cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కేరళ ఎన్నికలు

ఎమ్బీయస్: కేరళ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో 140 స్థానాలున్న కేరళ ఒకటి. 1977లో తప్ప కేరళీయులు ప్రతీ ఐదేళ్లకు ప్రభుత్వపు అట్టు తిరగేస్తూనే వున్నారు. 2016 ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు 91 స్థానాలు వచ్చి అధికారంలోకి వచ్చింది. (సిపిఎంకు 27% ఓట్లతో 58, 8% ఓట్లతో సిపిఐకు 19, యితరులకు 14) యుడిఎఫ్‌కు 47 స్థానాలు వచ్చాయి. (కాంగ్రెసుకు 24% ఓట్లతో 22, ఐయుఎంఎల్‌కు 7% ఓట్లతో 18, కెసి(మాని)కి 6, కెసి(జె)కి 1) వచ్చాయి. 1-2% ఓట్ల తేడాతోనే అధికార మార్పిడి జరుగుతూంటుంది. ఈ కూటమిలోంచి ఆ కూటమిలోకి గెంతేవాళ్ల వలన (ఈ మధ్య యుడిఎఫ్ నుంచి  కెసి(ఎమ్), ఎల్‌జెడి ఎల్‌డిఎఫ్‌కు ఫిరాయించాయి) కూడా మార్పు వస్తుంది. 5% వరకు తటస్థ ఓటర్లున్నారని, తక్కినవాళ్లందరూ పార్టీలకు కట్టుబడే ఓటేస్తారని పరిశీలకులంటారు.

2019 పార్లమెంటు ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో యీసారి మార్పు తథ్యమనే అనిపించింది. దేశమంతా మోదీ హవా వీచినా బిజెపికి 1 స్థానమే వచ్చింది. యుడిఎఫ్‌కు 19 సీట్లు వచ్చాయి. ఆ తీర్పును అసెంబ్లీ నియోజకవర్గాలుగా తర్జుమా చేసి చూస్తే యుడిఎఫ్‌కు 123 స్థానాలు (దానిలో కాంగ్రెసుకు 96), సిపిఎంకు 16, బిజెపికి 1 రావాలి. లెఫ్ట్ కూటమి కేరళ వరదల్లో బాగా పనిచేసి పేరు తెచ్చుకున్నా, శబరిమల ఉద్యమం ధాటికి కాబోలు చతికిలపడింది. మహిళలను అనుమతించ కూడదంటూ కాంగ్రెసు బిజెపిని మించి హంగామా చేసింది. దరిమిలా 6 స్థానాల కెసి (మాని) యుడిఎఫ్‌ నుంచి ఎల్‌డిఎఫ్‌కు ఫిరాయించింది కాబట్టి యుడిఎఫ్‌కు 117, ఎల్‌డిఎఫ్‌కు 22 రావాలంతే.

కానీ మార్చి 25 నాటి టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే లెఫ్ట్ కూటమికి 77, యుడిఎఫ్‌కు 62 (తక్కిన 1 బిజెపికి) వస్తాయని చెపుతోంది. ఎందుకిలా అంటే మధ్యలో 2020 డిసెంబరులో స్థానిక ఎన్నికలు జరిగాయి. 30 ఏళ్లగా అధికారంలో ఉన్న ప్రభుత్వమేదీ స్థానిక ఎన్నికలలో గెలవలేదు. పైగా సరిగ్గా దానికి ముందే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో యిరుక్కున్నాడు. సిపిఎం రాష్ట్ర సెక్రటరీ కొడియేరి బాలకృష్ణన్ కొడుకు డ్రగ్ సరఫరా కేసులో యిరుక్కున్నాడు. అయినా స్థానిక ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ విజయం సాధించింది. దాన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా తర్జుమా చేస్తే 101 సీట్లు వస్తాయి. యుడిఎఫ్‌కి 38 వస్తాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే ఎల్‌డిఎఫ్ ఆ 101లో 24 యుడిఎఫ్‌కు పోగొట్టుకుంటుంది.

