cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఓ గూఢచారిణి ప్రేమ కథ - 12

ఎమ్బీయస్: ఓ గూఢచారిణి ప్రేమ కథ - 12

నజీర్ తరఫున బ్రాడీని రోయా హేండిల్ చేస్తోందని తెలిశాక సిఐఏ తనను ఫాలో కాసాగింది. ఒక పబ్లిక్ పార్క్‌లో ఒకతనితో ఆమె మాట్లాడుతూండగా వర్జిల్, అతని తమ్ముడు గమనించి ఫోటో తీశారు. తమ్ముడు వాళ్లకు దగ్గరలో నిలబడి మైకు పట్టుకున్నా పక్కనే వున్న ఫౌంటెన్ చప్పుడు కారణంగా వాళ్లు మాట్లాడుకునేది ఏమీ వినబడలేదు, రికార్డు కాలేదు. రోయాతో మాట్లాడి వెళ్లిపోయినతన్ని వర్జిల్ వెంటాడాడు కానీ అతను పట్టుబడలేదు. ఎక్కడో తప్పిపోయాడు. అతని ఫోటో సిఐఏ రికార్డుల్లో ఎక్కడా లేదు. బ్రాడీని పిలిపించి గుర్తించమందా మనుకున్నారు.

ఆ రోజు బ్రాడీ ఆఫీసుకి వెళ్లబోతూ వుంటే జెసికా ‘సిఐఏకు పనిచేస్తున్నావని నిన్న రాత్రి నువ్వు చెప్పినది నిజమేనా‘ అని అడిగింది. అవును అంటే అక్కడ క్యారీ పనిచేస్తోందా అని అడిగింది. లేదుగా, ఆమె మానసిక స్థితి బాగాలేదని తీసేశారుగా అన్నాడతను. అయితే.. అని యింకేదో అడగబోయి జెసికా ఊరుకుంది. క్యారీతో నీకింకా సంబంధం వుందాని అడగబోయి ఆగిపోయిందని బ్రాడీకి అర్థమై వూరుకున్నాడు.

సిఐఏ ఆఫీసుకి బ్రాడీ వచ్చాక ఫోటో చూసి, అతనెవరో తెలియదన్నాడు. అక్కడ బులెటిన్ బోర్డు మీద టైలర్ ఫోటో చూసి, ఇతను చనిపోయాడుగా అన్నాడు. దాంతో పీటర్‌కు ఒళ్లు మండింది. ఆ ముక్క నిన్ననే చెప్పవచ్చుగా, మా టీము బయట అనవసరంగా కాచుకుని వుంది, వాళ్లను వెనక్కి రప్పించి, ఫోరెన్సిక్ టీమును లోపలకి పంపించి, యింకా ఏమైనా బాంబులున్నాయేమో వెతకమంటాను అన్నాడు. బ్రాడీ క్యారీతో విడిగా మాట్లాడుతూ జెసికాతో నీ గురించి అబద్ధం చెప్పాను, నువ్వు కూడా దానికి అనుగుణంగానే నడుచుకో అని సూచించాడు.

లాడర్ పట్టుదల కారణంగా మైక్ అతనితో కలిసి టామ్ చావు గురించి పరిశోధన మొదలుపెట్టాడు. అతని శవాన్ని మొదటగా చూసిన పోలీస్‌ను వెంటపెట్టుకుని శవం పడి వున్న చోటు చూశారు. ‘మేం యిన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన 20 ని.లలోనే సిఐఏ వచ్చి కేసు తన చేతుల్లోకి తీసేసుకుంది‘ అన్నాడు ఆ పోలీసు. ‘సిఐఏలో నాకు తెలిసున్న మనిషి వున్నాడు, అతన్ని అడుగుతానులే‘ అన్నాడు మైక్. ‘సిటీలో యింత మూలకు టామ్ వచ్చాడంటే, అతనికి బాగా తెలిసున్నవాళ్లే రప్పించి వుంటారు‘ అన్నాడు లాడర్.

