cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కర్ణాటకతో పోలిక నప్పుతుందా?

 ఎమ్బీయస్‌: కర్ణాటకతో పోలిక నప్పుతుందా?

ఉద్ధవ్‌ నేతృత్వంలో సేన-ఎన్సీపీ-కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే 'బిజెపి కర్ణాటకలో కాంగ్రెసు-జెడిఎస్‌ మిశ్రమ ప్రభుత్వాన్ని కూల్చివేసింది కదా, దీన్నీ యీజీగా కూల్చేయగలదు' అంటూ టీవీ చర్చల్లో చాలామంది వాదిస్తున్నారు. ఇది నాకు కాస్త వింతగా ఉంది. నిజానికి యీ సేన కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో దేవుడికే తెలియాలి అని వారం కితమే రాశాను. ఇది పడిపోగానే ఒక పాఠకుడు అభిప్రాయ పడినట్లు అది ఎందుకు కూలిపోయిందో, ఎవరు ఏ పాత్ర వహించారో తప్పకుండా రాసి తీరతాను. రాజకీయక్రీడల పట్ల నా ఆసక్తి అలాటిది. అయితే యిది కర్ణాటక తరహాలో కూలుతుంది అనే వాదన నప్పదని నా అభిప్రాయం.

కర్ణాటకలో అప్పటిదాకా సొంత మెజారిటీతో ప్రభుత్వం నడిపిన కాంగ్రెసు 2018 ఎన్నికలలో 42 సీట్లు తక్కువ తెచ్చుకుని 80 దగ్గర ఆగిపోయింది. దాంతో 37 సీట్ల జెడిఎస్‌ (దానికి గతంలో 40 ఉండేవి) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 80 సీట్ల కాంగ్రెసుకి కాకుండా 37 సీట్ల జెడిఎస్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అదే అన్ని అనర్థాలకు కారణమైంది. అవతల బిజెపి తన బలాన్ని 44 నుంచి 104కు పెంచుకుని, మొత్తం సీట్లలో 46% సీట్లు తెచ్చుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెసు సిఎం సీటుపై రాజీపడి, మళ్లీ అధికారంలోకి వచ్చింది. అక్కడ 50-50 ఫార్ములా కూడా లేదు. కుమారస్వామియే ఐదేళ్లు సిఎం అన్నారు.

ఇక మహారాష్ట్రలో అప్పటిదాకా సంకీర్ణ ప్రభుత్వం నడిపిన బిజెపి 2019 ఎన్నికలలో 17 సీట్లు తక్కువ తెచ్చుకుని 105 దగ్గర ఆగిపోయింది. అంటే 36% సీట్లు మాత్రమే దాని వద్ద ఉన్నాయి. పొత్తు కారణంగా సేనకు  సీట్లు యిచ్చేయడం కారణమైతే కావచ్చు, కానీ 36% సీట్లు మాత్రమే అనేది వాస్తవం. తన కంటె సగం సీట్లు మాత్రమే వచ్చిన సేనకు ఐదేళ్ల పాటు సిఎం పదవి అప్పగించి అధికారంలోకి వచ్చి ఉంటే, కర్ణాటకలో కాంగ్రెసు చేసిన పనే చేసింది అనేవారం. లేదా ఎన్సీపీని అజిత్‌ ద్వారా చీల్చి, విప్‌ ద్వారా ఎన్సీపీ ఎమ్మెల్యేలందరినీ నిర్బంధించి, ఫ్లోర్‌ టెస్ట్‌ గెలిచి, అజిత్‌ను ఐదేళ్ల సిఎం చేసినా కర్ణాటక కాంగ్రెసు వ్యవహారమే అయ్యేది. ప్రజలు తిరస్కరించిన పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది అనేవారు. 

