cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: గోరంట్ల ఉదంతం – జగన్‌కు పాఠం

ఎమ్బీయస్: గోరంట్ల ఉదంతం – జగన్‌కు పాఠం

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరుగుబాటు ఉలికిపాటుకి గురి చేసింది. ఆయనకు అసంతృప్తి చాలాకాలంగానే వుంది. ‘పార్టీ బాగు చేయాలని నే చేసే ప్రయత్నాలను అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. 74 ఏళ్ల వయసులో ఇంకేం చేయగల’మంటూ ఆయన ఊరుకోవచ్చుగా! పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఆలోచన లేదు. తన పార్టీ అధికారంలో వున్నపుడే మంత్రి పదవికానీ, కమిటీలో పదవికానీ బాబు యివ్వలేదని ఆయనే చెప్పేశారు. ఇప్పుడు అధికారం పోయిన స్థితిలో బాబు యిద్దామనుకున్నా యివ్వలేరు. వచ్చే ఎన్నికలలో గోరంట్ల 76 ఏళ్ల వయసులో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిక్కెట్టు గురించి ఆశపడతారని అనుకోవడానికి లేదు. ఖర్చు, శ్రమే తప్ప ప్రయోజనం ఏముంటుంది? మెజారిటీ తగ్గవచ్చు కానీ జగనే మళ్లీ రావచ్చు. అతన్ని ఎదిరించే స్థితిలో టిడిపి, బిజెపి, జనసేన లేవు. ఈయనకు మహా అయితే అసెంబ్లీలో చంద్రబాబు పక్కన మళ్లీ కూర్చునే ఛాన్సు వస్తుందంతే!

పార్టీ వ్యవహారాలతో విసిగి, ఆయన వెంటనే రాజీనామా చేసేయవచ్చు. కానీ తన నిర్ణయాన్ని తర్వాత చెప్తానని అనడం దేనికి? దానికోసం ఆలోచించాలంటే, ఆ ఆలోచనేదో పూర్తి చేసుకుని అప్పుడే రచ్చ కెక్కవచ్చు కదా! ఈ లోపున కొంప మునిగేదేముంది? రాజీనామా చేసే ముందు పార్టీ హితైషులందరికీ పార్టీ వ్యవహారాలు యింత అధ్వాన్నంగా వున్నాయని తెలియచెప్పి ఇప్పటికైనా దిద్దుకోండి అని హెచ్చరిద్దామనా? తను యాక్టివ్‌గా లేనప్పుడు, రాజకీయ భవిష్యత్తుపై ఆశ లేనప్పుడు, పార్టీ గురించి అంత చింత ఎందుకు? చేసినంతకాలం చేశాం, యికపై చేసే పరిస్థితి లేదు. మర్యాదగా తప్పుకుంటే గౌరవంగా వుంటుంది అనే టోన్ వినిపిస్తున్నారు కానీ చివరి మాట ‘...కాబట్టి పార్టీకి, ఎమ్మెల్యే పోస్టుకి రాజీనామా చేస్తున్నాను’ అనే మాటను మాత్రం వాయిదా వేస్తున్నారు. ఎందుకంటారు?

తను యువకుడిగా వుండగా పార్టీలో చేరారు. ఇప్పటి యువకులు టిడిపిలో చేరాలంటే సెకండ్ లైన్ బలంగా వుండాలి. నెంబర్ టూ ఐన లోకేశ్ పార్టీని ఉద్ధరించలేడని గోరంట్లకు ప్రగాఢ విశ్వాసం. అందుకే జూ. ఎన్టీయార్ జపం బహిరంగంగా చేశారు. కానీ బాబు లోకేశ్‌ను తప్ప వేరెవర్నీ రానివ్వరనీ తెలుసు. నెంబర్ టూని మార్చాలంటే నెంబర్ ఒన్ తప్పుకోవాలి. లేదా మనసు మార్చుకోవాలి. బాబు మారడమనేది జరిగే పని కాదని తెలిసే టిడిపిలో సీనియర్ నాయకులు, ఓ మేరకు కార్యకర్తలూ సైలెంటుగా వున్నారు. వాళ్లు చేయాల్సినదంతా తెలుగు మీడియాయే చేస్తోంది. ఈయనా ఊరుకుంటే పోయేదిగా! ఐదేళ్ల క్రితం ఫిరాయింపు దారులను చేర్చుకోవద్దని, చేర్చుకున్నా పెద్ద పీట వేయవద్దని ఈయన సలహాలు యిచ్చి బాబుకి చెడ్డవాడయ్యారు. ‘23 మందిని చేర్చుకున్నందుకు యీసారి జనం 23 సీట్లే యిచ్చారు, మీరు చెప్పినా వినకపోవడం పొరబాటే’ అని 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బాబు యీయనతో అన్నారా? లేదే! ఇప్పుడు జూ ఎన్టీయార్‌ను తీసుకువచ్చేయండి అంటే వినేస్తారా?

