Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 02

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 02

సాల్‌కు మీరా అనే భారతీయురాలితో పెళ్లయింది కానీ యితను నిరంతరం పనిలో మునగడంతో విసిగిపోయి, ఆమె ఇండియా వెళ్లి సామాజిక సేవలో పడింది. అందువలన అతనిదీ ఒంటరి బతుకే. తామెవ్వరికీ లేని సిక్స్‌త్‌ సెన్స్‌ క్యారీకి ఉందని అతని నమ్మకం. ఒకవేళ క్యారీ చెప్పినది నిజమే అయితే అని సందేహం వచ్చింది. చివరకు ఒక జడ్జి దగ్గరకు వెళ్లి గతంలో అతను చేసిన వెధవపనిని కప్పెట్టడానికి తను చేసిన సాయాన్ని గుర్తు చేసి, బ్రాడీకి వ్యతిరేకంగా ఒక ఫిసా వారంటు జారీ చేయించుకున్నాడు.

దాని ప్రకారం 4 వారాల పాటు బ్రాడీపై నిఘా వేయడానికి తాత్కాలిక అనుమతి లభించింది. ఆ పత్రాన్ని క్యారీకి యిచ్చి,  డిపార్టుమెంటులో ఎవరికీ తెలియకుండా పని చేయమన్నాడు. ఈ లోగా తన డిపార్టుమెంటులో క్రిప్టోగ్రాఫీ టీముకు బ్రాడీ వీడియోలు చూపించి, తన వేళ్ల కదలిక ద్వారా యిస్తున్న సందేశాలేమిటో డీకోడ్‌ చేసి చెప్పమన్నాడు. వాళ్లు ప్రయత్నించారు కానీ వాటిలో ఒక నియమిత పద్ధతి కనబడటం లేదని చెప్పారు.

బ్రాడీ రాత్రి సరిగ్గా పడుక్కోడు. తన స్నేహితుడు టామ్‌ను తనే గోతిలోకి తోసి కప్పెట్టిన దృశ్యం గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచాడు. అరబిక్‌ భాషలో ఏదో అంటూ భార్య భుజాన్ని గట్టిగా పట్టుకుని గాయపరిచాడు. మర్నాడు ఉదయం అతని భార్య ఆ గాయాలు చూపించి, ఏమిటిదంతా అంది. మానసికంగా సర్దుకోవడానికి నాకు కాస్త టైమియ్యి అన్నాడు. ఆమె, పిల్లలు బయటకు వెళ్లిపోయాక ఏళ్ల తరబడి ఇరాక్‌లో బందీగా ఉన్న పద్ధతిలో తన బెడ్‌రూమ్‌లోనే ఓ మూల ఒదిగి, మౌనంగా కూర్చున్నాడు. క్యారీ యివన్నీ తన కెమెరాల ద్వారా గమనిస్తోంది. సాల్‌కి చెపుతోంది.

క్యారీ అరబ్‌ ప్రాంతంలో పనిచేసే రోజుల్లోనే లిన్‌ (రీడ్‌) అనే ఒక అందమైన అమెరికన్‌ అమ్మాయిని సౌదీ అరేబియా రాచకుటుంబంలో యిన్‌ఫార్మంట్‌గా ప్రవేశపెట్టింది. ఫరీద్‌ (బిన్‌ అబ్దుల్‌) అనే ఒక యువరాజుకి అమ్మాయిల పిచ్చి అని తెలిసి అతని అంతఃపురానికి చేర్చింది. ఇక అక్కణ్నుంచి అతనికి ప్రియురాలిగా ఉండడమే కాక, అతనికి నచ్చే అమ్మాయిలను దేశదేశాల్లో యింటర్వ్యూ చేసి అంతఃపురానికి చేర్చడమే ఆమె పని. ప్రస్తుతం వాషింగ్టన్‌కు ఆ పని మీదే వచ్చింది. ఆమె వెంట నిరంతరం ప్రిన్స్‌ అసిస్టెంటు లతీఫ్‌ ఉంటూ వుంటాడు.

