cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హుజూరాబాద్ ఫలితం

ఎమ్బీయస్‍:  హుజూరాబాద్ ఫలితం

నెల్లాళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఉపయెన్నికల విశ్లేషణలతో పునఃప్రారంభిస్తున్నాను. విరామానికి కారణం అనారోగ్యం కాదు, వ్యక్తిగతంగా వుండే యితర ఆసక్తులు. ఉపయెన్నికల గురించే చర్చ ఎందుకంటే, ఫలితాలు విచిత్రంగా వున్నాయి. దేశంలో మోదీ ప్రభకు ఎదురు లేకుండా వుందని సర్వేలు చెపుతున్నాయి. ప్రతిపక్షాలు ఏవీ పుంజుకోలేదు. ప్రధాన ప్రతిపక్షం, దేశమంతా ఉనికి వున్న కాంగ్రెసయితే మరీ అధ్వాన్నం. ప్రశాంత కిశోర్ చెప్పినట్లు రాహుల్ గాంధీ ఊహాసౌధాల్లోనే వుంటూ పార్టీకి గుదిబండగా మారాడు.

ఇలాటి పరిస్థితుల్లో కూడా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలితంలో వచ్చిన ఫలితాలలో 29 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి దక్కినది ఏడే! మూడు చోట్ల డిపాజిట్ గల్లంతు. మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి రెండిట్లో ఓడిపోయింది. అధికారంలో వున్న అసాంలో సొంతానికి 3, మిత్రపక్షానికి రెండు వచ్చాయి. బిహార్‌లో మిత్రపక్షానికి రెండు వచ్చాయి. అధికారంలో వున్న యితర రాష్ట్రాలలో హరియాణాలో పోటీ జరిగిన ఒక చోటా ఓడింది. హిమాచల్‌లో అయితే మూడిట్లోనూ ఓడింది. మధ్యప్రదేశ్‌లో 3టికి పోటీ జరిగితే 2 బిజెపి గెలవగా, మూడోది కాంగ్రెసు గెలిచింది. కర్ణాటకలో ఒకటి గెలిచింది, మరో చోట, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓడింది. ప్రతిపక్షంలో వున్న బెంగాల్‌లో నాలుగు చోట్లా ఓడింది. రాజస్థాన్‌లో ఓ సీటూ రాలేదు. మహారాష్ట్రలో పోటీ చేసిన ఒక దానిలోనూ ఓడింది. ఆంధ్రలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో మాత్రం గెలిచింది. మొత్తం మీద ఈశాన్యంలో మాత్రమే బలంగా వుంది.

ఈ ఫలితాలన్నిటికి స్థానిక పరిస్థితులు కారణమై వుంటాయి. అందువలన కేవలం అంకెలు మాత్రం చెప్పి వూరుకోకుండా ప్రస్తుతం అక్కడ వున్న రాజకీయవాతావరణం కూడా వివరిద్దామని ఉద్దేశం. ముందుగా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రలో వైసిపి కి బలంగా వుండే కడప జిల్లాలో బద్వేల్ గురించి రాయడానికి పెద్దగా లేదు. గతంతో పోలిస్తే 8% ఓటింగు తగ్గినా, వైసిపి అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధ 1.12 లక్షల ఓట్లతో 90,500 రికార్డు మెజారిటీతో గెలిచారు. ఆమె భర్త 2019లో టిడిపి అభ్యర్థిపై 44700 మెజారిటీతో గెలిచారు. 2019లో 51 వేలు తెచ్చుకున్న టిడిపి ఈసారి బరిలో లేదు కాబట్టి వైసిపి ఆధిక్యత రెట్టింపయింది. పేరుకి నిల్చున్న బిజెపికి 21,700 ఓట్లు వచ్చి డిపాజిట్టు పోయింది. టిడిపి, జనసేన ఓట్లలో కొంత శాతం వాళ్లకు పడ్డాయని సులభంగా ఊహించవచ్చు. ఇక కాంగ్రెసుకు 6200 వచ్చాయి. అంటే నోటాకు రెట్టింపు.

