cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 08

 ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 08

బ్రాడీ కూతురు డానా యింట్లో కూర్చుని టీవీ చూస్తోంది. తండ్రి హాజరైన సమావేశంలో కాల్పుల సంఘటన వినగానే కంగారు పడింది. అతనికేమీ కాలేదు కదాని ఫోన్‌ చేద్దామనుకుంటూండగా క్యారీ వర్జిల్‌ కారులోంచి దిగింది. గబగబా డానా దగ్గరకు వచ్చి ‘‘మీ నాన్న టామ్‌ వాకర్‌తో కలిసి పని చేస్తున్నాడు. పెద్ద దుస్సాహసం చేసి ఆపదలో పడబోతున్నాడు. అతన్ని ఆపు.’’ అని అరుస్తూ ఆమె చేతికి తన సెల్‌ఫోన్‌ యిచ్చింది. డానా ఆ ఫోన్‌ తీసుకుని పోలీసులకు ఫోన్‌ చేసింది ‘ఇక్కడో పిచ్చిది మా యింటి మీద పడి గోల చేస్తోంది, వచ్చి కాపాడండి’ అని.

దాంతో క్యారీ ‘నేను మీ అందరి మంచి కోసం చెపుతున్నాను. నువ్వేమిటి యిలా చేశావ్‌?’ అని యింకా అరిచింది. ఈ క్యారీ తన తండ్రితో తిరుగుతోందని డానాకూ అనుమానం. ‘నువ్వు ఓ పిశాచివి, మా నాన్నకి, మాకూ ఎంత దూరంగా వుంటే అంత మంచిది’ అంటూ క్యారీ మీద కేకలేసింది. ఇంతలో పోలీసులు వచ్చి క్యారీని లాక్కుని పోయారు. తీసుకెళ్లే సమయానికి జెసికా వచ్చి చూసింది. సంగతేమిటో కూతుర్ని అడిగి తెలుసుకుంది.

బ్రాడీ స్విచ్చి నొక్కినా జాకెట్‌ బాంబు పేలలేదు. అతను కంగారు పడ్డాడు. మళ్లీ ప్రయత్నించాడు. ఊహూ, పేలలేదు. చెమట్లు కారసాగాయి. ముఖంలో ఆందోళన కొట్టవచ్చినట్లు కనబడింది. కానీ ఆ గదిలో వున్న అందరిదీ అలాటి పరిస్థితే. టెర్రరిస్టులు మళ్లీ  కాల్పులు  జరుపుతారేమోనని భయపడుతున్నారు. మాటిమాటికీ బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తున్నారు. బ్రాడీ కూడా బాత్‌రూమ్‌కి వెళితే ఎవరికీ అనుమానం రాలేదు. అతను తలుపేసుకుని జాకెట్‌ స్క్రూలు విప్పి చూశాడు. లోపల వైర్లు ఊడిపోయి వున్నాయి. జాగ్రత్తగా కలిపాడు. బాంబు రెడీ చేశాడు.

ఇదే సమయంలో క్యారీ అతని కూతురితో ఘర్షణ పడుతోంది. అంతా రెడీ చేసుకుని వచ్చి మళ్లీ గుంపులోకి వచ్చాడు. వాల్డెన్‌కు సమీపంగా వెళ్లబోతూ వుండగా ఓ స్పెషల్‌ ఏజంటు అతని భుజం తట్టాడు. బ్రాడీ ఉలిక్కిపడ్డాడు. ఏజంటు ‘మరేం లేదు, మీ అమ్మాయి ఫోన్‌ చేస్తోంది.’ అన్నాడు. అందరి సెల్‌ఫోన్లూ ఒక చోట పెట్టేయమన్నారు, అందువలన అక్కడికి వెళ్లి మాట్లాడవలసి వచ్చింది.

