cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: చొరబాటుదారుల మతం పట్టించుకోవాలా?

ఎమ్బీయస్‌: చొరబాటుదారుల మతం పట్టించుకోవాలా?

అక్రమ చొరబాటుదారులు ఎవరైనా సరే, ఏ మతస్తులైనా సరే - ఉదాహరణకి బర్మా రోహింగ్యా ముస్లిములు - వెనక్కి పంపేయాలని నా బోటి వారి ఉద్దేశం. దీనిలో మానవత్వానికి ప్రమేయం లేదు. వాళ్లు రాకూడదు, వచ్చారు కాబట్టి పంపేయాలి. వెనక్కి వెళతారో, మరో దేశంలో అక్రమంగా చొరబడతారో వాళ్ల యిష్టం, వాళ్ల రిస్కు. వెనక్కి వెళితే మనుగడ సాగించడం కష్టం, స్వేచ్ఛగా బతకడం కష్టం అంటే తిరగబడమనండి, పోరాడమనండి. హక్కులు సాధించుకోమనండి. అంతే కాని, యిక్కడో అనాథాశ్రమం ఉంది, వాళ్ల యింట్లోకి తీసుకెళ్లి వాళ్లతో సమానంగా చూసుకుంటారు అనుకోకూడదు. ఇక శరణార్థులైనా సరే, మూణ్నెళ్లు, మహా అయితే ఆర్నెల్లు.. అంతే! తర్వాతైనా వాళ్లు వెనక్కి వెళ్లి వాళ్ల బతుకు వాళ్లు బతకాలి, పోరాడాలి. ఇక్కడ మేమూ మా హక్కుల గురించి ఉద్యమాలు చేస్తున్నాం, జైళ్లకు వెళుతున్నాం, మీరూ ఆ పని చేయండి అని మనం స్పష్టంగా చెప్పాలి. మీ కొంపలో అగ్గి వుంది కదాని, మా కొంపలో తిష్ట వేస్తానంటే ఎలా? వెళ్లి ఆర్పుకో. లేకపోతే అగ్గి పెట్టినవాడి కొంపని తగలెట్టు. మీ ఏడుపు మీది, మా ఏడుపు మాది.

కానీ బిజెపి అక్రమంగా వచ్చినవారిని మతపరంగా చీల్చింది. ముస్లిములు తప్ప తక్కినవారందరినీ పౌరులుగా గుర్తిస్తోంది. అక్రమంగా వచ్చిన వారు హిందువులైతే చాలు (ఇంకా కొన్ని మతాల పేర్లు కలిపారు, దాని గురించి తర్వాత చెప్తాను) వాళ్లకు పౌరసత్వం యిచ్చేస్తానంటోంది. అంటే మనతో పాటు వాళ్లకూ సమానహక్కు లన్నమాట! ఈ దేశంలో పుట్టి, యిక్కడే పెరిగి, యీ దేశం యిలా వుండడానికి కారకులైన మనకీ, పరదేశంలో పుట్టి యిన్నాళ్లూ అక్కడే వున్నవాడికీ తేడా లేదన్నమాట. మన యింట్లోనే మనల్ని పక్కకు సర్దుకోమని చెప్పి వాళ్లను మన పక్కన కూర్చోబెడుతున్నారు. మన తిండిలో వాటా పెడుతున్నారు. మనం యిన్నాళ్లూ పోగేసుకున్న ఆస్తిపాస్తులలో వాటా యిస్తున్నారు. మన కిచ్చే సంక్షేమ పథకాలు వాళ్లకూ యిస్తున్నారు. పోనీ వాళ్లేమైనా మేధావులు, మన దేశ మేధోసంపదకు, భౌతికసంపదకు ఉపయోగపడతారు, వాళ్లు రావడం మన బాగుకే అంటే సరేలే అనుకుంటాం. కానీ యీ వచ్చేవాళ్లు అలాటి బాపతు కారు. మనకు భారంగా పరిణమించేవారే!

