Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కశ్మీరుకై భారత్‌ చెల్లించిన భారీ మూల్యం

ఎమ్బీయస్‌: కశ్మీరుకై భారత్‌ చెల్లించిన భారీ మూల్యం

బ్రిటిషు వ్యాపారస్తులు వాటా కలిగి వున్న ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఇది ఒక దేశం కాదు, ఒక రాజు లేడు. వివిధ రాజులు, నవాబులు వివిధ ప్రాంతాలను పాలిస్తున్నారు. ఈస్టిండియా కంపెనీ తమ సామాన్లు రక్షించుకోవడానికి సైన్యం సమకూర్చుకుంటున్నామంటూ మొదలుపెట్టి వివిధ రాజ్యాల రాజకీయ వ్యవహారాల్లో కలగజేసుకుంటూ క్రమేపీ రాజ్యాలు గెలుస్తూ పోయింది.

1757 లో బెంగాల్‌ నవాబును ప్లాసీ యుద్ధంలో ఓడించడంతో చరిత్ర మలుపు తిరిగింది. తక్కిన రాజ్యాలను జయిస్తూ పోతూ వందేళ్లు గడిచేసరికి, 1857లో కంపెనీ పాలనపై సిపాయిలు తిరుగుబాటు చేశారు. దానితో బ్రిటిషు రాణి విక్టోరియా కంపెనీ అక్రమాలపై చూపు సారించి, వాళ్లను వెనక్కి రప్పించి, ఇండియా పాలనను తన ఛత్రం కిందకు తీసుకుంది. అప్పణ్నుంచి బ్రిటిషుకు వలసరాజ్యమైంది ఇండియా. అదైనా పూర్తిగా కాదు, వివిధ సంస్థానాధీశులు వారి వారి ప్రాంతాల్లో పరిమిత అధికారాలతో పాలిస్తూనే ఉన్నారు. 

ఇలా ఇండియాను కలపడానికి బ్రిటిషు వాళ్లు వందేళ్లకు పైబడి తీసుకుంటే వాళ్లు వెళ్లాక మనవాళ్లు రెండున్నరేళ్లలోనే అందర్నీ లుపుకుని వచ్చి ఇండియన్‌ రిపబ్లిక్‌ ఏర్పరచారు. అంత త్వరగా చేయడంలో కొన్ని పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది. పైగా విభజన తర్వాత తలెత్తిన మతకలహాల కారణంగా దేశం అతలాకుతలమైన సమయమది.

ఈనాడు మనం తీరిగ్గా కూర్చుని అలా చేసుండాల్సింది, యిలా చేసుండాల్సింది అని తీర్మానించడం సులభమే. కశ్మీరు విషయంలో నెహ్రూ చేసినది తప్పు అని అందరం అంటున్నాం, ఆయనా అదే అనుకుని దాన్ని సరిదిద్దబోయి కోతిపుండు బ్రహ్మరాక్షసి చేసుకున్నాడు. దాంతో తర్వాతి ప్రధానులు దాని జోలికి వెళ్లలేదు. 

ఇంతకీ నెహ్రూ పటేల్‌ వారిస్తున్నా కశ్మీర్‌ విషయంలో విలీనం చేద్దామని ఎందునుకున్నాడు?

తనకు కశ్మీరీ మూలాలున్నాయి కాబట్టి, తన పూర్వీకుల స్థలం ఇండియాలో ఉండాలనే కోరికతో.. అని నా చిన్నపుడు అనగా విన్నాను. తర్వాత నెహ్రూ గురించి చదివిన కొద్దీ తెలిసింది. అతనికి అలాటి సెంటిమెంట్సు ఏవీ ఉన్నట్లు తోచదు. ఉంటే గింటే ఇలహాబాదులో తను పెరిగిన ఆనంద భవన్‌ మీద ఉండాలి తప్ప! తనకు హిందీ అంటే యిష్టం ఉంది, మంచి పట్టు ఉంది తప్ప కశ్మీరీ భాష వచ్చని కూడా ఎక్కడా చదవలేదు. ఆ భాషలో ఉపన్యాసాలు యిచ్చిన దాఖలాలు లేవు. మరెందుకు అంటే బహుశా కశ్మీరుని విడిగా వదిలేస్తే ప్రమాదం అని యివాళ మనలో అత్యధికులు అనుకుంటున్నట్లే ఆయనా అనుకున్నాడు లాగుంది. అందుకే కాబోలు కశ్మీరు పాలకుల షరతులకు తలవొగ్గాడు. 

