Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కర్ణాటక ఎన్నికలు

ఎమ్బీయస్‌: కర్ణాటక ఎన్నికలు

5కోట్ల మంది ఓటర్లున్న కర్ణాటకలో ఇవాళ పోలింగు జరిగింది. 2013లో కంటె కాస్త ఎక్కువ పోలింగు శాతమే, 71-72% నమోదయ్యేట్లుంది. సాయంత్రానికి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయి. అసలు ఎన్నికల వేళ వచ్చేసరికి గతంలో 150 సాధిస్తామని చెప్పిన పార్టీ నాయకులు తగ్గారు. బిజెపి 130 ప్లస్‌ వస్తాయంది, కాంగ్రెసు 120 ప్లస్‌ అంది. జెడిఎస్‌ 113 ప్లస్‌ అంది. కానీ ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత రాదని, హంగ్‌ అసెంబ్లీ తప్పదని సర్వేలన్నీ చెపుతూ వచ్చాయి. అందరి కంటె ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయన్న దానిపై ఒక్కోళ్లూ ఒక్కో అంకె చెప్పారు.

సర్వేలలో కాంగ్రెసుకు, బిజెపికి మధ్య ఓట్లలో 2%, సీట్లలో 10-15 కంటె తేడా కనబడటం లేదు. తాజాగా కచ్చితత్వానికి మారుపేరైన సెఫాలజిస్టు, రాజకీయ నాయకుడి సర్వేలో బిజెపికి 110-120, కాంగ్రెసుకు 70-80, జెడిఎస్‌కు 40 వస్తాయని చెప్పారని తాజాగా వార్త వచ్చింది. బహుశా యిది టుడేస్‌ చాణక్య అయి వుంటుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా 6 బిజెపికి ఆధిక్యత వస్తాయని అంటే 2 కాంగ్రెసుకు ఆధిక్యత వస్తాయన్నాయి. గెలిచే పార్టీకి 120 కంటె ఎక్కువ వస్తాయని ఎవరూ ఘంటాపథంగా చెప్పలేదు. 

ఎప్పటిలాగా కాంగ్రెసు ఇవిఎంల గురించి ఫిర్యాదు చేసింది. మొత్తం 224 సీట్లలో 222 సీట్లకు మాత్రమే పోలింగు. ఒక దాంట్లో బిజెపి అభ్యర్థి చనిపోయాడు. మరో దాంట్లో 10 వేల నకిలీ ఓటరు కార్డులు కూడా పట్టుబడడంతో కాన్సిల్‌ చేశారు. (అన్నిటిని ఆధార్‌తో లింకు చేసే ప్రభుత్వం ఓటరు కార్డును ఎందుకు లింక్‌ చేయదో అర్థం కాదు. బిజెపియే కాదు, మరో పార్టీ వచ్చినా ఆ సంస్కరణ చేస్తుందన్న నమ్మకం లేదు). నోట్ల కట్టలు పట్టుబడుతూనే ఉన్నా (దొరికిన వాటి విలువ రూ.112 కోట్లు) వాటి ప్రవాహం ఆగలేదు. చీరలు, ముక్కుపుడకలు, సెల్‌ఫోన్లు, ప్రెషర్‌ కుక్కర్లు, క్రికెట్‌ కిట్ల పంపిణీ (పట్టుబడిన వస్తువుల విలువ రూ.65 కోట్లు) జరిగిపోయింది. మద్యం పారింది. (దొరికిన దాని విలువ రూ.25 కోట్లు) బిజెపి, కాంగ్రెసు యీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

కాంగ్రెసు తరఫున రాహుల్‌ గత మూడు నెలలుగా ప్రచారం చేస్తున్నాడు. 60% నియోజకవర్గాలకు వెళ్లాడు. ఖర్గే, శివకుమార్‌లు కూడా ప్రచారంలో ఉన్నారు. రెండేళ్లగా ప్రచారంలోకి దిగని సోనియా కూడా దిగింది. తన మానిఫెస్టోలో ప్రభుత్వోద్యోగాలలో మహిళల సంఖ్య 50%కు పెంచుతానంటోంది. 10 జిల్లాలను కలుపుతూ వ్యవసాయ కారిడార్‌ పెడతానంటోంది. చాలా చోట్ల నియోజకవర్గానికి రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని వినికిడి. 30 మంది ఫిరాయింపుదార్లకు పార్టీలు టిక్కెట్లిచ్చాయి.

గత కొద్ది నెలలుగా మన దగ్గర క్యాష్‌ దొరకడం మానేసింది. కర్ణాటక ఎన్నికలలో పంచడానికి పట్టుకుని పోయారంటున్నారు. అక్కడ కట్టలు కట్టలు దొరుకుతున్నాయి. బిజెపి తరఫున 208 మంది, కాంగ్రెసు తరఫున 207 మంది కోటీశ్వరులు పోటీ చేశారు. బిజెపి అభ్యర్థుల్లో 37% కాంగ్రెసు అభ్యర్థుల్లో 27%, జెడిఎస్‌ అభ్యర్థుల్లో 21% మంది నేరచరితులు. ఇన్ని ప్రలోభాలు, కుతంత్రాల మధ్య వెలువడే ఫలితం ప్రజాభిప్రాయాన్ని ఫలితాలు ఎంతవరకు సూచిస్తాయో అర్థం కావటం లేదు.

