Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కేరళ ఫలితాలు

ఎమ్బీయస్ : కేరళ ఫలితాలు

ఈ జనవరిలో కేరళ స్థానిక ఎన్నికల ఫలితాలను రాస్తూ ఈ ఫలితాలను అసెంబ్లీ నియోజకవర్గాలకు అన్వయించి చూస్తే 140టిలో 110 వాటిల్లో లెఫ్ట్ ముందంజలో వుంది. ఇది శాసనసభ ఎన్నికలలో పునరావృతమౌతుందా? 40 ఏళ్లకు పైగా వున్న అట్టు తిరగేసే సంప్రదాయం మారుతుందా? అనే ప్రశ్న వేయడం జరిగింది. దానికి సమాధానం మేలో వచ్చింది. 1977 తర్వాత మళ్లీ అదే ప్రభుత్వం అధికారంలోకి రావడం యిప్పుడే జరిగింది.  

లెఫ్ట్ కూటమి 2016 కంటె 8 సీట్లు, 2.67% ఓట్లు ఎక్కువ తెచ్చుకుని, 99 సీట్లు, 45.4% ఓట్లు (2019తో పోలిస్తే 10.7% ఓట్లు పెరిగాయి) తెచ్చుకుంది. యుడిఎఫ్ 2016 కంటె 0.8% ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నా 6 సీట్లు తక్కువగా, 41 సీట్లు, 39.4% ఓట్లు (2019తో పోలిస్తే 7.9% తగ్గాయి) తెచ్చుకుంది. ఎన్‌డిఏ 2016 కంటె 1 సీటు, 2.5% ఓట్లు తక్కువ తెచ్చుకుని, 0 సీట్లు, 12.5% ఓట్లు (2019తో పోలిస్తే 3.0% తగ్గాయి) తెచ్చుకుంది.

2016 ఎన్నికలలో లెఫ్ట్‌కు 91 స్థానాలు వచ్చి అధికారంలోకి వచ్చింది. (సిపిఎంకు 27% ఓట్లతో 58, 8% ఓట్లతో సిపిఐకు 19, యితరులకు 14) యుడిఎఫ్‌కు 47 స్థానాలు వచ్చాయి. (కాంగ్రెసుకు 24% ఓట్లతో 22, ఐయుఎంఎల్‌కు 7% ఓట్లతో 18, కెసి(మాని)కి 6, కెసి(జె)కి 1) వచ్చాయి. ఇతరులకు 1 వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలలో దేశమంతా మోదీ హవా వీచినా కేరళలో బిజెపికి 1 స్థానమే వచ్చింది. తక్కిన 19 యుడిఎఫ్‌కు వచ్చాయి. ఆ తీర్పును అసెంబ్లీ నియోజకవర్గాలుగా తర్జుమా చేసి చూస్తే యుడిఎఫ్‌కు 123 స్థానాలు (దానిలో కాంగ్రెసుకు 96), సిపిఎంకు 16, బిజెపికి 1 రావాలి. దరిమిలా 6 స్థానాల కెసి (మాని) యుడిఎఫ్‌ నుంచి ఎల్‌డిఎఫ్‌కు ఫిరాయించింది కాబట్టి యుడిఎఫ్‌కు 117, ఎల్‌డిఎఫ్‌కు 22 రావాలంతే. తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికలలో లెఫ్ట్‌కు 41.6%, యుడిఎఫ్‌కు 37.1%, ఎన్‌డిఏకు 14.5% ఓట్లు వచ్చాయి.

ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్‌కు 45.4% ఓట్లతో 99 వచ్చాయి. దీనిలో సిపిఎం 62 (గతంలో 58, పోటీ చేసినవి 77, ఓట్ల శాతం 25), సిపిఐ 17 (గతంలో 19, పోటీ చేసినవి 17, ఓట్ల శాతం 8), కెసి (ఎమ్) 5 (గతంలో 6, పోటీ చేసినవి 12, ఓట్ల శాతం 3), జెడిఎస్ 2 (గతంలో 3, పోటీ చేసినవి 4), ఎన్‌సిపి 2, కెసి(బి) 1 జెడిఎస్ 2  ఐఎన్‌ఎల్ 1 జెడిఎస్ 2  ఎల్‌జెడి 1 జెడిఎస్ 2 సి(ఎస్) 1, జెడిఎస్ 2 జెకెసి 1 .