నా దృష్టిలో టిడిపి ఎన్నికలకు దూరంగా ఉండి పొరబాటు చేసింది. ఎన్నికలంటూ వుంటేనే నాయకులకు, కార్యకర్తలకు హుషారు. కాస్త యాక్టివిటీ వుంటుంది. పెద్దాయన జూమ్‌లోనూ, చిన్నాయన ట్విట్టర్‌లోనే యాక్టివ్‌గా వుంటే ఏం లాభం? క్షేత్రస్థాయిలో జండాలు పట్టుకుని తిరిగేవాళ్లెంద రున్నారన్నదే కంటికి కనబడుతుంది. వైసిపి వ్యతిరేక ఓటంతా బిజెపికి వెళ్లిందనుకుంటే 68% పోలింగు జరిగిన యిక్కడ వైసిపికి 76% ఓట్లు పడ్డాయి. ప్రతిపక్షాలకు దక్కింది 24% మాత్రమేనన్నమాట. అధికార పక్షానికి 60%కు మించి ఓట్లు పడితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తమకు ఎదురులేదనే భావం పాలకులకు కలుగుతుంది.

బద్వేల్, హుజూరాబాద్ ఎన్నికలలో కొట్టవచ్చినట్లు కనబడిన తేడా – ధనప్రవాహం! హుజూరాబాద్‌లో ప్రభుత్వం అధికారికంగా పథకాల రూపంలో కుమ్మరించిన నిధులకు తోడుగా, రెండు ప్రధాన పార్టీలు దాదాపు 4-1 నిష్పత్తిలో 250 కోట్లు ఖర్చు పెట్టాయని అంచనా. ఈటల ఓటుకు 1500 యివ్వగా తెరాస 6 వేలు పంపిణీ చేశారని బాహాటంగా అంటున్నారు. ప్రజలు ఏ మొహమాటం లేకుండా తీసుకున్నారు. ఇవ్వకపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసి మరీ తీసుకున్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉపయెన్నికలలో 1500 పలికిన ఓటు హజూరాబాద్ వచ్చేసరికి కెసియార్‌కి యిజ్జత్ కా సవాల్ కావడంతో నాలుగు రెట్లయింది. ఓటర్లందరూ తీసుకున్నారని అనలేం కానీ చాలామందే నిస్సిగ్గుగా తీసుకున్నారట. తెరాస వారు 1.80 వేల మందికి పంచారని ఆంధ్రజ్యోతి భోగట్టా. మద్యం ఏరులా పారిందని అధికారికంగా వెలువడిన మద్యం అమ్మకాల గణాంకాలే చెప్పాయి.

దీనికి విపర్యంగా బద్వేలులో నోట్ల పంపిణీ మాటే బయటకు రాలేదు. ఆంధ్రజ్యోతి సైతం ‘పెద్దగా డబ్బు పంపిణీ అవసరం ఏర్పడలేదు’ అంటూ తేల్చేసింది. తిరుపతి పార్లమెంటు ఉపయెన్నికలోనే ధనప్రసక్తి లేదని పేపర్లే రాశాయి. ఇక టిడిపి పోటీ చేయని సందర్భంలో వైసిపి డబ్బులెందుకు పంచుతుంది? గెలుపుపై ఏ ఆశా లేకుండా బిజెపి ఎందుకు పంచుతుంది? మద్యం మాట ఎలా వున్నా డబ్బు ప్రమేయం లేకుండా బద్వేల్ ఎన్నిక జరిగి వుంటే ఓటర్లను, సంబంధిత పార్టీలను అభినందించాలి. ఆ మాట కొస్తే హుజూరాబాద్ ఓటర్లను ఒకందకు అభినందించాలి. వడేసి డబ్బు పుచ్చుకున్నా, తమకు నచ్చిన అభ్యర్థికే ఓటేసినందుకు, డబ్బుతో పని జరగదని పార్టీలకు గుణపాఠం చెప్పినందుకు! అదొక్కటే కాదు, పథకాల గురించి, పాలన గురించి, ఆత్మగౌరవం గురించి కూడా అనేకవిధాలుగా పాఠాలు చెప్పింది.

