Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ప్రస్తుతానికి గట్టెక్కిన సోరేన్

 ఎమ్బీయస్‍: ప్రస్తుతానికి గట్టెక్కిన సోరేన్

ఇవాళ ఝార్‌ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కి గండం గడించింది. 81 స్థానాల అసెంబ్లీలో 30 మంది ఉన్న హేమంత్ పార్టీ ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), 18 మంది ఉన్న కాంగ్రెసు (వీరిలో ముగ్గురు బెంగాల్‌లో క్యాష్‌తో పట్టుబడి జైలుకి పంపబడ్డారు), ఒక ఆర్జెడి సభ్యుడు కలిసి ఏర్పరచిన ప్రభుత్వానికి సిపిఐ ఎంఎల్ సభ్యుడొకడు, ఎన్‌సిపి సభ్యుడొకడు ఓటేయగా మొత్తం 48 ఓట్లు పడ్డాయి.

తను ఎమ్మెల్యే పదవి పోగొట్టుకునే పరిస్థితి వచ్చిన దగ్గర్నుంచి వెంటనున్న ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోననే భయంతో వాళ్లను యిన్నాళ్లూ కాంగ్రెసు ఏలుబడిలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూరులో బస చేయించి ఆదివారం సాయంత్రానికి ఝార్‌ఖండ్ రాజధాని రాంచీకి విమానంలో తీసుకుని వచ్చాడు. ఈలోగా 26 సీట్లున్న బిజెపి తన ఎమ్మెల్యేలను పిలిపించి రాజధానిలో ఉంచింది. అధికార పార్టీలో చీలిక వస్తే దాన్ని ఉపయోగించుకుందామని దాని వ్యూహం కావచ్చు. అసెంబ్లీలో దానితో పాటు దానికి మద్దతిస్తున్న 2 సీట్ల ఆల్ ఝార్‌ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) మరో యిద్దరు యిండిపెండెంట్లు ఓటింగును బహిష్కరించారు.

రాజకీయ పార్టీలు యిలా వ్యవహరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అంతుపట్టని దేమిటంటే గవర్నరుగారి ప్రవర్తన. హేమంత్‌పై గని లీజు గురించిన ఆరోపణ ఉంది. దానిపై రాష్ట్ర బిజెపి నాయకులు 2022 ఫిబ్రవరిలో చేసిన ఫిర్యాదు ఆధారం చేసుకుని ఎన్నికల కమిషన్ ‘మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎందుకు డిస్‌క్వాలిఫై చేయకూడదు?’ అని హేమంత్‌కు మే నెలలోనే నోటీసు యిచ్చింది. దానికి హేమంత్ యిచ్చిన జవాబును పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ ఆగస్టు 25న గవర్నరు రమేశ్ బైస్‌కు తన నిర్ణయాన్ని తెలిపిందట. అదేమిటో యిప్పటివరకూ ఆయన బయటపెట్టలేదు కానీ ఎమ్మెల్యేగా అనర్హుడు అని కమిషన్ చెప్పిందని లీకులు మాత్రం వదిలాడు.

అధికార కూటమి ఐన యుపిఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలయన్స్) నాయకులు కొందరు సెప్టెంబరు 1న గవర్నర్ని కలిసి రాజకీయ అనిశ్చిత పరిస్థితి తొలగాలంటే యీ విషయంపై స్పష్టత యివ్వాలని కోరారు. రెండు రోజుల్లో స్పష్టత యిస్తా అంటూ ఆయన దిల్లీ వెళ్లిపోయాడు. ఈయన మధ్యప్రదేశ్ వాడు. బిజెపి తరఫున రాజకీయాల్లో ప్రవేశించి 1978లో మునిసిపల్ కమిషనర్‌గా,  తర్వాత 1980లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1989 నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చాడు. వాజపేయి హయాంలో కేంద్ర కాబినెట్‌లో ఉన్నాడు.

2019-21 మధ్య నుంచి త్రిపురలో గవర్నరుగా చేసి, 2021 జులై నుంచి ఝార్‌ఖండ్ గవర్నరుగా ఉన్నాడు. ఈయన బిజెపి పక్షానే పని చేస్తాడన్న దానిలో అణుమాత్రం సందేహం లేదు. అయినా గవర్నరుగా ఉన్నపుడు కొన్ని బాధ్యతలుంటాయి. కమిషన్ తన రిపోర్టిచ్చి పది రోజులు దాటినా బయటపెట్టకుండా ఊహలకు, సందేహాలకు తావివ్వవలసిన అవసరం ఏముంది? హేమంత్‌ను అనర్హుణ్ని చేయమని చెప్పి ఉంటుందనే ఆశతో జెఎంఎం సభ్యులు కొందరిలో విభేదాలు కల్పించే ఆలోచనతో యిలా చేసి ఉండవచ్చా?  లేక హేమంత్‌ను లొంగదీయడానికి యీ రిపోర్టు వాడుకోబోతున్నాడా?

