cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కేరళ స్థానిక ఫలితాలు అసెంబ్లీకి సూచికలా?

ఎమ్బీయస్ : కేరళ స్థానిక ఫలితాలు అసెంబ్లీకి సూచికలా?

మరో 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. అధికారంలో వున్న ఎల్‌డిఎఫ్ మళ్లీ ఎన్నికవుతుందా? లేక గోల్డ్ స్కామ్ వంటి కుంభకోణాల కారణంగా గద్దె దిగుతుందా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. గత నెలలో 8 నుంచి 14 వరకు జరిగిన స్థానిక ఎన్నికలు రాబోయే ఫలితాలు ఎలా వుంటాయో సూచిస్తున్నాయా? కేరళలో స్థానిక ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతూంటాయి. 

ఆ సంస్థలకు నిధులు, అధికారాలు కూడా బాగా వుంటాయి. అందువలన గ్రామస్థాయి వరకు కార్యకర్తలందరూ చురుగ్గా వుంటారు. 2016లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2015లో స్థానిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెసు నేతృత్వంలోని యుడిఎఫ్ అధికారంలో వుంది. అప్పుడు ఎల్‌డిఎఫ్ భారీ విజయం సాధించింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా నెగ్గి, అధికారంలోకి వచ్చింది. ఈ సారి 2020లో జరిగిన స్థానిక ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ సాధించిన విజయం యీ ఏడాది శాసనసభ ఎన్నికలలో పునరావృతమౌతుందా?

2015 ఎన్నికలలో లెఫ్ట్ కూటమి మొత్తం 941 గ్రామ పంచాయితీలలో 549 గెలవగా యుడిఎఫ్ 365 గెలిచింది. 152 బ్లాక్ పంచాయితీలలో 90 లెఫ్ట్‌ గెలిచింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో లెఫ్ట్‌కు 91, యుడిఎఫ్‌కు 47, ఎన్‌డిఏకు 1, ఇతరులకు 1 వచ్చాయి. శబరిమలలో మహిళల ప్రవేశం వివాదం తర్వాత కేరళలో బిజెపికి, ఆ పోరాటంలో బిజెపికి మద్దతు యిచ్చిన కాంగ్రెసుకు బలం పెరిగిందని అనుకున్నారు కానీ, 2019 పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరభారతంలోను, దక్షిణాదిన కర్ణాటకలో 25 సీట్లతో బిజెపి బావుటా ఎగరవేసి తెలంగాణలో 4 గెలుచుకోగా, ఆంధ్ర, తమిళనాడులలో లాగానే కేరళలో కూడా బిజెపి ఏమీ గెలవలేదు. ఉన్న 20లో లెఫ్ట్ కూటమికి 1, యుడిఎఫ్‌కు 19 వచ్చాయి.

14 జిల్లా పంచాయితీల్లో 2015 స్థానిక ఎన్నికలలో లెఫ్ట్ 7 మాత్రమే గెలిచినా యీసారి 11 గెలుచుకుంది. 6 సిటీ కార్పోరేషన్లలో 5టిని (త్రిశూరు కార్పోరేషన్‌ను ఇండిపెండెట్లు, ఫిరాయింపుదార్ల సాయంతో గెలవవచ్చు), 86 మునిసిపాలిటీలలో 40టిని, 152 బ్లాక్ పంచాయితీలలో 152ని, 941 గ్రామ పంచాయితీల్లో 514ని గెలుచుకుంది. మొత్తం ఓట్లలో దానికి 41.6శాతం, యుడిఎఫ్‌కు 37.1శాతం, ఎన్‌డిఏకు 14.5శాతం వచ్చాయి. అనేక యుడిఎఫ్ కంచుకోటలు లెఫ్ట్ వశమయ్యాయి. కాంగ్రెసు దిగ్గజాలనదగిన రమేశ్ చెన్నితల, ఊమెన్ చాండీలు బలమైన స్థావరాల్లో సైతం కాంగ్రెసు ఓడిపోయింది.  

లెఫ్ట్ కూటమికి యింత ఘన విజయం వస్తుందని పరిశీలకులు అనుకోలేదు. ఎందుకంటే విజయన్ ప్రభుత్వం పాలనలో సామర్థ్యం చూపుకున్నా, రెండుసార్లు వచ్చిన భారీ వరదల సమయంలో, కోవిడ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి, మంచి పేరు తెచ్చుకున్నా యిటీవలి బంగారం స్మగ్లింగ్ స్కాము వంటి వాటిల్లో చెడ్డపేరు తెచ్చుకుంది. వాటి ప్రభావం ఏమేరకు వుంటుందో ఎవరూ ఊహించలేక పోయారు.

గతంలో యుడిఎఫ్ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ కార్యాలయంలోని అధికారికి సోలార్ స్కాము నిందితురాలు సరితా నాయర్‌కు సంబంధాలుండి ప్రభుత్వం అప్రదిష్ఠ పాలయినట్లే, యిప్పుడు విజయన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ బంగారం స్మగ్లింగ్ స్కాములో ప్రధాన నిందితురాలు, ప్రభుత్వ ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్నా సురేశ్‌తో సంబంధాల కారణంగా చిక్కుల్లో పడ్డారు.

దుబాయి నుంచి భారత్‌లోని వారి దౌత్యకార్యాలయానికి మామూలు పార్శిళ్లు పంపిస్తూన్నామని చెపుతూ కస్టమ్స్ కళ్లు కప్పి ద్వారా బంగారాన్ని 2017 నుంచి స్మగుల్ చేస్తున్నారట. దౌత్యకార్యాలయం అనగానే కస్టమ్స్ వాళ్లు తనిఖీ చేయడానికి వీలు లేదు. ఈ ఏడాది జులైలో శానిటరీ ఫిట్టింగ్స్ అంటూ వచ్చిన పార్శిల్‌లో బంగారం దాచారని సమాచారం రావడంతో కస్టమ్స్ వాళ్లు డెలివరీ యివ్వలేదు. 

దౌత్యకార్యాలయం సిబ్బంది అంటూ స్వప్న సహచరులు బెదిరించినా, శివశంకర్ ఫోన్ చేసి ఒత్తిడి చేయబోయినా కస్టమ్స్ వాళ్లు బెదరకుండా దౌత్యకార్యాలయ సిబ్బంది ఎదురుగానే తెరిచి చూస్తే పైపుల మధ్యలో 30 కిలోల బంగారం బయటపడింది. ఇక అక్కణ్నుంచి విచారణ మొదలుపెడితే చాలా విషయాలు తెలిశాయి. 2019 నవంబరు-2020 జూన్ మధ్య 21 సార్లుగా 166 కిలోల బంగారాన్ని యిలా స్మగుల్ చేశామని స్వప్న ఒప్పుకుంది. ఆమె సహచరులు యిలాటి వ్యవహారాల్లో ఆరితేరినవారు. గతంలో కూడా యీ నేరానికి పాల్పడ్డవారు. అనేక పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలున్నవారు.

స్వప్నకు యీ స్మగ్లింగ్‌లో భాగస్వామ్యం వుండడమే కాదు, కొన్ని ప్రాజెక్టులలో శివశంకర్ తరఫున లంచాలు తీసుకుందని కూడా అనుమానాలున్నాయి. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించడమే కాక, భర్తకు బంధువైన శివశంకర్ అభిమానాన్ని చూరగొంది. అతను యీమెకు నెలకు లక్ష రూ.ల జీతంపై ఐటీ శాఖలో ఉన్నతోద్యోగం కల్పించి, తన ఏజంటుగా ఉపయోగించుకున్నాడు. అతనికి అహంకారి, అందరిపై పెత్తనం చలాయిస్తాడన్న పేరున్నా సమర్థుడు కావడంతో విజయన్ ప్రాధాన్యత యిస్తూ వచ్చాడు. 

ఇప్పుడు అతని నిజస్వభావం బయటపడడంతో సస్పెండ్ చేశారు, అరెస్టు చేశారు. విజయన్ రాజీనామా చేయాలని కాంగ్రెసు డిమాండ్ చేసింది. విజయన్ స్వయంగా లంచంలో వాటా తీసుకున్నా తీసుకోకపోయినా అవినీతి జరిగేందుకు ఆస్కారం యివ్వడం కూడా అసమర్థతే కదా. దీనికి తోడు అతని మంత్రివర్గ సహచరులపై, పార్టీ సభ్యుల సంతానంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. విచారణలు సాగుతున్నాయి. అందువలన ఎన్నికలలో దాని ప్రభావం తప్పకుండా వుంటుందని అందరూ అనుకున్నారు. ఫలితాల బట్టి చూస్తే ఆ స్కాముల మకిలి విజయన్‌కు అంటనట్లు కనబడుతోంది.

ఈ విజయానికి రాజకీయపరమైన కారణాలు కూడా వున్నాయి. ప్రధానంగా క్రైస్తవుల మద్దతుతో 1964లో వెలసిన పార్టీ కేరళ కాంగ్రెసు. ఇన్నాళ్లుగా అది చీలికలు, పేలికలు అవుతూ వచ్చింది. కె ఎం మాని అధ్యక్షతన మిగిలిన కేరళ కాంగ్రెస్ (ఎమ్) యుడిఎఫ్‌లో వుంది. 2019 ఏప్రిల్‌లో చనిపోవడంతో అతని కొడుకు జోస్, పార్టీలోని సీనియర్ నాయకులైన జోసెఫ్, థామస్‌లను విస్మరించి, తన యిష్టం వచ్చినట్లు వ్యవహరించసాగాడు. దాంతో వాళ్లు విడిపోయి కేరళ కాంగ్రెసు (జె) అని పెట్టుకున్నారు. వాళ్లిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కాంగ్రెసు ప్రయత్నించి విఫలమైంది. 

ఉప ఎన్నికల అభ్యర్థి విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో అక్టోబరులో జోస్‌ పార్టీని యుడిఎఫ్‌లోంచి సాగనంపింది. వెంటనే అతను తన పార్టీని ఎల్‌డిఎఫ్‌లో చేర్చాడు. గతంలో ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు గుప్పించిన ఎల్‌డిఎఫ్ అవన్నీ మర్చిపోయి అతన్ని వాటేసుకుంది. అతనితో పాటు యుడిఎఫ్‌లో మరో భాగస్వామి ఐన లోకతాంత్రిక్ జనతా దళ్‌ను కూడా!

అది రాజకీయంగా తెలివైన పని అని యీ ఎన్నికలు నిరూపించాయి. జోసెఫ్ వర్గం కంటె తన వర్గానికే ఎక్కువ బలముందని జోస్ వర్గం చూపించుకుంది. మధ్య కేరళలోని కోటయం, పత్తనమ్‌తిట్ట, ఇడుక్కి జిల్లాలలో యుడిఎఫ్‌కు బలం బాగా వుండేది. ముఖ్యంగా కేరళ కాంగ్రెసు (ఎమ్‌)కి పట్టున్న ఇడుక్కి జిల్లాలో! ఇప్పుడది ఎల్‌డిఎఫ్‌కు వెళ్లిపోయింది. దానికి పోటీగా నిలబడిన జోసెఫ్ వర్గం సొంత నియోజకవర్గాలలో కూడా ఓడిపోయింది. 

యుడిఎఫ్‌కు ఉత్తర కేరళలోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. దానికి కారణం ముస్లిం లీగుకు అక్కడున్న బలం. జమాతే ఇస్లామీ రాజకీయ విభాగమైన వెల్‌ఫేర్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వలన ఆ ప్రాంతంలో లాభపడింది కానీ, దాన్ని గర్హించిన క్రైస్తవ, సెక్యులర్ ఓటర్లు లెఫ్ట్ కూటమి వైపు మొగ్గడంతో తక్కిన చోట్ల ఓడిపోయింది.

2019 పార్లమెంటు ఎన్నికలలో కేరళలో 15.2 శాతం ఓట్లు తెచ్చుకున్న ఎన్‌డిఏ (బిజెపి, మరో ఐదు మిత్రపక్షాలు) యీ స్థానిక ఎన్నికలలో 14.6 శాతం తెచ్చుకుంది. ఈ ఓట్లన్నీ హిందువుల నుంచే వచ్చాయనుకుంటే కేరళ జనాభాలో దాదాపు 55 శాతం హిందువులు కాబట్టి హిందువుల్లో దాదాపు 25 శాతం మంది బిజెపిని ఆదరించారని తెలుస్తోంది.

అయితే యీ ఓటు బ్యాంకు పలు ప్రాంతాలలో పరుచుకుని వుండడం చేత స్థానాల సంఖ్యకు వస్తే తక్కువగానే కనబడుతోంది. 2015 స్థానిక ఎన్నికలతో పోలిస్తే బిజెపికి యీసారి 395 సీట్లు ఎక్కువ వచ్చాయి. 941 గ్రామ పంచాయితీలలో గతంలో 14 దక్కగా, యీ సారి 23 దక్కాయి. రెండు మునిసిపాలిటీలలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. వాటిలో ఒకటైన పాలక్కాడ్‌ పాతదే కాగా, శబరిమల ఉద్యమం తీవ్రంగా జరిగిన పందళం కొత్తగా వచ్చి చేరింది.

కేరళలో నిరంతరం పోరాటం చేస్తూ బిజెపి తన ప్రాధాన్యతను పెంచుకుంటూ వస్తోందనడం వాస్తవం. దశాబ్దాలుగా ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ కూటమిల రాజకీయాలతో, సంకీర్ణ ప్రభుత్వపు భాగస్వాములతో వచ్చే చిక్కులతో విసిగిపోయిన ఓటర్లకు బిజెపి ఒక ప్రత్యామ్నాయంగా కనబడుతోందనడం కూడా నిజం. బిజెపికి రాష్ట్రస్థాయిలో కరిజ్మా వున్న పెద్ద నాయకుడు లేడు. జనాభాలో ముస్లిములు 27 శాతం, క్రైస్తవులు 18 శాతం వుండి మూడు మతాల వారి మధ్య శతాబ్దాలుగా మతసామరస్యం నెలకొన్న రాష్ట్రంలో మతభావాలు రెచ్చగొట్టి రాజకీయంగా నెగ్గుకురావడం అంత సులభమైన పనేమీ కాదు.

అయినా రాష్ట్ర బిజెపి నాయకులు తమ బలాన్ని ఎక్కువ చేసి చెప్పుకుంటూ వుంటారు. గతంలో అయితే యుడిఎఫ్‌కు ప్రత్యామ్నాయం తామే అని, లెఫ్ట్ కూటమి మూడో స్థానానికి వెళ్లిపోయిందని చెప్పుకునేవారు. ఇప్పుడు లెఫ్ట్ కూటమికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పేసుకుంటున్నారు. ప్రింట్, టీవీ మీడియాలో, సోషల్ మీడియాలో బిజెపి చేసే హడావుడి చూస్తే ప్రతీసారీ యీసారి బిజెపి కేరళను హస్తగతం చేసుకోవడం తథ్యం అనిపించేస్తూ వుంటుంది. ఆ సందడికి, చివరిలో దక్కే సీట్లకు పొంతన వుండడం లేదు. 

కారణం ఏమిటంటే, తక్కిన రాష్ట్రాలలో తక్కిన పార్టీల కంటె బిజెపికి పార్టీనిర్మాణ వ్యవస్థ వుండడం, దానికి ఆరెస్సెస్ వంటి సంస్థ బలం తోడు కావడం చేత ఎన్నికల వేళ లాభిస్తోంది. కానీ కేరళకు వచ్చేసరికి సిపిఎంకు, కాంగ్రెసుకు కూడా పటిష్టమైన వ్యవస్థ వుంది. అంకితభావం వున్న కార్యకర్తలున్నారు. అందువలన అవి బిజెపిని ఎదుర్కోగలుగుతున్నాయి.

కోవిడ్, అవినీతి ఆరోపణల వంటి ఎదురుదెబ్బలు తట్టుకుంటూనే లెఫ్ట్ కూటమి గణనీయమైన విజయాన్ని సాధించిందంటే విజయన్ పాలనాసామర్థ్యం పట్ల అధికసంఖ్యాకులు ఆమోదం తెలిపారనే అనుకోవాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా లెఫ్ట్ కూటమి విజయన్ నేతృత్వంలోనే ముందుకు వెళుతుందనడంలో సందేహం లేదు. ఈ ఫలితాలను అసెంబ్లీ నియోజకవర్గాలకు అన్వయించి చూస్తే 140టిలో 110 వాటిల్లో లెఫ్ట్ ముందంజలో వుంది. అసెంబ్లీ ఎన్నికల లోపున జరిగే పరిణామాలపై అంతిమ ఫలితాలు ఆధారపడతాయి. (ఇన్‌సెట్ - స్వప్న, విజయన్, శివశంకర్) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×