Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జయలలిత ఎంపిక తప్పింది

ఎమ్బీయస్‌: జయలలిత ఎంపిక తప్పింది

ప్రముఖ నిర్మాత 'కౌముదీ ఆర్ట్‌ పిక్చర్స్‌' ఎమ్మెస్‌ రెడ్డి సినీరంగంలో ఎగ్జిబిటర్‌గా ప్రవేశించారు. గూడూరులో సుందరమహల్‌ అనే థియేటరు ఉండేది ఆయనకు. ఒకసారి మద్రాసు వెళ్లినపుడు ఎవరో చెపితే ''కుమరిపెణ్‌'' అనే సినిమా చూడడానికి వెళ్లారు. దర్శకనిర్మాత టిఆర్‌ రామన్న రవిచంద్రన్‌ హీరోగా తీసిన ఆ సినిమాలో హీరోయిన్‌ జయలలిత ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోందని ఆయనకి అర్థమైంది. అప్పటికి సినిమా రిలీజై పదివారాలయింది. ఎమ్మెస్‌ మర్నాడే రామన్న ఆఫీసుకి వెళ్లి తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ అరవై వేలకు కొన్నారు. మరో అరవై వేలు ఖర్చు పెట్టి డబ్బింగు పూర్తి చేసి, ''కన్నెపిల్ల'' పేరుతో 1966 డిసెంబరు 26న విజయా పిక్చర్స్‌ ద్వారా రిలీజు చేశారు.

అదేరోజు ఎన్టీయార్‌ ''కంచుకోట'' రిలీజైంది. ఐనా యీ సినిమా వంద రోజులు ఆడి, లాభాలు తెచ్చిపెట్టింది. ఆ వూపులోనే ''కొంటెపిల్ల'', ''కాలచక్రం'' అనే మరో రెండు డబ్బింగు సినిమాలు తీస్తే అవి ''కన్నెపిల్ల'' లాభాలలో సగం తినేశాయి. 1968లో టిఆర్‌ రామన్న తమిళంలో తీసిన ''భవాని'' సినిమాకు తెలుగు రీమేక్‌ రైట్స్‌ కొని కెఎస్‌ ప్రకాశరావుగారి దర్శకత్వంలో శోభన్‌బాబు, వాణిశ్రీలతో ''భార్య'' (1968) పేరుతో తీస్తే అది తమిళ కొంత లాభం తెచ్చిపెట్టింది. ఆ తరవాత కామేశ్వరరావుగారు దర్శకుడిగా, శోభన్‌బాబు, వాణిశ్రీలతో ''కలసిన మనసులు'' (1969) సినిమా తీస్తే అది ఘోరంగా ఫ్లాపయింది.

అయినా ఎమ్మెస్‌ యీసారి ఎన్టీయార్‌తో భారీ సినిమా తలపెట్టారు. ఆయనా, పింగళి, కమలాకర కామేశ్వరరావు గారు పురాణాలన్నిటినీ గాలించి ''శ్రీకృష్ణవిజయం'' సినిమా కథ తయారుచేశారు. దాని ప్రకారం కృష్ణుడికి అష్టభార్యలతో బాటు వసుంధర అనే మరో భార్య ఉంటుంది. నాయకుడైన ఎన్టీయార్‌ కథ ఎప్రూవ్‌ చేశారు. కాలయవనుడు, మహోదరుడు అనే ప్రతినాయకుల పాత్రలు ఎస్వీ రంగారావు డబుల్‌ రోల్‌గా వేస్తే బాగుంటుంది. కానీ అప్పట్లో రామారావు, రంగారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత వివాదం నడుస్తోంది కాబట్టి అది జరిగేపని కాదన్నారు కామేశ్వరరావు. ఏం చేయాలా అని ఆలోచించి ఎమ్మెస్‌ 'ఎన్టీయార్‌ నాయకుడిగా, ఎస్వీయార్‌ ప్రతినాయకుడిగా త్వరలో ప్రారంభం కాబోతున్న భారీ పౌరాణిక చిత్రం 'శ్రీకృష్ణవిజయం' అని యాడ్‌ యిచ్చేశారు.

అది చూసి ఎన్టీయార్‌ పిలిపించుకుని 'మాతో మాటమాత్రం చెప్పకుండా యిలా చేశారు?' అన్నారు కోపంగా. 'సార్‌, మాది పెద్ద పేరున్న బ్యానర్‌ కాదు, అలా యిస్తే ప్రేక్షకుల్లో క్రేజ్‌ వస్తుందని యిచ్చా..' అన్నారు ఎమ్మెస్‌. దానికి ఎన్టీయార్‌ నిర్లిప్తంగా నవ్వి 'ముందుచూపులో మీరు మా కన్నా ముందున్నారు. అలాగే కానీయండి' అన్నారు. తర్వాత రంగారావు వద్దకు వెళ్లి కథ వినిపిస్తే 'అలాగే వేస్తాను కానీ నన్ను పెట్టుకునేందుకు రామారావు ఒప్పుకోడు' అన్నారు. ఆయన అనుమతితోనే నేను యాడ్‌ యిచ్చా అని యీయన చెప్తే సరేనన్నారు.

