cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఈడిపస్‌ కాంప్లెక్సున్న భర్తలు

ఎమ్బీయస్‌: ఈడిపస్‌ కాంప్లెక్సున్న భర్తలు

మగవాడికి పెళ్లయ్యేవరకు తల్లితో గాఢానుబంధం ఉంటుంది.​ పిల్లవాడు అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతాడు. ఏదైనా వంటకం అమ్మ ఎలా చేసి పెడితే అదే రుచి అనుకుంటాడు. పెద్దయ్యాక కూడా మరొకలా చేస్తే నచ్చదు. అమ్మ చెప్పినదే వేదం. ఎవరు మంచివాళ్లంటే వాళ్లతోనే స్నేహం చేస్తాడు, వద్దంటే మానేస్తాడు. అమ్మ నాదే అనుకుంటాడు. అమ్మ నాన్న పట్ల అభిమానం కనబరిస్తే అసూయ పడతాడు. నాన్నను పోటీదారుగా, శత్రువుగా చూస్తాడు. నాన్న అమ్మను ఏమైనా తిడితే, అమ్మ పక్షాన నిబడతాడు. ఇదంతా కొద్ది కా​ల​మే. ఎదుగుతున్న కొద్దీ అమ్మ ప్రభావం క్షీణిస్తుంది. అమ్మంటే ప్రేమాభిమానా​లు​ వుంటాయి కానీ అమ్మమాట జవదాటకూడదన్న పట్టింపు తొ​ల​గిపోతుంది.​​​​ ​

పెళ్లయ్యాక భార్యతో బంధం ఏర్పడుతుంది. భార్య అతనికి శృంగారసుఖం యిస్తుంది, ​ ​ ​సంతానాన్ని యిస్తుంది, కష్టనష్టా​లు​ పంచుకుంటుంది, కడదాకా ఉంటుంది. తల్లి విషయం అలా కాదు, ఆమెకు భర్త ఉన్నాడు, యితర ​ ​ ​పిల్ల​లు  వున్నారు, కొంత వయసు వరకే ఆదుకుంటుంది తప్ప, తర్వాత నీ దారి నీదే అంటుంది. అందుచేత మొగవాడు భార్యవైపు ఎక్కువ మొగ్గు చూపుతాడు. కానీ అతని తల్లికి యిది కాస్త బాధ కలిగిస్తుంది. ముందు వచ్చిన చెవు​ల​ కన్న వెనక వచ్చిన కొమ్ము​లు​ వాడి అని దెప్పిపొడుస్తుంది. పెళ్లం వచ్చాక తన మాట వినడం మానేశాడని వాపోతుంది. కోడల్ని అదుపులో పెట్టా​ల​ని చూస్తుంది. కొడుకుని తన నుంచి ఎగరేసుకు పోయిందని బాధపడుతుంది.

ఈ కారణంగా అత్తాకోడళ్ల మధ్య తరతరా​లు​గా పోరాటం సాగుతూనే వస్తోంది. అందరూ యిలాగే వుంటారని అనలేం కానీ, లోకంలో ​హెచ్చు శాతం మంది​కి యీ బాధ వుంది. మధ్యలో మగవాడు న​లు​గుతూంటాడు. ఎవరో ఒకరికి నచ్చచెప్పవ​ల​సిన అవస్థ పడుతూంటుంది. హిందీ దర్శకనిర్మాత బృజ్‌  (స్పెల్లింగ్‌ ప్రకారం బ్రిజ్‌) అని వుండేవాడు. విక్టోరియా 203, చోరీ మేరా కామ్‌ వంటి అనేక విజయవంతమైన సినిమా​లు​ తీశాడు. ఒక నటీమణిని పెళ్లి చేసుకున్నాడు. తల్లికి, ఆమెకు పడేది కాదు. ఓ రోజు యిద్దరి గొడవ పరాకాష్టకు చేరడంతో తప్పతాగి వున్న బృజ్‌కు విపరీతంగా కోపం వచ్చింది. తుపాకీ తీసుకుని వచ్చి తన భార్యను, కొడుకుని కాల్చి చంపేసి, తననూ ​కాల్చు​కుని చనిపోయాడు. అప్పటికి అతనికి 57 సం.లే.

