cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కర్ణాటక ఫలితాల విశ్లేషణ - 2/2

ఎమ్బీయస్‌: కర్ణాటక ఫలితాల విశ్లేషణ - 2/2

అగ్రకులాలను అదుపు చేయబోయిన సిద్ధరామయ్య - సిద్ధరామయ్య అధికారంలోకి వస్తూనే యీ వ్యవహారమంతా గమనించి లింగాయతులను, ఒక్కళిగలను నియంత్రించి యితర కులాలకు ప్రాధాన్యత యిచ్చి తను వాళ్ల నాయకుడిగా ఎదగాలని పథకం వేశాడు. ముందుగా జనాభాలో లింగాయతులు, ఒక్కళిగలు వాళ్లు చెప్పుకునేటంత మంది ఉన్నారా లేదా అనే లెక్కలు తేల్చాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్లు తాము 17% దాకా ఉన్నామని చెప్పుకుంటూ, తమ సంఖ్యాబలాన్ని చూపించి దబాయించి పదవులు తీసుకుంటున్నారు.

దాని సంగతేమిటో చూద్దామని 'సోషల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వే' అనే పేర యింటింటికి తిరిగి వివరాలు రాబట్టాడు. తక్కినవాటి మాట ఎలా వున్నా కులం, ఉపకులంతో సహా రికార్డు చేశారు. కెసియార్‌ దీన్ని చూసే స్ఫూర్తి పొంది, సర్వే చేయించారు లాగుంది. అప్పుడు సర్వేయర్లు కులం గురించి కూడా అడిగారు. కెసియార్‌ ఆ వివరాలు బయట పెట్టనట్లే, సిద్ధరామయ్య కూడా బయటపెట్టలేదు. ఎందుకంటే లింగాయతులు 10%, (కొంతమంది 13% అంటున్నారు) ఒక్కళిగలు 8% మంది మాత్రమే ఉన్నారని, వాళ్ల కంటె దళితులు (19%), ముస్లిములు (16%) ఎక్కువమంది ఉన్నారని తేలింది.

నివేదికను బయటపెడితే యిది కొత్త డిమాండ్లకు దారి తీస్తుందని భయపడి కాంగ్రెసు ప్రభుత్వం దాన్ని అటక మీద పడేసింది కానీ అంకెలు లీక్‌ అయ్యాయి. ఇది లింగాయతులను, ఒక్కళిగలను మండించింది. కన్నడ రాజకీయాల్లో యిన్నాళ్లూ చక్రం తిప్పిన తమ చేతుల్లోంచి రాజకీయాధికారం జారిపోతుందని భయం వేసింది. సిద్ధరామయ్యకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఆ అంకెలు చూశాక అరసు నాటి అహిందా సమీకరణాన్ని నమ్ముకుని ఒబిసిలను చేరదీస్తే మంచిదని తోచింది.

అయితే ఒబిసిలలో కూడా అతను పక్షపాతం చూపించాడు. తన కురుబ (గొల్ల) కులానికి పెద్ద పీట వేశాడు. అతని హయాంలో కీలకమైన పోస్టులన్నీ కురుబలకే దక్కాయని యితరులు అభిప్రాయ పడ్డారు. అందువలన యీ ఎన్నికలలో ఒబిసిల్లో చీలిక వచ్చింది. వారిలో 24% (బిజెపికి వేసిన దాంట్లో సగం కంటె తక్కువ) మంది మాత్రమే కాంగ్రెసుకు వేశారు. 

వర్గీకరణ సమస్య దెబ్బ తీసింది - షెడ్యూల్డ్‌ కులాల దగ్గరకు వచ్చేసరికి యింకో చిక్కు వచ్చిపడింది. కర్ణాటక ఎస్సీలలో 100 ఉపకులాలున్నాయి. వారిలో ముఖ్యమైనవి ఎడమ (హోలేయ), కుడి (మాదిగ) వర్గాలు. మన దగ్గర మాలల్లాగానే అక్కడ హోలేయలు రిజర్వేషన్‌ ఫలితాలు బాగా అనుభవించారు. కాంగ్రెసు హరిజన నాయకులైన మల్లికార్జున ఖర్గే, జి పరమేశ్వర, మహదేవప్ప - వీళ్లందరూ హోలేయలే. మాదిగలకు తమకు రావలసిన వాటా దక్కలేదని, ఉపకులాల మధ్య వర్గీకరణ చేయాలని ఆందోళన చేయడంతో 2005లో జస్టిస్‌ సదాశివ కమిషన్‌ వేశారు.

