Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితం

ఎమ్బీయస్‌: ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితం

పాకిస్తాన్‌ రాజకీయాల గురించి రాస్తున్న ప్రధాన వ్యాసంలో భాగంగా దీన్ని రాస్తున్నాను..

పాక్‌కు 22వ ప్రధానిగా ఐన ఇమ్రాన్‌ ఖాన్‌ 1952 అక్టోబరు 5న లాహోర్‌లో పుట్టాడు. పాక్‌ లోని ఫస్తూన్‌ కుటుంబానికి చెందినవాడు. వాళ్లది పాక్‌లో ఆఫ్గాన్‌ సరిహద్దు రాష్ట్రమైన ఖైబర్‌ ఫఖ్తూన్‌ ఖ్వా రాష్ట్రం. సంపన్న, ఉదార కుటుంబంలో పెరిగాడు. తండ్రి సివిల్‌ ఇంజనియర్‌. పంజాబ్‌లోని లాహోర్‌లో కొంత చదివి, తర్వాత 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనమిక్స్‌ లో డిగ్రీ చదువుకున్నాడు. అక్కడ బేనజీర్‌ భుట్టో అతనికి క్లాస్‌మేట్‌. అతని యిద్దరు అక్కలు, యిద్దరు చెల్లెళ్లు ఉన్నారు. పెద్దక్క యునైటెడ్‌ నేషన్స్‌లో మంచి పదవిలో ఉంది. రెండో అక్క లాహోర్‌లో ఉంటూ సర్జన్‌గా ప్రాక్టీసు చేస్తోంది. పెద్ద చెల్లెలికి టెక్స్‌టైల్‌ బిజినెస్‌ ఉంది. లాహోర్‌లో, న్యూయార్క్‌లో బ్రాంచీలున్నాయి. రెండో చెల్లెలు సామాజిక సేవా సంస్థలు నిర్వహిస్తూ ఉంటుంది.

ఇమ్రాన్‌ తండ్రి 88 ఏళ్లు బతికి 2008లో చనిపోయాడు కానీ అతని తల్లి 1985లోనే చనిపోయింది. ఆమెకు కాన్సర్‌ సోకింది. సరైన చికిత్స లభిస్తే మరి కొంతకాలం బతికేదే కానీ పాకిస్తాన్‌లో ఆ చికిత్స లభించలేదు.  అది ఇమ్రాన్‌ను కలచివేసింది. లాహోర్‌లో తల్లి పేర షౌకత్‌ ఖానూమ్‌ కాన్సర్‌ హాస్పటల్‌ అని కట్టించాడు. తన సొంత డబ్బేకాకుండా దేశవిదేశాల్లో విరాళాలు పోగు చేశాడు. 1994లో ఆసుపత్రి ప్రారంభించారు. పేషంట్లలో 70% మందికి ఉచితంగా వైద్యం చేస్తారక్కడ. ఇది ఇమ్రాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ ఓట్లు తెచ్చిపెట్టలేదు. 1997లో ఏడు స్థానాల నుంచి పోటీ చేస్తే ఒక్క చోటనుంచీ నెగ్గలేదు. అయినా అతను మరో కాన్సర్‌ ఆసుపత్రిని పెషావర్‌లో కట్టించి 2015లో ప్రారంభించాడు. ఇవే కాకుండా  పంజాబ్‌లోని మియా వాలీ జిల్లాలో సాంకేతిక యూనివర్శిటీ కూడా కట్టించాడు.

క్రికెట్‌ విషయానికి వస్తే - 1974లో వన్డే ఇంటర్నేషనల్‌లో ఆడాడు. 1975లో పాక్‌ క్రికెట్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా జట్టులో స్థానం వచ్చింది. 1982లో పాక్‌ క్రికెట్‌ టీముకి కెప్టెన్‌ అయ్యాడు. అతని నేతృత్వంలో 48 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడితే కేవలం 8టిలో మాత్రమే జట్టు ఓడిపోయింది. 1987లో రిటైరయ్యాడు కానీ పాక్‌ అధ్యక్షుడిగా ఉన్న జియా ఉల్‌ హక్‌ కోరిక మేరకు ఏడాది విరామం తర్వాత మళ్లీ ఆడసాగాడు. 1992లో పాక్‌కు వరల్డ్‌ కప్‌ సంపాదించి పెట్టాడు. అప్పుడే గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌ ఆటగాడిగా పలు దేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియాలో కూడా అతని అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. స్వభావరీత్యా అతను ఆవేశపరుడు, దుందుడుకు మనిషి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే, దుర్భాషలాడే, సహచరులతో ఘర్షణలకు దిగే వ్యక్తి అంటారు. మతవిశ్వాసాల పరంగా అతను ఉదారుడే అయినా రాజకీయాల కోసం ఛాందసవాది అవతారం ఎత్తాడంటారు.

ఇక శృంగార జీవితానికి వస్తే అతనికి ప్లేబాయ్‌గా ఉన్న యిమేజి చాలా దృఢంగా ఉంది. ఇంగ్లండులో హాయిగా విలాసంగా జీవితం గడిపాడు. లేడీ లిజా కాంబెల్‌, సుసాన్నా కాన్‌స్టాంటైన్‌ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం సాగించాడు. చాలాకాలం అవివాహితుడిగా జాలీగా గడిపి 1995లో తన 43వ యేట బ్రిటిష్‌ బిలియనీర్‌, డయానా స్నేహితురాలు, జెమీమా గోల్డ్‌స్మిత్‌ (గోల్డ్‌ష్మిట్‌) ని పెళ్లాడాడు. ఆమె బ్రిటిష్‌ టీవీ, సినిమా, డాక్యుమెంటరీ నిర్మాత. జర్నలిస్టు. జెమీమాకు యూదు మూలాలున్నాయి. ఇజ్రాయేలు కారణంగా ముస్లిములకు, యూదులకు పడని సంగతి అందరికీ తెలిసినదే. ఆ వివాహం కారణంగా అతనిపై జియోనిస్టు ఏజంటుగా ముద్ర కొట్టారు. క్రికెటర్‌గా ఉండి ఉంటే ఊరుకునేవారేమో కానీ పెళ్లయి మరుసటి ఏడే 1996లో తను రాజకీయాల్లో దిగి ఓ పార్టీ పెట్టాడు. అందువలన యివన్నీ ముందుకు వచ్చాయి.