‘కెసియార్ దమ్ముంటే హుజూరాబాద్‌లో నన్నోడించు’ అంటూ సవాల్ విసిరి తెరాస నుంచి బయటకు వచ్చిన ఈటల నెగ్గి చూపించారు. దానికిగాను బిజెపిలో చేరి దాని సహకారం తీసుకున్నా యిక్కడ గెలుపు మాత్రం ఈటలదే అని చెప్పి తీరాలి. 2018 ఎన్నికలలో నోటాకు 2867 ఓట్లు వస్తే బిజెపికి 1688 వచ్చాయి. ఇప్పుడు మొత్తం 2.06 లక్షల ఓట్లలో బిజెపికి 1.07 లక్షల ఓట్లు వచ్చాయంటే అది ఈటల చలవ కాదా? అబ్బే కాదు, మూడేళ్లలో బిజెపి బలం అంతగా పెరిగిపోయింది అంటే నాగార్జున సాగర్‌లో డిపాజిట్టు ఎందుకు పోయిందో చెప్పగలగాలి. ఈటల మొహం చూసి ముస్లిములు కూడా బిజెపికి ఓటేశారట. వారి ఓట్లు 5100 వుంటే ఈటలకు ఓటేయాలని ముస్లిం మతపెద్దలతో పాటు తెరాసకు ఆత్మీయంగా వుండే మజ్లిస్ కూడా పిలుపు నిచ్చింది.

2018లో 66 వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసు యిప్పుడు 3014 తో సరిపెట్టుకుంది. దీనికి కారణం బిజెపి, కాంగ్రెసు లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుని తమను ఓడించాయని తెరాస అంటోంది. ఈటల గట్టి పోటీ యిస్తారని, అంతిమంగా ఏదో ఒకలా తెరాస గెలిచేస్తుందని అనుకున్నవారు ఆశ్చర్యపడేలా ఈటల 24వేల మెజారిటీతో గెలవడానికి ఈటల యిమేజి, బిజెపి క్యాడర్ కృషి కారణమని చెప్తూనే కాంగ్రెసు అందించిన మద్దతు కూడా ముఖ్యకారణమని చెప్పి తీరాలి. కెసియార్‌కు బుద్ధి చెప్పాలనే వ్యూహంతో రేవంత్ రెడ్డి నామినేషన్‌కు రెండు రోజుల ముందు దాకా అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను నిర్ణయించలేదని, తర్వాత కూడా ప్రచారం చేయకుండా ఊరుకున్నారని, పార్టీ నేతలు అటువైపు పంపలేదని అనుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఎప్పుడూ దాదాపు 30% ఓట్లు తెచ్చుకునే కాంగ్రెసుకు యీసారి 1.5% ఓట్లు వచ్చాయి. ఓటమికి బాధ్యత నాదే అని రేవంత్ ప్రకటించినా, కాంగ్రెసు అధిష్టానం అతన్ని సంజాయిషీ అడగపోవడానికి వారి ఆలోచనా అదే కావడం!

కెసియార్ తెలంగాణకు రారాజని, తిమ్మిని బ్రహ్మిని చేయగలడని, తలచుకుంటే అందలానికి, లేకపోతే అధఃపాతాళానికి తొక్కేయగలడని, అతని మాటకు ఎదురాడక పోయినా జవాబు చెప్పడానికి సిద్ధపడినా దీర్ఘకాలిక సహచరుడన్న ఆలోచన కూడా లేకుండా పార్టీలోంచి బయటకు నెట్టేసి, అప్పటికప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించి, ప్రత్యర్థిని బజారు కీడ్చగలడని, ఏ నియమాలూ, నిబంధనలూ పట్టించుకోకుండా దుంప తెంపగలడని ప్రచారంలో వుండడం చేత, అతని పార్టీ సభ్యులే కాదు, ఎదుటి పార్టీ సభ్యులు కూడా వణుకుతూ వచ్చారు. ఆ యిమేజిని భగ్నం చేయడానికి ప్రతిపక్షాలే కాదు, కెసియార్ వైఖరితో విసిగిన తెరాస నాయకులు కూడా హుజూరాబాద్‌ను ఉపయోగించుకున్నారు. వారికి లభించిన అస్త్రం ఈటల. ఆర్థికమంత్రిగా, ఆరోగ్యమంత్రిగా చక్కటి పనితీరు కనబర్చడంతో బాటు ఈటలకు సౌమ్యుడిగా మంచిపేరుంది. కెసియార్ అహంభావానికి పూర్తి యాంటీ థీసిస్‌తో కనబడతారు.

