cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ముఖ్యమంత్రులు ధర్నా చేయవచ్చా?

ఎమ్బీయస్‍:  ముఖ్యమంత్రులు ధర్నా చేయవచ్చా?

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులు ధర్నాలు చేయవచ్చా? అదీ సొంత రాష్ట్రంలో, సొంత పోలీసులను చుట్టూ పెట్టుకుని! రాజే తిరుగుబాటుదారుడు అయినట్లయింది కదా! ధర్నాలు, నిరసనలు ప్రతిపక్షం వంతు. ధర్నా, రాస్తా రోకో, బంద్ చేస్తే యిన్ని పనిగంటలు వేస్టు, యిందరు రోజు కూలీలకు తిండి లేకుండా పోతుంది అని వాపోవడం అధికార పక్షం వంతు. అలాటిది అధికార పక్షమే వీటిని ప్రోత్సహిస్తే వింతగా లేదా? దీనిలో ఔచిత్యం వుందా?

ముఖ్యమంత్రి కెసియార్ స్వయంగా ధర్నాకు కూర్చున్నారు. గతంలో ముఖ్యమంత్రులు అనేకమంది పూరా ఒక పూట పాటు నిరాహార దీక్ష చేశారు. ఫ్లాష్‌బ్యాక్‌లో కరుణానిధి దాకా వెళ్లనక్కరలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబే వున్నారు. ప్రధానమంత్రి వెర్సస్ ముఖ్యమంత్రి అన్నట్లు పోరు సాగించారు. కేసుల గొడవ సద్దు మణిగితే, రేపు జగన్ కూడా కెసియార్ తరహాలో కేంద్రం నుంచి రావల్సిన బకాయిల కోసమో, తుపాను సాయం కోసమో, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అపడానికో, రఘురామ రాజుపై తామిచ్చిన నోటీసుపై లోకసభ స్పీకరు సత్వరమే స్పందించాలనో ధర్నాకు కూర్చోవచ్చు. మమతా బెనర్జీని, అరవింద్ కేజ్రీవాల్‌ని అడిగితే వాళ్లు నిరసనలు ఎన్ని రకాలుగా చేయవచ్చో నేర్పుతారు. ముఖ్యమంత్రిగా వుండగా మోదీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేసినట్లు గుర్తు.

తన దాకా వస్తే కానీ తెలియదనే విషయం కెసియార్ విషయంలో రెండు రకాలుగా రుజువైంది. ఒకటి కేంద్రానికి సర్వాధికారాలు అప్పగించి నోరు మూసుకుని కూర్చోవడం వలన కలిగే నష్టమేమిటో తెలిసిరావడం. రెండోది నిరసన తెలపవలసిన అవసరం ఎప్పటికైనా వస్తుందనే గ్రహింపు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ఏం చేసినా కిమ్మనటం లేదు. కేంద్రందే యిష్టారాజ్యంగా వుంది. లోకసభలో బిజెపికి ఎలాగూ మెజారిటీ వుంది. రాజ్యసభలో యిలాటి ముఖ్యమంత్రులు మద్దతిచ్చేస్తున్నారు. అతి ముఖ్యమైన బిల్లులు నిమిషాల్లో పాస్ అయిపోతున్నాయి. సెలక్ట్ కమిటీకి పంపించండి, పార్లమెంటరీ సంఘాన్ని పరిశీలించనీయండి.. అని ఏం మొత్తుకున్నా వినే నాధుడు లేడు.

