Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జ్యేష్ఠ కథ 'మీకు తెలుసా?'

ఎమ్బీయస్‌: జ్యేష్ఠ కథ 'మీకు తెలుసా?'

ఇవటూరి చినవీర బసవరాజు (1939-88) గారు జ్యేష్ఠ పేరుతో కథలు రాశారు. ఆయన కథల్లో వ్యంగ్యం ఉంటుంది, చదివించే, ఆలోచింపచేసే గుణం ఉంటుంది. మనుషులు చిత్రమైనవారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. ఎందుకలా ప్రవర్తించారో అర్థం కాక బుర్ర పగకొట్టుకుంటాం. లంచాలతో కోట్లు కూడబెట్టి, ఏ ఐదువేలకో కక్కుర్తి పడి ఎసిబి వాళ్లకు పట్టుబడ్డవాడి వార్త చదివి తెల్లబోతాం.. ఏ ఐదు లక్షలో అయితే ఫర్వాలేదు కానీ బొత్తిగా ఐదువేలా? అనుకుంటాం. బాగా డబ్బుండి హోటల్లో వందలాది రూపాయలు టిప్పులిచ్చే వాళ్లు అరటిపళ్ల దగ్గరో, కరివేపాకు దగ్గరో బేరాలాడడం చూసి నవ్వుకుంటాం. ‘వాడొట్టి పిసినారి. అలాటిది నీకెలా అప్పిచ్చాడురా బాబూ?’ అని ఆశ్చర్యపడతాం. ఏం మాయ చేశాడో చెప్పమంటాం. అవతలివాడు ‘ఏమో, వెళ్లి అడిగానంతే’ అంటాడు. నమ్మబుద్ధి కాదు. ఈ కథలో అలాటి చిత్రాన్ని ఒకదాన్ని చెప్పి, అలా ఎందుకై ఉంటుందో కారణం మీకు తెలుసా? అని అడుగుతాడు రచయిత.

చిరుద్యోగి ఐన ఆనంద్‌కు సుబ్బులు అనే నిరుద్యోగి ఫ్రెండున్నాడు. చిరకాలంగా నిరుద్యోగి. విసిగి వేసారి తన 30వ యింటర్వ్యూకి యీ వూరు వచ్చాడు. ఎవరికైనా సిఫార్సు చేసి, ఉద్యోగం యిప్పించరా అన్నాడు. నాకెవరూ తెలియదన్నాడితను. వీళ్లింటికి దగ్గర్లోనే పెద్ద తోట, దానిలో పెద్ద మేడ ఉంది. అది డాక్టర్‌ భగవాన్‌ గారిది. ఆయన యింటికి చుట్టపు చూపుగానే వస్తాడు. ఆయన భార్య శివరాణి పెద్ద సోషలైట్‌. మినిస్టర్ల దగ్గర్నుంచి ప్రజాకవుల వరకు అందరూ ఆవిడ దగ్గరకు వస్తూంటారు. అనేక రకాల లావాదేవీల్లో సూత్రధారిణి. ‘మీ కాలనీలోనే ఉంటుంది కాబట్టి, వెళ్లి పరిచయం చేసుకుని నా గురించి చెప్పరా. నేను వెళ్లి కాళ్ల మీద పడతాను.’ అన్నాడు సుబ్బులు. ‘నేనెప్పుడూ వెళ్లలేదు. వాళ్లింట్లో కుక్కల్ని చూస్తే భయం. అడిగినా లాభం ఉండదు’ అన్నాడు ఆనంద్‌.  

వీళ్లిలా ఆ యింటి ముందు నిల్చొని చర్చించుకుంటూ ఉండగా సుబ్బులు యింటర్వ్యూకి హాజరు కావల్సిన కంపెనీ జనరల్‌ మేనేజర్‌ కారు వచ్చి యింటిముందు ఆగింది. ఇక సుబ్బులు ఆగలేదు. ‘ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం ఖాయంరా’ అని తొందర పడిపోయాడు. కారు వచ్చిందని గేటు తీయడానికి వచ్చినవాడు కారును లోపలికి పంపించి, వీళ్లను చూసి దగ్గరకు సిగరెట్టు ఉందా అని అడిగాడు.  అతను ఆవిడ డ్రైవరు. పేరు నూకరాజు. వంటవాడూ, గేట్‌ కీపరూ సెలవు పెట్టడంతో ఆ పనులు చేయాల్సిరావడంతో బయటకి వెళ్లి సిగరెట్టు కాల్చే అవకాశం లేకుండా పోయింది. వీళ్లను అడిగి తీసుకున్న సిగరెట్టు కాలుస్తూ మంచీచెడ్డా మాట్లాడాడు.

ఆవిడ కాకపోయినా, ఆవిడ పనివాడైనా దొరికాడు కదాని వీళ్లు తమ గోడు చెప్పుకుని మీ అమ్మగారికి చెప్పు అన్నారు. అతను ఫెళఫెళ నవ్వి ‘పులుల్ని కాల్చేవాణ్ని ఉడతలు కాల్చమన్నట్లుంది. సిమ్మెంట్‌ కోటాలు, ఎమ్మెల్యే టిక్కెట్లు, స్థలాల సెటిల్‌మెంట్స్‌, మర్డర్‌ మేనేజ్‌మెంట్స్‌ లాటివైతే చెప్పండి. 5 వేలకు యిలాటి చిన్నాచితకా ఉద్యోగాలు వేయించే రాయుడుగారి దగ్గరకు వెళ్లండి.’ అన్నాడు నిర్మొహమాటంగా. అది విని సుబ్బులు రోడ్డు మీద చతికిలపడి ఏడవడం మొదలుపెట్టాడు. ఆనంద్‌ నూకరాజుతో ‘చూస్తున్నారుగా వీడి అవస్థ. ఆత్మహత్యే శరణ్యం. ఐదారేళ్లగా మీరు ఆవిడ దగ్గర పని చేస్తున్నారుగా, చెప్పి చూడండి. నీట ముంచినా, పాల ముంచినా మీదే భారం.’ అంటూ సుబ్బులు పేరు, కంపెనీ పేరుతో బాటు ఓ యాభై రూపాయల నోటు అతని జేబులో పెట్టేశాడు.

నాలుగు వేకెన్సీల ఇంటర్వ్యూకి 450 మంది వచ్చారు. సుబ్బులుకి ఆశ పోయింది. ఏమైనా తెలుస్తుందేమోనని నూకరాజు దగ్గరకి వెళ్లబోయి కుక్కలను చూసి పారిపోయి వచ్చారు. పది రోజుల తర్వాత సుబ్బులుకి ఉద్యోగం వచ్చింది. ఏభై రూపాయలు యిచ్చాం కదాని నూకరాజు సిఫార్సు చేశాడే అనుకుందాం. ఆవిడ డ్రైవరు మాట ఎందుకు వింటుంది? అతనికి ఎందుకంత విలువ యిచ్చింది? అని వీళ్లకు అర్థం కాలేదు.

కొన్నాళ్లకు సైకో ఎనాలిసిస్‌ తెలిసున్న పెంటారావుతో యీ విషయం చర్చించబోతే అతను పెద్ద థియరీ చెప్పాడు ` ఫ్రాయిడ్‌ అన్ని సంబంధాలకూ సెక్సే కారణమన్నాడు. భర్తతో ఆవిడకు పెద్ద బంధాలు లేవు. హైక్లాసు వాళ్లు పదిమందితో ఉన్నా వెరైటీ కోసం లోక్లాస్‌ వాడైన నూకరాజుతో పెట్టుకుని వుంటుంది. బాగా ఎంజాయ్‌ చేస్తూండవచ్చు కూడా. అందుకని అతని మాట కొట్టేయలేక పోయింది అంటూ. ఇది విని సుబ్బులు ‘అన్నం పెట్టిన శివరాణి గార్ని ఒక్కమాట అంటే చంపేస్తా’ అంటూ శివతాండవం చేసేశాడు. ‘ఇతనికి మదర్‌ ఫిక్సేషన్‌’ అంటూ పెంటారావు మరో థియరీ ప్రతిపాదించాడు. చివరకు ఆనంద్‌ అతన్ని ఎలాగోలా పంపించివేశాడు.

రెండు నెలలు గడిచాయి. సుబ్బులుకి పెళ్లయింది. ఇంటికోసం వేటాడుతూండగా ఓ పాక గుమ్మంలో చిన్న పిల్లాణ్ని ఎత్తుకుని నూకరాజు కనబడ్డాడు. మేం ఫలానా అని వీళ్లు గుర్తు చేయగానే అతను ఆ ఏభై గురించి వచ్చారనుకుని కంగారుపడి ‘ఇదిగో యీ పిల్లాడి తోడు. ఆ యాభై అమ్మగారికే యిచ్చాను. మీ ఉద్యోగం రాకపోయినందుకు నన్నేమీ అనకండి సార్‌’ అని బతిమాలాడు. ‘అదేవిటి, ఆవిడకిచ్చావా?’ అని వీళ్లు తెల్లబోయారు.

‘అవును, నాకెందుకండి, ఉద్యోగం కోసం ఆవిడకే యిచ్చారనుకుని మంచి మూడ్‌లో ఉన్నపుడు మీరిచ్చిన కాగితాలతో పాటు అదీ యిచ్చానండి. ఆవిడ విరగబడి విరగబడి నవ్వారు. తర్వాత ఆ జనరల్‌ మేనేజర్‌ గారితో ఇంగ్లీషులో ఏదో మాట్లాడారు కూడానండి. లక్షలతో బంతాట లాడే ఆ యమ్మకు ఏభై రూపాయలు ఏం ఆనతాయండి, అందుకే ఆ వుద్యోగం రాలేదు’ అన్నాడతను. వీళ్లు ఉద్యోగం వచ్చిందని చెప్పి, ఓ యిరవై రూపాయలు అతనికి బక్షీసుగా యిచ్చి పక్కకు వచ్చి మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఏభై రూపాయలు గడ్డిపరకతో సమానం. అయినా ఎందుకిలా చేసింది అని. ఏమీ తేలలేదు.

పది రోజుల తర్వాత పేపర్లో న్యూస్‌ వచ్చింది. శివరాణి న్యూయార్కులో ఓ డిపార్టుమెంటల్‌ స్టోర్సులో రెండు జతల మేజోళ్లు దొంగిలిస్తూ పట్టుబడిందని, కోర్టు జుల్మానా విధించిందని వుంది దానిలో. ‘అది క్లెప్టోమానియా, థ్రిల్‌ కోసం చేసే చిన్న దొంగతనం.’ అని పెంటారావు విశ్లేషించాడు. ‘బహుశా అనుకోకుండా ఆశించకుండా నూకరాజు మా ఏభై రూపాయలూ చేతిలో పెట్టేసరికి అలాంటి థ్రిల్‌ వచ్చిందేమో ఆవిడకి, ఆ మురిపెంతో వెంటనే సిఫార్సు చేసిందేమో. అంతకంటె ఏమనుకుంటాం? ఇంకేదైనా కారణం ఉందేమో నాకు తెలియదు. మీకు తెలుసా?’ అని కథకుడు కథ ముగించాడు.

పెంటారావు సైకో ఎనాలిసిస్‌ను రచయిత అంతకుముందే వెక్కిరించాడు. క్లెప్టోమానియాకు దీన్ని ముడిపెట్టడం సూచించి వదిలేశాడు కానీ అలాటిది ఏమీ లేకపోయినా, పెద్దపెద్ద వాళ్లు చిన్న విషయాలకు థ్రిల్‌ కావడం చూస్తూ ఉంటాం. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో తినితిని బోరు కొట్టి, రోడ్డు పక్కన పిడత కింద పప్పును రెలిష్‌ చేసేవాళ్లని చూశాను. ముళ్లపూడి రమణ గారు రాశారు ` ‘‘అత్తగారి కథలు’’కు పారితోషికంగా భానుమతి గారికి పది రూపాయలు పంపుదామని రమణగారు అంటే ఆంధ్రపత్రిక వాళ్లు అభ్యంతర పెట్టారట. ఆవిడ సినిమాల్లో వేలల్లో సంపాదిస్తుంది. స్టూడియో ఓనరు. మనం పంపింది చూసి తిట్టిపోస్తుంది అన్నారట. అలా కాదని ఒప్పించి, పంపిస్తే భానుమతి గారు రమణగారికి ఫోన్‌ చేసి ప్రత్యేకంగా థాంక్స్‌ చెప్పారట. సినిమాల్లో వేలు సంపాదించినా రాని కిక్‌ దీనిలో వచ్చింది. ఇది రచయిత్రిగా సంపాదన. దీనితో మా అత్తగారికి ఒక సైను పంచె, నాకో జాకెట్టు గుడ్డ, మా ఆయనకి రుమాళ్లు కొన్నాను అంటూ సంబరంగా చెప్పారట.

ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటరుగా పనిచేసిన వల్లూరి రాఘవరావు ఓ సారి చెప్పాడు. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా ఆయన్ని అడిగి ‘శీనయ్య కథ’ (పేరు సరిగ్గా గుర్తు రావటం లేదు) అనే పెద్ద కథ వీక్లీలో ప్రచురించి దాని పారితోషికంగా వెయ్యో, రెండు వేలో చెక్కు పట్టుకెళ్లి హైదరాబాదు వచ్చినపుడు యిస్తే పివి మురిసిపోయారట. పక్కనున్న వాళ్లతో ‘నా కథకు చెక్కు యిస్తున్నాడయ్యా యీ కుర్రాడు’ అంటూ పడిపడి నవ్వారట. ఆ చెక్‌ను ఎన్‌క్యాష్‌ చేసుకున్నారు కూడా.

ఈ కథలో శివరాణికి కూడా అలాటి కిక్కే కలిగి వుంటుంది. నూకరాజు అమాయకంగా ఏభై రూపాయల లంచం యివ్వడం ఆమెను టికిల్‌ చేసి వుంటుంది. ఇలాటి ఉద్యోగం యిప్పించడం ఆమెకు చిటికెలో పని. పోనీలే అని చేసేసింది. మళ్లీ ఆ సుబ్బులు వచ్చి తనకు కనబడాలని కూడా ఆశించి వుండదు. అది సుబ్బులుకి జీవన్మరణ సమస్య కానీ ఆవిడకు ఓ పిల్లచేష్ట. కావాలంటే పీకించడం కూడా అంత ఫ్రివోలస్‌ రీజన్‌కు చేయగలదు. ఈ కథకు క్లెప్టోమానియా సంఘటన చేర్చి వుండకపోతే పాఠకులను కన్విన్స్‌ చేయడం కష్టమయ్యేదని, దాని స్థానంలో పెద్ద ఫుట్‌నోట్‌ రాయాల్సి వచ్చేదని రచయిత భావించి వుంటారని నేననుకుంటున్నాను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?