cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: హాలీవుడ్ ప్రేమకథలు - హంఫ్రీ బోగార్ట్

ఎమ్బీయస్: హాలీవుడ్ ప్రేమకథలు - హంఫ్రీ బోగార్ట్

ఇక హీరోగా వేసిన హంఫ్రీ బోగార్ట్ గురించి కూడా ఆసక్తికరమైన కథ వుంది. అతను 1899లో న్యూయార్క్‌లో ఒక ధనిక కుటుంబంలో పుట్టాడు. తండ్రి సర్జన్. ఇతను మెడిసిన్ చదువుతూండగానే, మొదటి ప్రపంచయుద్ధంలో నేవీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఓ సారి బాంబు పేలి పై పెదవికి పక్షవాతం వచ్చింది. మొదటినుంచి వున్న రఫ్ లుక్‌కు తోడు యిది కూడా రావడంతో అలాటి పాత్రలకు పేరుబడ్డాడు కానీ వస్తుతః చాలా సౌమ్యుడు, మంచివాడుట. 1920లో నేవీ నుంచి బయటకు వచ్చాక న్యూయార్క్‌లోని బ్రాడ్వే థియేటర్‌లో నటిస్తూంటే 1930లో సినిమాల్లో మొదటి ఛాన్సు వచ్చింది. ‘‘ద పెట్రిఫైడ్ ఫారెస్టు’’ (1936)లో హంతకుడి పాత్ర వేయడంతో వార్నర్ వాళ్లు పిల్చారు. వాళ్ల సినిమాల్లో సెకండరీ పాత్రలే, అవీ గాంగ్‌స్టర్ పాత్రలే యిచ్చారు.

బయటకు మొరటుగా, నిరాసక్తంగా కనబడుతూ, అంతరంగంలో మంచిగా వుండే ‘‘కేసబ్లాంకా’’లో రిక్ పాత్ర అతని కోసమే డిజైన్ చేశారా అన్నట్లున్నా, నిజానికి ఆ పాత్ర రోనాల్డ్ రీగన్ చేత (తర్వాత ఆ దేశాధ్యక్షుడయ్యాడు) వేయిద్దామనుకున్నారు. కానీ యితనికి మంచి పేరు తెచ్చి తొలిసారిగా ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. ఇలాటి పాత్రే ‘‘టు హేవ్ అండ్ హేవ్ నాట్’’ (1944)లోది కూడా. దానికీ మంచి పేరు వచ్చింది. ఇతను వేసిన వాటిల్లో ముఖ్యమైన యితర చిత్రాలు – ఆడ్రీ హెప్‌బర్న్‌తో వేసిన ‘‘సబ్రినా’’ (1954) (‘‘ఇంటికి దీపం ఇల్లాలే’’ (1961), ‘‘ఏ దిల్లగీ’’ (1994) సినిమాలకు యిది యిన్‌స్పిరేషన్ అంటారు) కేథరిన్ హెప్‌బర్న్‌తో వేసిన ‘‘ద ఆఫ్రికన్ క్వీన్’’ (1951) – దీనికి ఆస్కార్ వచ్చింది.

వైవాహిక జీవితానికి వస్తే అతను న్యూయార్క్‌లో స్టేజి మీద నాటకాలు వేసే రోజుల్లో సహనటి హెలెన్ మెన్‌కెన్‌ను చేసుకున్నాడు. రెండేళ్లు సహజీవనం చేసి 1926లో పెళ్లాడాడు. 18 నెలల తర్వాత హంఫ్రీ తనను కొట్టాడంటూ ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో స్టేజి నటీమణి మేరీ ఫిలిప్స్‌ను చేసుకున్నాడు. అంతలో 1930లో అతనికి హాలీవుడ్‌లో ఛాన్సు వచ్చింది. దేశపు తూర్పు కొస నుంచి పశ్చిమ కొసకు వెళ్లాల్సి వచ్చింది. నాకు యిక్కడి నాటకాల కెరియర్ ముఖ్యం, నేను నీతో రాను అందామె. ఇతను అక్కడకి వెళ్లి పెద్దగా అవకాశాలు రాక రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ‘నువ్వు లేనప్పుడు మరొకడితో ప్రేమలో పడ్డాను’ అని చెప్పిందామె. ‘ఫర్వాలేదులే. మనిద్దరం యిక ఎప్పటికి విడివిడిగా వుండవద్దు.’ అన్నాడతను. అన్నట్టుగానే 1936లో మళ్లీ హాలీవుడ్‌లో మంచి ఛాన్స్ వస్తే యీసారి భార్యను వెంటపెట్టుకుని వెళ్లాడు.