వినకపోగా లోకేశ్‌కు కోపం వచ్చిందంటే రాదా? సవతి అన్నగారినో, తమ్ముడినో పొగిడితే యువరాజుకి మండదా? లక్ష్మణకుమారుడి వద్ద అభిమన్యుణ్ని పొగిడితే ఊరుకుంటాడా? అయినా జూనియర్ లోకేశ్‌కు సవతి సోదరుడు కాడు, రాజ్యభ్రష్టులైన బంధువులబ్బాయి. టిడిపిని ఎవరు స్థాపిస్తే ఏం గాక, ప్రస్తుత టిడిపి తన తండ్రి కష్టార్జితం. పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఉన్నదీ, 30-40 శాతం ఓటర్లు ఓట్లేసేది ఆయన మొహం చూసే, విగ్రహంగా, ఫోటోగా మిగిలిన ఎన్టీయార్‌ను చూసి కాదు! అసలు ఒరిజినల్ టిడిపికి, తన తండ్రి హయాం టిడిపికి ఏమైనా పోలిక వుందా? పేదవాడి కడుపు నింపడాలు, తెలుగువారి సమైక్యత యిటువంటి నినాదాలు గత టిడిపి నాటివి. ఇప్పటి టిడిపి నినాదాలు కళ్లు మిరుమిట్లు గొలిపే మాయానగరం, డాలర్ల వర్షం, రైతుల సింగపూర్ యాత్రలు! విధానాలంటారా, రాజకీయపు టెత్తులు, ఎవరితోనైనా పొత్తులు, మీడియా మేనేజ్‌మెంట్లు!

ఏ మాట కా మాట చెప్పాలంటే, ప్రజలు చంద్రబాబు విధానాలను ఆమోదిస్తూ వచ్చారు కాబట్టే ఆయన 1996 తర్వాత కూడా రాజకీయాల్లో వెలుగుతూ వస్తున్నారు. లేకపోతే నాదెండ్ల భాస్కరరావులా రూపుమాసి పోయి వుండేవారు. టిడిపి తెలంగాణాలో కనుమరుగై పోయింది కానీ యిప్పటికీ ఆంధ్రలో దాదాపు 30శాతం ఓట్లు తెచ్చుకుంటోంది. ఇదంతా బాబు కండబలం, బుద్ధిబలం పర్యవసానం. దాని ఫలాలను తను కాకుండా ఎప్పుడో పాతికేళ్ల క్రితమే చచ్చిపోయిన ఎన్టీయార్ పేరు పెట్టుకున్నవాడికి కట్టబెడతానంటే లోకేశ్‌కు బాధ వేయదా? నందమూరి యింటిపేరుకి అంత వాల్యూ వుందనుకుంటే తండ్రి లాగానే తనూ నందమూరి వారి అల్లుడు. నందమూరి నటసింహం తన మావగారు. జూనియర్ పార్టీలోకి రావడం అనవసరం అని ఆయనే చెప్పాడు కదా! ఇంకా ఏమిటి?

