Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: హాలీవుడ్‌ను కుదుపుతున్న సెక్స్‌ ఆరోపణలు

ప్రపంచంలో ఎక్కడైనా సరే, సినీనిర్మాతలు వేషాల కోసం అడిగే తారలను, తమ సినిమాల్లో నటించే చిన్నా, పెద్దా హీరోయిన్లను సెక్స్‌పరంగా వేధిస్తారనేది ఒక సాధారణ సత్యంగా అందరూ అంగీకరించే రోజుల్లో హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టయిన్‌పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై హాలీవుడ్‌ స్పందిస్తున్న తీరు అసాధారణంగా ఉంది. ''ద న్యూయార్క్‌ టైమ్స్‌'' తన అక్టోబరు 5 సంచికలో హార్వే గత మూడు దశాబ్దాల్ల్లో 12 మంది కంటె ఎక్కువమంది అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేశాడని, కొందర్నీ బలాత్కరించాడని, వారిలో అతని సినిమాల్లో పనిచేసిన తారలు, మోడల్స్‌, యిద్దరు అసిస్టెంట్లు కూడా ఉన్నారని, బలమైన ఆరోపణలు చేసిన ఎనిమిది మందికి డబ్బిచ్చి రాజీ చేసుకున్నాడని కథనం వెలువరించింది.

తను నగ్నంగా స్నానం చేస్తూ వుంటే చూడమనీ, తన నగ్నశరీరానికి మర్దనా చేయాలంటూ ఒత్తిడి చేశాడని రోజ్‌ మెక్‌గోవన్‌, ఏష్లీ జూడ్‌ అనే నటీమణులిచ్చిన స్టేటుమెంట్లను ఉటంకించింది. కథనం వెలువడగానే హార్వే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. 65 ఏళ్ల హార్వే తక్కువవాడు కాదు. ఫిల్మ్‌ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. తమ్ముడు బాబ్‌ వెయిన్‌స్టయిన్‌తో కలిసి మిరామాక్స్‌ సంస్థ ఏర్పరచి అనేక విజయవంతమైన సినిమాలు తీశాడు. 2005లో వెయిన్‌స్టయిన్‌ కంపెనీ పెట్టాడు. కంపెనీలో 22% వాటాతో బోర్డులో డైరక్టరుగా వున్నాడు. ఆస్కార్‌ విజేతలు బహుమతి పొందాక తమ విజయానికి కారకులైన వారికి ధన్యవాదాలు తెలపడం రివాజు. ఇప్పటిదాకా 34 మంది అతనికి కృతజ్ఞతలు చెప్పారు. 43 మంది చెప్పిన స్పీల్‌బర్గ్‌  తర్వాత ద్వితీయస్థానం యితనిదే.

న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెలుగులోకి రాగానే అందరూ నోరు విప్పసాగారు. 20 ఏళ్ల క్రితం నన్ను యిలా చేశాడని ఒకరంటె 15 ఏళ్ల క్రితం యిలా చేశాడని యింకోరు చెప్పసాగారు. దాంతో హార్వేకి దడ పుట్టి ఒక క్షమాపణ పత్రాన్ని విడుదల చేశాడు - 'నా సహచరులతో నేను ప్రవర్తించిన విధానం వలన వాళ్లకు చాలా బాధ కలిగించానని గ్రహించాను. నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. నా కంపెనీ నుంచి కొన్నాళ్లు విరామం తీసుకుని, మానసిక చికిత్స చేయించుకుంటాను.' అని. అతని కంపెనీ అతన్ని బోర్డు నుంచి వెంటనే తొలగించింది. నాలుగు రోజులు పోయేసరికి అమెరికన్‌ నటీమణులే కాదు, బ్రిటిష్‌ తారలు కూడా గొంతు కలిపారు.

అక్టోబరు 10 వచ్చేసరికి న్యూయార్కర్‌ మాగజైన్‌ మరో 13 మంది ఆరోపణలు ప్రచురించింది. వారిలో ముగ్గురివి రేప్‌ ఆరోపణలు. హార్వే స్పందించక తప్పలేదు - 'నేను బలవంతంగా ఎవరితో శృంగారం చేయలేదు' అని. 1987లో తన 35వ యేట అతను తన అసిస్టెంటు ఈవ్‌ చిల్టన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక 2004లో విడిపోయారు. 2007లో ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి అయిన జార్జియానా చాప్‌మన్‌ను పెళ్లాడాడు. వాళ్లకో కూతురు, (పేరు ఇండియా పెర్ల్‌) కొడుకు. న్యూయార్కర్‌ కథనం తర్వాత జార్జియానా భర్తను విడిచి, పిల్లలను తీసుకుని యింట్లోంచి వెళ్లిపోయింది.