ఆమె ఒకమ్మాయిని యింటర్వ్యూ చేస్తూనే మధ్యలో ఏదో గుర్తుకు వచ్చినట్లు స్పాకు ఫోన్‌ చేసి రేపు ఫలానా టైముకి నాకు ఎపాయింట్‌మెంట్‌ కావాలని అడిగింది. ఆ విధంగా అక్కడ క్యారీని కలుసుకునే ఏర్పాటు చేసుకుంది. క్యారీని కలిసినపుడు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. ఇన్నాళ్లూ స్తబ్దంగా ఉన్న అబు నజీర్‌ యిటీవలే స్వయంగా వచ్చి ప్రిన్స్‌ను కొద్ది నిమిషాలపాటు కలిశాడని, తన సెల్‌లో దాన్ని వీడియో తీశానని చెప్పి చూపించింది. దీని అర్థం నజీర్‌ మళ్లీ చురుకుగా కార్యకలాపాలు చేపట్టబోతున్నాడన్నమాట. దానికి బహుశా ప్రిన్స్‌ ధనసహాయం కోరుతున్నాడన్నమాట.

క్యారీ వెంటనే డేవిడ్‌కు యీ సంగతి చెప్పి లిన్‌కు అమెరికాలో రక్షణ కల్పించాని కోరింది. సమాచారం విలువైనదని డేవిడ్‌ ఒప్పుకుంటూనే లిన్‌కి రక్షణ కల్పించడం మన బాధ్యత కాదన్నాడు. అలా కావాలంటే ప్రిన్స్‌ ఫోన్‌లోంచి డేటాను ఒక పరికరంలోకి డౌన్‌లోడ్‌ చేయాలని, తద్వారా అతని ఫోన్‌లో ఉన్న డేటా, దాని ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్‌ అన్నీ తమకు తెలుస్తాయని చెప్పాడు. అతి త్వరగా డౌన్‌లోడ్‌ చేసే పరికరాన్ని కూడా క్యారీకి యిచ్చాడు.

ప్రిన్స్‌ అసిస్టెంటు లతీఫ్‌తో సహా లిన్‌ హోటల్లోంచి బయటకు వస్తూ ఉండగా క్యారీ మనిషి ఒక టీ కప్‌తో ఆమెను గుద్దేసి, ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించాడు. బాత్‌రూమ్‌లో క్యారీ ఆ పరికరాన్ని లిన్‌కు యిచ్చి ఎలా ఉపయోగించాలో చెప్పింది. ప్రిన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తే నా పని ఆఖరని ఆమె భయపడితే, నిన్ను నిరంతరం మా టీము కాపలా కాస్తోందని ధైర్యం చెప్పింది.

తర్వాతి రోజు లిన్‌ ధైర్యం చేసి, ప్రిన్స్‌ తన సెల్‌ బెడ్‌రూమ్‌లో విడిచి బయటకు వెళ్లిన కొద్ది క్షణాల సమయంలో గబగబా యీ పరికరంలోకి డేటాను డౌన్‌లోడ్‌ చేసేసింది. ఇంతలో ప్రిన్స్‌ తిరిగి వచ్చాడు. అతను గమనించాడేమోనని ఆమె గుండెలు పీచుపీచు మంటూండగానే ఇప్పటిదాకా నువ్వు అందించిన మధురానుభూతికి కానుకగా.. అంటూ ప్రిన్స్‌ ఒక పెద్ద డైమండ్‌ నెక్లెస్‌ ఆమె మెడలో వేశాడు.

బ్రాడీ యిన్నాళ్లదాకా సజీవంగా ఉండి, యిప్పుడే అమెరికాకు తిరిగిరావడం, నజీర్‌ యిప్పుడే మళ్లీ యాక్టివేట్‌ కావడానికి మధ్య లింకు ఉందని క్యారీకి గట్టి అనుమానం. అమెరికా జనం తనను హీరోగా చూస్తున్నారని తెలిసి బ్రాడీ ఒక ముఖ్యమైన పదవి చేజిక్కించుకుని, దాని ద్వారా నజీర్‌కు లోగుట్టు సమాచారం అందిస్తూ సాయపడతాడని ఆమె ఊహ. కానీ బ్రాడీ ఆమె అనుకున్నట్లు ప్రవర్తించటం లేదు, పబ్లిసిటీ కోరుకోవడం లేదు.