ఇద్దరికీ బ్రాడీ మీదకే అనుమానం పోయింది. శవం దొరికిన చోటకు దగ్గరలోనే 9 ఎంఎం కేసింగు దొరికింది. మైక్ అది భద్రపరుచుకున్నాడు. బ్రాడీ తుపాకీని రహస్యంగా పరీక్షించాలనుకున్నాడు. సిఐఏ ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ సాల్ కనబడి డేవిడ్ వద్దకు తీసుకెళ్లాడు.  ‘మైక్, టామ్ మరణం గురించి మీరు సొంత పరిశోధన ఆపేస్తే మంచిది. ఇది జాతీయభద్రతకు సంబంధించిన విషయం.‘ అన్నాడు డేవిడ్. ఇతను తలవూపి బయటకు వచ్చేశాడు.

యాక్సిడెంటు జరిగిన దగ్గర్నుంచి డానా ఆందోళనగా వుంది. స్కూలు వెళ్లనంది. తండ్రి బలవంతపెట్టి తీసుకెళ్లాడు. స్కూలులో ఫిన్ ధైర్యం చెప్పబోయాడు – ఆ చోటుకి దగ్గర్లోనే హాస్పటల్ వుంది. ఎవరో తీసుకెళ్లి వుంటారు, ఆమెకు నయం అయిపోయి వుంటుంది అని. డానాకు స్థిమితం చిక్కక మర్నాడు ఆసుపత్రికి వెళ్లి చూసింది. ఆ ముసలామె భారతీయురాలు. పెద్దగా డబ్బు లేదు. ఐసియులో వుంది. డానా తలుపు కన్నంలోంచి చూస్తూండగా ఆమె కూతురు వచ్చి నువ్వెవరంది. నేనిక్కడ డాక్టరు కూతుర్ని. మీ అమ్మకేమైంది? అని అడిగింది డానా.

‘పొద్దున్నదాకా బాగానే వుంది, యిప్పుడే డాక్టర్లు పిలిచి అంతా అయిపోయింది, మీ ప్రీస్ట్‌ని పిలుచుకోండి‘ అన్నారు అందామె. ఇంతలోనే లోపల్నుంచి పిలుపు రావడంతో ఆమె ఐసియులోకి వెళ్లింది, డానా పరిగెట్టుకుని వచ్చేసింది. మర్నాడు పొద్దున్న ఆసుపత్రికి వెళ్లి కనుక్కుంటే ఆమె చనిపోయిందని తెలిసింది. చాలా బాధపడుతూ ఫిన్‌తో జరిగినది చెపితే అతను తిట్టిపోశాడు. మనం మెదలకుండా కూర్చుంటే విషయం మనదాకా రాదు. నీ కారణంగా బయటకు వచ్చిందంటే కారు డ్రైవ్ చేసినది నేను కాబట్టి నా కొంప మునుగుతుంది అన్నాడు.

రోయా కలిసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని క్యారీ బ్రాడీ కారెక్కి అతని చేత రోయాకు ఫోన్ చేయించింది. ఆమె చెప్పిన మీదట బ్రాడీ ‘నేను సిఐఏ ఆఫీసుకి వెళ్లినపుడు అమెరికాకు కొత్తగా వచ్చిన హిజబొల్లా మనిషి గురించి క్యారీ ఎవరితోనో మాట్లాడుతూండగా విన్నాను‘ అని చెప్పాడు. ‘ఓహో అలాగా‘ అంటూనే రోయా గెట్టీస్‌బర్గ్‌లో టైలర్ షాపు దగ్గరకు సిఐఏ టీము చేరింది అంది. అలాగా వాళ్లకు అక్కడేమైనా కనబడిందా? అని బ్రాడీ అడిగితే చూదాం, ఏం కనిపెడతారో అంది రోయా. ఆమె మాట్లాడిన ధోరణి విని క్యారీ కంగారుపడి పీటర్‌కు ఫోన్ చేసింది.

