cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 07

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 07

టామ్‌ అనే టెర్రరిస్టు ఓ తుపాకీ పట్టుకుని పట్టుబడకుండా రాజధానిలో తిరగడం దేశాధ్యక్షుడికి నచ్చలేదు. అందర్నీ పిలిచి ఏదో ఒకటి చేయాలని గట్టిగా చెప్పాడు. టామ్‌ భయంతో దాదాపు హౌస్‌ అరెస్టులో దాక్కోవలసి వచ్చిన వాల్డెన్‌కు కూడా మంటగా ఉంది. డేవిడ్‌తో ‘నేను అధ్యక్షపదవికి పోటీ చేద్దామను కుంటున్నాను. టెర్రరిజం ఆపగలిగే మొనగాడిని నేనే అని చెప్దామనుకుంటే పిరికిపందలా యిలా ఓ కలుగులో కూర్చోమంటున్నారు మీరు. టామ్‌ అనబడేవాడు వీడే అని చెప్పి ఎవరో ఒకర్ని లేపేయండి.’ అని గట్టిగా చెప్పాడు. ఆ విషయం డేవిడ్‌ సాల్‌కు చెప్పి మనం ఏదో ఒకటి చప్పున చేయాలి అన్నాడు. టామ్‌ ప్రాజెక్టుకి యిన్‌చార్జిగా వున్న క్యారీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి త్వరగా వస్తే బాగుండును అన్నాడు.

క్యారీ శారీరక ఆరోగ్యం బాగుపడింది కానీ చికిత్స జరిగే సమయంలో ఒక అనర్థం జరిగింది. బైపోలార్‌ డిజార్డర్‌కై తను వేసుకునే మందులు యీ సమయంలో వేసుకోలేక పోయింది. ఎందుకంటే ఆసుపత్రిలో వుండగా చాటుగా మందులు వేసుకునే అవకాశం ఉండదు. క్రమం తప్పకుండా ఆ మందు వేసుకోకపోవడం వలన ఆమెలో ఆ డిజార్డర్‌ తీవ్రస్థాయికి చేరింది. డిశ్ఛార్జి చేసే రోజున ఆమె పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగింది. వాళ్లు సంతకం పెట్టమని పెన్ను యిస్తే నాకు గ్రీన్‌ పెన్ను కావాలి అంటూ పేచీ పెట్టింది. ఆసుపత్రి సిబ్బంది ఆఫీసుకి ఫోన్‌ చేస్తే అదృష్టవశాత్తూ సాల్‌ తీసుకున్నాడు. తను వచ్చి చూస్తే క్యారీ ఎప్పటిలాగ లేదని, గబగబా మాట్లాడుతూ మానసికరోగిలా ప్రవర్తిస్తోందని గ్రహించాడు. ఇదేమిటని డాక్టర్ల నడిగితే మాకేమీ తెలియటం లేదు, ఆమె పర్శనల్‌ డాక్టర్ల నడగండి అన్నారు. క్యారీని అడిగితే మా అక్క మాగీకి చెప్పమంది.

సాల్‌ క్యారీని యింటికి తీసుకుని వచ్చి మాగీకి ఫోన్‌ చేశాడు. ఆమె వచ్చి క్యారీకున్న సమస్యేమిటో చెప్పి రహస్యంగా వుంచమంది.  బాంబు  పేలుడులో సహచరులు మరణించడం, మందులు వేసుకోకపోవడం వలన పరిస్థితి విషమించిందని చెప్పి మందులిచ్చింది. మధ్యలో చాలా గ్యాప్‌ వచ్చేసింది కాబట్టి మళ్లీ కోలుకునేందుకు వారానికి పైగా పట్టినా పట్టవచ్చు అని చెప్పింది. మానసిక ప్రశాంతత అవసరం. ఎవరో ఒకరు కనిపెట్టి చూస్తూండాలి. పగలు నేనుంటాను కానీ రాత్రికి మా యింటికి వెళ్లిపోవాలి. మీరు వచ్చి నైట్‌ షిఫ్ట్‌ ఉండగలరా? అంది. సాల్‌ సరేనన్నాడు.  క్యారీ సమస్య ఆఫీసులో ఎవరికీ చెప్పకూడ దనుకున్నాడు. డేవిడ్‌తో ‘ఆమె ఆరోగ్యం యింకా కుదుటపడలేదు. డాక్టర్లు కాస్త రెస్టు తీసుకోమన్నారు’ అని చెప్పి మేనేజ్‌ చేశాడు. క్యారీ మామూలు మనిషయ్యేవరకు ఓపిక పట్టాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.