డానా చాలా ఆందోళనగా ‘‘నాన్నా, ఎలా వున్నావు?’’ అని అడిగింది. ‘‘నేను ముందే చెప్పానుగా, అక్కడేదో అశుభం జరగబోతుందని. నాకు భయంగా వుంది. క్యారీ వచ్చి నువ్వు టెర్రరిస్టువంటోంది. కాదు కదా! నువ్వు భద్రంగా యింటికి వచ్చేస్తావుగా’’ అని ప్రాధేయపడింది. కూతురు గొంతు వినగానే బ్రాడీ కరిగిపోయాడు. ‘‘వచ్చేస్తానులేమ్మా’’ అన్నాడు. ‘‘అలా అంటే కాదు, ఒట్టేయ్‌.’’ అని పట్టుబట్టింది డానా.

ఆమె మనసంతా గందరగోళంగా వుంది. చాలా రోజులుగా తండ్రి ప్రవర్తన వింతగా ఉండడం చూసింది. గెట్టిస్‌బర్గ్‌ నుంచి అతను తెచ్చిన వస్తువును చూడనీయటం లేదు. ఇటు క్యారీ చూస్తే తండ్రి టెర్రరిస్టు అంటోంది. అది అబద్ధమైతే కావచ్చు, కానీ తండ్రి ఏదో చేస్తున్నాడు, పొద్దున్న తనను బెడ్‌రూమ్‌లోకి కూడా రానీయలేదు. ఏది ఏమైనా తన తండ్రి క్షేమంగా యింటికి రావాలి, అంతే. అందుకే గట్టిగా పట్టుబట్టింది.

ఆమె గొంతులో తన పట్ల వున్న యిష్టాన్ని గమనించి బ్రాడీ అచేతనుడయ్యాడు. ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ‘‘సరేనమ్మా, ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాను.’’ అని ప్రామిస్‌ చేశాడు. అన్న ప్రకారమే స్విచ్చి నొక్కే ప్రయత్నం మానేశాడు. బయట మళ్లీ  కాల్పులు  జరగకపోవడంతో అంతా సురక్షితమే అనుకున్న పోలీసులు కాస్సేపటికి అందర్నీ ఆ బంకర్‌ నుంచి బయటకు పంపేసి, యిళ్లకు వెళ్లిపోమన్నారు. అతను యింటికి రాగానే జెసికా క్యారీ వచ్చి చేసిన అల్లరి గురించి చెప్పింది. ‘‘నువ్వు దాని మీద కేసు పెట్టు.’’ అని ఒత్తిడి చేసింది. ‘‘ఆ సంగతి నేను చూసుకుంటాను.’’ అని హామీ యిచ్చాడు.

మర్నాడు వాల్డెన్‌ సాల్‌ను పిలిపించాడు. నువ్వు డ్రోన్‌ ఎటాక్‌ గురించి చాలా వర్రీ అవుతున్నావట. పాత ఫైళ్లన్నీ తిరగేయిస్తున్నావట. ఆ సంగతి మర్చిపోతే నీకు మంచిది అని హెచ్చరించాడు. ‘‘నువ్వు సిఐఏ హెడ్‌గా వుండగా నేను నీతో కలిసి మూడేళ్లు పనిచేశాను. నా తరహా ఎలాటిదో నీకు తెలుసు. దేన్నయినా పట్టుకుంటే వదలను. నువ్వు నాకేమైనా ప్రమాదం తలపెడితే సిఐఏలో వుండగా నువ్వు దగ్గరుండి చేయించిన పరమ హింసాత్మక యింటరాగేషన్ల వీడియోలు నా దగ్గరున్నాయి, చూడు, వాటిని బయటపెడతా’’ అని బెదిరించాడు. వాల్డెన్‌ చెదిరాడు. ‘‘సరే నీకు కావలసినది ఆ ఎటాక్‌ గురించిన నిజాలేగా, డేవిడ్‌కు చెప్పి నీకు చూపించమంటాను. చూసి, మర్చిపో, మరీ ఎక్కువగా ఆలోచించకు.’ అని రాజీ చేసుకున్నాడు.