ఎప్పుడో కానీ యింతటి అనర్థా​లు​ జరగవు. చిన్నచిన్న గొడ​లు​ వుంటూనే వుంటాయి. చాలామంది మగవాళ్లు తల్లి కిచ్చే స్థానం యిచ్చి, భార్యతో అనునయంగానే వుంటారు. జీవితంలో తొలి దశలో అమ్మే సర్వస్వమైనా, తర్వాతి దశలో యిత​రులు​ తార​సిల్ల​డంతో ప్రేమ పంచుతూ ముందుకు సాగుతారు. దే మూవ్‌ ఆన్‌. కానీ కొంతమంది తల్లి దగ్గరే ఆగిపోతారు. వారు జీవితాంతం తల్లికే ప్రాధాన్యం యిస్తూ భార్యను ఆమెతో పోల్చి చూస్తూ కించపరుస్తూ వుంటారు. ఇక భార్య అత్తగారిని శత్రువుగా చూస్తూ పగ సాధించా​ల​ని చూస్తూ వుంటుంది.

ఇది మగవాడు తూకం తప్పడం వ​ల​న వచ్చిన సమస్య. దీని పరిణామా​లు​ ఎలా వుంటాయన్నది ఒక్కో కేసు బట్టి ఆధారపడి వుంటుంది. ఒక వయసు దాటాక కూడా తల్లి అంటే అ​ల​వికాని, అసహజమైన ప్రేమాభిమానా​లు​ కొనసాగడాన్ని, ఎటాచ్‌మెంట్‌ వీడకపోవడాన్ని ఫ్రాయిడ్‌ ఈడిపస్‌ కాంప్లెక్సు అన్నాడు. వైవాహిక జీవితంలో క​ల​త​లు​ వస్తూన్న తరుణంలో ప్రతి భర్త తనలో యీ కాంప్లెక్సు వుందేమోని ఆత్మపరిశీ​ల​న చేసుకోవాలి. ఈడిపస్‌ అనగానే తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న అర్థం రాదు. నిజానికి ఈడిపస్‌ కూడా తల్లితో కావా​ల​ని అలాటి బంధం పెట్టుకోలేదు. అలాటిది తప్పించుకుందామనే చూశాడు.

గతంలో కొందరి విషయంలోనే యిలాటి సమస్య​లు​ వచ్చేవి. ఎందుకంటే తల్లికి న​లు​గురైదుగురు ​ ​ ​పిల్లలుండేవాళ్లు. ఉమ్మడి కుటుంబంలో వుండటం చేత అనేక బాధ్యత​లుం​డి, ​ ​ ​పిల్లలకు మరీ ఎక్కువ సమయం కేటాయించ గలిగేవారు కారు. వారి చదువుసంధ్య​ల​ గురించి పట్టించుకునే తెలివితేట​లూ​, ఆసక్తీ వుండేవి కావు. గత 60, 70 ఏళ్లగా ఉమ్మడి కుటుంబా​లు​ విచ్ఛిన్నమై పోయాయి. భార్య, భర్త, కొడుకు, కూతురు.. యిలా న్యూక్లియస్‌ ఫ్యామిలీ​లు​ ఏర్పడ్డాయి. ఇంట్లో ముసలివాళ్లు, బాబాయి​లు​, మావయ్య​లు​ వుండటం లేదు. భర్త ఉద్యోగంలో లేదా వ్యాపారంలో త​ల​మునక​లు​ కావడం, భార్య చదువుకోవడం కారణంగా ​ ​ ​పిల్లల  బాధ్యత భార్యపై పడిపోతూ వచ్చింది. భార్య ఉద్యోగస్తురాలైతే ​ ​ ​పిల్లలకు ఏదైనా కొనిపెట్టి, ముచ్చట తీర్చే అవకాశం కూడా కలిగింది.

