cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: గుజరాత్‌లో చేసి చూపించాం

ఎమ్బీయస్‌: గుజరాత్‌లో చేసి చూపించాం

2014 ఎన్నికలలో మోదీ ప్రధాన ప్రచారాస్త్రం - మేం గుజరాత్‌లో చేసి చూపించినదాన్నే దేశమంతా అమలు చేస్తాం! అని. గుజరాత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు గ్రాఫిక్స్‌లో చూపించడంతో, ఇంకేముంది యీయన పాలనలో దేశమంతా యిలాగే ఉజ్జ్వలంగా వెలిగిపోతుందనుకుని కోట్లాది తటస్థులు కూడా మోదీకి ఓటేసి ప్రధానిని చేశారు. ఈ ఎన్నికలలో మోదీ, అమిత్‌ల రణతంత్రం ఎలా ఉంటుందో గుజరాత్‌లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది.

గుజరాత్‌ మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రమైనా, 2017 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికలలో వాళ్లకు గట్టిపోటీ యిచ్చి 99 సీట్లకు పరిమితం చేశార కాబట్టి, యీసారి అక్కడే మన పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం పెడదామని నిశ్చయించుకుంది కాంగ్రెసు. 1961 తర్వాత అక్కడ అలాటి సమావేశం జరగలేదు, అందువలన దానికి ప్రాముఖ్యత యిద్దామనుకున్నారు. పైగా తమకు మద్దతిస్తూ వచ్చిన పటేల్‌ ఉద్యమనాయకుడు హార్దిక్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి అదే వేదిక అనుకున్నారు. వీళ్లు పెట్టుకున్న మార్చి 12 ముహూర్తానికి కాస్త ముందే వీళ్ల నైతిక స్థయిర్యం దెబ్బ తీయడానికి బిజెపి నిశ్చయించుకుంది. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయింప చేసుకుని వాళ్లసో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టింది. వీళ్లంతా సౌరాష్ట్ర ప్రాంతానికి, బిసి వర్గాలకు చెందినవారు.

గతంలో కూడా ఓ యిద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను గుంజుకుంది. గత పార్లమెంటు ఎన్నికలలో గుజరాత్‌లో బిజెపికి మొత్తం 26 సీట్లు దక్కాయి. ఈ సారి కొన్నయినా తమ ఖాతాలో పడతాయని కాంగ్రెసు ఆశిస్తున్న తరుణంలో బిజెపి యీ ఫిరాయింపుల ఉధృతం పెంచింది. నిజానికి యిది బిజెపి చాలాకాలంగా ఆడుతున్న ఆటే. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 14 మందిని, దానికి ముందు మరో ముగ్గురిని కాంగ్రెసు నుంచి ఫిరాయింప చేసుకుంది. కానీ ఎన్నికలలో కేవలం యిద్దరు మాత్రమే నెగ్గారు. ''వీళ్ల గతీ అంతే. బిజెపి కాంగ్రెసు ముక్త్‌ భారత్‌ అనే నినాదం యిచ్చింది కానీ తన పార్టీని కాంగ్రెసు వారితో నింపేసుకుంటోంది. ప్రస్తుతం విజయ్‌ రూపాణీ కాబినెట్‌లో 70% మంది ఏదో ఒక సమయంలో కాంగ్రెసులో ఉన్నవారే'' అంటూ వెక్కిరించాడు కాంగ్రెసు అధికార ప్రతినిథి శక్తి గోహిల్‌.

2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి బాగా దెబ్బ తిన్న ప్రాంతం 47 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర. వ్యవసాయం మీద ఆధారపడిన ఆ ప్రాంతంలో రైతుల్లో చాలామంది పటేల్‌, కోలి కులస్తులు. 1995 నుంచి బిజెపికి అండగా నిలబడ్డారు. అక్కడ నీటి కొరత, వ్యవసాయరంగంలో సంక్షోభం, 2015లో తలెత్తిన పటేల్‌ ఆందోళన అన్నీ కలిసి 2017లో బిజెపి సీట్లను 30 నుంచి 19కి తగ్గించి వేశాయి. కాంగ్రెసుకు ఏకంగా 28 సీట్లు వచ్చిపడ్డాయి. దాన్ని మరింత పటిష్టపరచుకోవడానికి కాంగ్రెసు పటేల్‌ నాయకుడైన హార్దిక్‌ను సన్నిహితుడిగా చేసుకుంది. దానికి విరుగుడుగా బిజెపి సౌరాష్ట్రలోని కోలి, యితర బిసి కులాల ఎమ్మెల్యేలపై కన్నేసింది.