కాంగ్రెసుతో చేతులు కలిపిన ప్రభుత్వాలను పడగొట్టడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెసుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్‌ను దింపేశారు. ఝార్‌ఖండ్‌లో జెఎంఎం ప్రభుత్వం కూడా అలాటిదే కాబట్టి దాన్నీ పడగొట్టాలి. జెఎంఎం పార్టీ పటిష్టంగా ఉంది. అందుకని కాంగ్రెసు నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. గతంలో కాంగ్రెసు అధిష్టానం తరఫున ఝార్‌ఖండ్ ఇన్‌చార్జిగా ఉండి ప్రస్తుతం బిజెపిలో చేరిన ఒక నాయకుడు ఝార్‌ఖండ్ కాంగ్రెసు ఎమ్మెల్యేలపై వల విసురుతున్నాడట. అది గమనించి, హేమంత్ కంగారు పడుతున్నాడు. ‘సంకీర్ణంలో నుంచి కాంగ్రెసును తప్పించి, మాతో జత కట్టి, మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేయి, లేకపోతే కేసులు తప్పవు’ అని అమిత్ షా హేమంత్‌ను హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

బిజెపి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపినపుడు ఎందుకైనా మంచిదని హేమంత్ జాగ్రత్త పడ్డాడు. తమది గిరిజన పార్టీ కాబట్టి, ద్రౌపది గిరిజన మహిళ కాబట్టి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాకుండా ఆమెకే ఓటేస్తామని హేమంత్ ప్రకటించాడు. కానీ జులై మూడోవారంలో ఎన్నిక జరిగినపుడు కాంగ్రెసులో ఏడెనిమిది మంది పార్టీ చెప్పిన సిన్హాకు కాకుండా ముర్ముకు క్రాస్ ఓట్ చేశారు. అప్పుడే కాంగ్రెసుకు తన శాసనసభ్యులపై పట్టు లేదని తెలిసిపోయింది.

ముగ్గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి అసాం ముఖ్యమంత్రి ద్వారా బెంగాల్‌లో డబ్బు ఏర్పాటు చేశారని హేమంత్ ఆరోపణ. వాళ్ల సంగతి బెంగాల్ సిఐడికి ఉప్పందింది. జులై 30న ఆ ముగ్గురూ బెంగాల్‌లో హౌడా జిల్లాలో రూ.50 లక్షల క్యాష్‌తో కారులో ప్రయాణిస్తూండగా పోలీసులు పట్టుకుని కేసు పెట్టారు. బెంగాల్ సిఐడి ఆగస్టు 9న వాళ్ల యిళ్లపై దాడి చేసి సోదా చేసింది. మొబైళ్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకుంది. బిజెపి ప్రలోభాలకు లొంగిపోయారంటూ కాంగ్రెసు వారిని పార్టీ నుంచి సస్పెండు చేసింది. క్రాస్ ఓటు చేసినవారిలో యీ ముగ్గురూ కూడా ఉన్నారని అనుమానాలున్నాయి. కాంగ్రెసును ఒకవైపు నుంచి నరుక్కుంటూ వస్తూ మరో పక్క హేమంత్‌ మెడపై కేసు కత్తి వేలాడదీశారు.

ఇంతకీ ఈ మైనింగ్ కేసేమిటి? 2021 జూన్‌లో హేమంత్ మైనింగ్, ఎన్వయిర్‌మెంట్ మంత్రిగా ఉండగానే రాంచీలోని అంగారా బ్లాక్‌లో 0.88 ఎకరాల మైనింగు లీజును రాంచీ జిల్లా మైనింగ్ ఆఫీసు హేమంత్‌కు కేటాయించిందని, పర్యావరణ శాఖకు 2021 సెప్టెంబరులో 9 రోజుల్లో అనుమతి యిచ్చేసిందని ఆరోపణ వచ్చింది. దీనిపై ఎవరో పిల్ వేశారు. దానికి సమాధానంగా హేమంత్ ఒక అఫిడవిట్‌లో ‘ఇదేమీ కొత్త లీజు కాదు. 2008 మే 17న పదేళ్ల లీజు గ్రాంట్ అయింది. తవ్వకాలు జరగకపోవడంతో 2018లో అది పూర్తయిపోయిన తర్వాత రెన్యూవల్‌కు అడిగితే 2021 వరకు యిచ్చారు. 2021లో అది లాప్స్ అయిపోయింది కాబట్టి మళ్లీ రెన్యూవల్‌కు అడిగానంతే’ అని చెప్పుకున్నాడు.

