cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పవన్‌కి మతోయిందా?

ఎమ్బీయస్‌: పవన్‌కి మతోయిందా?

''పవన్‌ కళ్యాణ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లేని కరంటు లాటి వాడు'' అన్నాడో మిత్రుడు. అతని ఆలోచనాధోరణి, శక్తియుక్తులు ప్రజలకు చేరవు, చేరే వ్యవస్థ, పార్టీనిర్మాణం అతను ఏర్పాటు చేసుకోలేదు అని అతని భావన. ఇప్పుడు తిరుపతిలో  హిందువులపై, ఇంగ్లీషు మీడియంపై మాట్లాడినది వింటే ఓల్టేజి స్టెబిలైజర్‌ లేని కరంటు కూడా అనిపిస్తోంది. ఒక్కోప్పుడు లో ఓల్టేజి కారణంగా నెలల తరబడి నిశ్చేతనంగా ఉంటాడు. ఇంకోప్పుడు హై ఓల్టేజి కారణంగా తీవ్రంగా విరుచుకు పడతాడు. షాకిస్తాడు. హిందువులు, సెక్యులరిజం గురించి అతను అన్నదానిపై రాయడానికి చాలా ఉంది, దానికి ముందు తక్కిన విషయాలపై నా అభిప్రాయాలు చెప్పేస్తాను. 

'ఇంగ్లీషు మీడియంలో చదివినవారు జైలుకి ఎందుకు వెళతారు? అంటే జైలు కెళ్లడం ఇంగ్లీషు నేర్పిందా?' అని పవన్‌ వేసిన ప్రశ్న అర్థరహితం. రెండూ వేరేవేరే విషయాలు, రెండిటికి ముడిపెట్టడం మతిలేని  పని. ఏ మీడియంలో చదివినా, అసలు చదవకపోయినా జైలుకి వెళ్లవచ్చు. 'నన్ను ప్రాథమిక విద్య అనంతరం ఇంగ్లీషు మీడియంలో చేర్పించారు. దీంతో చదువంటేనే విరక్తి, భయం వచ్చేశాయి.' అని పవన్‌ చెప్పుకున్నారు. తెలుగు మీడియంలో కంటిన్యూ అయి వుంటే చదువంటే ఆసక్తి కలిగేదన్న గ్యారంటీ లేదు. ఆ మీడియంలో చదువుతూ చదువు వదిలేసినవారు చాలామంది ఉన్నారు. 'భాషలోని పాండిత్యాన్ని అర్థం చేసుకునే శక్తి యీ సమాజం నాకు లేకుండా చేసింది' అని వాపోయారు. తెలుగు మీడియంలో చదివిన చాలామందికి ఆ శక్తి లేదు, ఆసక్తి లేక! 

సినిమాల్లోకి వద్దామనుకున్నాక పవన్‌ నాట్యం, పోరాటం, గుఱ్ఱపుస్వారీ, అభినయం వంటి చాలా విద్యలు నేర్చుకుని ఉంటారు. కావాలనుకుంటే యిదీ నేర్చుకుని వుండవచ్చు. అలా నేర్చుకోకపోవడానికి ఇంగ్లీషు మీడియంలో పెట్టిన తలితండ్రులను తప్పుపట్టడం పొరబాటు. 'షేక్‌స్పియర్‌ గురించే ఎందుకు చదవాలి? తిక్కన, నన్నయ ఉన్నారు కదా' అని అడిగారు. ఇంగ్లీషు మీడియంలో చదివినవారు చదువు అయిపోయాక షేక్‌స్పియర్‌ చదువుతున్నారా? తెలుగు పాఠ్యాంశంగా చదివినవారు స్కూలు చదువయ్యాక నన్నయ తిక్కన చదువుతున్నారా? ఇంట్రస్టు ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. తెలుగు మీడియంలో చదవకపోయినా శేషేంద్రశర్మ కవిత్వాన్ని పవన్‌ చదివారు కదా! మీడియంతో సమస్య లేదు, ఆసక్తితో ఉంది. తెలుగు సాంతం తీసేస్తే యిలాటి బాధకు అర్థం ఉంటుంది కానీ తెలుగు సబ్జక్టుగా ఉన్నంతకాలం యీ వేదన అనవసరం.

