Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: సిజెకు రాసిన లేఖ బహిర్గతం చేయడం తప్పా?

ఎమ్బీయస్: సిజెకు రాసిన లేఖ బహిర్గతం చేయడం తప్పా?

జగన్ చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖపై రాయదగినది చాలానే వుంది. ప్రస్తుతానికి రెండు పాయింట్లపై మాత్రం ఆలోచిద్దాం. మొదటిది, అలా రాయవచ్చా? రెండోది, దాన్ని బహిర్గతం చేయవచ్చా? తక్కిన విషయాలు తర్వాతి వ్యాసాల్లో చూద్దాం. అటువంటి లేఖ రాయవచ్చని కొందరు అంటున్నారు. అబ్బెబ్బే అలా రాయడం మహా తప్పు, ఘోరం అని కొందరంటున్నారు. మాజీ న్యాయమూర్తులు ఒకలా చెపుతున్నారు. న్యాయవాదుల సంఘాల వాళ్లు మరోలా చెప్తున్నారు. దేనిలోనైనా రెండు రకాల అభిప్రాయాలు వున్నపుడు వ్యవహారం కోర్టుకి వెళుతుంది. ఏది సరైనదో వాళ్లే చెపుతారు. ఈ లోపున మనలో మనం అటోయిటో చర్చించుకుంటాం. నష్టమేమీ లేదు.

స్థూలంగా చూస్తే ఫిర్యాదు చేయడంలో తప్పేముంది? ఈ దేశంలో ఎవరైనా ఎవరి మీదనైనా ఫిర్యాదు చేయవచ్చు, ఆరోపణ చేయవచ్చు. నేను జగన్ నుంచి డబ్బు పుచ్చుకుని వ్యాసాలు రాస్తున్నానని కొందరు ఆరోపిస్తూ వుంటారు. వాళ్ల దగ్గర ఆధారం ఏమైనా వుందా, పాడా? నేను ఏ పరువునష్టం దావానో వేస్తే, అప్పుడు విచారణ జరుగుతుంది. అప్పటిదాకా ఆరోపణ ఆరోపణగానే మిగులుతుంది. అసలు ఆరోపణే చేయకూడదంటే ఎలా? వాళ్లకు అలా తోచింది. ఆరోపణ చేసి పడేశారు. పత్రికలలో బోల్డు వార్తలు వస్తూంటాయి – పేరు చెప్పడానికి యిష్టపడని ఒకరు లేదా విశ్వసనీయ వర్గాలు - ఫలానా వారికి సింగపూరులో ఆస్తులున్నాయని చెప్పారు అని. మరొకరు నాయకుడి పేరు రాసేసి, ‘ట’ అని చేరుస్తారు. లేకపోతే అలా అని చెప్పుకుంటున్నారు అని రాస్తారు.

వీటన్నిటిలో బురద చల్లడం వరకే వాళ్ల పని. చల్లినవాళ్ల తాట తీయాలా, తీరిక లేక ‘ఏడ్చాడులే’ అని వూరుకోవాలా అన్నది బురదపడినవాడి యిష్టం. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ. ఈ కేసులో న్యాయమూర్తుల మీద బురద పడుతోంది కాబట్టి గొడవ చేస్తున్నారు. కానీ గతంలో న్యాయమూర్తుల మీద బురద పడలేదా? అనేకమంది మీద పడింది. కొందరు వాళ్ల మీద కేసులు పెట్టారు కూడా. ఆధారముందని తేలిన చోట కోర్టులే వాళ్ల మీద చర్యలు తీసుకున్నాయి. ఇక్కడ ఒక ఆరోపణ వచ్చింది. దానిపై విచారణ చేయవలసినది కోర్టు. నిరాధారంగా చేశారో, ఆధారం వుండి చేశారో కోర్టే తేలుస్తుంది.

జస్టిస్ రమణపై చేసిన ఆరోపణల్లో సరుకు లేకపోతే అది విచారణలో తేలుతుంది. అసలు ఫలానా వారిపై అనుమానమే రాకూడదంటే ఎలా? ‘సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబవ్ సస్పిషన్’ అనే సామెత క్రీస్తుపూర్వం నాటిది. అయినా అది అక్కడి మాట. మన దగ్గర అంతకు వేల సంవత్సరాల క్రితమే రాముడి భార్యమీదే నింద పడింది. సీతామ్మవారిని సాక్షాత్తూ భర్తే అగ్నిపరీక్షకు గురి చేశాడు. అందువలన న్యాయమూర్తి అయినంత మాత్రాన ఆయనను వేలెత్తి చూపడానికి వీల్లేదు అనే మాట మన సంప్రదాయానికి పొసగదు.