అతని ఆదేశం మేరకు డేవిడ్‌ ఆ వీడియోలు చూపించాడు. దానిలో నజీర్‌ కొడుకు స్కూలుపై డ్రోన్‌ ఎటాక్‌కై వాల్డెన్‌ ఆదేశించడం స్పష్టంగా కనబడింది. పసి పిల్లలు  చచ్చిపోతారని తెలుసు కానీ, నజీర్‌ను చంపడమనే పెద్ద పని పెట్టుకున్నపుడు యిలాటి చిన్న విషయాలలో రాజీ పడక తప్పదని అతనన్నాడు. అంతా చూసి ‘అప్పట్లో నువ్వు నా జూనియర్‌వి. ఈ సంగతి నీకు తెలుసు, అయినా నా దృష్టికి తేలేదు. నాకు చెప్తే నేను ఒప్పుకోనని తెలిసి అలా చేశావ్‌ కదా’ అంటే డేవిడ్‌ తలూపాడు.

‘ఇప్పుడీ సంగతి నేను పేపరు వాళ్లకి లీక్‌ చేస్తే ఏం చేస్తావ్‌?’ అని అడిగాడు సాల్‌. ‘నా సంగతెలా వున్నా, సిఐఏ పరువు పోతుంది. అనేకమంది సిఐఏ ఏజంట్లు దీనిలో పాలు పంచుకున్నారు. వాళ్లందరి యిమేజి పోతుంది. అమెరికా యిలాటి ఘాతుకాలు చేస్తోంది అని చెప్పి టెర్రరిస్టులు మరింత మంది యువతీయువకులను తన వైపు తిప్పుకుంటారు.’ అన్నాడు డేవిడ్‌. ఆ మాటా నిజమే కాబట్టి సాల్‌ ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఆ దాడిలో నజీర్‌ కొడుకు చనిపోయి వుంటాడని, అందుకే అతను శోకదినాలు పాటిస్తూ కొద్దికాలం స్తబ్దంగా వున్నాడనీ అర్థం చేసుకున్నాడు. క్యారీని కలిసి తన థియరీ కరెక్టే అని చెప్పాలనుకున్నాడు.

క్యారీకి వాళ్ల అక్క పూచీకత్తు యివ్వడంతో పోలీసు వాళ్లు విడిచిపెట్టారు. బయటకు వచ్చేసరికి బ్రాడీ కనబడ్డాడు. ‘‘నువ్వు అనుకుంటున్నట్లు నేనేమీ టెర్రరిస్టును కాను. నువ్వు అనవసరంగా మా యింటి మీద పడి మా అమ్మాయిని కంగారుపెట్టావు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా వేధిస్తున్నావ్‌.’’ అని ఆమెను తిట్టిపోశాడు. దీంతో క్యారీ స్థయిర్యం చెదిరిపోయింది. తన చేష్టతో పెద్ద ఉపద్రవాన్ని ఆపగలిగానని తెలియని క్యారీ బ్రాడీ గురించి తన అంచనా తప్పిందని తెగ బాధపడిపోయింది. తనకు మతి చలించిందని, బుర్ర సరిగ్గా పనిచేయటం లేదని అనుకుంది.
అపరాధభావనతో బ్రాడీతో ‘‘నువ్వెవరివైనా నాకు అనవసరం. ఇకపై నీ జోలికి, నీ కుటుంబం జోలికి రానని మాట యిస్తున్నాను. నాకు యిప్పుడు ఉద్యోగం లేదు, నిన్ను కాపాడడం లేదా శిక్షించడం నా పని కాదు. ఆ విషయం అర్థం చేసుకోలేక పోవడం చేతనే పోలీసు స్టేషన్లో ఓ రాత్రి గడపవలసి వచ్చింది.’’ అంది క్యారీ. తనెంతో ప్రేమించిన వ్యక్తి తనను నానా తిట్లూ తిట్టడంతో జీవితంపై విరక్తి కలిగింది. అక్క కారెక్కి ‘‘నన్ను నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లు. మానసిక వైద్యం చేయించుకోవాలి.’’ అంది.