బ్రాడీ తన కుటుంబాన్ని గెట్టీస్‌బర్గ్‌ అనే దగ్గరి వూరికి వీకెండ్‌ పిక్నిక్‌కి తీసుకెళదామనుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అస్సలు టైము దొరకదు, ఓ సారి అందరం వెళ్లొద్దామంటే భార్య సంతోషంగా సరేనంది. కూతురు డానా కాస్సేపు గునిసింది. మొత్తానికి తండ్రి అనునయంగా చెప్పగా సరేనంది. కార్లో అందరూ సరదాగా ఉన్నారు. బానిసత్వ నిర్మూలనకై అబ్రహాం లింకన్‌ సేనలు చేసిన యుద్ధాల్లో గెట్టీస్‌బర్గ్‌ వద్ద జరిగిన యుద్ధం అత్యంత కీలకమైనది. బానిసలను వ్యవసాయకూలీలుగా ఉపయోగించుకుంటూ, లింకన్‌ను ఎదిరించి అంతర్యుద్ధం లేవనెత్తిన దక్షిణాది రాష్ట్రాల సమాఖ్యను ఓడించినది అక్కడే.  ఆ యుద్ధం జరిగిన చోటికి తీసుకెళ్లి, ఆ నాటి యుద్ధంలో లింకన్‌ సైన్యం ఎత్తుగడలను, త్యాగనిరతిని బ్రాడీ కళ్లకు కట్టినట్లు వర్ణించి చెపితే భార్యాబిడ్డలు ముగ్ధులై పోయారు.

‘ఒక లక్ష్యం అంటూ పెట్టుకున్నాక, దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. మా నాన్న మెరీన్‌. నేను మెరీన్‌. నువ్వు కూడా అదే బాటలో నడిచి దేశసేవ చేయాలి.’ అని బ్రాడీ కొడుకుకి ఉద్బోధించాడు. ఇదంతా చూసి డానా తండ్రితో ‘దేని గురించైనా నీకింత క్షుణ్ణంగా తెలుసని నేనెన్నడూ అనుకోలేదు.’ అని మెచ్చుకుంది. ‘ఆ మాట సరే కానీ, నేను రాజకీయాల్లోకి వెళుతున్నాను, అనుకోని సంఘటనలు అనేకం జరగవచ్చు. నాకేమైనా అయితే నువ్వు అమ్మను చూసుకోవాలి.’ అని బ్రాడీ కోరాడు.

లంచ్‌ సమయానికి అందరూ ఊళ్లోకి వెళ్లారు. అందర్నీ హోటల్‌కు వెళ్లి కూర్చోమని చెప్పి, బ్రాడీ మందులు కొనుక్కోవడానికి వెళతానన్నాడు. కానీ అతను ఒక బట్టలషాపుకి వెళ్లి, దాని వెనకవైపు ఉన్న టైలరింగ్‌ షాపుకి వెళ్లాడు. అక్కడ ఒక టైలర్‌, బాంబు అమర్చిన ఒక జాకెట్‌ కుట్టి తయారుగా వుంచాడు. బ్రాడీ రాగానే తొడుక్కుని చూడమన్నాడు. ఏ స్విచ్‌ నొక్కితే బాంబు  పేలుతుందో చూపించాడు. తొడుక్కున్నాక బ్రాడీ నిశ్చలంగా ‘పేలగానే నా తల ఛిద్రమౌతుందా, తెగి పడుతుందా?’ అని అడిగాడు తప్ప బెదరలేదు. తర్వాత టైలర్‌ దాన్ని ఓ పాకెట్‌గా చుట్టి యిచ్చాడు. బ్రాడీ దాన్ని కారు డిక్కీలో పెట్టి భోజనానికి రాబోయాడు. తండ్రి చాలాసేపు కనబడకపోవడంతో డానా కలవరపడింది. తిరిగి వచ్చి హోటల్లోకి రాకుండా కారు డిక్కీ తెరవడం చూసి, అక్కడకు వచ్చి ‘ఏమిటది?’ అని అడిగింది. ‘మీ అమ్మకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌. ఎవరికీ చెప్పకు.’ అన్నాడు బ్రాడీ.

రెస్టారెంట్‌లో ఒకతను బ్రాడీని చూసి ‘నువ్వు వీరుడివి, దేశభక్తుడివి. ఎన్నికలలో నిలబడుతున్నావుట కదా. నా ఓటు నీకే.’ అని గట్టిగా అరిచాడు. బ్రాడీ నేనేమీ గొప్పవాణ్ని కాదని అంటున్నా, ఆ వ్యక్తితో బాటు మరి కొందరు గొంతులు కలిపి, అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. వాళ్లందరికీ బ్రాడీ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. కుటుంబం గర్వంగా ఫీలైంది. ఆ రాత్రి జెసికా ‘ఒక మంచివాడి కోసం ప్రజలు యింతలా ఎదురు చూస్తున్నారని తెలియదు. నేను అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ముందే ఒప్పుకోవాల్సింది.’ అంది. ఆమె చాలా ఆనందపడుతూ భర్తతో రతిలో పాల్గొంది. కానీ బ్రాడీ వరస చూస్తే అతను దేని కోసమో ఆత్మాహుతి చేసుకోబోతున్నాడని, కుటుంబానికి గుడ్‌బై చెపుతున్నాడని మనకు అర్థమవుతోంది.

