cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కర్ణాటక ఫలితాల విశ్లేషణ - 1/2

ఎమ్బీయస్‌: కర్ణాటక ఫలితాల విశ్లేషణ - 1/2

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇది ఎంతకాలం నడుస్తుందో ఎవరూ చెప్పలేరు. 2019 దాకానైనా యీడుద్దామని కాంగ్రెసు-జెడిఎస్‌లు, ఆ లోపునే పడగొట్టి తాము తప్ప వేరెవరూ అక్కడ పాలించలేరని నిరూపిద్దామని బిజెపి అనుకుంటున్నాయి. ఎవరు తమ లక్ష్యం సాధిస్తారో ఊహించాలంటే ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూడాలి. ఏ వర్గాలు, ఏ ప్రాంతాలు ఎవరికి అనుకూలంగా తెలుసుకోవాలి. అప్పుడే వాటిని తమవైపు తిప్పుకోవడానికి పాలకపక్షం ఏం చేస్తోందో, ప్రతిపక్షం ఆందోళనలు ఎక్కడ సఫలమవుతున్నాయో అర్థమవుతాయి.

అంతేకాదు, యీనాటి ఎన్నికల పోకడ కూడా అర్థమవుతుంది. సిద్ధరామయ్యపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు, బోల్డన్ని సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేశాడు. అటు ఎడియూరప్ప మీద, అతని కుటుంబసభ్యులపై 50కు పైగా కేసులున్నాయి. వాటిలో భూమి కబ్జా, బంధుప్రీతి, మైనింగ్‌ స్కామ్‌, లంచగొండితనం వగైరా ఆరోపణలున్నాయి. కొన్ని కొట్టేసినా, మరి కొన్ని కోర్టు పరిధిలో పెండింగులో ఉన్నాయి.

2008లో ఆపరేషన్‌ కమల్‌ పేర అవతలి పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసిన గాలి సోదరులు చెలరేగి ఉన్నారు. అయినా బిజెపికే సీట్లు వచ్చాయి. దీని అర్థమేమిటి? సంక్షేమ పథకాల వలన ప్రయోజనం లేదా? గెలవాలంటే కులాల సమీకరణే నమ్ముకోవాలా? సర్వజన సంక్షేమం గురించి ఆలోచించడం మానేసి కులకూటములతో ప్రయోగాలు చేస్తే లాభిస్తుందా? బెడిసి కొడుతుందా? ఇలాటి అనేక విషయాలను అర్థం చేసుకోవడానికే యీ కూలంకష విశ్లేషణ. ఒక గమనిక - ఓట్లశాతం, సీట్ల సంఖ్య నిర్ధారణగా చెప్పగలం కానీ కులాల వారీ ఓటింగు సరళి, కొన్ని అధ్యయనాల ఆధారంగా చెప్పినదే. వాటిని పూర్తిగా నమ్మడానికి లేదు. 

బిజెపి అధిరోహణ - ముందుగా చెప్పుకోవలసినది బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైనా ఎన్నికల పరంగా చాలా మెట్లెక్కింది. సరిగ్గా చెప్పాలంటే 2008 నాటి మ్యాజిక్‌ను దాదాపు రిపీట్‌ చేసింది. అప్పట్లో 110 తెచ్చుకుంటే యిప్పుడు 104 తెచ్చుకుంది. 2500 ఓట్ల కంటె తక్కువ తేడాతో 8 సీట్లు పోగొట్టుకుంది కానీ లేకపోతే సరాసరి గద్దె ఎక్కేసేది. 2008లో ఎడియూరప్ప మీద సానుభూతితో వేస్తే 110 వచ్చింది, యిప్పుడు మోదీ వచ్చి 21 ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేస్తే 104 వచ్చాయి.