జగన్‌కు న్యాయవస్థపై నమ్మకం లేదని, అందుకే ప్రశ్నించాడని, స్వతహాగా ముద్దాయి (చంద్రబాబుగారు తెలుగువైపు మళ్లుతున్నారు. మొన్నటిదాకా ఎ1 అనేవారు, యిప్పుడు ముద్దాయి ప్రభుత్వం అంటున్నారు) కాబట్టి, కోర్టులంటే పడదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ప్రశ్న లేవనెత్తింది, కొందరు న్యాయమూర్తులపై తప్ప, న్యాయవ్యవస్థపై కాదు. అందుకే తన లేఖను చీఫ్ జస్టిస్‌కు రాశాడు. పార్లమెంటు స్పీకరుకో, రాష్ట్రపతికో రాసి సుప్రీం కోర్టుపై చర్య తీసుకోండి అనలేదు. మామూలు పరిభాషలో చెప్పాలంటే - మీ పిల్లవాడి ప్రవర్తన సరిగా లేదని యింటి పక్కవాడు పిల్లవాడి తండ్రికి చెప్పినట్లు చెప్పాడు. ‘అబ్బే కనుక్కున్నానండి, మీ కిటికీ పగలకొట్టింది, ఆ పక్క యింటి కుర్రాడట, మావాడు కాదు.’ అని తండ్రి చెప్పవచ్చు. లేకపోతే కొడుకుని పిలిచి, చివాట్లు వేయవచ్చు.

ఇలా ముఖ్యమంత్రి న్యాయమూర్తికి వ్యతిరేకంగా రాయడం కనీవినీ ఎరగని ఘటన అని విమర్శ రాగానే, జగన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి, స్వయంగా లాయరు ఐన సంజీవయ్యగారు అప్పటి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌పై, మరో న్యాయమూర్తిపై ఫిర్యాదు చేస్తూ కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖను బయటపెట్టింది. నిజానికి సంజీవయ్య న్యాయవ్యవస్థలోని వ్యక్తుల గురించి రాజకీయవ్యవస్థకు ఫిర్యాదు చేశారు. హోం మంత్రి రాజకీయనాయకుడే కదా! కానీ జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కే ఫిర్యాదు చేశారు. అంటే న్యాయవ్యవస్థపై సంజీవయ్య గారి కంటె జగన్‌కే ఎక్కువ గౌరవం వుందనుకోవాలి.

ఇక చేసిన ఆరోపణ కూడా ప్రభుత్వ నిర్ణయాలకు హైకోర్టు అడ్డు తగులుతోందని చేసినదే. దానికి కారణం ఫలానావారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర హైకోర్టు వింతవింతగా ప్రవర్తిస్తోందన్న మాట వాస్తవం. ఫలానావారు అవినీతికి పాల్పడ్డారని మాకు సమాచారం వుంది అని ఎసిబి అంటే విచారణ జరపడానికి వీల్లేదని కోర్టు అనడం, ఎఫ్ఐఆర్‌ మీడియాలో రాకూడదని గాగ్ (వాగ్బంధం) ఆర్డర్లు వేయడం యింతకుముందు ఎన్నడూ జరగలేదు కదా. తాజాగా గీతం యూనివర్శిటీ కేసుంది. వాళ్లు ఎకరాలకు ఎకరాలు స్థలం ఆక్రమించలేదని టిడిపి కూడా అనటం లేదు. అర్ధరాత్రి కూల్చేశారు, నోటీసు యివ్వకుండా కూల్చేశారు, యూనివర్శిటీకి చాలా పేరుప్రఖ్యాతులున్నాయి, ఇలా అయితే రాష్ట్రంలో ఎవరూ యూనివర్శిటీలు పెట్టరు – యిలాటి వాదనలే చేస్తోంది. శరవణ భవన్‌లో టిఫెన్లు బాగుంటాయి కదాని ఆ హోటల్ యజమాని హత్యానేరంలో యిరుక్కున్నపుడు వదిలేయలేదు. యూనివర్శిటీ మంచిదంటే ఆ ఘనత ఫ్యాకల్టీకి చెందుతుంది తప్ప ప్రభుత్వస్థలాలను కాజేసిన యాజమాన్యానికి చెందదు.