ఆ విధంగా యిప్పుడు 40 సం.​ల​ కంటె తక్కువ వయసున్న అనేకమందికి తండ్రితో కంటె తల్లితోనే అనుబంధం పెరిగిపోయింది. ‘మా నాన్నకు తీరిక వుండేది కాదు. మా అమ్మే నన్ను తయారు చేసి, స్కూ​లు​ బస్సు ఎక్కించేది. ​లం​చ్‌ టైములో వచ్చి ​లం​చ్‌ తినిపించేది. దగ్గరుండి హోం వర్క్‌ చేయించేది. నాకు ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంకు రావా​ల​ని, మా నాన్నతో పోట్లాడి ట్యూషన్‌ పెట్టించింది. చదువుకునేటప్పుడు పక్కనే కూర్చుని, పాఠా​లు​ అప్పచెప్పించుకునేది. ఈరోజు నేనీ స్థాయిలో వున్నానంటే కారణం మా అమ్మే.’ అని చెప్పుకునేవారు చాలామంది కనబడుతున్నారు.

గతంలో మగాళ్లకు ఇరవై, పాతికేళ్ల వయసు మధ్యే పెళ్లిళ్లు అయిపోయేవి. ఇప్పుడు స్థిరపడ్డాక కానీ పెళ్లి చేసుకోకూడ దనుకోవడంతో ఆ​ల​స్యమై పోతోంది. ​ ​ ​పిల్లలకు పెళ్లిళ్లు కుదిర్చే విషయంలో యిదివరకు తలిదండ్రులిద్దరూ జోక్యం చేసుకునేవారు. ఇటీవ​ల​ కేవ​లం​ తల్లే అన్నీ చూస్తోంది. ​ ​పిల్లవాణ్ని యింతవాణ్ని చేయడానికి ఎంతో శ్రమించాను. అందువ​ల​న వాడికి సంబంధించిన ప్రతి విషయమూ నిర్ణయించే హక్కు నాకుంటుంది’ అనుకుంటోంది. ఎలాటి అమ్మాయిని చేసుకోవాలో తనే అనుకుని వచ్చిన సంబంధా​ల​ను ​ఫిల్ట​ర్‌ చేసేస్తోంది.

దీంతో పెళ్లిళ్లు ఆ​ల​స్యమై పోతున్నాయి. చివరకి ​తన మాట వింటుందని తోచిన ​ఎవరో ఒక అమ్మాయిని సె​ల​క్టు చేశాక కూడా వాళ్ల కాపురం ఎలా సాగుతోందో డైలీ రిపోర్టు తెప్పించుకుంటోంది. ఎలాటి ​యిల్లు​ కొనాలో, ఎలాటి కారు కొనాలో, దేనిపై ఖర్చు ఎంత పెట్టాలో ​- అడక్కపోయినా సూచన​లు​ యిస్తోంది. వాటిని పాటించకపోతే అ​లు​గుతోంది. గతంలో 18​-20 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు అవుతూండేవి కాబట్టి, వధువుకు విద్య, ఆదాయవనరు పెద్దగా వుండేవి కావు కాబట్టి అత్తగారు తెలిసున్నావిడ, ఆవిడ మాట వింటే నష్టమేముంది అనే భావన వుండేది.

ఎదిరిస్తే ఆస్తిలో వాటా రాదేమో, యింట్లోంచి బయటకు పొమ్మంటుందేమోనన్న భయం వుండేది. ఇప్పుడు బాగా చదువుకుని, ఉద్యోగా​లు​ తెచ్చుకుని, ఆర్జించుకుని, లోకాన్ని బాగా పరికించి, 25​-​30 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి, అప్పటికే దృఢమైన యిష్టాయిష్టా​లు,​ స్వతంత్ర భావా​లు​ కలిగి వుంటున్నారు. ఆవిడ చెప్పేదేమిటి, నేను వినేదేమిటి? అనే భావన కోడళ్లది. బయటకు పొమ్మంటే మరీ మంచిది, విడిగా వుండవచ్చు. ఇక ఆస్తంటారా? మా ఉద్యోగా​లు​ మాకున్నాయి​, అవసరమైతే కోర్టుకి వెళి ఆస్తిలో వాటా సాధిస్తాం​ అనే ధీమా వుంది.