2008లో 110 సీట్లు తెచ్చుకున్న బిజెపి ఎడియూరప్ప అవినీతితో, ఆ తర్వాత పార్టీ ముఖ్యమంత్రుల మధ్య కలహాలతో, 2013లో అంత:కలహాలతో ఓడింది. 11 జిల్లాల్లో చిరునామా గల్లంతైంది. 110 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో 43% ఓట్లతో 17 సీట్లు (132 అసెంబ్లీ సెగ్మెంట్లు)  గెలిచింది. ఎడియూరప్ప బృందం కలిసింది కాబట్టి, 2014 మ్యాజిక్‌ను పునరావృతం చేయగలనని బిజెపి అనుకుంటోంది. తన మానిఫెస్టోలో జాతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రైతు ఋణాలు లక్ష వరకు రద్దు చేస్తానని హామీ యిచ్చింది.

అన్ని జిల్లాలను కలుపుతూ 6 లైన్ల హైవే వేస్తానంది. అమిత్‌ షా ఎన్నాళ్లనుంచో కష్టపడి ప్రణాళికలు రచించగా, ఎప్పటిలాగానే మోదీ ప్రచారంలో పాల్గొని తన ఉపన్యాసాల్లో రాహుల్‌ మీద, సిద్ధరామయ్యమీద విసుర్లు విసిరాడు. శ్రుతి మించిన సందర్భాలూ ఉన్నాయి. ఆఖరి నిమిషంలో చేసే ప్రయత్నాలలో కూడా బిజెపి లోటు చేయలేదు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో తనపై కాంగ్రెసు, పాకిస్తాన్‌ కలిసి కుట్ర చేశాయని మోదీ ప్రచారం చేసుకున్నాడు. ఈ కర్ణాటక ఎన్నికలకు ముందు కూడా మోదీకి అలాటి అమరవీర యిమేజి కట్టబెట్టడానికి ప్రయత్నం జరిగింది. మోదీ హత్యకు ఐఎస్‌ కుట్ర పన్నిందట. వాట్సప్‌ సంభాషణ వలన బయటపడిందట.

గుజరాత్‌ ఏంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు గత ఏడాది యీ విషయం తెలిసిందట. గత నెలలో చార్జిషీటు కూడా దాఖలు చేశారట. ఆ విషయాన్ని యిన్నాళ్లూ దాచి, నిన్ననే వెలుగులోకి తెచ్చారు. జమ్మూలో జరిగిన రేప్‌ సంఘటనలో సిబిఐ విచారణ సందర్భంగా నిందితురాలు బిజెపి ఎమ్మెల్యే పేరు చెప్పిందని జాతీయ మీడియాలో వచ్చిన వార్తను సిబిఐ అర్జంటుగా ఖండించింది. ఇక కాంగ్రెసు అర్జంటుగా విడుదల చేయించిన పాతకాలపు వీడియోలో కేసులు కొట్టివేతకై బిజెపి నాయకుడు శ్రీరాములు జడ్జికి లంచం యివ్వబూనడం చిత్రీకరించి ఉంది.  

జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ మీడియాతో బాటు తెలుగు మీడియా కూడా కవరేజి బాగా యిచ్చింది. పొరుగు రాష్ట్రమే అయినా గతంలో మనం యింతగా పట్టించుకున్నది లేదు. అప్రతిహతంగా సాగిపోతున్న బిజెపి రథానికి కర్ణాటకలోనైనా గండి పడుతుందా అనేది ఆసక్తికర అంశమైంది. దానితో పాటు కాంగ్రెసు చేతిలో ఉన్న ఒక్క పెద్ద రాష్ట్రమూ చేజారుతుందాని చూడాలన్న కుతూహలమూ ఉంది.

కర్ణాటకలో బిజెపి ఓడితే నెత్తి మీద ఉన్న దాని కళ్లు దిగుతాయని, తాజాగా విడాకులు పుచ్చుకున్న టిడిపి ఆశ. గుజరాత్‌లోలా యిది బిజెపి-కాంగ్రెసు ముఖాముఖీ పోరాటం కాదు. మధ్యలో జెడిఎస్‌ అనే బలమైన, 20% ఓటు బ్యాంకు ఉన్న, ఒకప్పుడు రాజ్యమేలిన ప్రాంతీయ పార్టీ ఉంది. వాళ్లకు ఎన్ని సీట్లు వస్తాయి, వాటితో వాళ్లు రెండు జాతీయపార్టీలను ఎలా ఆడుకుంటారు అనేది కూడా చూడవలసిన ప్రహసనమే. 