స్థలాలు ఆక్రమించిన ప్రతీవారూ ప్రభుత్వం చర్య తీసుకోగానే, కోర్టుకి వెళతారు. కోర్టు స్టే యిస్తుంది. రెండు రోజులో, మూడు రోజులో. కానీ గీతం కేసులో ఏకంగా నవంబరు 30 వరకు యిచ్చింది. అప్పటివరకు విచారణ చేపట్టదట. ఏం? ఎందుకంత ఆలస్యం? కేసులు గబగబా తేల్చేసేయాలి అంటూ సుప్రీం కోర్టు మాటిమాటికీ చెప్తూనే వుంటుంది కదా! వీళ్లకు మాత్రం ఎందుకు వెసులుబాటు? నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చూడండి, ‘ఎన్నికలు నిర్వహించగలరా లేదా, దానికి తగిన యంత్రాంగం, వాతావరణం వుందా లేదా’ అనేది ప్రభుత్వంతో చర్చించరు. ఎకాయెకీ కోర్టుకే! ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించేవాళ్లందరూ అక్కడ ఆశ్రయం పొందవచ్చు అనే భావన కలగడమే దురదృష్టం.

ఈ తీరు గురించే జగన్ ఆక్షేపణ తెలుపుతూ, దాని వెనుక సదరు పెద్ద తలకాయ ఉన్నారని ఆరోపించారు. తన మీద వ్యక్తిగతంగా వున్న కేసుల గురించి కాదు. కేసులు ఓ పట్టాన తేల్చకుండా, విచారణ చేపట్టకుండా నానబెడుతూ తనని అందరూ ఏ1 అనడానికి ఆస్కారం యిస్తున్నారని కానీ, ప్రతీ శుక్రవారం పోలీసు స్టేషన్‌కు రమ్మన్నారని కానీ, రాజకీయనాయకులపై వున్న కేసులు సత్వరం విచారించాలనే సుప్రీం కోర్టు ఆదేశం తనకు వర్తించకూడదని కానీ – యిలాటి వాటిపై లేఖ రాయలేదు.

అయినా యిలా రాయడం కూడా ఒకవేళ తప్పే అనుకోండి. ఏమౌతుంది? ఫలానా చట్టం కింద నువ్వు చేసింది తప్పు అని కోర్టు చెపుతుంది. గతంలో యిలా జరిగిన సందర్భాలు లేవు కాబట్టి అలాటి సెక్షన్ వుందో లేదో మనకు తెలియదు. న్యాయకోవిదులకు తెలుస్తుందనుకోండి. వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు కోర్టు తప్పుగా భావిస్తే శిక్ష విధిస్తుంది. ఎటువంటి శిక్ష? జైలుకి పంపుతుందా? అదేమీ జగన్‌కు కొత్త కాదు. గతంలో ఆర్థిక నేరాల విషయంలో వెళ్లినపుడే నవ్వుతూ వెళ్లాడు, నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రజాప్రభుత్వ హక్కుల నేతగా వెళతాడు. చిరునవ్వుల డోసు యింకా పెరుగుతుంది.

జైలు కాదు, జరిమానా వేశారనుకుందాం. ప్రభుత్వనేతగా లేఖ రాసి, శిక్షకు పాత్రుడయ్యాడు కాబట్టి ఖజానా నుంచే కడతారనుకుంటా. అబ్బే, వ్యక్తిగత హోదాలో కట్టాలి. అని కోర్టు స్పెసిఫిక్‌గా చెప్పిందనుకోండి. ఆ మాత్రం డబ్బు జగన్ దగ్గర లేకుండా వుందా? జరిమానా కూడా లేకుండా, ఒట్టి మొట్టికాయలతో సరిపెడతారా? అది జగన్‌కు కొత్తేమీ కాదు. చాలాసార్లు వేయించుకోవడం జరిగింది. తల మీద ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వేసుకోమను అని తల వంచి చూపిస్తాడు. అదీ కాదు, అక్షింతలు వేస్తారా? ఎన్నిసార్లు పడ్డాయో, తల దువ్వుకుంటే బోల్డు కింద పడతాయి. ఈ సారి యింకోమాటు వేయించుకుని తల దులిపేసుకుంటాడు. ఇంతకు మించి తలకొట్టి మొలేయరుగా!