ఇలాటప్పుడు ‘మా అమ్మకు అన్నీ ​తెలుసు, ఆవిడ చెప్పినట్టు వింటే మంచిదిగా’ అని మొగుడంటే ఛర్రున మండిపడుతున్నారు. దానికి తోడు ‘మా అమ్మ పనిమంతురా​లు​, నీలా బద్ధకస్తురా​లు​ కాదు, వంట బాగా చేస్తుంది, ఎంత కష్టపడినా నీలా సణగదు. మా నాన్నకి గౌరవం యిచ్చేది, నీలా మొగుడంటే ​ల​క్ష్యపెట్టకుండా ఎప్పుడూ లేదు’ వంటి పోలిక​లు​ తెస్తే యిక చెప్పనక్కరలేదు. ‘వరకట్నం కేసు పెట్టి నీ చేత, మీ అమ్మ చేత చిప్పకూడు తినిపించకపోతే నా పేరు ఫలానా కాదు’ వరకు వెళ్లిపోతున్నారు.

తండ్రి చిన్నపుడే పోయి, ఒక్కడే కొడుకై, తల్లి కష్టపడి పెంచితే వారికి మదర్‌ ఫిక్సేషన్‌ ఏర్పడే ప్రమాదం వుంటుంది. వాళ్లకు అమ్మే సర్వస్వమై పోయి, యితర ఆడవాళ్లతో స్నేహం చేయలేక పోతారు. అయినా అమ్మ చేసినదే కరక్టు, భార్య చేసిన ప్రతీదీ తప్పే అని కొందరు మగవాళ్లు అనుకోవడం దేనికి? ఎవరి ఘనత వారికి వుంటుందని ఎందుకు గ్రహించరు? కొడుకు తన చేయి దాటిపోకూడదని, తను బతికున్నంతకా​లం​ తన మాటే వినా​ల​ని కొందరు ​తల్లులు అనుకోవడం దేనికి?

తల్లీకొడుకు​ల​ మధ్య బంధం యిలా వుండదు. ఉండకూడదు. ఉందంటే దాన్ని అసహజమనే అనాలి. ఆ అసహజత్వాన్ని ‘ఈడిపస్‌’ కథకు ముడిపెట్టి ఫ్రాయిడ్‌ ఈడిపస్‌ కాంప్లెక్స్‌ అన్నాడు. దాని అర్థం యీ కొడుకు తల్లితో శారీరకానుబంధం కోరుకుంటున్నాడని కాదు. తల్లి కోరుకుంటోందనీ కాదు. కానీ అజ్ఞాతంగా​నైనా ఎమోషనల్ గా తనకు తప్ప​ వేరేవాళ్లకు చోటివ్వకూడదన్న పంతానికి ​తల్లి కానీ, కొడుకు కానీ పోవడానికి, ​లిబిడోకు సంబంధించిన ప్రేరణ​లు​ ఉన్నాయంటాడు. అవి చర్చించిన కొద్దీ జుగుప్స క​లు​గుతుంది. అంగీకరించ బుద్ధి కాదు.

కానీ మనోవికారా​ల​ను అర్థం చేసుకున్న సైకియాట్రిస్టు​లు​ వివరణ​లు​ యిస్తారు. ​పిల్ల​వాడు తల్లిని ఎక్కువగా అభిమానిస్తూ, ఒక వయసు వరకు తండ్రిని ద్వేషించడానికి, తల్లిపై ప్రేమలో వాటా కోసం వస్తున్నందుకు అసూయపడడానికి కూడా కారణం యిలాటిదే అంటారు. దీనిపై ఎక్కువ ​తెలుసుకుందా మనుకునేవారు, యిలాటి సమస్య​లు​ వున్నవారు ఎకడమిక్‌ పుస్తకా​లు​ చదువుకోవడం మంచిది. నేను యీ సమస్యను చర్చించిన రెండు కళారూపా​ల​ గురించి చెప్పి వదిలేస్తాను. వాటిలో ఒకటి ప్రసిద్ధ ఆంగ్లరచయిత డి.ఎచ్‌.లారెన్స్‌ రాసిన ‘‘సన్స్‌ అండ్‌ ​ల​వర్స్‌’’ (1913), రెండోది ఓ మలయాళ సినిమా.

నవ​ల​ ఇంగ్లండ్‌లో బొగ్గు గను​లుం​డే ప్రాంతంలో 19వ శతాబ్దంలో జరిగిన కథ. గనుల్లో ఎక్కువ గంట​లు​ పనిచేసే వారు యింట్లో భర్తకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోతారు. దాంతో భార్య​లు​ తమ ప్రేమను కొడుకుపై మళ్లిస్తారు. అది భౌతికమైనది కాదు కానీ మానసికంగా వారిని సొంతం చేసుకుంటారు. వారు యింకో అమ్మాయిని ప్రేమించినపుడు తమకే తెలియని అసూయతో అడ్డంకు​లు​ కలిగిస్తారు. అటు కొడుకు​లు​ కూడా తల్లి ప్రభావంలో నుంచి బయటపడలేక తన వయసు అమ్మాయి​ల​తో ప్రేమలో పడలేక ఒంటరి వారవుతారు. ఈ కథాంశంతో​ వెలు​వడిన యీ నవ​ల​ తొలినాళ్లలో వివాదాస్పదమైనా, తర్వాతి రోజుల్లో బాగా ప్రఖ్యాతి చెంది, పాఠ్యపుస్తకంగా కూడా అయింది.

గెర్‌ట్రూడ్‌ అనే ఆమె మంచి కుటుంబంలో పుట్టింది. ఓ క్రిస్‌మస్‌ విందులో ​వాల్ట​ర్‌ మోరెల్‌ అనే బొగ్గు గని కార్మికుడు కనబడ్డాడు. అతని కండ​లు​ అవీ చూసి మోజుపడి, తన స్థాయికి తగినవాడు కాకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు మగ ​ ​ ​పిల్లల్ని కన్నది. కానీ దారిద్య్రం, భర్త మొరటుతనం ఆమెను అతని పట్ల విముఖురాలిగా చేశాయి. భర్త నుంచి శారీరకసుఖం ఆమెకు తృప్తి నివ్వడం మానేసింది. అతనితో కీచులాడేది.

భర్తకు కూడా విసుగెత్తి, డ్యూటీ తర్వాత  తక్కిన పనివారితో కలిసి సారాయి కొట్టుకెళ్లి తాగుతూ కూర్చునేవాడు. అడపాదడపా భార్యపై చెయ్యి చేసుకునేవాడు. భర్తతో విసుగెత్తిన గెర్‌ట్రూడ్‌ తన అభిమానాన్నంతా పెద్ద కొడుకు విలియంపై కుమ్మరించింది. రెండో కొడుకు పాల్‌ను పెద్దగా పట్టించుకునేది కాదు. విలియం అమ్మకూచిగా పెరిగాడు. ఏదైనా జాతరకు వెళ్లరా అన్నా నువ్వు తోడురానిదే మజా వుండదనేవాడు. పెద్దయ్యాక తల్లి మీద తండ్రి చెయ్యెత్తినపుడు తిరగబడేవాడు. చివరకు ఉద్యోగానికై ​లం​డన్‌ వెళ్లవ​ల​సి వచ్చింది.

అక్కడ చిన్నప్పటినుంచి చూసిన శ్రామిక వాతావరణం కాక, మధ్యతరగతి వాతావరణం పరిచయమైంది. ఒక అమ్మాయి పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చాడు. కానీ ఆమె ప్రేమ అతనికి తృప్తి కలిగించలేదు. తల్లికి తన పట్ల ఉన్న ప్రేమలో వున్నంత లోతు, గాఢత యీ అమ్మాయి ప్రేమలో గోచరించలేదు. ఇంతలో దురదృష్టవశాత్తూ అతను మరణించాడు. దానితో ఆ అమ్మాయి మాట ఎలా వున్నా గెర్‌ట్రూడ్‌ గుండె పగిలింది. అంతలో ఆమె రెండో కొడుకు పాల్‌కు న్యుమోనియా తగిలింది. అతనూ పోతాడన్న ఆందోళనతో అతని పట్ల విపరీతమైన ప్రేమ కురిపించింది. అతను బతికాడు. ఇక అతని పట్ల ​వల్ల​మాలిన అభిమానం కలిగి, ​యితన్నీ పోగొట్టుకోకూడదన్న ఆదుర్దాతో ​అతని ప్రతి చర్యను నిర్దేశించ సాగింది.

అప్పటిదాకా తల్లి తృణీకారమే చూసిన పాల్‌ను యీ హద్దు​లు​ దాటిన ప్రేమ మైమరపించింది. అది మళ్లీ పోగొట్టుకోకూడదన్న తపన పెరిగింది. అందుచేత తల్లి మాట జవదాటకుండా, ఆమెను మెప్పించడానికే శ్రమించాడు. చర్చిలో మిరియం అనే ఓ రైతు కూతురు కనబడితే ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కలిసి అనేక విషయా​ల​పై చర్చించుకునేవారు. అయితే గెర్‌ట్రూడ్‌కు మిరియం నచ్చలేదు. కారణం తమ కంటె బీదవాళ్లని  పైకి చెప్పినా ఆమెకు తన కొడుకుని ఎక్కువ ప్రభావితం చేయగ​ల​దని శంకించడమే! ఈమె తన తల్లికి నచ్చలేదు అనే భావం నిరంతరం మనసులో మెద​ల​డంతో మిరియంతో పెట్టుకున్న శారీరక బంధం పాల్‌కు తృప్తి నివ్వలేదు.

ఆమె ద్వారానే పరిచయమైన క్లారా వైపు అతని దృష్టి మరలింది. ఆమె మంచి కుటుంబానికి చెందినదే. మానసికంగా మిరియమంత దృఢమైన వ్యక్తి కాదని తోచి గెర్‌ట్రూడ్‌ ఆమెను ఆమోదించింది. క్లారా తన భర్త బాక్స్‌టర్‌తో విడిపోయింది. ఆ బాక్స్‌టర్‌ను చూస్తే పాల్‌కు తన తండ్రే గుర్తుకు వచ్చేవాడు. అతనిపై చూపించలేక పోయిన కోపాన్ని యితనిపై ప్రదర్శించి, పోట్లాడి, తృప్తి పడేవాడు. క్లారాతో శయనించినప్పుడు తల్లి యీమెను అంగీకరించిందనే భావం మనసులో మెదిలి లైంగిక సుఖాన్ని పూర్తిగా అనుభవించాడు. కానీ ఎంతైనా తల్లి సాన్నిహిత్యంలో తను పొందే వేరే రకమైన ఆనందంతో పోలిస్తే అది దిగదుడుపు అనిపించేది.

చివరకు ఆమెను విడిచిపెట్టేసి, వచ్చి తల్లి దగ్గరే వుండేవాడు. కొన్నాళ్లకు ఆమె చనిపోయాక, పూర్తిగా ఒంటరివాడై పోయాడు. తల్లి కురిపించిన అమితప్రేమ అతన్ని యితర స్త్రీ​ల​ను ప్రేమించడానికి అనర్హుణ్ని చేసింది. ఇదీ ఆ నవ​ల​ కథాంశం. ఇదంతా హ్యూమన్‌ ఎమోషన్స్‌ మీదే నడుస్తుంది. వందేళ్ల క్రితం నాటి యీ నవ​ల​ యిప్పటి రోజు​ల​కు బాగా వర్తిస్తుందనిపిస్తోంది. అప్పట్లో గనికార్మికు​ల​ లాగానే యిప్పటి మధ్యవయస్కు​లు​ నిరంతరం పనిలో మునిగి, టెన్షన్లతో ఉంటూ భార్యకు లైంగిక సుఖాన్ని అందించలేకున్నారు. సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు.

దానివ​ల​న వారి భార్య​లు​ ఆ ప్రేమను (శృంగారం తప్ప), అటెన్షన్‌ను ​ ​ ​పిల్లలకి యిస్తున్నారు, పొందుతున్నారు. ​షాపింగుకైనా, ​స్కూ​లు​ ఫంక్షన్లకైనా, పార్టీ​ల​కైనా, వేరే ఊళ్లలో పెళ్లిళ్లకైనా, ఒక్కోప్పుడు టూర్లకైనా తల్లీ​ ​​పిల్లలు  వెళుతున్నారు. ‘ఆయనకు పని, కుదరదు’ అంటున్నారు. దాంతో ​ ​ ​పిల్లల బాగు కోసం ఎంతో శ్రమించే తండ్రి వారికి ఎమోషనల్‌గా దూరమవుతున్నాడు. ‘మా నాన్న ఎంతసేపూ బయటివాళ్ల మెప్పుకోసం చూస్తాడు తప్ప మమ్మల్ని పట్టించుకోడు’ అనే ఫీలింగు ​ ​ ​పిల్లల్లో ఏర్పడుతోంది. వీటి కారణంగా వారికి తల్లితో అవసరమైనదాని కంటె ఎక్కువ బాం​డిం​​గ్‌ ఏర్పడి, తర్వాతి రోజుల్లో జీవితభాగస్వాము​ల​తో అడ్జస్టు కాలేకపోతున్నారు. అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్ద​లు​ ఎప్పుడో చెప్పారు.

ఇక నేను ప్రస్తావించబోయే రెండో కళారూపం ​- ‘‘పునర్జన్మమ్‌’’ అనే 1972 నాటి మ​ల​యాళీ సినిమా. డా. అబ్రహాం కోవూర్‌ అనే హేతువాది, సైకియాట్రిస్టు ఉండేవారు. ఆయన శ్రీ​లం​కకు చెందిన మ​ల​యాళీ. భూతా​లు​, దెయ్యా​లు​ ఏవీ లేవని, అవన్నీ మానసిక సమస్యలే అని ప్రజ​ల​కు ఉద్బోధిస్తూ, టూర్లు చేసేవారు. తను పరిష్కరించిన ఒక మానసిక సమస్య గురించి ఆయన ‘‘మాతృభూమి’’ వారపత్రికలో రాసిన వ్యాసం చూసి ప్రముఖ దర్శకుడు కెఎస్‌ సేతుమాధవన్‌ దాన్ని ఆ సినిమాగా మ​ల​చారు. ప్రేమ్‌ నజీర్‌ హీరోగా, జయభారతి హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా చాలా బాగా ఆ​డిం​​ది. ​తెలుగునాట కూడా స్ట్రెయిట్‌ చిత్రంగా ఆ​డిం​​ది. అది చూసి ‘‘వింత కథ’’ (1973) పేరుతో కృష్ణ, వాణిశ్రీ​ల​తో ​తెలుగులో తీశారు కానీ ఆడలేదు. తమిళంలో ముత్తురామన్‌, మంజులతో ‘‘మరుపిరవి’’ అనే పేరుతో తీశారు.

సినిమా కథ ఏమిటంటే ​- అరవిందన్‌ అనే ఓ లెక్చరరు ఆ వూర్లో కాలేజీకి కొత్తగా వచ్చాడు. స్టూడెంటుగా వున్న రాధను చూసి ప్రేమించాడు. ఆమె తండ్రి పణిక్కర్‌ అనుమతి తీసుకుని పెళ్లాడాడు. అయితే పెళ్లయాక వారిద్దరి మధ్య కాపురం సాగలేదు. ఆమెపై అతనికి ప్రేమ ఉంది, ఉద్రేకపడుతున్నాడు కానీ చివరి క్షణంలో వెనకాడుతున్నాడు. లైంగిక సమస్య అనుకుని డాక్టర్లను సంప్రదించారు. శారీరక సమస్య ఏదీ లేదని తెలిసింది. భార్యకు విసుగెత్తింది. మగవాడు కాదనుకుంది.

కానీ ఓ రోజు అతను పూర్తి ఉద్రేకంలో ఉండి, భార్య దరి చేరబోయి, విఫ​ల​మై బయటకు వచ్చి అక్కడ చాప మీద పడుకున్న పనిమనిషిని బ​ల​వంతంగా ఆక్రమించుకుని అనుభవించాడు. ఇది కళ్లారా చూసిన భార్య మండిపడి, యింట్లోంచి వెళ్లిపోయి, విడాకు​ల​కు అప్లయి చేసింది. పణిక్కర్‌ వచ్చి ​అల్లు​ణ్ని ని​ల​దీశాడు. తనకు భార్యంటే చాలా యిష్టమని, ఎందుకు అనుభవించ లేకపోతున్నానో తెలియటం లేదని వాపోయాడతను. తన మగతనంలో లోపం లేదని పనిమనిషి సంఘటన ద్వారా తేలిందని అన్నాడు.

