Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 09

ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 09

బ్రాడీకి మంచి రోజులు వచ్చాయి. వాల్డెన్‌ ఒకసారి అతని ఆఫీసుకి వచ్చి ‘‘నేను అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నాను. నిన్ను నాతో పాటు వైస్‌ ప్రెసిడెంటు పోస్టుకి ప్రతిపాదిస్తున్నాను. మనిద్దరం కలిసి అమెరికాను ఏలుదాం అన్నాడు. బ్రాడీ భార్య నడిగి చెప్తానన్నాడు. వినగానే జెసికా ఎగిరి గంతేసింది. వెంటనే ఒప్పుకోమంది. మర్నాడు బ్రాడీ ఆఫీసుకి రోయా (హమ్మాద్‌) అనే రిపోర్టరు వచ్చింది. మామూలుగా కాస్సేపు మాట్లాడి, ఎవరూ లేకుండా చూసి, తను నజీర్‌ మనిషినని చెప్పింది. పాలస్తీనా శరణార్థులుగా తన కుటుంబం తరలి వచ్చిందని, నజీర్‌ కుటుంబంతో చాలా దశాబ్దాలుగా స్నేహం ఉందని అంది. నజీర్‌ సందేశాన్ని అందించడానికే వచ్చానంది. ఏం కావాలన్నాడు బ్రాడీ.

అమెరికాలో నజీర్‌ ఏయే ప్రాంతాలను టార్గెట్‌ చేయబోతున్నాడో సిఐఏ ఒక లిస్టు తయారుచేసి, దాన్ని కోడ్‌ భాషలోకి మార్చి పెట్టుకుంది. నజీర్‌కు ఆ లిస్టు దొరికింది కానీ దాన్ని ఛేదించే ఎన్‌క్రిప్షన్‌ కీ అతని వద్ద లేదు. అది వుంటే ఏ ప్రాంతాల గురించి సిఐఏ అప్రమత్తంగా వుందో తెలుసుకుని, వాటిని వదిలేసి, తక్కిన వాటిపై దాడి చేయాలని అతని వ్యూహం. ఇదంతా రోయా చెప్పుకుని వచ్చాక ‘ఇంతకీ నేనేం చేయాలని?’ అని అడిగాడు బ్రాడీ. ‘‘ఆ ఎన్‌క్రిప్షన్‌ కీ ఒక కాగితంపై రాసి, డేవిడ్‌ గదిలోని సేఫ్‌లో దాచి వుంచారు. నువ్వు దాన్ని తెరిచి అదంతా ఓ కాగితంపై కాపీ చేసి, మా కివ్వాలి. ఇది డేవిడ్‌కు తెలియకుండా జరగాలి.’ అంది.  ‘మీరు ఎటాక్‌ చేయబోయే టార్గెట్‌ ప్రాంతాల్లో అమాయక పౌరులుంటారా?’ అని అడిగాడు బ్రాడీ. 

‘రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు మనం ఏదో ఒక పక్కన వుండాలి. యుద్ధరంగంలో యిలాటివి ఎవరూ పట్టించుకోరు. అయినా నజీర్‌ యిది నువ్వు చేసి తీరాలని చెప్పమన్నాడు. ఐసా మృతిని గుర్తు తెచ్చుకోమన్నాడు.’ అంది రోయా. తనకు గత్యంతరం లేదని గ్రహించాక బ్రాడీ ‘సరే నేను ఒప్పుకున్నా, డేవిడ్‌ సేఫ్‌లోంచి సంగ్రహించి, వేరే దానిపై ఎక్కించుకునేటంత టైమెలా వుంటుంది?’ అని అభ్యంతరం తెలపబోయాడు. ‘వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు తయారయ్యే ప్రయత్నంలో ఇవాళ డేవిడ్‌ దగ్గరకు వెళ్లి ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌ తీసుకోమని వాల్డెన్‌ చెప్పాడు కదా, నువ్వు డేవిడ్‌ గదిలో వుండగా నీకు ఆ సమయం చిక్కేట్లు నేను చూస్తాను. అది నా బాధ్యత.’ అంది రోయా. ‘ఇక్కడ జరిగేవన్నీ వీళ్లకు తెలిసిపోతున్నాయి, సిఐఏ చీఫ్‌ను ఏమార్చడం కూడా వీళ్ల చేతిలో పనే. అసాధ్యులు, వీళ్లని కాదంటే కుదరదు.’ అనుకుని సరేనన్నాడు బ్రాడీ.

