Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కర్ణాటక తెలుగు ఓటర్లు హోదా విషయంలో స్పందిస్తారా?

ఎమ్బీయస్‌: కర్ణాటక తెలుగు ఓటర్లు హోదా విషయంలో స్పందిస్తారా?

ఆంధ్రకు ప్రత్యేక హోదా యివ్వకుండా బిజెపి మోసం చేసింది కాబట్టి ప్రపంచంలోని తెలుగువాళ్లందరూ బిజెపికి బుద్ధి చెప్పాలని తిరుపతి సభలో బాబు పిలుపు నిచ్చారు. రాబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఓడించి దానికి తగిన శాస్తి చేయాలని టిడిపి నాయకులు పదేపదే చెపుతున్నారు. అక్కడకు వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు. ఆరెస్సెస్‌ చేసిన అంతర్గత సర్వే ప్రకారం కర్ణాటకలో బిజెపికి 70 సీట్లు, కాంగ్రెసుకు 115-120, జెడిఎస్‌కు 29-34 సీట్లు వస్తాయని తాజాగా వెలువడిన వార్త. దానికి తగ్గట్లుగానే మోదీ ప్రచారాన్ని మరో నాలుగు జిల్లాలకు విస్తరించడానికి నిశ్చయించుకున్నారు.

అంతిమంగా ఆ సర్వే ఫలితాలు నిజమైతే ఆ ఘనతంతా తమదే అని టిడిపి ప్రచారం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే కాంగ్రెస్సూ చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెసు నాయకులు మాత్రం కర్ణాటకకు వెళ్లి మోదీ ఆంధ్రుల పాలిట నరకాసురుడని, బిజెపిని ఓడించి ఆంధ్రఖు న్యాయభిక్ష పెట్టాలనీ విజ్ఞప్తి చేశారు. వాళ్లతో బాటు కెసియారూ చెప్పుకోవచ్చు - ఎందుకంటే  తెలంగాణకు ఆనుకుని వున్న కర్ణాటక జిల్లాలలోని తెలుగువారు కాంగ్రెసు, బిజెపిలను తిరస్కరించి జెడిఎస్‌కు ఓటేయాలని కెసియార్‌ పిలుపు నిచ్చారు. వైసిపి అలాటి పిలుపు నిచ్చినట్లు లేదు. ఎందుకంటే హోదా విషయంలో టిడిపిది వంచన, బిజెపిది నిర్లక్ష్యం అని వైసిపి ఉవాచ. కర్ణాటకలో బిజెపి ఓటమిని వైసిపి స్వాగతిస్తుందన్న నమ్మకమూ లేదు.  

తమ రాష్ట్రంలో ఉన్న యితర భాషల వారిని ఆకట్టుకోవడానికి ఆ యా భాషారాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులను, కళాకారులను తెప్పించి ప్రచారం చేసుకోవడం ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే. బిజెపి తరఫున భోజపురి నటుడు మనోజ్‌ తివారి కూడా వచ్చాడు, ఆ భాష మాట్లాడే కొద్దిమందినైనా ఆకట్టుకోవడానికి! కానీ కర్ణాటకలో నివాసం ఉండేవారు తమ జన్మస్థానాలలో జరిగే రాజకీయ సంఘటనలను పట్టించుకుని స్పందిస్తూ ఉంటారని అనుకోవడానికి పెద్దగా ఆధారాలు కనబడవు.

ఆంధ్రకు హోదా యివ్వలేదు కాబట్టి తెలుగువారికి కోపం వచ్చి బిజెపిని శిక్షిస్తారా? అనేదాని గురించి ఆలోచించి చూస్తే, మొదటగా తట్టే ప్రశ్న - 2014లో ఏం జరిగింది అని. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చినందుకు ఆంధ్రప్రజలు కాంగ్రెసును తుక్కుతుక్కుగా ఓడించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయింది. కానీ కర్ణాటక వారు కాంగ్రెసును ఆదరించారు, పట్టం కట్టారు. ఆ ఎన్నికలలో తక్కిన వారి మాట ఎలా వున్నా తెలుగువారు మాత్రం కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటేశారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒకవేళ వేసినా కాంగ్రెసును ఓడించడానికి అవి చాలలేదు అని అర్థమైంది కదా. 

