Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: తలచినదే జరుగుతుందా?

ఎమ్బీయస్: తలచినదే జరుగుతుందా?

‘‘ఆంధ్రలో సర్వే ఫలితాలు’’ ఆర్టికల్‌పై వచ్చిన వ్యాఖ్యలకు అక్కడికక్కడ సమాధానం యిద్దామంటే సాంకేతిక సమస్య వచ్చింది. కొందరు ఈమెయిల్స్ రాశారు. అందరికీ కలిపి సమాధానంగా ఒక ఆర్టికల్ రాయవలసి వస్తోంది. నా వ్యాసంపై కొందరు విరుచుకుపడిన కారణమేమిటంటే, చివర్లో వైసిపికి  2024లో 115-120 సీట్లు రావచ్చని రాయడం! వైసిపి పాలనలో లోపాలు ఎత్తిచూపడం వరకు వాళ్లకు ఓకే. కానీ టిడిపి జాగ్రత్తపడకపోతే వైసిపి 120 వరకు సీట్లు తెచ్చుకోవచ్చు అని రాయడం నచ్చలేదు. వాళ్ల దృష్టిలో వైసిపి పని ఆఖరై పోయింది. టిడిపి కాళ్లు జాపుకుని కూర్చున్నా సరే, వైసిపి మళ్లీ గెలవదు. ఈ సర్వే ఆధారంగా, నేను లెక్కలు వేసి ఆ అంకె చెప్పడం జగన్‌కు మాలీసు చేయడమే అని తీర్మానించారు. గ్రేట్ ఆంధ్ర సర్వే కానీ, దాని ఆధారంగా ఆర్టికల్ రాసిన నేను కానీ మాలీసు చేద్దామనుకుంటే 70% ఓట్లు, అచ్చెన్నాయుడు తరహాలో 160 సీట్లు అని రాసి వుండేవాళ్లంగా! ‘మామూలుగా అయితే 90 సీట్లు రావచ్చు, టిడిపి, జనసేన సరిగ్గా వ్యవహరించకపోతేనే 120 చేరవచ్చు’ అని స్పష్టంగా రాశాను. వాళ్లు చేయవలసిన పనులేమిటో కూడా రాశాను.

అబ్బే అదేమీ అక్కరలేదు, టిడిపి భేషుగ్గా ఉంది, యిప్పుడున్న పరిస్థితుల్లోనే 160 ఖాయం అని టిడిపి అభిమాన పాఠకులు అనుకుంటే అయ్యోపాపం అనుకుంటాను. తలచుకోవడం వేరు, అది జరుగుతుందని భ్రమ పడడం వేరు. తలచినంత మాత్రాన వాస్తవాలు మరుగుపడి పోవు. ‘ఇఫ్ విషెస్ వర్ హార్సెస్, బెగ్గర్స్ ఉడ్ రెయిడ్’ అన్నాడు ఇంగ్లీషువాడు. ‘జగన్ మళ్లీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనమై పోతుందని తెలియదా, అయినా గెలుస్తాడని ఎలా చెప్పారు?’ అంటూ నాపై కొందరు కూకలు వేశారు. అది వేరే ఫ్యాక్టరు, యిది వేరే ఫ్యాక్టరు. యుపిలో యోగి పాలన బాగా లేదని బోల్డు వివరాలిచ్చాను. అయినా అతనే గెలిచేట్లున్నాడని కూడా రాశాను. అనుకున్నదాని కంటె ఎక్కువ సీట్లతో గెలిచాడు. దానికి కారణాలేమిటో విశ్లేషించి చెప్పాను కూడా. అవినీతి, పక్షపాతం లేకుండా సంక్షేమపథకాలు అమలు చేయడం ప్రధాన కారణమని చెప్పాను. మతోన్మాది కాబట్టి యోగి ఓడిపోతాడని నేను రాస్తే, అది తప్పేది కదా!