తల్లి మాట ఎలా వున్నా కూతురికి మాత్రం తండ్రి వరస నచ్చలేదు. పొద్దున్న లేచి కారు డిక్కీ తెరిచి ప్యాకెట్‌ తెరవబోయింది. సరిగ్గా సమయానికి బ్రాడీ వచ్చి లాక్కున్నాడు. ఎందుకంత ఆతృత, అమ్మకు యిచ్చాక నీకూ చూపిస్తుందిగా అన్నాడు. ఎందుకంత రహస్యం అని ఆమె అడిగింది. తండ్రి చెప్పిన సమాధానానికి తృప్తి పడలేదు. ఇంటికి తిరిగి వచ్చాక తన బాయ్‌ఫ్రెండ్‌ జాండర్‌ దగ్గర తన అనుమానాలు వెళ్లబోసుకుంది. బ్రాడీ నడివీధిలో ఓ పదిహేను నిమిషాల పాటు ఏదో ఆలోచిస్తూ, అచేతనంగా నిలబడడాన్ని తీసిన వీడియోను చూపించి ‘‘మా నాన్న ఆందోళనగా వున్నట్లు కనబడటం లేదూ’’ అని అడిగింది. అతను కూడా బ్రాడీ ప్రవర్తనలో ఏదో మర్మం ఉందన్నాడు. ఏమిటో యిద్దరూ ఊహించలేక పోయారు.

ఇటు క్యారీ యింట్లో స్థిరంగా కూర్చోలేకపోతోంది. ఆందోళనతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఏదో ఉపద్రవం జరుగబోతోంది, నేను యింట్లో కూర్చుంటే లాభం లేదు అంటోంది. అక్క వారిస్తున్నా యింట్లోంచే పని చేయడానికి కూర్చుంది. నజీర్‌ కార్యకలాపాల గురించి, అతని అనుయాయుల గురించి తను సేకరించిన సమాచారాన్నంతా తేదీలవారీగా ఓ టైమ్‌లైన్‌ మ్యాప్‌గా తయారు చేయడానికి కూర్చుంది. ఒక్కొక్క ఫేజ్‌ను ఒక్కో రంగు హైలైటర్‌తో హైలైట్‌ చేసింది. కానీ అక్క ఆమెను మందలించి నిద్రమాత్రలిచ్చి పడుక్కోబెట్టింది. అవేళ రాత్రి సాల్‌ వచ్చినపుడు యిదంతా చూశాడు. ఐలీన్‌ కారు డ్రైవర్‌ లైసెన్స్‌ కాపీ దగ్గర్నుంచి ఆమె సేకరించడం చూసి, తన శ్రద్ధకు ముచ్చట పడ్డాడు. రాత్రంతా మెలకువగా కూర్చుని కుప్పగా పడి వున్న పేపర్‌ కటింగ్సన్నీ ఓ గోడ మీద ఆమె సూచించిన రంగుల ప్రకారం అంటిస్తూ పోయాడు.

మర్నాడు పొద్దున్న క్యారీ యిదంతా చూసి కరిగిపోయింది. సాల్‌ను ఎంతో మెచ్చుకుంది. సాల్‌ ‘అది సరే కానీ నీకు యీ డిజార్డర్‌ రావడానికి కారణం నేనే అనుకుంటాను. ఇరాక్‌కు పంపించకుండా వుండాల్సింది. అక్కడి టెన్షన్లతో నీకు యీ వ్యాధి వచ్చి వుంటుంది.’ అన్నాడు జాలిగా. ‘అదేం లేదు, కాలేజీ రోజుల్నించి వుంది. మా నాన్నకు ఉంది. ఆయన చాలాకాలం అశ్రద్ధ చేసి యిప్పుడు మందులు వేసుకుంటున్నాడు. నేను పైకి చెప్పుకోలేను కాబట్టి మందు దొరక్క, సరిగ్గా వేసుకోక యిబ్బంది పడుతున్నాను.’ అంది. ఇద్దరూ కలిసి టైమ్‌లైన్‌ మ్యాప్‌ని పరీక్షగా చూశారు. నజీర్‌ కార్యకలాపాల్లో కొన్నాళ్ల గ్యాప్‌ వుంది. ఏదో దుర్ఘటన కారణంగా అనారోగ్యం కలగడమో, సంతాపదినాలు గడపడమో జరిగి వుండాలి. ఏమిటది? అది కనుక్కుంటే ఆ దిశగా ఆలోచిస్తే అతని భవిష్యత్‌ ప్రణాళిక తెలుస్తుంది.