తెలుగు హీరోలకు చాలామందికి తెలుగు మాట్లాడడం, రాయడం రాదని పవన్‌ వాపోయారు. హీరోయిన్‌లు, విలన్‌లు కారెక్టరు యాక్టర్ల విషయంలో అది కరక్టు కావచ్చేమో కానీ హీరోలకు తెలుగు రాయడం రాకపోవచ్చు కానీ మాట్లాడడం రాదంటే నమ్మలేం. తెలుగు రాయడం రాకపోవడానికి కారణం పరరాష్ట్రాలలో పెరగడం కావచ్చు, స్వరాష్ట్రంలో చదివినా తెలుగు నిర్బంధం కాకపోవడం వలన కావచ్చు. ఇప్పుడు తెలుగు సబ్జక్టు నిర్బంధం చేయాలని డిమాండు చేయడం ద్వారా పవన్‌ యీ సమస్యకు పరిష్కారం చూపవచ్చు. 'బూతులు, తిట్లే సినిమాల్లో ప్రమాణాలై పోయాయి' అని యిప్పుడు వాపోతున్న పవన్‌ సినిమాల్లో అతను పలికిన కొన్ని డైలాగులు మ్యూట్‌ కావడం గమనించాను. గొంగళిలో తింటూ.. సామెత గుర్తుకు వచ్చింది. 

ఇక జగన్‌ జైలు ప్రస్తావన గురించి. పవన్‌ తరచుగా మాట్లాడేది దీని గురించే. టిడిపి వాళ్లు ఎ1 అంటూంటారు, ఈయన జైలు అంటాడు. ఇవన్నీ వినివిని కూడా ఓటర్లు వైసిపికి 151 సీట్లు యిచ్చారు. జైలుకి వెళ్లకపోయినా పవన్‌ను రెండు చోట్ల ఓడించారు. ఎందుకంటే జగన్‌ జైలుకి వెళ్లినది రాజకీయ కారణాల చేత తప్ప, కోర్టులో శిక్ష పడి.. కాదు. కేసులు పెట్టి యిన్నాళ్లయినా ఒక్క దానిలోనూ తీర్పు రాలేదు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చూపి, జైల్లో పెట్టారు. ఇక కేసులంటే - యీ దేశంలో ఎవరైనా ఎవరి మీదైనా ఏ కారణం చూపైనా కేసు పెట్టవచ్చు. వరకట్నం కేసుల్లో అమెరికాలో ఉన్న ఆడపడుచు మొగుడి మీద కూడా పెట్టేస్తున్నారు. శ్రీజ యింట్లోంచి వెళ్లిపోయినప్పుడు మా బాబాయి నన్నేమైనా చేస్తాడని భయం అంది. వెంటనే పవన్‌ తుపాకీ తీసుకుని వచ్చి పోలీసు స్టేషన్‌లో సరెండర్‌ చేశాడు. అయినా కత్తితో పొడుస్తావేమోనని అనుమానం అంటూ పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకుని వుండవచ్చు. 