2022 ఏప్రిల్‌లో అడ్వకేట్ జనరల్ ‘2022 ఫిబ్రవరిలో హేమంత్ ఆ లీజును వదులుకున్నాడు. ఇప్పటివరకు ఆ గనిలో తవ్వకాలే జరపలేదు, ఏ లాభాన్ని ఆర్జించలేదు. అందువలన పదవిలో ఉంటూ తనకు తాను లాభం చేసుకున్నాడు అని అనడానికి లేదు కాబట్టి, అనర్హత ప్రశ్న ఉదయించదు.’ అని కోర్టుకి చెప్పాడు. జెఎంఎం జనరల్ సెక్రటరీ ‘హేమంత్ ప్రతి ఎన్నికల ఎఫిడవిట్‌లోనూ తన మైనింగు లీజు సంగతి ఉటంకించాడు. దాపరికం ఏమీ లేదు.’ అన్నాడు.

గని తనకు తానే ఎలాట్ చేసుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు కాబట్టి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫెట్ అఫెన్స్, పీపుల్స్ రిప్రజెంటేషన్ చట్టం 9 (ఎ) సెక్షన్ కింద ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు 2022 ఫిబ్రవరిలో గవర్నరుని కోరాడు. మే 3న ఎన్నికల కమిషన్ హేమంత్‌కు నోటీసు పంపింది.

మూడు రోజుల తర్వాత అదే నెలలో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్) రాష్ట్ర మైనింగ్ సెక్రటరీ, నరేగా స్కామ్‌లో డబ్బులు కాజేసిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న పూజా సింఘాల్‌పై దాడి చేసి అరెస్టు చేసింది. ఝార్‌ఖండ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ ‘పూజాకు సంబంధించిన ఆడిటర్ సుమన్ కుమార్ వద్ద ఇడి రూ.18 కోట్లు పట్టుకుంద’ని ప్రకటించాడు.

ఇక్కడ చిత్రమేమిటంటే పూజాను అరెస్టు చేసినది మనీ లాండరింగ్ కేసులో, మైనింగ్ లీజు కేసులో కాదు! ఆమె, ఆమె భర్త అప్రూవర్లుగా మారి హేమంత్‌ను యిరకాటంలో పెడతారనే వార్తలు పుట్టుకుని వచ్చాయి. కానీ యిప్పటిదాకా అది జరగలేదు. మే 15న జెఎంఎం పార్టీ కోశాధికారి రవి జైశ్వాల్‌ను మనీ లాండరింగ్ చేశావా అంటూ విచారణకు పిలిచింది ఈడీ. తర్వాత ఏమైందో తెలియదు.

హేమంత్‌తో పాటు అతని సోదరుడు బసంత్ సోరేన్‌కు కూడా ఎన్నికల కమిషన్ నోటీసు పంపింది. అతను ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో బాటు చంద్రా స్టోన్ వర్క్స్ అండ్ గ్రాండ్స్ మైనింగ్ అనే రెండు కంపెనీల్లో డైరక్టరు. ఈ కంపెనీలు గనులను లీజుకి తీసుకున్నాయి. ఇవి కాక హేమంత్ తన భార్య కల్పనకు ఓ యిండస్ట్రియల్ కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించాడని ఆరోపణతో పాటు, హేమంత్ తన రాజకీయ ప్రతినిథి పంకజ్ మిశ్రా, మీడియా ఎడ్వయిజరు ప్రసాద్‌లకు అక్రమంగా మైనింగు లీజులు కేటాయించారనే ఆరోపణ కూడా ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు కోర్టుల్లో తేలాలి.

హేమంత్ ప్రస్తుతానికి కాంగ్రెసు సాయంతోనే గట్టెక్కినా రేపుమర్నాడు సడన్‌గా కాంగ్రెసును అవతలికి నెట్టేసి, బిజెపిని ఆహ్వానిస్తే యీ నిజానిజాలు ఎప్పటికీ తేలవు. అటా? ఇటా? తేల్చుకో అని హేమంత్‌కు సమయమివ్వడానికే గవర్నరు ఎన్నికల కమిషన్ సిఫార్సును బయట పెట్టటం లేదని అనుమానించవలసి వస్తోంది.

ఒక వేళ కమిషన్ సిఫార్సు మేరకు హేమంత్ ఎమ్మెల్యేగా తప్పుకున్నా, పదవిలో కొనసాగుతూ ఆర్నెల్లలో మళ్లీ ఎన్నిక కావచ్చు. లేదా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ ప్రతిష్ఠ పోగొట్టుకున్నవాడు అనుచరగణాన్ని నిలుపుకోగలడా? లాలూ నిలుపుకోలేదా అంటే ఆ పరిస్థితి యిక్కడ ఉందా? లాలూ తన భార్య రబ్డీని కూర్చోబెట్టినట్లు, హేమంత్ తన భార్యను కూర్చోబెట్టే అవకాశముంది అంటున్నారు. ఇదే జరిగినా కాంగ్రెసు నుంచి ఫిరాయింపుదారులను లాక్కుని, ప్రభుత్వాన్ని అస్థిర పరచి, ఎవరికీ మెజారిటీ లేదంటూ రద్దు చేసి, మళ్లీ ఎన్నికలకు ఆదేశిస్తే తమకు ఛాన్సుంటుందని బిజెపి అనుకుంటూ ఉండవచ్చు.

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?