Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కేరళ గవర్నరు ఆరిఫ్‌ ఖాన్‌

 ఎమ్బీయస్‌: కేరళ గవర్నరు ఆరిఫ్‌ ఖాన్‌

2019 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న కేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవికి నిన్ననే నియామకం జరిగింది. ఇక యిప్పటికైనా కేరళ గవర్నరు ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు తీరిక దొరుకుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే 2019 సెప్టెంబరులో పదవి చేపట్టిన దగ్గర్నుంచి కేరళ ప్రభుత్వాన్ని చీకాకు పెడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి భారం కూడా ఆరిఫే మోస్తున్నాడని విమర్శలున్నాయి. కేంద్రమంత్రి వి మురళీధరన్‌ శిష్యుడు కె సురేంద్రన్‌కు రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించారు. ఆ ఫంక్షన్‌కు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌, మాజీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజగోపాల్‌ వగైరాలు హాజరు కాగా, ఆ పదవి ఆశించి భంగపడిన ముగ్గురు రాష్ట్ర సెక్రటరీలు - శోభా సురేంద్రన్‌, ఎంటి రమేశ్‌, ఎఎన్‌ రాధాకృష్ణన్‌ సమయానికి రాకుండా తమ అసంతృప్తిని ప్రకటించారు. వీళ్లు పార్టీలోని పికె కృష్ణదాస్‌ వర్గానికి చెందినవారు. అతను మాత్రం ఫంక్షన్‌కు వచ్చాడు.

49 ఏళ్ల సురీంద్రన్‌ ఎబివిపి ద్వారా ప్రజాజీవితంలోకి వచ్చాడు. బిజెపి యువమోర్చాకు అధ్యక్షుడిగా, రాష్ట్రశాఖకు పదేళ్లపాటు జనరల్‌ సెక్రటరీగా ఉన్నాడు. శబరిమలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమసారథ్యం కారణంగా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు అధ్యక్షుడిగా చేసిన పిఎస్‌ శ్రీధరన్‌ పిళ్లయ్‌ను మిజోరాం గవర్నరుగా వేయడంతో యితనికి యీ ఛాన్సు వచ్చింది. రాబోయే స్థానిక ఎన్నికలలో 2021 మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించే బాధ్యత అతని భుజస్కంధాలపై ఉంది.

ఇక ఆరిఫ్‌ గురించి చెప్పుకోవాంటే - అతనికి యిన్నాళ్లూ ఉన్న గుర్తింపు ఉదారవాది ఐన ముస్లిము లీడరుగా. ముస్లిం ఛాందసవాదాన్ని ఎదిరించడానికి ఏ పార్టీకి చెందిన ముస్లిం నాయకుడూ సాహసం చేయడు. అలా చేస్తే ఓట్లు పడవని భయం. కానీ ఆరిఫ్‌ చిన్నప్పటి నుంచి ముస్లిం ఆలోచనాసరళిలో మార్పు రావాలని, ఆధునికత వైపు మొగ్గాలని, ముల్లాలను, మౌల్వీలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని, ప్రస్తుతం ఇస్లాంలో అనుసరిస్తున్న అనేక దురాచారాలు ఖురాన్‌లో లేవనీ వాదిస్తూ, పుస్తకాలు రాస్తూ వచ్చాడు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్శనల్‌ లా బోర్డును రద్దు చేయాలని వాదించాడు. ఒట్టి చెప్పడమే కాదు, దాని కోసం తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు. అందువలన అన్ని మతాలకు చెందిన మేధావుల, తటస్థుల గౌరవాన్ని పొందుతూ వచ్చాడు. అయితే యిటీవల అతను పూర్తిగా మోదీ మార్గంలోకి వచ్చేశాడు. మోదీ-అమిత్‌ ఏం చేసినా భేషంటున్నాడు. అననివారిని పడతిడుతున్నాడు. ఈ మార్పును అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.