ఎవరో ప్రేమ వ్యవహారంలో హత్యకు గురయితే వెళ్లి చూడ్డానికి టైముంది కానీ, గోరంట్ల గారు ఫోన్ చేస్తే తీయడానికి టైము లేదా అంటే లోకేశ్ ఏం చెప్తారు? మంచి వుంటే మైకులో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పండి అన్నారు చిరంజీవిగారు. మైకులోనే చెడుగా చెప్పినవాడు చెవిలో యింకెంత చెడుగా చెప్తాడో! అవన్నీ వినాలా? ఇక బాబు మాత్రం? ఫోనెందుకు ఎత్తాలి? ‘చెబితే వింటివా గురుగురూ..’ అని గోరంట్ల పాడుతూంటే విని తాళం వేయాలా? రెండేళ్లగా ఫోన్ ఎత్తటం లేదంటే దాని అర్థం తన నెంబరు బ్లాక్ చేశారనేగా! అది తెలిసీ గోరంట్ల యిప్పుడే యాగీ చేయడం దేనికి? అయినా 2019 ఎన్నికలలో చివరి నిమిషందాకా బి ఫార్మ్ యివ్వలేదని, యిండిపెండెంటుగా పోటీ చేస్తానని బెదిరించాల్సి వచ్చిందని యిప్పుడు చెప్తున్నారు. దాన్ని బట్టే పార్టీలో ఆయన స్థాయి ఏమిటో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా!

తెలిసీ యిప్పుడే గొంతు విప్పారంటే కారణం ఏమిటి? తను నమ్మిన పార్టీ, తనను పెంచి పెద్ద చేసిన పార్టీ దెబ్బ తింటోంది, దాన్ని సంస్కరించాలి అనే ఆవేదనా? కానీ సంస్కరించడం ఆయన చేతిలో లేదు కదా! పార్టీ అధికారంలో వున్నపుడే అధిష్టానం యీయన్ని పట్టించుకోలేదు, యిప్పుడు అధికారంలో లేకపోయినా, బోల్డంత తీరిక వున్నా ఫోన్లు కూడా తీయటం లేదు. ఈయన గోడు వినటం లేదు, ఈయన అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుందామని కుతూహలమే లేదు. మరి యింక యీయనేం చేయగలడు? ఒరిజినల్ టిడిపి ఆదర్శాలతో వేరే పార్టీ పెట్టగలడా? అంత ఓపిక వుందా? నిధులున్నాయా? గోదావరి జిల్లాలకు వెలుపల పలుకుబడి వుందా? అధికారంలో వుండగా ఏదైనా పదవి చేజిక్కించుకుని, నలుగురికీ ఉపకారాలు చేస్తే కదా, వాళ్లంతా యీయన వెంట నడవడానికి!

పార్టీ పెట్టలేరు సరే, వేరే పార్టీలో చేరతారా? వైసిపి పాలన బాగా లేదని అసెంబ్లీలోనే కాదు, యిప్పుడు కూడా చెప్తున్నాడాయన. అందువలన వైసిపిలో చేరడు. జనసేనలో చేరాలంటే అక్కడా పరోక్షంగా బాబుతో వేగాలి. ఇక మిగిలినది బిజెపి ఒక్కటే! రాజీనామా చేసి తెచ్చే ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ స్థానంలో పోటీ చేసి, ప్రజల్లో పలుకుబడి వుంది కాబట్టి గెలవవచ్చు. తక్కిన బిజెపి నాయకులెవరూ ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి, రాష్ట్ర నాయకత్వం నాకే యివ్వండి అని ఆయన అడగవచ్చు. కాపుల్ని అధ్యక్షులుగా పెట్టినా పార్టీ ముందంజ వేయలేక పోతోంది కాబట్టి నాబోటి కమ్మను నాయకుడిగా పెడితే టిడిపిలో నాలాగ ఫ్రస్ట్రేట్ అయి, దిక్కుతోచక ఉన్న కమ్మ కార్యకర్తలందరినీ లాక్కుని వస్తాను అని చెప్పవచ్చు. 2024 నాటికి రాజమండ్రి నగర నియోజకవర్గంలో కూడా తనో, తన అనుయాయినో నిలబెట్టి గెలిపించుకోవచ్చు. అది ప్రస్తుతం టిడిపి చేతిలో వుంది కాబట్టి ఆ విధంగా వాళ్లపై కసి తీర్చుకున్నానని అనుకోవచ్చు. 2024 నాటికి టిడిపి నీరసించి, బిజెపి పుంజుకుంటే, వైసిపి వ్యతిరేక ఓటు పడి బిజెపికి ఏ పదో, పన్నెండో సీట్లు వస్తే అది తన ఘనతే అని చెప్పుకోవచ్చు.