కొత్త రాష్ట్రానికి ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటలను ఆ శాఖలో కొనసాగించకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. పెద్దగా ప్రాధాన్యత లేని ఆరోగ్యశాఖ యిస్తే కరోనా కారణంగా దానికీ ప్రాధాన్యత వచ్చిపడింది. కరోనా టెస్టులు, వాక్సినేషన్ యిత్యాది విషయాలలో ఈటల ఎప్పుడు స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసినా, వెంటనే కెసియార్ ఖండిస్తూ తన మాట చెల్లుబాటయ్యేట్లు చూశారు. చివరకు అవినీతి ఆరోపణలు మోపి, హడావుడి విచారణలు జరిపించి, కక్ష సాధిస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేశారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటల అంతా సవ్యంగానే వ్యవహరించారని ఎవరూ అనలేరు. కానీ అంతకు మించిన అక్రమాలు చేసిన తెరాస నాయకులెందరో ఉన్నారని రేవంత్ యిత్యాదులు బయటపెట్టినా కెసియార్ మౌనంగా వుండడమే అనుమానాలకు తావిచ్చింది. పైగా అసైన్‌డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో (ఆయన కొన్నానంటాడు) ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తెరాస ప్రభుత్వం ప్రచారంలో దాని గురించి బలంగా ప్రస్తావించకపోవడంతో ఓటర్లకు ఈటలపై మరింత జాలి కలిగింది.

ఇలాటి ప్రమాదం ఊహించిన కెసియార్ హుజూరాబాద్‌పై ఐదు నెలలుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా విజయావకాశాలున్న నాగార్జునసాగర్‌కు కెటియార్‌ను యిన్‌చార్జిగా పెట్టిన పెద్దమనిషి, దీనికి హరీశ్‌ను తోలారు. పోతే అతని యిమేజే పోతుందని! చిన్న పదవుల్లో వున్న తెరాస నాయకులు సైతం ఈటల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ఈటలపై పోటీ చేసి 2018లో 66వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసు నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ చేశారు. బిజెపిలో వున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డిలను, కాంగ్రెసు, బిజెపి పార్టీల స్థానిక నేతలను తెరాసలో చేర్చుకున్నారు. దళిత నాయకుడు మోత్కుపల్లిని, బిసి నాయకుడు ఎల్ రమణను పార్టీలో చేర్చుకున్నారు. హుజూరాబాద్ స్థానిక నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు యిచ్చారు. ఎస్సీ నేత బండా శ్రీనివాస్‌ను కాబినెట్ ర్యాంకుతో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా, ఈటలపై పోటీ చేసి ఓడిన వకుళాభరణం కృష్ణమోహన్‌ను బిసి కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఓటర్లలో ఎక్కువగా వున్న యాదవకులానికి చెంది, తెరాస విద్యార్థి విభాగం రాష్ట్రాధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌కు టిక్కెట్టిచ్చారు. (వీళ్లెవరి సొంత వార్డుల్లో తెరాసకు మెజారిటీ రాలేదు)

ఈటల తమ స్థాయి నాయకుడు కాదని చెప్పడానికి ఉపయెన్నికలో ప్రచారానికి కెసియార్, కెటియార్ రాలేదు. హరీశ్‌ను దింపారు, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో బృందం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 30 మంది నియోజకవర్గంలో మకాం వేశారు. సంక్షేమ పథకాల బకాయిలు, కొత్త కార్డులు, కొత్త పింఛన్లు, పెండింగు పనుల పూర్తి, సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి పథకాల అమలును ప్రకటించడం. కులసంఘాలకు కోట్ల రూ.ల నిధులు, వారి భవనాలకు స్థలాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని ఋణాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అయినా 22 రౌండ్లలో 2 రౌండ్లలో మాత్రమే తెరాసకు అధిక్యం వచ్చింది. మొత్తం మీద బిజెపి కంటె 23,865 తక్కువగా 83,167 మాత్రం తెచ్చుకుంది. ప్రచారం చివరి దశలో వరి కొనుగోళ్లకు సంబంధించిన అంశాన్ని వరి-ఉరి పేరుతో బిజెపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వాన్ని యిబ్బంది పెట్టడంతో తెరాస దెబ్బ తింది.

ఓట్లు కురిపిస్తుందనుకున్న దళితబంధు పథకం ప్రకటించిన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో బిజెపికి 321 ఓట్లు, తెరాసకు 175. హరీశ్‌రావు దత్తత తీసుకుంటానన్న మామిడాలపల్లిలో తెరాసకు 1037, బిజెపికి 1316. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో తెరాసకు 358, బిజెపికి 549! మొత్తం ఓట్లలో బిజెపికి 52% రాగా, తెరాసకు 40% వచ్చాయి. ఈ ఓటమికి కారణాలేమిటని చర్చ జరుగుతోంది. కెసియారే కాదు, యితర ముఖ్యమంత్రులూ (మరీ ముఖ్యంగా జగన్), రాజకీయ పార్టీలు గమనించవలసినది – సంక్షేమ పథకాలతోనే ఎన్నికలు గెలవలేమని! పరిపాలనా సామర్థ్యం, సమగ్రాభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటారు. తమకు అందుబాటులో వుండాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులు కోరుకుంటారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకే కాదు, స్వపక్షంలోని ఎమ్మెల్యేలను సైతం దూరం పెడుతూ, ‘పథకాల ద్వారా ఓటర్ల హృదయంలో వుంటే చాలు, వారధిగా మీరుంటే ఎంత? లేకపోతే ఎంత?’ అనే ఆలోచనా ధోరణి మంచిది కాదని యీ ఫలితం ఎలుగెత్తి చాటింది. కెసియార్ యిరిగేషన్ పథకాలు వగైరా తెలంగాణలో భూముల విలువలను పెంచాయి. ఎంతోకొంత అభివృద్ధి జరుగుతోంది. కానీ పెత్తందారీ పాలన సహించమని ప్రజలు ఆగ్రహంగా చెప్పారు.

ఆ క్రోధాన్ని వ్యక్తం చేయడానికి ఈటల వంటి మాధ్యమం దొరికింది. చాలా చోట్ల దొరకకపోవచ్చు. హుజూరాబాద్ గెలుపుతో తెలంగాణ మాదే అని బిజెపి మురిసినా పొరబాటే. దానికి ప్రతీ నియోజకవర్గంలో ఈటల లాటి వారు దొరకరు. పరోపకారిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా ఈటలకు చాలా మంచి పేరుంది. ఉద్యమంలో అంతకాలం వుండి కూడా ఆంధ్రుల పట్ల నోరు పారేసుకున్న సందర్భాలు లేవు. కెసియార్ దాష్టీకానికి బలై కూడా, తల వంచుకుని యిన్నాళ్లూ ఉన్నాడన్న సానుభూతి వుంది. ‘నాకే కాదు, హరీశ్‌కూ అవమానాలు జరిగాయి. కానీ మామ కాబట్టి ఆయన సహిస్తున్నాడు.’ అని ఈటల చెప్తూంటే నమ్మబుద్ధవుతుంది. 20 ఏళ్లగా నియోజకవర్గంతో అనుబంధం, సౌమ్యుడనే యిమేజి, అన్యాయం జరిగిందనే సానుభూతి, ఆత్మగౌరవ నినాదం, సొంత క్యాడర్‌కు బిజెపి క్యాడర్ తోడు కావడం, పోలింగుకు ముందు వారం పదిరోజుల పాటు మండలానికో ముఖ్యనేత ప్రచారాన్ని నిర్వహించడం, పోలింగ్ రోజున పోల్ మేనేజ్‌మెంట్ యివన్నీ బాగా పని చేశాయి.

ఇన్ని సమకూడాయి కాబట్టి, బిజెపికి గెలుపు లభించింది. 2018 ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకుని, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెసు ఫిరాయింపులతో 6కి పడిపోయింది. అప్పుడు ఒక స్థానం మాత్రమే గెలుచుకున్న బిజెపి, తర్వాత దుబ్బాక, యిప్పుడు హుజూరాబాద్ గెలిచి 3కి ఎగబాకింది. ఇంకా పైకి వెళ్లడానికి తెరాసలో అసంతృప్తిగా వున్న కొందరు ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించి, పదవులకు రాజీనామాలు చేయించి, మూణ్నెళ్లకోసారి ఉపయెన్నికలు వచ్చేట్లా చూసి, దానిలో గెలిచి, ఆ విధంగా తెరాస నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసి, తెరాసకు కాంగ్రెసు కాదు, తామే ప్రత్యామ్నాయమన్న అభిప్రాయాన్ని ఓటర్లకు కలిగించాలనేది బిజెపి వ్యూహంగా చెప్తున్నారు.

తెరాసలో అసంతృప్త నాయకులకు కొదవ లేదు కానీ, వారిలో ఈటల వంటి వారు చాలా తక్కువమంది. చాలామంది ఫిరాయింపుదారులే, నియోజకవర్గాల్లో పలుకుబడి లేనివారే, అవినీతి ఆరోపణలున్నవారే. రక్షణ లభిస్తుందని వారు బిజెపిలో చేరితే చేరవచ్చు. నిజానికి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరాలాని ఈటల అటూయిటూ చూసిన మాట వాస్తవం. స్వతంత్రంగా పోటీ చేద్దామాని ఊగిసలాడిన మాటా నిజమే. కానీ కెసియార్ విచారణ ఉధృతి పెంచడంతో సర్వపాపాలూ కడిగివేయగల బిజెపి గంగలో మునిగారు. బిజెపి సుదర్శన చక్రాన్ని అడ్డేసింది కాబట్టే కెసియార్ ఆగారు. కరోనా తీవ్రంగా వున్న సమయంలో కూడా వేరే ఏ పనులూ లేనట్లు కలెక్టర్లను యీ పని మీద తరిమిన కెసియార్ ఆర్నెల్లు పోయాక, యిప్పుడు విచారణ పునఃప్రారంభిస్తున్నా మంటున్నారు. తనవైపు వచ్చిన ఎమ్మెల్యేలపై విచారణ సాగకుండా బిజెపి కాపాడవచ్చు కానీ గెలిపించుకోవడం దాని చేతిలో లేదు కదా! ఉద్యమాల ఊపు లేదు కాబట్టి, అభ్యర్థి గుణగణాలపై ఫలితం చాలా భాగం ఆధారపడుతోందిప్పుడు.

ఈ ఎన్నిక సందర్భంగా పథకాల ప్రభావం, ముఖ్యంగా దళితబంధు పథకంపై చాలా చర్చ జరుగుతోంది. కులం ప్రాతిపదికగా యింత ఖరీదైన పథకాన్ని ఏ చర్చా లేకుండా, సంబంధిత వర్గాలను సంప్రదించకుండా, ఆదరాబాదరాగా పెట్టిన కారణంగా యితర వర్గాల్లో అసంతృప్తి కలిగిందంటున్నారు. (సంక్షేమ పథకాల్లో కులపరమైన రైడర్స్ పెడుతున్న జగన్ యీ విషయాన్ని గుర్తించాలి) పథకంలో పెట్టిన షరతుల కారణంగా, హై బజెట్ కారణంగా యీ పథకం నిలిచేనా అని దళితులలో అనుమానం కలిగిందిట. పథకంపై ఆంక్షల కారణంగా అమలుపై సందేహాలూ కలిగాయట. హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చేదాకా సిఎంఓలో ఒక్క దళిత అధికారైనా ఉన్నాడా అని ఈటల అడుగుతున్నారు.