ఇక హీరోయిన్‌ పాత్ర దగ్గరకు వచ్చేసరికి ''వసుంధర పాత్ర కొత్తగా ఉంది. ఆ పాత్రకు జయలలిత గారైతే గొప్పగా ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నించండి.'' అని ఎన్టీయార్‌ సూచించడంతో ఎమ్మెస్‌ ఆవిడ దగ్గరకు వెళ్లారు. ఆయన ''కన్నెపిల్ల'' సినిమా డాన్సింగ్‌ పోజులోని ఒక దృశ్యాన్ని ఒక ఆర్టిస్టు చేత పెయింటింగ్‌ చేయించి, ఫ్రేమ్‌ కట్టించి ఆఫీసులో పెట్టుకునేవారు. ఆ పటం తీసుకుని జయలలిత యింటికి వెళితే వాళ్ల అమ్మగారు మేడపైన మేకప్‌లో ఉంది కలవండి అన్నారు. ఎమ్మెస్‌ వెళ్లి ఆ పటం చేతికి యివ్వగానే ఆమె ఎక్కడిది అన్నట్లు యీయన వంక చూసింది. 'నా ఫస్ట్‌ పిక్చర్‌ హీరోయిన్‌ మేడమ్‌' అన్నారీయన. 'ఓహో కుమరిపెణ్‌ డబ్బింగు చేసింది మీరేనన్నమాట. ఇది నేను ఉంచుకోవచ్చా?' అని అడిగింది జయలలిత. మీ కోసమే తెచ్చా, అంటూ తన సినిమా కథ చెప్పసాగారు.

ఆమె సగం కథ విని 'నా పాత్ర కొత్తగా ఉంది. తప్పకుండా చేస్తాను. షూటింగుకి టైమైంది' అంటూ కిందకు వచ్చి తల్లితో 'రెడ్డిగారి పిక్చర్‌ చేస్తున్నాను. కాల్‌షీట్లెలా అడ్జస్టు చేస్తావో నీ యిష్టం' అని చెప్పి వెళ్లిపోయింది. ఆవిడ కూతురు మాట కాదనలేక ''దసరాబుల్లోడు'' సినిమాకు కేటాయించిన కాల్‌షీట్లు కాన్సిల్‌ చేసి ఎమ్మెస్‌ సినిమాకు యిచ్చారు. ఇదంతా ఎమ్మెస్‌ రెడ్డి ఆత్మకథ ''నా కథ''లో రాశారు. దీని తర్వాత జరిగినది భగీరథ రాసిన విబి రాజేంద్రప్రసాద్‌ జీవితగాథ ''దసరాబుల్లోడు''లో చూడవచ్చు.

రాజేంద్రప్రసాద్‌ తీసిన ''ఆస్తిపరులు'', ''అదృష్టవంతులు'' సినిమాలలో జయలలితే హీరోయిన్‌. ''దసరా బుల్లోడు'' సినిమా కథ అక్కినేనికి నచ్చింది కానీ డేట్స్‌ కోసం ఆగవలసి వచ్చింది. అంతలో ఆయన కాల్‌షీట్‌ యిచ్చిన సినిమాకు కథ సరిగ్గా కుదరకపోవడంతో షూటింగ్‌ కాన్సిల్‌ అయి, యీ సినిమా వెంటనే ప్రారంభించాల్సి వచ్చింది. డైరక్టర్లు ఎవరూ ఖాళీగా వుండకపోవడంతో రాజేంద్రప్రసాదే తొలిసారిగా డైరక్షన్‌కు పూనుకున్నారు. గబగబా తక్కిన నటీనటుల్ని కూడా కుదుర్చుకుని అమలాపురంలో ఔట్‌డోర్‌ షూటింగుతో సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ప్లాను చేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల ముందు జయలలిత తల్లి సంధ్య 'మా అమ్మాయికి ఎమ్జీయార్‌తో సినిమా ఫిక్సయింది. అందువలన దీనిలో వేయలేదు' అని ఉత్తరం పంపారు.

దాంతో రాజేంద్రప్రసాద్‌ వాణిశ్రీ గురించి ఆలోచించారు. ఆమె ఆయన తీసిన ''ఆస్తిపరులు'' (1966)లో జగ్గయ్య సరసన వేశారు. సారథీవారి ''ఆత్మీయులు'' (1969)లో అక్కినేని సరసన వేశారు. ''అర్జంటుగా డేట్స్‌ కావాలి, ఎంత డబ్బయినా ఫర్వాలేదు' అన్నారు రాజేంద్రప్రసాద్‌. తక్కిన నిర్మాతలతో మాట్లాడి వాణిశ్రీ డేట్స్‌ అడ్జస్టు చేసుకుని ''దసరాబుల్లోడు''లో వేశారు. చంద్రకళ మరో హీరోయిన్‌. నాగభూషణం, పద్మనాభం, రంగారావు, అంజలి, గుమ్మడి సహపాత్రధారులు.

''శ్రీకృష్ణవిజయం'' సినిమా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసినా ఎన్టీయార్‌, ఎస్వీయార్‌, నాగభూషణం, కాంతారావు, సత్యనారాయణ, పద్మనాభం, జయలలిత, జమున, దేవిక అందరూ ఉన్నారు. రంభ పాత్రలో హేమమాలిని డాన్స్‌ చేసిన దృశ్యాన్ని కలర్‌లో తీశారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర దర్శకత్వం. భారీ అంచనాలతో 1971 జనవరి 11న రిలీజైంది. రెండు రోజులు పోయాక ''దసరా బుల్లోడు'' రిలీజైంది, సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. శ్రీకృష్ణవిజయం ఫెయిలైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?