Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: గుజరాత్‌ - బిజెపికి దొడ్డి సంభావన

గుజరాత్‌ ఎన్నికల దృశ్యం గురించి రాసినప్పుడు నేను వేసిన ప్రశ్న - 'బిజెపికి 116 చదివిస్తారా?' అని. ఇది రాసే టైముకి ఫలితాలు పూర్తిగా రాలేదు. బిజెపి 100 కు చేరలేదు. కాంగ్రెసు ముల్లు 80 దగ్గర కదులుతోంది. గుజరాత్‌లో బిజెపి ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఎన్ని సీట్లు తెచ్చుకుంటుందనే అందరూ చర్చించారు. అమిత్‌ షా 150 టార్గెట్‌ పెట్టారట. విజయ్‌ రూపాణీ నిన్న కూడా 150 వస్తాయన్నాడు. చివరకు ఆయనే అటూయిటూ ఊగి చివరకు 5 వేల మెజారిటీతో గెలిచాడు. ఆయన డిప్యూటీ నితిన్‌ పటేల్‌ ఉల్లిపొర మెజారిటీతో నెగ్గాడు. 150 మనకు చెప్పారు కానీ నిజానికి ఏ 125 యైనా గెలిచి చూపించాలని అనుకుని ఉంటారు. రాహుల్‌ కాంగ్రెసు అధ్యక్షుడయినవేళ కాంగ్రెసు సీట్లను ఏ 50-60 వద్దో ఆపితే అతని నైతిక స్థయిర్యం దెబ్బ తింటుంది. అతని నాయకత్వం పట్ల కార్యకర్తలకు, అనుచరులకు విశ్వాసం చెదురుతుంది. అనే లక్ష్యంతో గోదాలోకి దిగారు కానీ దిగాక క్షేత్రపరిస్థితి బాగా లేదని అర్థమై ఉంటుంది. అందుకే ఎన్నికల ప్రకటన ఆలస్యం చేయించి, అనేక పథకాలు ప్రకటించారు. జిఎస్‌టిలో సవరణలు చేశారు.

మోదీ కాలికి బలపం కట్టుకుని 34 ర్యాలీలు నిర్వహించారు. ప్రచారసమయంలో పదవీ ఔచిత్యం మరచి, విపరీతమైన ఆరోపణలు చేసి, గుజరాతీల్లో ఆత్మగౌరవం అంటూ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారు. తెలుగుదేశం వంటి ప్రాంతీయపార్టీ తెలుగుతనం గురించి మాట్లాడితే అర్థముంది. తెరాస వంటి ప్రాంతీయపార్టీ తెలంగాణత గురించి మాట్లాడితే అర్థముంది. బిజెపి వంటి జాతీయపార్టీ గుజరాత్‌ ఆత్మగౌరవం గురించి మాట్లాడడం వింత గొలిపింది. ఇంత చేశాం కాబట్టి, కనీసం 120 యైనా వస్తాయని అనుకోవడంలో తప్పు లేదు. అధమపక్షం గతసారి వచ్చినన్నయినా రావాలి. 2012లో బిజెపికి, 2017లో బిజెపికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు దేశమంతా బిజెపి హవా నడుస్తోంది.

కొత్త రాష్ట్రాలలో పాగా వేస్తోంది. యుపి శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ కలలో కూడా ఊహించలేనంత విజయాన్ని కైవసం చేసుకుంది. అలాటప్పుడు ప్రధాని, పార్టీ అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గతంలో వచ్చిన సీట్లయినా రాకపోతే ఎలా? కానీ రాలేదు. గతంలో కంటె 14% తక్కువ వచ్చాయి. 22 యేళ్ల పాలన తర్వాత కూడా బిజెపి ఆరోసారి గెలిచింది. అది గొప్పే కానీ బిజెపికి చదివింపులు చాలలేదు. శుభకార్యాలలో పురోహితుల్లో ముఖ్యమైన వాళ్లకు భారీగానే సంభావన యిచ్చినా, ఓ మాదిరి పురోహితులను దొడ్లో నిలబెట్టి నామమాత్రంగా దక్షిణ యిచ్చి పంపించివేస్తారు. అది పుచ్చుకున్న పురోహితుడు తృప్తి పడకపోయినా కిమ్మనకుండా వెళతాడు. గుజరాత్‌ ఓటరు అలాగే బిజెపికి 99, కాంగ్రెసుకు 80 యిచ్చి సరిపెట్టాడు. బిజెపి కంటె తక్కువే ముట్టినా కాంగ్రెసు బెంచ్‌మార్కు చాలా తక్కువగా ఉంది కాబట్టి లోల్లోపల సంతోషించి వుంటుంది.