కెసియార్‌తో సన్నిహితంగా మెలిగిన ఈటల యిప్పుడు చాలా విషయాలు చెప్తున్నారు. 2018లో తనను కాదని ఓ విద్యార్థి నాయకుడికి టిక్కెట్టివ్వబోయారట. చివరి క్షణంలో జంకి, టిక్కెట్టిచ్చి, ఆ పై ఓడించడానికి కాంగ్రెసు అభ్యర్థికి డబ్బులిచ్చి తెచ్చారట. గెలిచాక అతను తెరాసలో చేరేందుకు ఒప్పందం. ఇలా 15 చోట్ల కాంగ్రెసు వాళ్లకు డబ్బులిచ్చారట. అందుకనే లాగుంది, వాళ్లు గెలిచాక తెరాసలో చేరారు. ‘వైయస్సార్ ముఖ్యమంత్రిగా వుండగా ప్రతిపక్ష తెరాసలో వుండి కూడా ఆయన దగ్గరకు వెళ్లి పనులు చేయించుకునేవాళ్లం. అలాటిది సొంత ముఖ్యమంత్రి కెసియార్ దగ్గరకు వెళ్లి గోడు సైతం చెప్పుకునే పరిస్థితి లేదు’ అని ఈటల వాపోయారు. ‘అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల తర్వాత నుంచి అధికారాలన్నీ తన దగ్గరే పెట్టుకోవడం ప్రారంభించారు. డబుల్ బెడ్‌రూం యిళ్లపై కడియం, హరీశ్, నాతో కమిటీ వేసి మేం నివేదిక యిచ్చేలోగానే పథకాన్ని ప్రకటించారు. ఏ మంత్రికీ తన శాఖలోని అంశాలపై చర్చించే అధికారం లేదు. ముఖ్యమంత్రే అధికారులను పిలవడం, ఆదేశించడం జరుగుతోంది.’ అని ప్రభుత్వం నడిచే తీరును వివరించారు.

ఇంతకీ బిజెపిలో ఈటల భవిష్యత్తు ఏమిటి? స్వతహాగా అయితే ఆయన తక్కిన యిద్దరు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్‌ల కంటె పెద్ద నాయకుడు. అసెంబ్లీలో బిజెపి నాయకుడు కాగలవాడు. ఇమేజి ప్రకారం బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాదగినవాడు. కానీ సిద్ధాంతరీత్యా, వామపక్షవాది కావడం చేత బిజెపి అతనికి అంతటి స్థానాన్ని యివ్వకపోవచ్చు. పైగా అదుపు తప్పి మాట్లాడే బండి సంజయ్ మార్కు పాలిటిక్స్‌కి, ఆచితూచి మాట్లాడే ఈటల మార్కు పాలిటిక్స్‌కి చాలా తేడా వుంది. తెరాసలోని అసమ్మతివాదులను లాక్కుని వస్తే మాత్రం ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ లాక్కుని రాగలడా? ఈటల స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలిచి వుంటే, అసమ్మతివాదులను ఆకర్షించగలిగేవాడు, ప్రత్యామ్నాయ తెలంగాణ ఉద్యమనేతగా ఎదిగేవాడు. కానీ యిప్పుడు బిజెపి నీడలోకి వచ్చేశాడు. బిజెపి తెలంగాణకు ఏమీ చేయలేదని తెరాస ప్రజల్ని బాగా నమ్మించగలుగుతోంది. స్థానిక బిజెపి నాయకులు ఆ విషయంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితిలో ఈటల ఎంత చెప్పినా, అసమ్మతివాదులు తమ క్షేమం కోసమే బిజెపిలో చేరుతున్నారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఈటల బిజెపి నాయకులలో ఒకడిగా మిగలవచ్చు తప్ప ప్రముఖుడు కావడం కష్టమని అనుకుంటున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!