కాంగ్రెసుకు అప్పుడు 80 వస్తే యిప్పుడు 78 వచ్చాయి. ఎడియూరప్పకు ద్రోహం చేసిన జెడిఎస్‌కు అప్పుడు 28, యిప్పుడు 37. ఇక 2013తో పోలిస్తే బిజెపి అనేక వర్గాల్లో దూసుకుపోయింది. లింగాయతులు (వీళ్లలో 61% మంది ఓట్లు సంపాదించింది) ఎస్సీలు (5% నుంచి 40%కు పెరిగింది) గిరిజనులు (44% మంది వేశారు), ఒబిసిలు (7% నుండి 52%కి పెరిగింది), ఒక్కళిగలు (11%) అలా అనేకమంది దాని వెంట నిలిచారు. ఒక్క సీటు యివ్వకపోయినా ముస్లిముల్లో 5% మంది ఓట్లేశారు. బిజెపి యిటీవల పట్టణప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటోంది. గ్రామాల్లో వెనకబడుతోంది. కానీ కర్ణాటకలో మాత్రం 2013లో గ్రామీణ ఓట్లలో 27% వస్తే యీసారి 36% వచ్చాయి. పట్టణాలలో గతంలో 39% వస్తే యీసారి 42% వచ్చాయి. 

బిజెపి యింత బాగా చేసినా 2014 ఫలితాలతో పోలిస్తే మాత్రం నిరాశ కలుగుతుంది. అప్పుడు 43% ఓట్ల శాతం 132 శాసనసభ సీట్లలో ఆధిక్యం ఉంది. ఇప్పుడు 7% ఓట్లు, 29 సీట్లు తగ్గాయి. అప్పుడు జాతీయ స్థాయి అభ్యర్థి మోదీ, యిప్పుడు రాష్ట్రస్థాయి అభ్యర్థి ఎడియూరప్ప. అవినీతి యిమేజిలోనే యిద్దరికీ తేడా ఉంది. కొన్ని రాష్ట్రాలలో మోదీ 2014 మ్యాజిక్‌ రిపీటైంది. కొన్ని చోట్ల కాలేదు. కాని వాటిల్లో యిదొకటి. ప్రాంతాల వారీ చూస్తే 2014తో పోల్చి చూస్తే బిజెపి ఓట్ల శాతం బొంబాయి-కర్ణాటకలో 7%, హైదరాబాదు కర్ణాటకలో 7.8%, మధ్య కర్ణాటకలో 3.6%, కోస్తా కర్ణాటకలో ఏకంగా 9.3%, దక్షిణ కర్ణాటకలో 7.4%లో బెంగుళూరులో  మరీ 10.5% తగ్గింది.

గాలి జనార్దన్‌ రెడ్డి ప్రభావం ఎలా ఉందా అని చూడబోతే అతని మనుషులు మొత్తం 10 మంది పోటీ చేస్తే వారిలో 5గురు గెలిచారు. పరిశీలకుల ప్రకారం ఏప్రిల్‌ 30 వరకు కాంగ్రెసుకు బిజెపిపై 5% పాయింట్ల లీడ్‌ ఉందట. కానీ మోదీ వచ్చి 21 సభలు నిర్వహించేసరికి అది 1.5%కి పడిపోయిందట. నిజానికి మోదీ ఉపన్యాసాల్లో రాహుల్‌ గాంధీపై జోకులు, సిద్ధరామయ్యపై నిందలు తప్ప కొత్త పాయింట్లూ లేవు, కొత్త ఆలోచనలూ లేవు. 6 లక్షల మంది వాలంటీర్ల సహాయంతో బూత్‌ మేనేజ్‌మెంటులో బిజెపి కనబరచిన చాకచక్యం వలన అనేక చోట్ల బిజెపి విజయం సాధించగలిగింది. కాంగ్రెసు ఓడిపోయింది. స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత వలన కూడా కొన్ని చోట్ల ఓటమి సంభవించింది. 'సిద్ధరామయ్య మా గురించి ఎంతోకొంత చేశాడు, కానీ మా ఎమ్మెల్యే ఏం చేశాడు చెప్పండి' అన్నారు కొన్ని చోట్ల ఓటర్లు. 