మోదీ దేశాన్ని చీలుస్తున్నాడని, 2024లో మళ్లీ గెలవకూడదని నాకుండవచ్చు. కానీ జాతీయ రాజకీయాల గురించి ఆర్టికల్ రాయవలసి వస్తే మోదీ ఓడిపోతాడని రాస్తే మీరు నవ్వరా? మతోయిందా అని అడగరా? మన యిష్టాయిష్టాలు వేరు. జరిగేది వేరు. మమతా బెనర్జీ వంటి రౌడీకి అన్ని సీట్లు రావడమా? ఘోరం, గతంలో కంటె తగ్గాల్సింది అని మనం అనుకుంటే కుదరదు. ఏ రాష్ట్రంలోనైనా అధికారపక్షానికి 55% కంటె ఎక్కువ సీట్లు రాకూడదని, ప్రధాన ప్రతిపక్షానికి కనీసం 35% సీట్లు రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. 2019లో జగన్ ఏ 100-110 దగ్గరో ఆగిపోయి వుంటే బాగుండేది అనుకున్నాను. 151 రావడంతో కన్నూమిన్నూ కానకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ఇటు టిడిపి 23 తెచ్చుకుని దానిలో ముగ్గుర్ని పోగొట్టుకుని, తక్కినవాళ్లు నిస్తేజంగా ఉండడంతో ఆంధ్రలో ప్రజాస్వామ్యం చచ్చుబడింది.

టిడిపి ప్రస్తుత పరిస్థితి బాగాలేదు అన్నా దాని అభిమానులైన పాఠకులకు కోపం వస్తోంది. కానీ నా ఆర్టికల్ వచ్చిన రోజునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘‘కొత్త పలుకు’’లో ‘మారాలి బాబూ’ అంటే రెండు కాలమ్స్ రాశారు. ‘2014-19 మధ్య జరిగినదేమిటి? ఎన్నికల్లో ఘోరపరాజయానికి కారణమేమిటి? బాబు బలహీనతలు, వైఫల్యాలు ఏమిటి? - వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి... బలహీనవర్గాలు టిడిపికి దూరమయ్యాయి...బాబు మెతకవైఖరి, మొహమాటం, పిరికితనం వదుల్చుకోవాలి... పోయిన పర్యాయం జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి.. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి.. కనీసం 60%టిక్కెట్లు కొత్తవారికివ్వాలి.. లోకేశ్‌కు జనామోదం రావాలంటే పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేసి, ప్రజలకు చేరువ కావాలి...

‘ఇక బాబు కూడా తన అనుభవం మాట మర్చిపోయి యీ తరం రాజకీయాలకు అనువుగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. టిడిపి నాయకులు త్యాగాలకు సిద్ధం కావాలి. టిడిపి అంటే తమది అనే భావన అన్ని వర్గాల వారికీ కల్పించాలి. పార్టీ కార్యాలయాల్లో కోటరీ వ్యవస్థ నడుస్తోందన్న వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి సమాచారం యథాతథంగా తనవరకు చేరేలా బాబు జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీని కార్పోరేట్ తరహాలో కాకుండా పార్టీలా నడిపి, ప్రజలతో సంబంధం ఉన్నవారిని గౌరవించాలి.  ఒక్కముక్కలో చెప్పాలంటే యిప్పటివరకు కనిపించిన బాబు స్థానంలో సరికొత్త బాబు ఆవిష్కృతం కావాలి.’ ఇదీ ఆయన రాసినదాని సారాంశం. టిడిపికి అత్యంత హితైషి అయిన రాధాకృష్ణ యివన్నీ రాయాల్సి వచ్చిందంటే ప్రస్తుత టిడిపి స్థితి ఏమిటో అర్థం కావటం లేదా? మూడేళ్లగా ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన వైసిపిని ఓడించడానికి యిప్పుడున్న బలం సరిపోతుందా?

