cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కామత్ హోటల్ నుంచి ఫైవ్ స్టార్ వరకు..

ఎమ్బీయస్ : కామత్ హోటల్ నుంచి ఫైవ్ స్టార్ వరకు..

విఠల్ కామత్ హోటల్ అనుభవాలలో మరొకటి - జపాన్‌లో ఓ ఫ్రెండు కోసం ఇండియన్ రెస్టారెంటు పెడితే సరిగ్గా ఓపెనింగ్ సమయానికి ఓ జపనీస్ అధికారి వచ్చి తందూరీ చేస్తున్న ఇండియన్ వంటవాణ్ని ‘ఇది తయారుచేయడానికి సర్టిఫికెట్టు వుందా?’ అని అడిగాడు. జపానీయులకైతే ఏ రకమైన వంటకం చేయడానికైనా సర్టిఫికెట్టు అక్కరలేదు కానీ విదేశీయులకైతే ఆ వంటకం తయారీ కాటరింగ్ కాలేజీలో నేర్చుకున్నట్లు సర్టిఫికెట్టుండాలి. తందూరీ చాలా ప్రాచీన వంటకం, కేటరింగు కాలేజీల్లో నేర్పరని విఠల్ చెప్పినా అతను వినలేదు. తందూరీ లేకుండా ఇండియన్ రెస్టారెంటు అంటే నవ్వుతారు. అందుకని ఇతను ఓ జపాన్ వంటవాడికి ఆ పని నేర్పాడు. అతను ఎంత వేడిగా వున్నా సరే పిండిని నొక్కి తందూర్లు బయటకు తీయగలిగాడు. కానీ మామూలు తందూర్లంత వెడల్పుగా రావటం లేదు. అప్పుడితను సైజు తగ్గిన తందూర్ల మధ్యలో బంగాళాదుంప, బాదాం, ఉల్లిపాయలు పేస్టులా చేసి పెట్టి కాక్‌టెయిల్ నాన్ పేరుతో డిష్‌గా ప్రవేశపెట్టాడు. జనం విరగబడి తిన్నారు.

అంతేకాదు, ఇండియన్ టచ్ యివ్వడానికి అక్కడ మ్యూజిక్ యూనివర్శిటీలో సితారా, తబలా నేర్చుకుంటున్న జపనీయులను తీసుకు వచ్చి డిన్నర్ టైమ్‌లో కచ్చేరీ పెట్టారు. జపాన్ కుర్రవాళ్లు ఇండియన్ వాయిద్యాలు వాయించడం, ఇండియన్ వంటకాలు వండడం ప్రెస్‌లో ఘనంగా వచ్చింది. హోటల్ నిలదొక్కుకుంది. కొన్నాళ్లకు సితారు, తబలా విద్యార్థులు చదువు ముగించుకుని వెళ్లిపోయారు. వేరెవరూ దొరకలేదు. దాంతో జపాన్ సర్వర్లని ఆ వాయిద్యాలు వాయిస్తున్నట్లు పోజు పెట్టమని చెప్పి, వెనక్కాల రవిశంకర్ సితారా టేపు పెట్టేవారు.  ఈ ప్లేబ్యాక్ టెక్నిక్కూ బాగా పనిచేసింది. ఈ ట్రిక్కులే కాదు, తనను తాను మెరుగుపరుచుకోవడానికి విఠల్ చాలా శ్రమించాడు. మరాఠీ మీడియంలో చదవడం చేత సభల్లో ఇంగ్లీషు మాట్లాడలేకపోయేవాడు. అందుకని రెండేళ్ల పాటు స్పీకింగ్ కోర్స్ హాజరయ్యాడు.

స్వతస్సిద్ధంగా చేసిన మంచి పనులు తర్వాత మేలు చేకూర్చిన సంఘటనలు కొన్ని వున్నాయి. ‘‘ఆకాశం నీ హద్దురా’’ సినిమాలో హీరో ఎయిర్‌పోర్టులో లగేజి విషయంలో ఒక అపరిచిత మహిళకు ఉపకారం చేస్తాడు. ఆమె జర్నలిస్టు కావడంతో తర్వాత ఉపయోగపడుతుంది. అలాగే విఠల్ ఎయిర్‌పోర్టులో సామాన్లతో, పిల్లలతో అవస్థపడుతున్న స్త్రీకి సాయపడడం వెనక్కాల వున్న ఫ్రెంచివాళ్లు చూసి మెచ్చుకున్నారు. మాటలు కలిపారు. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి ఇరవై మంది వున్న ఓ బృందం వస్తూంటే ఫలానా వారి హోటల్లో దిగండి అని రికమెండ్ చేశారు. దీపావళి సామాన్లు అమ్మడానికి లైసెన్సు కోసం వెళితే అక్కడి అధికారి ‘మీరు నాకు అత్యవసర పరిస్థితుల్లో ఒకసారి లిఫ్ట్ యిచ్చి మహోపకారం చేశారు’ అంటూ బ్యాక్‌డేట్‌ వేసి లైసెన్సు యిచ్చాడు.

ఓ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ స్వయంగా చెప్పినా మేనేజర్ విఠల్ లోను విషయం చెప్తూంటే వినిపించుకోకుండా చూద్దాం లెండి అని వాయిదా వేయబోయాడు. ఇతను ‘ఇప్పుడు మీ లంచ్‌టైమ్ కదా, చేసి రండి, తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాడు. నా లంచ్‌టైమ్ మీకెలా తెలుసు? అంటే ‘మీకు చపాతీలకు నెయ్యి రాస్తే నచ్చదని తెలుసు. తీపి ఆవకాయతో చపాతీలు తినడం యిష్టమని తెలుసు. మీరు మా ‘సామ్రాట్’ హోటల్‌కు వచ్చేవారు. గమనించాను. కస్టమర్ల యిష్టాయిష్టాలను ఇన్నేళ్లయినా గుర్తు పెట్టుకునే నేను, అదే బిలాంగింగ్‌నెస్‌తో యింకా పెద్ద హోటల్ కడదామనే మీ దగ్గరకు వచ్చాను.’ అన్నాడు. దెబ్బకి మేనేజరు కన్విన్స్ అయిపోయాడు. వాయిదా వేయకుండా వెంటనే పది కోట్లు లోను రిలీజు చేసేశాడు. విఠల్ ఇకోటెల్ పెట్టినపుడు తమ హోటల్ ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుతున్నామో, నీటి వృథాను ఎలా అరికడుతున్నామో స్కూలు పిల్లలను ఎక్స్‌కర్షన్‌కని రప్పించి చెప్తూండేవారు.

ఆ హోటల్ వర్కింగ్ కాపిటల్‌కై అప్పు కోసం బ్యాంకుకి వెళితే దాని డిప్యూటీ జనరల్ మేనేజర్ ‘నేను చదువుకునే రోజుల్లో మీ ‘సత్కార్’ హోటల్‌కు వచ్చేవాణ్ని. స్కూల్లో చదివే మా అబ్బాయి మీ ఆర్కిడ్ హోటల్ చూసి వచ్చి, ఇక అప్పణ్నుంచి నీరు వేస్ట్ చేయవద్దంటూ వాళ్ల అమ్మకు లెక్చర్లిస్తున్నాడు. మీరు పెట్టిన పోటీలో ప్రైజ్ కూడా వచ్చింది. మంచి కాన్సెప్టుతో కట్టినట్టున్నారే’ అంటూ వెంటనే లోను శాంక్షన్ చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పరిచయమైనప్పుడు, ఆయన బ్యాంకు కొత్తగా కట్టిన బిల్డింగు పక్కనున్న 5 వేల చ.అ.ల ఖాళీ స్థలం చూపించి, ‘ఎల్లుండే ప్రారంభోత్సవం. ఈ స్థలంలో 24 గంటల్లో కాంటీన్ నెలకొల్పగలవా?’ అని అడిగారు. ‘ఓఁ’ అంటూ మాయాబజార్‌లోలా అప్పటికప్పుడు అన్నీ ఏర్పాటు చేయడంతో ముగ్ధుడై పోయి, ‘ఇక్కడే కాంటీన్ కట్టుకుని నడుపుకో.’ అని అనుమతి యిచ్చేశారు, కట్టుకోవడానికి లోను కూడా యిచ్చేశారు. ఆ విధంగా ఆర్‌బిఐలో ఆఫీసర్లందరూ బాగా పరిచయమయ్యారు. నాలుగైదేళ్లు పోయాక ఒక ఆఫీసరు శాంతాక్రజ్ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ త్రీ స్టార్ హోటల్‌ అమ్మకానికి వచ్చింది. మేం అనుమతిస్తే తప్ప అమ్మలేరు. దాన్ని కొనవచ్చుగా అని సూచించాడు.