సాగు చట్టాల విషయంలో చూడండి, బిజెపి తలచుకున్నపుడు పెట్టింది. దేశమంతా అల్లకల్లోలమైనా పట్టించుకోలేదు. నిరసన తెలిపే రైతులను ఖలిస్తానీలన్నారు, దేశద్రోహులన్నారు, జమీందారీ జాట్లన్నారు, కమిషన్ ఏజంట్ల తొత్తులన్నారు. వాళ్లు రక్తం ఒలికించినా, ప్రాణాలు తీశారు తప్ప, జాలి కనబరచలేదు. అలాటిది యీనాడు యుపి, పంజాబ్ ఎన్నికలు వచ్చిపడేసరికి భయం పుట్టి ఒక్కసారిగా రద్దు చేసేశారు. జమిలి ఎన్నికలు పెడితే ఖర్చు మిగులుతుందని కొందరు వాదిస్తారు. అప్పుడప్పుడు ఎన్నికలు వస్తూంటేనే పాలకులకు కనువిప్పు కలిగి, తమ తప్పులు దిద్దుకుంటూ వుంటారు. ఈ లాభంతో పోలిస్తే ఆర్థికనష్టం అతి తక్కువ. సాగు బిల్లులను రద్దు చేసేటప్పుడు ఏ డిస్కషనైనా అయిందా? సుప్రీం కోర్టు సూచనల మేరకు చేశాం, నిపుణుల సలహా మేరకు చేశాం అన్నారా? ఏమీ లేదు. తలచుకున్నాం, పెట్టాం, మళ్లీ తలచుకున్నాం, తీసేశాం. మా యిష్టం, మా చిత్తం అనే అహంకారమే కనబరచారు.

వరి విధానమైనా అంతే, కొంటామని చెప్పారు, మధ్యలో యికపై కొనం అని ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, పొండి అన్నారు. ప్రత్యామ్నాయానికి మారడం అంత సులభమా? వడ్రంగిని పిలిచి యివాళ్టి నుంచి కొయ్య బొమ్మలు కాదు, రాతి బొమ్మలు చేయి అంటే చేసేయగలడా? రైతుల్లో చదువు రానివాళ్లు, తక్కువగా చదువుకున్నవాళ్లు చాలామంది వుంటారు. తరతరాలుగా వేస్తున్న పంటకు బదులు మరొకటి వేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. దాని లోతుపాతులు, లాభనష్టాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు.. యిలా ఎన్నో విషయాలు వాళ్లను కూర్చోబెట్టి ఒకటికి రెండు సార్లు చెప్పి, వాళ్లకు తలకెక్కించాలి. ఇదంతా ప్రభుత్వోద్యోగులపై వదిలేస్తే వాళ్లు చిత్తశుద్ధితో చేస్తారో లేదో తెలియదు. సామాజిక సంస్థలు నడుం కట్టాలి. ఈ ఏర్పాట్లేవీ చేయకుండా వరి వేయవద్దని కేంద్రం అనగానే కెసియార్ ఎలా తలవూపారు? సరేనని రాసిచ్చారట కూడా! ఇప్పుడు రైతులు పంట పట్టుకుని వచ్చి సేకరణ కేంద్రాల ముందు కుప్పపోస్తే గాని తెలిసి రాలేదు.

సాగు బిల్లుల వలన జరిగే అనర్థాలు గ్రహించి, వాటికి వ్యతిరేకంగా దేశమంతా రైతులు ఉద్యమిస్తే యిన్నాళ్లూ కెసియార్ మాట్లాడలేదు. అబ్బే రాజ్యసభలో మా పార్టీ ఎంపీ గొణిగాడు, సణిగాడు, మా వ్యవసాయ మంత్రి ఉత్తరాలు రాశాడు అని యిప్పుడు చెప్తున్నారు. కెసియార్ ఎప్పుడైనా మాట్లాడారా? నోరు విప్పితే చైనాలో అలా, సింగపూరులో యిలా, సింగపూరు గురించి పుస్తకాలు రాస్తానంటూ కబుర్లు చెప్పే కెసియార్ ఆ సాగు చట్టాలను ‘దిక్కుమాలిన చట్టాలు’ అని ఎప్పుడైనా వర్ణించారా? ఈ రోజు తన రోడ్డెక్కిన తర్వాత ‘కేంద్రం దిగి వచ్చేవరకూ ఉప్పెనలా సాగుతుంది, బియ్యాన్ని బిజెపి ఆఫీసు ముందు కుమ్మరిస్తాం’ అంటూ నినాదాలు చేస్తున్నారే, వణికించే చలిలో కరోనా భయాన్ని కూడా లక్ష్యపెట్టకుండా పంజాబీ రైతులు ఉద్యమిస్తే సానుభూతిగా ఒక్క ముక్క పలికారా? వాళ్లని దేశద్రోహులని మోదీ సేన అంటూ వుంటే, ఎడాపెడా కేసులు బనాయిస్తూ వుంటే ఖండించారా?

ఇప్పుడు వరి విధానంతో సమస్య ముగిసిపోతుందని అనుకోనక్కరలేదు. పెట్రోలు, గ్యాసు ధరలు, ప్రభుత్వ ఆస్తుల విక్రయం, సమస్తం ప్రయివేటు సెక్టార్‌కు కట్టబెట్టడం.. యిలా ఎన్నో ప్రజావ్యతిరేక విధానాలున్నాయి. వాటికి వ్యతిరేకంగా బాధిత ప్రజల్లో ఆగ్రహం వుంది. ముఖ్యమంత్రులు ప్రధానికి కట్టుబానిసలుగా మారి, తమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని గ్రహించిన ఆ యా వర్గాల వారు వారికి వాతలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉపయెన్నికల తర్వాత మోదీకి జ్ఞానోదయం అయినట్లే, హుజూరాబాద్ ఓటమి తర్వాత కెసియార్‌కూ అయింది - రైతులకు ఆగ్రహం తెప్పిస్తే రాజకీయంగా భవిష్యత్తు వుండదని! ఉద్యోగాలు కల్పిస్తాయి అనే మిషతో కార్పోరేట్ల ఋణాలు లక్షల కోట్లు మాఫీ చేస్తూన్న మోదీ సర్కారు, దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటం లేదు. రైతులకు కిట్టుబాటు ధరలు ఎలాగూ యివ్వటం లేదు, పండించిన పంట కూడా కొనం పొమ్మనమంటే వాళ్లు ఏం కావాలి?

2024లో కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేట్లుంది. ఇలాటివి ఎన్నో, ఎన్నెన్నో చేసి చూపిస్తుంది. వాటిని కొన్ని రాష్ట్రాలైనా ప్రతిఘటించక తప్పని పరిస్థితి రావచ్చు. నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా కూర్చోకపోయినా వ్యవసాయ మంత్రి చేతనో, విద్యుత్ మంత్రి చేతనో ప్రదర్శనలు చేయించవచ్చు. అధికార పక్షమే యిలా ఆందోళనకు దిగడంలో అర్థముందా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. ఇవాళ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు ఇదెక్కడి విడ్డూరం? అంటూ అడుగుతున్నారు. కావాలనుకుంటే తనే ధాన్యం కొని వీలువెంబడి కేంద్రానికి అంటగట్టవచ్చు కదా అని కూడా అన్నారు. కొనడానికి డబ్బు లేదంటే కెసియార్‌ను ‘కొత్త సెక్రటేరియట్‌కు డబ్బుంది కానీ దీనికి లేదా?’ అని అడగవచ్చు. మోదీని ‘కొత్త పార్లమెంటుకి డబ్బుంది కానీ దీనికి లేదా?’ అనవచ్చు. ఉప్పుడు బియ్యం తినేవాళ్లు లేరు, నాలుగేళ్లగా మా దగ్గర మేటలు వేసుకుపోతోంది అని ఎఫ్‌సిఐ యిప్పుడంటే ఎలా? రెండేళ్ల క్రితమే హెచ్చరించి వుండాల్సింది.