‘ఇదంతా ఊహాగానం. ఆయన బిజెపిలో చేరడు, స్థానికంగా అచ్చన్నాయుడికి ఆత్మీయులైన ఆదిరెడ్డి కుటుంబానికి విలువ నిచ్చి తనను చిన్నచూపు చూస్తున్నారన్న బాధ కారణంగానే రచ్చ కెక్కాడు, అలక తీరగానే టిడిపిలో కొనసాగుతాడు’ అనుకుంటే ఆయన యింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడో చెప్పగలగాలి. ‘ఆయన గొంతెత్తినది తనకోసం కాదు, తనను నమ్ముకున్న, కార్యకర్తల కోసం, తను సిఫార్సు చేసినా పార్టీలో వారికి ఏ పదవులూ యివ్వకపోవడం చేతనే తన కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించారు’ అనుకుందామా? ‘బాబు పొరపాట్లు చేసి పార్టీని దిగజార్చారు, లోకేశ్ అసమర్థుడు, జూనియర్ రాడు, యీ పార్టీకి భవిష్యత్తు లేదు’ అనుకున్నపుడు తన ఆత్మీయులను ఆ పార్టీలో కొనసాగమని ఆయన ఎందుకంటారు? వాళ్లకు పదవులు రానప్పుడు ‘మునిగే పడవలో ముందు కూర్చుంటే ఏమిటి, వెనక కూర్చుంటే ఏవిటి’ అని ఓదారుస్తారు. వాళ్ల మేలు కోరేవారైతే ‘మాకెలాగూ తప్పదు, మీరైనా వేరే పార్టీలో చేరి బాగుపడండ్రా బాబూ’ అని చెప్తారు.

ఆయనకు పార్టీలో కొనసాగే ఉద్దేశమే వుంటే, ఇప్పుడు అల్లరి చేయకుండా మౌనంగానే వుండి, తక్కిన పదవీకాలం పూర్తి చేసుకునేవారు. చురుగ్గా వుండకపోయినా అడిగేవారు లేరు. ఏమైనా అంటే యీ మధ్యే కరోనా వచ్చింది, అమెరికాలో ఉన్న మా పిల్లలు రెస్టు తీసుకో అని పోరుతున్నారు అనవచ్చు. కావలిస్తే యమదర్శనం అయ్యే ముందు నా దర్శనం కావాలని ఎవరైనా అభిమాని కోరితే, అప్పుడెళ్లి పలకరించి వస్తాను లెండి అని తప్పించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చున్నావేం? అని అడగాలంటే బాబో, లోకేశో ఫోన్ చేసి అడగాలి. వాళ్లకు యీయనతో ఫోన్ కనక్షన్ లేదు. ఏ చినరాజప్పనో పంపి, చెప్పిద్దామంటే యీయన ‘తొల్లి నే చెపితి..’ పద్యాలు పాడతాడు. ఎందుకొచ్చిన గోల, 2024 దాకా సహించి, అప్పుడు ‘మేమూ బిజెపి విధానం అమలు చేస్తున్నాం, 75 ఏళ్లు దాటినవాళ్లకు టిక్కెట్టివ్వం (కొంతమందికి దక్క...)’ అని ఎగ్గొట్టవచ్చు అని టిడిపి అధిష్టానం వూరుకుంటుంది. తన పాటికి తను ఎమ్మెల్యే బెనిఫిట్స్, ప్రజల్లో పరపతి కాపాడుకుంటూ కాలక్షేపం చేసేయవచ్చు.