ఆ రాత్రే బ్రాడీ రాతిగోడలో తను దాచిన కెమెరా చిప్‌ వెతకబోయాడు. అది అక్కడ లేదు. పక్కన ఉన్న బెంచీపై తను గీసిన గీత పక్కన మరో గీత వుంది. అంటే నజీర్ మనిషి ‌ వచ్చి పట్టుకుపోయాడన్నమాట. అంతలో టామ్‌ నుంచి కాల్‌ వచ్చింది. వెళ్లి ఒక టన్నెల్‌ వద్ద కలిశాడు. ‘‘నువ్వు ఎంతో మంచి ఫ్రెండువనుకున్నాను. నజీర్‌తో కలిసి చచ్చిపోయినట్లు నాటకమాడి, నన్ను వెర్రివెధవను చేశావ్‌’’ అని బ్రాడీ టామ్‌పై విరుచుకుపడ్డాడు.

‘‘ఇద్దరం నజీర్‌వైపు ఫిరాయించాం. ఎటొచ్చీ నేను నీ కంటె ముందే ఫిరాయించా. అయినా అదంతా అనవసరం. నువ్వు జాకెట్‌ బాంబు ఎందుకు పేల్చలేదు అది చెప్పు’’ అని నిలదీశాడు టామ్‌. ‘‘అది పని చేయలేదు, వైర్లు ఊడిపోయినట్లున్నాయి.’’ అన్నాడు బ్రాడీ. ‘‘గాడిదగుడ్డేం కాదా, నీకు భయం వేసిందని చెప్పు, చాలు’’ అన్నాడు. ‘‘నజీర్‌కు ఏం సంజాయిషీ యిస్తావో ఇయ్యి’’ అంటూ అతనికి ఫోన్‌ చేసి చేతికిచ్చాడు.

బ్రాడీ నజీర్‌తో ‘‘నేను నిజమే చెపుతున్నాను, అది పనిచేయలేదు. నేను ఆత్మాహుతికి సిద్ధపడినా మనం అనుకున్న ప్రకారం జరగలేదు. తర్వాత ఆలోచిస్తే ఏది జరిగినా మన మేలుకే జరిగిందనిపించింది. ఎందుకంటే వాల్డెన్‌ నన్ను ఆత్మీయుడిగా చూస్తున్నాడు. నేను కాంగ్రెస్‌మన్‌గా ఎన్నిక కావడం, అతని సన్నిహితవర్గంలో ఒకడిగా మారడం ఖాయం. అధ్యక్షుడిగా ఎన్నిక కాబోయే అతనికి చేరువగా వుండి అతని ఆలోచనలను మనకు అనువుగా మార్చుకుని విజయం సాధించే అవకాశం ఉంది. ఒక మనిషిని చంపడం కంటె అతని ఆలోచనను నిర్దేశించ గలగడం మేలు కదా అని తోచింది.’’ అన్నాడు.

నజీర్‌కు ఆ వాదన నచ్చింది. ‘‘సరే, కానీ నువ్వు అతనికి ఆత్మీయుడిగా మారాక కూడా నాకు విధేయుడిగా వుంటావన్న నమ్మకం నాకు కలగాలంటే నువ్వో పని చేయాలి.’’ అన్నాడు. ‘‘ఏమిటో చెప్పు’’ అని బ్రాడీ అడగ్గా, ‘‘టామ్‌ను కాల్చేయ్‌’’ అన్నాడు. బ్రాడీ మారు మాట్లాడకుండా టామ్ ని కాల్చి పారేశాడు. అతని శవం రోడ్డు మీద అనాథలా పడి వుండగా యితను చల్లగా ఎవరి కంటా పడకుండా వచ్చేశాడు. క్యారీ బాధ వదిలిపోయింది కాబట్టి, తను కాంగ్రెస్‌మన్‌గా వుంటూ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని నజీర్‌ ఆమోదించాడు కాబట్టి సంతోషంగా వున్నాడు. కుటుంబంతో ఆత్మీయంగా వుండడానికే నిశ్చయించుకున్నాడు.