అక్కడ అతనికి పేరు రాసాగింది. కానీ మేరీకి తన కెరియర్ పోతోందన్న అసంతృప్తి పెరిగిపోయింది. న్యూయార్క్‌లో స్టేజిపై ఛాన్స్ వస్తే ఒప్పుకుంది. హంఫ్రీకి కోపం వచ్చింది. ఇలా అయితే మనకు సంసారం ఎలా ఏర్పడుతుందని వాదించాడు. అయినా ఆమె వినలేదు. వెళ్లిపోయింది. 1938లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు 35 ఏళ్ల మేయో మెథాట్ అనే యింకో నటిని చేసుకున్నాడు. పెళ్లి రోజునే యిద్దరూ తాగి పోట్లాడుకున్నారు. అప్పణ్నుంచి రోజూ తాగి, పోట్లాడుకోవడమే. ఆమె చిత్తుగా తాగేది. ఆమె సాంగత్యంతో యితను మామూలుగా తాగే మనిషి తాగుబోతు అయిపోయాడు. నిజానికి హంఫ్రీ ఆడవాళ్ల వెంట పడేరకం కాదు. అయినా నువ్వలాటి వాడివే అంటూ ఆమె అసూయతో దెబ్బలాడుతూండేది. ‘నీ కోసం నా కెరియర్ వదులుకున్నా’ అంటూ సతాయించేది. నిజానికి ఆమెకు చెప్పుకోదగ్గ పెద్ద కెరియర్ లేనే లేదు. ఇలా కలహాలతోనే ఆరేళ్లు గడిపారు.

1944లో ‘‘టు హేవ్ అండ్ హేవ్ నాట్’’ అనే సినిమా షూటింగులో లారెన్ బెకాల్ అనే హీరోయిన్‌ పరిచయమైంది. అతనిది చాలా కులీన కుటుంబం. ఆమెది అత్యంత సాధారణ కుటుంబం. అతను బాగా తెలివైనవాడు. సున్నితమనస్కుడు. ఇంటి గొడవల కారణంగా పక్కా తాగుబోతుగా మారినవాడు. అతని కంటె పాతికేళ్లు చిన్నదైన లారెన్ సినిమాలకు కొత్త. వయసు 19 కాబట్టి లోకమంటే ఏమీ తెలియదు. అమాయకురాలు. చాలా సింపుల్ గర్ల్. ఇద్దరి మధ్య వున్న తేడాయే ఆకర్షణగా మారింది. ఆమెను బోటు షైరుకి తీసుకెళ్లేవాడు. నీకు విడాకులిచ్చి లారెన్‌ను చేసుకుంటాను అని చెప్తే మేయో నానా అల్లరీ చేసింది. అతన్ని పొడవబోయింది. తను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరకు భారీ భరణం పుచ్చుకుని 1945లో విడాకులిచ్చింది.