మహానాడు సక్సెస్ కావడంతో గుబులు పుట్టి నేను వ్యాసం రాశానని కొందరు అన్నారు. మీటింగులకు వచ్చే జనం బట్టి ఓట్లు రాలవు. పవన్ కళ్యాణ్ మీటింగులకూ జనం వచ్చారు. స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. ఎన్టీయార్ మరణం తర్వాత లక్ష్మీపార్వతి మీటింగులకూ జనం వచ్చారు. ఓట్లేయలేదు. ఎన్నికలు ఒక్కటే కొలబద్ద. తెలంగాణలో బిజెపి ఉత్సాహానికి కారణం ఉపయెన్నికలలో గెలుపు. అలాటిది యిప్పటిదాకా టిడిపి రుచి చూసిందా? స్థానిక ఎన్నికలలో కూడా ఘోరపరాజయమేమిటి? టిడిపి, జనసేన కనీసం బలమైన ప్రతిపక్షంగా మారాలనే నా ఆకాంక్ష. దానికి ఏం చేయాలో రాశాను. రాధాకృష్ణ గారు కూడా బాబు తన అనుభవాన్ని (అనగా ఫ్లాష్‌బ్యాక్‌లను) మర్చిపోవాలని రాశారు కదా! ఇదేమీ చేయకుండా ‘జగన్ దుర్మార్గుడు, 2024లో ఓడిపోతాడు, ఓడిపోవాలి’ అని జపిస్తూ, అలా జరగదేమో అనేవాళ్లను శపిస్తూ కూర్చుంటే దేవుడు వచ్చి మన పనులు చక్కబెట్టడు.

మధ్యతరగతివాళ్లం మనం యింట్లో కూర్చుని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఫలానా నాయకుడు యిలా చేస్తే బాగుండును అనుకుంటాం. కానీ అది జరగదు. 2009 ఎన్నికల ఫలితాలను నేను సరిగ్గా ఊహించానని, నా వ్యాసం చదివి పందెం వేసి 5 లక్షల రూ.లు గెలిచానని ఒక పాఠకుడు రాశారు. జూదమాడడానికి నా వ్యాసం ఉపయోగపడడం విషాదకరం. మేధోపరమైన కసరత్తు వరకే యివి పరిమితమైతే ఆనందిస్తాను. ఆ రోజుల్లో ఉన్న సోషల్ మీడియాలో మహాకూటమి గెలుపు తథ్యం అని పుంఖానుపుంఖాలుగా ఆర్టికల్స్ వచ్చాయి. లోకసత్తా గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని కొందరి హడావుడి. చిరంజీవి ముందు ఎవరూ నిలబడలేరని మరి కొందరి సందడి. గ్లామరున్న చిరంజీవి, మేధోజీవి అయిన జెపి చేతులు కలిపితే టిడిపి, కాంగ్రెసులకు గట్టి ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని నేను ఆశించాను. అలాగే తెరాసతో చేతులు కలిపి దాన్ని బలోపేతం చేయడమనే తప్పును 2004లో కాంగ్రెసు చేసిందని, 2009లో టిడిపి చేయకూడదని ఆశించాను. కానీ నా ఆశలు వమ్మయ్యాయి. వాస్తవ పరిస్థితి చూసి సమైక్యవాదానికి నిలబడిన వైయస్‌కే మళ్లీ గెలుపు రావచ్చని రాశాను.

ఇక్కడ నా యిష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. ఉన్న పరిస్థితి ఏమిటి అనేది గ్రహించి, నా పరిశీలనను పాఠకులతో పంచుకోవడమే నేను చేయవలసినది. నేను ఫలానావాడు గెలుస్తాడని రాసినంత మాత్రాన ఓటర్లంతా పరిగెట్టుకెళ్లి ఓటేయ్యరు. ఫలానా చర్య వలన రాష్ట్రం నాశనమౌతుందని ఓటరు అనుకోకపోతే నేనేం చేయలేను. ఇక కొందరు పాఠకుల వ్యాఖ్యల గురించి చెప్పాలంటే, సర్వే ప్రామాణికత గురించి నాకు తెలియదంటూనే అది వాస్తవానికి దగ్గరగా ఉందని ఎలా అంటారని కొందరు అడిగారు. ఆర్గ్, మార్గ్, టుడేస్ చాణక్య వంటి సంస్థల పేర్లు చెపితే వాళ్ల ట్రాక్ రికార్డు చూసి ప్రామాణికతపై అంచనాకు వస్తాం. వాటికి అనుభవం ఉన్నా, వాళ్ల అంచనాలు తప్పిన సందర్భాలు కోకొల్లలు. ఏ సర్వేలు లేకుండా కేవలం గట్ ఫీలింగ్‌తో మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ చెప్పిన జోస్యం ఫలించవచ్చు. నీకు ప్రామాణికత లేదు కదా, నీ మాటను నమ్మను అని అనలేం. నాకు యిది వాస్తవానికి దగ్గరగా వుందని తోచింది. అది ప్యూర్లీ వ్యక్తిగతం. ఆ సర్వే తప్పని నాకు తోచలేదు. అందుకే దాని ఆధారంగా వ్యాసం రాశాను. వాళ్లు సీట్ల సంఖ్య రాయలేదు. నేను ఊహించి రాశాను.