అన్నట్లుగానే బ్రాడీ, డేవిడ్‌ గదికి వెళ్లి మాట్లాడుతున్న సమయంలో అతని సిబ్బంది ఒకడు వచ్చి ‘‘రోయా అనే జర్నలిస్టు వచ్చి మిమ్మల్ని అర్జంటుగా కలవాంటోంది. మీటింగులో వున్నారు రారు అని చెప్తే ‘నాకో సమాచారం దొరికింది, దాని గురించి డేవిడ్‌ స్వయంగా క్లారిఫికేషన్‌ యివ్వకపోతే, నేను విన్నదే కరక్టని చెప్పి, యివాళ రాత్రే మా టీవీలో ప్రసారం చేసేస్తాం. దానివలన సిఐఏ ప్రతిష్ఠ పోయిందని చెప్పి, తర్వాత నన్ను నిందించవద్దు’ అంటోంది.’’ అని చెప్పాడు. డేవిడ్‌ కాస్సేపు ఆలోచించి బ్రాడీతో ‘‘ఈ రోయా చాలా డేంజరస్‌ ఉమన్‌. అన్నంత పనీ చేస్తుంది కూడా. వెళ్లి కన్విన్స్‌ చేసి వచ్చేస్తా. ఏమీ అనుకోకండి.’’ అంటూ బయటకు వెళ్లాడు. బ్రాడీ సరేనని తల వూపి, గుండెలు పీచుపీచుమంటూండగానే అతని సేఫ్‌ తెరిచి, ఎన్‌క్రిప్షన్‌ కీ వున్న కాగితం చేజిక్కించుకుని తన జేబులో వున్న పాకెట్‌బుక్‌లో ఎక్కించుకోసాగాడు.

ఇవతల రోయా డేవిడ్‌ను అవీయివీ అడిగి కాలయాపన చేసింది. అన్నిటికీ సమాధానాలు చెప్పి డేవిడ్‌ లేవబోతూండగా, బ్రాడీకి యింకాస్సేపు సమయం యిస్తే మంచిదనుకుని, రోయా డేవిడ్‌తో ‘‘సరే, యిదంతా అఫీషియల్‌ వర్క్‌ అనుకోండి. కానీ పర్శనల్‌గా మీరు నాకు నచ్చారు. నాతో డిన్నర్‌కు వస్తారా?’’ అని అడిగింది. ఒక మహిళ అలా అడిగాక మర్యాదగా తిరస్కరించడానికైనా కాస్త సమయం పడుతుంది కదా. ఆ ఫార్మాలిటీ పూర్తి చేసుకుని డేవిడ్‌ తన గదికి తిరిగి వచ్చేసరికి బ్రాడీ సరిగ్గా అప్పుడే తన పని పూర్తి చేసుకుని, తన కుర్చీలో కూలబడుతున్నాడు.

క్యారీ మానసిక స్థితి గురించి విన్న తర్వాత కూడా డేవిడ్‌ ‘మనకు గత్యంతరం లేదు. ఆ ఫాతిమా క్యారీకి తప్ప వేరే ఎవరికీ చెప్పనంటోంది. ఏమైతే అదే అవుతుంది, క్యారీని బీరూట్‌ పంపిద్దాం’ అన్నాడు. అందుచేత కేట్‌ అనే కెనడియన్‌ స్త్రీ పేరు మీద దొంగ పాస్‌పోర్టు, వీసాతో క్యారీ బీరూట్‌ చేరింది. అక్కడ అమెరికా వ్యతిరేక వాతావరణం బాగా వుంది. పోలీసులు, గూఢచారులు అందరూ అమెరికన్లంటే మండిపడుతున్నారు. అందుకే యీ జాగ్రత్తలు. క్యారీని రాయబారి కార్యాయానికి డైరక్టుగా రాకుండా వేరే గదిలో వుండి, ఫోన్‌ ద్వారా టచ్‌లో వుంటూ సాల్‌ వుంటున్న ఒక సురక్షితమైన చోటికి రమ్మనమని చెప్పారు. ఫాతిమాను అక్కడికే రమ్మనమని యిద్దరి ఎదుటా మాట్లాడిస్తే ఆమె నిజం చెపుతోందో, అబద్ధం చెపుతోందో సాల్‌, క్యారీ అంచనా వేయాలని డేవిడ్‌ సూచించాడు.