2012లో నివేదిక యిచ్చిన కమిషన్‌ వర్గీకరణ చేయమని సిఫార్సు చేసింది. 2013లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. అది అమలు చేస్తే హోలేయలకు కోపం వస్తుందని, దేశంలో తక్కిన చోట్ల కూడా యిలాటి డిమాండ్లు తలెత్తుతాయని భయపడి కాంగ్రెసు పార్టీ దాన్ని అమలు చేయలేదు. సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీలకై పెట్టిన నిధులను వారివారి ఉపకులాల నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసినా, లింగాయతులను మైనారిటీలుగా గుర్తించడంలో చూపిన చొరవ వర్గీకరణలో చూపించలేదని మాదిగలకు కోపం వచ్చింది. దాంతో కాంగ్రెసుకు ఎదురు తిరిగారు. ఎస్సీల్లో 37% మంది మాత్రమే వాళ్లకు ఓట్లేశారు.

ఎస్టీల దగ్గరకు వస్తే చాలా రాష్ట్రాలలో ఆరెస్సెస్‌ గిరిజన ప్రాంతాల్లో రకరకాల సంస్థల పేర్లతో వారికి సేవలందిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటోంది. కర్ణాటకలోనూ అదే జరిగివుంటుంది. అందుకే కాబోలు ఎస్టీల్లో 29% మంది మాత్రమే కాంగ్రెసుకు ఓటేశారు. ఎస్సీ, ఎస్టీ ఓట్లు రెండు కలిపి చూస్తే బిజెపి కంటె కాంగ్రెసుకు 9% తక్కువ వచ్చాయి. రిజర్వ్‌డ్‌ సీట్లలో కాంగ్రెసు ఓట్ల శాతం ఎక్కువే వచ్చింది, కానీ బిజెపి 16 రిజర్వ్‌డ్‌ సీట్లు గెలుచుకోగా, కాంగ్రెసు 12 మాత్రమే గెలుచుకోగలిగింది.

బుద్ధి చెప్పిన లింగాయతులు - ఇక ఆర్థికంగా బలమైనవారు, రాజకీయంగా పలుకుబడి గలవారు ఐన లింగాయతులైతే సిద్ధరామయ్యకు బుద్ధి చెప్పడానికి నిశ్చయించుకున్నారు. మామూలుగానే బిజెపి పక్షపాతులు, పైగా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడియూరప్ప లింగాయతుడు. ఎడియూరప్ప బిజెపి నుంచి విడిపోయి కెజెపి (కర్ణాటక జనతా పక్ష) పెట్టినపుడు 34 నియోజకవర్గాలలో అతని పార్టీకి ద్వితీయ స్థానం వచ్చింది. దానికి కారణం లింగాయతు ఓట్లే.

అది గ్రహించిన మోదీ తనకు పార్టీలో ప్రాధాన్యత రాగానే ఎడియూరప్పను పార్టీలోకి తీసుకున్నారు. 2016లో రాష్ట్ర అధ్యక్షుణ్ని చేశారు. ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపారు. బిజెపి యిలా తమను ఆదరిస్తూ ఉండగా, యిటు తమ ప్రాబల్యం తగ్గించడానికి సిద్ధరామయ్య ఒబిసిలను ఎగదోయడమే కాకుండా, తమ నుంచి వీరశైవులను విడదీసి, తమ బలాన్ని క్షీణింపచేయడానికే మైనారిటీ స్టేటస్‌ ప్రకటించాడని నమ్మారు. వారు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటేయడమే కాకుండా, తమ సంస్థల్లో పనిచేసే యితర కులస్తుల ఓటింగు సరళిని కూడా ప్రభావితం చేశారు.