68 ఏళ్ల ఆరిఫ్‌ ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో పుట్టాడు. ఆలీఘర్‌ ముస్లిము యూనివర్శిటీలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాలేజీ బయటకు వస్తూనే చరణ్‌ సింగ్‌ నాయకత్వంలోని భారతీయ క్రాంతి దళ్‌ అభ్యర్థిగా బులంద్‌ శహర్‌లోని సియానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత  ఆ పార్టీ జనతాపార్టీలో విలీనమయ్యాక, ఆ పార్టీ అభ్యర్థిగా 1977లో నెగ్గి, తన 26వ ఏట ఎమ్మెల్యే అయ్యాడు. జనతాపార్టీ విచ్ఛిన్నం కావడంతో అతను చరణ్‌ సింగ్‌ను వదిలిపెట్టి, ఇందిర నేతృత్వంలోని కాంగ్రెసులో చేరి 1980లో కాన్పూర్‌ నుంచి ఎంపీగా నెగ్గాడు. ఇందిర మరణం తర్వాత రాజీవ్‌ నేతృత్వంలో 1984లో బహరైచ్‌ నుండి నెగ్గాడు. రాజీవ్‌ అతనికి సహాయ మంత్రి పదవి యిచ్చాడు.

1986లో షా బానో కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేస్తే ముస్లిము ఓటర్లకు కోపం వస్తుందనుకుని ప్రధానిగా ఉన్న రాజీవ్‌ ముస్లిం పర్శనల్‌ లా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఆ అంశంపై రాజీవ్‌తో విభేదించి ఆరిఫ్‌ కాబినెట్‌ నుంచి, కాంగ్రెసు నుంచి బయటకు వచ్చేసి జనతా దళ్‌లో చేరాడు. విపి సింగ్‌ నేతృత్వంలో ఆ పార్టీ ద్వారా 1989లో లోకసభకు మళ్లీ ఎన్నికయ్యాడు. కాబినెట్‌లో సివిల్‌ ఏవియేషన్‌, ఎనర్జీ మంత్రిగా పని చేశాడు. మళ్లీ కొద్ది కాలానికి ఆ పార్టీ కూడా వదిలేసి బహుజన సమాజ్‌ పార్టీలో చేరి ఆ పార్టీ టిక్కెట్టు ద్వారా 1998లో ఎంపీ అయ్యాడు. 2004లో ఆ పార్టీ కూడా వదిలేసి బిజెపిలో చేరాడు. కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇంకో మూడేళ్లు పోయాక, అవినీతిపరులకు టిక్కెట్లు యిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీలోంచి కూడా బయటకు వచ్చేశాడు.

ఇలా ఏ పార్టీలోనూ యిమడలేక, రాజకీయంగా ముందుకు సాగలేక కాలక్షేపం చేస్తున్న ఆరిఫ్‌ యిటీవల మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అతన్ని మెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఆరిఫ్‌కు ఫేవరేట్‌ అంశమైన ముమ్మార్‌ తలాక్‌ విషయంలో మోదీ చేసిన చట్టం అతన్ని ఆనందపరచింది. ఆ చట్టంలో ఆ రకం విడాకులు చెల్లవని చెప్పడంతో బాటు భర్తకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం కల్పించడం ఆరిఫ్‌కు తప్పుగా తోచలేదు. ఆ బిల్లు పాస్‌ చేసినప్పుడు అభినందించడమే కాదు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పుడు కూడా ఆరిఫ్‌ జయజయధ్వానాలు పలికాడు. ప్రస్తుత సమాజంలో ముస్లింల వేధింపు సాగుతోందనే వాదన తప్పని వాదిస్తున్నాడు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ దాడులు ఏవీ జరగలేదని సర్టిఫికెట్టు యిచ్చాడు.

‘గోమాంసం తింటున్నారన్న అనుమానం మీదనే ఇళ్లల్లో చొరబడి కొడుతున్నారు, పాల వ్యాపారులను కూడా గుంపుహత్యలు చేస్తున్నారుగా’ అని అడిగితే ‘ఒకళ్ల తిండి గురించి మరొకరు మాట్లాడనక్కరలేదు. అదంతా భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. కశ్మీరు ముస్లిములు గోమాంసం తినరు, బెంగాలీ బ్రాహ్మణులు చేపలు తింటారు’ అంటూ ఉపదేశాలు చెప్పాడు తప్ప గుంపుహత్యలు జరిగాయని ఒప్పుకోవటం లేదు. ఉమ్మడి పౌరస్మృతిని త్వరలోనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్న బిజెపికి ఆరిఫ్‌ పోస్టర్‌ బాయ్‌గా పనికి వస్తాడనిపించింది. ఎందుకంటే ఉదారవాదియైన ముస్లిముగా అతనికి ఖ్యాతి వుంది. అతనే ఈ ఉమ్మడి పౌరస్మృతిని మెచ్చుకున్నాడు చూడండి అని చెప్పుకోవచ్చు.

ముస్లిములకు టిక్కెట్టివ్వం, ఎమ్మేల్యేలు, ఎంపీలు కానివ్వం. వాళ్లకు రాజకీయాధికారం లేకుండా మేం చేసిన, చేస్తున్న మార్పు, మాకు అనుకూలంగా సమాజంలో తెస్తున్న మార్పు ఆమోదించే విధంగా ముస్లిములు మారవసిన అవసరం ఉంది. ఇదిగో యీయన్ని చూసి నేర్చుకోండి. అని బిజెపి నాయకత్వం వారు చెప్పదలచుకున్నారు.  అందువలన ఆరిఫ్‌ను లైమ్‌లైట్‌లోకి తీసుకుని వచ్చారు. బిజెపిని అవినీతి పార్టీ అని ఆరోపించి బయటకు వెళ్లిపోయినా, గౌరవమిచ్చి 2019 సెప్టెంబరులో కేరళకు గవర్నరుగా వేశారు. బిజెపి యిప్పటిదాకా నజ్మా హెపతుల్లా అనే ముస్లిం మహిళను మణిపూర్‌ గవర్నరుగా వేసింది. ఇతను రెండో ముస్లిం గవర్నరు.

ఇలా వుండగానే సిఏఏ, ఎన్నార్సీ, ఎన్పీయార్‌ వివాదం మొదలైంది. కేరళను పాలిస్తున్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం సిఏఏ చట్టాన్ని, ఎన్పీయార్‌ తయారీని ప్రతిఘటిస్తోంది. ఇక ఆరిఫ్‌కు చేతినిండా, నోటినిండా పని దొరికింది. ముఖ్యమంత్రితో అనుక్షణం ఆ విషయంపై పోట్లాడుతున్నాడు. సిఏఏ చట్టాన్ని ఆకాశానికి ఎత్తివేస్తూ ‘‘గాంధీ, నెహ్రూ, కాంగ్రెసు దేశప్రజలకు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ఉందీ బిల్లు’’ అని అన్నాడు. వాళ్లెవరూ మతపరమైన వివక్షత చూపించాని కోరలేదన్న సంగతి అతి సౌకర్యంగా మర్చిపోతున్నాడు. ‘‘పాకిస్తాన్‌లో అహ్మదీయాలు, షియాలు మైనారిటీలే కదా, వాళ్ల పేర్లు ఎందుకు చేర్చలేదు?’’ అని అడిగితే ‘‘అవును మైనారిటీలే, కానీ వాళ్లెవరూ ఇండియాకు రారు. అందుకని చేర్చలేదు.’’ అని అన్నాడు. అలాటప్పుడు క్రైస్తవుల పేరు ఎందుకు చేర్చినట్లు? వాళ్లు వెళ్లడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయిగా, అందరికీ ఇండియాయే దొరికిందా అని జర్నలిస్టు అడగలేదనుకోండి.

ఆరిఫ్‌ యిలా సిఏఏ, ఎన్నార్సీ, ఎన్పీయార్‌ను ఆకాశానికి ఎత్తేస్తూండగానే మరో పక్క కేరళ ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తోంది. జనవరి 20న కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తూ ‘ప్రస్తుత ఫార్మాట్‌లో ఎన్‌పిఆర్‌ నిర్వహిస్తే రాష్ట్రంలో ఆందోళనలు పెరిగి, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పోలీసులు చెప్తున్నారు. అందువన మేము దాన్ని నిర్వహించలేము.’ అంది. అది గవర్నరుకి రుచించలేదు. గవర్నరు ప్రవర్తన పట్ల కేరళ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఆయన 2019 డిసెంబరు 29న కన్నూరు యూనివర్శిటీలో ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెసులో యీ విషయమై చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌తో ఘర్షించినపుడు సభలో ఉన్నవారు గవర్నరుకు వ్యతిరేకంగా కేకలు వేశారు. మర్నాడే కేరళ అసెంబ్లీ సిఏఏ చట్టాన్ని వెనక్కి తీసుకోమని కేంద్రాన్ని కోరుతూ దాదాపు ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసింది. దాన్ని కేంద్రప్రభుత్వం పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా గవర్నరు మాత్రం పట్టించుకున్నాడు. ‘పౌరసత్వం అనేది కేంద్రానికి సంబంధించిన అంశం. దాని గురించి రాష్ట్రం చర్చిండమంటే టైము వేస్టు చేసినట్టే. ప్రజాధనాన్ని వృథా చేసినట్లే’ అని ప్రకటించాడు. అసలు గవర్నరు వ్యవస్థే దండగమారిది, దానిపై ప్రజాధనం ఖర్చు పెట్టడం వృథా అనే వ్యాఖ్య గురించి ఆరిఫ్‌ ఏమంటారో మరి!

కొద్ది నెలల్లో జరపవసిన స్థానిక ఎన్నికలకై వార్డులను డీలిమిట్‌ చేస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు తయారు చేసి ఆయన సంతకానికై పంపితే ‘‘సిఏఏ లాటి అంశాలపై చర్చించడానికి టైముంది కానీ, దీనికి లేదా? ఆర్డినెన్సుపై సంతకం పెట్టను, కావాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టమనండి’’ అంటూ తిరస్కరించాడు. దీని తర్వాత సిఏఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు పడేస్తే అగ్గిరాముడై పోయాడు. కేసు పడేసే ముందు నా అనుమతి తీసుకోనక్కరలేదా? తీర్మానానికి ముందు కూడా నాతో చెప్పనే లేదు అంటూ నిప్పులు తొక్కాడు. ‘చట్టం ప్రకారం మీ అనుమతి తీసుకోనక్కరలేద’ని చీఫ్‌ సెక్రటరీ వచ్చి వివరణ యిచ్చినా సంతృప్తి పడలేదు.

ఇవన్నీ తమపై వ్యతిరేక ప్రభావం కనబరుస్తాయని రాష్ట్ర బిజెపికి భయం వేసింది. బిజెపికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు ఓ. రాజగోపాల్‌ ‘‘ముఖ్యమంత్రి, గవర్నరు యిలా పబ్లిగ్గా తలపడడం బాగా లేదు. ఇద్దరూ కాస్త సంయమనం పాటించాలి.’’ అని ప్రకటన చేశాడు. జనవరి 29న అసెంబ్లీ బజెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నరు ప్రసంగం చేశారు. ఆనవాయితీ ప్రకారం ప్రసంగపాఠాన్ని రాష్ట్రప్రభుత్వం తయారు చేస్తుంది, గవర్నరు చదువుతారు. దానిలో సిఏఏను వ్యతిరేకించే భాగాన్ని ఆరిఫ్‌ చదువుతారా లేదా అని అందరూ ఆసక్తిగా గమనించారు. చివరకు ఆయన దాన్ని చదివాడు కానీ చదవబోయే ముందు ‘నేను దీనితో ఏకీభవించను’ అని చెప్పి మరీ చదివాడు. పోనుపోను యీ గొడవ ముదిరి ఎంతవరకు పోతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?