కానీ ఆయన యీ మార్గాన్ని ఎంచుకోకుండా పోరాటాన్ని ఎంచుకున్నాడు కాబట్టే బిజెపిలో చేరతారేమోనన్న సంశయం. వెళ్లబోతూ టిడిపి యిమేజిని సాధ్యమైనంత భ్రష్టుపట్టించి వెళదామను కుంటున్నాడేమో! ఇవన్నీ ఏమో లే! పూర్తి చిత్రం త్వరలో స్పష్టమౌతుంది. ఆ చిత్రం ఎలా వుండబోయినా, జగన్ మాత్రం యీ ఉదంతం నుంచి ‘పార్టీలో చిన్నా, పెద్దా నాయకులను, ప్రజాప్రతినిథులను తరచుగా కలవాలి’ అనే పాఠం నేర్చుకోవాలి. లేకపోతే అసంతృప్తి లోపల కుతకుతలాడుతూ ఎప్పుడో ఒకప్పుడు భళ్లుమని కుండలా బద్దలవుతుంది అని తెలుసుకోవాలి. గోరంట్ల యిలా బయటపడేవరకూ ఆయనలో యింత బాధ గూడుకట్టుకుని వుందని ఎవరూ వూహించలేక పోయాం. అసెంబ్లీలో ఆయన బాబు పక్కనే కూర్చుని, ఆయనతో పాటు జగన్‌ను దుమ్మెత్తి పోస్తూ వుండేవాడు. టీవీ చర్చల్లో పాల్గొంటూ టిడిపి వాదనను బలంగా వినిపించేవాడు.

ఈ బాబు ఏమిట్రా బాబూ, ఎంతకాలం చూసినా తన చుట్టూ గోరంట్ల, యనమల, సోమిరెడ్డి వంటి ముసలి నాయకులనే తిప్పుకుంటూ వుంటాడు, యువతరానికి ప్రాధాన్యం యివ్వడేమిటి అనుకునేవాణ్ని. ఇప్పుడు యీయన బయటపడ్డాడు. తక్కినవాళ్లలో కూడా ఎలాటి భావాలున్నాయో మనకు తెలియదు. గతంలో బాబుకి ఆత్మీయంగా వున్న నాగం, దేవేందర్ గౌడ్, కెసియార్, మోత్కుపల్లి తర్వాత్తర్వాత ఎన్నేసి మాటలన్నారో చూశాం. కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన అంతా దివ్యంగా వున్నట్లు కాదు. బాబు గోరంట్లకు ఆడియన్స్ యిచ్చి, ఏమిటి మీ బాధ? అని అడిగి వుంటే యీ రోజు ఆయన యింత పురాణం విప్పేవాడు కాడు. భార్యాభర్తల మధ్య గొడవలకు మేరేజి కన్సల్టెంట్లు చెప్పే సలహా ఏమిటంటే, అవతలివాళ్లకు క్వాలిటీ టైము యివ్వండి, వాళ్లు చెప్పేది వినండి అని.

మనలో చాలామందికి గోడు వినిపించుకోవడంలోనే తృప్తి వుంటుంది. తన సమస్యలు తీరవని, వాటికి పరిష్కారాలు లేవని తెలిసినా ‘చూడండి ఇంట్లో, ఆఫీసులో నా కెన్ని సమస్యలో, నేను కాబట్టి తట్టుకుంటున్నాను, మరొకరైతే యీపాటికి ఉరేసుకునేవాడు లేదా ..కునేది’ అని చెప్పుకోవడంలో పరమానందం ఉంది. అవతలివాడు అది విని ‘ఔను పాపం, ఎలా భరిస్తున్నావో, నువ్వు గ్రేట్’ అంటే చాలు. కొన్నాళ్లు సమస్య గురించి బాధపడడం మానేసి కులాసాగా వుంటాడు. అలాకాకుండా అవతలివాడు సరిగ్గా వినకుండానే ‘నీది సమస్యే కాదు’, అనో ‘నీ కంటె బోల్డు సమస్యలున్నవాళ్లు లోకంలో వున్నారు’ అనో, ‘ఎందుకింత బాధపడతావు? ఫలానా విధంగా పరిష్కరించవచ్చు కదా’ అనో అంటే యివతలివాళ్లకు చెడ్డ చిరాకొస్తుంది. ‘నీకు చెప్పడం వేస్టు’ అని లేచి వెళ్లిపోతారు. వాళ్లకు కావలసినది పరిష్కారం కాదు, ఓదార్పు, నువ్వు కాబట్టి సహిస్తున్నావు అనే ప్రశంస. భార్య కానీ, భర్త కానీ అదివ్వలేకపోతే వాళ్ల మధ్య బంధం బలహీనపడుతుంది.