పేద లింగాయతులకు మైనారిటీ స్టేటస్‌ వలన కలిగే లాభమేమిటో అర్థం కాలేదు. తాము, వీరశైవులు ఎందుకు భిన్నమో వారికి తెలియలేదు. అందువలన వారు కాంగ్రెసు పట్ల అభిమానమేమీ పెంచుకోలేదు. ఏతావతా లింగాయతుల్లో 20% మందే కాంగ్రెసుకు ఓటేశారు. (2013లో 48% మంది వేశారు). లింగాయతులు ఎక్కువగా ఉన్న బొంబాయి కర్ణాటక, మధ్య కర్ణాటకలలో మొత్తం 104 సీట్లుంటే కాంగ్రెసుకు 31 వస్తే బిజెపికి రెట్టింపు కంటె ఎక్కువగా 63 వచ్చాయి. 

ఆగ్రహించిన ఒక్కళిగలు - ఒక్కళిగలు కూడా సిద్ధరామయ్య అంటే మండిపడ్డారు. తాము ఆరాధించే 86 ఏళ్ల దేవెగౌడను సిద్ధరామయ్య మాటిమాటికీ తీసిపారేయడంతో, హేళన చేయడంతో వారికి కోపం వచ్చింది. మోదీ అంతటివాడే దేవెగౌడను మన్నిస్తూండగా అతడికి నమ్మినబంటుగా వుండి, రాజకీయాల్లో పైకి వచ్చిన సిద్ధరామయ్య దేవెగౌడను యింత చులకన చేస్తాడా అని ఆగ్రహించారు. వారిని మరింత రెచ్చగొట్టడానికి దేవెగౌడ పేపర్లలో మొదటిపేజీల్లో యాడ్స్‌ యిచ్చాడు. ప్రభుత్వాఫీసుల్లో సిద్ధరామయ్య తన ఫోటోలు తీయించేశాడని, మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ప్రధానికి దక్కుతున్న గౌరవం యిదనీ వాటిల్లో వాపోయాడు.

అందువలన వారిలో 19% మాత్రమే కాంగ్రెసుకు ఓటేశారు. ఒక్కళిగలు దేవెగౌడను, జెడిఎస్‌ను మాత్రమే తమ పార్టీగా ఫీలయ్యారు. బిజెపికి రాష్ట్రమంతా యింత హవా ఉన్నా అది లింగాయతులకు మాత్రమే మేలు చేసే పార్టీ అనే అభిప్రాయంతో కాబోలు 11% మంది మాత్రమే ఓటేశారు. జెడిఎస్‌ నుంచి కాంగ్రెసుకు పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఒక్కళిగ నాయకులకు వారి కులం మద్దతు లభించలేదు. ముగ్గురూ ఓడిపోయారు. పాతమైసూరు ప్రాంతంలో జెడిఎస్‌కు 41% ఓట్లు, సీట్లలో 50% వచ్చాయి. హాసన్‌, మండ్యా, రామనగరం, బెంగుళూరు (రూరల్‌), మైసూరు, చామరాజనగర్‌ జిల్లాలలో గతంలో 16 వస్తే యీసారి 24 వచ్చాయి.

కాంగ్రెసుకు గతంలో 19 వస్తే యీసారి 8 వచ్చాయి. సిద్ధరామయ్య పోటీ చేసిన చాముండేశ్వరిలో 2.20 లక్షల మంది ఓటర్లుంటే ఒక్కళిగలు 1.30 లక్షలున్నారు. వాళ్లు తమ కసి తీర్చుకున్నారు. జెడిఎస్‌లో ఉండగా అక్కణ్నుంచే 5 సార్లు నెగ్గిన సిద్ధరామయ్యపై ఒకప్పటి అతని అనుచరుడు జిటి దేవెగౌడ జెడిఎస్‌ తరఫున పోటీ చేస్తే అతనికి 1.21 లక్షల ఓట్లు వచ్చాయి. 36 వేల తేడాతో సిద్ధరామయ్య ఓడిపోయాడు. సిద్ధరామయ్య సొంత కులమైన కురుబల్లో 60% మంది కాంగ్రెసుకు వేయగా, 27% మంది బిజెపికి వేశారు. సిద్ధరామయ్య పరిపాలనలో మతకలహాలు జరగకుండా శాంతి నెలకొన్నందుకో, సిద్ధరామయ్య నిర్వహించిన అన్నభాగ్య, శాదీ భాగ్య వంటి పథకాల వలన లబ్ధి పొందడం చేతనో, బిజెపి అంటే భయమో కానీ ముస్లిములు మాత్రం 78% మంది కాంగ్రెసుకు ఓటేశారు 

ప్రాంతాల వారీ ఓటింగు సరళి - ఇప్పుడు ప్రాంతాల వారీగా చూస్తే బిజెపి విస్తృతి, కాంగ్రెసు దెబ్బ తిన్న పరిస్థితి బాగా అర్థమౌతుంది. ఈ ప్రాంతాల విషయంలో కాస్త అస్పష్టత ఉందని గతంలోనే రాశాను. కొన్ని జిల్లాలను కొందరు విశ్లేషకులు ఒక ప్రాంతంలో గణిస్తే, యితరులు పక్కనున్న ప్రాంతంలో కలుపుతున్నారు. అనేకం పరిశీలించాక నేను ఫైనల్‌గా హిందూ పత్రిక వారి వర్గీకరణను తీసుకుంటున్నాను.

1) 56 సీట్లున్న బొంబాయి-కర్ణాటకలో కాంగ్రెసు చావుదెబ్బ తింది. 2013లో 34 సీట్లు గెలిచిన ఆ పార్టీ యీసారి 19 తెచ్చుకుంది. బిజెపి 16 నుంచి 34 కి పెరిగింది. 2014 లెక్క ప్రకారమైతే 44 రావలసి ఉంది. జెడిఎస్‌కు 1 నుంచి 2కి పెరిగాయి. ఇతరులకు 1 వచ్చింది. ఉత్తర బొంబాయి-కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెసు బిజెపి నుంచి కొన్ని స్థానాలను గుంజుకోగలిగింది.

2) మన ఆంధ్ర నాయకులు తమ ప్రచారం ప్రభావం పని చేసిందని చెప్పుకుంటున్న ప్రాంతం హైదరాబాదు- కర్ణాటకలో 32 సీట్లుంటే, బిజెపి బలం 7 నుంచి 13కి ఎదిగింది, కాంగ్రెసు 20 నుంచి 15కి తగ్గింది. కర్ణాటకలో 85 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, వారిలో 25 లక్షల మంది మాత్రమే ఓటర్లగా నమోదయ్యారని ఓ పత్రిక రాసింది. ఎంతవరకు నిజమో తెలియదు. తెలుగు ఓటర్లు అధికంగా ఉండే 32 స్థానాల్లో బిజెపి 8 మాత్రమే గెలిచిందని టిడిపి చెప్పుకుంటోంది. హైదరాబాదు కర్ణాటక మొత్తంగా చూస్తే గతంలో 6 వస్తే యీసారి 20 వచ్చాయని రామ్‌ మాధవ్‌ చెప్తున్నారు. ఎవరి వాదనకు అనుకూలంగా వారు నియోజకవర్గాలకు వేర్వేరు లేబుళ్లు అంటించేస్తున్నారులాగుంది. మొత్తం మీద చూస్తే హైదరాబాదు కర్ణాటకలో బిజెపి సీట్లు 181% పెరిగాయి, కాంగ్రెసుకు సీట్లు 75% తగ్గాయి. 

3) 16 సీట్ల కోస్తా కర్ణాటకలో బిజెపి 11 సీట్లతో తుడిచిపెట్టేసింది. గతంలో 3 ఉండేవి. కాంగ్రెసు బలం 12 నుంచి 2కి పడిపోయింది. జెడిఎస్‌ బలం 1 నుంచి 3కి పెరిగింది. ఇక్కడ హిందూత్వ ప్రచారం ముమ్మరంగా సాగింది. టిప్పు జయంతి నిర్వహణకై సిద్ధరామయ్య దసరా ఉత్సవాల బజెట్‌లో కోత పెట్టాడని, ప్రపంచ కన్నడ సమ్మేళనాలకు డబ్బు లేదన్నాడని ప్రచారం చేశారు. ఆరెస్సెస్‌, బిజెపిలకు చెందిన 23 మంది కాంగ్రెసు పరిపాలనలో చంపబడ్డారని ఉడుపి నుంచి బిజెపి ఎంపీగా ఉన్న శోభా కరంద్లాజే గత ఏడాది జులైలో రాజనాథ్‌ సింగ్‌కు ఒక లేఖ రాసింది. ఆమె యిచ్చిన పేర్లను పరిశీలించిన జర్నలిస్టులు వారిలో ఒకరు బతికే ఉన్నారనీ, తక్కినవారిలో  వ్యక్తిగత కారణాలతో చంపబడినవారు, సహజమరణం పొందినవారు తప్ప రాజకీయ కారణాలతో కాదని తేల్చారు.