క్యారీ డాక్టర్లు ఆమె మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ యిస్తే మంచిదన్నారు. దానివలన కొంతకాలం పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, తర్వాత మళ్లీ తిరిగి వస్తుందని చెప్పారు. సిఐఏలో ఉద్యోగం ఎలాగూ పోయింది, యీ షార్ట్‌టెర్మ్‌ మెమరీ లాస్‌ వలన పెద్దగా వచ్చే నష్టం లేదనుకుని సరేనంది క్యారీ. రెండు రోజుల తర్వాత మొదటి షాక్‌ యివ్వడానికై మత్తు యివ్వబోతున్న సమయంలో సాల్‌ వచ్చాడు. ‘‘వద్దు క్యారీ, నువ్వింత డిప్రెస్‌డ్‌గా ఫీలవ్వద్దు. ఈ షాకులు మానేయ్‌. బ్రాడీ విషయంలో నీ థియరీ తప్పినా, నజీర్‌ విషయంలో కరక్టయింది’’ అంటూ వాల్డెన్‌ చేయించిన ఎటాక్‌ గురించి చెప్పాడు.

అంతా విని క్యారీ నిర్లిప్తంగా నవ్వింది. ఎవడికి కావాలివన్నీ అంది. ఆమెకు మత్తుమందిచ్చారు. మత్తులో జారుకుంటూండగా బ్రాడీతో గడిపిన మధురక్షణాలు గుర్తుకు వచ్చాయి. అంతలోనే అతను అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి, ఐసా, ఐసా అనడం కూడా జ్ఞాపకం వచ్చింది. ఐసా ఎవరని అడిగితే బ్రాడీ తన గార్డు అని చెప్పాడు. కానీ నజీర్‌ కొడుకు పేరు ఐసా అని తన పరిశోధనలో తేలింది. ఐసాకు, బ్రాడీకి ఏదైనా లింకుందేమో, యీ విషయం గుర్తు పెట్టుకోవాలి అనుకుంది. అంతలోనే ఆమెకు డాక్టర్లు షాక్‌ యిచ్చారు.

ఇక్కడితో ‘‘హోమ్‌లాండ్‌’’ మొదటి సీజన్‌ పూర్తయింది. దీనిలో 12 ఎపిసోడ్స్‌.  రెండో సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి సుమారు ఆర్నెల్ల  కథాకాలం గడిచిపోయింది. క్యారీ మానసిక వైద్యం పూర్తి చేసుకుని, అక్క యింట్లో ఆమె  పిల్లలతో, తండ్రితో ఉంటోంది. ఆ వూళ్లోనే స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. సిఐఏ గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వాళ్లూ యీమెను పట్టించుకోవడం మానేశారు. గూఢచారిణిగా ఆమె కెరియర్‌ ముగిసిపోయి టీచరుగా సాధారణ జీవితం గడుపుతోంది.

బ్రాడీ ఎన్నికలలో గెలిచి కాంగ్రెసుమన్‌ అయ్యాడు. వాల్డెన్‌ అతనంటే చాలా అభిమానం కురిపిస్తున్నాడు. అతన్ని ఒక హీరోగా చూపిస్తూ అతని యిమేజి పెంచుతూ, తన ప్రయోజనాల కోసం వాడుకుందామని చూస్తున్నాడు. బ్రాడీ వైవాహిక జీవితం కూడా బాగుంది. అతని భార్య, పిల్లలు తమ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. డానా స్కూలు మారింది కానీ యీ కొత్త స్కూలు ఆమెకు నచ్చటం లేదు.