ఎప్పుడో 1985లో కాంగ్రెసుకు 149 వచ్చాయి. అప్పణ్నుంచి దిగజారుతూనే వచ్చింది. దాని తర్వాతి ఎన్నికలలో దానికి వచ్చినవి 33,45,43,21,59, 61 మాత్రమే. రాజీవ్‌, పివి నరసింహారావు, సీతారం కేసరి, సోనియా గాంధీ వంటి ఉద్దండులు కాంగ్రెసు అధ్యక్షులుగా ఉండగా వచ్చిన ఫలితాలవి. అలాటిది యిప్పుడు ఏకంగా 80 వచ్చాయి. మోదీ అంత బలమైన ప్రధాని ఉండగా, అతని ప్రభ దేశమంతా వెలిగిపోతూండగా అతని సొంత రాష్ట్రంలో 19 సీట్లు పెంచుకోవడం, అంటే 31% సీట్లు పెంచుకోవడం మామూలు విషయం కాదు. 2014 పార్లమెంటు ఎన్నికలను పక్కక పెట్టినా, గత ఎన్నికలలో కాంగ్రెసుకు బిజెపి కంటె 10% తక్కువ ఓట్లు వచ్చాయి. దాన్ని 6%కి తగ్గించగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కాంగ్రెసుకు 2% మాత్రమే వెనకబడింది. 70% నియోజకవర్గాల్లో (సరిగ్గా చెప్పాలంటే 127 నియోజకవర్గాలు) అదీ పరిస్థితి. 30% ఉన్న నగర నియోజకవర్గాల్లో 19% వెనుకబడింది. అందువలన 6% తేడా వచ్చింది.

ఇదంతా రాహుల్‌ అధ్యక్షుడు అయిన తరుణంలో వచ్చింది. రాహుల్‌ యిప్పటిదాకా పప్పుముద్దగానే కనబడుతున్నాడు. రాజకీయాల్లో ఆసక్తి లేదు. తల్లి బలవంత పెడితే చెప్పాపెట్టకుండా మాయమై పోతూ ఉంటాడు. రాష్ట్రనాయకుల్లో భేదభావాలు వచ్చి రాజీ కోసం అతని వద్దకు వెళితే అతను ఎపాయింట్‌మెంటు యివ్వడు. కొంతమందిని పక్కన పెట్టుకుని వాళ్లు చెప్పిన మాటలే వింటాడు. తెలుగు రాష్ట్రాన్ని చీల్చి రెండు చోట్లా తిరుక్షవరం చేయించుకున్న ప్రబుద్ధుడు. ఆ తల్లీ కొడుకులకు బుద్ధి వచ్చిందో లేదో తెలియదు కానీ వాళ్ల నిర్వాకం వలన తెలుగువాళ్లం విడిపోయాం. ఇక్కడ కాంగ్రెసు సమాధి అయిపోయింది. రాహుల్‌ ఎప్పుడు నోరు విప్పినా ఏదో ఒక అవాచ్యం పలకక మానడు. అతను ఎక్కడకి వెళ్లి ప్రచారం చేస్తే అక్కడ బిజెపి గెలుస్తోంది. మామూలుగా అయితే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యే అర్హత లేదు కానీ గాంధీ-నెహ్రూ కుటుంబంలో పుట్టాడు కాబట్టి నెత్తిన కిరీటం అమర్చబోయారు. వద్దు బాబోయ్‌ అంటూ తప్పించుకుని తిరిగినంతకాలం తిరిగాడు కానీ చివరకు తల్లి బలవంతాన పెట్టేసింది. దేశమంతా కాంగ్రెసుకు కొద్దోగొప్పో ఓటు బ్యాంకుంది. తరతరాల స్థానిక నాయకత్వం ఉంది.

అధిష్టానం ఏమీ చేయకపోయినా స్థానిక నాయకుల ప్రయత్నాల వలన చాలా చోట్ల 25-30% దాకా ఓట్లు వచ్చేస్తూనే ఉంటాయి. దాన్ని నిలుపుకోవడం రాహుల్‌కి రాదు. పార్టీ నిర్మాణం చేయలేదు, ఎన్నికలు జరపలేదు. సరైన స్ట్రాటజీ లేదు. ప్రతిపక్షంగా ఉన్నచోట ప్రజా ఉద్యమాలు చేపట్టలేదు. అటు చూస్తే బిజెపికి పార్టీ నిర్మాణం, పద్ధతి ప్రకారం చేసే కార్యశైలి, బూతుస్థాయి వరకు పనిచేసే కార్యకర్తలు, అంగబలం, అర్థబలం అన్నీ ఉన్నాయి. వాళ్లు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ చేసి చూపిస్తామని కంకణం కట్టుకుని ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటరు అట్టు తిరగేసి, అవినీతికరమైన కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడించి, బిజెపికి మూడింట రెండు వంతుల సీట్లు కట్టబెట్టడం ఖాయం. ఇలాటి సమయంలో వారిని ఎదుర్కోవడానికి రాహుల్‌ తప్ప మన కెవరూ దొరకలేదా? అని సగటు కాంగ్రెసు కార్యకర్త బెంగ పెట్టుకున్నాడు.