అతను అప్పటికే ఆ షాపులో తన టీముతో సహా సర్వం శోధిస్తున్నాడు. ఏమీ కనబడలేదు. క్యారీ ఫోన్‌తో కాస్త అలర్ట్‌ అయి ఒక గోడలు కూడా తట్టి చూడసాగాడు. ఒక గోడ బోలుగా వున్నట్లు తోచింది. పగలకొట్టి చూదాం అంటూండగానే కొందరు హెల్మెట్లు వేసుకుని వచ్చి ఆటోమెటిక్ వెపన్స్‌తో వీళ్లందరినీ టపటపా కాల్చేశారు. వీళ్లూ తిరిగి కాల్చడంతో వారిలో ఒకడు గాయపడ్డాడు.

వీళ్లందరూ నిస్సహాయంగా పడి వుండగా వచ్చినవాళ్లు ఆ గోడ పగలకొట్టి ఓ దానిలోంచి పెద్ద యినప్పెట్టె బయటకు లాగారు. దాన్నిండా పేలుడు పదార్థం వుంది.

పెట్టెను, గాయపడిన సహచరుణ్ని తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లకు నాయకత్వం వహించిన వ్యక్తి వేరెవరో కాదు, రోయాను కలిసినవాడే. ఈ కాల్పుల్లో సిఐఏ టీములో 7గురు మరణించారు. పీటర్ కొసప్రాణంతో బయటపడినా, తీవ్రంగా గాయపడ్డాడు. ఇది వినగానే క్యారీ బ్రాడీ ఆఫీసుకు వచ్చి విరుచుకుపడింది. ఇది నీకు ముందే తెలిసివుంటుంది. మాకెందుకు చెప్పలేదు? అని. నాకు తెలియదు మొర్రో అని మొత్తుకున్నాడు బ్రాడీ. అతన్ని నమ్మాలో లేదో అర్థం కాక క్యారీ భోరుమంది.

మైక్ బ్రాడీ యింటికి వెళ్లిన సమయంలో క్రిస్ కనబడ్డాడు. ‘మీ నాన్న నా దగ్గర తీసుకున్న వస్తువు కోసం వచ్చాను‘ అంటూ గరాజ్ లోపలికి వెళ్లి బ్రాడీ తుపాకీని పరీక్షించాడు. అక్కడ ఒక గుండు మిస్ కావడం చూసి, టామ్‌ను అతనే చంపాడని తేల్చుకున్నాడు. అప్పడే యింటికి వచ్చిన జెసికాతో బ్రాడీయే టామ్‌ను చంపాడు. నీ గురించి, పిల్లల గురించి వర్రీ అవుతున్నా అన్నాడు. బ్రాడీ సిఐతో కలిసి పనిచేస్తున్నాడు అని జెసికా చెప్పింది కానీ మైక్ కన్విన్స్ కాలేదు. అతనింకా ఏదో చెప్పబోతూ వుంటే జెసికా అతన్ని కట్ చేసేసింది.

బ్రాడీ మార్నింగ్ జాగింగ్ చేస్తూండగా చెట్టు చాటు నుంచి రోయా వచ్చి కలిసింది. గెట్టీస్‌బర్గ్‌లో మనవాడు ఒకడు పోయాడు, నీ పాత్ర మరింత పెరగబోతోంది అంది. బ్రాడీకి ఒళ్లు మండిపోయింది. మీరు నాకేమీ చెప్పరు, చెయ్యరు కానీ నేనే ఏదో చేసేస్తున్నట్లు మాట్లాడుతున్నావ్ అని అరిచాడు. బ్రాడీకి తెలుసు - క్యారీ యివన్నీ వింటోందని. ఆమె అపనమ్మకం పోగొట్టడానికే రోయాతో కటువుగా మాట్లాడాడు. రోయా అతన్ని చల్లబరుస్తూ అన్నీ అనుకున్నట్లు జరుగుతున్నాయి. ఇది ముగియడానికి ఎక్కువకాలం పట్టదు అంది. జాగింగ్ నుంచి తిరిగివచ్చాక బ్రాడీ కుటుంబం ఒక ఫండ్‌రైజింగ్ పార్టీకి బయలుదేరింది. రెక్స్ అనే ఒక డబ్బున్న పార్టీ అభిమాని తన యింట్లో ఏర్పాటు చేశాడు.