కర్ణాటకలో ఉన్న తెలుగువారందరూ ఒక ప్రాంతం వాళ్ల్లు కాదు.  కొందరు తెలుగు మూలాలున్న కర్ణాటకవాసులు. ఎన్నో తరాల కింద వచ్చేశాం, మా సొంత ఊరు కూడా మాకు తెలియదు, ఇంట్లో తెలుగు మాట్లాడతామంతే అనేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 'మేము ఎప్పుడూ యిక్కడే ఉన్నాం, రాష్ట్రాల సరిహద్దులు మారి కొంతకాలం మద్రాసు రాష్ట్రమన్నారు, తర్వాత కర్ణాటక అన్నారు, మాకు యీ ప్రాంతం తప్ప వేరే వాటి గురించి తెలియదు' అనేవారు బళ్లారి జిల్లాలో కనబడతారు. హైదరాబాదు - కర్ణాటక ప్రాంతంలోని తెలుగువాళ్లూ యిదే మాట చెప్తారు - 'మాది అప్పుడు నైజాంలో అన్నారు, యిప్పుడు కర్ణాటక అన్నారు' అని.

గత వందేళ్లగా వెళ్లినవాళ్లలో వ్యాపారాల కోసం, ఉపాధి కోసం వెళ్లిన రాయలసీమ వారు ఎక్కువ. సాగుభూములు చౌకగా లభించే రోజుల్లో అక్కడికి వ్యవసాయం చేయడానికి వెళ్లినవారిలో కోస్తా జిల్లాల వారు కనబడతారు. ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా బెంగుళూరు నగరంలో స్థిరపడిన వారిలో అన్ని జిల్లాల వారూ ఉన్నారు. వారందరికీ ఆంధ్రకు హోదా యివ్వలేదన్న బాధ ఉందా? ఇవ్వనందుకు బిజెపిపై కసి ఉందా? ఇప్పించలేనందుకు టిడిపిపై చికాకు ఉందా? 

ముందుగా చూడవలసినది, అక్కడ శాశ్వతంగా నివాస మేర్పరుచుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తి ఏ మేరకు ఉంది? అని. మనుషులు స్వార్థపరులు. హైదరాబాదు ఎంఎంటిఎస్‌ రైలెక్కేవాడు సికింద్రాబాదు ఎంఎంటిఎస్‌ రూట్లో బళ్లు పెంచారంటే పట్టించుకోడు. తన రూట్లో బోగీలు పెంచారా, ఫ్రీక్వెన్సీ పెంచారా అన్నదే చూస్తాడు. అమరావతికి మెట్రో యివ్వకుండా బెంగుళూరు మెట్రోకు నిధులు యిచ్చారని అలిగిన బెంగుళూరు తెలుగువాణ్ని చూపండి, చూద్దాం.

తను ఉన్న చోట శాంతియుతంగా ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, తన యిల్లున్న చోట స్థలాల ధరలు పెరగాలి... అంతే. ఆంధ్రకు హోదా యిచ్చేస్తే కర్ణాటక నుండి పరిశ్రమలు తరలిపోతే ఏ కర్ణాటక తెలుగువాడైనా సంతోషిస్తాడా? పధ్నాలుగేళ్లు ప్రవాసాంధ్రుడిగా ఉండి నేను గమనించినది - తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడి స్థానికులతో, స్థానిక పరిస్థితులతో కలిసిపోతారు. సొంత ఐడెంటిటీకై పోరాడరు. సొంత రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు శ్రద్ధగా ఫాలో అవరు. కలకత్తాలో లేక్‌ మార్కెటుకు సమీపంలో ఉన్న న్యూస్‌పేపరు స్టాల్‌లో తమిళ, మలయాళ దిన, వార పత్రికలు అమ్మేవారు. తెలుగు పత్రికలు అతి తక్కువ వచ్చేవి.

నేను స్థానిక ఆంగ్ల దినపత్రిక ''టెలిగ్రాఫ్‌'' కొనేవాణ్ని, దక్షిణాది వార్తలకై ''హిందూ'' పోస్టులో తెప్పించేవాణ్ని (రోజున్నర లేటుగా వచ్చేది). 1983 ఎన్నికల సమయంలో ఓ మూణ్న్లెళ్ల పాటు ''ఈనాడు'' పోస్టులో తెప్పించాను. నాదెండ్ల తిరుగుబాటు రోజున ఎన్టీయార్‌ పదవీభ్రష్టుడయ్యాడని, అరెస్టయ్యాడని విని వెంటనే ఆ న్యూస్‌స్టాల్‌కి వెళ్లి తెలుగు పేపరు ఉందా అని అడిగితే తిట్టిపోశాడు. 'మీ తెలుగు వాళ్లంతా యింతే. రోజూ పేపరు తెప్పించుకోరు. ఇవాళ మాత్రం వచ్చి తెగ అడుగుతున్నారు. తమిళ, మలయాళ వాళ్లని చూడండి, ఎక్కడున్నా వాళ్ల రాష్ట్ర విశేషాలు తెలుసుకుంటారు.' అని.