ఇమ్రాన్‌ రాజకీయాలతో అతని భార్య ఎడ్జస్ట్‌ కాలేక పోయింది. ఇద్దరూ స్నేహపూర్వకంగానే తొమ్మిదేళ్ల తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. మొదటి పెళ్లి ద్వారా ఇమ్రాన్‌కు ఇద్దరు కొడుకులు, పెద్దవాడు సులేమాన్‌కు 21, చిన్నవాడు కాసిమ్‌కు 19. వీళ్లిద్దరితో పాటు టైరాన్‌ వైట్‌ అనే 26 ఏళ్ల అమ్మాయి కూడా జెమీమా దగ్గర పెరుగుతోంది. ఆమెను తన సవతి కూతురని చెప్తుందామె. సీతా వైట్‌ అనే ఆమె కూతురామె. సీతా 1991 వరకు ఇమ్రాన్‌ సహచరి, భాగస్వామి. ఆమె జమీందారిణి. 2004లో చనిపోయింది. ఇమ్రాన్‌తో పెళ్లికి ముందే జెమీమా అతని ఆసుపత్రికై విరాళాల సేకరణలో సహకరించింది. ఇప్పటికీ ఆమె ఇమ్రాన్‌ గురించి గర్వంగానే చెపుతుంది.

జెమీమాతో విడిపోయిన 11ఏళ్ల వరకు ఇమ్రాన్‌ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. 2005 జనవరిలో బిబిసిలో వాతావరణ విభాగంలో ప్రయోక్తగా ఉన్న రెహమ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ 9 నెలల్లోనే విడిపోయారు. ఇది నా జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అంటాడు ఇమ్రాన్‌. సేమ్‌ ఫీలింగ్‌ హియర్‌ అంటుంది రెహమ్‌. నిరంతర ప్లేబోయ్‌ అయిన ఇమ్రాన్‌కు స్వీట్‌ నథింగ్స్‌ చెప్పడం మరేదీ రాదని, తనపై యితరులు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోలేడని, ఓటర్లను దగా చేస్తాడనీ ఆమె ప్రచారం చేసింది. ఎన్నికల వేళకు అందుకునేట్లా ఒక ఆత్మకథ రాసి అతన్ని తిట్టిపోసింది. అతనికి అక్రమ సంబంధాల ద్వారా పుట్టిన సంతానం చాలా ఉందని, పార్టీ టిక్కెట్లు కోరి వచ్చిన మహిళలను అనుభవించాడని, యిటువంటి అనేక వ్యక్తిగత వివరాలను ఆమె బహిరంగంగా ఉతికి ఆరేసింది. ఇమ్రాన్‌ 2015లోనే సైన్యాధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాడని, పేరుకు యితను ప్రధానిగా ఉన్నా సైన్యం చెప్పినట్లే ఆడతాడనీ ఆమె అంటుంది.

రెండో వివాహం భగ్నమైన 13 ఏళ్లకు ఇమ్రాన్‌ యీ ఏడాది మూడో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 50 ఏళ్లు. 5 గురు పిల్లల తల్లి, అమ్మమ్మ కూడా. ఆవిణ్ని చేసుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెప్పారు కాబట్టి చేసుకున్నాడని ఓ పుకారు ఉంది. సూఫీ మార్గానికి చెందిన చిస్తీ పంథాలో గురువుగా ఉన్న మనేకా పూర్వీకులు రాజపుత్రులు. 14వ శతాబ్దంలో తుగ్లక్‌ పరిపాలనలో ఇస్లాంలోకి మారారు. మనేకా సోదరి ఇమ్రాన్‌ పార్టీ సభ్యురాలు. మూడేళ్ల క్రితం ఆమె తన అక్క దగ్గరకు అతన్ని తీసుకుని వచ్చింది. అప్పటికి ఆమెకు ఖవర్‌ అనే భర్త ఉన్నాడు. కస్టమ్స్‌ ఆఫీసరుగా పని చేస్తాడు. గత రెండేళ్లగా ఇమ్రాన్‌ ఆమె దగ్గరకు వెళుతూండేవాడు.

''ఆమె తన భర్తతో విడిపోయిన తర్వాత మాత్రమే నేను ఆమెకు పెళ్లి ప్రతిపాదన పంపాను. పెళ్లికి ముందు ఆమె మొహాన్ని ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే ఆమె భర్త తప్ప వేరే ఏ మొగవాడి ఎదుట బురఖా తీయదు.'' అంటాడు ఇమ్రాన్‌. ఈ ఫిబ్రవరిలో అతని పార్టీ వాళ్లు అతని పెళ్లి ఫోటోను విడుదల చేసినపుడు ఆమె బురఖా వేసుకునే ఉంది. ఒకప్పుడు ఉదారవాదిగా ఉన్న ఇమ్రాన్‌ యింత ఛాందసంగా భార్య మొహాన్ని ముసుగు చాటున దాచడమేమిటి, మనమేమన్నా తాలిబన్ల శకంలో ఉన్నామా అని చాలామంది విమర్శించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?