తనలో సగం కంటె తక్కువ సీట్లు వచ్చిన జెడిఎస్‌కు సిఎం పదవి యిచ్చి, కాంగ్రెసు తన నాయకులకు, కార్యకర్తలకు కడుపు రగిల్చింది. రాహుల్‌ ప్రధాని కావాలంటే జాతీయస్థాయిలో జెడిఎస్‌ పొత్తు కుదుర్చుకోవడం, నిలబెట్టుకోవడం అత్యవసరం అంటూ రాహుల్‌ కోసం కర్ణాటక కాంగ్రెసును బలిపెట్టారు. దాని పర్యవసానమే కర్ణాటక ప్రభుత్వపతనం. మహారాష్ట్రకు వచ్చేసరికి అలాటి పరిస్థితి లేదు. రాహుల్‌ పిఎం కాదు కదా, ఎంపిగా ఉండడానికి కూడా యిష్టపడటం లేదు. జాతీయస్థాయి ప్రయోజనాల కోసం రాష్ట్రనాయకులను బలిపెట్టడం జరగలేదు. ప్రభుత్వంలో పాలుపంచుకునే ఛాన్సు వస్తే సరేసరి, లేకపోతే లేదు అన్నట్లు నిరాసక్తంగానే ఉంది సోనియా. ఈ నిరాసక్తతే కర్ణాటకలో ప్రభుత్వపతనానికి కారణమైంది. 

హై కమాండ్‌ ఏమీ చేయలేదు, పట్టించుకోదు అనే ధైర్యంతోనే సిద్ధరామయ్య కుట్ర చేసి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోశాడు. అది తెలిసి కూడా సిద్ధరామయ్యపై క్రమశిక్షణ చర్య తీసుకోలేని అధ్వాన్నస్థితిలో ఉంది కాంగ్రెసు. మరి సేన కూటమి విషయానికి వస్తే సేన, ఎన్సీపీ రెండూ ప్రాంతీయపార్టీలే. అధిష్టానం అక్కడే ఉంది. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలనే తపనతో అసమ్మతి నాయకులను అదుపు చేయడానికి ఆ రెండూ సర్వథా ప్రయత్నిస్తాయి. చిక్కంటూ వస్తే కాంగ్రెసుతోనే రావాలి. పదవులు దక్కనివారు, దక్కిన పదవులు నచ్చనివారు తిరగబడితే వారిని అదుపు చేసే మూడ్‌లో లేదు కాంగ్రెసు హైకమాండ్‌. ఒకవేళ శరద్‌కే ఆ భారమూ అప్పగించేస్తే, అతనే చూసుకోవచ్చు - ఎందుకంటే శరద్‌ కాంగ్రెసులో ఎదిగినవాడే. ఈ కాంగ్రెసు వాళ్లంతా అతని శిష్యులే!

కర్ణాటక పొత్తులో భాగస్వాముల మధ్య సీట్లలో తేడా - 19%. (36%-17%). అందువలన తోక కుక్కను ఆడించినట్లయింది. చాలాకాలం సహించాక, కుక్క తోకను వదిల్చేసుకుంది. తోక ఏమీ చేయలేక పోయింది. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన కూటమి సీట్ల సంఖ్య చూస్తే సేనది 19.4%, ఎన్సీపీది 18.8%, కాంగ్రెసుది 15.3%! ముగ్గురి మధ్య పెద్ద తేడా లేదు. మాగ్జిమమ్‌ తేడా సేన, కాంగ్రెసుల మధ్య ఉన్న 4.1%. అందువలన ఎవర్నీ గట్టిగా తోక అనలేం, గట్టిగా కుక్కా అనలేం. సంఖ్యాబలం బట్టే పదవులు పంచుకుంటున్నారు. 

కర్ణాటకలో ప్రభుత్వపతనానికి కారణం - దేవెగౌడ కుటుంబానికి, సిద్ధరామయ్యకు గల చిరకాల వైరం. సిద్ధరామయ్య కాంగ్రెసేతర పార్టీల్లో ఎదిగి, జెడిఎస్‌లో కీలక స్థానంలో ఉంటూ వచ్చి దేవెగౌడకు వారసుడిగా మారుతున్న సమయంలో అతను తన కొడుకు కుమారస్వామిని తెచ్చిపెట్టి సిద్ధరామయ్య ఆశలకు గండి కొట్టాడు. దానితో సిద్ధరామయ్య పార్టీ మారి దరిమిలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్లు పాలించాక, కాలం కలిసిరాక జెడిఎస్‌తోనే చేతులు కలపవలసి రావడం అతనికి దుస్సహమైంది. ఎన్నికలలో జెడిఎస్‌ సిద్ధరామయ్యను ఓడించడానికి సర్వయత్నాలు చేసి ఒక నియోజకవర్గంలో సఫలీకృతమైంది కూడా. 