ఈ సర్వేని తక్కినవాళ్లు పట్టించుకున్నారా లేదా అనేది నా కనవసరం. ‘‘అష్టావక్ర’’ గురించి, కలాం రాష్ట్రపతి అయిన విధానం గురించి తక్కిన కాలమిస్టులు రాశారా లేదాని నేను వర్రీ అవలేదు కదా. ఇదీ అంతే.  కలాం ఆర్టికల్ చదివాక నాపై గౌరవం పోయిందట ఒక పాఠకుడికి. నిజానికి అబద్ధం చెప్పుకుంటున్న వ్యక్తిపై గౌరవం పోవాలి. ఇదీ వాస్తవం అని రాసినవాడి మీద పోయిందట. ‘నేటి నిజం చూడలేని కీటకసన్నాసులు’ అని శ్రీశ్రీ ఒక గేయంలో కొందర్ని నిరసించాడు. నిజం చూపిస్తే భరించలేని వాళ్లను ఎలా వర్ణించేవాడో మరి. ఇలాటివి రాసేబదులు తర్వాతి తరాలకు పనికి వచ్చే నాలుగు మంచి మాటలు చెప్పమని మరొకాయన హితవు. మంచిమాటలు వినాలంటే ప్రవచనాలకు వెళ్లాలి. గ్రేట్ ఆంధ్రకు రాకూడదు. బాబు ప్రజల నుంచి ఓదార్పు ఎదురు చూడకూడదని రాస్తే, జగన్ ఓదార్పు యాత్ర మాటేమిటి? అని అడిగాడు ఒకాయన. జగన్ ఓదార్చింది, తన తండ్రి మరణవార్త విని చనిపోయినవారి కుటుంబాలను! వాళ్ల దగ్గరకు వెళ్లి ‘మా నాన్న పోయాడూ’ అని గుక్కపెట్టి ఏడవలేదు.

అసెంబ్లీలో అంబటి రాంబాబు అన్నది మాధవరెడ్డి హత్య గురించి విచారణ చేయిద్దాం అని. మాధవరెడ్డికి, బాబు భార్యకు లింకు పెట్టి మాట్లాడినది వంశీ. అది కొన్ని వారాల క్రితం. అప్పుడు బాబు ఉలకలేదు, పలకలేదు. జగన్ వంటి దుర్మార్గుడికి ఎలా గెలవాలో సలహాలిస్తారా అంటూ ఒకాయన కోప్పడ్డారు. పాలన ఎలా ఉండాలో చెప్పాను. అప్పు చేసి పప్పుబెల్లాలు పంచవద్దని చెప్పాను. సమాజంలో కొన్ని వర్గాలనే నమ్ముకుని తక్కినవారికి అన్యాయం చేయవద్దని చెప్పాను. అతను ఓడిపోవాలి కదాని యింకా చెత్తగా పాలించు అని సలహా యివ్వాలా? ఈ లోపాలను సవరించుకున్నా, పాలన సవ్యంగా చేసినా, గెలుపు గ్యారంటీ అని, ఎన్నికల వేళ ఓటర్ల చిత్తం యిటే వుంటుందని ఎవరూ చెప్పలేరు. నంద్యాల ఉపయెన్నిక ఫలితాలు చూసినవారు, 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఊహించగలిగారా?