క్యారీ కస్టమ్స్‌లోంచి బయట పడి, తనకు చెప్పిన గదికి వెళ్లింది. అక్కడ ఒక సెల్‌ఫోన్‌ పడి వుంది. దాని నుంచి సాల్‌కు ఫోన్‌ చేసింది. అతను ఒక చోటకి రమ్మన్నాడు. అక్కడకి చేరబోతూండగా ఒక గూఢచారి తన వెంటపడ్డాడని గ్రహించిందామె. తన రాక గురించి ఉప్పందిందేమోనని సందేహం కలిగి, సాల్‌కు చెప్పింది.  సాల్‌ తను కూర్చున్న చోట నుంచే ఆమెను, గూఢచారిని గమనించి, ‘నువ్వు చెప్పినది నిజమే. నాపై నిఘా వుండుంటుంది. నేనిక్కడ కూర్చున్నాను కాబట్టి పరిసరాల్లో కనబడిన ప్రతి అమెరికన్‌ను గమనిస్తున్నారేమో, నువ్వు నన్ను దాటుకుని వెళ్లిపో.’ అని సలహా చెప్పాడు. ఆమె అలాగే చేసినా, మరో గూఢచారి క్యారీని గుర్తు పట్టినట్లున్నాడు, వెంటాడి వస్తున్నాడు.

ఈ విషయం సాల్‌కు చెప్పగానే ‘‘నీ చేతిలోని సెల్‌ఫోన్‌ ద్వారా నిన్ను ట్రాక్‌ చేస్తారు. ఫోన్‌ పారేసి, జనంలో కలిసిపో’ అని సహా చెప్పాడు. ఆమె అలాగే ఫోన్‌ పారేసి ఒక సంతలోకి దూరింది. అయితే లెబనీస్‌ గూఢచారి ఆమెను వదిలిపెట్టలేదు. ముస్లిము స్త్రీలా ముసుగు కప్పుకుని పారిపోతూ వుంటే గుర్తుపట్టి తుపాకీ గురి పెట్టాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్యారీ అతన్ని మర్మస్థానంలో కొట్టి, తప్పించుకుని పారిపోయింది. ఆర్నెల్ల గ్యాప్‌ వచ్చినా తనలో చురుకుతనం పోనందుకు చాలా సంతోషపడింది. ఇలాటి పరిస్థితుల్లో సాల్‌ వద్దకు తను వెళ్లడం, ఫాతిమాను అక్కడకు రప్పించడం అసాధ్యమని ఆమెకు తోచింది.

డానా కొత్త స్కూలులో వైస్‌ ప్రెసిడెంటు వాల్డెన్‌ కొడుకు ఫిన్‌ కూడా చదువుతున్నాడు. ఇద్దరిదీ ఒకటే క్లాసు. అతను కాస్త మందబుద్ధి అని డానాకు చిన్నచూపు కూడా. అవేళ క్లాసురూములో ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయేల్‌ దాడి గురించి విద్యార్థీవిద్యార్థినుల మధ్య చర్చ జరుగుతోంది. ఫిన్‌ ఇజ్రాయేల్‌ను సమర్థించబోయి తెలివితక్కువగా మాట్లాడి నవ్వులపాయ్యాడు.

