Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: జగన్‌ బలాలు-బలహీనతలు

జగన్‌కు వున్న బలం అతని తండ్రి వైయస్‌ ఇమేజి. వైయస్‌ అవినీతిపరుడనే పేరువున్నా ఇప్పటి దాకా కేసులు తేలకపోవడం చేత ఆ విషయాన్ని ఎవరూ నిర్ధారించలేరు. ప్రజానాయకుడిగా, అనేక సంక్షేమ పథకాల రూపకర్తగా వైయస్‌ సామాన్య ప్రజల హృదయాల్లో నిలిచాడు. అతని వారసుడిగా ముందుకు వచ్చాడు కాబట్టి జగన్‌పై ఆ అభిమానం 2014 ఎన్నికలలో ప్రసరించింది. 2019 ఎన్నికల సమయం వరకు ఆ గుడ్‌విల్‌ నిలుస్తుందా? ఏ మేరకు నిలుస్తుంది అనేదే ప్రశ్న.

వైయస్‌ తిరిగిరాడు కాబట్టి జగన్‌ బలాబలాలే ఓటరు లెక్కలోకి తీసుకుంటాడు. జగన్‌కు పరిపాలనలో అనుభవం లేదు. తండ్రి పోయిన తర్వాత కేంద్రమంత్రి పదవి చేపట్టినా, కాస్త అనుభవం చేకూరేది. తండ్రి మరణం తర్వాత సోనియా వద్దకు వెళ్లినపుడు ఆవిడ కేంద్రమంత్రి పదవి ఇస్తానంటే 'కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే కావాలి' అని మంకుపట్టు పట్టారని వార్తలు వచ్చాయి.

'అనుభవం లేదుకదా' అని సోనియా అంటే 'ఇందిరా గాంధీ పోగానే రాజీవ్‌కు ఇవ్వలేదా?' అని విజయమ్మ లాజిక్‌ లాగారట. 'హత్తెరీ, మా కుటుంబంతోనే పోలికా?' అని సోనియా ఆగ్రహించి తడాఖా చూపారట. దీనిలో నిజానిజాలు ఎలావున్నా జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఉవ్విళ్లూరారన్నది వాస్తవం. ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టి ఆటోమెటిక్‌గా ముఖ్యమంత్రినై పోవాలని అనుకోకుండా రోశయ్యగారి వద్ద ఏ కీలకమైన మంత్రి పదవో తీసుకుని తర్ఫీదు పొందివుంటే ప్రజల్లో విశ్వాసం ఏర్పడేది. 

ఏ మంత్రి పదవీ చేపట్టకుండా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎకాయెకీ ముఖ్యమంత్రి అయిపోయి మూడేళ్లపాటు పాలించలేదా? అని అనుకోవచ్చు. కానీ విడిపోయాక ఆంధ్ర పుట్టెడు కష్టాల్లో మునిగివుంది. ఎటుచూసినా సమస్యలే. రాజధాని లేదు. కేంద్రసహాయం లేదు. వీటిల్లోంచి గట్టెక్కించాలంటే పరిపాలనలో తలపండినవాడు, కేంద్రంతో బతిమాలో, భంగపడో, తగాదా పడో నిధులు తెచ్చేవాడు కావాలి.

ఈ అవగాహనతోనే 2014లో ఆంధ్ర ప్రజలు బాబును ఎంచుకున్నారు. విభజనకు తొలిబీజం వేసినవాడు ఆయనే అని తెలిసినా గతం గతః అనుకుని, వర్తమానం కోసం, బంగారు భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటేశారు. పరిపాలనాదక్షుడిగా పేరుబడిన బాబుకి ప్రతిగా జగన్‌ నిలవలేడనుకున్నారు. బాబు విషయంలో అనుకున్నది జరగలేదు సరే, కానీ ప్రత్యామ్నాయంగా వున్న జగన్‌ ఈలోపుగా పాలనానుభవం ఏమైనా సంపాదించాడా? లేదే!

కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో ప్రతిపక్షంలో వున్నవారు కేంద్రంలో అధికారంలో వున్నవారితో పొత్తు పెట్టుకుని కేంద్రమంత్రి హోదా సంపాదించి రాష్ట్రానికి వచ్చి తప్పులు ఎంచుతూ వుంటారు. ఆ క్రమంలో పాలనానుభవం, దిల్లీలో పరిచయాలు పెంచుకుంటారు. జగన్‌కు అలాంటి అవకాశం చిక్కలేదు. అందువలన ముఖ్యమంత్రిగా జగన్‌ సామర్థ్యం ఎలా వుంటుందన్నది ఊహకి మాత్రమే అందుతుంది.

ఇక టీము లీడరుగా జగన్‌ సామర్థ్యాన్ని లెక్కవేసినపుడు బాబుతో కాని, తండ్రితో కాని తులతూగలేడు. బాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూనే తన ఎమ్మెల్యేలను, నాయకులను కాపాడుకోగలిగారు. మరి జగన్‌? 'నా నియోజకవర్గానికి నిధులు విడుదల చేయలేదు, పార్టీ మారమని నన్ను బెదిరించారు, విధిలేని పరిస్థితుల్లో నా ప్రాంత ప్రజల గోడు వినలేక పార్టీ మారాను' అని ఫిరాయింపుదారులు చెప్పవచ్చు. గతంలోనూ ఇలాంటి ఒత్తిళ్లే వచ్చివుంటాయి.