కాంగ్రెసు జయం, అపజయం - 44 సీట్లు పోగొట్టుకున్న కాంగ్రెసునూ బొత్తిగా తీసిపారేయడానికి లేకుండా ఉంది. గతంలో 36.8% తెచ్చుకున్న కాంగ్రెసు యీసారి 38% తెచ్చుకుంది. ఇది బిజెపి కన్నా 1.8% ఓట్లశాతం ఎక్కువే కానీ బిజెపి కంటె 26 సీట్లు తక్కువ (104-78) తెచ్చుకుంది. 2008లో కూడా యిలాగే జరిగింది. అప్పుడూ కాంగ్రెసుకు బిజెపి కంటె 1.3% ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నా, 30 సీట్లు తక్కువ తెచ్చుకుంది. దీని అర్థం కాంగ్రెసు, బిజెపిలాగానే అన్ని ప్రాంతాల్లోను పలచగా పరుచుకున్నా దానికి సరైన వ్యూహం లేదు. తక్కువ తేడాతో అనేక చోట్ల ఓడిపోయింది.

బిజెపి మంచి ప్రణాళికతో కొన్ని ప్రాంతాల్లో బలంగా చొచ్చుకుపోయి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటోంది. కాంగ్రెసు గ్రామాల్లో యీసారి 38.2% తెచ్చుకుంది. ఇది 2013 కంటె 0.4% తక్కువ. పట్టణాల్లో గతంలో కంటె 1.7% ఎక్కువగా 40% తెచ్చుకుంది. కన్నడ పోరాట యోధుడిగా అవతారమెత్తినా ప్రయోజనం పొందలేక, సిద్ధరామయ్య రెండు చోట్ల పోటీ చేసి చాముండేశ్వరిలో ఘోరంగా ఓడిపోయాడు, మరో చోట చచ్చిచెడి 1700 ఓట్లతో నెగ్గాడు. అతని సహచరుల్లో 11 మంది ఓడిపోయారు. రైతులకు రూ.50 వేల వరకు ఋణాలు రద్దు చేసినా, అతని హయాంలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం మైనస్‌గా మారింది. నలుగురు కాంగ్రెసు అభ్యర్థులు వెయ్యిలోపు మెజారిటీతో బయటపడ్డారు. (బిజెపి విషయంలో ఒక్కరే)

బిజెపి సీట్ల సంఖ్య 2013తో పోలిస్తే బొంబాయి-కర్ణాటకలో 213%, హైదరాబాదు కర్ణాటకలో 181%, మధ్య కర్ణాటకలో 483%, కోస్తా కర్ణాటకలో 366%, దక్షిణ కర్ణాటకలో 233%లో పెరగ్గా బెంగుళూరులో 91% మాత్రమే వచ్చాయి. ఇక కాంగ్రెసు సీట్ల సంఖ్యను 2013తో పోలిస్తే బొంబాయి-కర్ణాటకలో 56%, హైదరాబాదు కర్ణాటకలో 75%, మధ్య కర్ణాటకలో 50%, కోస్తా కర్ణాటకలో 17%, దక్షిణ కర్ణాటకలో 83%లో తగ్గగా బెంగుళూరులో 107%కు పెరిగాయి.

మరి ఓట్ల శాతం ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే దక్షిణ కర్ణాటకలో బిజెపికి 19.5% ఓట్లు రాగా, కాంగ్రెసుకు 33.8% వచ్చాయి. బెంగుళూరులో 3.9%, కోస్తా కర్ణాటకలో 0.4%, హైదరాబాదు కర్ణాటకలో 3.3%, ఎక్కువ వచ్చాయి. బిజెపికి మధ్య కర్ణాటకలో 3.4%, ముంబయి కర్ణాటకలో 3% ఎక్కువ వచ్చాయి. ఓట్లను సీట్లగా తర్జుమా చేసుకునే విద్య పట్టుబడక కాంగ్రెసు కోస్తా కర్ణాటకలో 0.4% ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నా 9 సీట్లు తక్కువ తెచ్చుకుంది! 