ఇక్కడ పాలకులంటే యిద్దరు వస్తారు. ఒకరు రాజైన హరి సింగ్‌, రెండో వారు ప్రజాదరణ పొందిన తిరుగుబాటు నాయకుడు షేక్‌ అబ్దుల్లా. హరి సింగ్‌ కుమారుడు కరణ్‌ సింగ్‌ కాంగ్రెసులో చేరి పెద్ద పదవులు అనుభవించాడు. సొంత లాభం, క్షేమం చూసుకుని తమను గాలికి వదిలేశాడని ప్రజలు తనను అనుకోకుండా ఉండాలని హరి సింగ్‌ 1947 అక్టోబరులో షరతులతో కూడిన విలీనానికి ఒప్పుకున్నాడు. తర్వాత జమ్మూకి వెళ్లిపోయి, అక్కణ్నుంచి బొంబాయికి వెళ్లి అక్కడ స్థిరపడి అక్కడే 1961లో మరణించాడు. కరణ్‌ సింగ్‌ 1949లో రీజెంట్‌గా అయ్యాడు. 1952లో కశ్మీరు గవర్నరు (అప్పటి పేరు దేశాధ్యక్షుడు సదర్‌-ఎ-రియాసత్‌) అయ్యాడు. తర్వాతి రోజుల్లో కేంద్రమంత్రిగా, విదేశాల్లో రాయబారిగా కూడా పని చేశారు. 

హరి సింగ్‌ ఒప్పందంపై సంతకం పెట్టేనాటికి రాజ్యాంగం ఏర్పడలేదు. రాజ్యాంగరచన సాగుతూండగా 1949 మే నుండి అక్టోబరు వరకు కశ్మీర్‌ తరఫున ముఖ్యమంత్రి (అప్పటి పేరు ప్రధానమంత్రి) అయ్యాడు. షేక్‌ అబ్దుల్లా కేంద్రంతో చచ్చే బేరాలాడి  ఆర్టికల్‌ 370 సాధించుకున్నాడు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్‌లలో తప్ప కేంద్రం రాష్ట్ర వ్యవహారాలు దేనిలోనూ కలగజేసుకోకూడదనే షరతులపైనే విలీనం జరిగిందని గట్టిగా వాదించాడు. కానీ కొన్ని వాటిల్లోనే అతని మాట నెగ్గింది.

షేక్‌ అబ్దుల్లా మాట యింతలా ఎందుకు వినాల్సి వచ్చింది అనే ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. అతను తన (అక్రమ) సవతి సోదరుడు కాబట్టి అని కొందరు జవాబిస్తారు. (అలా అయితే 1953 నుంచి 11 ఏళ్ల పాటు నిర్బంధంలో ఎందుకు పెట్టాడు? అని అడిగితే జవాబివ్వరు) అలాటివి పట్టించుకోనక్కరలేదు. మనకు నచ్చని వాడికి రంకులు కడతాం, లేదా వాడి తల్లిని రంకులాడి చేస్తాం. ఇటీవలి కాలంలో జిన్నా కూడా మోతీలాల్‌ అక్రమ సంతానమే అని కొందరనసాగారు.

ఇవి పక్కన పడేసి రాజకీయ పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే చాలు. కశ్మీరుని భారత్‌లో అంతర్భాగంగా అనుకోకపోవడం చేతనే కాబోలు ఆనాటి మెయిన్‌స్ట్రీమ్‌ రాజకీయ పార్టీలేవీ అక్కడ వ్యాపించలేదు. కాంగ్రెసు, కమ్యూనిస్టు, సోషలిస్టు.. యిలా ఏ పార్టీకి అక్కడ యూనిట్స్‌ లేవు. తెలంగాణలో అయితే ఉన్నాయి. అందుకే నిజాంను తీసేయగానే వీటికి ప్రాముఖ్యత వచ్చి రాజకీయశూన్యతను భర్తీ చేశాయి.