ఓ రోజు ఓ జర్నలిస్టు అతని యింటి ప్రాంగణంలో చొరబడి ప్రశ్డలడగబోతే అతని పీక పిసికివేయబోయాడు. ఆ సన్నివేశం తన కొడుకు చూడడంతో డిస్టర్బ్‌ అయ్యాడు. అక్కణ్నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఊరంతా తిరిగి చివరకు ఓ స్టోర్స్‌లో ఓ ప్లాస్టిక్‌ చాప కొనుక్కున్నాడు. రాత్రి ఆస్యంగా ఇల్లు చేరి తన గరాజ్‌లో ఆ చాప దాచాడు. అయితే యివన్నీ క్యారీ కంట పడలేదు. ఎందుకంటే బయటకు వెళ్లినపుడు ఏం చేశాడో తెలియలేదు. గరాజ్‌లో ఏం దాచాడో చూద్దామంటే అక్కడ కెమెరాలు పెట్టలేదు. నువ్విచ్చిన బజెట్‌లో అవి రాలేవు అన్నాడు వర్జిల్‌.  

ఆ రాత్రి డిన్నర్‌కి బ్రాడీ స్నేహితుడు, జెసికా ప్రియుడు ఐన మైక్‌ (ఈ సంగతి క్యారీ టీము గమనించారు. విడిగా వున్నపుడు వాళ్లు మాట్లాడుకున్నవి వీళ్లకు తెలిసిపోయింది) వచ్చాడు. అతను కెప్టెన్‌ హోదాలో ఉన్నాడు. ‘మళ్లీ మెరీన్స్‌లో చేరరాదా? ప్రమోషన్‌ యిస్తారు, డబ్బు యిబ్బంది కూడా ఉండదు.’ అని హితవు చెప్పాడు. బ్రాడీ అది అవమానకరంగా ఫీయ్యాడు. ‘నీచేత యీ ఆఫర్‌ చేయించిన పెద్దలకు నన్ను పోస్టర్‌బాయ్‌గా చూడడానికి ప్రయత్నించవద్దని చెప్పు. అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకునే రోజులు ముగిసిపోయాయని చెప్పు’ అంటూ అరిచాడు. ఇది విని క్యారీ, అయితే బ్రాడీ అమాయకుడన్నమాట అనుకుంది.

ఆ రాత్రే బ్రాడీకి గతం గుర్తుకు వచ్చింది. అతను ఒక రోజున చూసుకుంటే బంధనాలన్నీ విప్పేసి వున్నాయి. తన గదిలోంచి బయటకు వచ్చి ఆ కాంపౌండులో అటూయిటూ నడుస్తూ ఉన్నా ఎవరూ ఏమీ అనటం లేదు. అతను ఒక పెద్ద హాల్లోకి తొంగి చూస్తే అక్కడ అనేకమంది ముస్లిములు నేలమీద కార్పెట్లు పరిచి నమాజ్‌ చేసుకుంటున్నారు. ఈ దృశ్యం గుర్తుకు రాగానే బ్రాడీకి మెలకువ వచ్చేసింది. బెడ్‌రూమ్‌లోంచి సడి చేయకుండా గరాజ్‌కు వెళ్లి కొత్తగా కొన్న మ్యాట్‌ వేసుకుని నమాజ్‌ చేయసాగాడు.

అంటే బందీగా ఉన్న రోజుల్లో అతను మతం మార్చుకున్నాడన్నమాట అని మనకు అర్థమౌతుంది. అయితే యిదేమీ క్యారీకి తెలియదు. ఆమెకు తెలిసిందల్లా మర్నాడు బ్రాడీ మెరీన్‌ యూనిఫామ్‌ వేసుకుని బయటకు వెళ్లి అక్కడ తనకోసం వేచి ఉన్న మీడియాతో దేశం, దేశసేవ, కుటుంబం కూడా చేసే త్యాగం గురించి లెక్చరివ్వడం. అది చూస్తూనే క్యారీ సాల్‌కు ఫోన్‌ చేసి ‘అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది. అతను హీరో కార్డు ప్లే చేస్తున్నాడు’ అంది.