హైకోర్టు రాజధానిలో ఉంటేనే సౌకర్యం అని ఓ అమరావతి భక్తుడు రాశారు. వేర్వేరు చోట్ల ఉన్న రాష్ట్రాల పరిస్థితి అధ్యయనం చేశారేమో తెలియదు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలులో రాజధాని పెట్టి, గుంటూరులో హైకోర్టు పెట్టిన ప్రకాశం పంతులుగారి లాటి పెద్దలకు యీ సౌకర్యం గురించి అవగాహన లేదనుకోవాలి. ఇక ఒకాయన అమెరికా స్కూలులో 20 మందిని చంపేసిన ఘటనల్లాటివి ఉండగా యీ సబ్జక్ట్‌పై ఎందుకు రాశారు అంటూ విలవిలలాడారు. కంచంలో ఉన్న వంకాయ కూర నోట పెట్టుకోకుండా ‘పక్కింటావిడలా బెండకాయ కూర వండలేదేం?’ ‘మా బామ్మలా దొడ్లో గడ్డి పీక్కుని వచ్చి పచ్చడి చేయలేదేం?’ అని అడిగితే కట్టుకున్నావిడ కూడా ‘ఎదురుగా ఉన్నది మింగి, ఎలా ఉందో చెప్పండి చాలు’ అంటుంది. ఈయనకు పక్కింటి గృహిణి ఆత్మహత్య, కులాల కుమ్ములాటలపై ఆసక్తి ఉండవచ్చు. ఆ కథనాలు వెతుక్కోనక్కరలేదు. టీవీ పెడితే చాలు.

జనాలకు నచ్చేది రాయాలని సలహాలొకటి నాకు. నాకు టీఆర్‌పీ రేటింగులతో పని లేదు. లైక్స్‌పై, వ్యాఖ్యల సంఖ్యపై ఆధారపడి నా పారితోషికం ఉండదు. ఆర్టికల్‌కు యింత అని తీసుకుంటాను. ఎందరు చదివినా, మానినా ‘కోయీ ఫరక్ నహీ అల్‌బత్తా’! హిట్స్ బట్టి నా రెమ్యూనరేషన్ ఉంటుందని, అందుకని కావాలని వివాదాస్పదమైన అంశాలు ఎత్తుకుంటానని కొందరు రాస్తూంటారు. వాళ్ల కోసం యీ క్లారిఫికేషన్. నాకు నచ్చిన సబ్జక్ట్‌లపై నేను రాస్తానని, మిస్‌లీడ్ చేయని శీర్షికలు పెడతానని లక్షసార్లు చెప్పినా కొందరు మహానుభావులకు తలకెక్కదు. మళ్లీమళ్లీ అదే వ్యాఖ్యలు రాస్తారు.  

వైసిపి ఓటమిని కలలో కూడా ఊహించలేనని నాపై ఒకరు రాశారు. అలాటిదేమీ లేదు. రెండేళ్ల వ్యవధిలో ఏమైనా జరగవచ్చు. రాధాకృష్ణగారి సలహాలు విని బాబు తన తరహా మార్చేసుకుని వైసిపిని చిత్తు చేయవచ్చు. 2019లో టిడిపి అంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరికైనా పీడకలైనా వచ్చిందా? ఇప్పుడే ఆవేశపడనక్కరలేదు. ఎన్నికల లోగా పార్టీలు తమ విధానాలను ఎలా సవరించుకోవచ్చో రాశాను. ఇది పార్టీ వర్గాల వరకు చేరుతుందో లేదో, వాళ్లు పట్టించుకుని, అమలు చేస్తారో లేదో నాకనవసరం. చంద్రబాబు పాలించే సమయంలో అధికారుల అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, జన్మభూమి కమిటీల జులుం గురించి రాధాకృష్ణ తన కాలమ్‌లో రాస్తూనే వచ్చారు. అయినా బాబు సవరించుకున్నారా? అలాటిది నా బోటి కోన్‌కిస్కాయ్ చెపితే వాళ్లు వింటారా? ఇది మనలాటి వాళ్ల గురించి రాసినది మాత్రమే. దట్సాల్.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా