cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అజిత్‌ నాటకానికి శరద్‌ సూత్రధారా?

ఎమ్బీయస్‌: అజిత్‌ నాటకానికి శరద్‌ సూత్రధారా?

అజిత్‌ పవార్‌ బిజెపితో చేతులు కలపగానే దీని వెనుక శరద్‌ హస్తముందని, అతను కేసుల భయంతో శివసేనకు జెల్ల కొట్టి, లోపాయికారీగా బిజెపితో ఒప్పందం కుదుర్చుకుని తన సోదరుడి కుమారుణ్ని అటు పంపాడని పుకార్లు వచ్చాయి. తర్వాత అజిత్‌ తనతో చెప్పకుండా వెళ్లాడని శరద్‌ ప్రకటించడం, సాయంత్రాని కల్లా అజిత్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా శరద్‌ చెంతకు చేరడం జరిగింది. ప్రస్తుతానికి 54 మందిలో 49/50 మంది శరద్‌ వైపు ఉన్నారు. అజిత్‌ను కూడా వెనక్కి రమ్మనమని రాయబారాలు పంపారు. ఇప్పటిదాకా అతను వెనక్కి రాలేదు. ఇప్పుడు కొంతమందికి వస్తున్న అనుమానం ఏమిటంటే - శరదే అజిత్‌ చేత యీ నాటకం ఆడించాడని! ఈ వాదం అర్థం కావాలంటే కొన్ని సంగతులు పరిగణనలోకి తీసుకోవాలి.

ఇవాళ మధ్యాహ్నం సుప్రీం కోర్టులో వాదనలు చూస్తే ఓ సంగతి అర్థమైంది. ఎన్సీపీ, సేన, కాంగ్రెసు తరఫు న్యాయవాదులు గవర్నరు అడావుడిగా, రహస్యంగా, దురుద్దేశంతో వ్యవహరించి దేవేంద్రను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాడని, ఫలానా తేదీలోగా బలాన్ని నిరూపించుకోమని అడగలేదని, అందువలన వెంటనే 24 గంటల్లో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించమని గవర్నరును కోర్టు ఆదేశించాలని కోరారు. గతంలో కర్ణాటక, గోవా విషయంలో కోర్టు యిలాటి ఆదేశాలే యిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రతిగా బిజెపి తరఫున, కేంద్రం తరఫున హాజరైన న్యాయవాదులు విచారణను సాగదీద్దామని చూశారు. అసలు ఆదివారం నాడు మీరెందుకు విచారిస్తున్నారు అని జడ్జిలను అడిగారు. ఈ కేసు హైకోర్టులో వేయాలి తప్ప సుప్రీం దాకా రావడమెందుకు అన్నారు. వ్యక్తులుగా కేసు వేయచ్చు తప్ప పార్టీలుగా కేసులు వేసి, ప్రాథమిక హక్కులకు భంగం అనకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం /కేంద్ర ప్రభుత్వం / గవర్నరు ఎలా వాదించాలో (బ్రీఫ్‌ చేయడం) తమకు చెప్పకపోవడం వలన వారి తరఫు వాదనలు వినిపించలేమన్నారు. 

చివరకు కోర్టు రెస్పాడెంట్లకు నోటీసులు యిచ్చి రేపు ఉదయం 10.30 కల్లా తమ తరఫు వాదనలు వినిపించమంది. రేపు వారి వాదనలు విన్నాక దేవేంద్ర తన మెజారిటీని 24 గంటల్లోనో, 48 గంటల్లోనో నిరూపించుకోవాలని ఆదేశిస్తే కథ త్వరగా ఓ కొలిక్కి వస్తుంది. లేకపోతే క్రయవిక్రయాలకు సమయమిచ్చినట్లే అవుతుంది. కోర్టు ఏం చేస్తుందో మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి అర్థమవుతున్నదేమిటి? బిజెపి వద్ద సంఖ్యాబలం లేదు, అందుకే బలపరీక్షకు వెనుకాడుతోంది. నవంబరు 30 లోగా గవర్నరు బలం నిరూపించుకోమన్నారు అనే మాట ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు తప్ప ఆ మేరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. బిజెపి లాయరు సుప్రీం కోర్టులో నవంబరు 30 లోగా ఎటూ చూపిస్తారు కదా అని దేని ఆధారంగా అన్నారో తెలియదు. గవర్నరు గడువు విధించకపోవడం యిదే ప్రథమం కావచ్చు. అంటే ఎప్పటిలోగా బలం సమకూర్చుకోగలమో బిజెపికే స్పష్టత లేదన్నమాట.