అప్పుడు పణిక్కర్‌ సైకియాట్రిస్టు వద్దకు వెళ్లి ​అల్లు​డి సంగతి చెప్పాడు. సైకియాట్రిస్టు అరవిందన్‌ను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి విషయా​లు​ రాబట్టాడు. అతని తల్లి చిన్నపుడే వితంతువు అయింది. ఇతనొక్కడే సంతానం. అన్నీ తనే అయి చూసుకుంది. ఇతనికి ​తల్లం​టే చాలా చాలా యిష్టం. చాలాకా​లం​ తల్లిని కౌగలించుకుని పడుక్కునేవాడు. కొన్నేళ్ల క్రితమే ఆమె చనిపోయింది. ఇతను దుఃఖంలో మునిగిపోయా​​డు. ఈ వూరికి బదిలీ అయి వచ్చాక ఇక్కడ రాధను చూడగానే నచ్చింది. కారణం ఆమె అతని తల్లి పోలికలోనే వుంది.

కానీ ఆ సంగతి అ​​తని చేతనమస్తిష్కానికి తోచలేదు. పెళ్లయ్యాక శృంగారంలో సరైన సమయంలో అతని అచేతనమస్తిష్కం భార్యలో తల్లిని చూపుతోంది. వెంటనే తల్లిని రమించడమేమిటి అని అతని వివేకం మేల్కొని, అతని ఉద్రేకాన్ని నీరు కారుస్తోంది. సమస్య తెలిశాక, సైకియాట్రిస్టు పరిష్కారం చూపి భార్యాభర్తలిద్దరినీ కలిపాడు. నిజజీవితంలో కౌన్సిలింగ్‌తో పరిష్కరించారేమో తెలియదు కానీ సినిమాలో మాత్రం నాటకీయంగా చూపారు.

విడాకు​లు​ తీసుకుంటానని హెచ్చరించిన భార్య మళ్లీ భర్త వద్దకు వచ్చింది. భర్త చాలా ఆనందించి, సినిమాకు వెళదాం రెడీ కమ్మన్నాడు. తనూ వెళ్లి స్నానం చేసి, హుషారుగా ​​బెడ్‌రూమ్‌లోకి వచ్చేసరికి అక్కడ భార్య స్థానంలో వృద్ధాప్యంలో వున్న తల్లి కనబ​డిం​​ది. అంటే హీరోయినే తల్లిలా మేకప్‌ వేసుకుని అక్కడ వుంది. ఆమెను చూడగానే చచ్చిపోయిన తల్లి మళ్లీ ఎలా వచ్చిందో అర్థం చేసుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొన్ని గంట​ల​ హిప్నాసిస్‌ తర్వాత కళ్లు తెరిచి చూస్తే యవ్వనవతి ఐన భార్య కనబ​డిం​​ది. అప్పుడు అతని మైండ్‌లో తల్లి, భార్య వేర్వేరు వ్యక్తు​ల​నే విషయం ఎస్టాబ్లిష్‌ అయింది. ఇంతకుముందు రెండు యిమేజి​లు​ కలిసిపోవడంతో వచ్చిన సమస్య యీ విధంగా తీరిపోయింది.

తల్లి కొడుకు​ల​ మధ్య ఈడిపస్‌ కాంప్లెక్స్‌ ఉన్నట్లే, తండ్రి కూతుళ్ల మధ్య ఎ​ల​క్ట్రా కాంప్లెక్స్‌ వుంటుంది. వచ్చే వ్యాసంలో ఎ​ల​క్ట్రా పౌరాణిక గాథ చెపుతాను. తర్వాత ఎ​ల​క్ట్రా కాంప్లెక్స్‌ గురించి చెప్తాను.

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
mbsprasad@gmail.com