తమిళనాడులో ఉండగా తెలుగు పేపరు రోజూ తెప్పించుకునేవాణ్ని. అక్కడున్న తెలుగు మూలాల వాళ్లని కదలేస్తే, వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఫలానా అని తెలుసు తప్ప యింకేమీ తెలియదు. తమిళ పత్రికల్లో ఏ న్యూస్‌ వస్తే అదే చదువుతారు. ఇప్పుడు యింటర్నెట్‌ వచ్చింది కాబట్టి తెలుసుకుందా మనుకునేవాడికి తెలుసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. కానీ ఆసక్తి ఉండాలిగా. తెలుగువాళ్లకి సహజంగా అది తక్కువ. హోదా విషయంలో ఉన్న మతలబులన్నీ అర్థం చేసుకునే ఓపిక, తీరిక వాళ్ల కుంటాయనుకోను. 

కర్ణాటకలో ఉన్న తెలుగువాడు ఓటేసేముందు స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకుంటాడు తప్ప ఫలానా రాష్ట్రానికి ఫలానాది చేయలేదు నుక.. అనుకోడు. తెలంగాణలో ఉన్న ఆంధ్రమూలల ఓటరు ఓటేసేముందు తెరాస పరిపాలనను, తన రక్షణను, అభివృద్ధిని గణిస్తాడు తప్ప ఆంధ్ర పాలకుడికి యితను అనుకూలుడా, ప్రతికూలుడా అని పట్టించుకోడు. ఆ మాట కొస్తే ఆంధ్రలో పెట్టుబడులు పెడదామనుకుంటే తప్ప అక్కడ ప్రత్యేక హోదా యిచ్చారా లేదా అన్నది కూడా తెలంగాణా పౌరుడు పట్టించుకునే అంశం కాదు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్నవారు కూడా పట్టించుకోరు.

టిడిపి తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, హైకోర్టుతో సహా అన్నీ అమరావతికే కట్టబెడుతోందనీ ఆంధ్రలో ఉన్న రాయలసీమ వారికే విముఖత ఉన్నపుడు, రాయలసీమ నుండి కర్ణాటకకు వెళ్లి స్థిరపడిన వారికి టిడిపిపై ఆదరం ఉంటుందా? నిజానికి కర్ణాటకలో ఉన్న రాయలసీమ ప్రాంతీయుల ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆంధ్ర బిజెపి రాయలసీమ హక్కుల ఉద్యమం చేపట్టిందని అన్నారు. 

తను ఏర్పరచబోయే కూటమిలో జెడిఎస్‌ చేరుతుందనే ఆశతో, కెసియార్‌ జెడిఎస్‌కు ఓటేయమని తెలుగువారికి పిలుపు నివ్వవచ్చుగాక, వాళ్లెందుకు వినాలి? తెలుగు ఓటర్లు కర్ణాటక ఫలితాలను అటూయిటూ చేసేయగలరనేే భ్రమలోనే యీ పిలుపులన్నీ. నిజానికి కర్ణాటకలో తెలుగు వారే కాదు, తమిళులు, మలయాళీలు, మరాఠీలు, కొంకణివారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బెంగుళూరు అనేక రంగాల్లో పుంజుకున్న తర్వాత ఉత్తర భారతం నుంచే కాదు, ఈశాన్య భారతం నుంచి కూడా వచ్చి ప్రజలు స్థిరపడ్డారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో 64 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

వీటితో బాటు 60 నియోజకవర్గాల్లో యితర భాషీయుల సంఖ్య గణనీయంగా ఉంది. బెంగుళూరులో అయితే మరీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికలలో ఫలానా భాషావర్గం వారు ఓటేశారు కాబట్టి ఫలానా పార్టీ నెగ్గిందన్న విశ్లేషణలు నేను చదవలేదు. స్థానిక కుల, ప్రాంతీయ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలే ఎప్పుడూ ప్రాధాన్యత వహిస్తూ వచ్చాయి. ఈసారీ అదే జరగవచ్చు. బిజెపి ఓడిపోతే స్వయంకృతాపరాధాల వలన ఓడిపోవచ్చు తప్ప దానికై తెలుగు రాష్ట్రాల నాయకులు చంకలు గుద్దుకోనక్కరలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?