ఇక అమెరికా రాజకీయాలు ఎప్పటిలాగానే ఉన్నాయి. ఇజ్రాయేల్‌ ఇరాన్‌పై అణుస్థావరాలపై దాడి చేసింది. ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. అమెరికా ఇజ్రాయేల్‌ను సమర్థిస్తోంది. సాల్‌ సిఐఏలోనే కొనసాగుతున్నాడు. డ్రోన్‌ ఎటాక్‌ గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి ఆఫీసు పనిమీద వెళ్లాడు. అక్కడకు ఒక మహిళ వచ్చింది. ‘గతంలో యిక్కడ క్యారీ అని ఒకావిడ వుండేది. ఆవిడ ఎక్కడ? అమెరికాపై జరగబోయే దాడి గురించి ఆవిడకు ఓ ముఖ్యమైన సమాచారం చెప్పాలి.’ అంది. నువ్వెవరు అంటే ఆవిడకు తెలుసు అంది.

‘ఆవిడ యిప్పుడు లేదులే, సంగతేమిటో మాకు చెప్పు’ అంటే ‘ఆవిణ్ని తప్ప వేరెవరినీ నమ్మను. ఎవరికీ ఏమీ చెప్పను.’ అంది. సాల్‌ ఆ విషయం డేవిడ్‌కు చెప్పాడు. ‘క్యారీ అక్కడ పనిచేసినపుడు రిక్రూట్‌ చేసిన ఇన్‌ఫార్మర్‌ అయి వుంటుంది. ఆమె పేరు మన లిస్టులో ఎక్కడా లేదు. కానీ తను ముఖ్యమైన సమాచారాన్నే యివ్వబోతుందని నాకనిపిస్తోంది’ అన్నాడు సాల్‌.

డేవిడ్‌ ఏం చేయాలో పాలుపోలేదు. క్యారీని అడుగుదామంటే నామోషీ. కానీ అడగకపోతే నజీర్‌ గురించి అతి ముఖ్యమైన సమాచారం చేజారిపోతుంది. నజీర్‌ పట్టుబడేవరకు వాల్డెన్‌ స్థిమితంగా వుండలేడు, తనని ఉండనీయటం లేదు. తన ఆఫీసులో పని చేసే, క్యారీకి సన్నిహితంగా వుండే డేనీ గాల్వెజ్‌ను ఆమె స్కూలుకి పంపించాడు.

గాల్వెజ్‌ను చూసి క్యారీ నవ్వుతూ పలకరించింది. కానీ ఎప్పుడైతే అతను డేవిడ్‌ నీతో మాట్లాడతాడట అన్నాడో ‘వెళ్లి ఏట్లో దూకమను’ అంది. స్కూలు నుంచి రాత్రి తిరిగి వచ్చేసరికి  సాల్‌ అనేకమార్లు ఫోన్‌ చేశాడని తెలిసింది. వెంటనే ఫోన్‌ చేస్తే ‘డేవిడ్‌ నీ కోసం బయట కారులో వెయిట్‌ చేస్తున్నాడు, ఒక్కసారి మాట్లాడు, నా కోసం..’ అని సాల్‌ ప్రాధేయపడ్డాడు. అతని మీద గౌరవంతో క్యారీ సరేనంది. వెంటనే డేవిడ్‌ లోపలకి వచ్చాడు. సాల్‌ను కలిసిన యువతి ఫోటో డేవిడ్‌ చూపించి యీమె ఎవరో చెప్పు అని అడిగాడు.

క్యారీ చూసి ‘‘ఈమె పేరు ఫతీమా ఆలీ. హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థలో జిల్లా కమాండర్‌గా వున్న ఒకతని మొదటి భార్య. హాలీవుడ్‌ సినిమాలంటే యిష్టం. అమెరికన్‌ వస్తువులంటే యిష్టం. వాటి ఆశ చూపి ఏజంటుగా రిక్రూట్‌ చేశాను. భర్తన్నా, అతను చేసే పనులన్నా అసహ్యం కాబట్టి మనకు సహకరిస్తోంది. ఆమె మనల్ని సంప్రదించి చాలాకాలమైంది. ఇన్నాళ్లు పోయాక తనే వచ్చి చెపుతోందంటే చాలా ముఖ్యమైనదే అయి వుంటుంది. బహుశా నజీర్‌ అమెరికాపై దాడికి ప్లాను చేస్తున్నాడేమో. ఆమె చెప్పేదాన్ని నమ్మి, దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్‌ చేసుకోవచ్చు. సిఐఏ నన్నెంతో అవమానపరిచి, నా పట్ల క్రూరంగా వ్యవహరించినా సాల్‌పై గౌరవంతో యిదంతా చెప్పాను. ఇక నువ్వు దయచేయవచ్చు.’ అంది.

