Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: హీరోల అడ్వాన్సులు – డేట్లు

ఎమ్బీయస్: హీరోల అడ్వాన్సులు – డేట్లు

తెలుగు హీరోల సినిమా ఏదైనా హిట్ కాగానే, నిర్మాతలందరూ అతని దగ్గర పరుగులు పెడతారు. తమ సినిమాలకు బుక్ చేసేస్తున్నామంటూ అడ్వాన్సులు చేతిలో పెడతారు. కథ కూడా వినకుండానే హీరో నిక్షేపంలా ఎడ్వాన్సు తీసేసుకుంటాడు. ఇలా ఒకరి దగ్గర కాదు, అనేకమంది దగ్గర! ఆ తర్వాత నిర్మాత పడిగాపులు ప్రారంభమౌతాయి. 

ఎప్పణ్నుంచి ప్రారంభిద్దాం? అని అడిగితే, ‘మంచి కథ, దర్శకుణ్ని తీసుకురండి’ అంటాడు హీరో. తీసుకుని వచ్చినదాకా వుండి, ‘కథ బాగా రాలేదు, బాగా వర్క్ చేసుకురండి’ అంటాడు. నిర్మాత మళ్లీ యింకో కథకుణ్ని, దర్శకుణ్ని వెంటపెట్టుకుని వెళుతూంటాడు. ఇలా హీరో దగ్గర ప్రదక్షిణాలు చేసే నిర్మాతలు కనీసం అరడజను మందైనా వుంటూ వుంటారు. వీళ్ల అడ్వాన్సు హీరో దగ్గరే వుంటుంది. అక్కడ క్యూ సిస్టమ్ ఏదీ వుండదు. హీరో గారు ఎవర్ని కనికరిస్తే వారి సినిమా ప్రారంభమవుతుంది.

ఈ లోగా ఎవరైనా దర్శకుడు హిట్ కొడితే, వీళ్లందరినీ పక్కన పడేసి, హీరో అతనికి ముందుగా డేట్స్ యిస్తాడు. కావాలంటే యీ నిర్మాతలలో ఎవరైనా కాని, యిద్దరుముగ్గురు కలిసి కానీ అతన్ని పెట్టుకోండి, ఎడ్వాన్సులో ఎడ్జస్ట్ చేద్దాం అంటాడు. నిర్మాతకు కథ నచ్చకపోయో, దర్శకుడు నచ్చకపోయో, పారితోషికాలు కుదరకో ‘ఇది వద్దండి’ అంటే, ‘అయితే ఆగండి’ అంటాడు హీరో. 

ఇలా కొన్ని కోట్ల రూపాయలు హీరోల వద్ద అడ్వాన్సుల రూపంలో వుంటూంటాయి. ‘నేను ఎడ్వాన్సు ముందుగా యిచ్చాను, నా సినిమా ముందుగా చేయాలి కదా, అది చేయకుండా నన్ను వెనక్కి నెట్టావు, సినిమా పూర్తయ్యాక నీ పారితోషికం యివ్వకుండా నేను కూడా నిన్ను వెనక్కి నెడితే ఏం చేస్తావ్?’ అని అనగల నిర్మాత ఉంటాడా? ఉన్నాడు! నిర్మాతల ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతినిథి, ‘యువచిత్ర’ మురారి గారు. ‘‘నవ్విపోదురుగాక..’’ అనే తన ఆత్మకథలో హీరో వెంకటేశ్‌తో వచ్చిన గొడవ గురించి సవిస్తరంగా రాశాడాయన.

బాలకృష్ణతో తన యువచిత్ర బ్యానర్ మీద ‘‘సీతారామకల్యాణం’’ (1986) తీస్తూండగానే నిర్మాత రామానాయుడు తన కుమారుడు వెంకటేశ్ హీరోగా ‘‘కలియుగ పాండవులు’’ (1986) సినిమా మొదలుపెట్టారు. మురారి ఆయన వద్దకు వెళ్లి మీ అబ్బాయి తర్వాతి సినిమా నాతో చేయాలంటూ అడ్వాన్సు యిచ్చారు. 

‘‘కలియుగ పాండవులు’’ హిట్టయ్యాక వెంకటేశ్ మురారి సినిమా వెంటనే చేయలేదు. ‘‘బ్రహ్మరుద్రులు’’ (1986- నిర్మాత అశ్వనీదత్), ‘‘అజేయుడు’’ (1987 – నిర్మాత ఎస్. వెంకటరత్నం), ‘‘భారతంలో అర్జునుడు’’ (1987 – డైరక్షన్ రాఘవేంద్రరావు), ‘‘త్రిమూర్తులు’’ (1987 – నిర్మాత టి సుబ్బరామిరెడ్డి) ‘‘విజేత విక్రమ్’’ (1987 – నిర్మాత ఎం. తిరుపతిరెడ్డి) సినిమాలు ఒప్పుకుని వాటికి వర్క్ చేశారు. ఇది మురారిని మండించింది.