 కర్ణాటకపై నేను సేకరించిన సమాచారాన్ని గుదిగుచ్చి సాధ్యమైన సంక్షిప్తంగా యివ్వాలని చూస్తున్నాను. దీని ద్వారా అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేము. మే 15 ఫలితాల రోజున టీవీల్లో సెఫాలజిస్టులు, పాత్రికేయులు విశ్లేషించేటప్పుడు విషయం మనకు బాగా బోధపడడానికి మాత్రం యిది ఉపయోగపడుతుంది. ఈ లోగా జనరల్‌గా మనం గమనించవలసిన అంశాలేమిటంటే - దీన్ని గుజరాత్‌లోలా మోదీ వెర్సస్‌ రాహుల్‌ పోరాటంగా మార్చాలని బిజెపి చూస్తే సిద్ధరామయ్య మాత్రం తనను కేంద్రబిందువుగా మార్చుకున్నాడు.

ఎందుకంటే బలమైన ప్రాంతీయ నాయకుడు ఉన్నచోట - దిల్లీ, బిహార్‌, పంజాబ్‌ - బిజెపికి దెబ్బ తగులుతూ వచ్చింది. గుజరాత్‌లో బలమైన స్థానిక నాయకుడు లేక కాంగ్రెసు విజయావకాశాలు పోగొట్టుకుంది. పంజాబ్‌లో కాంగ్రెసు  అమరీందర్‌ సింగ్‌కు మొత్తమంతా వదిలి పెట్టేసింది. ఆయన గెలిపించి చూపాడు. అలాగే యిక్కడ సిద్ధరామయ్యకు అప్పచెప్పేశారు. అతను చెప్పినవాళ్లకే టిక్కెట్లిచ్చారు. అతని యిమేజితోనే ముందుకు వెళ్లారు. బిజెపి తరఫున ఉన్న ఎడియూరప్ప ఒకప్పుడైతే సిద్ధరామయ్యకు సమ ఉజ్జీగా ఉండేవాడేమో కానీ అతని యిమేజి చెడిపోయింది. అందువలన మోదీ, అమిత్‌ సాయం పట్టవలసి వస్తోంది. 

సిద్ధరామయ్య అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా, అవినీతి ఫర్వాలేదన్న స్థాయిలో ఉండటం చేత బిజెపి ఆశించినంత స్థాయిలో ప్రభుత్వవ్యతిరేకత లేదు. అందువలన జెడిఎస్‌తో బిజెపి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని అనుమానాలున్నాయి. ఆ యా పార్టీలకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు వేరేవేరే కాబట్టి ఒకళ్ల ఓటుబ్యాంకుని మరొకరు తినేసే ప్రమాదం లేదు. దేవెగౌడ ఎవరితోనైనా చేతులు కలపగల టక్కరి. ప్రాంతీయ పార్టీల సమాఖ్యలో చేరతానని ఆశ చూపించి బిజెపికి వ్యతిరేక పార్టీలైన బిఎస్‌పి, మజ్లిస్‌, తెరాసల మద్దతు తీసుకున్నా ఎన్నికల అనంతరం వీరందరినీ ముంచి బిజెపితో చేతులు కలపగలడు.

కాంగ్రెసును 'పిపిపి' (పుదుచ్చేరి, పంజాబ్‌, పరివార్‌)కు పరిమితం చేయడానికై బిజెపి జెడిఎస్‌ పెట్టే షరతులకు అంగీకరించినా అంగీకరించవచ్చు. చిక్కంతా ఎక్కడ వస్తుందంటే ముఖ్యమంత్రి పదవి దగ్గర! కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తానంటే వాళ్లకే 35-40 సీట్ల మా మద్దతు అని దేవెగౌడ అంటే కాంగ్రెసు సిద్ధరామయ్యను త్యాగం చేస్తుందా? చేయకపోవచ్చు. తమ నుండి విడిచి వెళ్లిపోయిన సిద్ధరామయ్య పొడ దేవెగౌడకు అస్సలు కిట్టదు, ఉపముఖ్యమంత్రిగా కూడా యివ్వనంటాడు. అదే బిజెపి ఐతే ఎడియూరప్పను ఉపముఖ్యమంత్రి పదవికి ఒప్పించవచ్చు. శివసేననే టేకిల్‌ చేయగాలేనిది, జెడిఎస్‌ను చేయలేమా అనే ధైర్యంతో ముందుకు వెళ్లవచ్చు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా నిజం కావాలని లేదు. కర్ణాటక ఓటరు ఏదో ఒక పార్టీకి కచ్చితమైన మెజారిటీ కట్టబెట్టినా కట్టబెట్టవచ్చు. అలా కట్టబెట్టని పక్షంలో బిజెపికి 90 సీట్లు వచ్చినా జెడిఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కర్ణాటక రాజకీయ రంగాన్ని చర్చించడానికి తర్వాతి వ్యాసాల్లో ప్రాంతాల వారీగా డీల్‌ చేస్తున్నాను. అక్కడే యితర అంశాల ప్రస్తావన కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా సమగ్రమైన అవగాహన ఏర్పడుతుందని ఆశ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?