ఒక టీవీ ఛానెల్‌ వాళ్లు అతన్ని, అతని ఫ్యామిలీని యింటర్వ్యూ చేస్తామన్నారు. అతను సరేనన్నాడు కానీ, అతని భార్య జెసికాకు, కూతురు డానాకు అది యిష్టం లేదు. జెసికా తన స్నేహితురాలితో ‘మీడియా ఎటెన్షన్‌ పెరిగినకొద్దీ, నాకు మైక్‌తో ఉన్న అనుబంధం బయటకు వచ్చేస్తుంది. భర్తకోసం యిన్నాళ్లూ వేచివున్న పతివ్రతగా వీళ్లు బిల్డప్ చేసిన యిమేజి చెదిరిపోతుంది. ఇదంతా నాకు అవసరమా? చెఱ నుంచి బయటకు వచ్చిన బ్రాడీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఒళ్లంతా గాయాల మచ్చలే. మేం కలిసి వుంటామో, విడిపోతామో తెలియదు. కానీ ప్రేక్షకుల చప్పట్ల కోసం కెమెరా ముందు మేం ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంలా నటించాలి.’ అంటూ వాపోయింది.

డానా అయితే తన తల్లితో ‘నీకూ మైక్‌కు ఉన్న ఎఫైర్‌ నాకు తెలుసు. ఇప్పుడు పెద్ద విశ్వాసపాత్రమైన భార్యగా కెమెరా ముందు ఎలా నటిస్తావ్‌?’ అని నిలదీసింది. తన స్నేహితులతో ‘నేను టీవీ ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడి, అందరి పరువూ తీస్తాను చూడు’ అంది కూడా. ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండు జాండర్‌ ఉన్నాడు. అతను ఆమె తమ్ముడికి ట్యూటర్‌. కానీ అది మానేసి యీమెతో రొమాన్సు చేస్తూంటాడు. జెసికా యిది సహించలేదు. కూతుర్ని తిడుతూంటుంది. కానీ 16 ఏళ్ల వయసు పిల్ల కాబట్టి ఊరుకో అంటాడు బ్రాడీ. డానా తన తలిదండ్రుల గురించి జాండర్‌తో తన మనసు విప్పి చెప్పుకుంది.

బ్రాడీ యివన్నీ వూహించాడు. నిజానికి తిరిగి వచ్చిన వెంటనే మైక్‌ తన స్థానంలో పాతుకుపోయిన సంగతి గమనించాడతను. భార్యకూ, మైక్‌కు రొమాన్సు నడుస్తోందని,  పిల్లలూ  అతనితో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారని అర్థం చేసుకున్నాడు. కానీ దాని గురించి భార్యని నేరుగా అడగదలచుకోలేదు. కూతురు టీనేజిలో ఉంది కాబట్టి, తల్లిని ద్వేషిస్తోందని గ్రహించి, ఇంటర్వ్యూకి ముందు ఆమెను విడిగా పిలిచి ‘అమ్మ తప్పొప్పులు ఎంచకు. మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో యిరుక్కున్నాం. సాధారణ స్థితి రావడానికి, మనమంతా రీఎడ్జస్టు కావడానికి కొంత టైము పడుతుంది’ అని నచ్చచెప్పాడు.

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన టీవీ కెమెరాల వాళ్లు తమ యాంగిల్స్‌ కోసం సామాను అటూయిటూ జరుపుతామన్నారు. అలా జరిగితే తాము పెట్టిన కెమెరాలు బయటపడతాయని క్యారీ టీము భయపడింది. కానీ అదృష్టవశాత్తూ బ్రాడీ ఎక్కడున్నవి అలాగే ఉండనీయ మన్నాడు. టీవీ వాళ్లు మొదట బ్రాడీని యింటర్వ్యూ చేశారు. ‘యుద్ధఖైదీగా ఎలా వుండగలిగావు?’ అని అడిగారు. ‘వాళ్లు నా నమ్మకాలపై దెబ్బ కొడదామని చూశారు. మీ మెరీన్‌ ఫోర్స్‌ వాళ్లు నీ గురించి పట్టించుకోలేదు చూశావా అన్నారు. మీ ఆవిడ వేరే ఎవరితోనో కులుకుతోందని చెప్పారు. అయినా అవన్నీ నేను తట్టుకున్నాను.’ అని చెప్పాడితను.