భార్యాభర్తా అనే కాదు, స్నేహితుల మధ్య ఐనా అంతే. మీ ఫ్రెండు ఏదైనా సమస్య చెప్పగానే మీరు రాత్రంతా కూర్చుని ఆలోచించి మర్నాడు ‘నీ సమస్యకు పరిష్కారం దొరికిందోయ్’ అంటే ‘అయ్యో యితను నా గురించి యింత టైము, బుర్ర వెచ్చించాడే’ అని అతను సంతోషించడు. ‘పోవోయ్, యిది నాకు ఎప్పుడో తట్టింది, కానీ వర్కవుట్ కాలేదు. నీకు అనవసరంగా చెప్పాను, వదిలేయ్’ అని విసుక్కుంటాడు. నాయకుడు, కార్యకర్త మధ్య కూడా యిదే జరుగుతుంది. మంత్రిగారి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే ‘మా నియోజకవర్గంలో నా మాట చెల్లుబాటు కావటం లేదండి, కలక్టరు నా మాట వినకపోవడంతో అప్పోజిషన్ వాళ్లు రెచ్చిపోతున్నారు’ అని మొత్తుకుంటాడు. కాస్సేపు విని ‘కలక్టరుగారితో మాట్లాడతానులే. నువ్వేం యిదవకు. అయినా నువ్వెలాటివాడివో సిఎం గారికి తెలుసు. నేనూ ఓ మాట చెప్తాను.’ అంటే సంతోషించి వెళ్లిపోతాడు. తర్వాత ఏమైందని ఫాలోఅప్ చేయడు.

ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న జగన్ నినాదం, టిడిపి వాళ్లు అంటున్నట్లు ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ కాదు. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’! ‘‘యాత్ర’’ సినిమాలో దీన్ని వైయస్ పరంగా చాలా బాగా చూపించారు. సరుకు అమ్ముకోలేక ఒక రైతు ఉరి వేసుకోవడంతో స్వరం పోతుంది. అది తెలిసి పాదయాత్రలో వున్న వైయస్ పరామర్శించడానికి వెళతాడు. ఆ రైతు ఏదో చెప్పబోతాడు కానీ గొంతు పెగలదు. డాక్టర్ ‘‘అతనేం చెప్తున్నాడో వినబడదండి.’’ అంటాడు. వైయస్ ‘‘నాకు వినబడుతోందయ్యా. నేను విన్నాను.’’ అంటాడు. నేను థియేటర్లో చూడలేదు కాబట్టి చెప్పలేను కానీ హాల్లో చప్పట్లు పడే డైలాగది. జగన్ కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను వినివిని వాటికి పరిష్కారాలుగా నవరత్నాలు రూపొందించానని చెప్పుకుంటాడు. మరి ప్రజల గోడు వినేవాడు ఎమ్మెల్యేల బాధలు వినలేడా? ప్రజాప్రతినిథులు ప్రజలు కారా? ఏవేవో పథకాలు పెట్టేసి ‘ఇదంతా జగనన్న ఇచ్చినదే’ అని ప్రజలు అనుకుంటారని మురిసిపోతే చాలా?

పథకాలు ఎన్నయినా పెట్టవచ్చు. కానీ అవి ఎలా అమలవుతున్నాయో చెప్పగలిగేవాళ్లు ప్రజల్లో మసిలే కార్యకర్తలే. బ్రహ్మానంద రెడ్డి దగ్గర పనిచేసినాయన ఒకసారి చెప్పారు – ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి పథకాల అమలు గురించి ఫిర్యాదు చేస్తే అధికారులను పిలిపించి, ఎలా అమలవుతున్నాయని అడిగేవారట. వాళ్లు కింద నుంచి వచ్చిన గణాంకాలు వల్లిస్తూ వుంటే, తాపీగా ‘క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా వుందంటున్నారు’ అంటూ ఎమ్మెల్యేను చెప్పమనేవారట. అప్పుడు అధికారులు నీళ్లు నమిలి, ‘సరిగ్గా కనుక్కుంటామండి’ అనేవారట. ఇలాటి క్రాస్‌చెకింగ్ లేకపోతే అధికారులు అంకెలు చూపించి పాలకులను బురిడీ కొట్టిస్తారు. వాళ్లు ఉన్నదున్నట్లు చెపుతూ వుంటే అధికారంలో వున్న ఏ పార్టీ ఓడిపోదు. ఇంటెలిజెన్సు వాళ్లనీ నమ్మకూడదు. ఇచ్చకాలు చెప్పి ప్రజలు సంతోషంగా వున్నారని చెప్పి పబ్బం గడుపుకుంటారు. ఫలితాలు వచ్చినపుడే పాలకులకు కనువిప్పవుతుంది.