యుడిఎఫ్‌కు 39.5% ఓట్లతో (గతంలో కంటె 0.7% పెరిగాయి) 41 సీట్లు, గతంతో పోలిస్తే 6 తక్కువగా, వచ్చాయి. దీనిలో కాంగ్రెసుకు 21 (గతంలో 22, పోటీ చేసినవి 93, ఓట్ల % 25), ఐయుఎమ్ఎల్ 15 (గతంలో 18, పోటీ చేసినవి 25, ఓట్ల శాతం 8), కేరళ కాంగ్రెస్ 2, ఆర్ఎమ్‌పిఐ 1 జెడిఎస్ 2, ఎన్‌సికె 1 జెడిఎస్ 2  కెసి (జాకబ్) 1, ఎన్‌డిఏకు 12.4% ఓట్లతో ((గతంలో కంటె 2.4% తగ్గాయి) 0 సీట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే 1 తగ్గింది. దీనిలో బిజెపికి 0 (గతంలో 1, పోటీ చేసినవి 113, ఓట్ల% 11.3), బిడిజెఎస్ 0 (పోటీ చేసినది 21), ఎడిఎంకె 0, కెకెసి 0, జెఆర్‌ఎస్ 0, డిఎస్‌జెపి 0. బిజెపి  ఓటింగు శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2014లో 10%, 2016లో 15%, 2019లో 16%, స్థానిక ఎన్నికలలో మొత్తం మీద 16% వచ్చినా, 42 నియోజకవర్గాల్లో 20% కంటె ఎక్కువ వచ్చింది.  2016లో ఏడు చోట్ల రెండవ స్థానంలో వుంది. అలాటిది యీసారి బాగా దిగజారిపోయింది.

కేరళను మూడు ప్రాంతాలుగా విభజించి చూస్తారు. ఉత్తరాన వున్న మలబార్, మధ్యలో వున్న కొచ్చిన్, దక్షిణాన వున్న ట్రావన్కూర్.  ఉత్తరాన 40% ఓట్లతో యుడిఎఫ్ ముందంజలో వుండగా, లెఫ్ట్ 37తో వెనక ఉంది. తక్కిన రెండు ప్రాంతాలలో లెఫ్ట్ కొచ్చిన్‌లో 44, ట్రావన్కూర్‌లో 43తో ముందంజలో వుంది. యుడిఎఫ్ రెండు చోట్లా 36 దరిదాపుల్లో వుంది. ఎన్‌డిఏకు వస్తే ఉత్తరాన 10, మధ్య 13, దక్షిణాన 15 తెచ్చుకుంది. అన్నిచోట్లా గతంలో కంటె 1-2% తక్కువే తెచ్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో యుడిఎఫ్‌కు 2016లోనూ, యిప్పుడూ 40% వచ్చాయి. లెఫ్ట్‌కు గతంలో 38 వస్తే యిప్పుడు 41. సెమి-రూరల్‌లో యుడిఎఫ్‌కు గతంలో కంటె 1 తగ్గి 35 రాగా, లెఫ్ట్‌కు 1 పెరిగి 40 వచ్చాయి. సెమి అర్బన్‌లో యుడిఎఫ్‌కు గతంలో కంటె 5 పెరిగి 42 రాగా, లెఫ్ట్‌కు అప్పుడూ యిప్పుడూ 43 వచ్చాయి. ఇక అర్బన్‌లో యుడిఎఫ్‌కు గతంలో కంటె 3 పెరిగి 42 రాగా, లెఫ్ట్‌కు 1 పెరిగి, 41 వచ్చాయి.

ఎన్‌డిఏ రూరల్‌లో 10 (గతంలో8), సెమీరూరల్‌లో 17(17), సెమి-అర్బన్‌లో 12 (10), అర్బన్ 10(14). దీని అర్థం బిజెపికి గ్రామీణ ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగినా, నగర ప్రాంతాల్లో అధికంగా పోగొట్టుకుందన్నమాట. జనరల్ స్థానాల్లో లెఫ్ట్ యుడిఎఫ్ కంటె 3%, ఎన్‌డిఏ కంటె 28% ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఎస్సీ స్థానాల్లో యుడిఎఫ్ కంటె 8%, ఎన్‌డిఏ కంటె 20% ఎక్కువ తెచ్చుకుంది. ఎస్టీ స్థానాల్లో ఎన్‌డిఏ కంటె 35% ఎక్కువ, యుడిఎఫ్ కంటె 1% తక్కువ తెచ్చుకుంది. ఏజ్ గ్రూప్ ప్రకారం చూస్తే 25 సం.ల వయసులోపు వున్నవాళ్లలో 48% లెఫ్ట్‌కు (గతంలో కంటె 10% పెరిగింది), 37% యుడిఎఫ్‌కు (గతంలో కంటె 7% పెరిగింది). ఎన్‌డిఏకు 10% (గతంలో కంటె 13% తరిగింది) ఓటేశారు. 26-35 వయసులో వున్నవారు గతంలో కంటె 11% ఎక్కువగా లెఫ్ట్‌కు 52% మంది వేశారు. తక్కిన ఏజ్ గ్రూపుల వాళ్లు 43% వేశారు. ఆ గ్రూపులో వున్నవాళ్లు యుడిఎఫ్‌కు 40-42%, ఎల్‌డిఎఫ్‌కు 12-14% వేశారు. యువత ఎన్‌డిఏ నుంచి లెఫ్ట్‌కు షిఫ్ట్ అయిందని అర్థమవుతోంది.