ఏ కుమారస్వామి రాకతో తను జెడిఎస్‌ వీడాల్సి వచ్చిందో అతన్ని చేజేతులా సిఎంను చేయడం సిద్ధరామయ్య గుండెను ఎంత రగిలించి ఉంటుందో ఊహించవచ్చు. కాంగ్రెసు చేతిలో కేంద్రప్రభుత్వం ఉండి వుంటే సిద్ధరామయ్యను దిల్లీకి రప్పించి ఏ కేంద్రమంత్రి పదవో అప్పగించి కర్ణాటకకు దూరంగా ఉంచేవారు. కానీ ఆ స్కోప్‌ లేదు. అందువలన సిద్ధరామయ్య బెంగుళూరులోనే మకాం వేసి, కుమారస్వామిని ఎలా శంకరగిరి మాన్యాలు పట్టించాలా అని ప్లాన్లు వేస్తూన్నాడు. వేరెవరూ లేనట్లు కాంగ్రెసు అతన్ని రెండు పార్టీల సమన్వయ కమిటీకి చైర్మన్‌గా వేసింది. అయినా సమయం చూసి కాటేశాడు. 

మహారాష్ట్రలో అలాటి పరిస్థితి లేదు. ఎన్సీపీ, కాంగ్రెసు శివసేనకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు చేసినా, వ్యక్తిగత కక్షలు లేవు. శరద్‌కు బాల ఠాక్రే చాలా ఆప్తుడు కూడా. ఛగన్‌ భుజ్‌బల్‌ మాత్రం శివసేన నుంచి బయటకు వచ్చి ఎన్సీపీలో చేరాడు. పాత విషయాలు మనస్సులో పెట్టుకుని అతనేమైనా చేస్తే చేయాలి. కానీ అతను శరద్‌కు అనుయాయే తప్ప, మరీ ముఖ్యమైన పదవిలో లేడు. పైగా శివసేన బాల్‌ ఠాక్రే నాటి శివసేన కాదు, ఉద్ధవ్‌ తన తండ్రిలాగ నోరు పారేసుకునే రకం కాదు. మృదుస్వభావిగా పేరుబడ్డాడు. అందువలన ఇగో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. బాల్‌ ఠాక్రే నాటి శివసేన ముస్లిములపై, మరాఠీయేతర హిందువులపై మాటిమాటికీ విరుచుకు పడేది. అతను గతించాక, ఆ పాలసీ తగ్గుముఖం పట్టింది. ఆ లక్షణాలన్నీ రాజ్‌ ఠాక్రే యొక్క ఎంఎన్‌ఎస్‌ పుణికి పుచ్చుకుంది. మహారాష్ట్రలో ఉత్తర భారతీయులపై దాడులు వంటివి నిర్వహిస్తోంది. 

అయితే ఉద్ధవ్‌ మాత్రం అలాటివి ప్రోత్సహించలేదు. ఇక అతని కొడుకు ఆదిత్య అయితే మరాఠీయేతరులను మచ్చిక చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందువలన శివసేన మిత్రపక్షాలకు మరాఠీ- నాన్‌ మరాఠీ అంశంపై సేనతో గొడవలు వచ్చే అవకాశం లేదు. కలహించే అంశం ఏదైనా ఉందా అంటే హిందూత్వయే! ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే కాంగ్రెసు, ఎన్సీపీ దూరమవుతాయి. వ్యతిరేకంగా ఓటేస్తే అధికారం కోసం హిందూత్వపై రాజీ పడిందని బిజెపి సేనను ఉడికిస్తుంది. మన హిందూత్వ ఓటు బిజెపి ఎత్తుకుపోతోందని సేన క్యాడర్‌ మొత్తుకుంటుంది. 