కశ్మీరులో హరి సింగ్‌ పాలన అధ్వాన్నంగానే సాగింది. వివరాలు కావాలంటే దివాన్‌ జర్మనీ దాస్‌ రాసిన ''మహారాజా'' పుస్తకం చదవవచ్చు. అయితే దాన్ని ఎదిరించి ప్రజలను కాపాడే బాధ్యత భారత రాజకీయ పార్టీలేవీ తీసుకోలేదు. వాళ్లు నేపాల్‌ జోలికి ఎలా పోలేదో, కశ్మీరు జోలికీ అలాగే పోలేదు. రాజు పాలనను ఎదిరించి, ప్రజల్లో పలుకుబడి పెంచుకున్న నాయకుడు షేక్‌ అబ్దుల్లా ఒకడే. అతని మాటే శాసనం. పాకిస్తాన్‌లో చేరాలో, ఇండియాలో చేరాలో నిర్ణయించే శక్తి అతనే. పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ రాజ్యంగా ప్రకటించబోతున్నారని తెలియగానే స్వభావత: సెక్యులర్‌ అయిన షేక్‌ ఇండియా వైపు మొగ్గు చూపాడు. (తర్వాత రాజకీయంగా బలహీనపడగానే ఇస్లాం పాట ఎత్తుకున్నాడు) అదే మహద్భాగ్యం అనుకుంది ఇండియా. అతనికి అడిగినవన్నీ యిచ్చి, అతని ద్వారా కశ్మీరును పాలిద్దామనుకుంది.

తమది కాని చిన్న ప్రాంతాన్ని/దేశాన్ని పాలించబోయినపుడు పెద్ద దేశాలన్నీ ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తాయి. తాము డైరక్టుగా అక్కడకు వెళ్లకుండా స్థానికులలోనే ఒకణ్ని ఎంపిక చేసి, అతన్ని కీలుబొమ్మగా పెట్టుకుని పాలించబోతాయి. కశ్మీరు విషయంలో ఇండియా చేయబోయినది అదే. షేక్‌ అబ్దుల్లా అనే కీలుబొమ్మ ద్వారా కశ్మీరుని పాలించబోయింది. కానీ షేక్‌ కీలుబొమ్మ కాదు. మహా రాజకీయ చతురుడు. మీకు మద్దతు యిస్తున్నానని చెపుతూ, దానికి ప్రతిఫలంగా ఇండియాను దోచేశాడు. కశ్మీరులో తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు.  

తెలంగాణలో ఐతే నిజాంను గద్దె దింపేసే నాటికి రాష్ట్రంలో కాంగ్రెసు కంటె కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అందువలన వెల్లోడి నేతృత్వాన సైనిక ప్రభుత్వం నడిపి, 'పోలీసు యాక్షన్‌' జరిపించి, కమ్యూనిస్టులను వేటాడి చంపేసి, ఆ పార్టీని అణగదొక్కి, కాంగ్రెసు బలం పెంచి, బూర్గుల వారు ముఖ్యమంత్రిగా కాంగ్రెసు ప్రభుత్వాన్ని తేగలిగారు. కశ్మీరులో అలా చేద్దామంటే అక్కడ కాంగ్రెసు పార్టీయే లేదాయె. కాంగ్రెసు అక్కడ మొట్టమొదటిసారి ఎన్నికలలో పాల్గొన్నది 1967లోనే! అంటే దేశవిభజన జరిగిన 20 ఏళ్ల తర్వాత అన్నమాట! అది కూడా 1965లో నేషనల్‌ కాన్ఫరెన్సు (ఎన్‌సి) లో చాలాభాగం మంది కాంగ్రెసు పార్టీగా మారుతున్నామని ప్రకటించాక! దానికి అంగీకరించని కొందరు విడిగా వెళ్లి ఆ పార్టీ పేరు కొనసాగించారు.

1967 వరకు అక్కడ కాలూనేందుకు కాంగ్రెసుకు చోటే లేదు. తర్వాత కూడా మాజీ ఎన్‌సి సభ్యులే కాంగ్రెసు బ్యాడ్జి తగిలించుకుని కూర్చున్నారు. తమ మాట చెల్లదు, అయినా కశ్మీరు తమ అధీనంలో ఉండాలి. అందుకని ఏం చేశారు? ఎన్‌సికి పగ్గాలు యిచ్చేసి, వాళ్లు చెప్పినట్లా ఆడారు. షేక్‌ అబ్దుల్లా, అతని కుటుంబసభ్యులు, అనుచరుల పాలన అతి ఘోరంగా సాగింది.  కశ్మీరు వాళ్లం మీతోనే ఉంటాం అని కేంద్రాన్ని బెల్లించి, నిధులు పట్టుకుని పోయి, తాము తినేశారు. ప్రజల్ని అతి దీనపరిస్థితుల్లో ఉంచారు. అభివృద్ధి అనేదే శూన్యం. తమను ప్రతిఘటించినవారికి నిప్పూ, నీళ్లూ పుట్టకుండా చేశారు.