బిజెపి పైకి చెపుతున్న దాని ప్రకారం, గవర్నరుకి లేఖలు యిచ్చిన ప్రకారం చూస్తే అజిత్‌ కున్న 54 మంది ఎమ్మెల్యేలు, బిజెపి కున్న 105 ఎమ్మెల్యేలు కలిపి 159 అవుతారు. 145 మంది ఉంటే మెజారిటీ ఉన్నట్లే. 14 మంది ఎక్కువ ఉన్నారన్నమాట. మరి బలపరీక్షకు సమయం అడగడం దేనికి? పోనీ అజిత్‌ వద్ద (అతను తర్వాత చెప్పుకున్నట్లుగా) 35 మందే ఉన్నారనుకున్నా 140 అయ్యారు. తలా ఒక సభ్యుడున్న నాలుగు పార్టీలు మద్దతిస్తాయన్నారు. అంటే 144, ఇక యిండిపెండెంటులో ఒకరు మద్దతిచ్చినా చాలు 145 అయిపోతుంది. మరి బిజెపికి ఎందుకింత బెదురు? బెదురెందుంటే అజిత్‌ దగ్గర 54 కాదు, 35 కాదు, మూడు ప్లస్‌ అయిదు 8 మంది కూడా లేరు. విమానంలో దిల్లీకి 7గురు వెళ్లారని, 9 గురు వెళ్లారని వార్తలు వచ్చాయి కానీ, వారిలో ముగ్గురు విమానమే ఎక్కలేదట, వెళ్లాక యిద్దరు వెనక్కి వచ్చేశారట. ప్రస్తుతానికి అజిత్‌ వద్ద మహా అయితే 5గురు ఉన్నారని అంటున్నారు.

అజిత్‌ దగా చేస్తే చేశాడు, శివసేనను చీల్చవచ్చు అనుకుంటే అదీ కుదిరేట్లు లేదు. శివసేనకు ముంబయి నిండా శివసైనికులు ఉన్నారు. వాళ్లు ఎన్సీపీ ఎమ్మెల్యేల శిబిరాలకు కాపలా కాస్తున్నారు. ఇక తమ ఎమ్మెల్యేలను కాసుకోరా? నాదెండ్ల ఉదంతంలో ఎన్టీయార్‌ పలుకుబడికి ఎన్టీయార్‌ ఫ్యాన్స్‌ బలగం తోడయ్యింది. అజిత్‌ ఉదంతంలో శరద్‌ బుద్ధిబలానికి, శివసేన కండబలం తోడయ్యింది. అందుకే బిజెపికి బెరుగ్గా ఉంది. అజిత్‌ వెనక్కి వచ్చేసి ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే, ఇక దేవేంద్ర ఆటకట్టయినట్లే. వెనక్కి రాకపోయినా, అసెంబ్లీలో తన తరఫున 5గురు ఎమ్మేల్యేలనే చూపిస్తే దేవేంద్ర పరువు పోయినట్లే. 

అతనికే కాదు మోదీ, అమిత్‌లకు కూడా యిది భంగపాటే. గవర్నరు వ్యవస్థను యింతకు ముందు ఎరగని రీతిలో భ్రష్టు పట్టించి సాధించినది యిదా? అని పార్టీలో చెవులు కొరుక్కుంటారు. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించడానికైనా ఎత్తివేయడానికైనా కాబినెట్‌ ఆమోదం కావాలి. విధించేటప్పుడు అది పాటించారు. ఎత్తివేసేటప్పుడు ప్రధాని విశేషాధికారాలు ఉపయోగించి ఆ ఆమోదం అక్కర లేకుండా చేశారు. ఎందుకంత అడావుడి? ఏమిటి ఆ ఎమర్జన్సీ? అని కోర్టులు అడిగితే ప్రభుత్వం జవాబు దాటవేయాలి.

మోదీ, అమిత్‌ అంత పొరపాటు చేస్తారా? మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రం విషయంలో యింత తప్పుడు లెక్క వేస్తారా? అనే సందేహం సహజంగా వస్తుంది. ఎంతటివారైనా పొరపాట్లు చేస్తారని గుర్తుంచుకోవాలి. 1984లో ఇందిరా గాంధీ కశ్మీరులో ఫరూక్‌ అబ్దుల్లా పార్టీని చీల్చి అతని ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ విజయగర్వంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ ప్రయోగం చేద్దామనుకుంది. నేనున్నానుగా అని నాదెండ్ల యిచ్చిన హామీ నమ్మి ఎన్టీయార్‌ ప్రభుత్వాన్ని పడగొట్టింది. 

తీరా చూస్తే నాదెండ్ల బలం చాలలేదని తెలిసింది. నెల్లాళ్ల తర్వాత అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించబోతే నాదెండ్ల అసెంబ్లీలో గందరగోళం సృష్టించి, స్పీకరును చేతిలో పెట్టుకుని పరీక్ష జరగకుండా రోజుల తరబడి వాయిదా వేయిస్తూంటే చూసి యిక లాభం లేదని ఇందిర కొత్త గవర్నరు ద్వారా నాదెండ్ల ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్టీయార్‌కు అధికారం మళ్లీ అప్పగించి ఆ తర్వాత అతని జోలికి వెళ్లలేదు. అనేక సందర్భాల్లో అవలీలగా ప్రభుత్వాలు మార్చిన ఇందిర యిక్కడ మాత్రం కంగు తింది. 

అలాగే మోదీ, అమిత్‌ కంగు తినరన్న గ్యారంటీ ఏమీ లేదు. 2018 మేలో ఎడియూరప్ప నేటి దేవేంద్ర లాగానే తనకు తగినంత బలం ఉందని మోదీ-అమిత్‌లను నమ్మించి, గవర్నరు ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించుకున్నాడు. సుప్రీం కోర్టు అర్ధరాత్రి సమావేశమై, వెంటనే బలం నిరూపించుకోమంది. 7గురు ఎమ్మేల్యేలను కూడగట్టుకోలేక గద్దె కెక్కిన 48 గంటల్లోనే ఎడియూరప్ప దిగిపోవలసి వచ్చింది. మళ్లీ 2019 జులైలో  అధికారం చేజిక్కించుకోవడానికి నానారకాల జిత్తులు ప్రయోగించవలసి వచ్చింది. ఏది ఏమైనా 2018 మే లో మోదీ-అమిత్‌ల లెక్క తప్పిందనేది వాస్తవం. ఇప్పుడూ అదే జరుగుతోందేమో, ఎవరు చూడవచ్చారు? అమిత్‌ జేబులో వేరే తురఫు మ్కు ఏదైనా దాగి ఉందేమో రాబోయే రోజులు చెప్తాయి.

నిజంగా మోదీ-అమిత్‌లు బోల్తా పడి వుంటే, బోల్తా కొట్టించిన వారెవరు? తన బలాన్ని ఎక్కువ చేసి చూపిన అజితా? లేకపోతే వెనక ఉండి ఆడించిన శరదా? మామూలుగా చూస్తే రెండో ప్రశ్న అసంగతం అనిపిస్తుంది. శరద్‌ తన పార్టీని తనే చీల్పించి, తన సమీప బంధువును బిజెపి గూట్లోకి పంపి, తన పరువు తనే ఎందుకు తీసుకుంటాడు అనే సందేహం వస్తుంది. కానీ యిక్కడో లాజిక్‌ ఉంది. ఇలా ఆలోచించి చూడండి - 

ఎన్సీపీ-సేన-కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడి, అధికారం చలాయించేస్తూ ఉంటే బిజెపి గుడ్లప్పగించి చూస్తూ ఉంటుందా? కొశ్చన్‌ లేదు. కర్ణాటకలో గోతి దగ్గర నక్కలా కాచుకుని ఏ పార్టీని ఎలా చీలుద్దామా అని చూడలేదూ, అలాగే చేస్తుంది. ఎన్సీపీలో అజిత్‌కు అసంతృప్తి ఉంది కాబట్టి అతన్ని దువ్వుతుంది. ఒక బలహీనమైన క్షణంలో అతను సై అన్నా అనవచ్చు. అదిగో అతను వచ్చేశాడు అంటూ సేనలో కొందర్ని ఆకట్టుకుంటుంది. కేసులు బనాయించడాలు, ఈడీ నోటీసులు, ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు.. యివి ఎలాగూ ఉన్నాయి. ఇప్పటికే కేసులున్నవాళ్లకు ఊరట కల్పించడాలూ ఉన్నాయి. 

మూడు పార్టీల మిశ్రమ ప్రభుత్వంలో కలతలు ఎలాగూ తప్పవు. వాటిని ఎన్‌క్యాష్‌ చేసుకుని పడగొట్టడానికి బిజెపి సర్వయత్నాలూ చేస్తుంది. దాంతో దాని మనుగడ ప్రశ్నార్థకమే. ఈ సందేహం భారతదేశ ప్రజలందరికీ ఉంది. ఆ ప్రమాదాన్ని తొలగించడానికే శరద్‌ యీ ఎత్తు వేశాడని కొందరి పరిశీలన. అజిత్‌ను బయటకు పంపి, బిజెపిని బుట్టలో పెట్టి, చివరకు భంగపాటు కలిగిస్తే బిజెపి ధైర్యాన్ని దెబ్బ తీసినట్లవుతుంది. తెనాలి రామలింగడి పిల్లిలా బెదిరిపోయి, మళ్లీ యిలాటి దుస్సాహసం చేయదు. 

తెనాలి రామలింగడిికి రాయలు ఓ సారి ఓ పిల్లిని యిచ్చి పెంచమన్నాడట, అది తాగడానికి పాలకోసం ఓ ఆవుని కూడా యిచ్చాట్ట. రామలింగడు ఆ పాలు తనే తాగేసి, పిల్లిని ఎండగట్టాడు. కొన్నాళ్లకు రాయలు పిల్లిని చూసి 'ఇదేమిటి రామలింగా?' అంటే 'అది పాలు తాగటం లేదు మహాప్రభో, నేనేం చేయను?' అన్నాట్ట. పిల్లి పాలు తాగకపోవడమేమిటని తన ఎదురుగా తాగించబోతే అది పాలను చూసి బెదిరి పారిపోయిందట. రాయలు ఏమనలేక ఊరుకున్నాట్ట. జరిగిందేమిటంటే రామలింగడు పిల్లిని యింటికి తీసుకెళ్లి గిన్నెల్లో వేడివేడి పాలు ముందు పెట్టాడు. తాగబోతే దానికి మూతి కాలింది. ఇక అప్పణ్నుంచి పిల్లికి పాలంటే భయం పట్టుకుంది. పాలు చూడగానే మూతి కాలుతుందన్న ఫీలింగు మనసులో ముద్రితమై పోయింది. 

అలాగే యిప్పుడు కనుక బిజెపి భంగపడితే యిక అజిత్‌ లాటి ఫిరాయింపుదారులు తమ వద్దకు వచ్చినప్పుడల్లా సంశయంగా చూస్తుంది - ఇదేదో మన పరువు తీసే కుట్ర కాదు కదా అని. కనీసం ఏడాది, రెండేళ్లయినా మిశ్రమ ప్రభుత్వం జోలికి పోదు. 2018లో పార్టీ హైకమాండ్‌ పరువు తీసిన ఎడియూరప్ప 2019 నాటికి వాళ్లను నమ్మించడానికి ఎన్ని తంటాలు పడ్డాడో మనం ఊహించవచ్చు. జెడిఎస్‌-కాంగ్రెస్‌ బహిరంగ వైరం, సిద్ధరామయ్య-గౌడ కుటుంబం మధ్య ఇగో క్లాష్‌, కాంగ్రెసు హై కమాండ్‌ నిష్క్రియాపరత్వం, సిద్ధరామయ్య కుతంత్రం.. యివన్నీ పరిగణనలోకి తీసుకునే హై కమాండ్‌ మళ్లీ యింకో ప్రయోగానికి సిద్ధపడి ఉంటుంది. ఈ సారి విజయం సిద్ధించింది.

ఇప్పుడీ ప్రయోగం విఫలమైతే బిజెపి హై కమాండ్‌ దేవేంద్రను కేంద్రానికి పిలిపించి, ఏ మంత్రిత్వ పదవో యిచ్చి, రాష్ట్రంలో ప్రభుత్వం కూల్చే పని మరో చతురుడికి అప్పగించవచ్చు. ఈ లక్ష్యం సాధించే ఉద్దేశంలోనే శరద్‌, అజిత్‌ ద్వారా యీ ప్లాను అమలు చేశాడని కొందరు పరిశీలకుల అనుమానం. ఎందుకంటే ఎన్సీపీలో శరద్‌ ఆజ్ఞ లేనిదే ఆకు కదలదంటారు. అతనికి మనుషులు పార్టీలో అందరి కదలికలు గమనిస్తూనే ఉంటారు. శరద్‌ మాట కొట్టేయగల సామర్థ్యం ఎన్సీపీలో ఎవరికీ లేదు. అందుకే నిన్న మధ్యాహ్నం నుంచి అతను స్వయంగా ఫోన్‌ చేయడం మొదలెట్టగానే ఒక్కొక్కరూ వచ్చి వాలిపోయారు. 

బాబాయి సామర్థ్యం అజిత్‌కు తెలియకుండా ఉందా? శరదే దీనికి సూత్రధారి ఐతే యిది రాజకీయంగా ఒక గొప్ప ఎత్తుగానే చెప్పుకోవాలి. పంచతంత్రంలో యిలాటి కథ ఏమైనా ఉందేమో వెతకాలి. మనం సాధారణంగా మిత్రలాభం, మిత్రభేదంతో ఆపేస్తాం. కానీ యింకా మూడు చాప్టర్లున్నాయి. మహారాష్ట్ర ఉదంతం ప్రారంభమైనప్పటి నుంచి కాస్సేపు శరద్‌ను చాణక్యుడంటున్నారు, కాస్సేపు అమిత్‌ను చాణక్యుడంటున్నారు. 

రాజకీయపు టెత్తులు తెలిసున్నవాడు చాణక్యుడు ఒకడే కాదు. అతనితో సమానమైన తెలివితేటలున్నవాడు రాక్షసామాత్యుడు. నందుల ప్రధానమంత్రి. చంద్రగుప్తుడు రాజయ్యాక కూడా నందులను మళ్లీ అధికారంలోకి తేవడానికి ఎన్నో పథకాలు రచించాడు. చాణక్యుడు వాటిని తిప్పికొడుతూ వచ్చాడు. అవన్నీ విశాఖదత్తుడు తన 'ముద్రారాక్షసం' నాటకంలో రాశాడు. చివరకు చాణక్యుడు గెలిచాడు. రాక్షసుడు ఓడాడు. ఓడినా రాక్షసుణ్ని చాణక్యుడు సత్కరించి, చంద్రగుప్తుడికి ప్రధానమంత్రిగా ఉండి అతన్ని కాపాడమని కోరాడు. ఈ మహారాష్ట్ర ఉదంతం పూర్తయ్యాక శరద్‌, అమిత్‌లలో ఎవరు చాణక్యుడో, ఎవరు రాక్షసుడో తెలుస్తుంది. (సశేషం)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2019)
mbsprasad@gmail.com