ఇదెక్కడి అన్యాయం అంటే వాళ్లు మన హిందువులు, వాళ్లవాళ్ల దేశాల్లో మతపరంగా కష్టాలు ఎదుర్కుంటున్నారు కాబట్టి, భారతదేశం తప్ప మరో హిందూదేశం లేదు కాబట్టి వాళ్లను మనం ఆదరించాల్సిందే అని ఆరెస్సెస్‌ భావజాలం ఉన్నవాళ్లు వాదిస్తారు. దీనిలో ప్రతి అంశాన్ని మనం చర్చించాల్సిందే. పరదేశస్తుడు పరదేశస్తుడే! వాణ్ని మతపరంగా చూడలేం. శ్రీలంక తమిళుల్లో ఎల్‌టిటిఇ సభ్యులు అనేకమంది హిందువులు. వాళ్ల కారణంగా భారతదేశంలో కొన్నేళ్లపాటు స్మగ్లింగు, హత్యలు, కాల్పులు వంటి అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. స్థానికులను భయభ్రాంతులను చేశారు. వాళ్లలో ఒకడు వచ్చి 'మా దేశంలో సింహళ బౌద్ధులు మమ్మల్ని జాతిపరంగా, మతపరంగా హింసిస్తున్నారు, నాకు ఆశ్రయం యివ్వండి' అంటే యివ్వాలా?

రేపు శ్రీలంకతో, ఎల్లుండి మలేసియాతో, ఆవలెల్లుండి థాయ్‌ల్యాండ్‌తో మనకు యుద్ధం వస్తే ఆ దేశపౌరులలో హిందువులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకుంటామా? అమెరికాతో వచ్చినా అంతే! అప్పుడు సాటి తెలుగువాడు, సాటి హిందువు, సాటి కులస్తుడు - యివన్నీ జాన్తానై. నువ్వు శత్రుదేశం వాడివి, నిన్ను దగ్గరకు రానివ్వం. ఆ దేశపు సైన్యంలో లేదా గూఢచారిదళంలో నువ్వుంటే నిన్ను చంపడానికి కూడా సంకోచించం. చైనాతో యుద్ధం వచ్చిందనుకోండి, మన విష్ణువు అవతారమైన బుద్ధుణ్ని వాళ్లలో కొంతమంది కొలుస్తారు, పాపం బుద్ధుడి విగ్రహాలు కూడా పెద్దపెద్దవి చేసి జాగ్రత్తగా పెట్టుకున్నారు అని జాలిపడి వదిలేస్తామా? మతంతో ప్రమేయం ఏముంది, దేశం ముఖ్యం అనుకుంటూ పోట్లాడమా?

మనం ఒక్కరమే కాదు, ప్రపంచమంతా యిలాగే ఆలోచిస్తుంది. అందుకే ముస్లిము దేశాల మధ్య వారిలో వారికి యుద్ధాలవుతాయి. షియా, సున్నీ వంటి శాఖాభేదాలు కొన్ని సందర్భాల్లో వుండవచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఒకే శాఖ వారు, ఒకే కుటుంబీకులు కూడా యుద్ధాలు చేసుకుంటారు. క్రైస్తవ దేశాలూ అంతే! రెండు క్రైస్తవదేశాలు వందేళ్లపాటు నిరంతరంగా యుద్ధం చేసుకున్న చరిత్ర ఉంది. చైనా, జపాన్‌ రెండూ బౌద్ధం ఆదరించే దేశాలే! శతాబ్దాలుగా యుద్ధాలు చేసుకున్నాయి. మతం వేరు, దేశప్రయోజనం వేరు. రాజపక్ష వచ్చి వెంకటేశ్వరుణ్ని దర్శించాడు కదాని మనం వాటేసుకోం. దేశవిరోధిగానే చూస్తాం, అతను నెగ్గకుండా శతథా ప్రయత్నిస్తాం. ఎల్‌టిటిఇ నాయకుల్లో హిందువులు ఉన్నారు కదాని రాజీవ్‌ గాంధీని హత్య చేసినా క్షమించి ఊరుకోలేదు. శిక్షలు వేయించాం.

ప్రపంచవ్యాప్తంగా శరణార్థులకు ఆశ్రయం యిచ్చినపుడు - వారి మతాన్ని చూడరు. మన భారతీయులు బర్మాలో స్థిరపడి, స్థానికులకు కన్నెర్ర కలిగేటంతగా ఎదిగారు. సైనిక ప్రభుత్వం వచ్చి భారతీయులందరినీ వెళ్లగొట్టినపుడు మన దేశం వారికి ఆశ్రయం యిచ్చి వాళ్లకు శరణార్థి శిబిరాలు కట్టి, ఉపాధి కల్పించి, ఆదుకుంది. వాళ్లను మతపరంగా చీల్చి హిందువులైతేనే ఆశ్రయం యిస్తాం అనలేదు. టిబెట్టును చైనా ఆక్రమించినపుడు, అక్కడి బౌద్ధులు కొందరు శరణార్థులుగా వచ్చినపుడు 'మీరు హిందువులు కాదు కదా' అనలేదు. ఇప్పుడు శరణార్థుల రాకను ప్రతిఘటిస్తున్న యూరోప్‌ దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు కూడా క్రైస్తవులైతే రానిస్తాం అనటం లేదు. పరదేశం వాళ్లు మాకు వద్దు బాబోయ్‌ అంటున్నారు.  

