరిగానే వెళ్లి, ఫలితాల అనంతరం పొత్తు పెట్టుకోవచ్చు.

గోవా దిల్లీకి, కలకత్తాకు చాలా దూరం. అయినా ఆప్, తృణమూల్ యిక్కడకు ఎందుకు వచ్చాయన్న ప్రశ్న రావచ్చు. గోవా చిన్న రాష్ట్రం. పెద్దగా తిరగనక్కరలేదు, ఖర్చు పెట్టనక్కరలేదు. అందుకే అవి యిక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని దిగాయి. తమను బయటి పార్టీలంటారని, స్థానికులనే పార్టీలోకి ఆకర్షించి, వారినే నిలబెడుతున్నారు. గోవాలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా వున్నాయి. ఇన్నాళ్లూ యథేచ్ఛగా గోడ దూకేస్తున్న నాయకులకు దూకడానికి యింకో రెండు గోడలు దొరికాయి. ఆప్, తృణమూల్‌లకు సీట్లు పెద్దగా రాకపోయినా ఫర్వాలేదు. రెండు, మూడు వచ్చినా చాలు, మాకు బెంగాల్‌కి బయట కూడా ఉనికి వుంది అని తృణమూల్ చెప్పుకోవచ్చు.

4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే జాతీయ పార్టీ అనే గుర్తింపు యిస్తారు. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రావాలంటే పోలైన ఓట్లలో 6% తెచ్చుకోవాలి. గోవా వంటి చిన్న రాష్ట్రంలో ఒక స్థానం దక్కినా కింగ్‌మేకర్ కావచ్చు. ఎంజిపి, జిఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నదదే. అక్టోబరు చివర్లో మమతా బెనర్జీ గోవా వచ్చి మూడు రోజులు పర్యటించి ‘గోవాంచీ నవీ సకాల్’ (గోవా నవోదయం) అనే పేర కాంపెయిన్ ప్రారంభించింది.. ‘నేను ఇక్కడ సిఎం అవ్వాలనే కోరికతో రాలేదు. మీలో ఒకరే అవుతారు, నేను జస్ట్ సాయం చేయడానికి వచ్చానంతే’ అని ప్రసంగించింది. అంతకు ముందే ప్రశాంత కిశోర్ ఐ-పాక్ టీము వచ్చి సర్వేలు నిర్వహించి, ఎక్కడెక్కడ పోటీ చేయవచ్చో, ఎవరెవరు పార్టీలో చేరితే బాగుంటుందో నిర్ధారించారు.

ప్రస్తుతం తృణమూల్ దూకుడుగా వుంది. ఒకప్పటి బిజెపి మిత్రపక్షమైన (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం బిజెపితో పొత్తున్న (జిఎఫ్) పార్టీని కలిపివేసుకోవడానికి, అది కుదరకపోతే పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. లూజినో ఫెలిరో అనే మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెసు నుంచి తృణమూల్‌లోకి చేరాడు. అతను మరీ పెద్ద లీడరేమీ కాదు కానీ దక్షిణ గోవాలో కాస్త పలుకుబడి వుంది. సినీనటి, సామాజిక కార్యకర్త నసీఫా అలీ తృణమూల్‌లో చేరి ప్రచారం చేస్తోంది.

ఆప్‌కీ జాతీయపార్టీ అవాలనే ఆలోచనలున్నాయి. దానికి దిల్లీతో పాటు పంజాబ్‌లో ఎమ్మెల్యేలున్నారు. తక్కిన అనేక రాష్ట్రాలలో యిప్పటికే పోటీ చేసింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికలలో 36 స్థానాల్లో పోటీ చేసినపుడు ఒక్క సీటూ దక్కలేదు కానీ 6.3% ఓట్లు తెచ్చుకుంది. దాని కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న జిఎఫ్‌కు 3 సీట్లు వచ్చాయి. అందువలన యీసారి ఆప్ తమకు బలం వుందనుకుంటున్న 15-17 స్థానాలను ఎంపిక చేసుకుని, వాటిపైనే దృష్టిపెట్టి ఓ పది స్థానాలైనా గెలుచుకోవాలని ఆశ పడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబరులో గోవాకు వచ్చి హామీలతో ఊదరగొట్టేశాడు. ప్రయివేటు కంపెనీల్లో స్థానికులకు 80% రిజర్వేషన్, ఒక్క ఉద్యోగి కూడా లేని కుటుంబాలకు రూ.3 వేల అలవెన్స్, ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ యిస్తానన్నాడు. దిల్లీ తరహాలో మంచి విద్య, వైద్యం అందిస్తానన్నాడు.

దిల్లీ కంటె గోవాలో విద్య, వైద్యం మెరుగ్గా వున్నాయని, విద్యుత్ సమస్య లేదని అతని దృష్టికి తెచ్చారు కాబోలు, నవంబరులో వచ్చినపుడు మతపరమైన గేలం వేశాడు. ప్రభుత్వధనంతో హిందువులు అయోధ్యకు, క్రైస్తవులు వేలాంగణ్నికి, ముస్లిములు అజ్మీర్ షరీఫ్‌కు, సర్వమతస్తులు షిర్దీకి వెళ్లవచ్చన్నాడు. కేజ్రీవాల్ పంజాబ్‌లో కూడా లెక్కకు మిక్కిలి హామీలు గుప్పిస్తే అవన్నీ దిల్లీలో అమలు చేసి చూపించు అని సిద్దూ దిల్లీలో అతని యింటి ముందు ఆందోళనకు దిగాడు. ‘దిల్లీ బజెట్ చిన్నది, పరిశ్రమలు లేవు, పంజాబ్ బజెట్ పెద్దది కాబట్టి చేయగలుగుతాను’ అని కేజ్రీవాల్ బుకాయించవచ్చు. కానీ గోవా బజెట్టూ చిన్నదే. ఆదాయవనరులు తక్కువ. టూరిజం నుంచే ఎక్కువగా వస్తుంది. కరోనా కారణంగా అది దెబ్బ తినిపోయి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నిరుద్యోగం ప్రధాన సమస్యగా వుంది.

హామీల మాట ఎలా వున్నా ఆప్ కాంగ్రెసు, బిజెపిల నుంచి నాయకులను గెంతించే పనిలో పడింది. మాజీ ఉపముఖ్యమంత్రి దయానంద్ నార్వేకర్, గోవా మైనింగ్ ఫ్రంట్ నాయకుడు పుతి గోవాంకర్, హక్కుల కార్యకర్త, జిల్లా పరిషత్ సభ్యుడు ‌డొమినిక్ గౌన్‌కర్ యిప్పటిదాకా చేరారు. పోనుపోను గోవా రాజకీయాలు రసవత్తరంగా మారతాయనడంలో సందేహం లేదు. (ఫోటో – గోవా ప్రచారంలో నాయకులు)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు