Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: వాక్సినిచ్చే రక్షణ సరే, ప్రతిష్ఠకు రక్షణేది?

ఎమ్బీయస్: వాక్సినిచ్చే రక్షణ సరే, ప్రతిష్ఠకు రక్షణేది?

దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. కోవిడ్ సోకినవారి రికవరీ రేటు 97% వుంటోంది. మరణాల సంఖ్య బాగా తగ్గింది. కోవిడ్ కర్వ్ ఫ్లాటెన్ అయిపోయిందని, 146 జిల్లాలలో కొత్త కేసులే లేవని హర్షవర్ధన్ అన్నారు. ఇదంతా చూసి ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం చాలా మినహాయింపులు యిచ్చేస్తోంది. జనజీవితం యించుమించు సాధారణం అయిపోతోంది. కానీ యిదే సమయంలో ప్రభుత్వం కరోనా విషయంలో ఎమర్జన్సీ వుందంటూ రెండు వాక్సిన్‌లు ఎమర్జన్సీ యూసేజి కింద అనుమతులు యిచ్చింది.

ఓ వాక్సిన్‌కు మూడో దశ పరీక్షలు పూర్తి కాలేదు, మరో దానికి వేరే దేశంలో అయ్యాయి కానీ యిక్కడ కాలేదు. ఇంగ్లండులో వైరస్ భీకరరూపం చూపిస్తోంది. మన దగ్గర బాగా నీరసించింది. అందువలన రెండింటిని ఒకే గాట కట్టడం ఎలా? ఇక్కడ కూడా పరీక్షలు పూర్తి కావాలి కదా అనే సందేహాలు మెదలుతున్నాయి. ఇప్పుడు వాక్సినేషన్ బాధ్యత ప్రభుత్వమే చేపట్టి, టీకాలు వేయించుకోండి అని ఊహూ ప్రచారం చేస్తోంది. కానీ ప్రజల్లో దాని పట్ల నిరాసక్తత కనబడుతోంది.

ప్రజల మనసుల్లోంచి కరోనా భయం పూర్తిగా తొలగిపోయిందని కాదు కానీ, యీ వాక్సిన్‌ల వలన మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అసలు ఏమీ జరగదా? అనే సంగతి తేలక కాబోలు. జనవరి 16 నుంచి మొదలుపెట్టిన మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంలో 27 వరకు టార్గెట్ చేసినవారిలో 56% మంది మాత్రమే వేయించుకున్నారు.

మన ఉస్మానియాలో 2797 మందికి వేయాలనుకున్నారు కానీ 785 మంది మాత్రమే వేయించుకున్నారు. బిహార్ ఎయిమ్స్‌ వైద్యుల్లో 40% మంది వాక్సిన్ వేయించుకోలేదు. ఈ విడతలో వేయించుకోవలసిన వారు వైద్యులు, పారా మెడికల్ వాళ్లు, ఆసుపత్రి సిబ్బంది, పారిశుధ్య పనివారు వగైరా. టీకాల వాళ్లు యింటికి వస్తే భయపడి పిల్లల్ని దాచేసే పాతకాలపు పల్లెటూరి వాళ్లు కాదు. అనునిత్యం టీకాలతోనే వ్యవహరించేవారు.

వైద్యసిబ్బందే వెనకాడడంతో సాధారణ ప్రజల్లో సందేహాలు మరింత పెరిగిపోయాయి. మామూలుగా అయితే అరుదైనది వచ్చినపుడు మాయాబజార్లో రుమాళ్ల కోసం ఎగబడిన కౌరవుల్లా నాకంటే నాకంటూ ఎగబడాలి. కానీ దీని విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా ‘మన వంతు వచ్చినపుడు వేయించుకోవాలంటావా? వేయించుకోవాలంటే ఏది వేయించుకోవాలి?’ అని ఒకరినొకరు అడుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.

టీకా వేయించుకున్నవాళ్లు కూడా కోవిషీల్డ్ వేయించుకుంటాం తప్ప కోవాక్సిన్ వద్దంటున్నారని వార్తలు వస్తున్నాయి. దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వాళ్లు మొదట మొదలుపెట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ముంబయిలోని అతి పెద్ద ప్రభుత్వాసుపత్రి ఐన జెజె ఆసుపత్రిలో సగం మంది డాక్టరు కోవాక్సిన్ వేయించుకోం అన్నారు. ఆ వాక్సిన్ మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న సెంటర్లలో అది ఒకటి. తక్కిన ఆసుపత్రులకు కోవిషీల్డ్ యిచ్చి మాకు మాత్రం యిది యిచ్చారేమని వారి ఫిర్యాదు.

‘‘నేషనల్ హెరాల్డ్’’ ప్రకారం దిల్లీలోని 75 ప్రభుత్వాసుపత్రులలో కోవిషీల్డ్ యిచ్చి ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, లోహియా ఆసుపత్రులలో కోవాక్సిన్ యివ్వబోయారు. కానీ వాళ్లు కోవాక్సిన్‌ను తిరస్కరిస్తున్నారు. అంతెందుకు, కోవాక్సిన్ పుట్టిన తెలంగాణలోనే దానికి గిరాకీ లేదని ‘‘ఔట్‌లుక్’’ రాసింది. 3.64 లక్షల కోవిషీల్డ్ డోసులు వస్తే కేవలం 20 వేల కోవాక్సిన్ డోసులు వచ్చాయట.

కానీ వాటిని యింకా ఎవరికీ యివ్వలేదట. ఇదంతా చూసి ఛత్తీస్‌గఢ్ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాని కోవాక్సిన్‌ను మా ప్రజలకు యివ్వం అనేసింది. పంజాబ్ ‘మాకు పంపినవి దగ్గర పెట్టుకుని, మూడో దశ ఫలితాలు వచ్చాక వాడతాం’ అంది అని ‘‘ఎకనమిక్ టైమ్స్’’ రాసింది. అవేవో మే లోపున రాకపోతే ఆ టీకాలు ఎక్స్‌పైర్ అయిపోతాయి.

దీనికంతా కారణమేమిటంటే మీ ప్రయోగాలు చేయడానికి మేమైనా ఎలకలమా? గినీ పిగ్స్‌మా? వాలంటీర్లమా? అని డాక్టర్లు అడుగుతున్నారు. ఆంధ్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును యిదే ప్రశ్న ఓ టీవీ చర్చలో అడిగితే ‘మమ్మల్ని దాదాపు 4 లక్షల మందికి టీకా వేయమన్నారు.

వాటి కంటె 40, 50 వేల ఎక్కువ టీకాలు పంపారు. అవన్నీ కోవిషీల్డే. అవి కాకుండా ఓ 20 వేలు కోవాక్సిన్ పంపారు. వాటిని వేయవలసిన అవసరం పడటం లేదు. అందుకని యీ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అన్నారు. అంటే అర్థమేమిటి? కోవాక్సిన్ ఆటల్లో అరటిపండు అన్నట్లు పంపారా? ఎయిమ్స్ డైరక్టరు డా. రణదీప్ గులేరియా అన్నట్లు అది కేవలం బాక్‌అప్ వాక్సిన్ మాత్రమేనా?

ఆయన ఆ మాట అన్నపుడే కోవాక్సిన్ తయారీదారు డాక్టర్ ఎల్లా కృష్ణ మండిపడ్డారు. ‘బాక్‌అప్ వైరస్సు, బాక్‌అప్ వాక్సిన్ అనేవి వుండవు. మాది వాక్సిన్, దట్సాల్’ అని. డా. రణదీప్ తన మాటల్ని వెనక్కి తీసుకోలేదు కానీ క్షేత్రస్థాయిలో అమలవుతున్నది అదే. ఇదే చాలా బాధాకరంగా వుంది.

నిజానికి వాక్సిన్ సురక్షితమో, కాదో, పని చేస్తుందో లేదో మనమెవ్వరం చెప్పలేం. సైంటిస్టులు మాత్రమే, అదీ ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాతనే చెప్పగలరు. ఇక్కడ మూడో దశ పూర్తే కాలేదు. పోనీ రెండో దశ ఫలితాలు అధ్యయనం చేసినవారూ లేరు. దానికి చాలా టైము పడుతుంది. దీని విషయంలో అంతా హడావుడి వ్యవహారం కాబట్టి కొందరు నిపుణులు కూర్చుని అనుమతి ఇచ్చేసి చూద్దాం అని యిచ్చేశారు.

వాక్సిన్ పని చేసిందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? ఒక ఏడాది వరకు మనకు కోవిడ్ రాకపోతే పనిచేసిందన్నమాట అనుకోవాలి. పోనీ దీని ప్రభావం ఆర్నెల్లే వుంటుంది అన్నారనుకోండి.. నిజానికి చెప్పాలంటే అదీ అనటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర్నుంచి ‘టూ ఎర్లీ టు సే. ...ఫర్ సమ్ పీరియడ్’ అంటోంది.

ఈ వాక్సిన్ తయారీదారులూ దాని గురించి చెప్పటం లేదు. వేయించుకున్న నెల్లాళ్లకు కోవిడ్ వచ్చిందనుకోండి. ‘చూశావా, నెల్లాళ్లు రాకుండా చేశాం, ఇది తగ్గిపోగానే మళ్లీ రా, యింకో రెండు డోసులు వేస్తాం, ఇంకో నెల గట్టెక్కిస్తాం’ అనవచ్చు. ఇలా ఎన్నాళ్లు వేయించుకోవాలో అర్థం కాక జనాలంతా ముందే గట్టెక్కి కూచుని, దీని కథ తేలేదాకా ఆగుదాం అనుకుంటూ చోద్యం చూస్తున్నారనుకుంటా. అందువలన యిది పని చేయదు అనీ చెప్పలేం. అబ్బే, చేస్తుంది, యింతకాలం వరకు పని చేస్తుంది అనీ చెప్పలేం.

ఇక సురక్షితమా కాదా అనే పాయింటు. రెండో దశ వరకు ఆరోగ్యంగా వున్న వ్యక్తుల మీదనే ప్రయోగాలు చేస్తారు కాబట్టి, ఆరోగ్యవంతులకు ఏమీ కాకపోవచ్చు. దాని ఫలితాలు లోతుగా అధ్యయనం చేయకపోయినా, పైపైన చూసినా టీకా సురక్షితమని అనుకుని వుంటారు. సురక్షితం అంటే అప్పటికప్పుడు ఏమీ జరగలేదని అర్థం. తీసుకున్న నెల్లాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం చూపితే అది అప్పుడే తెలియదు కదా. మామూలుగా టీకాల క్లినికల్ ట్రయల్స్‌లో మూడు నెలల వరకు వాలంటీరు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూనే వుంటారు. దీని విషయంలో మూడు నెలలు చూసిందెక్కడ?

ఏది ఏమైనా మీరు ఆరోగ్యవంతులైతే, ఆ విషయం మీకు పక్కాగా తెలిస్తే ధైర్యం చేయవచ్చు. క్లినికల్ ట్రయల్స్ వాలంటీరు విషయంలో అయితే కంపెనీ వారే వైద్యపరీక్షలు చేయించి, అప్పుడు వాలంటీరుగా తీసుకుంటారు. ఇప్పుడు వీళ్లు చేయించడం లేదు కాబట్టి, మీరే ఆ సంగతి నిర్ధారించుకోవాలి. చాలామంది హెల్త్ చెకప్ చేయించుకోరు. సూది కోసం సోదె కెళ్లినట్లవుతుంది, రిపోర్టులు చూసి డాక్టర్ నాన్‌వెజ్, మందు మానేయమంటాడు, బరువు తగ్గించమంటాడు, యోగా అంటాడు, ఎందుకొచ్చిన గోల అని. దీని కోసమైనా వెళితే వాటి గురించీ తెలుస్తుంది. 

వాక్సిన్ యివ్వగానే వెంటనే రియాక్షన్ యిచ్చినవాళ్లు కొంతమంది ఎలాగూ వున్నారు. 23 లక్షల పై బడి మందికి టీకా యిస్తే 24 గంటల నుంచి 5 రోజుల లోపున చనిపోయినవారు 9 మంది, ఆసుపత్రి పాలైనవారు 16 మంది అని హెల్త్ సెక్రటరీ చెప్పారు. కానీ పోయినవాళ్లు మరో కారణంతో పోయారు తప్ప, వాక్సిన్ కారణంగా కాదని కూడా వెంటనే చెప్పేశారు.

మా వూళ్లో మా యింటి ఎదురుగా ఒక ఆయుర్వేద వైద్యుడు ‘సర్వరోగ నివారిణి’ పేర తనే తయారు చేసిన మందు అమ్మేవాడు. ఉమ్మడి రాష్ట్రమంతా తిరుగుతూ 6 వ తారీకున నిజామాబాద్‌లో ఫలానా హోటల్లో, 8వ తారీకున అనకాపల్లిలో ఫలానా హోటల్లో వచ్చి సంప్రదించవచ్చు అని పేపర్లో ప్రకటలు యిచ్చే స్థాయి ఆయనది.

కానీ ఆ మందు చాలామందికి పనిచేసేది కాదో ఏమో, కడుపుమంటతో ఆ యా వూళ్ల నుంచి పేషంట్లు వచ్చి రోడ్డు మీద నుంచొని ఆయన్ని తిట్టేవారు. ఈయన తన యింటి అరుగు మీద నుంచే ‘అపత్యం చేస్తే మందెలా పనిచేస్తుంది?’ అని అరుస్తూండేవాడు. ఆయనకు కాస్త చెవుడు కూడా. అందువలన మరీ గట్టిగా అరవడంతో మేం యింట్లోంచి బయటకు వచ్చి చూడడంతో విషయం తెలిసేది. ఆయన దగ్గర ‘అపత్యం’ అనే సర్వఫిర్యాదునివారిణి ఉండేది. దాంతో మందు పనితీరు గురించి ఎవరూ అంచనా వేయలేకపోయేవారు.

హైదరాబాదులో యిచ్చే చేపమందు విషయంలో కూడా గమనించాను. ఒక ఏడాది వచ్చినవాళ్లు మళ్లీ ఏడాది, మళ్లీమళ్లీ వస్తూనే వుంటారు. ఒక్క డోసుతో తగ్గిపోవాలి కదా, మళ్లీ ఎందుకు వెళ్లడం? అంటే ‘అబ్బే, దానితో పాటు చేయాల్సిన ఆ పత్యాలూ అవీ అన్నాళ్లు చేయడం మన వలన ఏమవుతుంది? మందు మంచిదే, మనదే లోపం. ఈ ఏడాదైనా సరిగ్గా పత్యం పాటిద్దామనీ..’  అని వేయించుకుంటారు. మళ్లీ ఏడాది మళ్లీ సిద్ధం.

అలాగే యీ వాక్సిన్ విషయంలో మీరు కూడా గుర్తు పెట్టుకోండి, పోయినవాళ్లు వేరే కారణాలతో, ఆయుర్దాయం తీరిపోయి పోతారు, జబ్బు పడినవాళ్లు కర్మచాలక ఆసుపత్రిలో పడతారు తప్ప యీ టీకా కారణంగా పోరు, పడరు. ఈ వాక్సిన్‌ను తప్పు పట్టకూడదని అర్థం చేసుకుని, మళ్లీమళ్లీ ప్రభుత్వప్రతినిథులను ప్రశ్నించి వేధించవద్దు.

మహా శివలింగం తుదీ, మొదలు బ్రహ్మ, విష్ణువులకే తెలియక కొట్టుమిట్లాడినట్లు యుకె వేరియంట్ స్వరూపం యింకా వారికే తెలియక తచ్చాడుతూంటే, ఆ వేరియంట్ మీద కూడా కోవాక్సిన్ పనిచేస్తుంది అని కంపెనీ వారు అంటే ఎలా చెప్పగలరు? అని అడగడం అనవసరం. ‘ఆ నిర్జీవ వైరస్ టైపు వాక్సిన్‌లలో మాకున్న అనుభవం బట్టి చెపుతున్నాం’ అని కంపెనీవారు అంటున్నారు. మనం ఓహో అనుకోవాలంతే. ఇవన్నీ హైపోథిసిస్‌లు మాత్రమే.

ఈ దశలో రుజువులు ఉండవు. ఎందుకంటే ఏ వాక్సిన్ కథ ఆ వాక్సిన్‌దే. ఒకటి తయారవ్వడానికి 5 ఏళ్లు పడితే మరో దానికి 25 ఏళ్లు పడుతుంది. హెపటైటిస్ బి వాక్సిన్ కని పెట్టి దశాబ్దాలయి, అనేక కంపెనీలు తెగ చేసేయడంతో దానిని మంచినీళ్ల బాటిలు కంటె తక్కువ ధరకే అమ్ముతున్నామని డా. కృష్ణే చెప్పారు. మరి హెపటైటిస్ సి కి వాక్సిన్ ప్రపంచంలో యిప్పటిదాకా లేదు. ఏతావతా చెప్పేదేమిటంటే ప్రస్తుత దశలో కోవిడ్ వాక్సిన్ పని చేస్తుందని చెప్పినా, చేయదని చెప్పినా, ప్రమాదకరమైనదని చెప్పినా, క్షేమమని చెప్పినా, అంతా ఊహాగానమే. నిపుణులే చర్చల్లో మునిగినపుడు మనలాటి వాళ్లం చెప్పడానికి తగము.

ఊహాగానం తప్పు కాదు. ఏదో వూహించుకుని తెలియని మార్గంలో చీకటిలో తచ్చాడుతూ వెళ్లడమే రిసెర్చి. ప్రయత్నం చేస్తూనే వుండాలి. పూర్తి కాకుండానే చప్పట్లు కొట్టేయకూడదంతే! కొన్ని మందులు పర్శప్క్షన్ మీద పనిచేస్తాయి. ఫెయిత్ హీలింగ్ గురించి, డాక్టర్ల హస్తవాసి గురించి వినే వుంటారు. ప్లాసిబోతో తగ్గిన రోగాలున్నాయి. అంతమాత్రం చేత అదే మందు అనకూడదు. కరోనా రాగానే ఆర్శెనిక్ ఆల్బమ్ వేసుకుంటే చాలు అని ఆయుష్ శాఖ అంది.

హోమియో పుట్టిన జర్మనీవాళ్లే అంతకు తెగించలేక పోయారు. అప్పుడే అడిగాను, ప్రయోగాలు చేయందే అప్పుడే ఎలా చెప్పగలరని. ఎందుకంటే హోమియో మందుల గురించి చెప్పే బోరిక్‌ పుస్తకంలో కొన్ని లక్షణాలు ఇటాలిక్స్‌లో యిస్తారు. దాని అర్థం మందు ప్రయోగించి చూసినవారిలో ఎక్కువమందికి ఆ లక్షణాలు కనబడ్డాయన్నమాట. ఇలా ఒక్కో మందును అనేకులపై ప్రయోగించి చూసి, దేనికి పనికి వస్తుందో, ఎవరి మీద పనిచేస్తుందో నిరంతరం ప్రయోగాలు చేస్తూంటారు. అదేమీ జరగకుండా వెంటనే యీ ప్రకటన ఎలా చేశారని నా వ్యాసంలో అడిగాను.

ఆయుర్వేదంలో దీనికి ఎప్పుడో చికిత్స వుందనే వార్త కూడా వచ్చింది. ఎలా చెప్పగలిగారని ప్రశ్నిస్తే నాకు హోమియో మీద, ఆయుర్వేదం నమ్మకం లేదంటూ కొందరు పాఠకులు విరుచుకు పడ్డారు. నాకు ఉంది. అలోపతీతో బాటు ఆ రెండు విధానాల మందులూ వాడతాను. హోమియో వైద్యం గురించి నాకు కొంత అవగాహన కూడా వుంది.

ఒక్కో రోగానికి ఒక్కో వైద్యవిధానం బాగా పనిచేస్తుందని గమనించాను. ఆర్శెనిక్ ఆల్బమ్ వాడితే కరోనా రాదనగానే జనాలు విరగబడి వాడేశారు. ఇప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే అది వాడినా కరోనా వచ్చేసినవాళ్లు బోల్డుమందిని చూశాను. దానితో హోమియో మీద కొందరికి నమ్మకం పోయి, యిక ఏ హోమియో మందూ వాడడం మానేసి వుంటారు. ఇప్పుడు అరకొర వాక్సిన్ జనంలో వదలడం చేత యిలాటి ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడే ప్రమాదం వుందనే నా బాధ.

మామూలుగా వాక్సిన్‌లకు వాలంటీర్లు దొరకడం కష్టం కాదు. కానీ దీనికి దొరకలేదు. సగం మంది కూడా రాకపోతే కోవాక్సిన్‌కు చివరి నిమిషంలో అర్జంటుగా రిక్రూట్ చేసి ఫిగర్ బూస్టప్ చేశారు. ఇప్పుడు డాక్టర్లే వాక్సిన్ వేయించుకోవడానికి జంకినప్పుడు సామాన్య ప్రజలకు భయం వుండదా? ఇలాటి భయం కలగడానికి ప్రభుత్వ చర్యలే కారణమయ్యాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ ఒకరి గుట్టు మరొకరు బయటపెట్టుకుంటూండగా ప్రభుత్వం ఆపించేసింది, అంతా గప్‌చుప్ అన్నారు.

ఇప్పుడేమో దాని గురించి చెడుగా మాట్లాడితే ఫైన్ వేస్తామంటున్నారట. అప్పుడే జనాలకు అనుమానం వచ్చింది. అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు వేసుకోరు అనడంతో మరీ డౌటు వచ్చేసింది. నిజానికి యివాళ్టి నుంచి పార్లమెంటు సెషన్ వుంది. ఎందుకైనా మంచిదని వేయించుకోవచ్చుగా! ఇతర దేశాల్లో దేశాధినేతలు వేయించుకుని ప్రజల్లో విశ్వాసం పెంచారు.

మన దగ్గర ఏదైనా కోటా వుందంటే ఎంపీలు ముందువరుసలో నిలబడతారు. వైద్యం కావాలంటే ఫారిన్ వెళ్లి చేయించుకుంటారు. మరి దీనికి మాత్రం ‘పహ్‌లే ఆప్’ అంటున్నారు. మీకు రావలసినవి ముందు మేమెలా తీసుకుంటాం అంటూ వగలు పోతున్నారు. 23 లక్షల మందికి వేసినప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఓ పదివేల డోసులు పక్కన పెడితే ఎవరేమంటారు?

ఇలాటివాటి వలన వాక్సినేషన్ మీద అనుమానాలు వస్తూండవచ్చు. అందునా కోవాక్సిన్‌ నిరాదరణకు గురయ్యేలా కేంద్రం ప్రవర్తించిందని చెప్పకతప్పదు. బాక్‌అప్ వాక్సిన్ అనడమే కాకుండా, దీన్ని క్లినికల్ ట్రయల్స్ మోడ్‌లో యిస్తున్నాం అనడం బాగా దెబ్బ తీసింది. వాటిల్లో అయితే వాలంటీరుకి రక్షణ వుంది, ముందస్తు పరీక్షలుంటాయి.

ప్రపంచంలో ఎక్కడా ఆ ట్రయల్ మోడ్‌లో జనవరల్ పబ్లిక్‌కు వాక్సినేషన్ చేపట్టినట్లు లేదు. ఇప్పుడేమంటున్నారు? కోవిషీల్డ్‌కైతే కన్సెంట్ ఫాం యివ్వనక్కరలేదు. కోవాక్సిన్ కైతే యివ్వాలి అని చెపుతున్నారు. తీసుకునేవాడికి అక్కడే అనుమానం వచ్చేస్తుంది, సంతకాలు పెట్టించేసుకుంటున్నారు బాబోయ్ అని. మామూలు టీకాలకే కాదు, చిన్నా చితకా ఆపరేషన్లకైతే సంతకాలు అడగరు కానీ రిస్కున్న పెద్దాపరేషన్ అయితేనే అడుగుతారు కాబట్టి దీనిలో ఏదో రిస్కుందన్నమాట అని లెక్క వేస్తున్నారేమో.

మామూలుగా క్లినికల్ ట్రయల్స్‌లో వాలంటీరు వద్ద ఇన్‌ఫామ్‌డ్ కన్సెంట్ ఫాం అని తీసుకుంటారు. మూడు నెలల వ్యవధిలో 9 సార్లు వాళ్లని పరిశీలిస్తారు. రక్తపు శాంపుల్స్ తీసుకుంటారు. అనుకున్న రీతిలో యాంటీబాడీలు తయారయ్యాయో లేదో చూస్తారు. దీనికి సహకరించినందుకు గాను, పరిహారం ఏమీ యివ్వరు కానీ, ఈ 9 సార్లు ఆసుపత్రికి వచ్చి వెళ్లినందుకు గాను రానుపోను ఖర్చులిస్తారు, వెచ్చించిన సమయానికై యింత అంటూ యిస్తారు.

ఈ ప్రయోగం వలన ఏదైనా అపాయం (ఇన్‌జూరీ) కానీ మరణం కానీ సంభవిస్తే మేము కాంపెన్సేట్ చేస్తాం, కంప్లీట్ కేర్ తీసుకుంటాం అంటారు కానీ యింతిస్తాం అని రాయరు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మేమే చికిత్స చేసి తగ్గిస్తాం అంటారు. ఇప్పుడీ కోవాక్సిన్ విషయంలో ఈ హామీ కంపెనీ యిస్తోందో, ఐసిఎమ్మార్ యిస్తోందో, ప్రభుత్వం యిస్తోందో నాకు స్పష్టంగా తెలియదు. తీరా మోసి, ఏదైనా వస్తే మా దాని వలన కాదు అని వాళ్లు అనేస్తే దిక్కుందా?

ఇలాటి సందేహాలు పెట్టి ప్రభుత్వమే కోవాక్సిన్‌ను దిగదీసింది. జర్నలిస్టులందరూ డా. కృష్ణపై పడ్డారు, పరీక్షలు పూర్తి కాకుండానే అలా ఎలా మార్కెట్లో రిలీజ్ చేస్తారు, డేటా ఏది? అంటూ. ఆయన ఇండియా టుడేకి యిచ్చిన టీవీ యింటర్వ్యూ చూశాను. ‘అవును డేటా లేదు, అయినా ప్రభుత్వం అనుమతి యిచ్చింది కాబట్టి అమ్ముతున్నాను. నా తప్పేముంది? నన్ను ఉరికంబం ఎక్కిస్తారేమిటి?’ అని ఆయన వాపోయారు.

‘మా ట్రాక్ రికార్డు చూడండి, రోటావైరస్‌కు మేం చేసిన వాక్సిన్ ఫలితాలు చూడండి.’ అంటూ చెప్పుకొచ్చారు. నిజమే, భారత్ బయోటెక్ చరిత్రలో కొన్ని హికప్స్ వున్నా - రిసెర్చి అన్నాక అవి తప్పవు – రెండు దశాబ్దాలుగా వాక్సిన్‌లు చేస్తున్నారు, మంచి ఖ్యాతి గడించారు కదా. మరి ఇవాళ ఆయన ప్రోడక్టును దిగదుడుపుగా చూస్తే బాధ వేయదా?

వాస్తవానికి వాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న దానిపై డా. కృష్ణ ఎప్పుడూ కమిట్ కాలేదు. ఆయన సైంటిస్టు. రిసెర్చిలో యిబ్బందులు తెలుసు. జూన్ కాకపోతే మార్చికి వస్తే రావచ్చు అన్నారు తప్ప జనవరి అనలేదు. ఐసిఎమ్మార్‌కే తేదీల గోల. గాంధారికి గర్భం రెండేళ్లు వుందట.

ఈలోగా కుంతికి కొడుకు పుట్టేశాడనే అసూయతో గాంధారి కడుపు బాదేసుకుంటే దాంతో అబార్షన్ అయిపోయి, పిండం వంద ముక్కలై పోయిందట. దేనికి పట్టే టైమును దానికి పట్టనివ్వాలి. తొందరపడితే యిలాటి అనర్థాలు తప్పవు. కోవాక్సిన్ కేసులో పాపం డా. కృష్ణ ఆగుదామనే అనుకున్నారు. ప్రభుత్వమే బలవంతంగా గర్భస్రావం చేయించి, ఎదిగీ ఎదగని పిండాలుగా మార్కెట్‌లో చూపిస్తోంది. ఎందుకంత తొందర?

కరోనా నిర్వహణలో ఏయే దేశాలు బాగా పనిచేశాయి అని ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్‌స్టిట్యూట్ ఒక అధ్యయనం చేసింది. 98 దేశాల జాబితాలో భారత్‌కు 86 వ ర్యాంకు వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య, ప్రతి పది లక్షల జనాభాకు నిర్ధారిత కేసులు, నిర్ధారిత మరణాలు, పాజిటివిటీ రేటు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని జాబితా తయారుచేశారుట. వినగానే మరీ అంత ఘోరంగా వున్నామా అని నమ్మబుద్ధి కాదు.

కానీ న్యూజిలాండ్, వియత్నాం, తైవాన్‌లకు మొదటి మూడు స్థానాలివ్వడం శ్రీలంకకు 10వ స్థానం, అట్టడుగు ఐదు స్థానాల్లో అమెరికా, ఇరాన్, కొలంబియా, మెక్సికో, బ్రెజిల్ వుండడం చూస్తే జాబితాను నమ్మాల్సి వస్తోంది. మన రికార్డు బాగా లేకపోవడానికి అనేక కారణాలుండవచ్చు. తరతరాలుగా వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేయడం, స్థానికంగా కిట్స్ తయారు చేసుకోలేక పోవడం, వలస కార్మికులు, ముఖ్యంగా అర్బన్ స్లమ్స్, పరిశుభ్రత లేకపోవడం.. వగైరాలను కూడా పరిగణించాలి. ఏది ఏమైనా యీ వాక్సిన్‌తో తన యిమేజి పెంచుకోవాలని భారత ప్రభుత్వం తాపత్రయ పడి వుండవచ్చు.

దీనివలన యిప్పుడు ఆ వాక్సిన్‌ కంపెనీ ప్రతిష్ఠకు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. పోనీ యిక్కడ తీసుకోవటం లేదు కాబట్టి ఎగుమతి చేస్తాం అంటే ఆ దేశాలు ‘మీకు అక్కరలేనిది, మాకు తోస్తారా?’ అనవచ్చు. దురదృష్టమేమిటంటే యిది ఒక తెలుగు కంపెనీ.

తెలుగువాళ్లు, తెలుగునేలపై పెట్టిన సంస్థ. ముఖ్యంగా రిసెర్చిని నమ్ముకుని పెట్టిన సంస్థ. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ సైన్సు నిత్యమైనది. ముఖ్యంగా భారతీయుల పరిశోధనాసామర్థ్యంపై అంతర్జాతీయంగా విశ్వాసం కుదురుకున్న యీ వేళ, ఏ సందు దొరికినా పోటీ విదేశీ సంస్థలు రాళ్లు వేసే ప్రమాదం వున్న యీ వేళ, అత్యాధునికమైన టెక్నాలజీని జనసామాన్యానికి అందిస్తున్న సంస్థ పదికాలాల పాటు వుండాలి. ఇమేజి కాపాడుకోవాలి.

ఇప్పుడీ యిరకాట పరిస్థితిలో పడినందుకు ఆయన ఆక్రోశాన్ని అర్థం చేసుకోవచ్చు. మొహమాటానికి పోయి ప్రభుత్వంతో సహకరించడం వలన యీ యిబ్బంది వచ్చిందని నా ఆవేదన. నిజానికి కోవిషీల్డ్ పరాయి యింట పెరిగిన బిడ్డ. ఇది యిక్కడిది. స్వదేశీ అంటే గౌరవంగా వుంటుంది. ‘లోకల్’ అనేస్తారేమోనని భయంగా వుంది. వాడుక భాషలో లోకల్‌ను తక్కువగా చూస్తారు. కారు స్పేర్ పార్ట్ మార్చమంటే ఒరిజినల్ కావాలా? లోకలా? అని అడుగుతాడు. మహమ్మారి నుంచి కాపాడే వాక్సిన్ విషయంలో అలాటి మాటలు వినడానికి బాధగా వుంటుంది. –

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?