అక్కడున్నవారిలో యించుమించు అందరికీ యూదులపై సానుభూతి, ముస్లిములపై అసహ్యం. చర్చ వేడెక్కినపుడు డానా ఆవేశంగా ‘ముస్లిమైతే తప్పేముంది? మా నాన్న ముస్లిమే’ అంది. అది జోక్‌ అనుకుని అందరూ పకపకా నవ్వారు. డానా తన తప్పు తెలుసుకుని నాలిక కరుచుకుని ఊరుకుంది. కానీ స్కూలు డీన్‌‌ దృష్టికి యీ విషయం వెళ్లింది. ఆవిడ జెసికాకు ఫోన్‌ చేసి, ‘మీ అమ్మాయి తిక్కతిక్కగా మాట్లాడుతోంది. దానివలన మీ కుటుంబాన్ని అందరూ అనుమానంగా చూస్తారు. జాగ్రత్త’ అని చెప్పింది.

జెసికాకు ఒళ్లెరగనంత కోపం వచ్చింది. కూతుర్ని పిలిచి ‘ఏవిటా వాగుడు?’ అని తిట్టిపోసింది. డానా కాస్సేపు తిట్లు పడి, యిక భరించలేక, తండ్రి కిచ్చిన మాట తప్పి ‘‘నేను నిజమే చెప్పాను.’’ అనేసింది. ‘‘మతి పోయిందా?’’ అని జెసికా అరుస్తూ వుండగా అప్పుడే అక్కడకు వచ్చిన బ్రాడీ ‘‘డానా నిజమే చెపుతోంది.’’ అని ఒప్పుకున్నాడు. తీసుకెళ్లి గరాజ్‌లో పెట్టిన నమాజ్‌ సామగ్రి చూపించాడు. ‘‘నువ్వు మాటిమాటికీ గరాజ్‌కు వెళ్లేది యిందుకా? నాకు చెప్పకుండా మతం ఎలా మారతావు? అయినా నిన్ను బందీగా వుంచి, చిత్రహింసలు పెట్టినవాళ్ల మతం నీకంత మక్కువైందా?’’ అని ఆమె విరుచుకు పడిరది. తనెలాటి పరిస్థితుల్లో మారవలసి వచ్చిందో చెపితే, ఆ పరిస్థితి మారిపోయిందిగా, యిక అవన్నీ తీసిపారేయ్‌, ఆ కురాన్‌ తగలబెట్టు అని ఆదేశించింది. ఎదురు చెప్పలేక బ్రాడీ తల వూపాడు. అర్ధరాత్రి లేచి కురాన్‌ను మర్యాదగా గొయ్యి తీసి కప్పెట్టాడు. ఇదంతా తనవలనే జరిగిందని ఫీలవుతున్న డానా తండ్రికి సాయపడింది.

ఫాతిమా ప్రతి శుక్రవారం ఒక మసీదుకి వెళ్లి ప్రార్థన చేస్తుందని క్యారీకి గుర్తుకొచ్చింది. అందుకని అక్కడికే వెళ్లి పలకరించింది. ఈమెను చూడగానే ఆశ్చర్యపడినా, పక్కకు తీసుకెళ్లి విషయం చెప్పింది. హిజ్బొల్లా జిల్లా కమాండర్‌ అయిన ఆమె భర్త అబ్బాస్‌ అలీకు నజీర్‌ యీ మధ్యే ఫోన్‌ చేశాడు. ‘అమెరికాపై ఒక దాడి చేయాల్సి వుంది, నీ సాయం కావాలి. బీరూట్‌ వచ్చి కలుస్తాను.’ అన్నాడు. ఏదైనా భవంతిలో కలిస్తే అవసరమైన పరిస్థితుల్లో పారిపోవడం కష్టమనీ,  వీధిలోనే కలుద్దామనీ, రద్దీ బాగా వుండే జనావాసం మధ్యలో ఎక్కడ, ఎప్పుడు కలవాలో చెప్పాడు. అది యీమె ఫోన్‌లో వింది. ‘ఆ సమాచారం చెప్తాను, నాకు అమెరికాలో స్థిరపడేందుకు తగిన ఏర్పాట్లు, డబ్బు యివ్వాలి.’ అందామె. ఆ మేరకు క్యారీ హామీ యిచ్చాక చెప్పేసింది. సాల్‌ ఉన్నచోటికి వెళ్లి క్యారీ సంగతంతా చెప్పింది. క్యారీ తను ఒక్కత్తీ వెళ్లి ఫాతిమాను కలిసిందని తెలియగానే సాల్‌ చికాకు పడ్డాడు.