నిజానిజాలపై విచారణ జరిపినవారు లేరు కానీ బిజెపి నాయకులు ఆ ఆరోపణను తమ ప్రచారానికి శుబ్భరంగా వాడుకున్నారు. మోదీ కూడా అమాయకులైన హిందూ కార్యకర్తల హత్యలను ఆపడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఆర్థిక సిద్ధాంతాలు పూర్తిగా మరుగున పడ్డాయి. మతాల వారీగా ప్రజల్లో చీలిక వచ్చేసింది. హిందూత్వ శక్తులు బలపడుతూ ఉంటే కాంగ్రెసు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తూ ఉందని, యిక్కడి హిందువుల్లో బిల్లవులకు, బంటులకు పదవులు యిచ్చి వారిని తమవైపు తిప్పుకుని హిందూత్వ శక్తులకు అడ్డుకట్ట వేయలేదని సెక్యులరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇక్కడ బిజెపి 50% కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. 

4) 48 సీట్ల మధ్య కర్ణాటకలో బిజెపి బలం 6 నుంచి 29కి పెరిగింది. దాదాపు 5 రెట్లు. కాంగ్రెసు బలం సగానికి సగం 24 నుంచి 12కి పడిపోయింది. జెడిఎస్‌ బలం కూడా దాదాపు సగానికి అంటే 13 నుంచి 7కి పడిపోయింది. 4) 40 స్థానాల దక్షిణ కర్ణాటకలో కాంగ్రెసు బలం 18 నుంచి 13కి పడింది. బిజెపి బలం 3 నుంచి 7కి పెరిగింది. జెడిఎస్‌ బలం 15 నుంచి 16కి పెరిగింది. ఇతరులకు 2 వచ్చాయి. అంటే మైసూరు, చామరాజనగర్‌లలో తప్పిస్తే తక్కిన చోట్ల జెడిఎస్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెసు స్థానంలోకి బిజెపి వచ్చింది. 5) బెంగుళూరులో (ఈ 32 సీట్లుంటే 30 వాటిల్లో ఓటింగు జరిగింది. బిజెపి అప్పుడు 11 యిప్పుడు 10 తెచ్చుకుంది. కాంగ్రెసు గతంలో 14, యిప్పుడు 15 గెలుచుకుంది. జెడిఎస్‌ 6 నుంచి 5కి తగ్గింది.   

లింగాయతులు ఊరుకుంటారా? - ఇప్పుడీ అంకెలన్నీ చూశాక కర్ణాటక ప్రభుత్వం భవిష్యత్తు ఎలా ఉంటుందో లీలగా ఊహించవచ్చు. ఒక్కళిగలకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎస్సీలలో హోలియలకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. తమ నాయకుడైన ఎడియూరప్పకు అధికారం నోటి దాకా వచ్చి కింద పడిపోయినందుకు, అతని స్థానంలో తమ ప్రత్యర్థులైన ఒక్కళిగలు వచ్చినందుకు లింగాయతులు మండిపడుతూ ఉండివుంటారు. బిజెపి అధికారంలోకి వచ్చి ఉంటే కోస్తా కర్ణాటక ప్రశాంతంగా ఉండేదేమో కానీ, యిప్పుడు అక్కడ హిందూత్వ శక్తులు విజృంభించవచ్చు.

సిద్ధరామయ్యకు సమీప భవిష్యత్తులో ఏ పదవీ దక్కకపోయినా ఆశ్చర్యం లేదు. పాలన విషయంలో ఫర్వాలేదనిపించుకున్నా కుల సమీకరణాలతో ఆటలాడి ముప్పు తెచ్చుకున్నాడు. రాజకీయంగా బలవంతులైన అగ్రకులాలు తమ తడాఖా చూపించాయి. రానున్న రోజుల్లో కర్ణాటకలో బిసిలను నమ్ముకుని గోదాలోకి దిగడానికి ఎవరూ సాహసించరు. (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2018)
-mbsprasad@gmail.com