ఇక రెండో పాయింటు - వాళ్లవాళ్ల దేశాల్లో మతపరంగా కష్టాలు ఎదుర్కుంటున్నారు కాబట్టి.. అనేది! దీనికి మొట్టమొదటగా అడగాల్సిన ప్రశ్న - మతపరంగా ఎదుర్కుంటున్నారని ఎలా చెప్పగలరు? దానికి ఆధారాలు ఏమైనా చూపగలరా? కానీ బిజెపి తయారు చేసిన బిల్లులో అలాటి ఆధారాలు చూపాలన్న నిబంధన ఏమీ లేదు. కొన్ని దేశాల పేర్లు పేర్కొని ఆ దేశపు హిందువైతే చాలు, మహరాజులాగ వచ్చేయవచ్చు అంటోంది ఆ బిల్లు.  అక్కడ హిందువులకు వ్యతిరేకంగా, వారి మనుగడకు ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం ఫలానా చట్టాలు చేసింది అని మన ప్రభుత్వం మనల్ని కన్విన్స్‌ చేయాలి కదా! అదేమీ లేదు. ఆ దేశాల్లో అనేక వర్గాల ప్రజలు యిక్కట్లు పడుతున్నారు. పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ వంటి దేశాల్లో ముస్లిముల్లోనే ఒక వర్గం వారు మరో వర్గం వారిని బాధిస్తున్నారు. ఒకే వర్గంలో కూడా ప్రాంతీయ భేదాలతో ఒకరి నొకరు హింసిస్తున్నారు. ఉగ్రవాదం ప్రదర్శిస్తున్నారు. అందువలన అక్కడి సమాజం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి మీ యింట్లో వచ్చి తిష్ట వేస్తాం అంటే ఎందుకు ఒప్పుకోవాలి?

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువులను హింసిస్తున్నారు, వారిని మనం ఆదుకోవాలి అనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగింది. హిందువులు మెజారిటీగా భారత్‌, ముస్లిములు మెజారిటీగా పాకిస్తాన్‌ ఏర్పడ్డాయి. ఎవరైనా ఎక్కడైనా ఉంటూ మతస్వేచ్ఛను అనుభవించవచ్చు అని పాలకులు అనుకున్నారు. ఆ మేరకు గంభీర ప్రసంగాలు కూడా చేశారు - జిన్నాతో సహా! అయితే ఆచరణకు వచ్చేసరికి భారత్‌లో ఉన్నంత స్వేచ్ఛ పాకిస్తాన్‌లో లేకుండా పోయి అది పూర్తి మతరాజ్యంగా తయారైంది. అసలు ఆచరణ ఎలా వుంటుందో తెలియడానికి ముందే విభజన ప్రకటన రాగానే సరిహద్దు ప్రాంతాల్లోని సామాన్యజనం అమానుషంగా ప్రవర్తించి పరమతస్తులను తరిమివేయడానికి చూశారు. దాంతో హిందువులు యిటు వచ్చేసి, ముస్లిములు అటు వెళ్లిపోయారు. 

ఎవరైనా పాకిస్తానీ (తూర్పు, పశ్చిమ) హిందువు, ఇండియాకు వచ్చేద్దామని అనుకుని ఉంటే అది సరైన అవకాశం. రాలేదంటే అర్థమేమిటి? అక్కడ బాగానే ఉందని అతను ఫీలయ్యాడని! పోనీ మొదట్లో అలా అనుకున్నా, మతపరంగా వివక్షతకు గురవుతున్నానని అతను ఐదారేళ్లలోనే ఫీలయి వుండాలి, అప్పుడైనా వచ్చేసి ఉండాలి. అప్పుడూ రాలేదంటే అర్థమేమిటి? అక్కడి పరిస్థితులతో అతనికి పేచీ లేదని! 1947 వెళ్లి ఏడు దశాబ్దాలు దాటాయి. ఒక తరం పూర్తిగా వెళ్లిపోయింది. ఇప్పుడు మతపరమైన వివక్షత పేరు చెప్పి వద్దామనుకుంటున్నాడంటే మనం నమ్మాలా? ఇన్నాళ్లూ ఏం చేస్తున్నావు బాబూ అని అడగవద్దా? అలాగే బంగ్లాదేశ్‌! అది ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్‌.  సంఖ్యాపరంగా పశ్చిమ పాకిస్తాన్‌ కంటె పెద్దది. అయినా పశ్చిమ పాకిస్తాన్‌ వాళ్లు వాళ్లను అణచి వేయాలని చూశారు. మొదట రాజకీయంగా, 1970లో సైనికపరంగా! 