జరిగినది చెప్తే డేవిడ్‌ కూడా విసుక్కున్నాడు. ‘‘గతంలో ఓ ఇన్‌ఫార్మంటు యిలాటి వార్తే చెప్పి జనసమ్మర్దం వున్న చోటకి మన అమెరికన్‌ ఏజంట్లందర్నీ సమీకరించాడు. మన వాళ్లని పెద్ద సంఖ్యలో మట్టుపెట్టేందుకు కారకుడయ్యాడు. ఇప్పుడీ ఫాతిమా కూడా మన తరఫున పని చేస్తోందో, నజీర్‌ తరఫున పనిచేస్తోందో సరిగ్గా అంచనా వేయగలగాలి. అందుకే నిన్ను కూడా పక్కనే వుండమన్నాను. ఇప్పుడు క్యారీ ఒక్కత్తీ వెళ్లి కలిసింది. ఆమెలో యిదివరకటి చాకచక్యం లేదు. అందర్నీ తప్పుగా అంచనా వేస్తోంది. ఫాతిమా నిజమే చెపుతోందని క్యారీ అంటున్నా, ఆమె మాట నమ్మి రిస్కు తీసుకుని మన ఏజంట్లను బలిపెట్టిన వారమౌతామా? పోనీ క్యారీ మాట నమ్మకుండా వూరుకుంటే నజీర్‌ను పట్టుకునే అవకాశం కోల్పోతామేమో! ఈ క్యారీ సొంత పెత్తనం చేసి పెద్ద ముప్పే తెచ్చిపెట్టింది.’’ అన్నాడు.

సాల్‌దీ అదే అభిప్రాయం. తన పరిస్థితి చూసి క్యారీకి తనమీద తనకే జాలి వేసింది. ‘‘లెబనీస్‌ ఏజంట్లు నీపై నిఘా వేశారు, నన్ను గుర్తించి వెంటపడ్డారు. ఇలాటి పరిస్థితుల్లో ఫాతిమాను యిక్కడకు రప్పించడం అసాధ్యం. అందుకే ఆమె వద్దకే వెళ్లి మాట్లాడాను. అది మీ దృష్టిలో పెద్ద తప్పయిపోయింది. మీరనేది నిజమే! నా నైపుణ్యం దెబ్బ తింది. బ్రాడీ విషయంలో నా అంచనా ఘోరంగా తప్పింది. మీరు యీనాటి క్యారీని నమ్మకపోతే నేనేమీ అనుకోను. కానీ ఎనిమిదేళ్ల క్రితం ఫాతిమాను రిక్రూట్‌ చేసిన క్యారీని నమ్మండి. ఫాతిమాను ఆమె భర్త విపరీతంగా హింసిస్తే నేను అనేకసార్లు కాపాడాను. ఆమెకు అమెరికాలో స్థిరపడాలనే ఆశ. ఆమె నిజాయితీ నాకు తెలుసు. నన్ను మోసం చేయదని గట్టి నమ్మకం. ఆ పై మీ యిష్టం.’’ అంది.

క్యారీ యిలా చెప్పాక సాల్‌ ఏమైతే అది అయిందని ఫాతిమా చెప్పిన ప్రాంతంలో డెల్టా ఫోర్స్‌ను మోహరించాలని, నజీర్‌ వస్తాడేమో ఎదురు చూడాలని డేవిడ్‌కు సూచించాడు. డేవిడ్‌ ‘సరే, వీలైతే సజీవంగా పట్టుకోవడం, లేకపోతే చంపేయాలి.’ అని నిర్ణయించాడు. సాల్‌తో ‘వాళ్లు నడివీధిలో కలవబోతున్నారు. మన వాళ్లు వివిధ టీములుగా విడిపోయి అనేక కోణాల్లోంచి ఆ మీటింగ్‌ స్పాట్‌పై దృష్టి పెట్టాలి. మేం వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫీసు నుంచి, ఆపరేషన్‌ను వీడియో ద్వారా మానిటార్‌ చేస్తూ వుంటాం. ఏ టీము ఏం చేయాలో చెప్తూ వుంటాం. మేం యిచ్చిన ఆర్డర్ల ప్రకారం నడుచుకోవాలి. నువ్వూ, క్యారీ నువ్వుంటున్న యింటి నుంచి వీడియో కెమెరాల ద్వారా ఏం జరిగిందో తెలుసుకుంటూ వుండండి. నజీర్‌ రాకపోతే ఫాతిమా గురించి పట్టించుకోనక్కరలేదు. వస్తే మాత్రం ఆమె యింటికి వెళ్లి, ఆమెను తీసుకుని సురక్షితంగా అమెరికాకు తీసుకుని వచ్చేయాలి.’’ అని చెప్పాడు.