అధికారం చేజిక్కించుకున్న జెడిఎస్‌ 2013 కంటె 1.9% (20.2%-18.3%) ఓట్లు, మూడు సీట్లు తక్కువగా తెచ్చుకుంది. అది పాత మైసూరు (దక్షిణ కర్ణాటక)లో మాత్రమే తన బలం చూపుకోగలిగింది. హైదరాబాదు కర్ణాటకలో గతంలో 5 వస్తే యీ సారి 4 వచ్చాయి. ఒక్కళిగల్లో 63%, లింగాయతుల్లో 9%, ముస్లిముల్లో 11%, ఒబిసిల్లో 14%, గిరిజనుల్లో 16%, ఎస్సీల్లో 18% ఓట్లేశారు. ముస్లిములు కాంగ్రెసుకు ఓట్లేయడంతో కొన్ని చోట్ల ఓడిపోయింది. జెడిఎస్‌కు గ్రామాల్లో గతంలో కంటె 3.4% తక్కువగా 17.8% వచ్చాయి, పట్టణాల్లో గతంలో కంటె 5.6% తక్కువగా 13.1% వచ్చాయి.  121 స్థానాల్లో డిపాజిట్టు దక్కలేదు. 16 జిల్లాల్లో ఖాతా తెరవలేదు. కాంగ్రెసు జెడిఎస్‌ యిద్దరూ కలిసి పోటీ చేసి వుంటే, వారి మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా జరిగివుంటే వారికి 150, బిజెపికి 70 వచ్చి ఉండేవి. 

కాంగ్రెసు డైలమా - కర్ణాటక ఫలితాలను లోతుగా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. కాంగ్రెసు పార్టీకి తన రాష్ట్రనాయకులతో ఏం చేయాలో తెలియటం లేదు. గతంలో ముఖ్యమంత్రిని ఎవర్ని పెట్టినా, అసమ్మతి వర్గాన్ని కూడా దువ్వుతూ ఉండేది. దాంతో రాష్ట్రస్థాయిలో ఎవరూ బలంగా ఉండేవారు కారు. అటుతిరిగి, యిటుతిరిగి అధిష్టానం మీదే ఆధారపడేవారు. వాళ్లు చిత్తం వచ్చినట్లు ముఖ్యమంత్రుల్ని మార్చిపారేసేవారు. పదవి పోయిన వాళ్లు కొత్తగా వచ్చినవారిపై పగ బట్టేవారు. దాంతో ఎన్నికలు వచ్చినపుడు అంత:కలహాలతో పార్టీ దెబ్బ తినేది. సోనియా వచ్చిన తర్వాత పద్ధతి మార్చింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని బలహీనపరచకుండా నడవనిచ్చింది.

కానీ ఆ క్రమంలో వాళ్లు సరిగ్గా పాలించకపోయినా, అసమ్మతి వర్గం మొరపెట్టుకుంటున్నా వినకపోవడం జరగసాగింది. అదీ అనర్థాలు తెచ్చింది. రెండేళ్ల క్రితం అసాం ఎన్నికలలో ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌కి సర్వాధికారాలు యిచ్చారు. అతను చెప్పినవాళ్లకే టిక్కెట్లు యిచ్చారు. అతను ప్రాంతీయ పార్టీలతో పొత్తుకి ఒప్పుకోలేదు. అతని డిప్యూటీ అయిన హిమంత బిశ్వ శర్మతో రాజీ పడమంటే పడలేదు. చివరకు శర్మ బిజెపిలోకి వెళ్లిపోయి, రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అసాంలో కాంగ్రెసు ప్రభుత్వాని ఓడించాడు. అసాంలో కాంగ్రెసు పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు తగినన్ని రాలేదు. ఆ కథే కర్ణాటకలో పునరావృతమైంది.

కర్ణాటకలో సిద్ధరామయ్య 2013లో పార్టీకి విజయం చేకూర్చాడు కాబట్టి అతనికే సకలాధికారాలు అప్పచెప్పారు. అంతా అతని యిష్టప్రకారమే జరిగింది. అతను ముఖ్యమంత్రి కాగానే ఉపముఖ్యమంత్రిగా ఎవరైనా ఎస్సీ నాయకుణ్ని పెడితే మంచిదనే సూచన వచ్చింది. కానీ అలా అయితే పోటీ అధికారకేంద్రం ఏర్పడి చికాకులు వస్తాయని అనుకుని, ఎవరికీ యివ్వలేదు. సిద్ధరామయ్యకూ అదే కావాలి. కానీ యిదంతా తక్కిన కాంగ్రెసు నాయకులకు రుచించలేదు. హరిజనుడైన మల్లికార్జున ఖర్గే, ఒక్కళిగయైన డికె శివకుమార్‌, కెపిసిసి అధ్యక్షుడు హరిజనుడు ఐన జి. పరమేశ్వర (ఇప్పుడు ఉపముఖ్యమంత్రిని చేశారు), లింగాయత్‌ లీడరైన ఎస్‌.శివశంకరప్ప - వీళ్లందరూ సిద్ధరామయ్యకు సహకరించలేదు.

బిజెపి కంటె ఏడు లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చిపెట్టినా, సీట్లు రాకపోవడంతో సిద్ధరామయ్యపై వీళ్లు కత్తులు నూరుతున్నారు. 2017 గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెసు ఎమ్మెల్యేలతో శిబిరం నిర్వహించిన శివకుమార్‌ తనకు ప్రాధాన్యత యిస్తారనుకున్నాడు కానీ అది దక్కకపోవడంతో సిద్ధరామయ్యే దానికి కారణమని మంటగా ఉన్నాడు. అతని అతివిశ్వాసమే మా కొంప ముంచింది అన్నాడు. ఫలితాల తర్వాత మళ్లీ శిబిర నిర్వహణ అతనికే యిచ్చారు, కానీ ఉపముఖ్యమంత్రి పదవి యివ్వలేదు. ఏదో ఒక పదవి యివ్వకపోతే ఏదైనా చేస్తాడేమోనన్న బెదురు కాంగ్రెసుకు ఉంది. 

కర్ణాటక కులసమీకరణాలు - తొలి నుంచీ కర్ణాటక ఎన్నికలలో కులసమీకరణాలు చాలా ప్రాధాన్యత వహించాయి. మొదటినుంచీ లింగాయతులు, తర్వాతి రోజుల్లో ఒక్కళిగలు జనాభాలో తమ శాతాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ అధికారం చలాయించారు. తమ నిష్పత్తి కంటె ఎక్కువగా సీట్లు పొందారు. వీళ్లు నిజలింగప్ప సారథ్యంలోని పాత కాంగ్రెసును, తర్వాత జనతాపార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో వీళ్ల ప్రాబల్యం తగ్గించడానికి ఇందిరా గాంధీ నేతృత్వంలో దేవరాజ్‌ అర్స్‌ (1972-80) బిసిలను, దళితులను, మైనారిటీలను చేరదీసి అధికారంలోకి వచ్చాడు. సిద్ధరామయ్య యీనాడు చెప్తున్న అహిందా ఫార్ములా అతనిదే.

ఆ తర్వాత కర్ణాటకను ఫుల్‌ టెర్మ్‌ పాలించినది సిద్ధరామయ్య మాత్రమే. అరసు అనంతరం కర్ణాటకలో చాలా మార్పులు వచ్చాయి. ఇందిరా కాంగ్రెసుకు చెందిన గుండూరావు (1980-83) పాలన అవినీతిమయమై 1983 ఎన్నికలలో జనతా పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. లింగాయతులు, ఒక్కళిగలు అధికారం కోసం పోటీ పడితే చివరకు రాజీ అభ్యర్థిగా బ్రాహ్మణుడైన రామకృష్ణ హెగ్డేను ముఖ్యమంత్రి చేశారు. రాజీ అభ్యర్థిగా ఎంపికైనా  హెగ్డే లింగాయతులను ఎక్కువగా చేరదీశాడు. ఇది ఒక్కళిగుడైన దేవెగౌడకు రుచించలేదు.  1984 లోకసభ ఎన్నికలలో ఇందిర హత్య తదనంతరం జనతాపార్టీకి 28 స్థానాల్లో 4 రావడంతో హెగ్డే రాజీనామా చేసి, 1985లో మళ్లీ ఎన్నికలకు వెళ్లాడు. 