యుడిఎఫ్ పుంజుకోవడానికి కారణం ఊమెన్ చాండీ ప్రచార కమిటీ చైర్మన్‌గా వచ్చి కాంగ్రెసులో అంతఃకలహాలను సర్దుబాటు చేయడం, రాహుల్, సోనియాలు కేరళలో విస్తారంగా తిరిగి ప్రచారం చేయడం, ముస్లిములు కాంగ్రెసుకి పూర్తి మద్దతుగా నిలవడం అంటున్నారు. బిజెపి యిప్పటివరకు లెఫ్ట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. హిందూత్వ నినాదాలతో నాయర్ల వంటి కొన్ని కులాలను బిజెపి ఆకర్షిస్తోందని గమనించి కాంగ్రెసు బిజెపిని మించిన హిందూత్వం ప్రదర్శిస్తోంది యిటీవల. ముఖ్యంగా శబరిమల విషయంలో అది బాగా బయటపడింది. దాంతో హిందూత్వ విధానాలను వ్యతిరేకించే వర్గాలన్నీ కాంగ్రెసును విడిచిపెట్టి, లెఫ్ట్ వైపే పూర్తిగా మొగ్గుతున్నాయి.

ఇది బిజెపి గమనించి, తన ప్రధాన శత్రువుగా కాంగ్రెసును గుర్తించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు స్థానంలో తను వస్తే ఆ పై లెఫ్ట్‌తో తలపడవచ్చని అనుకుంది. కాంగ్రెసుకి అండగా వుంటున్న క్రైస్తవ మైనారిటీలను దువ్వడానికి చూస్తోంది. ఇది గమనించిన ముస్లిములు తాము కాంగ్రెసుకు అండగా నిలవకపోతే లెఫ్ట్, బిజెపిలే ప్రధాన పక్షాలుగా మిగులుతాయని అర్థం చేసుకుని, కాంగ్రెసు వైపు పూర్తిగా మొగ్గింది. దీనివలన యుడిఎఫ్ బలం పెరగవచ్చని అంచనా. కేరళ జనాభాలో 55% మంది హిందువులు. 27% ముస్లిములు. 18% క్రైస్తవులు. సాధారణంగా మైనారిటీలు అనగానే అనేక రాష్ట్రాలలో పేదలు, డబ్బు కోసం మతం మారినవాళ్లు గుర్తుకు వస్తారు. ఇక్కడ అలాటి పరిస్థితి కాదు.

వేలాది సంవత్సరాల క్రితమే తీర ప్రాంతానికి వచ్చి వాణిజ్యం ద్వారా బలపడిన మైనారిటీలు వీళ్లు. తమకంటూ కంపెనీలున్నాయి, చర్చిలు, మసీదులు వున్నాయి. పత్రికలున్నాయి. రాజకీయపరమైన పలుకుబడి వుంది. సంఖ్య ఎక్కువ కావడంతో క్రైస్తవులలో భిన్నభిన్న వర్గాలు, వాళ్ల మధ్య పోటీలు, పేచీలు, వారికి అంటిపెట్టుకున్న వేర్వేరు పార్టీలూ వున్నాయి. తొలినాళ్ల కమ్యూనిస్టులు మతాచారాలకు వ్యతిరేకంగా పోరాడడంతో వీళ్లు కాంగ్రెసునే అంటిపెట్టుకుని వున్నారు. హిందువుల్లో కూడా కులాల వారీగా అనేక పార్టీలు పుట్టుకుని రావడంతో ఎవరికీ సొంతబలం లేక, కూటమిగా ఏర్పడితే తప్ప అధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది.

చర్చిలు సమర్థించే పార్టీలు అటూయిటూ మారుతూ వుంటాయి కానీ ముస్లిముల పార్టీలలో అతి పెద్ద పార్టీ, బలమైన పార్టీ ఐన ఐయుఎమ్ఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిము లీగ్) 1960 నుంచి నాలుగైదు సంవత్సరాలు లెఫ్ట్‌తో కలిసి నడిచింది తప్ప తక్కిన సమయమంతా కాంగ్రెసునే అంటిపెట్టుకుని వుంది. మళప్పురమ్ జిల్లాలో వాళ్లకు ఎదురే లేదు. లెఫ్ట్ వాళ్లని చీల్చి, బయటకు వచ్చిన పార్టీలను సమర్థిద్దామని చూసినా వర్కవుట్ కాలేదు. ఇటీవలి కాలంలో ఐయుఎమ్‌ఎల్ నాయకులు తమ వ్యాపారప్రయోజనాల కోసం రాజీపడుతూ, ఉండవలసినంత చురుగ్గా వుండటం లేదని ఆరోపిస్తూ జమాతే ఇస్లామీ రాజకీయ విభాగమైన వెల్‌ఫేర్ పార్టీ తలెత్తింది. దానితో కాంగ్రెసు రహస్య ఒప్పందం చేసుకుందని, ఆ కారణంగా ఐయుఎమ్ఎల్ అలిగిందని వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెసు, ఐయుఎమ్ఎల్ కలిసికట్టుగా బిజెపిని, లెఫ్ట్‌ను ఎదిరించడానికి పోరాడుతున్నాయి.

లెఫ్ట్ కూటమి విజయం సాధించిందంటే ఆ ఘనత విజయన్‌కే పోతుంది. 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యేవరకూ విజయన్‌కు అంత మంచి పేరు లేదు. తక్కిన సిపిఎం నాయకులు కష్టపడి పైకి వచ్చినవారు కాగా యితను మాస్ లీడరు కాదు. పార్టీ ఆఫీసులోనే వుంటూ వచ్చాడని, ఎవరితో కలవడని, అహంభావి అని పేరు వుంది. లావాలిన్ స్కాండల్‌లో అతని పేరు యిరుక్కుంది. అయితే అది తన సొంతానికి కాకుండా పార్టీ నిధుల కోసం తీసుకున్నాడు కాబోలు, పార్టీ అతన్ని వెనకేసుకుని వచ్చింది. 2016లో పెద్ద వయసులో ఎంతో కష్టపడి ప్రచారం చేసిన అచ్యుతానందన్‌ని కాకుండా, విజయన్‌ను ముఖ్యమంత్రి చేయడం అన్యాయం అనిపించింది.

కానీ విజయన్ పూర్తిగా ప్రొఫెషనల్‌లా పనిచేశాడు. ప్రభుత్వసర్వీసులలో టెక్నాలజీని పెంచాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో చీఫ్ ఎకనమిస్టుగా చేసిన గీతా గోపీనాథ్‌ను సలహాదారుగా పెట్టుకున్నాడు. ప్రభుత్వాఫీసుల్లో పంక్చువాలిటీని బాగా అమలు చేశాడు. ‘హరితకేరళం’, ఆర్ద్రం’ వంటి 4 మిషన్ల ద్వారా పర్యావరణం, వేస్ట్ మేనేజ్‌మెంట్, హైటెక్ క్లాస్‌రూమ్స్, పేదలకు యిళ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చేశాడు. ‘నవకేరళం’ పేర మార్కెట్లలో నోక్కుకూలీ వ్యవస్థను రద్దు చేసి పార్టీ శ్రేణులను అదుపులో పెట్టాడు. పార్టీ కూడా ప్రభుత్వవ్యవహారాల్లో కలగజేసుకోకుండా యితనికి సహకరించింది.

ఏమైతేనేం, మితభాషి, చేతల మనిషిగా విజయన్ అందరి ఆదరాన్నీ పొందాడు., అవతలివాళ్లు హద్దుమీరి మాట్లాడినా యితను మర్యాదగానే సమాధానమిస్తాడు. అట్టహాసం లేకుండా అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపడంతో మేధావులు, యూత్ యితన్ని అభిమానించ సాగారు. కోవిడ్ సమయంలో 2.50 కోట్ల యిళ్లకు కిట్స్ సప్లయి చేయడంతో, 55 లక్షల మందికి నెలనెలా రూ.1600 చొప్పున పెన్షన్ యివ్వడంతో గుడ్‌విల్ కూడా బాగా వచ్చింది. వరదల్లో అతను చేసిన కృషి చూసి, సిఎం డిజాస్టర్ ఫండ్‌కి దాదాపు రూ.5 వేల కోట్లు విరాళాలు వచ్చాయి. కోవిడ్ సమయంలో దాదాపు రూ.500 కోట్లు వచ్చాయి. ఇళ్లు లేనివారికి యిళ్లు కడతాం, భూదానం చేయండి అంటే 100 ఎకరాలు వచ్చాయి.