వాళ్లు సూచించినట్లు కెసియార్ రాష్ట్ర నిధులు వెచ్చించి కొనవచ్చు. అంతమాత్రాన నిరసన తెలపకూడదని మాత్రం అనడానికి వీల్లేదు. సంతోషించవలసిన విషయమేమిటంటే నిరసన ప్రదర్శనల అవసరాన్ని కెసియార్ గుర్తించారు. తెలంగాణ వచ్చాక, తను ముఖ్యమంత్రి అయ్యాక ఎవరూ నిరసన తెలపవలసిన అనవసరం పడదు, పడినా చేయకూడదు అంటూ ఇందిరా పార్కు సమావేశాలపై నిషేధాలు విధించిన పెద్దమనిషి యీ రోజు తనే ఆ పార్కులో కూర్చోవలసి వచ్చింది. అక్కడే వుంది పొయెటిక్ జస్టిస్. నిరసన తెలపడమనేది ప్రజాస్వామిక హక్కు, దాన్ని యీయన యథేచ్ఛగా హరించాడు. మీడియా గొంతు నొక్కాడు. ఈ రోజు ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు.

ఉద్యమసమయంలో ఊరేగింపులపై మామూలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినా, అది ఆంధ్ర పాలకులు దౌష్ట్యం అన్నారు, తెలంగాణ వస్తే అన్ని పార్టీల వాళ్లం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. అలాయ్ బలాయ్ అన్నారు. బండారు దత్తాత్రేయ, జానారెడ్డి, కోదండరాం, కెసియార్ సరేసరి – అన్ని సిద్ధాంతాల వాళ్లూ తెగ కౌగలించుకున్నారు. ఇప్పుడేమైంది? ఒకరి నొకరు నరుకుతామంటున్నారు. బండి సంజయ్ రాక్షసజాతికి చెందిన ఆంధ్రుడు కాదే! సాటి తెలంగాణవాడే! మరి నరకడం దేనికి? కెసియార్ కూడా తెలంగాణ వాడే కదా, చెప్పుదెబ్బలు కొడతాననడం దేనికి? గతంలో ఆంధ్రుల పట్ల వాడిన భాషంతా యిప్పుడు ఒకరిపై మరొకరు వాడుకుంటున్నారు.

ఆర్కే పుస్తక ప్రతులను స్వాధీనం చేసుకోవడమే కాక, ప్రింటింగు ప్రెస్‌పై కూడా కేసులు బనాయించడంతో, వామపక్షవాది హరగోపాల్ తెలంగాణ ఉద్యమంలో కెసియార్‌ను సమర్థించి చారిత్రక తప్పిదం చేశామా అని బహిరంగంగా ఆలోచనలో పడ్డారు. నిజాంను కీర్తించిన కెసియార్‌లో కూడా ఉద్యమసమయంలో ప్రజాస్వామ్యవాది కనబడ్డాడు యీ ప్రొఫెసర్ గారికి. టాంక్‌బండ్‌పై వీరేశలింగం, జాషువా విగ్రహాలను కూల్పించిన హరీశ్ రావు ప్రభృతులలో విప్లవజ్యోతులు కనబడ్డాయి. అప్పట్లో కెసియార్ పరమ భాగవతోత్తముడు. ఆంధ్రకు చెందినందున అన్నమయ్య విగ్రహానికి అర్హుడు కాడు. పిచ్చి ఆంధ్రద్వేషంతో కెసియార్‌ను అందలం ఎక్కించారు. ఎక్కాక ఆయన తన తడాఖా చూపించాడు. ఇప్పుడు తనొక్కడే ఏకైక ఉద్యమకారుడిగా చెప్పుకుంటున్నాడు. చరిత్ర పుస్తకాలలోనూ అదే గ్రంథస్తం అవుతుంది. తన పరిపాలనపై నోరెత్తితే తాట తీస్తున్నాడు.