నిజానికి అది ఐసా మరణించిన కాలం. అయితే అమెరికా సైన్యాలు డ్రోన్‌ దాడి చేశాయని, దానిలో నజీర్‌ కొడుకు ఐసా చచ్చిపోయాడని సిఐఏలో ఎవరికీ తెలియదు, డేవిడ్‌కు తప్ప. అందుకనే క్యారీ, సాల్‌ కారణం ఊహించలేక పోయారు. ‘టామ్‌ని షూటర్‌గా పెట్టుకుని ఒకళ్లనో, యిద్దరినో కాల్పించడంతో నజీర్‌ ఆగడు. ఏదో పెద్ద ప్లానే వేసి వుంటాడు, దానికి యిది సైడ్‌ షో మాత్రమే’ అని క్యారీ వాదన. సాల్‌ అంగీకరించాడు. సాల్‌ వెళ్లే వేళకు క్యారీ అక్క, తండ్రిని వెంటబెట్టుకుని వచ్చింది. ఆయన తను దగ్గరుండి కూతుర్ని చూసుకుంటానన్నాడు. నాకీ బాధలు తెలుసు, యిప్పుడు కాస్త జాగ్రత్తగా వుంటే మామూలుగా అయిపోతావు, ఊరికే ఆవేశపడకు అని కూతురికి హితవు చెప్పాడు. కానీ క్యారీ ఊరుకోలేదు. ఆ గ్యాప్‌ గురించి బ్రాడీని అడిగితే తెలుస్తుంది అనుకుని, అతనికి ఫోన్‌ చేసింది. అతను ‘నేను స్వయంగా వస్తే మంచిదేమో కదా’ అన్నాడు. అయితే సాయంత్రం మా యింటికి రాగలవా? అంది క్యారీ.

అతను వచ్చేవేళకి, పార్కులో తగిలిన గాయాలకు మేకప్‌ పూసుకుని, మంచి బట్టలు వేసుకుని, ఆకర్షణీయంగా తయారై కూర్చుంది. తలుపు చప్పుడైతే ఛట్టున వెళ్లి తీసింది. చూస్తే, వచ్చినది బ్రాడీ కాదు, డేవిడ్‌!  జరిగిందేమిటంటే ఐసా మరణం గురించి క్యారీకి అనుమానం తగిలిందని, ఆ దిశగా ముందుకు సాగితే తన ఆత్మాహుతి ప్రయత్నం గురించి క్యారీ ఊహించేస్తుందని బ్రాడీ భయపడ్డాడు. సిఐఏలో ఆమెకు తప్ప మరెవరికీ తనపై అనుమానం లేదు. క్యారీని సిఐఏ నుంచి ఎలాగైనా తప్పిస్తే తన ప్రయత్నం నిర్విఘ్నంగా సాగుతుందని అనుకున్నాడు. ఆమెను తప్పించాలంటే తను ఆమెపై ఆరోపణలు చేయాలి.

డేవిడ్‌తో తనకున్న పరిచయాన్ని పురస్కరించుకుని, అతని వద్దకు వెళ్లి క్యారీకి తనకు శారీరక సంబంధం ఏర్పడిందని, అది అడ్డుపెట్టుకుని ఆమె తనను వేధిస్తోందని, తన యింట్లో కెమెరాలు పెట్టి గూఢచర్యం చేస్తోందని ఫిర్యాదు చేశాడు. అసలే క్యారీ అంటే మంటగా ఉన్న డేవిడ్‌కు యిది అందివచ్చింది. వెంటనే ఆమెనుంచి ఆ ప్రాజెక్టును వెనక్కి తీసేసుకుందామని నిశ్చయించాడు. ఆఫీసులో దాని తాలూకు కాగితాలన్నీ స్వాధీనం చేసుకుని, యింట్లో ఉన్నది కూడా తీసుకుందామని వచ్చాడు. బ్రాడీ ఫిర్యాదు గురించి చెప్పాడు.

ఈ పరిణామాలతో క్యారీ బిత్తరపోయింది. డేవిడ్‌, సాల్‌ గోడ మీద ఏర్పాటు చేసిన టైమ్‌లైన్‌ అంతా చూశాడు. ‘ఆఫీసు కాగితాలు యింటికి తీసుకురావడం నేరమని తెలియదా?’ అని తిట్టి, అవన్నీ పీకేయమని తన సిబ్బందికి చెప్పాడు. నా శ్రమంతా వ్యర్థమై పోతోందని, జరగబోయే ఘోరాన్ని ఆపే తన ప్రయత్నం విఫలమౌతుందని పిచ్చిపిచ్చిగా అరవసాగింది. ఆమె మానసిక స్థితి బాగా లేదని డేవిడ్‌ గమనించాడు. ‘నువ్వు అన్‌ఫిట్‌. నీ ప్రవర్తనా బాగా లేదు. అనుమతులు తీసుకోకుండా ఏవేవో చేసేస్తున్నావ్‌. అందుకని నీ ఉద్యోగం తీసేశా.’ అని చెప్పేశాడు. అవమానం, బాధ ముప్పిరికొనగా క్యారీ కుప్పకూలింది. 

క్యారీ ఒక్కదాన్ని తప్ప తక్కినందరినీ నమ్మించగలిగిన బ్రాడీ తన ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్నాడు. తను ఎందుకు ఆ దాడి జరపాల్సి వచ్చిందో మరణానంతరం సభ్యసమాజానికి చెప్పాలని అనుకుని మెరీన్‌ యూనిఫాం వేసుకుని ఓ షెడ్‌లో వీడియో టేపు రికార్డు చేశాడు. ‘నేను ఫలానా. దేశభక్తుడనైన నేను ఒక దేశద్రోహిని తుదముట్టించడానికే యీ పని చేస్తున్నాను...’ అంటూ కెమెరాలోకి చూస్తూ వైస్‌ ప్రెసిడెంటుగా ఉన్న వ్యక్తి దేశానికి అత్యంత ప్రమాదకారి అని, అమాయకులైన 82 మంది  పిల్లలపై డ్రోన్‌ ఎటాక్‌ చేయించిన అతనికి జీవించే హక్కు లేదనీ చెప్పాడు. రికార్డింగు పూర్తయ్యాక కెమెరాలోని మెమరీ చిప్‌ను విడిగా తీసి తన యింటి పెరట్లో ఒక రాతి గోడ యిటికల మధ్య దాన్ని అమర్చాడు. దానికి  పక్కనున్న బెంచీ మీద చాక్‌పీస్‌తో ఓ గీత గీశాడు. అతని మరణానంతరం నజీర్‌ మనుషులు ఆ చిప్‌ను సేకరించి, అమెరికా ప్రజలకు విడుదల చేసి, తాము వైస్‌ ప్రెసిడెంటును ఎందుకు చంపించామో చెప్పాలని ప్లాను.

బ్రాడీ దుష్టప్రణాళికను పసిగట్టినా, ఆధారాలు చిక్కక, ఎవర్నీ నమ్మించలేక నగవుల పాలై, ఉద్యోగం కూడా పోగొట్టుకున్న క్యారీ దుఃఖసముద్రంలో మునిగిపోయింది. ఆమె పట్ల ఎంతో సానుభూతి కల సాల్‌ ఆమెను చూడడానికి ఆమె యింటికి వెళ్లాడు. మూడు రోజులుగా క్యారీ ఏమీ తినటం లేదని, గది వదలి రాకుండా నిరంతరం బాధపడుతోందని అక్క చెప్పింది. సాల్‌ వెళ్లి ఓదార్పుగా మాట్లాడి, ‘‘నువ్వు ఉద్యోగంలో లేకపోయినా నజీర్‌ కార్యకలాపాల్లో మధ్యలో విరామం ఎందుకు వచ్చిందన్న విషయంపై నేను పరిశోధన కొనసాగిస్తాను.’’ అని హామీ యిచ్చాడు. ‘‘బ్రాడీ ఎందుకలా నమ్మకద్రోహం చేశాడు? మా ఎఫైర్‌ గురించి డేవిడ్‌కు ఎందుకు చెప్పాడంటావ్‌?’’ అని అడిగింది. చూడబోతే యీమె బ్రాడీతో తలమునకలా ప్రేమలో పడినట్లుందే అనుకున్నాడు సాల్‌. 

వైస్‌ ప్రెసిడెంటు వాల్డెన్‌ తన అనుచరులను, పార్టీ ప్రముఖులను పిలిచి ‘నేను అధ్యక్షపదవికి పోటీ చేయబోతున్నానని రేపు ప్రకటించేస్తాను’ అన్నాడు. అక్కడే వున్న డేవిడ్‌ ‘దేశప్రముఖులందరూ ఆ సమావేశానికి వస్తారు. టామ్‌ ఎటాక్‌ చేస్తే అందరికీ ప్రమాదమే’ అని తన భయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘టామ్‌ ఒక్కడే కదా’’ అని వాల్డెన్‌ తీసిపారేశాడు. టామ్‌ అప్పటికే తన ఏర్పాట్లలో ఉన్నాడు. ఈ సమావేశం జరగబోయే భవంతి నుంచి రెండు బ్లాకుల దూరంలో ఒక ఎపార్టుమెంటులో ఒంటరిగా వుండే వృద్ధురాలిపై కన్నేశాడు. 

ముందు రోజు రాత్రి ఆమె ఒక క్లబ్‌కు వెళ్లి తంబోలా ఆడుతున్నపుడు పార్కింగ్‌లో ఉన్న ఆమె కారులో చాటుగా దూరాడు. తన అపార్టుమెంటులోకి వస్తూంటే జరిగిన సెక్యూరిటీ చెక్‌ సమయంలో కారులోనే దాగున్నాడు. పార్కింగులోకి వెళ్లాక కారు దిగి, ఆమెకు తుపాకీ గురి పెట్టి నోరెత్తకుండా అపార్టుమెంటుకు పదమన్నాడు. ఆమె ఫ్లాట్‌ కిటికీలోంచి సూటిగా చూస్తే వైస్‌ ప్రెసిడెంటు మీడియాను ఉద్దేశించి ప్రసంగించే మీడియా పాయింటు కనబడుతుంది. ఆ గదిలోనే ఆమెను కుర్చీకి కట్టిపడేసి, గాజు కిటికీలో గుండ్రంగా కన్నం చేసి, దానిలోంచి కాల్చడానికి తన తుపాకీ గురి చూసుకుంటూ కూర్చున్నాడు.