'మతం మారితే కులం పేరు పేరెందుకు?' అని పవన్‌ చాలా సమంజసమైన ప్రశ్న అడిగారు. 2009లోనే నేను వైయస్సార్‌ క్రైస్తవుడు తప్ప రెడ్డి కాదు అని వ్యాసం రాస్తే చాలామంది ఆశ్చర్యపడ్డారు. కొంతమంది క్రైస్తవ రెడ్లు 'మా మతం క్రైస్తవం, కులం రెడ్డి. తరతరాలుగా యిదే పద్ధతి' అంటూ అమాయకంగా వాదించారు. క్రైస్తవంలో కులం ఉందా? బైబిల్‌లో కులం గురించి రాశారా చూపండి అంటూ అడిగాను. వాళ్లు కన్‌ఫ్యూజ్‌ అయిపోయారు. చిన్నప్పణ్నుంచి వాళ్లు అలాగే నమ్మారు. నా ఫ్రెండు ఒకతను గుజరాతీ జైన్‌. మతం హిందూ, కులం జైన్‌ అని అఫీషియల్‌ డాక్యుమెంట్లలో రాసేవాడు. జైన్‌ అనేది వేరే మతం కదా, హిందూ ఎలా రాస్తావంటే 'ఏమో, మా పూర్వీకుల దగ్గర్నుంచి యిలాగే రాస్తున్నాం' అని వాదించాడు. కావచ్చు. నేను గమనించిన దేమిటంటే రెడ్డి, చౌదరి వంటి ఆధిపత్య కులాల వారే మతం మారినా కులం పేరు కొనసాగిస్తున్నారు. జార్జి నాయుడు, పీటర్‌ యాదవ్‌, జాన్‌ గౌడ్‌.. యిలాటి వాళ్లు నాకు తగలలేదు. 

కడప జిల్లాలో యీ క్రైస్తవ రెడ్లు చాలామంది కనబడతారు. దీనికి అభ్యంతర పెట్టవలసినది చర్చిలే. క్రైస్తవంలోకి వచ్చాక ఆ కులం పేరు తీసేయ్‌ అని పట్టుబట్టాలి. ముస్లిం మతంలోకి మారితే కులం తగిలించుకుంటే ఒప్పుకోరు. బెంగాల్‌ ప్రాంతంలో చౌధురి అనేది కులం పేరు కాదు, టైటిల్‌. అందుకే ఘనీఖాన్‌ చౌధురి, అధీర్‌ రంజన్‌ చౌధురి కనబడతారు. మతవ్యాప్తికి అడ్డు వస్తోందని కాబోలు ఆంధ్రలో చర్చిలు కులసంకేతం వద్దని పట్టుబట్టటం లేదు. ఇది జగన్‌తో ప్రారంభం కాలేదు, అతనితో అంతం కాబోదు. పవన్‌కి హఠాత్తుగా యీ విషయం గుర్తుకు రావడానికి కారణం రాజకీయమే కావచ్చు. కానీ తన ఫ్యాన్స్‌లో క్రైస్తవుల్ని కులనామం వదులుకోమని పిలుపు నివ్వడం, ఆ మేరకు షరతులు పెట్టాలని చర్చిలకు విజ్ఞప్తి చేయడం యిలాటివి చేస్తే బాగుంటుంది.

ఇక హిందూమతం గురించి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. 'మతరాజకీయాలు చేసేది హిందూనేతలే' అనేది సర్వాబద్ధం. ముస్లింలు ముస్లిం లీగు, మజ్లిస్‌ వగైరా పేరుతో, శిఖ్కులు అకాలీ దళ్‌ పేరుతో, క్రైస్తవులు కేరళ కాంగ్రెసు (కొందరు నాయర్లను కలుపుకున్నారు) పేరుతో దశాబ్దాలుగా మతరాజకీయాలు నడుపుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో గుళ్లలో హిందువులకు ఓటేయమని ప్రసంగాలు చేయరు కానీ మసీదుల్లో, చర్చిల్లో ఫలానావారికి ఓటేయమని బోధిస్తూంటారు. హిందువులకు హిందూ మహాసభ ఉండేది. కానీ దానికి ప్రజాదరణ పెద్దగా లభించలేదు. అత్యధికభాగం హిందువులు కాంగ్రెసునే ఆదరించారు. ముస్లిములలో ముస్లిం లీగ్‌ అనుయాయుల కంటె కాంగ్రెసు అనుయాయులే ఎక్కువ వుండేవారు. శిఖ్కులందరూ అకాలీ దళ్‌లో, కేరళ క్రైస్తవులందరూ కేరళ కాంగ్రెసులో లేరు. వారివారి రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. మన దేశంలో హిందువులు ఎక్కువ కాబట్టి తమ కంటూ ఓ పార్టీ విడిగా ఉండాలి అనే భావన వారికి ఎప్పుడూ కలగలేదు.

అయితే దేశవిభజన అల్లర్ల తర్వాత హిందువులకు స్వీయరక్షణ అవసరం అనే అభిప్రాయం ఉత్తరాది ప్రాంతాల్లో బలపడింది. కాంగ్రెసు పార్టీ పాకిస్తాన్‌ పట్ల, దేశంలో ఉన్న ముస్లిముల పట్ల అవసరమైన దాని కంటె ఎక్కువ ఉదారంగా ఉంటోందని, దానివలన హిందువులకు నష్టం వాటిల్లుతోందని కొందరు ప్రచారం చేయసాగారు. భారతదేశం అన్ని మతాలనూ సమానంగా చూడవలసిన అవసరం లేదని, ఇది ప్రధానంగా హిందూదేశమే కాబట్టి, యిక్కడ ఉన్నవారెవరైనా సరే హిందూ సంస్కృతికి, ఆహారపు అలవాట్లకు, జీవనవిధానానికి లోబడి ఉండాలని వాదించసాగారు. అలా ఉండడం యిష్టం లేనివాళ్లు పాకిస్తాన్‌కో, పాలస్తీనాకో వెళ్లిపోవాలని అనసాగారు. ఇది హిందూత్వవాదం అని పేరు పడింది. హిందువుల్లో అతివాదులు హిందూత్వవాదులు అనుకోవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ హిందూత్వవాదులకు, హిందువులకు కన్‌ఫ్యూజ్‌ అయి యిద్దర్నీ కలిపి మాట్లాడేశారు. 'సెక్యులరిజాన్ని యిబ్బంది పెడుతోంది హిందువులు మాత్రమే' అనడం ఘోరాతిఘోరం. 

'సర్వమత సమభావన' అనే కాన్సెప్టు హిందూమతానిదే. నాస్తికత్వంతో సహా అన్ని రకాల భేదాభిప్రాయాలను యిముడ్చుకున్నది హిందూమతమే! నువ్వు విష్ణువుని ఆమోదించకపోయినా, శివుణ్ని ఆమోదించకపోయినా, అసలు దేవుడికి రూపమే లేదు పొమ్మన్నా, సృష్టికి మూలకారణం దేవుడు కాదన్నా, సాయిబాబా వంటి అన్యమతస్తుడిని కొలిచినా - నువ్వు హిందువుగానే పరిగణించబడతావు. దీనికి పోప్‌్‌ లాటి పీఠాధిపతి ఎవరూ లేరు. ఎవరి అభిమతం వారిదే. బహుళత్వమే భరతజాతి సంస్కృతికి పట్టుకొమ్మ. భరతభూమిలో మెజారిటీ హిందువులే కాబట్టి, ఆ బహుళ సంస్కృతి క్రెడిట్‌, పరమతసహన క్రెడిట్‌ హిందువులకే చెందుతుంది. అందుకే హిందూ మహాసభ, ఆరెస్సెస్‌, భారతీయ జనసంఘ్‌, బిజెపి వంటి హిందూత్వ సంస్థలు అధికారం కోసం దశాబ్దాల పాటు పోరాడవలసి వచ్చింది. హిందువులు మతపరంగా ఓట్లేసి ఉంటే ఆ పార్టీలు ఎప్పుడో గద్దె కెక్కేవి. ఇది గ్రహించిన బిజెపి ఒక దశలో ఆరెస్సెస్‌ భావజాలానికి దూరంగా జరిగి, తమ విధానమూ సెక్యులరిజమే అనసాగారు. ఆడ్వాణీ తను సెక్యులరిస్టునని, కాంగ్రెసు, కమ్యూనిస్టులు యిత్యాదులు సూడోసెక్యులరిస్టులని అనసాగారు.

సూడో (కుహనా) సెక్యులరిస్టులు అని వారెందుకు అన్నారంటే బిజెపియేతర రాజకీయపక్షాలు మైనారిటీల పాలిట రక్షకులుగా అవతార మెత్తడం చేత! నిజానికి వీళ్లు ముస్లిముల ఉద్ధరణకు చేసింది ఏమీ కనబడదు. చేసి ఉంటే, ముస్లిముల స్థితిగతులు యిలా వుండేవి కావు. వీళ్లు ముస్లిము ఛాందసవాదులు చెప్పినట్లు ఆడుతూ, అది చూసి మురిసి ముక్కలై యావన్మంది ముస్లిములు తమకు ఓటేసేస్తారనే భ్రమలో బతుకుతూ వచ్చారు. మీ కోసం ఉర్దూ మీడియం స్కూళ్లు పెడతాం, ఇమాముల జీతాలు పెంచుతాం, మదరసాలను స్కూళ్లగా గుర్తిస్తాం, ముమ్మారు తలాక్‌ విషయంలో ఆడవాళ్లకు అన్యాయం జరిగినా ఆ జోలికి రాము, భరణం విషయంలో ఆడవారికి అన్యాయం జరిగి, సుప్రీం కోర్టు తీర్పు వారి పక్షాన తీర్పు యిచ్చినా దానిని తిరగతోడి దుర్మార్గులైన మీ మగవాళ్లకు అండగా నిలుస్తాం.. యిలాటి వాగ్దానాలతోనే నెట్టుకుని వచ్చారు. 

మెజారిటీ హిందువులు ఉదారవాదులు అయినట్లే, మెజారిటీ ముస్లిములు ఉదారవాదులు. దేశమంతా ఎటువైపు గాలి వీస్తూ ఉంటే వాళ్లూ అటే ఓట్లేశారు. ఇందిరా గాంధీ ప్రభంజనంలో కానీ, జనతా ప్రభంజనంలో కానీ, ఎన్టీయార్‌ ప్రభంజనంలో కానీ వారు భిన్నంగా ఓటేయలేదు. కానీ వారిని ప్రత్యేక ఓటు బ్యాంకుగా చూస్తూ తక్కిన పార్టీల వారు వారిలో ఛాందస నాయకులను దువ్వుతూ వచ్చారు. మతరాజకీయాలు నడిపే మైనారిటీలకు చెందిన మతతత్వ పార్టీలతో భాగస్వామ్యం నెరుపుతూ, హిందూత్వ పార్టీ ఐన బిజెపిని మాత్రం అంటరానిదానిగా చూశాయి ఆ పార్టీలు. 'మేం సెక్యులరిస్టులం, మతతత్వ పార్టీ ఐన బిజెపికి వ్యతిరేకులం' అంటే చాలు, ఎంత అవినీతిపరులైనా సరే, అసమర్థులైనా సరే వాళ్లతో చేతులు కలుపుతూ వచ్చారు. బిజెపి ఒంటరిదై పోతూ వచ్చింది. దాంతో వాళ్లు యీ పార్టీలన్నిటినీ కలిపి సూడో-సెక్యులర్‌ పార్టీలు అనసాగారు. తటస్థులైన ప్రజలను ఆకర్షించడానికి బిజెపి వాజపేయి వంటి ఉదారవాదిని ముందు పెట్టుకుని, భిన్న సిద్ధాంతాలకు చెందిన పార్టీలతో కలిసి ఎన్‌డిఏ ఏర్పరిచింది. ఆరేళ్లు పాలించింది.

కానీ ఆర్థిక విషయంలో, అభివృద్ధి విషయంలో ప్రజలను సంతృప్తి పరచలేక 2004 ఎన్నికలలో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెసు నాయకత్వంలో పదేళ్లు రాజ్యం చేసిన యుపిఏ అవినీతిలో కూరుకుపోయి ప్రజల చేత అసహ్యించుకోబడింది. ఈ వైఫల్యానికి సెక్యులరిజానికి ముడిపెట్టి బిజెపి యీసారి మోదీ నాయకత్వంలో హిందూత్వ ప్లస్‌ విపరీత జాతీయవాదం జండాతో 2014 ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. ఇక అప్పణ్నుంచి హిందూత్వ అజెండా ఉధృతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రతిపక్షాలు చేతకానితనంతో మూలపడడంతో, రాజకీయపు టెత్తులను ఉపయోగించి బిజెపి నానాటికీ విరాజిల్లుతోంది. ఇప్పుడు సూడో అనే మాట తీసేసి అసలు సెక్యులరిజం అనేదాన్నే నిందార్థంలో వాడుతున్నారు. సెక్యులరిస్టులు హిందూ ధర్మానికి వ్యతిరేకులు అనే అర్థం తీస్తున్నారు. ఉదార హిందువులు యీ పరిణామాలను చూసి విస్తుపోతున్నారు. ఐసిస్‌ గురించి అడిగితే ఉదార ముస్లిముల్ని అడిగితే వాళ్లు ఎలా అయితే చేతులెత్తేస్తారో, యిప్పుడు హిందూత్వ ప్రభంజనం గురించి సాధారణ హిందువులు అలాగే చేతులెత్తేస్తున్నారు. 

ఈ హిందూత్వ ఉధృతి యింకా ఐదేళ్లు వుంటుందో, ఆ లోపులే ముగుస్తుందో తెలియదు. మీడియా వేసిన లెక్కల ప్రకారం 2017లో భారత్‌లో 71% ఏరియాలోని రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి, దాని మిత్రపక్షాలు 2019 నాటికి 40%కి పడిపోయాయట. ఇప్పటికీ ఆ పార్టీ ఆధ్వర్యంలో 17 రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ వీటిలో పెద్ద రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, హరియాణా మాత్రమే. 2019 పార్లమెంటు ఎన్నికలలో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందారు కానీ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ఆ మంత్రం పారలేదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ, బెంగాల్‌లలో రాబోయే ప్రభుత్వం బిజెపిదే అని చెప్పుకున్నారు కానీ హుజూర్‌ నగర్‌ ఉపయెన్నికలో 1% ఓట్లు కూడా రాలేదు. ఇక బెంగాల్‌లో మొన్న జరిగిన 3 ఉపయెన్నికలలో బిజెపి ఒక్కటీ గెలవలేదు. హిందూత్వ గురించి సోషల్‌ మీడియా ఎంత అడావుడి చేసినా, క్షేత్రస్థాయిలో ఆర్థిక కారణాలే ప్రజల తీర్పును ప్రభావితం చేస్తున్నాయి. మతం పేర కొట్లాట పెట్టుకునే తీరిక కానీ, ఓపిక కానీ ఎవరికీ లేవు. 

ఇలాటి సమయంలో పవన్‌ మతం గురించి ఎక్కువగా మాట్లాడడమే అనవసరం. ఒకవేళ మాట్లాడదలిస్తే పెరుగుతున్న హిందూత్వ రాజకీయ భావనల గురించి అటోయిటో వ్యాఖ్యానించాలి. కానీ హిందూత్వ రాజకీయాన్ని హిందువుల తలకు చుట్టి హిందువులను అసహనపరులుగా చిత్రీకరించడం అన్యాయం, అక్రమం. 'టిటిడిలో అన్యమత ప్రచారం చేయిస్తున్నది హిందువులే, హిందూ నాయకుల ప్రేరణ లేనిదే యిలాటివి జరగవు' -  అని యీయన ఏ ఆధారాలతో తీర్మానించాడు? బిజెపి అధికారంలోకి రాని క్రితం నుంచి ఆ పని జరుగుతూనే ఉంది. 'సెక్యులరిజాన్ని యిబ్బంది పెట్టేది, మతాల గొడవలు పెట్టేది హిందువులే, యితర మతాల నాయకులు యిలాటివి చేయరు' - అని సర్టిఫికెట్టు దేని ఆధారంగా యిచ్చాడు? ఎన్నికలలో గెలుపు కోసం మతాన్ని కాదు, కులాన్ని కాదు, దేన్నయినా వాడుకుంటూ వస్తున్నారని, దీనికి ఏ మతస్తులూ మినహాయింపు కాదనీ చరిత్ర చెపుతోంది. ఇది తెలుసుకోవడానికి వేలాది పుస్తకాలు చదవనవసరం లేదు. పాతబస్తీలో మజ్లిస్‌ చేస్తున్నదేమిటో చూస్తే చాలు. పవన్‌ను ఖండించవలసిన పని బిజెపిది, విఎచ్‌పిది మాత్రమే కాదు, హిందువులందరిదీ! వారిలో హిందూత్వవాదులు కూడా ఉంటే ఉండవచ్చు, కానీ హిందూ ఉదారవాదులు కూడా గళమెత్తి యితన్ని ఖండించాలి.

ఈ వ్యాఖ్యలతో బాటు పవన్‌ జగన్‌కు వ్యతిరేకంగా అనేక రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చేస్తే చేయవచ్చు కానీ వాటివలన ఫలితం పెద్దగా ఉండదని నా అభిప్రాయం. జగన్‌ వచ్చి ఆర్నెల్లు కాకుండానే యిలా విరుచుకు పడిపోతే ఏకీభవించే ప్రజలు తక్కువ వుంటారు. ఓ ఏడాది ఓపిక పడితే అప్పటికి జగన్‌ పొరపాట్లు చాలా దొరుకుతాయి. ఇప్పటికే ఆంధ్రజ్యోతి టీవీని బహిష్కరించి చాలా పెద్ద తప్పు చేశాడు. విమర్శను ఎదుర్కోవాలి ప్రశ్నించే గొంతును నులిమివేయ కూడదు. తప్పుడు వార్తలు రాస్తే ప్రభుత్వపరంగా కేసులు పెడతాం జాగ్రత్త అనడం వరకు కరక్టే. అబద్ధపు దుష్ప్రచారం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఓ టీవీ ఛానెల్‌ చూడడానికే వీల్లేదనడం అధికార దుర్వినియోగం. గతంలో బాబు, కెసియార్‌ యిలా చేసి విమర్శల పాలయ్యారు. అలాగే పథకాలకు పాత పేర్లు తీసేసి, వైయస్‌ పేరు పెట్టడాలు, చంద్రన్న తరహాలో జగనన్న అమ్మ ఒడి అంటూ పేరు పెట్టడం - యివన్నీ టిడిపి పోకడలే. వీటిని ప్రజలు ఏ మేరకు సహించారో ప్రత్యక్షంగా చూసి కూడా జగన్‌ నేర్చుకోకపోవడం అవివేకం.

దేశం మొత్తం మీద ఆర్థిక స్థితి కుదేలయింది. రాష్ట్ర పరిస్థితి అంతకంటె వెనకే ఉంది తప్ప మెరుగ్గా లేదు. అయినా జగన్‌ అడ్డూ, ఆపూ లేకుండా వరాలు ప్రకటిస్తూనే పోతున్నాడు. నిధులు ఎక్కణ్నుంచి వస్తాయో చెప్పటం లేదు. వీటికి నిధులివ్వాలంటే పాత వాటికి కోత పెట్టాలి, లేదా ఎత్తి వేయాలి. వాటి వలన ప్రయోజనం పొందుతూ వచ్చినవారు గగ్గోలు పెడతారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది పడుతుంది. అప్పటికి జగన్‌పై మోజు తీరిపోయి, అతన్ని విమర్శించేవారు చెప్పేది జనాలు శ్రద్ధగా వినడం మొదలుపెడతారు. పవన్‌ యీ అస్త్రాలను అప్పటిదాకా దాచుకుంటే మేలు. ఇప్పుడే ఎమ్యూనిషన్‌ ఖర్చు చేసేసుకుంటే, అప్పటికి నిర్వీర్యం అయిపోతాడు. రాజకీయపరంగా ఏమైనా అనే స్వేచ్ఛ మన దేశంలో ఉంది. కానీ తెలిసీతెలియకుండా హిందువులను కానీ, మరో మతస్తులను కానీ విమర్శిస్తే ఛీత్కారాలు తప్పవు. ఇది పవన్‌ గుర్తెరగాలి. -
ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2019)
mbsprasad@gmail.com