సమైక్య రాష్ట్రంలో రోజుకో ప్రెస్ మీట్ పెట్టి నినదించిన సామాజిక స్పృహ గళాలు యిప్పుడు ఏ మూగనోము పడుతున్నాయి? కెసియార్ నిరసన స్థలాన్ని అందుబాటులో లేకుండా చేస్తే వీళ్లేం చేశారు? సమైక్య పాలకులు అలా అని వుంటే ఉద్యమం నడిచేదా? మాట్లాడితే తెలంగాణ పౌరుషం, పోరాటాల గడ్డ అంటారు. ఏమైందిప్పుడు? ఎక్కడుంది పౌరుషం? డిస్కమ్‌లకు డబ్బు విదల్చకుండా దివాలా బాట పట్టిస్తున్న ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ కడతానంటే చూస్తూ వూరుకుంటోందేం తెలంగాణ సమాజం? ఎన్నికల ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిథి, సెక్రటేరియట్‌కే రాకుండా యింటి నుంచో, ఫామ్‌హౌస్ నుంచో పాలిస్తూంటే ఎలా సహిస్తోంది యీ పోరాటాల గడ్డ? నిజాం రోజులు మళ్లీ వచ్చాయని హర్షిస్తోందా?

కొందరు బిజెపి వాళ్లు విమర్శలు చేస్తే సరిపోయిందా? ఇప్పటికీ తెరాసదే కదా మెజారిటీ? అన్ని పార్టీల వాళ్లూ తెరాసలోనే, కెసియార్ ఛత్రం కిందే చేరుతున్నారు కదా! ఒకటి రెండు స్థానాలు తప్పిస్తే, వాళ్లే మాటిమాటికి గెలుస్తున్నారు కదా! అంటే తెలంగాణ సమాజం కెసియార్ పోకడలను ఆమోదిస్తున్నట్లేగా! ఫ్యూడల్ వ్యవస్థలో శతాబ్దాలపాటు వుండివుండి, ఆ విధానాన్నే అంగీకరించే స్థితికి వచ్చారు తెలంగాణ ప్రజలు. ఓ రోజు ధనిక రాష్ట్రం అంటావ్, మరో రోజు డబ్బు లేదంటావ్, ఏదో ఒక స్టాండ్ తీసుకో అని గట్టిగా అడగటం లేదే! ఇలా ప్రజలంతా తన చెప్పు కింది తేలులా పడి వున్నా నిరసన తెలపవలసిన అవసరం కెసియార్‌కు పడిందంటే వింతగా వుంది కదూ!