అదే రాత్రి బ్రాడీ తన అంతిమయాత్రకు సిద్ధమవుతున్నాడు. రాత్రి డిన్నర్‌కు ముందు దైవప్రార్థన చేశాడు. అతని కూతురు డానాకు అది వింతగా తోచింది. మామూలుగా అలాటిది చేయడు కదా, యివాళ ఎందుకు చేస్తున్నాడా అనుకుంది. రాత్రి మంచం మీద వాలాక బ్రాడీకి దైవకార్యం గురించి నజీర్‌ మాటలు గుర్తుకు వచ్చాయి. గరాజ్‌కి వెళ్లి నమాజ్‌ చేసుకున్నాడు. చేస్తూండగానే డానా అక్కడకు వచ్చింది. తండ్రి పోకడ వింతగా తోచడంతో ఆమె అతని వెనక్కాలే  అక్కడికి  వచ్చింది. ‘‘ఏమిటిది?’’ అని అడిగింది. ‘‘నమాజ్‌, నేను ముస్లిముగా మారాను.’’ అన్నాడు బ్రాడీ. ఆమె నివ్వెరపోయి, ‘‘అమ్మకు తెలుసా?’’ అని అడిగింది. ‘‘లేదు, చెప్పలేదు, చెపితే అర్థం చేసుకోలేదు. నువ్వూ చెప్పకు. ఇది మనిద్దరి మధ్య రహస్యంగా వుండాలి.’’ అని బ్రాడీ చెప్పాడు. డానా ఒప్పుకుంది.

క్యారీకి మాటిచ్చిన ప్రకారమే సాల్‌, నజీర్‌ స్తబ్దంగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల గురించి దృష్టి పెట్టాడు. తమ డిపార్టుమెంటు అతన్ని నిరోధించడానికి ఏమైనా చేసిందాని పాత ఫైళ్లు తిరగేస్తూ ఉంటే ఒక  ఫైలు దొరికింది. దానిలో చాలా భాగం తీసేయడంతో అవశేషమాత్రంగా మిగిలింది. సాల్‌ దాన్ని డేవిడ్‌ దగ్గరకు తీసుకెళ్లి అడిగాడు - ‘మనం డ్రోన్‌ ఎటాక్‌ ఒకటి చేశామంటున్నారు, నజీర్‌ అప్పట్లో ఆ ప్రాంతంలోనే ఉన్నాడని మనం అనుమానించాం. నజీర్‌ స్థావరాలపై యీ ఎటాక్‌ జరిగిందా?’ అని. క్యారీని తప్పించినా, సాల్‌ అదే థియరీని పట్టుకుని వేళ్లాడుతున్నాడని గ్రహించిన డేవిడ్‌ మాట తప్పించేసి, ఇవాళ్టి సమావేశంలో ఉపాధ్యక్షుడికి ఏమీ జరగకుండా చూడాల్సిన పని పక్కన పెట్టి యీ పాత పురాణాల సోది ఏమిటని మందలించాడు.

కానీ వాల్డెన్‌కు సాల్‌ అనుమానాల సంగతి చెప్పాడు. ‘మరీ లోతుగా తవ్వకుండా అతన్ని ఆపు’ అని వాల్డెన్‌ చెప్పాడు. కానీ సాల్‌ తన సహచరుడు గాల్వెజ్‌ను పాత ఫైళ్లన్నీ వెతకమన్నాడు. అన్నీ పరిశీలించి అతను ఎవరో కావాలని ఆ నాటి దస్తావేజున్నీ తుడిచిపెట్టేశారని చెప్పాడు. దీనిలో ఏదో కుట్ర వుందని సాల్‌కు బోధపడింది.  మరి కొంత సమాచారం సేకరించి ఏకంగా వాల్డెన్‌నే అడుగుదామనుకున్నాడు. 

వాల్డెన్‌ ఆనాటి సమావేశానికి సిద్ధమవుతున్నాడు. అతన్ని చంపాలని చూస్తున్న బ్రాడీ అతని కంటె ముందే తయారవుతున్నాడు. అతని భార్య జెసికా కొడుకు క్రిస్‌ను తీసుకుని కరాటే మ్యాచ్‌కు వెళ్లిపోయాక, తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు మూసేసి, బాంబున్న జాకెట్‌ తొడుక్కుంటున్నాడు. తండ్రి అనూహ్యప్రవర్తనతో గందరగోళంలో పడిన డానా బెడ్‌రూమ్‌ బయట నిలబడి నాన్నా అని పిలిచింది. బ్రాడీ ఆశ్చర్యంగా ‘నువ్వు స్కూలుకి వెళ్లలేదా?’ అని అడిగాడు. ‘లేదు, నీతో మాట్లాడాలి, లోపలికి వస్తాను.’ అంది డానా. ‘నేను డ్రెస్‌ చేసుకుంటున్నాను కదా, అక్కణ్నుంచే మాట్లాడు’ అన్నాడు బ్రాడీ. అది చాలా వింతగా తోచింది ఆమెకి. 