హంఫ్రీ, లారెన్‌ల దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగింది. ఇద్దరూ ఒకరి నొకరు విడిచి వుండేవారు కారు. ఇద్దరూ కలిసి 4 సినిమాలు వేశారు. ఆమె గృహిణిగా వుండడానికి ఎక్కువ యిష్టపడేది. మూడేళ్లు సినిమాలు మానేసింది. ఇద్దరు పిల్లల్ని కంది. అతని తాగుడును, సిగరెట్లను బాగా తగ్గించింది. అతని కెరియర్ బాగా వూపందుకుని, హాలీవుడ్‌లో అగ్రనటులందరూ వాళ్లింటికి వస్తూ పోతూ అరిస్టోక్రాటిక్ జీవితం అనుభవిస్తున్న రోజుల్లో అతని గొంతు కాన్సర్ వచ్చింది. 1957లో చనిపోయాడు. అతని మరణం తర్వాత ఆమె ఫ్రాంక్ సినాత్రాతో కొంతకాలం తిరిగింది. 1959లో హంఫ్రీ పోలికలున్న జేసన్ రాబర్డ్స్‌కి దగ్గరైంది. 1961లో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి 8ఏళ్లు మాత్రమే సాగింది. 1969లో విడాకులు తీసుకున్నాక ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

ఇక ‘‘కేసబ్లాంకా’’ సినిమా విషయానికి వస్తే – దానికి మూలం, ముర్రే బర్నెట్, జోన్ ఆలిసన్ అనేవారు రాసిన ‘ఎవరిబడీ కమ్స్ టు రిక్‌స్’ అనే నాటకం. అది ప్రదర్శింపడకుండానే వార్నర్ బ్రదర్స్ దృష్టికి వచ్చింది. వారు యీ సినిమాను తీశారు. మొదట విలియం వైలర్ (‘‘రోమన్ హాలీడే’’, ‘‘బెన్‌హర్’’, ‘‘హౌటూ స్టీల్ ఏ మిలియన్’’, ‘‘ఫన్నీ గర్ల్’’) ను డైరక్టర్‌గా అనుకుని, అతను దొరక్కపోవడంతో అంతగా పేరు లేని మైక్ కర్టీజ్‌కు అప్పగించారు. రోజురోజుకి స్క్రిప్టు మారిపోతూండడంతో సినిమాపై ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది.

ఈ సినిమా అమెరికన్ సినిమా అయినా, ముఖ్య తారాగణమంతా అమెరికాకు వచ్చిన యితర దేశస్తులే. హీరోయిన్ ఇల్సాగా వేసిన ఇంగ్రిడ్ బెర్గ్‌మన్ స్వీడన్ దేశస్తురాలు. ఆమె భర్త విక్టర్ లాస్‌జ్లోగా వేసిన పాల్ హెన్‌రీడ్ హిట్లర్ బాధ పడలేక 1935లోనే ఆస్ట్రియానుంచి అమెరికాకు వలస వచ్చినవాడు. జర్మన్ ఆఫీసర్‌ మేజర్ స్ట్రాసర్‌గా వేసిన జర్మన్ నటుడు కాన్రాడ్ వెయిడ్‌ట్ భార్య యూదురాలు. నాజీలతో వేగలేక అమెరికాకు పారిపోయి వచ్చి, అనేక అమెరికన్ సినిమాల్లో నాజీ పాత్రలు వేశాడు. డైరక్టర్ కర్టీజ్ హంగరీకి చెందిన యూదు. ఇతను 1926లో అమెరికాకు వచ్చేశాడు కానీ అతని బంధుగణమంతా నాజీల చేతిలో హింసలకు గురైనవారే.

1942లో ప్రారంభమైన షూటింగు ఆ ఏడాదే పూర్తయి నవంబరులో సినిమా రిలీజైంది. సరిగ్గా అదే సమయానికి,  మూడు వారాల క్రితమే మిత్రపక్షాలు కాసబ్లాంకాపై విజయం సాధించారు. సినిమా చివర్లో అప్పటిదాకా దుష్టుడిగా వున్న ఫ్రెంచి పోలీసు అధికారి, తను కూడా హీరోతో కలిసి ప్రతిఘటన ఉద్యమంలో చేరతానని పాల్గొంటానని అంటాడు. తెర బయట కూడా వాస్తవంగా వాళ్ల ప్రయత్నాలు ఫలించాయని చెప్పినట్లవడంతో సినిమాను అమెరికన్ ప్రజలు ఎంతగానో ఆదరించారు. మొదటిసారి కంటె తర్వాతి రిలీజుల్లో మరీ పేరు తెచ్చుకుని క్లాసిక్ అయిపోయింది. ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రంగాలలో 3 ఆస్కార్ బహుమతులు వచ్చాయి.