నిజానికి అదే సమయంలో అతని మనసులో నజీర్‌ తనను దెబ్బల నుంచి తప్పించి, తిండి పెట్టడం మసలుతోంది. కానీ పైకి మాత్రం తను పడిన కష్టాల గురించే చెపుతున్నాడు. తర్వాత కుటుంబంతో జరిగిన యింటర్వ్యూ సజావుగా నడిచింది. డానా కూడా తగువిధంగా మాట్లాడి కుటుంబం పరువు కాపాడింది.

లిన్‌ క్యారీని కలిసి డేటా డౌన్‌లోడ్‌ చేసిన పరికరాన్ని వెనక్కి యిచ్చేసింది. గత ఏడాదిగా ప్రిన్స్‌ చెంతనే ఉన్నాననీ, అతనికి టెర్రరిస్టు లింకులు ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదని, నజీర్‌ అతన్ని మర్యాదపూర్వకంగా కలిసి వుండవచ్చని చెప్పింది. ఆ పరికరంలోని డేటాను క్యారీ తన డిపార్టుమెంటులో శోధింపచేసినా, అతను టెర్రరిస్టులకు డబ్బు బదిలీ చేసిన దాఖలాలు ఏవీ కనబడలేదు. తర్వాత లిన్‌ కొత్తగా చేర్చుకున్న అమ్మాయిలతో ఓ నైట్‌ క్లబ్‌లో వుండగా లతీఫ్‌ వచ్చి ‘‘ప్రిన్స్‌ ఒక పెద్ద వ్యాపారస్తుడితో కలిసి వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. నిన్ను వెళ్లి అతన్ని సుఖపెట్టమన్నారు.’’ అని చెప్పాడు. ‘‘ఇలాటిది ఎప్పుడూ చెప్పలేదే! ఏమైనా ఉంటే ఆయనే చెప్పేవాడుగా!’’ అంది. ‘‘ఎవరికి ఎలా చెప్పించాలో ఆయనకు తెలుసు.’’ అన్నాడు లతీఫ్‌ గుంభనంగా.

లిన్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కణ్నుంచి క్యారీకి చెప్పింది. వాడెవడో టెర్రరిస్టు అయి వుంటాడని గెస్‌ చేసిన క్యారీ ‘తప్పకుండా వెళ్లు, నీకు రక్షణగా మా టీము ఉంది.’ అని ధైర్యం చెప్పింది. నిజానికి తనూ, వర్జిల్‌ మాత్రమే ఆమె వెనక ఫాలో అయ్యారు. లిన్‌ కారెక్కిన కాస్సేపటికి ఓ సందులోకి రాగానే కారు డ్రైవరే ఆమెను కాల్చి చంపేసి డైమండ్‌ నెక్లెస్‌ లాగేసుకున్నాడు. క్యారీ, వర్జిల్‌ వచ్చేసరికి ఆమె శవం సందులో పడి ఉంది. రక్షిస్తానని చెప్పి విఫలమైనందుకు క్యారీ చాలా బాధపడింది. ‘ఇక్కడుంటే ప్రమాదం, వెళ్లిపోదాం’ అని వర్జిల్‌ ఆమెను తొందరపెట్టడంతో శవాన్ని అక్కడే వదిలేసి వచ్చింది.

ఆసుపత్రిలో శవాన్ని చూడడానికి వచ్చిన ఆమె తలిదండ్రులను కలిసి బాధ పంచుకుంది. లిన్‌ను రక్షించలేకపోయిన వేదనను సాల్‌తో పంచుకుంటూ, తన డేటా డౌన్‌లోడ్‌ చేసిన విషయం తెలుసుకుని ప్రిన్స్‌ ఆమెను చంపించేసి వుంటాడంది. అదే సమయంలో లిన్‌ హత్య గురించి ప్రిన్స్‌ను పోలీసులు ప్రశ్నలడిగిన దృశ్యాలు టీవీలో వచ్చాయి. అవి చూసి ప్రిన్స్‌కి లిన్‌ అంటే నిజంగా యిష్టమని వీళ్లకు అర్థమైంది. అతనికి టెర్రరిస్టులతో లింకులు లేవేమో అని కూడా తోచింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?