ఆంధ్రలో ఫేక్ చలాన్ స్కాము సంగతే చూడండి. కొద్దికాలంగా నడుస్తోంది కాబట్టి లోకల్ వైసిపి లీడర్లకు తెలిసే వుంటుంది. కానీ అధిష్టానానికి ఎవరు చెప్తారు? ‘‘సాక్షి’’ రిపోర్టరు రిపోర్టు రాసి పట్టుకెళితే ‘మన గురించి మనమే చెడ్డగా రాసుకుంటే ఎలాగయ్యా?’ అంటాడు డెస్క్ ఎడిటరు. ఈనాడు, జ్యోతిలో వస్తే వైసిపి అభిమానులు ‘పచ్చ మీడియా కచ్చరాతలు’ అని కొట్టి పారేస్తారు. కొంప మునిగి కొల్లేరైన తర్వాత తెలుస్తుంది. ఈలోగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినిపోతుంది. మాట్లాడితే తండ్రి పేరు జపించే యీ విషయంలో వైయస్ పంథా ఎందుకు అవలంబించటం లేదు? వైయస్ ప్రతిపక్ష నాయకుల్ని కూడా కలిసేవారు. వీలైతే సాయపడేవారు. పార్టీలో తనతో విభేదించేవారితో మాట్లాడి ఛలోక్తులు విసిరేవారు. ఇక విధేయులైతే చాలు, జైలుకెళ్లి కూడా పలకరించేవారు.

జగన్ తరహా వేరు. ప్రతికక్షులనే కాదు, పరమ విధేయులతో కూడా కలవటం లేదు. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకుని నాయకుల ప్రాముఖ్యతను తగ్గిద్దామనే ప్లాను. ఎన్టీయార్ యిలాగే చేశారు. నేను నిలబెట్టిన గడ్డిపరకలు అని ఎమ్మెల్యేలను తీసిపారేసేవారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడడానికి వారికి భయం. చంద్రబాబు ఆ గడ్డిపరకలనే పోగేసి, తాడుగా పేని మదగజాన్ని కట్టి, కిందకు తోసేశారు. ప్రజలే కాదు, వారిని చేరాల్సిన వంతెన లాటి నాయకులూ ముఖ్యమే. దేవరాజ్ అరసు ఓ సారి అన్నాడు, ఐ హేవ్ ఇన్వెస్టెడ్ యిన్ లీడర్స్ అని. ఛోటా నాయకులను, కార్యకర్తలను కల్టివేట్ చేసుకుంటే వాళ్లు అవసరం పడ్డప్పుడు వెంట నిలుస్తారు. వాళ్లకు పెద్దగా కోరికలుండవు. భుజం తట్టి, ఏం తమ్ముడూ బాగున్నావా? అంటే చాలు.

జగన్ ఎమ్మెల్యేలనే కాదు, మంత్రులనూ కలవడని వార్తలు వస్తున్నాయి. ఎందువలన అంటే ఒకటి అహంకారం కావచ్చు. ఐవరీ టవర్స్‌లో కూర్చున్నవాళ్లంటే ప్రజలకు ఆదరం పోతుంది. అబ్బే, అహంకారం కాదు, ఎమ్మెల్యేలను కలిస్తే వాళ్లు కాంట్రాక్టులు, ఫేవర్లు అడుగుతారు అందుకని దూరం పెడతాడు అనుకుందామా? వాళ్లు అడగవచ్చు. అంతమాత్రాన చేసేయాలని ఏముంది? పైన చెప్పినట్లు పని కాకపోయినా ఓ మాట జగన్ చెవిన వేశాం అనే తృప్తయినా ఎమ్మెల్యేకుండాలి కదా! ఆ ఎమ్మెల్యేకు ఎన్నికలలో సాయపడిన వ్యాపారస్తుడు వుంటాడు. అతనేదో ఫేవర్ అడుగుతాడు. అతన్ని వెంటపెట్టుకునో, పెట్టుకోకనో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గర ఆ ఫేవర్ గురించి ప్రస్తావన చేయకపోతే ఎలా? ఇతనికి ముఖ్యమంత్రి దగ్గర పలుకుబడి లేదు, మనకెందుకూ పనికిరాడు అనుకుంటూ యిక ఆ వ్యాపారస్తుడు ఎమ్మెల్యేకు సాయం చేయడు. పని కాకపోయినా ఫర్వాలేదు కానీ ప్రయత్నమైనా చేయలేదు అనేది ఎక్కువ బాధ కలిగిస్తుంది.