2018లో చలమేశ్వర్, యితర న్యాయమూర్తులు బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టి సుప్రీం కోర్టు వ్యవస్థను దుమ్ము దులిపేసినపుడు ఏం జరిగింది? ఏమ్హీ జరగలేదు. వాళ్లను చిన్నమెత్తు మాట కూడా అనలేదు. ఈసారి ఏ మాత్రం శిక్ష పడినా, ‘ఇదే తప్పు చేసిన మీ కోర్టు సిబ్బందిని వదిలేశారు. సాధారణ ప్రజలైతే శిక్ష వేస్తారా? ఇదెక్కడి వివక్షత?’ అని సుప్రీం కోర్టు మాట పడుతుంది. అలా అని ఊరుకుంటే రేపు మరో ముఖ్యమంత్రి, యింకో న్యాయమూర్తిపై యింతకంటె ఘాటైన లేఖ రాస్తారేమో అనవచ్చు. తప్పకుండా రాస్తారు. కానీ కోర్టు దానికి కూడా అలవాటు పడాలి. ఏదైనా ఆరోపణ వచ్చినపుడు విచారణ ఎలా జరుపుతారో, దీని మీదా అదే పద్ధతిలో విచారణ జరపాలి.

ఇక రెండో పాయింటుకి వద్దాం. లేఖ రాసినా తప్పు లేదు కానీ బహిర్గత పరచకూడదు అనే అభిప్రాయం. ఇది తటస్థులనబడేవారు చాలామంది చేస్తున్న వాదన. చలమేశ్వర్ ప్రభృతులు సుప్రీం కోర్టులో జరుగుతున్న వ్యవహారాలపై బయటపెట్టినప్పుడు వారికి కోర్టు మర్యాదలు తెలియవా? ఆ ప్రఖ్యాత న్యాయమూర్తులెవరికీ న్యాయాన్యాయాలపై అవగాహన లేదా? లా లో వాళ్లు అంత వీకా? ఉత్తరం రాసి, సీల్డు కవర్‌లో పెట్టి చీఫ్ జస్టిస్ టేబులు మీద పెట్టేసి, బయటకు వచ్చి సిగరెట్టు కాలుస్తూ, ఆయన రూములోకి తొంగిచూస్తూంటే చాలు అనుకోలేదే వాళ్లు. వాళ్ల చర్యపై బహిరంగ చర్చ చాలా వారాలపాటు జరిగింది కానీ కోర్టు వాళ్లను మందలించను కూడా మందలించలేదు.

జగన్ ప్రభుత్వం సంజీవయ్య గారి ఉత్తరాన్ని బయటపెట్టగానే ‘ఆయన రాశారు కానీ బయట పెట్టలేదుగా’ అంటున్నారు. చట్టవ్యతిరేకం కాకపోవచ్చు కానీ ఔచిత్యభంగం జరిగింది అంటున్నారు. ఈ ఔచిత్యం అనేది కాలాన్ని బట్టి మారిపోతోంది. అప్పటి అసెంబ్లీలా యిప్పటి అసెంబ్లీ నడుస్తోందా? ఆనాటి మర్యాదలే వేరు. పార్లమెంటరీ సంప్రదాయాలే వేరు. లైట్లు ఆర్పేసి, కెమెరాలు కట్టేసి, ఎంపీలను చావగొట్టేసి, ఒక రాష్ట్రాన్ని మెజారిటీ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చీల్చి పారేసినప్పుడే మంట గలిశాయి మర్యాదలు. ఇప్పటి రాజకీయనాయకులు వాడే భాష అప్పుడు వాడేవారా? మంత్రుల దగ్గర్నుంచి పబ్లిగ్గా బూతులు కురిపిస్తున్నారు.

ఆ తరహా ప్రజాస్వామ్యంలో వుంటూ 1961 నాటి ఔచిత్యాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయగలం? ఇక మీడియా అయితే ఎప్పుడో హద్దులు దాటేసింది. 60 ఏళ్ల కితం నాటి పరిస్థితులతో యీనాటి పరిస్థితులను ఎలా పోల్చగలం? అప్పట్లో మీడియా యింత చురుగ్గా వుండేదా?  ముఖ్యమంత్రులపై, మంత్రులపై, ప్రధానిపై యింత ఘాటు వ్యాఖ్యలు చేసేదా? వ్యక్తిగతమైన కక్ష వున్నట్లు ప్రవర్తించేదా? జగన్ తన లేఖను ఒక వేళ రహస్యంగానే పంపాడనుకోండి. అది బయటకు కచ్చితంగా లీకయ్యేది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తికి సుప్రీం కోర్టులో ఎంత పట్టు వుందో ఊహించుకోవచ్చు. జగన్ కేసులపై సిబిఐ విచారణ జరిగేటప్పుడు, కాఫీ తాగి రుమాలుతో మూతి తుడుచుకున్న విషయం దగ్గర్నుంచి పూస గుచ్చినట్లు తెలుగు పేపర్లలో వచ్చేసేది. ఇదంతా ఎలా బయటకు వస్తోంది? అని సిబిఐ ఎన్నడూ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు, విచారణ జరపలేదు.