అప్పుడు జరిగిన జాతిహననం (జెనోసైడ్‌) మతపరంగా జరగలేదు. తూర్పు పాకిస్తాన్‌లోని హిందువులను, ముస్లిములను యిద్దరినీ చంపేశారు. భారత్‌ సహకారంతో తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ దాడిని తట్టుకుని, బంగ్లాదేశ్‌ అనే విడి దేశంగా ఆవిర్భవించింది. ఆ క్రమంలో ఇండియా బంగ్లాదేశీ శరణార్థులకు ఏడాది పాటు ఆశ్రయం యిచ్చి తిరిగి వెళ్లమంది. ఆ శరణార్థుల ఖర్చును మన ప్రభుత్వం పౌరుల నుంచి అదనపు తపాలా బిళ్ల రూపంగా వసూలు చేసింది. శరణార్థుల్లో చాలామంది వెళ్లిపోయినా, కొందరు ఉండిపోయారు. వారిలో హిందువులు, ముస్లిములు యిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలామంది బంగ్లాదేశీయులు, యిరుమతాల వాళ్లూ వలస వస్తూనే ఉన్నారు. వాళ్ల తాకిడి అసాంపై పడి, అక్కడి జనజీవితం అస్తవ్యస్తమైంది. ఇదెక్కడి న్యాయమని అసాం విద్యార్థులు ఆందోళన చెయ్యగా, చెయ్యగా చివరకి బంగ్లాదేశ్‌ ఆవిర్భావం వరకు వచ్చిన వారిని పౌరులుగా స్వీకరించాలని, తర్వాత వారిని గుర్తించి వెనక్కి పంపేయాలని కేంద్రప్రభుత్వం ఒప్పుకుంది.

ఆ తర్వాత కూడా వచ్చినవారిని మనం ఎందుకు ఆమోదించాలి? అనేదే ప్రధానమైన ప్రశ్న. ఎందుకు వస్తున్నారు వాళ్లు? మెరుగైన జీవనోపాధి కోసం వస్తున్నారన్నది నిస్సందేహం. మతపరమైన అణచివేత తట్టుకోలేక హిందువులు వస్తున్నారని మాటవరసకి అనుకున్నా, మరి ముస్లిములు ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. బంగ్లాదేశ్‌ ప్రజలు అవస్థలు పడుతున్నారు, వారి జీవన ప్రమాణాలు సరిగ్గా లేవు అంటే హిందువులకు, ముస్లిములకు అందరికీ వర్తిస్తుంది. మా బతుకులు బాగుపడడానికి వస్తున్నాం అంటే మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన వున్నవాళ్లంతా చైనా వెళ్లి స్థిరపడతాం అంటే చైనా రానిస్తుందా? మతపరమైన వివక్షత జరుగుతోందనే కారణం చెపితే, యిక్కడ మన దేశంలో కొన్ని సందర్భాల్లో దళితులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లంతా మాపట్ల కులవివక్షత చూపుతున్నారని ఫిర్యాదు చేస్తే బంగ్లాదేశ్‌ రానిస్తుందా?

నా ఉద్దేశంలో యీ మతపరమైన వివక్షత అంతా ఒట్టిమాట. సాగినంత కాలం అక్కడే ఉన్నారు. జరుగుబాటు కాకపోతే యిటు వచ్చేస్తున్నారు. ఒకవేళ హిందువులకు అవకాశాలు రావటం లేదు అంటే ఆ పరిస్థితి 1950లలోనే ప్రారంభమై ఉండాలి. అప్పుడు రాకుండా యిప్పుడు వచ్చారంటే యిదొక సాకు మాత్రమే. హిందువులపై ప్రత్యేకంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న దానికి రుజువేమిటి అని అడిగితే మన వాళ్లలో కొందరు  అక్కడ గుళ్ల సంఖ్య తగ్గింది అని చెప్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో చర్చిల సంఖ్య తగ్గిందని వాటికనే చెబుతోంది. అంతమాత్రం చేత అక్కడ క్రైస్తవులను అణచివేస్తున్నారని అనగలమా? 

