Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జీడి‘పలుకు’లు 02

ఎమ్బీయస్‍: జీడి‘పలుకు’లు 02

ముళ్లపూడి వెంకట రమణ రచనల్లోంచి - రాజకీయ దురం(త)ధరులు

* ఈ భూప్రపంచంలో ఎదటివాడిలో కృతజ్ఞత కోసం ఆశించేకన్న ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు. (కృతజ్ఞత)

* ఎలక్షన్లలో ఒక పార్టీవారు ఒక వర్గం వారికి పింఛను ఇప్పిస్తామన్నారు. అవతలివాళ్లు పింఛన్లకి ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామన్నారు. (రాజకీయ బేతాళ పంచవింశతిక) 

* మరి నన్ను జెటకా తోలనిస్తావా అని అడిగాను నేను.

* ఓఁ, మీ నాన్న నాకు ఓటిస్తే తప్పకుండా తోలుతావు అన్నాడు ఓట్లవాడు. (బుడుగు)

* రావుగారికి పార్టీ టిక్కెట్లు ఎందుకివ్వాలో ఆయన తరపు లీడరు వాదించాడు. ‘రావుగారి ముక్కు చాలా పొడుగు. కార్టూన్లు వెయ్యడం సులువు. ఈయన కార్టూనులు తరుచు పేపర్లో పడితే, పార్టీకి నిత్యపబ్లిసిటీ. (రాజకీయ..) 

* పార్టీలో చీలిక వచ్చింది. పార్టీనాయకుడే అది ఏర్పాటు చేయించాడు. ఒకాయన చిన్నగ్రూపు కట్టి బుల్లిగొయ్యి తవ్వడానికి సిద్ధపడుతున్నట్టు పసిగట్టి, తక్షణం తనే తన ఆప్తుడి చేత తనకి వ్యతిరేకంగా ఓ గ్రూపు కట్టించాడు. తనంటే గిట్టక నాయకుణ్ణి ఫిరాయించదలచుకున్న వాళ్లందిరినీ ఈ విధంగా ఆ గ్రూపులోకి నడిపించి, కట్టుతప్పి పోకుండా ఆకట్టుకుపోనాడు.  (రాజకీయ..)

* ఎలక్షన్‍ పొలిటీషియన్‍లా ఎండ కుడీఎడమా లేకుండా పేల్తోంది.  (విక్రమార్కుడి.. )

* రాజ్యపాలన అనగా ప్రజలు ఆకలిదప్పికలు రూపుమాపడం గాదు. ఆకలీ దప్పికా ఎప్పుడూ సూర్యచంద్రుల్లా వుండేవే. వాటిని కాసేపు మరిపించి అల్లిబిల్లి గారడీ చెయ్యడమే పరిపాలన. (గిరీశం లెక్చర్లు)

* రౌడీ : నేనెవరిని అనుకున్నావ్‍? మినిస్టర్‍గారి తాలూకు.

కృష్ణ : ఏడ్చావు.. ఊఁ కానియ్‍..., మినిట్టరంటే గుర్తొచ్చింది. గాంధీ తాతగారు ఏమిచెప్పాడురా? ఇయాల్టి బిడ్డలే రేపటిపౌరులని గదా నాయాలా. ఈళ్లకు రేపు అనేది చూడకుండా చేస్తే ఎట్లారా, రేపు నీ నల్లదొరలకు ఓట్లేయ్యడానికి మంది కావాలిగదా, అందుకని ఈళ్లు బతికుండాలిగదా!  మీరు దోసుకు తినడానికి కాస్తంతా కండ, పీల్చుకు తాగడానికి కాస్తంతా నెత్తురు ఉండాలా? మీ బండి లాగడానికైనా అలా ఒంట్లో కాస్త ఊపిరైనా ఉండాలిగదరా ఏమంటావు? అందుకని సరదాగా ఆ బుట్ట నింపేయ్‍! నువ్వు ఎగ్గొట్టే ఇన్‍కంటాక్స్‌లో, నడిపే మాయాబజారులో వెయ్యోవంతు కాదిది. (కృష్ణావతారం)

* అసలీ కాలప్పొలిటీషియన్‍లకి ఐకమత్యపు విలువ తెలీలేదండీ వదినా, ఒక్క ఘడీసేపు ఒక్క మాటమీద నిలబడ్రు. చెరువు నీటిమీద చిళ్లపెంకులా అలా ఇలా మాటలమీద జరుక్కుంటూ పోతారు.(గిరీశం లెక్చర్లు)

* చూడబోయిన జనం నవ్వితే ఆనందంకొద్దీ అన్నారు. ఏడవగా ఆనంద బాష్పాలన్నారు.(రాజకీయ..)