కేరళకు వరుసగా రెండేళ్లు వరదలు, ఓఖీ తుపాను, వచ్చినపుడు యితను చేపట్టిన సహాయకార్యక్రమాలు అందరి మెప్పూ పొందాయి. నీఫా వైరస్, కరోనా సమయంలో కేరళ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసిందని అందరూ మెచ్చుకున్నారు. తర్వాత కరోనా మళ్లీ విజృంభించినా, కట్టడి చేయడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోందని కూడా ప్రజలు భావించారు. ఈ ఐదేళ్లలో పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా రాలేదు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో శివశంకర్‌కు మకిలి అంటింది, విజయన్‌కు కూడా అంటిద్దామని ప్రయత్నం చేశారు కానీ యింకా సఫలం కాలేదు. విచారణ పూర్తయితే తప్ప పూర్తి విషయాలు బయటకు రావు. ఇవే స్థానిక ఎన్నికలలో లెఫ్ట్ కూటమికి విజయాన్ని అందించాయి. అసెంబ్లీ ఎన్నికలలో అది కొంతమేరకైనా పునరావృతమౌతుందని సర్వే అంచనాలు.

బిజెపి విషయానికి వస్తే రాష్ట్రశాఖను 1981లో తెరిచారు. ఎప్పుడూ ఆటల్లో అరటిపండుగానే వుంటూ వచ్చింది. అయితే మోదీ వచ్చిన దగ్గర్నుంచి కేరళపై బాగా దృష్టి పెట్టారు. ఇప్పుడు దేశం మొత్తంలో అత్యధిక ఆరెస్సెస్ శాఖలున్న రాష్ట్రం కేరళయే. 2016లో రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాల్ నిలబడిన నేమమ్ నియోజకవర్గంలో కాంగ్రెసు కావాలని పోటీ చేయకుండా బలహీనంగా వుండే ఎన్‌సిపికి ఆ స్థానం కేటాయించి లెఫ్ట్ కాండిడేటుపై బిజెపి గెలిచేందుకు సాయపడింది. బిజెపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని ప్రచారం కావడంతో యీసారి ఆ నియోజకవర్గం నుంచి తన పార్టీకి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బిజెపి ప్రస్తుత తమ రాష్ట్ర అధ్యక్షుడైన సురేంద్రన్‌ని నిల్చోబెట్టింది. దాని ఓటింగు శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో 10%, 2016లో 15%, 2019లో 16%, స్థానిక ఎన్నికలలో మొత్తం మీద 16% వచ్చినా, 42 నియోజకవర్గాల్లో 20% కంటె ఎక్కువ వచ్చింది.  2016లో ఏడు స్థానాల్లో రెండవ స్థానంలో వుంది. ఈసారి 25 స్థానాల్లో తన ప్రభావం చూపగలదని అంచనా.

చాలాకాలంగా అనేక రాష్ట్రాలలో కొన్ని కులాలు కొన్ని పార్టీలకు ఓటేయడం ఆనవాయితీ అయిపోయింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా బిజెపి వాటిని ఉపకులాలుగా విడగొట్టి వారిలో మైనారిటీ వర్గానికి మద్దతిచ్చి ఆ కులం యొక్క ఆధిపత్యానికి గండి కొట్టి విజయం సాధిస్తోంది. కేరళకు వచ్చేసరికి మైనారిటీలు 45% మంది ఉన్నారు. వాళ్లంతా సాంప్రదాయకంగా బిజెపికి వ్యతిరేకులే. అందువలన 27% ముస్లిములను పక్కన పెట్టి 18% క్రైస్తవులను మంచి చేసుకోవడానికి ప్రయత్నించింది. సిరియన్ క్రైస్తవ చర్చిల్లో ఆర్థోడాక్స్ వర్గానికి, జాకొబైట్ వర్గానికి మధ్య ఆస్తి తగాదాలు చాలాకాలంగా వున్నాయి. వీళ్ల మధ్య తగవు తీర్చడానికి ఆ చర్చి అధిపతులతో మోదీ స్వయంగా సమావేశమయ్యారు. మాళంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి బిషప్పులు ఆరెస్సెస్ నాయకుడు మన్‌మోహన్ వైద్యతో కోచిలో సమావేశమయ్యారు.