చివరకు ఆయన సినిమా ప్రారంభమైంది. భానుప్రియ, గౌతమి హీరోయిన్లు. మొదటి రోజు వెంకటేశ్ డ్రెస్ మార్చాలని అన్న సురేశ్‌బాబు వచ్చి చెపితే, మురారి ఒప్పుకోలేదు. ముందు ఏమనుకున్నామో అదే వేసుకోవాలని చెప్పారు. ఈ సినిమా షూటింగు జరుగుతూండగానే ‘‘త్రిమూర్తులు’’ సినిమా క్లయిమాక్స్ సీనుకి డబ్బింగ్ చెప్పవలసి వచ్చింది వెంకటేశ్‌కు. ఆ విషయం షూటింగు మధ్యలో చెపితే ‘‘ఇప్పుడు చెపితే ఎలా? త్వరగా పూర్తి చేసి సాయంత్రానికల్లా పంపించేస్తాం.’’ అన్నారు మురారి.

ఆ సినిమా హిందీలో వచ్చిన ‘‘నసీబ్‌’’కి రీమేక్. అర్జున్, రాజేంద్రప్రసాద్, శోభన, ఖుశ్‌బూ, అశ్విని వంటి తారాగణం. బప్పీ లాహిరి సంగీతం. మధ్యలో వచ్చిన తన సినిమాలన్నీ ఫ్లాపవడంతో ఆ సినిమాపై వెంకటేశ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘‘అంత పెద్ద సినిమాకి డబ్బింగ్ చెప్పాలి.’’ అంటూ వెంకటేశ్ ఏదో చెప్పడంతో మురారికి చికాకేసింది.

పక్కకు వచ్చి డైరక్టరు కోడి రామకృష్ణతో ఆయన షాట్లు త్వరగా తీసేయవయ్యా అన్నారు. ఆ ప్రకారమే షాట్ ఏర్పాటు చేసి వెంకటేశ్‌ను పిలవబోతే ఆయన అప్పటికే షూటింగు స్పాట్ వదిలేసి కారులో వెళ్లిపోయాడని తెలిసింది. అది ఔట్‌డోర్‌లో రోడ్డు మీద జనం మధ్యలో జరుగుతున్న షూటింగు. 

యూనిట్, పోలీసులు 100 మంది దాకా ఉన్నారు. చెప్పాపెట్టకుండా హీరో వెళ్లిపోవడంతో డైరక్టరుకు ఒళ్లు మండి పాకప్ చెప్పేశారు. మురారి అన్నయ్య రాఘవేంద్రరావు గారి వద్దకు వెళ్లి మాట్లాడితే ఆయన వెంకటేశ్ చేత మర్నాడు షూటింగుకి వస్తున్నానని కబురు పెట్టింటారు. కానీ వీళ్లు పంతం కొద్దీ షూటింగు పెట్టలేదు. ఆ తర్వాత షూటింగ్ చేసినా, రెండు రోజులపాటు యూనిట్ అంతా వెంకటేశ్‌తో ముభావంగానే వున్నారు.

సినిమా మొత్తానికి పూర్తయింది. హీరోకి యివ్వవలసిన పారితోషికం గురించి రామానాయుడు గారు కబురంపితే మురారి వెళ్లి ‘‘మీ సినిమా తర్వాత రెండో సినిమాగా నాది చేయాలి. ఐదుగురికి చేశాక నాకు చేశారు. నేను కూడా ఐదు సినిమాలు చేసిన తరువాతే హీరోకి డబ్బిస్తాను. మీరూ నిర్మాతే. మన కష్టాలు మీకు తెలుసు.’’ అంటూ దణ్ణం పెట్టి వచ్చేశారు. 

దానికి ముందు మాటల సందర్భంలో రామానాయుడు గారితో మురారి ‘‘వెంకటేశ్‌కి రెమ్యూనరేషన్ ఎంత యిమ్మంటారండీ?’’ అని అడిగితే ఆయన ‘‘దీని తర్వాత ‘‘జానకిరాముడు’’ (1988) నాగార్జునతో ప్లాన్ చేస్తున్నావటగా, అతనికి యిచ్చేటంతే ఇవ్వండి.’’ అన్నారు రామానాయుడు. ‘‘నాగార్జున హీరో నాగేశ్వరరావు గారబ్బాయి. వెంకటేశ్ నిర్మాత కుమారుడు. మీకూ, నాగేశ్వరరావు గారికి పోలికేమిటండీ?’’ అనేశారు. రామానాయుడు యిక బదులు చెప్పలేదు.

సినిమా రిలీజైంది. చాలా బాగా ఆడింది. వెంకటేశ్‌కు తొలి సినిమా తర్వాత హిట్ యిదే. డబ్బులు బాగానే వచ్చినా మురారి డబ్బు పంపలేదు. దాంతో మురారి తర్వాతి సినిమా ‘‘జానకిరాముడు’’ పూర్తి చేసి, విడుదల చేసే సమయంలో విజయా లాబ్స్ వారికి ‘‘మురారి మాకు బాకీ వున్నారు కనుక అది కట్టేవరకూ ప్రింట్స్ యివ్వకూడదు’’ అని వెంకటేశ్ ఉత్తరం పంపించారు. 