చివరగా ఓ మాట చెప్పి ముగిస్తాను. ఈ సినిమాలో ఉగార్తే తన దగ్గరున్న పత్రాలు ద గాల్ సంతకం చేసినవి అంటాడు. విచీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి విరోధి ఐన ద గాల్ సంతకం ఎలా చెల్లుతుందాని అనుమానం వచ్చి, నేను పేరు ప్రస్తావించలేదు. కానీ సినిమాను క్షుణ్ణంగా చూసిన ఒక పాఠకుడు యీ విషయాన్ని లేవనెత్తి సందేహం వెలిబుచ్చారు. నా దగ్గర సమాధానం లేదన్నాను. మరో పాఠకుడు యింకా పరిశోధన చేసి ఒరిజినల్ స్క్రిప్టులో విచీ ఫ్రాన్స్ ప్రధాని డార్లాన్ అని వుందని, కానీ దాన్ని తిరగరాయడంలో ఎవరో అసిస్టెంటు ద గాల్ పేరు సుపరిచితం కాబట్టి డార్లాన్ బదులు ద గాల్ పేరు రాశాడని లింకు యిచ్చారు. https://richardlangworth.com/darlan-degaulle-casablanca. దాంతో సస్పెన్స్ విడిపోయింది.

నేను 2008 చివర్లో ‘‘ఎమ్బీయస్ కబుర్లు’’ పేర యీ శీర్షిక మొదలుపెట్టినపుడు తొలి వ్యాసంలో వైషమ్యం లేకుండా మనమంతా కలిసి నేర్చుకుందాం, జ్ఞానాన్ని పెంచుకుందాం అని చెపుతూ గురుకులంలో విద్యార్థులు పఠించే ‘సహనా భవతు’ శాంతి మంత్రాన్ని ఉటంకించాను. ఇలాటి సంఘటనలు ఆచరణలో దాన్ని నిరూపిస్తున్నాయని నాకు సంతోషంగా వుంది. ద గాల్ గురించి ఎలాగూ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరో విషయం కూడా చెప్తాను. రెండవ ప్రపంచయుద్ధానంతరం అనేక ఫ్రెంచ్ వలసదేశాలతో పాటు అల్జీరియా కూడా స్వాతంత్ర్యానికై పోరాడినప్పుడు అప్పటి ఫ్రాన్స్ ప్రభుత్వం (4వ రిపబ్లిక్ అంటారు) దానితో ఎలా వ్యవహరించాలో తెలియక యిబ్బంది పడింది. స్వాతంత్ర్యం యిచ్చేయాలని కొందరంటే అల్జీరియాలో వున్న ఫ్రెంచివాళ్లు ఒప్పుకోలేదు. చివరకు 4వ రిపబ్లిక్ నాయకులు ద గాల్‌ను అధ్యక్షుడిగా చేసి, సమస్యకు పరిష్కారం కనుక్కోమన్నారు. అతను స్వాతంత్ర్యం యిచ్చేదామన్నాడు. దానితో అల్జీరియా ఫ్రెంచ్ వాళ్లు అతన్ని హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. (వాటి ఆధారంగా కల్పించిన నవల, సినిమా ‘‘డే ఆఫ్ ద జాకాల్’’ అద్భుతంగా వుంటాయి, చదవండి, చూడండి).  చివరకు 1962లో అల్జీరియాకు స్వాతంత్ర్యం యిచ్చేశారు. వచ్చేసారి మరో యుద్ధపు సినిమా గురించి రాస్తాను. (ఫోటో – హంఫ్రీ, లారెన్, ఇన్‌సెట్‌లో సతాయించిన మూడో భార్య మేయో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×