ఒక ఆయుధాల కంపెనీ వాళ్లు నిధుల సమీకరణకై ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రాడీని, జెసికాను ఆహ్వానించారు. అక్కడకు వాల్డెన్‌ తన భార్య సింథియా తో సహా వచ్చాడు. సింథియాకు జెసికా బాగా నచ్చింది. ఇంటికి రమ్మనమని ఆహ్వానించింది. యుద్ధంలో గాయపడినవారి కోసం నిధులు సేకరించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. బ్రాడీకి చాలా పాప్యులారిటీ వుంది కాబట్టి దానికి అతన్ని ఎలాగైనా ఒప్పించి, రప్పించాలి అంది. మనిద్దరం కలిసి దాన్ని హోస్ట్‌ చేద్దామంది. జెసికా తప్పకుండా ప్రయత్నిస్తానంది. ఆడవాళ్లిలా మాట్లాడుతూండగానే, వాల్డెన్‌ బ్రాడీని పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు.

‘‘ఇరాన్‌లో ఒక అణుస్థావరం యింకా మిగిలిపోయింది. ఇజ్రాయేలు దాన్ని కొట్టలేక పోతోంది. అమెరికా తన దగ్గరున్న ఒక బాంబు యిస్తే ఇజ్రాయేలు ఆ పని సాధించగలదు. కానీ బాంబు యివ్వడానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒప్పుకోవటం లేదు. తన టెర్మ్‌ ఎలాగూ పూర్తి కాబోతున్నపుడు యిలాటి వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుని చెడ్డపేరు తెచ్చుకోవడం దేనికని అతని ఆలోచన. మనం ఇజ్రాయేలుకి యీ తరుణంలో సాయం చేస్తే ఎన్నికల సమయంలో వారు సాయపడతారు. డిఫెన్స్‌ సెక్రటరీని మనం ఒప్పిస్తే, ఆయన అధ్యక్షుడిపై ఒత్తిడి తేగలడు. డిఫెన్స్‌ సెక్రటరీ గతంలో నీలాగే మెరీన్‌. నువ్వంటే గౌరవం ఉంది. నువ్వు రేపు నా దగ్గరకు రా, యిద్దరం కలిసి ఆయన దగ్గరకు వెళదాం.’’ అని చెప్పాడు. బ్రాడీ తలవూపాడు.

మర్నాడు జెసికా, డానా యిద్దరూ వాల్డెన్‌ యింటికి వెళ్లారు. అదృష్టం కలిసివస్తే కొద్దికాలంలో తాము యీ యింట్లో ఉండబోతున్నామనే ఆలోచన జెసికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డానాకు బోరుగా వుంది. అక్కడకు వెళ్లాక వాల్డెన్‌ భార్య సింథియా, డానాతో ‘‘నేనూ, మీ అమ్మా మాట్లాడుకుంటాం. నువ్వు కావాలంటే పైన లైబ్రరీకి వెళ్లి హోం వర్క్‌ చేసుకో.’’ అంది. తను అక్కడ వుండగానే వాల్డెన్‌ కొడుకు ఫిన్‌ అక్కడకు వచ్చాడు. సరదాగా కబుర్లు చెప్పాడు. తెలివైనవాడు కాకపోయినా మంచివాడే అనిపించింది డానాకు. కింద జెసికా, సింథియా మంచి మిత్రురాళ్లయిపోయారు.