లెఫ్ట్‌ ఓటర్లలో పురుషులు, స్త్రీలు యించుమించు సమానంగా వున్నారు (46-45). యుడిఎఫ్ ఓటర్లలో స్త్రీలు పురుషుల కంటె 3% ఎక్కువగా 41 వున్నారు. ఎన్‌డిఏకు ఓటేసిన పురుషులు స్త్రీల కంటె 3% ఎక్కువగా 14 వున్నారు. విద్య విషయానికి వస్తే ప్రైమరీ విద్య వరకు చదివినవారిలో లెఫ్ట్‌కు 57% పడ్డాయి. 38% యుడిఎఫ్‌కు, 9% ఎన్‌డిఏకు పడ్డాయి. మెట్రిక్ వరకు చదివినవారిలో యీ శాతాలు 44,42,13 వుండగా, కాలేజీ చదువు చదివినవారిలో 46,37,12 వున్నాయి. పేదవారిలో 53% లెఫ్ట్‌కు, 30% యుడిఎఫ్‌కు, 15% ఎన్‌డిఏకు వేశారు. దిగువ మధ్యతరగతిలో యివి 46,36,15 వుండగా, మధ్యతరగతిలో 41, 46, 10 వుండగా, ధనికులలో 41, 47, 9 వుంది. అంటే ధనికులు ఎక్కువగా యుడిఎఫ్‌కు వేశారు. ఎన్‌డిఏకు తక్కిన వర్గాల కంటె దిగువ మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా వేశారు.

ఎన్నికల అనంతరం లోకనీతి-సిఎస్‌డిఎస్ జరిపిన సర్వే ప్రకారం 73% మంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యవసతులు మెరుగుపరిచారని 73%, ప్రభుత్వ స్కూళ్లు బాగుచేశారని 72%,  రోడ్ల పరిస్థితి బాగుందని 66%, విద్యుత్ సరఫరా బాగుందని 65% అన్నారు. ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయని 29% మందే అన్నారు, పడలేదని 33% మంది అన్నారు. రైతుల పరిస్థితి మెరుగుపడిందని 30% మంది అంటే పడలేదని 29% మంది అన్నారు. కరోనా సమయంలో కోవిడ్‌ను బాగా హేండిల్ చేశారని 72% మంది కితాబు యిచ్చారు. అయినా వారిలో 57% మందే లెఫ్ట్‌కు ఓటేశారు. 33% యుడిఎఫ్‌కు, 8% ఎన్‌డిఏకు వేశారు. కరోనా ఫుడ్ కిట్స్ అందాయని 88% మంది అన్నారు. అయినా వారిలో 50% మందే లెఫ్ట్‌కు ఓటేశారు. 37% యుడిఎఫ్‌కి, 11% ఎన్‌డిఏకి వేశారు.

2019 ఎన్నికలను ప్రభావితం చేసిన శబరిమల అంశం యిప్పుడు ప్రధానాంశంగా లేదని సర్వే అంది. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేస్తామని అనడం చేత లెఫ్ట్ ఫ్రంట్‌ని విమర్శించేవాళ్లు కూడా తక్కిన విషయాలను పరిగణనలోకి తీసుకుని కాబోలు దానికే ఓటేశారు. శబరిమల విషయంలో కంటె కాంగ్రెసు పార్టీ బిజెపితో సమానంగా పోరాడినందుకు మెచ్చి నాయర్లు, యితర అగ్రవర్ణాల వారిలో ఎక్కువమంది యుడిఎఫ్‌కు 2019లో, 2021లో కూడా ఓటేశారు. నాయర్లలో 20% మంది 2016లో వేస్తే, యిప్పుడు 40% మంది వేశారట. 2016తో పోలిస్తే లెఫ్ట్‌కు దళితుల మద్దతు 51% నుండి 69%కు పెరిగింది. బిజెపికి 16% తగ్గింది. ఒబిసిలలో ఈళవ కులస్తులు లెఫ్ట్‌కు ఎప్పుడూ సమర్థకులే. వారిలో యుడిఎఫ్‌కు ఓటేసేవారిలో కొందరు యీసారి బిజెపి వైపు మళ్లారు. లెఫ్ట్‌కు ఈళవేతర ఒబిసిల మద్దతు 49% నుంచి 61%కు ఎగబాకింది. (పోలరైజేషన్‌ ఎంత జరిగినా 55శాతానికి మించి వుండదని ప్రశాంత కిశోర్ అన్నదాన్ని యీ సర్వే సమర్థిస్తున్నట్లు లేదు)