అది విఠల్ జీవితంలో టర్నింగు పాయింటు. దాని లొకేషన్ బ్రహ్మాండంగా వుంది. కానీ భాగస్వాములు విడిపోతున్నారు. నాలుగు వర్కర్స్ యూనియన్లు నిరంతరం పోట్లాడుకుంటున్నాయి. శుచీ, శుభ్రతా లేదు. తీసుకుని బాగు చేద్దామన్నా బోల్డు పెట్టుబడి పెట్టాలి. తండ్రి నడిగితే ‘ఉడిపి హోటల్‌గాళ్లం, మనకు స్టార్ హోటళ్లెందుకు’ అని తిడతాడు. ఇతను తర్జనభర్జన పడి చివరకు కోటి రూపాయలు అడ్వాన్సుగా యిచ్చి హోటల్ నిర్వహణ తీసుకున్నాడు. రెండేళ్లలో తక్కినది వాయిదాల్లో తీర్చకపోతే ఈ అడ్వాన్సు పోతుందన్నమాట. కోటి రూపాయలు యిచ్చేశాక చెపితే తండ్రి భగ్గుమన్నాడు. కుటుంబస్నేహితుడైన అడ్వకేటుతో ‘మా నాన్నను కాస్త శాంతపరిచి, ఒక్కసారి వచ్చి చూడమనండి చాలు. తర్వాత ఆయన ఏం చెప్పినా చేస్తాను.’ అన్నాడు. తండ్రి రాగానే టెర్రేస్ మీదకు తీసుకెళ్లి చూపించాడు. ఓ పక్కన ఎయిర్‌పోర్టు. మరో పక్కన రైల్వేస్టేషన్, ఎదురుగా హైవే. అనుభవజ్ఞుడైన హోటలియర్ కాబట్టి ఆయన ఒక్క చూపులో లొకేషన్ విలువను, లాభాలొచ్చే స్కోప్‌ను గుర్తుపట్టాడు. అదే అదనని విఠల్, ‘పక్క స్థలం అమ్మకానికి వచ్చింది. వద్దని చెప్పాను.’ అన్నాడు సన్నగా. ‘ఇడియట్, అలాటి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? ఎక్స్‌పాన్షన్‌కు పనికి వస్తుంది కదా! నేను డబ్బిస్తాను, కొనేయ్’ అన్నారాయన.

విఠల్ హోటల్ నిర్వహణ చేపట్టాక, వర్కర్స్‌తో బాటే కూర్చుని లంచ్ చేస్తూ, వాళ్ల బాగోగులు చూసుకుంటూ, సౌకర్యాలు పెంచుతూ, వాళ్ల అభిమానాన్ని చూరగొన్నాడు. నాలుగు యూనియన్లను ఒక్కటి చేశారు. అన్ని రకాలుగా క్వాలిటీ పెంచాడు. బేరాలు పెరగడానికి రెండు బస్సులు అద్దెకు తీసుకుని, ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు ఫ్రీ ట్రిప్పులు వేసేవారు. ఫ్లయిట్ ఫ్లయిట్‌కు మధ్య వున్న టైములో అక్కడ పడిగాపులు కాచేకన్నా హోటల్‌కు వచ్చి కూర్చుంటే మేలు అనిపించారు. డిపార్చర్ టైముకి అరగంట ముందు దింపేసే బాధ్యత మాది అని వీళ్లు గ్యారంటీ యిచ్చేవారు. ఆ బస్సుల మీద వీళ్ల హోటల్ పేరు ‘కామత్ ప్లాజా’ ప్రముఖంగా రాయడంతో, అవి నిరంతరం అటూయిటూ తిరగడంతో ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఎయిర్‌పోర్టు కాంటీన్ కన్నా వీళ్ల ఐటమ్స్ ధరలు తక్కువ, ఫుడ్ క్వాలిటీ ఎక్కువ. పైగా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండు వుండేది. ‘ఎక్కువసేపు వెయిటింగ్ వుండే పక్షంలో మా రూముల్లో విశ్రాంతి తీసుకోండి. రోజు అద్దె కట్టనక్కరలేదు, పూటల్లెక్కన  కడితే చాలు’ అని ఆఫర్ యిచ్చాడితను. దాంతో హోటల్‌లో 90శాతం ఆక్యుపెన్సీ వుండేది. త్వరలోనే అప్పులన్నీ తీర్చివేశారు.

నాలుగైదేళ్లు సాగేసరికి, ఆ 78 రూముల త్రీస్టార్ కామత్ ప్లాజా హోటల్ పడగొట్టి ‘ఆర్కిడ్’ పేర 250 గదుల ఫైవ్‌స్టార్ ఇకోటెల్ కట్టాలనే ఐడియా వచ్చింది విఠల్‌కు. ఇక్కణ్నుంచి సెకండాఫ్ కష్టాలన్నీ వచ్చాయి మన హీరోకి. తండ్రి ముందు వద్దన్నాడు కానీ తర్వాత దీన్ని పడగొట్టకుండా పక్కనున్న ఖాళీ స్థలంలో కడితే ఒప్పుకుంటాన్నాడు. ఇతను సరే అన్నాడు. దాని పునాదులు తీస్తూంటే తెలిసింది కామత్ ప్లాజాను పైపులైన్సు మీద కట్టారని, ఏ క్షణంలోనైనా కూలవచ్చని. వెంటనే హోటల్ మూసేశారు. రాబడి ఆగిపోయింది. ఈ సమయంలో దురుసు స్వభావం వున్న విఠల్ తమ్ముడు శివానంద్, వాళ్ల ఆడిటర్‌తో కలిసి కుట్ర పన్ని ఇతనిపై తిరుగుబాటు చేశాడు. తండ్రిని ఒప్పించి, ఆస్తిని వాటాలు వేయించాడు. గ్రూపు మొత్తం ఆస్తి యితరులకు, అప్పులతో అసంపూర్ణంగా మిగిలిన ఆర్కిడ్ విఠల్ వాటాకు వచ్చేట్లు చేశాడు.

దీనితో విఠల్‌కు కష్టాలు చుట్టుముట్టాయి. నిజానికి సరిగ్గా అప్పుడే అతనికో ఆఫర్ వచ్చింది. ఒక అమెరికన్ తన దేశంలో 42 ఇండియన్ రెస్టారెంట్లు నాలుగేళ్లలో తెరిచి, నిర్వహించే బాధ్యత తీసుకుంటే రూ. 21 కోట్లు యిస్తానని అన్నాడు. ఏడాదికి రూ.5 కోట్ల ఆదాయంతో, అమెరికా, ఇండియాల మధ్య తిరుగుతూ ఆర్కిడ్ నిర్మాణమూ పూర్తి చేయవచ్చని ఇతననుకున్నాడు. ఫైనల్‌గా అగ్రిమెంటు రాసే ముందురోజే ఆస్తి పంపకాలు జరిగాయి. ఇతను నిజాయితీగా జరిగినది చెప్పేశాడు. దాంతో అమెరికన్ పారిపోయాడు. బేరం తెచ్చిన ఏజంటు తిట్టిపోశాడు. సంతకాలు పెట్టేదాకా ఆగలేకపోయావా, నా కమీషన్ పోయింది. అని. ‘ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా, నా దగ్గర డబ్బేమీ లేదని..’ అన్నాడు విఠల్.