అసెంబ్లీ ఎన్నికలైన కొద్ది నెలలకే 2018 జులైలో రాజకోట జిల్లాలోని జస్‌దాన్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేగా నెగ్గిన కువర్‌జీ బవాలియాను తన పార్టీలోకి తీసుకుని వెంటనే మంత్రిని చేసేసింది. అతను గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెసుకు వర్కింగ్‌ ప్రెసిడెంటు. తన నియోజకవర్గంలో ఎంత బలవంతుడంటే అక్కణ్నుంచి ఐదుసార్లు నెగ్గాడు. అంతేకాదు, అక్కడ మోదీ సభ పెట్టినా జనం ఎక్కువగా రాకుండా చూసిన సమర్థుడు. అందుకే అతని చేత రాజీనామా చేయించి, 2018 డిసెంబరులో మళ్లీ గెలిపించుకుంది. ఈ లోపునే మూడు పోర్టుఫోలియోలతో మంత్రి పదవి కట్టపెట్టింది. ఉపయెన్నికలో అతని విజయం తర్వాత మోదీ వీడియో ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ''కోలీలను చాలా కాలంగా ఓటు బ్యాంకుగా వాడుకున్నారు.'' అని వాపోయారు. ఆయన రాజకీయజీవితంలో చాలాభాగం గుజరాత్‌లోనే గడిచిందని మనం గుర్తు చేసుకోవాలి.

2017 ఎన్నికలలో ఉత్తర గుజరాత్‌లోని ఊంఝా నియోజకవర్గం నుంచి నెగ్గిన డా. ఆశా పటేల్‌పై బిజెపి కన్ను పడింది. హార్దిక్‌ పటేల్‌ అనుచరురాలైన ఆమె ఆ ఎన్నికలో బిజెపికి చెందిన అగ్రనాయకుడు నారాయణ్‌ పటేల్‌ను ఓడించింది. మోదీ స్వగ్రామం వాడ్‌నగర్‌ ఆ నియోజకవర్గంలోకే వస్తుంది. 1972 నుంచి కాంగ్రెసు అక్కడ ఓడిపోతూనే ఉంది. ఈసారి యీమె గెలిచి వారిని ఉత్తేజ పరిచింది. అయితే ఆమె హార్దిక్‌తో విభేదించి వేరుపడిందన్న సమాచారం రాగానే బిజెపి ముందుకు వచ్చి గత నెలలో బిజెపిలోకి లాగేసుకుంది. ఆమెకు మంత్రి పదవి యిచ్చినట్లు లేదు. ఈ నెల రాగానే వలలో మూడు చేపలు పడ్డాయి. ఈ మూడూ సౌరాష్ట్ర నుంచే.

పోర్‌బందర్‌ జిల్లాలోని మాణవదార్‌ నియోజకవర్గం నుంచి 5 సార్లుగా ఎన్నికవుతూ వస్తున్న కాంగ్రెసు ఎమ్మేల్యే, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఐన జవహర్‌ చావ్‌డాను మార్చి 8న పార్టీలోకి తీసుకుని మర్నాడే మంత్రి పదవి యిచ్చేశారు. ఇతను ఆహిర్‌ కులానికి చెందినవాడు. పోర్‌బందర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో వారి సంఖ్య ఎక్కువ. అతని తర్వాత పార్టీలో చేర్చుకున్నది జామ్‌నగర్‌ (గ్రామీణ) నియోజకవర్గం నుంచి ఎన్నికైన వల్లభ్‌ ధరావియాని. ఇతను సత్వారా కులానికి చెందినవాడు. జామ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో వీరి సంఖ్య ఎక్కువ. ఇతను బిజెపిలోనే ఉండేవాడు. 2017 ఎన్నికలకు ముందు కాంగ్రెసులోకి దూకి ఎమ్మెల్యే అయ్యాడు. హార్దిక్‌ కాంగ్రెసు పార్టీలోకి చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం జరగడంతో యితను మళ్లీ బిజెపిలోకి మారిపోయాడు. ఈసారి ''పాకిస్తాన్‌పై దాడుల తర్వాత మోదీయే మళ్లీ ప్రధాని కావాలని నిశ్చయించుకున్నాను.'' అని కారణం చెప్పాడు.