ఎందుకంటే ఆమె ఎదురుగానే తండ్రి డ్రెస్‌ చేసుకుంటూ వుంటాడు. ఇవాళ తలుపు తీయనంటాడేమిటి? అర్థం కాలేదు. ‘నువ్వు అక్కడకు వెళ్లవద్దు నాన్నా.  టామ్‌ అంకుల్‌ తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చినవాళ్లపై కాలుస్తాడేమో. అక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. వద్దు నాన్నా’ అంది. బ్రాడీ లోలోపల నవ్వుకున్నాడు. అక్కడ ఏదో జరపడానికే తను వెళుతున్నాడు. ఈ పిచ్చి పిల్లకు తెలియదు. అనునయంగా ‘ఏమీ జరగలేదులే అమ్మా, అక్కడంతా బోల్డు సెక్యూరిటీ వుంటారు.’ అని నచ్చచెప్పాడు.

ఈలోగా జాకెట్‌ తొడుక్కోవడం, దానిపై యూనిఫాం వేసుకోవడం జరిగాయి. బయటకు వచ్చి డానా తల మీద చేయి వేసి అనునయించ బోయినా, ఆమె వద్దునాన్నా వద్దు అంటోంది. ఇంతలో అతని కోసం ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజంటు కారు వేసుకుని వచ్చాడు. అతను పక్కన ఉండడంతో సాధారణంగా జరగవలసిన చెకింగులేమీ జరగకుండానే బ్రాడీ సభాస్థలికి చేరుకున్నాడు.

ఇవతల క్యారీ యింట్లో స్థిమితంగా కూర్చోలేకపోతోంది. తన పట్ల అభిమానంతో వర్జిల్‌ వచ్చి తోడుగా కూర్చున్నాడు. ఇంట్లో వద్దు, కారులో బయటకు వెళదామంది. అటుయిటు తిప్పి సభాస్థలికి తీసుకెళ్లమంది. అక్కడకు చేరిన జనంలో వీళ్లిద్దరూ నిబడి చూస్తున్నారు. ‘‘ఎక్సలెంట్‌ షూటరైన టామ్‌ యింకా పట్టుబడలేదు. ప్రభుత్వపెద్దల్లో  సగం మంది యివాళ యిక్కడికి వచ్చారు. ఎటాక్‌ జరిగితే యిక్కడే జరుగుతుంది చూడు’’ అంది వర్జిల్‌తో. ‘‘నీ కిప్పుడు ఏ ఉద్యోగమూ లేదు. ఏదైనా జరిగితే ఆపాలన్న బాధ్యతా లేదు.’’ అని వర్జిల్‌ గుర్తు చేశాడు. 

అయినా క్యారీ ఆలోచిస్తూనే వుంది. అంతలో ఆమెకు తట్టింది. ‘‘ఇంతమంది ఒక్క చోట గుమిగూడి నప్పుడు తుపాకీతో గురిపెట్టి ఒకళ్లనో, యిద్దర్నో చంపి వూరుకోవడం తెలివైన పని కాదు. ఏదో ఒకటి చేసి అందరూ ఒకే చోటకు చేరేట్లు చేసి, రెండో ఎటాక్‌ చేయవచ్చు. అదేమిటో ఊహించలేక పోతున్నాను.’’ అంది. ఇంతలో బ్రాడీ అక్కడకు వచ్చి ఎలిజబెత్‌ను పలకరించాడు. వాల్డెన్‌ కూడా వెనువెంటనే వచ్చి బ్రాడీని ఆహ్వానించాడు.

ఎపార్టుమెంటులో కాచుకుని వున్న టామ్‌ తన తుపాకీ అద్దంలోంచి యిదంతా చూస్తున్నాడు. వాల్డెన్‌తో ఎలిజబెత్‌ మాట్లాడుతున్న సమయంలో తుపాకీ పేలింది. గుండు ఎలిజబెత్‌ తల వెనుక భాగంలో తగిలి ఆమె వెంటనే చనిపోయింది. టామ్‌ వెనువెంటనే మరో రెండు సార్లు కాల్చాడు. ఒకటి కిటికీకి తగిలింది. మరొకటి పక్కనే ఉన్న సెక్యూరిటీ ఏజంటుకి తగిలి అతను చనిపోయాడు. అంతా గోలగోల అయిపోయింది. టామ్‌ తన పని ముగిసిందన్నట్లు, ముసలామె కట్లు విప్పేసి, ఫ్లాట్‌లోంచి చల్లగా బయటకు వచ్చేసి జనసందోహంలో కలిసిపోయాడు. ఈ మారణకాండను ప్రత్యక్షంగా చూసిన క్యారీకి ఛట్టున టెర్రరిస్టుల వ్యూహమేమిటో అర్థమైంది. అధికారికంగా తను ఏమీ చేయలేదు కాబట్టి సాల్‌కు ఫోన్‌ చేసి తను అనుకుంటున్నది చెప్పింది -