అమెరికాలో అనేక చర్చిలకు భక్తులు రాకపోవడంతో ఆదాయం తగ్గి, నిర్వహణాభారం పెరిగి మూసివేసే దశకు వచ్చాయి. మన హిందువులు కొందరు వాటిని కొనేసి, దేవాలయాలుగా మారుస్తున్నారు. హిందువులు క్రైస్తవులను పీడించారని అనగలమా? ఇక్కడ కూడా కొత్తగా సాయిబాబా గుడులు వెలుస్తున్నాయి తప్ప, పురాతన శైవ, వైష్ణవ దేవాలయాలు నిర్వహణ లేక శిథిలాలయ్యాయి. ధూపదీపనైవేద్యాలు ఉండటం లేదు. అర్చకులకు జీతాలు లేవు. మరి యిక్కడా హిందువులు అణచివేతకు గురవుతున్నారా? గుడికి వెళ్లేవారు లేకపోతే, ఆదరణ కోల్పోయి, మూతపడడం సహజం.

 రాష్ట్రప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతతో మన దేశంలో బాబ్రీ మసీదును కూలగొట్టినట్లు పొరుగున ఉన్న ముస్లిం దేశాల్లో హిందూ దేవాలయాలను వేటినైనా కూలగొడితే దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆ వెనువెంటనే ఎవరైనా తరలివస్తే వాళ్ల కేసు పరిశీలించాలి. బాబ్రీ మసీదు కూలగొట్టిన పాతికేళ్లకు ఎవరైనా భారతీయ ముస్లిము పాకిస్తాన్‌కి వెళ్లి 'మాకు మతస్వేచ్ఛ లేదు, మా ప్రార్థనాలయం కూల్చారు, మీ పౌరసత్వం యివ్వండి.' అని చెపితే 'ఇన్నాళ్లూ ఏం చేశావ్‌ బాబూ?' అని అడుగుతారు. 

ఇది కాకుండా చెప్పే మరో కారణం ఏమిటంటే - ఆ యా దేశాల్లో హిందువుల శాతం తగ్గిపోయింది అని. సంఖ్య తగ్గడానికి అనేక కారణాలుండవచ్చు. ఆ మాటకొస్తే మన దేశంలో కూడా హిందువుల సంఖ్య తగ్గి వుంటుంది. కుటుంబ నియంత్రణ పాటించడం వలన కావచ్చు, యితర దేశాలకు వలస వెళ్లడం కావచ్చు. 1947 తర్వాత అనేక ప్రపంచ దేశాల్లో స్థిరపడిన హిందువులు భారత్‌ నుంచి వెళ్లినవారే కదా! ఆ మేరకు యిక్కడ సంఖ్య తగ్గినట్లేగా! గల్ఫ్‌ దేశాల్లో ఊపు వచ్చాక కేరళ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లిములు ఉద్యోగార్థం వెళ్లారు. ఆ మేరకు కేరళలో వారి జనాభా తగ్గింది. అందువలన హిందువులు, ముస్లిములను యిక్కడ బాధిస్తున్నారని అర్థం కాదు కదా! పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది హిందువులు బాగా చదువుకుని మన దేశపు హిందువుల లాగానే యూరోప్‌లో, అమెరికాలో నివాసముంటున్నారేమో! విషయాలు లోతుగా తెలుసుకోకుండా భావావేశంతో ఏవేవో తీర్మానాలు చేసేయడం తప్పు. 

ఇక మూడో అంశం - హిందువులకు ప్రపంచంలో వేరే ఎక్కడికీ వెళ్లే అవకాశం లేదు కాబట్టి మన దేశం ఒక్కటే ఏకైక హిందూ దేశం కాబట్టి వారికి పౌరసత్వం యివ్వవలసిన బాధ్యత మనదే అనడం! మొదటగా తెలుసుకోదగినది, మనది హిందూదేశం కాదు. అన్ని మతాలకు సమానావకాశం యిచ్చిన దేశం. కొన్ని దేశాలు తమ అధికారం మతం క్రైస్తవం, ఇస్లాం అని ప్రకటించుకున్నట్లు మనం హైందవం అని ప్రకటించుకోలేదు. మన దేశం హిందూస్తాన్‌ కదా అంటే అది ప్రాంతం బట్టి వచ్చిన పేరు. అలా అయితే హిందూకుష్‌ పర్వతాలు కూడా మనవే అనాలి. పేరు బట్టే అన్నీ వుంటాయనుకుంటే పాకిస్తాన్‌ పేరుకి అర్థం పవిత్రస్థలం అని. అక్కడేమైనా పవిత్రత కనబడుతోందా? 