ముస్లిములు కాంగ్రెసును తమకు అనువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రతిగా తాము బిజెపితో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ చర్చి అధికారులు భావిస్తున్నారట. అందుకే యీ చర్చలు, రాయబేరాలు. పైగా యింకో కోణం కూడా వుంది. ఈ చర్చిలన్నిటికీ విదేశీ సంస్థల నుంచి విరాళాలు వస్తూ వుంటాయి. వాటి సహాయంతోనే వాళ్లు యిక్కడ ఆస్తులు సంపాదించి, స్కూళ్లు, ఆసుపత్రులు, కాంప్లెక్సులు కట్టి, పార్టీలు నడుపుతూ పలుకుబడి పెంచుకుంటూ వుంటారు. విదేశీ విరాళాల విషయంలో సవాలక్ష ప్రశ్నలు వేసి, అనుమానాలు తెచ్చుకుని, యిబ్బంది పెట్టే అవకాశం కేంద్ర సంస్థలకు వుంది. బిజెపితో సహకరించకపోతే యిది కూడా ఎదుర్కోవడానికి వీళ్లు సిద్ధపడాలి. కాంగ్రెసు ఓటు బ్యాంకు నుంచి కనీసం కొంతమంది క్రైస్తవులను విడగొట్టడం ద్వారానైనా 15 సీట్లు గెలవగలమని బిజెపి అనుకుంటోందట.

బిజెపి నెగ్గితే కాబోయే ముఖ్యమంత్రి అంటూ మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను తీసుకురావడంలో విజ్ఞత కనబడదు. 75 ఏళ్లు దాటినవారు రాజకీయాల్లో వుండకూడదంటూ అడ్వానీ, మురళీమనోహర్ జోషీలను పక్కన బెట్టిన మోదీ, అమిత్, 88 ఏళ్లాయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడమేమిటి? పైగా ఆయనకు ఆరెస్సెస్ సిద్ధాంతాలతో ముఖపరిచయం కూడా వుందో లేదో! అసలాయన రాజకీయాలే కాదు, పౌరసమస్యలు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఆయన ఒక టెక్నోక్రాట్ అంతే. కేరళ వంటి హైలీ పొలిటిసైజ్‌డ్ క్షేత్రంలో ఆయన రాజకీయాల్లో నెగ్గుకు రాగలడని ఏ మలయాళీ అనుకోడు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన కేరళ అంతా విస్తారంగా పర్యటించినట్లు, ప్రచారం చేసినట్లు వార్తలు చూడలేదు. బిజెపి చేస్తున్న బృహత్ ప్రయత్నాలు కొంతమేరకైనా ఫలిస్తే 23% ఓట్లు తెచ్చుకుని ఒక 7 సీట్ల దాకా తెచ్చుకుంటుందని ఒక పరిశీలన. కాంగ్రెసును దెబ్బ తీసే అది ఎదగగలదని, లెఫ్ట్‌కి అధికారం దక్కకుండా చేయలేదని అంటున్నారు. ఈ సర్వే మాత్రం దానికి ఒక సీటే వస్తుందంటోంది. చూదాం ఫైనల్‌గా ఎన్ని వస్తాయో!

ఇక లెఫ్ట్ ఫ్రంట్‌కు యిది జీవన్మరణ సమస్యే. దేశంలో మరే చోటా లెఫ్ట్ అధికారంలో లేదు. ఒకసారి కలకత్తాలో ‘‘హేజ్ లెఫ్ట్ ఎనీ ఫ్యూచర్ ఇన్ ఇండియా?’’ అనే అంశంపై చర్చ జరిగింది. వక్తల్లో ఒకరైన చో రామస్వామి ‘‘ఇఫ్ లెఫ్ట్ హేజ్ ఎనీ ఫ్యూచర్ ఇన్ ఇండియా, ఇండియా యీజ్ లెఫ్ట్ విత్ నో ఫ్యూచర్’’ అని చమత్కరించి, అందర్నీ నవ్వించారు. అలాగ యిప్పుడు కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోతే ‘‘లెఫ్ట్ హేజ్ నథింగ్ లెఫ్ట్ టు గవర్న్’’ అనవచ్చు. (ఫోటో - విజయన్, చాండీ, శ్రీధరన్)

-  ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×