డేవిడ్‌ లేవలేదు. ‘వచ్చిన చిక్కేమిటంటే, ఆమె నీకు తప్ప వేరెవ్వరికీ ఆ రహస్యం చెప్పనంటోంది. అందువలన నువ్వే, ఒక్క మూడు రోజుల పాటు బీరూట్‌ వెళ్లి, ఆమెను కలిసి..’ అంటూండగానే క్యారీ విరుచుకుపడింది. ‘‘సిగ్గుందా? అలా అడగడానికి?’’ అని. ఎన్ని తిట్టినా డేవిడ్‌ పడ్డాడు, బతిమాలాడు. దాంతో క్యారీ అహం చల్లారింది. ఒకప్పుడు తనను పూచికపుల్లలా తీసిపారేసిన డేవిడ్‌కు యిప్పుడు తను తప్ప గతి లేదన్న విషయం ఆమెకు ఆనందం కలిగించింది. తన ఘనతేమిటో చూపించడానికి బీరూట్‌ వెళ్తానంది. క్యారీ అక్క మ్యాగీ వచ్చి తిట్టింది- ‘నీకేమైనా మతుందా? అసలు నీకే అధికారం వుందని వెళ్తున్నావ్‌? ప్రశాంతంగా బతకలేవా?’ అని. క్యారీ తండ్రి ఆమెను అర్థం చేసుకున్నాడు, పెద్ద కూతురితో ‘సరేలే వెళ్లనీ’ అన్నాడు. క్యారీ డేవిడ్‌ కారు ఎక్కింది.

ఆ కారులో జాయ్‌ (మెండెజ్‌) ఉన్నాడు. అతనే క్యారీని మారుపేరుతో సైప్రస్‌కు, అక్కణ్నుంచి బీరూట్‌కు దగ్గరుండి తీసుకెళ్లాలి. లెబనాన్‌ పోలీసులకు పట్టుబడితే వారిని ఏమార్చడానికి ఆమెను కెనడాకు చెందిన కేట్‌ అనే బోగస్‌ ఐడెంటిటీతో పంపాలని సిఐఏ ప్లాను చేసింది. దాని కోసం ఆమెకో చరిత్ర తయారుచేసి, క్యారీని గుర్తుపెట్టుకోమన్నారు. లెబనాన్‌ వాళ్లు ప్రశ్నించేటప్పుడు తడబడకుండా వుండాలంటే ఆ దొంగ వివరాలన్నీ వంటపట్టించుకోవాలి. ఆమెకు ట్రైనింగ్‌ యిచ్చే పని జాయ్‌ది. ఎన్నిసార్లు చెప్పినా క్యారీ విషయాలు మర్చిపోతోంది. చెప్పిచెప్పి జాయ్‌ విసిగిపోయాడు. సాల్‌కు ఫోన్‌ చేసి ‘‘ఎలక్ట్రిక్‌ షాకుల కారణంగా ఆమె జ్ఞాపకశక్తి చెడిపోయింది. ఇక గూఢచారిణిగా పనికి రాదు, వేరెవరినైనా చూడండి.’’ అన్నాడు. (ఫోటో- ఎడమవైపు క్యారీ తండ్రి, ఫతిమా ఆలీ కుడివైపు టామ్ గురి చూస్తున్న వాల్డెన్, బ్రాడీ, ఎలిజబెత్, డేవిడ్) (సశేషం) - 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
mbsprasad@gmail.com