ఆ అవసరం వచ్చేట్లు చేసిన ఘనుడు మోదీ. ఈయన నిజాం అయితే ఆయన మొఘల్ పాదుషా. చర్చ, సంప్రదింపు, ప్రజాస్వామ్యం, అఖిలపక్షం అంటే యీయన కెంత మంటో, ఆయనకీ అంతే! తన మాట వినకపోతే ఎలా అణచాలో యీయన కంటె ఆయనకు బాగా తెలుసు. ఈయనంత నాటకీయంగా ఆయనా మాట్లాడగలడు. తలచుకుంటే దగ్గరకు తీయగలడు, తలచుకోకపోతే ఏళ్ల తరబడి ఎపాయింట్‌మెంట్ యివ్వకుండా ఏడిపించగలడు. అది తెలిసి, మమతా బెనర్జీ తరహాలో పేచీ పెట్టుకునే ధైర్యం లేక, కెసియార్ కేంద్ర విధానాలన్నిటికీ సై అంటూ వచ్చాడు. కానీ యివతల రైతులు తిరగబడుతున్నారు. ఇక తప్పక, గొంతెత్తవలసి వచ్చింది. ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదని రాయబోయే పత్రికలను బెదిరిస్తే అంతిమంగా పాలకులకే నష్టం. సెన్సార్‌షిప్ కారణంగానే ఎమర్జన్సీలో జరిగిన అత్యాచారాలు తన దృష్టికి రాక, ఆంతా బాగానే వుందని అనుకుని ఇందిరా గాంధీ ఎన్నికలు పెట్టింది. ఘోరపరాజయం పొందింది. కెసియార్ కూడా అది గుర్తించాలి. ఈ రోజు తన ధర్నా ద్వారా కేంద్ర విధానాలలో తప్పుని ఎత్తి చూపించినట్లు, యితరులు కూడా తన తప్పులు ఎత్తి చూపించే వెసులుబాటు కల్పించాలి.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గొంతెత్తే విధానం యిదేనా అంటే యిది తప్ప వేరే ఏ దారి వుంది? రాజు తిరుగుబాటుదారుడు కావచ్చా? అంటే వీళ్లు రాజులు కాదు, సామంత రాజులు. చక్రవర్తి దిల్లీలో కూర్చుని తన చిత్తం వచ్చినట్లు పాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అధికారం దక్కుతుందేమోనన్న ఆశ వుంది కాబట్టి తెలంగాణకు మరీ అన్యాయం చేయకపోవచ్చు. అదే ఆంధ్రకు వస్తే అక్కడ ఆ ఆశ లేదు కాబట్టి దానికి ఏదీ విదల్చటం లేదు. బెంగాల్ ఎన్నికల సమయంలో ఎన్ని వాగ్దానాలు చేసింది బిజెపి! సోనార్ బంగ్లా చేసేస్తానంది. తను ఓడిపోవడంతో వాటి మాటే మర్చిపోయింది. ఇలాటి పరిస్థితుల్లో తన రాష్ట్రం బాగు కోరే ముఖ్యమంత్రి సామోపాయం పనిచేయకపోతే కప్పెక్కి గోల చేయవలసినదే! అప్పుడే కేంద్రం సీరియస్‌గా తీసుకోవచ్చు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి కేంద్ర సెక్రటేరియట్‌కు బండెడు ఉత్తరాలు వెళ్లినా చూసే నాథుడు లేడు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మీరు నిధులు విదల్చాలి అని లేఖలు రాస్తే, ఏవో ఒక కొర్రీ లేవనెత్తుతూ ఏళ్లూ, పూళ్లూ గడిపేస్తారు. అదే కనుక ఎన్నికలు జరగబోయే రాష్ట్రమైతే నిధులు వర్షంలా కురుస్తాయి.

సరే, నిరసన తెలపక తప్పదు, కానీ అదేదో దిల్లీలో చేయాలి కానీ యిక్కడెందుకు? అని కొందరు అడగవచ్చు. దిల్లీలో వీళ్ల గోడెవడు వింటాడు? జంతర్ మంతర్ దగ్గర యిలాటివి రోజుకి మూడవుతాయి. అక్కడ గోల్ గప్పా అమ్మేవాడు తప్ప వేరెవడూ వీళ్ల నినాదాలు వినడు. టీవీ కెమెరాలు వాళ్లు వచ్చి ఓ ఐదు నిమిషాలు షూట్ చేసి వెళ్లిపోతారు. రాష్ట్రానికి సంబంధించిన టీవీ ఛానెళ్ల గొట్టాల ముందు మాత్రమే వీళ్లు మాట్లాడగలరు. హిందీ మా మీద రుద్దడానికి వీల్లేదు అని తెల్ల లుంగీల తమిళులు జంతర్‌మంతర్‌లో ప్రదర్శన చేస్తే లోకల్ వాళ్లు వింటారా? అక్కడ చేస్తే లాంఛనప్రాయమే. ఇక్కడ చేస్తేనే ఎఫెక్టివ్. ఈ విషయంలోనే కాదు, అంతర్జాతీయ విషయాలైనా అంతే. ఇండియాలోని ఆఫ్గనిస్తాన్ విద్యార్థులు అమెరికా విధానం పట్ల నిరసన తెలపాలంటే దిల్లీలో అమెరికన్ ఎంబసీ ఎదుటే చేస్తారు తప్ప వాషింగ్టన్‌కు వెళ్లరు.