జగన్ లేఖ పరోక్షంగా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చి వుంటే అప్పుడు తెలుగు మీడియా ఎంత రచ్చ చేసేదో ఊహించుకోండి. తన కేసులు విచారణకు వస్తున్నాయని రమణను తప్పించే కుట్ర యిది అని కథలల్లేది. మేమే బట్టబయలు చేశాం, ఇది మా ఎక్స్‌క్లూజివ్ అని గొప్పలకు పోయేది. జగన్‌ను దోషిగా నిలబెట్టేది. ఇప్పటికే ఒక థియరీని ప్రచారంలో పెట్టారు. దాని ప్రకారం జగన్‌పై కేసుల విచారణ సత్వరమే చేపట్టమని సుప్రీం కోర్టు ఒత్తిడి తెస్తుంది. విచారణ టపటపా పూర్తి చేసి, జగన్‌కు జైలు శిక్ష వేసేస్తారు. జగన్ తన భార్య భారతిని సిఎంగా గద్దెపై కూర్చోబెట్టి, తనెళ్లి జైల్లో కూర్చుంటాడు. ఐదేళ్ల దుష్పరిపాలన మర్చిపోయేట్లు, 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింపతీ ఓటుతో గెలుద్దామని చూస్తాడు. సానుభూతి రావాలంటే కోర్టు తనకు అన్యాయంగా శిక్ష వేసిందని ఓటర్లను నమ్మించగలగాలి. అలా నమ్మించగలగాలంటే దానికి ముందే బురద పూయాలి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ రమణ తనపై వ్యక్తిగతమైన కక్షతో, చంద్రబాబు ప్రేరేపణతో తనను జైలుకి పంపారని ప్రజలను నమ్మించగలిగితే 2024లో గెలుపు ఖాయం. ఈ అంచనాతో జగన్ యీ బురదజల్లుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని థియరీ.

దీనిలో వాస్తవం వుంటే వుండవచ్చు అని మనం అనుకుంటూండగా యీ లేఖ బహిర్గతం అయిందనుకోండి. ఉత్తరాన్ని యథాతథంగా వేయకుండా తన సొంత కేసుల గురించి కూడా ప్రస్తావించాడని భోగట్టా అని మసాలా చల్లారనుకోండి. తన పదవి కోసం జగన్ అడ్డదారులు తొక్కుతున్నాడనే ప్రచారం ముమ్మరంగా జరిగేది. రచ్చరచ్చ అయ్యేది. లేఖను జగనే బయటపెట్టడంతో దానికి ఛాన్సు లేకుండా పోయింది. నిమ్మగడ్డ రమేశ్‌ను చూడండి. తనకు ప్రాణభయం వుందని కాన్ఫిడెన్షియల్‌గా లెటర్ రాసి ఎంత భంగపడ్డారో! దాన్ని తనే లీక్ చేసి, తనే ఖండించి, పోలీసు కేసు పెట్టాక, అప్పుడు ఒప్పుకున్నాడు. నిర్భయంగా ఓటేయండి అని ఓటర్లకు చెప్పి, తను మాత్రం పిరికివాడిగా, అబద్ధాలకోరుగా తేలాడు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తానంటూ బయలుదేరాడు. గతంలో వచ్చిన బెదిరింపు కాల్స్ యిప్పుడు రావటం లేదా? ప్రాణభయం పోయిందా? ప్రభుత్వం మారిందా? లేక అది మంచిదనే నమ్మకం కలిగిందా? ఇలా అనేక సందేహాలు మెదలుతున్నాయి. ఈ గందరగోళం కంటె జగన్ చేసినట్లు ఆరోపణలను, తన అనుమానాలను బాజాప్తాగా చెప్పేసి, శిక్ష పడితే అనుభవించడమే బెటరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?