1962లో తొలిసారి భారత ఎన్నికల కమిషన్‌ అక్కడ ఎన్నికలు నిర్వహించింది. అప్పటివరకు రాష్ట్రప్రభుత్వ విభాగమే నిర్వహించింది. అదెంత లక్షణంగా సాగిందో ఉదాహరణగా 1957 నాటి ఎన్నికల విషయం చెప్తాను. మొత్తం 75 అసెంబ్లీ సీట్లలో 43 కశ్మీరు లోయకి, 30 జమ్మూకి, 2 లదాఖ్‌కు కేటాయించారు. లోయలో 30 సీట్లలో పోటీయే లేకుండా ఎన్‌సి వాళ్లు చేసుకున్నారు. తక్కిన 13 టిలో 5 సీట్లలో వీళ్ల అభ్యర్థి తప్ప తక్కిన వారందరి నామినేషన్లు సిల్లీ రీజన్స్‌తో తిరస్కరించారు. మిగిలిన 8 సీట్లలో 7 గెలిచారు. ఈ విధంగా ఎన్నికలకు ముందే వాళ్లకు అధికారం వచ్చేట్లు చేసుకున్నారు. ఇక మన ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన 1962 ఎన్నికలకు వస్తే 43 సీట్లలో 32టిలో ఏకగ్రీవంగా నెగ్గేశారు. తక్కిన 11టిలో 9 నెగ్గేశారు. 

ఏమిటి దీనర్థం? తమకు ఎవరైనా ఎదురు నిలిచేందుకు సాహసించకుండా చేసుకున్నారు. ఎన్నికలను ధారాళంగా రిగ్‌ చేశారు. కశ్మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు అనే పదేపదే నిరూపించారు. తర్వాతి రోజుల్లో కూడా షేక్‌ అనుచరుల మధ్య, కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వచ్చి వారిలో వారు పోటీ పడ్డారు కానీ రిగ్గింగ్‌లో అందరి కందరే. సాధారణ కశ్మీరు ప్రజకు ప్రజాస్వామ్యపు హక్కులు అందకుండా పోయాయి. దీనికి అతను ఎవర్ని బాధ్యుణ్ని చేస్తాడు? ఇండియాను! కేంద్రంలో ఏ పార్టీ ఉందనేది అతనికి పట్టదు. ఇండియా తన కీలుబొమ్మల ద్వారా మనల్ని అణచి వేస్తోంది అనే అతని భావన. 

ఉదాహరణకి 1955 నుండి 1975 వరకు అమెరికా వియత్నాంతో యుద్ధం చేసింది. ఆ సమయమంతా వియత్నామీయులు అమెరికా అంటే మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు రిపబ్లికనా, డెమోక్రాటా అన్నది వారికి పట్టలేదు. అమెరికా వాడు ఎవడు దొరికినా బూబీ ట్రాప్‌ పెట్టి చంపి పారేయాలంతే! అదే వాళ్ల ఫిలాసఫీ. కశ్మీరీయులకు మన మీద ప్రేమ లేకపోవడానికి కారణం యిదే! మన సినిమాల్లో హీరోలుంటారు. అన్యాయం జరిగితే పోలీసుల వద్దకు వెళతారు, కోర్టు తలుపు తడతారు. అయినా ఎవరూ అతని గోడు వినరు. చివరకు చట్టాన్ని చేతిలోకి తీసుకుని హింసామార్గం పడతాడు. మనం చప్పట్లు కొడతాం. వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే యిలాటి అనర్థాలే జరుగుతాయి. కశ్మీరులో ఉగ్రవాదం తలెత్తిందంటే దానికి కారణం - యిలాటి ప్రజాస్వామ్య వైఫల్యమే. ప్రజాగ్రహం వ్యక్తం కావడానికి ఛానెల్‌ ఉండాలి. అది మూసేస్తే అది హింసామార్గం పడుతుంది. (సశేషం) (ఫోటో - షేక్‌ అబ్దులా, హరి సింగ్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?