నెగ్గి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి 1988లో ట్యాపింగ్‌ వివాదాల్లో రాజీనామా చేశాడు. తన స్థానంలో లింగాయతుడైన ఎస్‌ఆర్‌ బొమ్మయ్‌ను కూర్చోబెట్టాడు. అతని ప్రభుత్వాన్ని రాజీవ్‌ ప్రభుత్వం డిస్మిస్‌ చేసింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి లింగాయతు ఐన వీరేంద్ర పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. అతను లిక్కర్‌ లాబీని నియంత్రించడంతో దానికి మద్దతుగా ఉన్న సాటి కాంగ్రెసు నాయకులు కక్ష పెంచుకున్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించారు. వాటిని అదుపు చేయలేకపోయావంటూ రాజీవ్‌ వీరేంద్ర పాటిల్‌ను తొలగించడంతో కోపం వచ్చిన లింగాయతులు కాంగ్రెసుకు దూరమయ్యారు.

1994 ఎన్నికల తర్వాత జనతా దళ్‌ తరఫున దేవెగౌడ ముస్లిములు, ఒబిసిలు, ఒక్కళిగలు, దళితులతో ఒక కూటమి ఏర్పరచి నెగ్గి ముఖ్యమంత్రి అయ్యాడు. 1996లో ప్రధానమంత్రి కూడా అయ్యాడు. అయ్యాక పార్టీలో తన ప్రత్యర్థియైన హెగ్డేను జనతా దళ్‌ అధ్యక్షుడైన లాలూ యాదవ్‌ చేత తీయించేశాడు. హెగ్డే విడిగా వచ్చేసి లోకశక్తి అనే పార్టీ పెట్టుకున్నాడు. 1998 ఎన్నికలలో బిజెపితో చేతులు కలిపి కర్ణాటకలో మెజారిటీ సీట్లు సంపాదించుకున్నాడు. హెగ్డేకు మద్దతు యిస్తూ వచ్చిన లింగాయతులు హెగ్డేతో బాటు బిజెపికి మద్దతుదారులుగా మారారు. ఒక్కళిగలు జనతా దళ్‌, దరిమిలా జెడిఎస్‌ మద్దతుదారులుగా మారారు. హెగ్డే 1998 నాటి వాజపేయి కాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశాడు.

1999లో జనతా దళ్‌లో చీలిక వచ్చాక కర్ణాటక ముఖ్యమంత్రిగా తన అనుచరుడు జెఎచ్‌ పాటిల్‌ను కూర్చోబెట్టాడు. లోకశక్తిని జెడి (యునైటెడ్‌)లో కలిపివేసి బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. కానీ 1999 ఎన్నికలలో పటేల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. హెగ్డే క్రమేపీ రాజకీయాలకు దూరమై, 2004లో పోయాడు. కానీ అతని కారణంగా లింగాయతులు, బ్రాహ్మణులు బిజెపి సమర్థకులుగా మారి అలాగే నిలిచిపోయారు. ఎడియూరప్ప పాలించే రోజుల్లో లింగాయతులు, బ్రాహ్మణులకు తోడుగా కోస్తా కర్ణాటకలోని బిల్లవులనే బిసిలను, బంట్‌లను చేరదీయడంతో బాటు మధ్య, తూర్పు కర్ణాటకలోని గిరిజనులను కూడా అక్కున చేర్చుకున్నాడు. ఒక్కళిగలు దేవెగౌడను తప్ప వేరెవరినీ తమ నాయకుడిగా ఆమోదించకుండా జెడిఎస్‌నే ఆదరిస్తున్నారు. (సశేషం) (దేవెగౌడ, హెగ్డే)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
mbsprasad@gmail.com