ఇక మైనారిటీల విషయానికి వస్తే వాళ్ల ఆర్థికపరిస్థితి, ప్రాంతం బట్టి ఓటింగు ధోరణి మారింది. లెఫ్ట్‌కు పేద ముస్లిముల మద్దతు 35 నుంచి 46 శాతానికి పెరిగింది. పేద క్రైస్తవుల మద్దతు 36 నుంచి 44 శాతానికి పెరిగింది. మలబారు ప్రాంతంలో ముస్లిములలో 65% మంది యుడిఎఫ్‌కు వేశారు కానీ, తక్కిన ప్రాంతాలలో ఆ మేరకు వేయలేదు. 2016లో క్రైస్తవులలో 10% మంది ఓట్లు సంపాదించుకోగలిగిన బిజెపి, యీసారి 2% మాత్రమే తెచ్చుకోగలిగింది. చర్చి వ్యవహారాల్లో రాజీలు కుదిర్చి, కృషి చేసినా, ‘లవ్ జిహాద్’ ఉద్యమాలు చేయడం వలన క్రైస్తవులు ఆదరించలేదు. లెఫ్ట్ ముస్లిములలో, క్రైస్తవులలో 39% ఓట్లు (2016లో 35 వుండేది) తెచ్చుకోగా యుడిఎఫ్ 57% తెచ్చుకుంది. 2019లో యుడిఎఫ్‌కు ముస్లిములు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఓటేయడం చేతనే అది చాలా సీట్లు గెలుచుకోగలిగింది. యుడిఎఫ్ కూటమిలో ఐయుఎమ్‌ఎల్ స్ట్రయిక్ రేట్ (పోటీ చేసినవాటిలో ఎన్ని గెలిచారు అనేది) 60% వుండగా కాంగ్రెసుది 23% వుంది. లెఫ్ట్ కూటమిలో సిపిఎం 83, సిపిఐ 74 వుండగా కెఇసి (ఎమ్)ది మాత్రం 42యే వుంది.

ఇక తక్కిన విషయాలుకు వస్తే, లెఫ్ట్ కాసర్‌గోడ్, కన్నూర్, కోళిక్కోడ్, పాలక్కాడ్, త్రిశూర్, పత్తనంతిట్ట, అలప్పుళ, కొల్లం, తిరువనంతపురం జిల్లాల్లో అన్ని స్థానాలనూ గెలిచింది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్ సిటింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబ్లీ చేతిలో 3900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్ గోపీ త్రిశూర్‌లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు. వరదలు, కరోనాయే విజయన్‌కు పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం కోవిడ్ హేండిల్ చేసిన విధానం సర్వత్రా మెప్పు పొందింది. అందుకనే విజయన్‌కు 50 ప్లస్ వేల మెజారిటీ రాగా ఆరోగ్యమంత్రి శైలజ 67 వేల మెజారిటీతో గెలిచారు. ఆక్సిజన్ కోసం ప్రజలు అలమటిస్తున్న యీ వేళ, కేరళ ప్రభుత్వం ముందుచూపుతో గత ఏడాదే ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లను రోజుకు 140 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిందని వింటే ఒళ్లు పులకించక మానదు. ఇప్పుడు రోజువారీ అవసరం 54 టన్నులట. అంటే యితరులకు యివ్వగలిగిన స్థాయిలో వున్నారు.

కరోనా మృతులకు ఏడాది నుంచి 15 సరుకులతో కిట్లను యిస్తున్నారు. బట్టలకొట్టులోకి అడుగు పెట్టగానే స్టాఫ్ వచ్చి ఏం కావాలో కనుక్కుని సాయం చేసిన విధంగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా అలాటి సహాయం చేసే విధంగా స్టాఫ్‌కు తర్ఫీదు యిచ్చారుట. పబ్లిక్ ఎడ్యుకేషన్ రిజువనేషన్ మిషన్ (పెర్మ్) పెట్టి స్కూళ్లను బాగు చేయడంతో ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మైగ్రేషన్ జరిగింది. వీటన్నిటితో బాటు బిజెపికి దీటుగా విజయన్ సైబర్ ఆర్మీ పేరుతో ఐటీ సెల్ పెట్టి తన గురించి ప్రచారం చేసుకున్నారుట. అందుకే కాబోలు, విజయన్‌ను గోల్డ్ స్మగ్లింగ్ స్కాములో యిరికించాలని బిజెపి ప్రయత్నించినా, కాబినెట్‌లో కొందరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా, అవేమీ విజయన్ ప్రభను తగ్గించలేక పోయాయి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?