దీన్ని సేన నాయకత్వం ఎలా తట్టుకుంటుంది అనేదే వేచి చూడాలి. కర్ణాటకలో యీ గొడవ రాలేదు. ఎందుకంటే కాంగ్రెసు, జెడిఎస్‌ రెండూ సెక్యులర్‌ అని చెప్పుకునేవే! మహారాష్ట్రలో సేన హిందూత్వ ఓటు బ్యాంకును సాంతం సొంతం చేసుకోవడానికి బిజెపి తీవ్ర హిందూత్వను వాటేసుకుందంటే ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే హిందూత్వ కంటె ఆర్థిక కారణాలే అసెంబ్లీ ఎన్నికలను శాసించాయి. 

ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పడగొట్టడానికి ఏదో ఒకటి చేసి తీరుతుంది. అజిత్‌ ప్రయోగం దెబ్బ తింది కాబట్టి ఓ ఆర్నెల్లు ఆగి, మళ్లీ యింకో ఐడియాతో ముందుకు వస్తుంది. అది అనైతికమైతే దెబ్బ తిన్న పార్టీలు ప్రతిక్రియ ఆలోచిస్తాయి. కర్ణాటకలో కాంగ్రెసుకు క్యాడర్‌ తక్కువ. జెడిఎస్‌ ప్రభావం కొన్ని జిల్లాలకే పరిమితం. ఎమ్మెల్యేలను కాపాడుకునే భారం శివకుమార్‌ వంటి నాయకుల మీదే పడింది. మరి యిక్కడ సేనకు క్యాడర్‌ బాగా ఉంది. చాలా మిలిటెంటు కూడా. ఎన్సీపీ యూత్‌ వింగ్‌ కూడా మొన్న చురుగ్గా పని చేసి గుడ్‌గావ్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సెక్యూరిటీ కళ్లు కప్పి పట్టుకుని వచ్చింది. 

వీటన్నిటితో బాటు మరో ఫ్యాక్టర్‌ ఉంది. ఆంధ్రలో బిజెపికి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఎలా ఉందో, అది ఓట్ల సంపాదనకు ఎలా అవరోధం అవుతోందో, మహారాష్ట్రలో బిజెపికి గుజరాతీ ముద్ర పడింది -మోదీ, షా, గుజరాతీ లాబీ కారణంగా! భూమిపుత్రుడైన ఉద్ధవ్‌ పదవిపోవడానికి గుజరాతీ లాబీయే కారణం అని చెప్పుకుని వాళ్లు సెంటిమెంటు రెచ్చగొట్టవచ్చు. 

కర్ణాటకలో బిజెపికి ఆర్థికంగా, రాజకీయంగా ప్రముఖులుగా ఉన్న లింగాయత్‌లు వెన్నెముకగా ఉన్నారు. యడియూరప్పకు ముఖ్యమంత్రి పదవి కొద్దిలో తప్పిపోవడం వారిని బాధించింది. అతన్ని పదవిలో తేవడానికి వాళ్లు, వారి వెనుక ఉన్న అనేకానేక సంస్థలు శ్రమించాయి. మహారాష్ట్రలో ఆర్థికంగా, రాజకీయంగా ఎప్పణ్నుంచో బలంగా ఉన్నవారు మరాఠాలు. వారి మద్దతు సేన-ఎన్సీపిలకి పుష్కలంగా ఉంది. 

మరాఠాలకు ప్రత్యామ్నాయంగా ఒబిసిలను బిజెపి చేరదీసింది. తన తరఫు ముఖ్యమంత్రిగా తొలిసారి ఒక బ్రాహ్మణ్ని చేసింది. అతనే మళ్లీ రిపీట్‌ చేస్తానంది. మరాఠాలకు కోపం రాకుండా వాళ్లకు రిజర్వేషన్లు యిచ్చింది కానీ అది పని చేయలేదని ఎన్నికలు నిరూపించాయి. కూటమి నిలవకపోతే మరాఠాల ప్రాబల్యానికి దెబ్బే! బిజెపికి ఎదురయ్యే అంశాలలో అదొకటి. మహారాష్ట్రలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి మరో ప్లాను వేయవచ్చు కానీ కర్ణాటక లాగానే కథ నడుస్తుందని అనుకోవడం సమంజసం కాదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2019) 
mbsprasad@gmail.com