అలాగే రాష్ట్రాలలోని ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతారు. రైల్వే స్టేషన్లు అప్పనంగా దొరుకుతాయి. క్రమంగా ప్రయివేటేజేషన్ అయిపోతూ వుంటే వచ్చే సంవత్సరాలలో కేంద్ర సంస్థ అంటూ లేకుండా పోతుంది. అప్పుడు ప్రధాని బొమ్మ ఒకటి పెట్టుకుని దాని ముందు చేయాల్సి వస్తుంది. ఆఖరుగా చెప్పవలసిన దేమిటంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిరసన చేయడంలో, అది హైదరాబాదులోనే చేయడంలో సబబు వుంది. మనం కోరుకోవాల్సిన దేమిటంటే కెసియార్ యింతటితో ఆగిపోకుండా, కేంద్రం పొరబాటు చేసినప్పుడల్లా యిలాటి నిరసనలు చేయాలని! దానితో బాటు తను పొరబాటు చేసినప్పుడు యితరులు నిరసన తెలుపుతూంటే వాటినీ ప్రోత్సహించక పోయినా, అనుమతించాలని!

కొసమెరుపు - ‘ఊరూరా కేంద్రంపై చావుడప్పు మోగిస్తాం. దిల్లీకి యాత్ర చేపడతాం. ఉత్తర భారతంలోని రైతుల పోరాటాలను కలుపుకుని భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే దేశ రైతుల సమస్యలపై తెరాసయే నాయకత్వం తీసుకుని పోరాడుతుంది.’ అని కెసియార్ నినదించిన మర్నాడే మోదీ గడగడ వణికి వివాదాస్పదమైన సాగు చట్టాలను రద్దు చేశాడని తెలంగాణ వ్యవసాయ మంత్రి ఘనంగా చెప్పుకుంటున్నారు. లేకపోతే ఉత్తరాది రైతులు ఏడాదికి పైగా రాస్తారోకో చేసి దిల్లీని స్తంభింపచేసినా, ప్రాణత్యాగం చేసినా కేసులు పెట్టి వేధించిన మోదీ, యుపిలో నిరసన తెలుపుతున్న రైతుల మీదుగా కేంద్రంమంత్రి కుమారుడు దుర్మార్గంగా కారు తోలి, ప్రాణాలు తీసినా చలించని మోదీ, కెసియార్ దీక్షకు కూర్చున్న ఒక్క రోజుకే స్పందించి తన స్వభావానికి విరుద్ధంగా తాను దగ్గరుండి చేయించిన చట్టాలను వెనక్కి తీసుకున్నాడంటే కెసియార్ ఘనత తప్ప మరేమైనానా? అని తెరాస వారు ప్రకటించుకుంటున్నా ఏమీ అనలేం. ఈ సందర్భంలో నాకు ‘‘బొమ్మా బొరుసూ’’లో ముళ్లపూడి వెంకటరమణగారు తమ గురించి రాసుకున్న యీ వ్యాసభాగం గుర్తుకు వచ్చింది.

‘..రమణ మొదటి రాత, బాపు మొదటి గీత 1945లో అచ్చయ్యాయి. ఇద్దరికీ ఐదేసి రూపాయలు పారితోషికం యిచ్చారు. ఆ దెబ్బకి షాకు తిన్న జర్మనీ జపాను వాడులు ఓడిపోయీ, ప్రపంచ యుద్ధం ఠపీమని ఆగిపోయీ, శాంతిదేవత చిందులేసి ఆనందనృత్యం చేసీ, అమెరికాలో అధ్యక్షులు (ట్రూమన్) అమెరికాలోని భారతీయులు పౌరసత్వానికి అర్హులు సుమా అంటూ సంతకం చేసీ.. మహప్రభో! ఇహ చెప్పలేను..’

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!