ముఖ్యమైన పాయింటు - హిందువులు వెళదామనుకుంటే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లవచ్చు. 'హిందువులకు ప్రవేశము లేదు' అని ఏ దేశమూ బోర్డు పెట్టుకోలేదు. భారత్‌లో ఉన్న హిందువులే యితర దేశాల్లో ఉండగా లేనిది, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో హిందువులు వెళ్లలేరా? అక్కడ బతకలేరా? చౌకగా కూలిపని చేస్తానంటే గల్ఫ్‌ వాళ్లు ఎవరినైనా రానిస్తున్నారు. అక్కడ కాకపోతే ఆఫ్రికాకు వెళ్లవచ్చు. అక్కడా మన హిందువులు అనేక దేశాల్లో కష్టపడి పైకి వచ్చారు. అక్కడి పౌరసత్వం యిస్తారో లేదో తెలియదు కానీ వర్క్‌ పర్మిట్‌లు మాత్రం యిస్తున్నారు. ఇండియాలో వచ్చి మన నెత్తి ఎక్కడం తప్ప, వారికి గత్యంతరం లేదని, లేకపోతే ఊచకోతకు గురవుతారని చెప్పడం అబద్ధం. 

1971 తర్వాత పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో అలాటి నియంతలు ఎవరూ రాలేదు. అఫ్గనిస్తాన్‌ అంటారా, అక్కడ సోదర ముస్లిములనే ఊచకోత కోస్తున్నారు. బౌద్ధ విగ్రహాన్ని బద్దలు కొట్టారు. పౌరసత్వ సవరణ చట్టంలో ఎఫెక్టు కోసం అఫ్గనిస్తాన్‌ పేరు కూడా చేర్చారు కానీ అక్కడ బౌద్ధులు, శిఖ్కులు, జైనులు, క్రైస్తవులు, పార్శీలు, హిందువులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనైనా ఉన్నారని నేననుకోను. 

హిందువులకు ఉన్నది హిందుస్తాన్‌ ఒక్కటే అని వాదించేవారు ఆ చట్టంలో ముస్లిములు కాక తక్కిన మతాల పేర్లు ఎందుకు వచ్చారో చెప్పలేరు. జైనులు, శిఖ్కులు వేర్వేరు మతాలైనా హిందువులకు అనుబంధ మతాలే అనుకున్నా, పార్శీలు ఎక్కణ్నుంచి వచ్చారు? వారిది పర్షియా. వారి మతం జొరాష్ట్రియన్‌. కావాలంటే పర్షియా వెళ్లవచ్చు. వారిలో కొందరు కొన్ని శతాబ్దాల క్రితం భారత్‌కు శరణార్థులుగా వచ్చినంత మాత్రాన వాళ్లనీ భారత్‌ ఆహ్వానించాలా? బౌద్ధం భారత్‌లో ఆవిర్భవించింది సరే, కానీ అది ఒక ప్రధానమతంగా చైనా, జపాన్‌, యితర ఆగ్నేయాసియా దేశాల్లో ఉంది. వాళ్లు అక్కడకి వెళ్లవచ్చుగా! 

ఇక క్రైస్తవులు, వారి మతం ప్రపంచంలో ఎన్ని దేశాల్లో వుందో లెక్కే లేదు. ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇక్కడే రావడం దేనికి? వీళ్లందరి పేర్లూ చేర్చి ఒక్క ఇస్లాంను మాత్రం వదిలేస్తే అది బాహాటంగా వివక్షత చూపినట్లు కాదా? ఈ చట్టం చూసి భారతీయ ముస్లిం భయభ్రాంతులకు గురవుతున్నాడంటే కాడా? ముస్లిమే కాదు, మతాన్ని, రాజకీయాలను విడిగా వుంచాలని కోరుకునే వారందరూ దడుచుకున్నారంటే దడుచుకోరా? (సశేషం)

(ఫోటో - 1971 బంగ్లాదేశీ శరణార్థులు) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)