అదే సమయంలో బ్రాడీ వాల్డెన్‌ ఆఫీసులో ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూండగానే డేవిడ్‌ వచ్చి ‘రండి, ఆపరేషన్‌ను లైవ్‌లో చూద్దురుగాని, తక్కిన ప్రముఖులందరూ వచ్చేశారు.’ అని పిలిచాడు. వాల్డెన్‌ బ్రాడీతో నువ్వూ రా అంటూ తీసుకెళ్లాడు. సగం చీకటిగా వున్న ఆ హాలులో వైస్‌ ప్రెసిడెంటుకు ఆత్మీయులు, సిఐఏ అధికారులు అందరూ ఉన్నారు. బీరూట్‌లో ఆ వీధిలో ఏం జరుగుతోందో లైవ్‌లో కనబడుతోంది. అంతా మామూలుగానే జనం తిరుగుతున్నారు. అంతలో అల్‌ ఖైదా వాళ్లు వచ్చి దుకాణాలు మూయించేశారు. జనాలందరినీ యిళ్లలోకి వెళ్లిపోమన్నారు. అనేక ట్రక్కులు వచ్చి చుట్టూ మోహరించ సాగాయి. ఫాతిమా భర్త కాబోలు, కొందరితో కలిసి, ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు నిలబడ్డాడు. ‘ఫాతిమా సమాచారం కరక్టే. ఎవరో ప్రముఖనాయకుడు వస్తున్నాడు. వచ్చేవాడు నజీర్‌ అవునా కాదా అని చూడాలి’ అనుకున్నాడు డేవిడ్‌.

గదిలో ఉగ్గబట్టుకుని చూస్తున్నవారిలో బ్రాడీ కూడా ఉన్నాడు కానీ అతను ఊరుకోలేక పోయాడు. నరరూప రాక్షసుడు వాల్డెన్‌కు శిక్ష పడాలంటే నజీర్‌ బతకాలి. అతన్ని ఎలర్ట్‌ చేయాలి. ఎలా? ఎవరూ చూడకుండా తన సెల్‌ఫోన్‌లోంచి అతనికి ఓ మెసేజ్‌ పెట్టాడు. కానీ అతను చూసే లోపునే చుట్టూ వున్న సిఐఏ టీము తుపాకీ గుళ్లు కురిపిస్తే? తెర మీదకు చూస్తున్నాడు. ఒక వాహనం వచ్చి ఆగింది. దానిలోంచి నజీర్‌, అతని సహచరుడు దిగారు. నజీర్‌ను ప్రత్యక్షంగా చూడగానే యిక్కడ గదిలో అందరూ ఎలర్టయ్యారు. ‘‘షూట్‌’’ అని డేవిడ్‌ ఆర్డరిచ్చాడు. ఇంతలోనే నజీర్‌కు అతని సహచరుడు సెల్‌ఫోన్‌ అందివ్వడం, అతను మెసేజ్‌ చూసుకుని, మరుక్షణంలో వాహనంలోకి ఎక్కేయడం, అక్కణ్నుంచి కాల్పుల మధ్య వాహనం తప్పించుకుని పారిపోవడం జరిగిపోయాయి.  కాల్పుల్లో ఫాతిమా భర్త, మరో ఏజంటు కుప్పకూలి, చనిపోయారు.

నజీర్‌ అక్కడే మరో నిమిషం నిలబడి వుంటే తుపాకీ గుళ్లు సరాసరి అతని నుదురులోంచి వెళ్లిపోయేవి. కానీ మెసేజ్‌ కారణంగా బతికిపోయాడు. ఏమిటా మెసేజ్‌? అది చూసుకుని ఎందుకు ఎలర్టయ్యాడు? చుట్టూ డెల్టా ఫోర్స్‌ వాళ్లున్నారు, నిన్ను చంపబోతున్నారని ఎవరో హెచ్చరించి వుంటారు. మెసేజ్‌ ఎవరు పంపారు?  వాళ్లకు ఎలా తెలిసింది? గదిలో అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. (ఫోటో - ఎడమవైపు వాల్డెన్‌ కొడుకు ఫిన్‌, భార్య సింథియా, కుడివైపు  బీరూట్‌ వీధుల్లో సమావేశానికి వచ్చిన నజీర్‌)(సశేషం) 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?