*నర్సు వచ్చి ‘‘కంగ్రాచ్యులేషన్స్. మీకు కవలపిల్లలు పుట్టారు.’’ అంది

రాజకీయవాది ‘‘అసంభవం, మళ్ళీ లెక్కబెట్టండి.’’ అన్నాడు. (నవ్వితే నవ్వండి)

* నీ మొఖం, ప్రజలకి చెపితే నాకేం బయ్యం నన్ను ఎన్నుకునేది ఓటర్లు. ప్రజలు వేరు. ఓటర్లు వేరు అన్నాడు దుష్టసింహుడు నవ్వి. (రాజకీయ..)

* కోట : గుడికడితే నాకేంటి లాబమని! కొబ్బరిచిప్పలూ చిల్లర డబ్బులూ సెడగోపాలూ- అంతేనా

పింకీ : ఆ గుడికట్టి ఓ కొబ్బరికాయ కొట్టిస్తే ఆ భూమి ఎవరిది?

కోట : దేవుడిదే!

పింకి : దేవుడెవరి తాలూకు?

మంత్రులు : కోటగారి కేరాఫ్‍ కదా!

కోట : శత్రు పార్టీవాళ్ళు ఒకేల గొడవ సేత్తే?

పింకీ : కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చేశాక ఎవ్వడూ కాదనడు. అంటే దేవుడే డొక్క చీరేస్తాడు.

కోట : కట్టిన గుడి కదపరాదు అని రాజ్యాంగంలోనే వుంది కద.

పింకి: చెరువుకానుకొని వున్న రెండొందల ఎకరాల పోరంబోకు భూమంతా మందే! (సుందరకాండ)

* ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు, నాయకులే ప్రజలన్న సత్యం రావుగారికి తెలుసు. ఆయన వి‘నాయక’ వ్రతం చేశారు.(రాజకీయ..)

* దేశానికి నేనేం చేస్తానని గాదు; ఈ గడ్డ మీద పుట్టినందుకు దేశం నాకేమిస్తుందీ అన్నదే వైటల్‍ క్వొశ్చెన్‍.. (గిరీశం లెక్చర్లు)

* సుబ్బరాజుగారికి ఇబ్బందికర పరిస్థితి వచ్చినపుడు టెలిఫోన్‍ మోగింది. సుబ్బరాజుగారి కాలికింద మీట నొక్కితే అదలా ఆపద్ధర్మంగా మోగుతుంది. (రాజకీయ..)

* పదవిలో వుండగా అబ్బిన అలవాట్లు మరి పదవులూ పళ్లూ రాలినట్లు ఠపీమని రాలిపోవు గదా....(గిరీశం లెక్చర్లు)

* ‘ఏవిటయ్యా నీ దేస్సేవ? దేశం కోసం ప్రాణాలు ధారపోస్తానన్నావు, మేమంతా పస్తులతో చస్తున్నాం’ అని తెగేసి అడిగితే - ‘ప్రాణాలు ధారపోస్తానన్న మాట నిజమేకాని - నా ప్రాణాలు కావు; మీవి అని నా ఉద్దేశం’ అన్నాడు (అపార్థసారథి)

* పాలిటిక్సనగానేమి?అనగా ఉదాహరణకి బర్తరపు ఖాయమని తెలుసుకోవడం; అందుకో గంట ముందే ఆ పదవిని త్యాగం చేసవతల పారెయ్యడం...(గిరీశం లెక్చర్లు)

* అల్లు : మీరు దండమా!  ఇప్పుడా అబ్బే ఎలక్షన్‍ ముందరైతే పెట్టొచ్చుగాని, ఎన్నికలై పోయాక పెడితే మహాతప్పు. లోకువైపోతాం కదండి! (మంత్రిగారి వియ్యంకుడు)

* (గురజాడతో గిరీశం) కొత్తతరం దేస్సేవకులు విరగబూచారు. మీ పాటని మధురవాణి ముంగురుల్లా కాస్త సవరించి దేశమంటే మంత్రులోయ్‍ అన్నారు.(గిరీశం లెక్చర్లు)

* ‘ప్రాణాలతో చెలగాడడం నాకు చేతకాదు’

సైతాన్‍ : అబ్బీ, జాలిపడడం, చావును చూడలేకపోవడం ఇవన్ని గుండెజబ్బు లక్షణాలు, ఇలాగవుతే నువ్వు బాగుపడలేవు, ఆప్ట్రాల్‍ వీళ్ళు మాజీరాజు మనుషులు శిషువా!  నీకు శత్రువులు. ఎలాగు చచ్చేవాళ్లని ఇలా చంపుతావు. అసలింతకీ ఇది రాయల్‍గేమ్‍ . రాజులు ఆడే ఆట. రాజులు.. రాజులేమిటి, మంత్రులు, దేశాలు, నాయకులు, డబ్బున్నవాళ్లు, పెత్తందార్లు, నిన్న నేడు రేపు ఎప్పుడు ఆడే ఆట ఇది. ఇవ్వాళ ఈ పదిమంది చావుకే నువ్వు కంగారుపడుతున్నావు. ఆఁ.... ఆఁ... రేపు హిట్లర్‍ వచ్చి ఒక ఆట వేస్తే కొన్ని లక్షలమంది చస్తారు.

ఓ తూర్పు దేశం, ఓ పడమటి దేశం నాలుగాకులు వేస్తే, ఇక్కడలా గదికొక్కరు కాదు శిషువా! కోటానుకోట్లు పురుగుల్లా మాడి చస్తారు. ఆడదాని కోసం, బంగారం కోసం, ఆఖరికి చేపలు పట్టే హక్కులకోసం, బాంబులు దాచే చోటుల కోసం, ఆహింసను ప్రబోధించే మతాలకోసం, దేవుళ్ల కోసం, దేశాలకు దేశాలు చదరంగపు గవ్వలవుతావు. నీ దేవుడు సీటు దిగేదాకా ఈ మారణహోమం తప్పదు. (రాజాధిరాజు)

* కుర్చీ ఎక్కినవాడు ఓఖ్క బిగిని ప్రజాసేవలోకి ఉరికెయ్యలేడు గదా!- ముందర తన యలక్షన్‍ పెట్టుబడీ దానిమీద వడ్డీ దరిమిలా లాభవూ చూసుకోవాలి గదా! తరవాత తనవాళ్లు, ఆనక మనవాళ్లూ, ఆ పైన పొజిషన్‍ వాళ్లు, ఆ తరవాత అపొజిషన్‍ గాళ్లూ, పార్టీలో కొందరు వర్కర్లూ ఇలా వడ్డించుకుంటూ వెళ్ళి తీరా ప్రజగాళ్ల వరసలో కొచ్చేసరికి దింపేస్తున్నారు. దింపేశాక ప్రజలకేం చెయ్య లేదంటున్నారు. (గిరీశం లెక్చర్లు)

* కోట: ‘ఢిల్లీవారు మళ్లీ  ఫోను చేశారు. సీయం టికట్టు మనకే ఖాయం ఇపుడీ సీకట్లో సీక్రేటు మీటింగు ఎందుకంటే నేను సీయంమ్మయ్యాక ఫారిన్‍ టూరెల్లినా మంచం పట్టినా ఒకేళ జెయిలు కెళ్లాల్సొచ్చినా సుస్తీ లొంగక ప్రాణగండమే వచ్చినా సీయంసీటు మన గేటు దాటరాదు అని డిల్లీవారి కమాండు. ఇయన్నీ రాజకీయాల్లో ముక్కెం. రాజు లేని రోజుండరాదు అని శాస్తరం గదా! అంచాత- అలాటిదే జరిగితే నా తరవాత ఎవరూ అన్నది- క్రొశ్చిను.

అందరూ : ‘నేను’, ‘నేను’

కోట భార్య లక్ష్మి :(లేచి) ఈ చింతకోట సీతామాలచ్మి వుండగా మీకే గండాలూ రావు. అవునా డిల్లీవాళ్లు సెప్పారుగాబట్టి ఒకేల అలాటిది జరిగితే, మీ సీటు - మీరు జేలుకెల్లినా సొర్గానికే ఎల్లినా - నాకే యివ్వాల. అలాని ఇపుడే విల్లు రాసి డిల్లీకి బంపండి. నా మంగళాస్త్రాల మీద ఒట్టు. నాక్కూడా ఏమన్నా అవుతే నా సీటు మన బుజ్జిబాబు కివ్వాల- ఆడికి మైనార్టి అని పేచీపెడితే మా తమ్ముణ్ని గార్డేన్‍గా పెట్టెయ్యండి- లేపోతే బావులోకి దూకి సత్తా- (సుందరకాండ)

* కుర్చీ ఎక్కిన మర్నాడే అమెరికా చెక్కేసి ఒక హార్టాపరేషనూ, వాళ్లావిడకో కిడ్నీ బదలాయింపూ లాగించేశాడు.(గిరీశం లెక్చర్లు)

* నాలుగో ప్రణాళిక ఖర్చులో కొరత వసూళ్లగ్గాను ఐదారు కోట్ల పన్నులు వెయ్యాలని పన్నుగడ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేసినపుడు వరవిక్రయం మీద అమ్మకంపన్ను, కొనుగోలుపన్ను రెండూ విధించినచో లాభము గల్గును.(కట్టుడు - ‘‘పన్ను’’లు)

* ..ఈ లోగా సిరాఒలికి బొత్తి పాడవటం, కొత్తకాయితాల కిండెంట్లు ఆలస్యం దేనికైందని ఓ కమిటీ, అది మీటింగులు పెట్టడం, ఎక్కడ జరగాలి అన్న దానిమీద రభసలు, రాయలసీమ, తెలంగాణా వర్గాలలో అసంతృప్తి, నిరసనలూ, నిరశనవ్రతాలూ, ఊరేగింపులూ, చివరికి కమిటీ మీటింగులూ, రిపోర్టు రాయడం, అది వచ్చేవరకూ అసలు రిపోర్టు ఆగడం, ఎర్రటేపు ముళ్లు చిక్కులు పడటం, ఆ రిపోర్టు కాగితాలు వీటిలోకి, దీనివి దానిలోకీ పోవడం.... వగైరాలు అన్నీ యథాప్రకారం జరిగాయి. (రాజకీయ..)

* (ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తున్న సామాన్యుడు) మీరు క్యూలో నించుని బియ్యం కొన్నంత ఒట్టు.(లెటరేచర్‍)

* బ్రహ్మాండమైన ఎన్నిక ఫలితాన్ని గజంన్నర కొలత మీద ఆధారపడేలా చేసిన రూల్సు. వాటిని ప్రియురాలి ముంగురుల్లా సవరించడానికి గల సదుపాయాలు - ఇవే విలనులు. నూరు గజాల లోపల కూడదు అంటే నూటొకటో గజంలో చెయ్యొచ్చునని ఒప్పుకున్నట్టేగా; గజం ఇవతల చేసింది నేరం అయి, గజం అవతల చేసింది కాకపోవడం అన్నాయవేనా? (రాజకీయ..)

* నాను పన్నులమంత్రి. పుడితే పన్ను, సత్తే పన్ను, వుంటే పన్ను వూడితే పన్ను- సెరుగ్గడలో సెరుగ్గడల్లా ఆడించేసి పీల్చి పిప్పించేస్తాను.

కోట : అంత మొరటుదనం సేత్తే మొదటికే మోసం వస్తది బెదరూ. పెజల సొమ్ము లాగాలంటే - అది ఆళ్లకే తెలీకుండా సున్నితంగా సుతారంగా జరగాలి. తల్లో పేనులా తాగాలి. పక్కలో నల్లిలా పీల్చాలి. చేలో కలుపు మొక్కలా, సెర్లో జలగలా సేదుకోవాలి....నేరం జెయ్యడం నేరంగాదు. నేరం జెయ్యడం వూపిరిపీల్చడం అంత మావూలు గ్గానీ-అసలు సిసలు నేరం - దొరికిపోవడం. (సుందరకాండ) ***

- ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (ఏప్రిల్‍ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?