అడిగినవాళ్లందరికీ పనులు చేయడం ఎవరి తరమూ కాదు. కానీ ఎపాయింట్‌మెంట్ యివ్వడం ఒక మర్యాద. అది కూడా దక్కకపోతే పార్టీలో గౌరవం ఏమున్నట్లు? పార్టీ లోంచి బయటకు వచ్చినపుడు ఈటెల ఏమన్నారు? ఎన్ని సార్లు అడిగినా కెసియార్ ఎపాయింట్‌మెంటే యివ్వలేదు, ఆత్మగౌరవం లేనప్పుడు యింకెందుకు పార్టీలో వుండడం అనుకున్నాను అన్నారు. నిజమే పాపం అనుకున్నారు జనం. ఇప్పుడు గోరంట్లా అదే ఆత్మగౌరవం అంటున్నారు. రఘురామ కృష్ణంరాజు కూడా మాటిమాటికి తనకు ఎపాయింట్‌మెంట్ దక్కని విషయం చెప్పారు. వీళ్లకే కాదు, బయటకు వాళ్లకు కూడా జగన్ ఎపాయింట్‌మెంట్ దుర్లభంగా వున్నట్టుంది. చిరంజీవి వంటి చిత్రప్రముఖుడికి ఎపాయింట్‌మెంట్ యిస్తే అది న్యూస్‌లో వస్తోంది. చిత్రపరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. దాని ప్రతినిథికి ఎపాయింట్‌మెంట్ యివ్వడం పెద్ద విశేషమా?

ఇక్కడే యింకో విషయం కూడా చెప్పాలి. ప్రజాస్వామ్యం అన్నాక ప్రతిపక్షాలు ఏవేవో కామెంట్స్ చేస్తూంటాయి. కొన్ని విని వూరుకోవాలి. కొన్నిటికి ఘాటుగా సమాధానం చెప్పాలి. రెస్పాన్స్ యిచ్చే మెకానిజం పకడ్బందీగా వుండాలి. బూతులు వాడితే మొదటికే మోసం వస్తుంది. ప్రత్యర్థులకు ఎలా సమాధానం యివ్వాలనేది తెలియాలంటే, ముఖ్యమంత్రి మనసు తెలియాలి. ఎందుకంటే యిలాటి వాటిల్లో ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ. ఏమీ మాట్లాడకపోతే ఎదుటి వాళ్లతో చేతులు కలిపారన్న ఆరోపణ. జగన్ మనసులో మాట తెలియాలంటే అతనితో యీ మంత్రులకు, అధికార ప్రతినిథులకు నిరంతర యింటరాక్షన్ వుండాలి. ఆ సమావేశాల్లో ముఖ్యమంత్రి నర్మగర్భంగా తన మనసులో మాట వాళ్లకు తెలియపరచాలి. అదేమీ లేకుండా ఎప్పుడో మంత్రివర్గ సమావేశంలో ‘ప్రతిపక్షం చేసే ఆరోపణలకు సమాధానం యివ్వకుండా కొందరు మౌనంగా వుండడం’పై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం లాభం?

వైసిపి ప్రభుత్వ విధానాలన్నీ అద్భుతంగా వున్నాయని పార్టీలో పైనుంచి కింద దాకా అనుకుంటున్నారని మనం అనుకోలేము. అసమ్మతి వున్నపుడు, అసంతృప్తి వున్నపుడు వాటిని వ్యక్తం చేసే వీలుండాలి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు వైసిపిలో కూడా గోరంట్లలు ప్రత్యక్షమవుతారు. పార్టీ యిమేజికి నష్టం చేస్తారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

mbsprasad@gmail.com

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×