అక్కడికి వెళుతూండగా జెసికా భర్తతో మైక్ వచ్చి టామ్‌ను నువ్వే చంపావన్నాడని చెప్పింది. బ్రాడీ యిరకాటంలో పడి టామ్ హత్యలో తనకు పాత్ర వున్న మాట వాస్తవమేనని, సిఐఏ చెప్పినట్లు చేయాల్సివచ్చిందని సంజాయిషీ యిచ్చాడు. పార్టీకి వెళ్లగానే బయటకు వచ్చి క్యారీకి ఫోన్ చేసి మైక్ జెసికాతో టామ్ గురించి చెప్పాడని, సిఐఏ ఏం చేస్తోందనీ కోప్పడ్డాడు.

క్యారీ యీ విషయం పీటర్‌తో చెప్పింది. అతను ఆసుపత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే బయటకు వచ్చేశాడు. బ్రాడీ  మనకు చాలా ముఖ్యమైనవాడు, అతన్ని ఎలాగైనా ఆకట్టుకుని వుంచు అని ఆదేశించాడు. క్యారీ మైక్‌ను కలిసి జెసికా ప్రేమ కోసం బ్రాడీని చెడ్డవాడిగా చూపించవద్దని, అసలు అతని జోలికి రావద్దని గట్టిగా చెప్పింది. తర్వాత స్వయంగా బ్రాడీని కలిసి అతని కోపాన్ని చల్లార్చడానికి పార్టీ జరిగే చోటుకి బయలుదేరింది.

రోయాను కలిసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి సాల్ గతంలో టామ్‌ను గుర్తుపట్టిన ఐలీన్‌ను కలవడానికి ఆమెను ఉంచిన జైలుకి వెళ్లాడు. అది వేరే ఊరిలో వుంది. అక్కడ ఆమె జీవితం దుర్భరంగా వుంది. జైలరు ఆమెను రోజులో 23 గంటల పాటు ఏకాంతంగా గాలి చొరబారని గదిలో వుంచుతున్నాడు. సాల్ వెళ్లి ఫోటో చూపించి అడిగినప్పుడు ఆమె ‘వీడు నాకు తెలుసు. నన్ను కిటికీ వున్న గదిలోకి మారిస్తేనే పేరు చెప్తాను‘ అని మొండికేసింది. సాల్ వెళ్లి జైలరుతో మాట్లాడాడు. అతను చాలా కఠినాత్ముడు. ఏ వెసులుబాటూ యివ్వనన్నాడు. దాంతో సాల్ హెడాఫీస్‌తో మాట్లాడి అడ్వకేట్ జనరల్ ద్వారా అనుమతి పత్రం తెప్పించాడు.

ఆమె దుస్థితి చూసి సాల్ కరిగిపోయాడు. తన దగ్గరున్న బ్రెడ్, చీజ్, వైన్ యిచ్చాడు. పత్రం వస్తోంది కదా యిప్పటికైనా మాట్లాడు అని అడిగినా ఐలీన్ ఒప్పుకోలేదు. నువ్వెంత ఆత్మీయంగా మాట్లాడినా దాన్ని కళ్లారా చూశాకనే నోరు విప్పుతానంది. పత్రం చేతికి యిచ్చాక అప్పుడు చెప్పింది – అతని పేరు ముహమ్మద్ అని, ఏడాదిగా అమెరికాలో ఉంటున్నాడని, ఫలానా అడ్రసులో వుంటాడనీ. సాల్ ఎగిరి గంతేసి, పీటర్‌కు ఫోన్ చేసి చెప్పాడు.

ఇక్కడ ఫండ్‌రైజింగ్ పార్టీ దగ్గర వచ్చినవాళ్లందరూ బ్రాడీని ఎనిమిదేళ్లపాటు నిర్బంధంలో ఎలా వున్నారండీ, ఎంత హింసించారండీ, మీ వీపు మీద, ఛాతీ మీద చారలున్నాయి కదా అని యిబ్బందికరమైన ప్రశ్నలు వేయసాగారు. పార్టీ ఏర్పాటు చేసిన రెక్స్ అది గమనించి అతన్ని విడిగా తీసుకెళ్లి మాట్లాడాడు –‘నేను వియత్నాం యుద్ధంలో పాల్గొని వచ్చినవాణ్ని. ఇలాటి ప్రశ్నలు నన్నూ అడిగేవారు. నువ్వంటే నా కిష్టం. వాల్డెన్ స్వార్థపరుడు, నాకు నచ్చడు. అయినా ఎందుకు సమర్థిస్తున్నానో తెలుసా, ఇవాళ నువ్వు అతని సహచరుడిగా ఉపాధ్యక్షుడివి అయ్యావంటే ఎనిమిదేళ్ల తర్వాత అధ్యక్షుడు అయ్యే ఛాన్సుంది. నీలాటి మంచివాడు అ స్థానానికి వెళ్లాలి. అదీ నా ధ్యేయం. ‘ అన్నాడు.

బ్రాడీ సిగ్గుపడుతూ ‘నేను మీరనుకునేటంత మంచివాణ్ని కాను‘ అన్నాడు. ‘అది వినయవంతుల లక్షణం‘ అంటూ రెక్స్ మరీ మురిసిపోయాడు. పార్టీలో తక్కిన అతిథులను చూడడానికి అతను వెళ్లినపుడు క్యారీ బ్రాడీకి ఫోన్ చేసి ‘నువ్వున్న బంగళాకు ఆనుకున్న తోటలో నీ గురించి వెయిట్ చేస్తున్నా, రా‘ అంది. బ్రాడీ తోటలోకి వెళితే అక్కడ క్యారీ కనబడి ‘మైక్‌ను నోరుమూసుకోమని చెప్పాం. నీకేం భయం లేదు‘ అంది. బ్రాడీ రెక్స్ తన గురించి అనుకుంటున్నది చెప్పి, ‘నేనెలాటి వాణ్నో నీకు తెలుసు, పాపం ఆయనకు తెలియదు. ఆ ప్రశంస వింటూంటే చాలా సిగ్గుపడుతున్నాను, అంత మంచివాణ్ని మోసగించినట్లు ఫీలవుతున్నాను.‘ అన్నాడు.

‘లేదు, నువ్వు నిజంగా మంచివాడివే‘ అంటూ క్యారీ బ్రాడీని ముద్దాడింది. ‘నువ్వు నన్ను ఉపయోగించు కుంటున్నావని, మానిప్యులేట్ చేస్తున్నావని తెలుసు. అయినా నిన్ను అభిమానించకుండా ఉండలేక పోతున్నాను. నీతో గడిపే క్షణాలు నాకు హాయి నిస్తున్నాయి.‘ అంటూ బ్రాడీ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. అంతలోనే యిది మంచి పద్ధతి కాదు అంటూ కౌగిలి విడిపించుకుని బంగళాలోకి వచ్చి పార్టీలో పాల్గొన్నాడు.

ఈ లోపున పార్టీకి వచ్చిన డానా, ఫిన్‌ల మధ్య గొడవ జరుగుతోంది. డానా అంతకుముందు రోజు ఆ ముసలామె అంత్యక్రియలకు హాజరైంది. ఆ సంగతి చెప్పగానే ఫిన్ ‘నువ్వు చేసే పిచ్చి పనుల వలన మన తలిదండ్రులకు ఎంత కష్టమో ఆలోచించావా‘ అంటూ తిట్టాడు. అనుకోకుండా అక్కడకు వచ్చి వీళ్ల వాదన విన్న ఫిన్ తల్లి సింథియా ఏం జరిగిందని అడిగింది. డానా చటుక్కున ‘మేం ఒకామెను చంపేశాం‘ అంది. సింథియా అడిగిన మీదట వివరాలన్నీ చెప్పింది. అదే టైముకి వచ్చిన జెసికా కూడా అంతా వింది.

ఆమె కంగారు పడుతూంటే సింథియా ‘నేను చూసుకుంటా‘ అని హామీ యిచ్చి, వెంటనే భర్తను పక్కకు పిలిచి విషయం చెప్పింది. వాల్డెన్ తొణక్కుండా బ్రాడీ దంపతులను పిలిచి ‘విషయం పోలీసుల దాకా వెళ్లకుండా నేను చూసుకుంటాను. డేవిడ్‌కు చెప్తాను, అతనే హాండిల్ చేస్తాడు. మీరేమీ మాట్లాడకండి‘ అన్నాడు. కానీ వీళ్లిద్దరికీ అది సబబు అనిపించలేదు. నేరం చేశాక ఒప్పుకోవాలి కదా అన్నారు. ‘చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే మన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటామా? తెలివితక్కువగా మాట్లాడకండి.‘ అని వాల్డెన్ కోప్పడ్డాడు. ఇంటికి తిరిగివస్తూంటే డానా సణుగుతూనే వుంది.  ‘ఇది అన్యాయం, అక్రమం‘ అంటూ. .

ఐలీన్ నుంచి సాల్ రాబట్టిన సమాచారంతో ఆ ఫోటోలో వ్యక్తి యింటిపై  పీటర్ ఒక ప్రయివేటు విమానంలో వెళ్లి దాడి చేశాడు. తీరా చూస్తే అతను ఏ టెర్రరిస్టూ కాదు. ఐలీన్‌కు చాలాకాలంగా తెలిసున్న ఒక సంగీతకారుడు. పోలికా కలవలేదు. ఐలీన్ తమను ఎందుకిలా తప్పుదోవ పట్టించిందో అర్థం కాక, సాల్ మర్నాడే ఆ జైల్‌కు ప్రయాణం కట్టాడు. సాల్ వెళ్లి చూసేసరికి ఐలీన్ తన కొత్త గదిలో చావుబతుకుల్లో వుంది. ముందురోజు సాల్ చదువుకోవడానికి తనకు యిచ్చిన కళ్లజోడు లోంచి ఓ గాజుముక్క పీకి దానితో పీక కోసుకుని ప్రాణం తీసుకుంది. సాల్ చూసేసరికి రక్తం కారిపోతోంది.

‘ఎందుకిలా అబద్ధం చెప్పావ్? మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తే నీకేం లాభం?‘ అని అడిగాడు సాల్ బాధగా.  ‘నన్ను క్షమించు. నా అవసరం అలాటిది. ఈ జైలు జీవితంతో నాకు బతుకుమీద విరక్తి కలిగింది. చచ్చిపోదామనుకున్నాను. ఒక రోజు మొత్తం కిటికీలోంచి గాలి పీల్చి చద్దామనుకున్నాను. కానీ ఎలా? అనుకోకుండా నువ్వు వచ్చావ్. ఆ ఫోటోలో వ్యక్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. కానీ తెలుసని మభ్యపెట్టి కిటికీ వున్న గది తెప్పించుకున్నాను. ఒక రోజు హాయిగా బతికాను, చాలు.‘ అని చెప్పి ప్రాణం విడిచింది. మోసపోయిన బాధ కన్నా  ఆమె పడిన మనోవేదన సాల్‌ను ఎక్కువ కదిలించింది. దీని మాట ఎలా వున్నా ఆ టెర్రరిస్టు ఎవరో, ఏం చేయబోతున్నాడో సిఐఏలో ఎవరికీ అంతు చిక్కలేదు. (ఫోటో – ఇన్‌సెట్‌లో రోయాతో మాట్లాడుతున్న టెర్రరిస్టు, అతని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఐలీన్‌ మరణం) 

-ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)
mbsprasad@gmail.com

 


×