అలా వ్యక్తిగతంగా పంపిస్తే లాబ్ వాళ్లు ఏమీ చేయలేరు. బాధిత వ్యక్తులు నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ద్వారా కానీ, ఫెప్సీ (దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సమాఖ్య) ద్వారా కానీ ఫిర్యాదు చేస్తే అప్పుడు లాబ్ వాళ్లు ప్రింట్ ఆపేస్తారు. అప్పట్లో నడిగర సంఘం తెలుగు, తమిళ నటుల మధ్య చీలిపోయి యాక్టివ్‌గా లేదు. ఇక ఫెప్సీ. అది టెక్నీషియన్స్‌కే తప్ప తమకు కాదని నటీనటులెవరూ దానిలో చేరలేదు.

లాబ్ వాళ్లు తమ నిస్సహాయత తెలపడంతో వెంకటేశ్ గత్యంతరం లేక ఫెప్సీలో చేరి, వాళ్ల ద్వారా ఫిర్యాదు పంపి, లాబ్ వద్ద ప్రింటు ఆపించబోయారు. ఫెప్సీ అధ్యక్షుడు గాంధీరామన్ వందమంది దాకా వెంటేసుకుని లాబ్‌కు వచ్చారు. ఆయన మురారితో ‘‘ఇన్నాళ్లకు ఒక నటుడు మా సమాఖ్యలో చేరారు. వచ్చిన డబ్బంతా మా సమాఖ్యనే తీసుకోమన్నారు. అందుచేత మీరు డబ్బు కట్టేస్తే బాగుంటుంది.’’ అన్నారు. 

మురారి లాబ్ వాళ్లకే చెప్పుకోండి అన్నారు. లాబ్ వాళ్లు ‘‘మేం ప్రింట్లు మురారిగారికి యిచ్చేస్తాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.’’ అన్నారు. ఆ లాబ్ నాగిరెడ్డి గారిది. అందుచేత ఫెప్సీవాళ్లు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడితే ఆయన ‘‘రామానాయుడుతో నేను మాట్లాడతాను.’’ అని చెప్పి పంపించేశారు.

తర్వాత దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలిలో చర్చ నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా దర్శకుడు కె బాలచందర్, తమిళ నిర్మాత కెఆర్, అట్లూరి పుండరీకాక్షయ్య, కె. దేవీవరప్రసాద్ తదితరులు వున్నారు. మురారి ఎప్పటిలాగానే ‘‘అతను ఐదు సినిమాలు చేసుకున్న తర్వాతనే నా సినిమా చేశాడు. నేనూ ఐదు సినిమాలు తీసిన తర్వాతనే యిస్తాను.’’ అని తన వాదన వినిపించారు. 

అలా అంటే కనీసం యింకో ఐదేళ్లు పడుతుందన్నమాట! వెంకటేశ్‌కు తోడుగా వచ్చిన సురేశ్ తెల్లబోయి ‘‘రాఘవేంద్రరావుగారి లాంటి పెద్ద దర్శకుడు అడిగితే, అటువంటి వాళ్లని కాదనగలనా?’’ అన్నారు. ‘‘ఆయన యిచ్చే రూపాయికి, నేను యిచ్చే రూపాయికి ఏమైనా తేడా వుందా?’’ అని అడిగారు మురారి.

ఈ వాదనకు తిరుగు లేదు కనుక, బాలచందర్ మధ్యవర్తిగా ‘‘మీరు యివ్వాల్సింది యివ్వడానికి మీకేమైనా అభ్యంతరం వుందా?’’ అని అడిగారు. ‘‘నాకెందుకు సార్ అభ్యంతరం, యీ హీరోల దురాగతం తెలియాలనే యింతవరకు లాగాను.’’ అన్నారు మురారి. వెంటనే చెక్కు కూడా యిచ్చేశారు. ‘ఈ హీరోల దురాగతం’ అనే మాట పరిశ్రమలో కొన్నాళ్లు నలిగింది. ఈ రోజుల్లో నిర్మాతల పరిస్థితి కనాకష్టంగా మారింది. డబ్బు యిచ్చేది అతనే అయినా, అందరూ అతన్నే ఆడిస్తున్నారు. 

అలా అడడానికి సిద్ధపడి కొందరు రంగంలోకి కొత్తగా వస్తూండడంతో పాతతరం వాళ్లు మారిన పరిస్థితులకు సర్దుకోలేక తప్పుకుంటున్నారు. మురారి వంటి పట్టుదల వున్న నిర్మాత అప్పుడప్పుడు తగులుతూ వుంటే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కాస్త హెచ్చరికగా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?