అప్పుడు లొంగనివాళ్లు ఇప్పుడెందుకు లొంగుతున్నారు అంటే జగన్‌ వాళ్లలో విశ్వాసం పాదుకొల్పలేకపోతున్నాడు. అతని నాయకత్వశైలి మారవలసిన అవసరం వుందని ఇలాంటి అనుభవాలు చెపుతున్నాయి. నాయకుల దృష్టిలో ఎలా ఉన్నా సామాన్య ప్రజలలో కొంతమంది దృష్టిలో జగన్‌ పోరాటవీరుడు. అతను తనకోసం కాకుండా తమ కోసం పోరాడుతున్నాడన్న అభిప్రాయం దృఢంగా కలిగించగలిగితే వారి సంఖ్య పెరుగుతుంది.

జగన్‌ అవరోధాలు

ప్రజాసమస్యలను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని గడగడలాడించే అవకాశం వైసీపీకి అసెంబ్లీ ఇవ్వటం లేదు. ఇచ్చేట్లా ఎలా చేసుకోవాలో వైసీపీకి తెలియటంలేదు. ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్యపరచడం మాత్రమే వైసీపీ చేయగలుతుంది. అది జగన్‌ ఒంటరిగా చేయగలిగిన పనికాదు. అనేక స్థాయిల్లో నాయకులు కదలిరావాలి. పార్టీలతో సంబంధం లేనివారితో వేదికలు ఏర్పరచి ప్రజల ఇబ్బందులను గురించి, పరిష్కరించే మార్గాల గురించి చర్చించేట్లు చేయాలి.

విభజన తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యర్థులుగా మారాయి. బాబైతే కేసీఆర్‌తో గట్టిగా పోరాడగలరని, జగనయితే కేసీఆర్‌తో రాజీపడి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెడతారని 2014 ఓటర్లు అనుకున్నారు. దానికి తగ్గట్టే జగన్‌ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకపోవడాన్ని పవన్‌ కళ్యాణ్‌ హైలెట్‌చేసి వారిని నమ్మించారు. 

అయితే ఓటుకు నోటు కేసు తర్వాత బాబు కూడా రాష్ట్రప్రయోజనాలపై రాజీ పడిపోయారని స్పష్టమైంది. ఇప్పుడు ఇద్దరూ సమానస్థాయికి చేరినట్లయింది. జగన్‌ తన తరహా మార్చుకుని ఉభయరాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలపై తెలంగాణ పాలకులను ఎండగట్టినప్పుడు మాత్రమే ఆంధ్రప్రజలకు జగన్‌పై విశ్వాసం కుదురుకుంటుంది.

జగన్‌ అవకాశాలు

చంద్రబాబు హయాంలో ప్రచారమే తప్ప అభివృద్ధి జరగకపోవడం, రాజధాని రూపుదిద్దుకోక పోవడం, ప్రభుత్వ అనుకూల వర్గానికే ఫలాలన్నీ దక్కడం, కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి కావడం - ఇవన్నీ జగన్‌కు కలిసి వచ్చిన అవకాశాలు. రాష్ట్రంలోని మిగతా పార్టీలేవీ చురుగ్గా లేకపోవడం వలన ప్రభుత్వవ్యతిరేకత ఓటును అతనే సొమ్ము చేసుకోగలడు. కానీ చేసుకోలేకపోతున్నాడన్న విషయమూ స్పష్టంగా తెలుస్తోంది. జగన్‌ స్థానంలో బాబు వుండి వుంటే ఈపాటికి ఎంతైనా రచ్చ జరిగివుండేది.

జగన్‌ పదవి అనుభవించక పోయినా తండ్రి పదవి చాటున సొమ్ములు చేసుకున్నాడన్న పేరు మూటగట్టుకున్నాడు. కోర్టులు ఏం తేలుస్తాయన్నది తర్వాతి విషయం. అతను అవినీతికి మారురూపమనుకునే ప్రజలు ఎక్కువ సంఖ్యలో వుండబట్టే 2014 ఎన్నికలలో ఓడిపోయాడు. టీడీపీ నాయకులు కూడా తక్కువేమీ తినలేదు అనే అభిప్రాయం 2019 నాటికి కలిగితే ఆ విషయంలో ఇద్దరూ సమానమై బాబుకి ఎడ్వాంటేజి పోతుంది. జగన్‌ అవినీతిని విపరీతంగా హైలైట్‌ చేసే తెలుగు మీడియా టీడీపీ అవినీతి పట్ల సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

అప్పుడైనా బాబును బాధ్యుణ్ని చేయడం లేదు. అధికారులనో, కింది స్థాయి నాయకులనో దోషులుగా చూపుతోంది. టీడీపీకి బీజేపీ దూరమైనపుడు మీడియా ధోరణిలో మార్పు వచ్చే అవకాశముంది. మీడియా ప్రొజెక్షన్‌ మాట ఎలావున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు అబద్ధాలు చెప్పవు కదా! వాటితో విసిగి వేసారిన తటస్థులను తనవైపు తిప్పుకుని 'ఇతనికీ ఓ ఛాన్సిచ్చి చూద్దాం' అని అనుకునేట్లా చేస్తే వైసీపీ బలీయమైన శక్తిగా రూపొందుతుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com