తన వెనక్కాల కుటుంబపు ఆస్తి లేదని తెలియగానే అప్పులాళ్లు వెంట పడతారని తెలిసి, తనే వెళ్లి అందరికీ విషయం చెప్పి కాస్త సమయం అడిగాడు. 90శాతం మంది సరేనన్నారు. కొందరు తిట్టారు. ఒక మార్వాడీ అయితే మరీ ఎగిరెగిరి పడ్డాడు.  ఇతను బాధగా బయటకు వచ్చేస్తూంటే వాళ్లావిడ పూజగదిలోంచి బయటకు వచ్చి ‘అన్నా, మేం అప్పుగా యిచ్చిన దాని కంటె 16 ఏళ్లలో మీరు వడ్డీగా మాకే ఎక్కువ యిచ్చారు. దానితోనే పిల్లల పెళ్లిళ్లయ్యాయి. ఆయన మర్చిపోయాడేమో, నేను మర్చిపోలేదు. ఇదిగో యీ డబ్బు తీసుకుని, ఆయన బాకీ తీర్చేయండి. మీ దగ్గర డబ్బు వచ్చినపుడే నాకు తిరిగివ్వండి.’ అంది. ఈయన ఆ డబ్బుతో మర్నాడు వెళ్లి అప్పు తీరిస్తే ఆ మార్వాడీ మహదానందంతో దానికి రెట్టింపు డబ్బు చెక్కు రాసి, చేతిలో పెట్టాడు - ‘ఇప్పుడు నీకు అవసరాలు చాలా వుంటాయి కదా’ అంటూ. వడ్డీ మీద ఆశ అలాటిది!

ఈ కష్టకాలంలో విఠల్ స్నేహితులెవరూ అక్కరకు రాలేదు. బంధువులు మొహం చాటేశారు. 21 శాతం వడ్డీకి కూడా అప్పు పుట్టలేదు. కుటుంబం చాలా అవస్థ పడింది. ఒక దశలో ఓ స్నేహితుడి ఆఫీసుకి వెళ్లి 20వ అంతస్తులోంచి ఆత్మహత్య చేసుకోబోయాడు. అంతలోనే అతని దృష్టి రోడ్డుకి అటున్న బిల్డింగు 23వ అంతస్తుకి రంగులేస్తున్న పెయింటరుపై పడింది. అతనున్నది వెదురుబొంగుల ఉయ్యాల మీద. నడుముకు తాడు కట్టుకోలేదు కూడా. చేసే పనిపై ఏకాగ్రత వుండడంతో అతనికి భయం వేయటం లేదని గ్రహించి, తనూ కష్టాల గురించి ఆలోచించడం మానేసి, పని మీదనే గురి పెడితే అవి బాధించవని అర్థం చేసుకున్నాడు. గతంలోలా రోజుకి 18 గంటలు ఏదో ఒక పని చేయడం మొదలెట్టాడు.

ఇలా చాలా అవస్థలు పడ్డాక బాంకు ఋణాలు వచ్చాయి. ఈలోగా వాళ్ల నాన్నగారికి కేన్సర్ సోకింది. ఆయన చేత ఇకోటెల్ ప్రారంభింపచేయాలని యితని ఆశయం. కానీ పూర్తి స్థాయి హోటల్ కట్టేవరకూ ఆయన బతకకపోవచ్చు. అందుకని 21 రూములు కట్టగానే 1997 అక్టోబరులో ఆయన చేత ప్రారంభోత్సవం చేయించాడు. ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభానికి వచ్చినది పదిమంది కుటుంబసభ్యులు అంతే. పెద్దవారిని పిలిచే స్తోమత లేదు. అయితే తనకున్న ప్రత్యేకతతో అది నిలబడింది, వర్ధిల్లింది. కామత్ ప్లాజా రెప్యుటేషన్ పనికి వచ్చింది. వారం రోజుల్లోనే జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల నుంచి ప్రయాణీకులు రాసాగారు. 1998లో గ్రీన్ గ్లోబ్ సంస్థ నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా వున్న ఎకోటెల్‌ల పోటీలో అది ప్రథమస్థానంలో నిలిచింది. దాని విలువ 2008లో రూ. 600 కోట్లు.

ఇక్కడితో పుస్తకం పూర్తవుతుంది. విఠల్ గురించి వికీపీడియాలో చూస్తే ఆయనకు 110 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని, ఐఐఎమ్‌లో పాఠాలు చెప్తారని, 60 లక్షల చెట్లు నాటారని, ఆర్ట్ కలక్టరనీ, పర్యావరణ ఉద్యమకారుడనీ తెలుస్తుంది. ఈ పుస్తకానికి వస్తే యండమూరి రచనాశైలి గురించి వేరే చెప్పేదేముంది? అనువాదమని ఎక్కడా అనిపించదు. ఏకబిగిన చదివేయవచ్చు. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

mbsprasad@gmail.com

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×