వీళ్లతో బాటు బిజెపిలోకి ఫిరాయించిన కోలీ కులస్తుడు పురుషోత్తమ్‌ సబరియాకు దేశభక్తి కంటె జైలుభయమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది. ఇతనితో బాటు యింకో కాంగ్రెసు ఎమ్మెల్యే కథ కూడా కలిపి చెప్పాలి. తలాలా నియోజకవర్గానికి చెందిన భాగాభాయ్‌ బరాద్‌ అనే కాంగ్రెసు ఎమ్మెల్యేపై ఓ కేసులో దోషిగా తీర్పు రాగానే స్పీకరు అతన్ని సస్పెండ్‌ చేసేశాడు. పై కోర్టు స్టే యిచ్చినా, సస్పెన్షన్‌ ఎత్తివేయలేదు. ఇప్పుడు యీ పురుషోత్తముడిపై కూడా కేసు కత్తి వేళ్లాడుతోంది. మోర్బీ జిల్లాలో ఒక యిరిగేషన్‌ స్కాములో 2018 అక్టోబరులో జైలుపాలై 2019 ఫిబ్రవరిలో బెయిలు తెచ్చుకుని బయటకు వచ్చాడు. బిజెపి ప్రభుత్వం ఆ జిల్లాలో 334 పనులను రూ.20.31 కోట్ల ఖర్చుతో చేపట్టింది. ఆ సందర్భంగా 46 పనుల్లో రూ.1.12 కోట్ల అవినీతి జరిగిందట. ''రూ.40 లక్షల రూపాయలు నాకివ్వకపోతే అసెంబ్లీలో దాని విషయం లేవనెత్తి యిబ్బంది పెడతా'' అని యితను బెదిరించాడట. దాంతో కేసు పెట్టారు. ఇప్పుడా కేసు చూపించి బరాద్‌లాగ తననూ సస్పెండు చేస్తే.. అనే భయం పట్టుకుంది యితనికి. పార్టీ మారిపోయాడు. ''పార్టీలో చేరమని నన్నెవరూ బలవంత పెట్టలేదు, భయపెట్టలేదు, నియోజకవర్గ అభివృద్ధికై అధికార పార్టీలో చేరానంతే.'' అని చెప్పుకున్నాడు.

ఈ మాటలు మన తెలుగు రాష్ట్రాలలో చాలాసార్లు వినబడ్డాయి కదా. బాధిత పార్టీలు గగ్గోలు పెడుతున్నా, అధికార పార్టీలు కిమ్మనటం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. స్పీకరొక్కడు మనవాడైతే చాలు, ఎంతమందినైనా చేర్చుకోవచ్చు. సభ్యుణ్ని పోగొట్టుకున్న పార్టీ ఫిర్యాదు చేస్తుంది, స్పీకరు దానిపై ఐదేళ్లపాటు నిర్ణయం తీసుకోడు. ఈ లోగా కొత్త సభ ఏర్పడుతుంది. గతంలో యిలాగే ఫిరాయింపులు ఏవగింపు పుట్టిస్తే రాజీవ్‌ గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చాడు. దానికి యిటీవలి కాలంలో తూట్లు పొడుస్తున్నారు. ఓ పక్క విలువల గురించి ఉపన్యాసాలు దంచుతారు, మరో పక్క యిలాటివి చేస్తూంటారు.

మహారాష్ట్రలో రెండు రోజుల క్రితమే ఎన్‌సిపికి చెందిన భారతీ పవార్‌ను, కాంగ్రెసుకు చెందిన ప్రవీణ్‌ ఛేడా (ఇతను ముంబయి కార్పోరేషన్‌లో ప్రతిపక్ష నాయకుడు)ను పార్టీలో చేర్చుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెసు నాయకుడు రాధాకృష్ణ విఖేపాటిల్‌ కుమారుడు సుజయ్‌ను అంతకు ముందే చేర్చుకున్నారు. ఫడణవీస్‌తో ఒప్పందంతోనే రాధాకృష్ణ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడని, తన కొడుకుని బిజెపిలోకి పంపడం దానిలో భాగమనే కాంగ్రెసు కూడా నమ్ముతోంది. అందుకే అతన్ని నిన్న ఢిల్లీలో జరిగిన కాంగ్రెసు-ఎన్‌సిపి పొత్తు సమావేశానికి పిలవలేదు. గత ఎన్‌సిపి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా చేసిన విజయ్‌ మొహితే పాటిల్‌ కొడుకు రంజిత్‌ను కూడా బిజెపి తన పార్టీలోకి తీసుకుంది. గుజరాత్‌ నమూనా దేశమంతా అమలు చేస్తామంటే యిదే మరి!

గుజరాత్‌ కథ యింతటితో ఆగిందని అనుకోవడానికి లేదు. ప్రముఖ బిసి నాయకుడు అల్పేశ్‌ ఠాకూరును కూడా ఆకర్షించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అతను 2017 ఎన్నికల సందర్భంగా కాంగ్రెసులో చేరి ఎన్నికయ్యాడు. ఈ మధ్య ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జితేంద్ర వఘాణీని కలిసి మంతనాలు సాగించాడు. బేరం కుదరలేదో ఏమో 'కాంగ్రెసులోనే కొనసాగుతున్నా' అని ప్రకటించాడు. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రతి పార్లమెంటు స్థానమూ గెలవడమే బిజెపి లక్ష్యం. దాని కోసం ఏ దారైనా రహదారే అనుకుంటోంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2019)
mbsprasad@gmail.com