‘‘టామ్‌ మంచి షూటరని విన్నాను. మూడుసార్లు గురి తప్పడం వింతగా వుంది. ఉపాధ్యక్షుణ్ని చంపకుండా యితరులను చంపడమేమిటి. నా    ఉద్దేశం ప్రకారం అతనితో బాటు మరొక కుట్రదారు కూడా వున్నాడు. ఇలాటి సందర్భాల్లో ఏమౌతుంది? వేదిక మీద వున్న విఐపిలందరినీ బిల్డింగు కింద వున్న బంకర్‌లో చేరుస్తారు.   వారిలో ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడినవాడు ఒక్కడుంటే చాలు. బాంబున్న జాకెట్‌ వేసుకుని, తనను తాను పేల్చేసుకోవచ్చు. ఈ ప్రముఖులందరూ ఒక్క దెబ్బతో ఎగిరిపోతారు. నా అనుమానం ప్రకారం ఆత్మాహుతికి సిద్ధపడిన ఆ వ్యక్తి బ్రాడీ. ఇప్పుడతన్ని వాల్డెన్‌తో బాటు బంకర్‌కు తరలిస్తున్నారు. వాల్డెన్‌ సెక్యూరిటీ వాళ్లను హెచ్చరించి బ్రాడీని ఆపకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది. నువ్వు యిక్కడున్న సిఐఏ ఏజంటు ఎవరికైనా చెప్పి వుంచితే నేను వెళ్లి మాట్లాడతాను.’’ అని. 

ఈ అమ్మాయి నెత్తి మీద నుంచి బ్రాడీ భూతం ఎపుడు దిగుతుందో అనుకున్న సాల్‌ నువ్వు చెప్పినట్లే తప్పకుండా చేస్తా అని నచ్చచెప్పి, అక్కడున్న ఏజంటుకి ఫోన్‌ చేసి, ‘ఒకావిడ కాస్త క్రేజీగా ప్రవర్తిస్తుంది, అదుపులోకి తీసుకుని ఎటూ పోకుండా చూడు’ అని చెప్పాడు. ఈలోపునే క్యారీ వేదిక మీదకు దూసుకుని వస్తోంది. ఏజంటు ఆమెను పట్టుకోబోయాడు. సాల్‌ తన మాట నమ్మలేదని గ్రహించిన క్యారీ ఏజంటు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఎందుకొచ్చిన గొడవ యిది మనకు అంటున్న వర్జిల్‌ మాట వినకుండా, అతని జేబులోంచి కారు తాళం తీసుకుని అతని కారెక్కి వెళ్లిపోయింది.

క్యారీ వూహించినట్లుగానే ప్రముఖులందరినీ హడావుడిగా బిల్డింగు కింద వున్న బంకర్‌కి తీసుకెళ్లారు. అక్కడ మెటల్‌ డిటెక్టర్‌ వుంది కానీ దాన్ని పక్కకు తీసిపడేసి, దాదాపు వందమందిని గబగబా లోపలకు నెట్టారు. ఎందుకంటే ఆ షూటరు యింకా దొరకలేదు. మళ్లీ షూట్‌ చేస్తాడేమో తెలియదు. ఈ గలభాలో బ్రాడీ వేసుకున్న జాకెట్‌ బయటపడలేదు. అబు నజీర్‌ దీన్నంతా ముందే ఊహించి వేసిన ప్లాను విజయవంతమైంది. డేవిడ్‌తో సహా వాల్డెన్‌కు అత్యంత సన్నిహితులైన వారందరూ అక్కడే ఉన్నారు. నరరూప రాక్షసుడైన వాల్డెన్‌తో బాటు వాళ్లందరూ చావడం ఖాయం. దాని కోసమే బ్రాడీ యీ ఆత్మత్యాగానికి సిద్ధపడ్డాడు. 

చనిపోయేముందు నజీర్‌కు తన సెల్‌ నుంచి మెసేజ్‌ పెట్టాడు - ఐసా స్మృత్యర్థం అని. వాల్డెన్‌కు సమీపంగా చేరి ఆ జాకెట్‌ బాంబు స్విచ్‌ నొక్కాడు. (ఫోటో - ఎడమవైపు క్యారీ అక్క మాగీ, కుడివైపు వాల్డెన్‌ , గోడపై క్యారీ తయారు చేసిన నజీర్‌ టైమ్‌లైన్‌ (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
 mbsprasad@gmail.com