ఇప్పుడు గుజరాత్‌ ఫలితాలు అతనికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించి ఉంటాయి. గుజరాత్‌లో కాంగ్రెసు 22 ఏళ్లగా ప్రతిపక్షంలో ఉంది. స్థానిక నాయకుడంటూ లేడు. ఉన్నవాళ్లలో గట్టివాళ్లు గోడ దూకేశారు.  డబ్బు లేదు, కార్యకర్తలు లేరు. బిజెపిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, ఉద్యమల రూపేణా దాన్ని ఎన్‌క్యాష్‌ చేసుకునే ప్రయత్నం గత నాలుగన్నరేళ్లగా కాంగ్రెసు చేయలేదు. మోదీతో తలపడడం కష్టం అనుకుని ఊరుకుని వుంటే అతను దిల్లీ వెళ్లాక, గత మూడేళ్లన్నరగా ఐనా చురుగ్గా ఉండాల్సింది. లేరు. ఏమీ లేకుండా గత మూణ్నెళ్లగా మాత్రమే రాహుల్‌ గుళ్లూగోపురాలూ తిరిగేస్తే సరిపోతుందా అని సందేహిస్తూ ఉన్న సమయంలో కాంగ్రెసు చచ్చిపోలేదు, రాహుల్‌ మొత్తానికి యింతవరకు సాధించాడు అనే తృప్తి మిగిలింది వాళ్లకు. రాహుల్‌ తనను తాను సీరియస్‌గా తీసుకుని, తక్కిన ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్లగలిగితే మోదీ జగన్నాథ రథాన్ని కాస్త నిలవరించగలడు అనే ఆశాభావం వారిలో కలిగింది.

నిజానికి గుజరాత్‌ ఓటరు తన తీర్పు ద్వారా స్పష్టంగా చెప్పాడు - మేము బిజెపితో తృప్తిగా లేము. కానీ ప్రత్యామ్నాయం సరిగ్గా లేకపోవడం చేత బిజెపినే గెలిపిస్తున్నాము అని. ఇప్పటికైనా మీరు మా పక్షాన పోరాడితే మేము మీ పట్ల కరుణ చూపిస్తాము అని హామీ యిచ్చారు. ఇంకో పదేళ్ల దాకా మోదీకి ఎదురు లేదు అని ప్రతిపక్షాలు అస్త్రసన్యాసం చేయనక్కరలేదు. ప్రచారం ఎక్కువ, ఫలితాలు తక్కువ అనే విషయం మేధావులకి అర్థం కాకపోయినా సామాన్యుడికి బాగా అర్థమైంది. ధనికులు, మధ్యతరగతి వారూ బిజెపికి అండగా నిలిచారు. అది వారి పార్టీగానే ఎదుగుతోంది. పేదలు, గ్రామీణులు, రైతులు దానికి వ్యతిరేకమయ్యారు. దేశంలో వారి సంఖ్యే ఎక్కువ. సోషల్‌ మీడియాలో మోదీ అభిమానుల సందడికి భయపడి, నిరాశపడి, చేష్టలుడిగి కూర్చున్న ప్రతిపక్షాలు ధైర్యం తెచ్చుకుని పేదల పక్షాన నిలబడితే వారికి భవిష్యత్తు ఉంది. ఇదీ వారు గ్రహించవలసిన సందేశం.

అలాగే మోదీ, అతని సమర్థకులు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే - అహంకారం పనికి రాదు. ప్రజల గోడు వినాలి. చేసిన పనులు సమీక్షించుకోవాలి. బిజెపిలో గతంలో సమిష్టినాయకత్వం ఉండేది. పార్టీలో చర్చలు జరిపి, మెజారిటీ అభిప్రాయం ప్రకారం వెళ్లేవారు. ఇప్పుడు సకలం మోదీ చేతిలో పెట్టడం వలన బిజెపి దెబ్బ తింటోంది. సంకీర్ణ ప్రభుత్వంలోని యితర పక్షాలను కూడా సంప్రదించాలి. కాంగ్రెసును మించిన కుటిల రాజకీయం చేస్తూన్నామనుకుంటూ దిగజారుతూ పోతే, ప్రజలకు తేడా తెలియకుండా పోతుంది. తిరస్కరణ ప్రారంభమవుతుంది. ఆర్థిక విధానాల్లో విఫలమైతే ఎంత లావు జాతీయవాదం, హిందూత్వవాదం అక్కరకు రావు. మీడియాను చేతిలో పెట్టుకుని ఎంత ప్రచారం చేయించుకున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు వెక్కిరిస్తాయి. గుజరాత్‌లో కాంగ్రెసు ఏ మాత్రం బలంగా ఉన్నా, కాంగ్రెసు తరఫున రాహుల్‌ కాక మరెవరూ ఉన్నా బిజెపికి నిజంగా మూడేదే. అది కాస్తలో తప్పింది. ఓటింగు సరళిని విశ్లేషించినప్పుడు చిత్రం మరింత స్పష్టంగా తెలుస్తుంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com