హార్వే లండన్‌లో 1992, 2010, 2011, 2015ల్లో తమను బలాత్కారం చేశాడని ముగ్గురు స్త్రీలు చేసిన ఆరోపణలపై యుకె పోలీసు విచారణ ప్రారంభించింది. ఇటు లాస్‌ ఏంజిలిస్‌, న్యూయార్క్‌ పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. ఇంకా కేసులు పెట్టలేదు. హార్వే కంపెనీలో స్క్రిప్టు రైటర్‌గా పనిచేసిన స్కాట్‌ రోజెన్‌బర్గ్‌ హార్వే వెకిలిగా ప్రవర్తిస్తాడని విన్నాను తప్ప బలాత్కారాలు చేశాడని వినలేదన్నాడు. అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసిన మైకేల్‌ మాత్రం వేషాల కోసం హార్వే ఆఫీసుకిి వచ్చిన అనేక మంది తారలను తనే కారులో వాళ్ల యిళ్లకు దింపేవాణ్నని, వారిలో చాలామంది కన్నీరు కార్చేవారనీ, తను ఓదార్చేవాడిననీ చెప్పాడు. 

హార్వే వద్ద గతంలో పనిచేసినవారు కూడా అతనిపై యిప్పుడు గళమెత్తారు. జెల్డా పెర్కిన్స్‌ అనే అసిస్టెంటు తనను లైంగిక వేధింపులకు గురి చేసి తన నోరు మూయించడానికి 1,65,200 డాలర్లు యిచ్చాడని చెప్పింది. మిమి హాలేయీ అనే ప్రొడక్షన్‌ వర్కరుగా పనిచేసినామె 2006లో తనపై బలవంతంగా ముఖరతి చేశాడని ఆరోపించింది. వెయిన్‌స్టయిన్‌ కంపెనీ ఉద్యోగుల్లో కొందరు తాము పడిన యిబ్బందులను బహిరంగపరచడానికి వీలుగా తమను ఎన్‌డిఏ (నాన్‌ డిస్‌క్లోజర్‌ ఎగ్రిమెంట్‌- కంపెనీ రహస్యాలు బయటపెట్టకూడదనే ఒప్పందం) నుంచి మినహాయింపు యిమ్మనమని కంపెనీని కోరారు.

డొమెనిక్‌ హ్యూట్‌ అనే నటీమణి గతంలో హార్వే తనపై ముఖరతి చేశాడని, ఆ నిర్లక్ష్యానికి తనకు పరిహారం చెల్లించాలని  ఏకంగా కంపెనీపై దావా వేసింది. ఈ వరసంతా చూసి హాలీవుడ్‌ హీరోలతో సహా చాలామంది హార్వేను విమర్శించడం మొదలుపెట్టారు. వెయిన్‌స్టయిన్‌ కంపెనీతో వ్యాపారబంధాలు ఉన్న అమెజాన్‌ స్టూడియో వంటి సంస్థలు, వ్యక్తులు తమ తమ కాంట్రాక్టులను రద్దు చేసుకోసాగారు. ఆస్కార్‌ బహుమతులు యిచ్చే ఎకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్‌స్‌ అండ్‌ సైన్స్‌ హార్వేని బహిష్కరించింది. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తుది నిర్ణయాన్ని నవంబరు 6 వరకు వాయిదా వేసింది. బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హార్వేకు 2002లో యిచ్చిన ఫెలోషిప్‌ను రద్దు చేసింది. హార్వార్డ్‌ యూనివర్శిటీ వారి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కల్చర్‌ విభాగానికి భూరి విరాళాలు యివ్వడంతో హార్వేకు ఆ యూనివర్శిటీ 2014లో డ్యూ బాయిస్‌ మెడల్‌ యిచ్చింది. ఇప్పుడది వెనక్కి తీసేసుకుంది.

హార్వేపై వస్తున్న నిరసన చూశాక యితర నిర్మాతల వేధింపులకు గురైనవారికి ధైర్యం వచ్చింది. హార్వే తమ్ముడు బాబ్‌ తనను మాటిమాటికీ ప్రయివేటు డిన్నర్‌లకు రమ్మనమని ఆహ్వానించేవాడని టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ అమందా సెగెల్‌ ఆరోపించింది. హార్వేకు మిత్రుడు, అమెజాన్‌ స్టూడియో చీఫ్‌ ఆయిన రాయ్‌ ప్రైస్‌పై కూడా ఒక మహిళా నిర్మాత యిలాటి ఆరోపణలు చేసింది. దాంతో అతను రాజీనామా చేయవలసి వచ్చింది. హార్వేపై వచ్చిన ఆరోపణలపై జోకులు వేసినా, 'అతనితో పాటు ఆ అమ్మాయిలదీ తప్పు ఉండవచ్చు, వాళ్లెందుకు యిన్నాళ్లూ మౌనంగా వున్నారు' వంటి వ్యాఖ్యలు చేసినా వారిపై కూడా ప్రజలు విరుచుకు పడుతున్నారు.

మహిళలను వేధించడం సినీరంగానికి పరిమితం కాలేదని, యితర కార్యాలయాల్లో కూడా నడుస్తోందని బాధితవనితలు అంటున్నారు. 'మీటూ' అనే హ్యాష్‌ట్యాగ్‌ కింద తమకు ఎదురైన చేదు అనుభవాలను యితరులకు చెప్తున్నారు. క్రమేపీ యిది ఒక ఉద్యమంలా రూపు దిద్దుకుంటోంది. దీని ప్రభావం యితర దేశాలపై కూడా పడుతుందేమో వేచి చూడాలి. (ఫోటో - ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్న మెరీల్‌ స్ట్రీప్‌తో హార్వే) వెయిన్‌స్టయిన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com